'Madhavi - Part 2/3' - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 27/07/2024
'మాధవి - పార్ట్ 2/3' పెద్ద కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
బాగా చదువుకోవాలన్న తన ఆశయాన్ని పక్కన పెట్టి, తలిదండ్రుల కోరికపై శరత్ ని పెళ్లి చేసుకుంటుంది మాధవి. అతనికి తనంటే ఇష్టం లేదనీ, వేరొకరిని ప్రేమించాడనీ తెలుసుకొని బాధ పడుతుంది.
ఇక మాధవి పార్ట్ 2 చదవండి
ఆ మరురోజు నుండి ఇంట్లో అన్నీ తానే అయి అందరితో కలుపుగోలుగా ఉంటూ తన మనసులోని బాధని ఎవరితో, ఎక్కడా బయటపడకుండా పైకి నవ్వుతూ ఉండసాగింది మాధవి.
క్రొత్త పెళ్లి కూతురని చూడడానికి ఇరుగుపొరుగువాళ్లు, బంధువులు ఇంటికి వస్తే వాళ్లకు “మా కోడలు నలుపు, బీదది. అయినా కోడలిగా చేసుకున్నాం” అని అత్తగారు కావాలని తన ముందే తనని, తన వాళ్లని చాలా చులకనగా మాట్లాడేది. నిజానికి తను నలుపుకాదు, తెల్లని తెలుపు కాకపోయినా మంచి రంగే. కనుముక్కుతీరు బాగుండి, మంచి కళగా ఉంటానని తమ స్కూల్లోవాళ్లు, స్నేహితులు, బంధువులు, ఊర్లోవాళ్లు అనుకోవడం తనకు తెలుసు. పదేపదే ఆవిడ అలా మాట్లాడుతూ ఉంటే మాధవి మనసు చాలా కలుక్కుమనేది. ఆవిడ స్వభావమంతే అనుకుని మిన్నకుండేది. తనకు భర్త ప్రేమ, ఆదరణ లేదు కనుక ఎదురు చెప్పేందుకు మాధవికి సాహసం లేదు.
ఆ ఇంట్లో ఆవిడ మాటలకు తిరుగులేదు. ఎప్పుడూ ఏదో ఒక పనిని కావాలని తనకు పురమాయించేది. పై తోటికోడళ్లిద్దరూ ఆవిడకి మేనకోడళ్లు. వాళ్లని చాలా ప్రేమగా చూసేది. తోటికోడళ్ల పిల్లలు తన వయసువారు. ఇంక తన బాధని ఎవరితో ఎలా చెప్పుకోవాలో తెలియని స్ధితి. తన కంటే పదేళ్లు పెద్దవాడైన భర్తతో తనకు సాన్నిహిత్యం, చనువు లేదు మాధవికి.
కొంతకాలానికి భర్తకి మాధవిమీద కామంతో కూడిన కోరిక కలిగి దగ్గరయ్యాడు. ఆ మాత్రానికే సంతోషించింది ఆ అభాగ్యురాలు. తరువాత రెండు నెలలకి కాస్త నీరసంగా అనిపిస్తూ ఉంటే తోటికోడలిని తోడుగా తీసుకుని డాక్టర్ వద్దకు వెళ్లింది మాధవి. ఆవిడ మాధవిని పరీక్షలు చేసి “నీవు తల్లి కాబోతున్నావు” అంది. అది విన్న మాధవి ఆనందానికి అంతులేదు.
ఆ శుభవార్తని విని ఇంట్లో అందరూ చాలా సంతోషించారు. ఏకాంతంలో భర్తకి చెప్పుదామని అనుకునేలోగా తల్లి ద్వారా విషయం తెలిసి శరత్ మిన్నకున్నాడు. ఆ రాత్రి ఒంటరిగా భర్త చెవిన వేసిన మాధవికి అతని ముఖంలో తండ్రిని అవుతున్న సంతోషఛాయలు ఏమాత్రం కనపడలేదు. మాధవి ద్వారా శుభవార్తను విన్న తల్లి, తండ్రి వచ్చి స్వీట్లు, పళ్లు తెచ్చి కూతురిని చూసి సంతోషించి వెళ్లారు.
కాలం గడుస్తోంది. మాధవికి ఏడవనెల రాగానే కమలమ్మ వచ్చి ఘనమైన పట్టుచీర, ఇంటిల్లి పాదికి బట్టలు తెచ్చి సీమంతం వేడుకని చాలా ఘనంగా జరిపించింది. అత్తింటి వాళ్లకు సీమంతం ఆనవాయితీ లేదుట. కమలమ్మ మాధవిని పురిటికి తీసుకెళతామని అడిగితే అత్తగారు ‘తమకు తొమ్మిదో నెలలోనే పంపే అలవాటు’ అని చెప్పడంతో ఆవిడ వెళ్లింది.
“మాధవీ! నీవు గర్భవతివి. ఇంటిపనులు ఎంత బాగా చేస్తే కానుపు అంత సులభమవుతుంది “ అని అత్తగారి ఆజ్ణ. ఆ ఇంట్లో ఉదయాన లేచిన మొదలు రాత్రి పడుకునే దాకా ఇంటెడు చాకిరీ మాధవి మీదే పడేది. అత్త, భర్త నిరసనలని గమనించిన తోడికోడళ్లు పినత్తగార్లు మాధవి చేత అన్ని పనులనూ చేయించుకునేవాళ్లు. పురిటికి వెళితే అమ్మ వద్ద విశ్రాంతి లభిస్తుంది అని ఆ రోజు కోసం ఎదురుచూసేది మాధవి.
తొమ్మిదోనెల రాగానే తల్లి వచ్చి మాధవిని పురిటికి తీసికెళ్లింది. రక్తం లేక బాగా పాలిపోయి ఉన్న మాధవిని ప్రక్క ఊరిలో డాక్టరుకు చూపించి మందులిప్పించి బలమైన ఆహారం, పళ్లు ఇస్తూ కంటికి రెప్పలా చూస్తున్నారు కమలమ్మ దంపతులు.
కొన్ని రోజులకు ఒక రోజున చక్కటి పాపకు జన్మనిచ్చింది మాధవి. పొత్తిళ్లలోకి తన కూతురిని పొదివి పట్టుకుని ప్రేమతో గుండెలకు హత్తుకుని మురిసిపోయి ఇంక తనకొక తోడు పాపాయి, ఇహ తన కష్టాలు తీరిపోతాయనుకుంది మాధవి.
పాప పుట్టిందని ఫోన్ చేసిన రాఘవయ్యతో శరత్, అతని తల్లి “అయ్యో! ఆడపిల్లా!” అన్నారుట. విన్న మాధవి, కమలమ్మ చాలా బాధపడ్డారు. మూడవనెలలో బారసాల చేసి పాపకు ‘విద్య’ అని పేరుపెట్టి మాధవిని, బిడ్డని తమ ఇంటికి తీసికెళ్లారు శరత్ వాళ్లు. కాలక్రమేణా విద్య చక్కగా పెరుగుతూ తన ముద్దు ముద్దు మాటలతో, బుడిబుడి అడుగులతో అందరినీ అలరిస్తోంది. “నాన్నా!” అంటూ దగ్గరగా వచ్చిన కూతురిని చూసి శరత్ ఏదో మొక్కుబడిగా ఎత్తుకునేవాడు. విద్యని చూసైనా అతని మనసు క్రమేణా మారుతుంది అనుకుని పిల్లను అతనికి మరింత దగ్గరయ్యేలా చేసేది మాధవి.
విద్యకి మూడవ సం…రాగానే అక్షరాభ్యాసం చేసి స్కూలులో చేర్చారు. విద్య చక్కగా చదువుతూ ఉంది. తనకి కోరిక కలిగినప్పుడే భార్య మొహం చూసేవాడు శరత్. మరో రెండు సం…తర్వాత మాధవి మరలా గర్భం దాల్చింది. నెలలు నిండగానే విద్యతో పుట్టింటికి వెళ్లిన మాధవికి మరో చక్కటి పాప పుట్టింది. ఆ పాపని చూసి మురిసిపోయింది మాధవి.
కబురు విన్న అత్తింటి వాళ్లు “ఈసారీ ఆడపిల్లేనా!” అని ఆ పాపని చూసేందుకు కూడా ఎవరూ రాలేదు. వాళ్ల ప్రవర్తనకి మాధవి మనసు కలుక్కుమంది. రాఘవయ్య పదేపదే చెప్పిన మీదట మూడవనెలలో శరత్ వాళ్లు బారసాల చేసుకుని “సంధ్య” అని పేరుపెట్టుకుని మాధవిని, పిల్లలని తమింటికి తీసుకెళ్లారు శరత్ వాళ్లు.
పిల్లలిద్దరిని ప్రేమగా పెంచుకుంటోంది మాధవి. తన పట్ల, తన పిల్లల పట్ల భర్త, అత్తల తీరంతే అనుకుంది. మరో రెండు సం.. కి మరో పాపకి జన్మనిచ్చింది మాధవి. ఆ పాపకి “కావ్య” అని పేరు పెట్టారు. “ఇంకో సంబంధం చేసుకుంటే తమకి వారసుడు వచ్చేవాడని, నిన్ను చేసుకోబట్టే ఆడమూక పుట్టారని” ప్రతిరోజూ అత్త నుంచి, భర్త నుంచి సాధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఆడపిల్లలైనా, మగ పిల్లలైనా తన దృష్టిలో ఒకటే. ఎవరూ కష్టపడకుండా ఈ భూమి మీదకు రారు. ఏ తల్లి అయినా ఆ ఇద్దరికీ ఒకటే నొప్పులు పడి కంటుంది. బిడ్డలు ఆరోగ్యంగా, సుఖంగా ఉంటే చాలనుకుంటుంది. తల్లి మనసంటే అదే. ఆడపిల్ల లేనిదే సృష్టి ఎక్కడుంది? ఆడపిల్ల లక్ష్మి. తన పిల్లలు బంగారు తల్లులు అని మురిసిపోయేది మాధవి.
“ఆడపిల్లల తల్లీ ఒక తల్లేనా!” అని ప్రతిరోజూ మాధవిని సూటీపోటి మాటలనేవాళ్లు. తల్లి అంటుంటే భర్త మద్దతు పలికేవాడు. ఆవిడ కూడా ఒక ఆడదే కదా! అని అనాలనిపించేది మాధవికి. కానీ ఏమనకుండా దాన్ని మనసులోనే దిగమింగుకునేది. ఇంట్లో తన చేత ఏ క్రొత్త దంపతులకు గానీ, ఏ శుభకార్యాలలో గానీ ఆశీర్వాదం, మంగళ హారతులు గానీ ఇప్పించేది కాదు అత్తగారు. “నీవు దీవిస్తే నీకు లాగే వాళ్లకు కూడా ఆడపిల్లలు పుడతారు” అన్న అత్తగారి మాటలకు తన గదిలోకి వచ్చి తన ముగ్గురి పిల్లలని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని ఏడ్చేది మాధవి.
“ఎందుకేలుత్తున్నావమ్మా? ఏలవద్దు” అని వాళ్లు తల్లి వెచ్చని కన్నీటిని తమ గౌన్లతో తుడిచేవాళ్లు.
పిల్లలు ముగ్గురూ స్కూళ్లకు వెళుతూ చక్కగా చదువుతున్నారు. తమ ప్రతిభాపాటవాలతో, ఆటపాటలతో రాణిస్తున్న ఆ పిల్లలని చూసి చాలా సంతోషంగా ఉంటోంది మాధవి. ఎప్పటిలానే శరత్ కి భార్యా, పిల్లల బాగోగులేమీ పట్టవు. అతను ఇంట్లో ఉండేదే బహు తక్కువ. ఆ ఉన్న కాసేపు అత్తగారు మాధవిమీద ఏవో ఒకటి చెప్పి అతన్ని కోపానికి ఎగేసేది. తల్లి చెప్పిన లేనిపోని నెపాలతో మాధవిని అకారణంగా కొట్టడం, అందరిముందూ బూతులు తిట్టడం చేసేవాడు. వాటన్నింటినీ వినోదంగా చూస్తూ తృప్తి పడే వాళ్లు అత్త, తోటికోడళ్లు. “ఓడు ఓడంటే కంచమంతా ఓడు” అన్న సామెత లాగా భర్త తనని చులకనగా చూస్తే ఇంట్లో అందరికీ లోకువే కదా! అనుకుంది మాధవి.
22 సం…కే ముగ్గురు బిడ్డలకు తల్లయి, భర్త, అత్త, తోటికోడళ్ల వలన తను పడుతున్న కష్టాలను, బాధలని, అవమానాలని తల్లిదండ్రులతో చాలాసార్లు చెబుదామనుకుని అనుకుని, చెబితే ఫలితం ఉండదని విరమించుకుంది మాధవి. తమ ఊరు అగ్రహారం. పరువూ, ప్రతిష్టలకే విలువిచ్చేవాళ్లు తల్లిదండ్రులు. తన బాధలన్నిటిని తన మనసులోనే దాచుకుని పైకి నవ్వుతూ బ్రతుకుతోంది మాధవి. తన కూతురు భాగ్యవంతురాలు, తన భర్త, పిల్లలతో సంతోషంగా ఉంటోందని వాళ్లు సంతోషపడేవాళ్లు. ఆ మాటే తరచూ అందరితో చెప్పుకునేవాళ్లు. కన్నవాళ్ల సంతోషం చాలు అనుకునేది మాధవి.
“మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు” అన్న సామెత లాగా మాధవికి ఇంట్లో వాళ్లందరిముందూ ఇష్టం వచ్చినట్టు తనని భర్త కొడుతూ, బూతులు తిడుతుంటే వాళ్లంతా చూస్తున్నారనే అవమానభారం ఎక్కువయేది. వాటన్నింటినీ తన పిల్లలకోసం భరిస్తోంది. అత్తగారు ప్రతి దానికి మావాడు “తల్లిచాటు బిడ్డ. నా మాటే వాడికి వేదం” అనేది. ముగ్గురు బిడ్డల తండ్రి అయినా ఇంకా తల్లిచాటు బిడ్డ అంటుందేంటో? అనుకునేది మనసులో మాధవి.
విద్యకి ఎనిమిదవ సం…రాగానే ఆ పాపకు పెళ్లి చేయాలనే వత్తిడి అత్తవారింట్లో మాధవికి ఎదురైంది. “అష్టవర్షాత్ భవేత్ కన్యాః” అనే సాంప్రదాయం ప్రకారం విద్యకు పెళ్లి చేయాలని ఇంట్లో అందరూ చెపితే శరత్ అన్నలు సంబంధాలు వెతికారు. విద్యకి కొన్ని సంబంధాలు కూడా వచ్చాయి. ‘నిజంగానే ఇంట్లో అందరూ ఏకమై విద్యకు ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసి ఆమె బంగారు భవిష్యత్తును నాశనం. చేస్తున్నారు’ అనే దిగులేర్పడింది మాధవికి.
‘తనెలాగైనా ఇది జరుగకుండా చేయాలి. తనకెలాగూ తల్లితండ్రులు బలవంతంగా పెళ్లి చేశారు. తన భవిష్యత్తు ఎలాగూ నాశనమైంది. ఇంక తన బిడ్డల భవిష్యత్తన్నా బావుండాలి. తన బిడ్డలు చక్కగా చదువుకుని మంచిగా వృధ్ధిలోకి రావాలి’ అనే తలంపుతో ఆ దిశగా ఆలోచన చేసి తన తల్లి తండ్రులకు, మరికొంతమంది సమీప బంధువులకు తన సమస్యని చెప్పి ఎలాగైనా విద్యకు పెళ్లి ప్రయత్నాలు జరుగకుండా చూడాలని వేడుకుంది మాధవి.
వాళ్లు వచ్చి అత్తారింట్లోని అందరితో, శరత్ తో “బాల్యవివాహాలు చట్టరీత్యా చాలా నేరము. కాదని మీరు ఆ పసిదానికి పెళ్లి చేస్తే మేమంతా పోలీసు కేసు పెడతాము. మీకు జైలుశిక్ష పడుతుంది. అనవసరంగా కుటుంబాన్ని అల్లరిపాలు చేసుకోవద్దు. బంగారంలాంటి పిల్లల భవిష్యత్తును పెళ్లి పేరుతో నాశనంచేయద్దు. కాలం మారింది. కాలంతో పాటు పధ్ధతులు కూడా మారాయి. ” అని వాళ్లకు హితబోధ చేశారు. పోలీసులు, జైలులు అనేటప్పటికి అత్త, భర్త, బావగార్లు కాస్త వెనుకంజ వేశారు. ఇంక విద్యకు పెళ్లి చేసే ప్రయత్నాలని వాళ్లు విరమించుకున్నారు. మాధవి సంతోషంగా మనసులోనే ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది. ఈ సంఘటన వలన ఆ ఇంట్లో మిగిలిన ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్లి చేసే ఆలోచనలు మారాయి.
కొన్ని సం…తర్వాత బావగార్ల కూతుళ్ల పెళ్ళిళ్లయినాయి. ఆ ఫంక్షన్లలో పెళ్లి చాకిరీ, పెళ్లి హడావిడంతా మాధవి పైనే పడింది. వాళ్లకి ఇల్లరికం అల్లుళ్ళు వచ్చాక మాధవికి చాకిరీ ఇంకా ఎక్కువైంది. వాళ్ల పురుళ్ళు అయ్యి మనవళ్లు వచ్చాక, మామగారు పోయేముందు వ్రాసిన ఆస్తి పంపకాల వీలునామాలు ఇప్పుడు బయటపడ్డాయి.
“మీకు ఈ ఇంట్లో భాగం లేదు. మీరు వెళ్లచ్చు” అని ప్రతిరోజూ పెద్ద తోటికోడలు మాధవిని సాధిస్తుంటే అత్తగారు వింటూ ఊరుకునేది కానీ పెద్ద కోడలిని ఏమాత్రం వారించేదికాదు. తోటికోడలు ఆ ఇంట్లో ప్రతి వస్తువూ తమదే అన్నట్లు ప్రవర్తించేది. ఆఖరికి తను, తన పిల్లలు తినేందుకు కూడా సమంగా ఉండేది కాదు. తాము పస్తులతో ఎన్ని రోజులు గడిపారో మాధవికి మాత్రమే తెలుసు. ఆ పసికందులకు ఇవేమీ అర్థం కాక అమాయకమైన కళ్లతో చూస్తూ తమ తల్లి పమిట చెంగులో ముఖం దాచుకుని ఏడ్చేవాళ్లు. వాళ్లని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని ప్రేమతో ఓదార్చి వాళ్లకి ఏదోవిధంగా వండి వాళ్ల ఆకలిని తీర్ఛేది మాధవి. తనకు ఏం చేయాలో? ఆ ఇంట్లో ఎలా ఉండాలో? ఎవరిని అడగాలో? అడిగితే ఏం గొడవవుతుందో ? అర్థం కాని స్ధితిలో ఉండేది మాధవి. ఇవన్నీ తన భర్త చూసుకోవాలి. కానీ ఆయనకు బయట ఆడవాళ్లతో తిరుగుళ్లతోనే సరిపోయేది.
కాలం గడిచిపోతోంది. కొన్నాళ్లకు శరత్ వాళ్లు తనకి వచ్చిన కాస్త వాటాను తీసుకుని వేరేచోట ఇంటిని కొని భార్యా, పిల్లలతో అందులోకి వెళ్లాడు. ఆ గృహప్రవేశం ఫంక్షన్ రోజుకి అందరినీ పిలిచి చక్కగా చేసుకున్నారు. ఆ రోజున బోజనాలయ్యాక మాధవి తల్లిదండ్రులను శరత్ తల్లి కావాలనే వాళ్లని చాలా అవమానించింది. ఏమీ చేయలేని నిస్సహాయురాలై చాలా బాధపడింది మాధవి. మాధవి కోసం అవమానభారాన్ని దిగమింగుకున్నారు కమలమ్మ దంపతులు. ఆ తర్వాత శరత్ తల్లి మాధవి వాళ్ల వద్ద తన జీవితాన్ని సంతోషంగా వెళ్లదీసుకుంది. స్వతహాగా పెద్దల యందు వినయవిధేయురాలైన మాధవి తన అత్తగారికి మానవత్వంతో సేవలు చేసింది. కొన్నేళ్ళ తర్వాత శరత్ తల్లి రోగంతో కాలం చేసింది.
రోజులు గడుస్తున్నాయి. మాధవి ముగ్గురు పిల్లలు మంచిమార్కులతో స్కూలు చదువులను పూర్తిచేసుకుని కాలేజీలలో చేరి చక్కగా చదువుకుంటున్నారు. రెండేళ్ల తర్వాత ఇంటర్ లో మంచి రాంకులతో పాసై స్కాలర్షిప్ తో ఇంజనీరింగ్ లో చేరారు. మాధవికి కూడా చదువుమీద అమిత ఇష్టం కనుక తల్లితండ్రుల సహాయంతో ప్రైవేట్ గా బి. కామ్ ని పూర్తి చేసింది. పిల్లలతో పాటు తనూ సంగీతాన్ని నేర్చుకుంది. సిటీలో అన్ని కాంపిటీషన్ లకు, హైదరాబాద్ కు టి. వి. లలో సంగీతం షోలకు పిల్లలని శ్రధ్ధగా తీసికెళ్లి వాళ్లని అన్ని విధాలా ప్రోత్సాహించేది. వాళ్లు అన్నింటా ప్రతిభావంతులై మంచి ప్రశంసలను పొందుతూ విజేతలై బహుమతులను తెచ్చుకునేవారు. వాళ్లల్లో తనని చూసుకుని మరింత మురిసిపోయేది మాధవి.
చదువంటే ప్రాణంతో మరొక ఆరేళ్లల్లో SDLC ద్వారా MA తెలుగు, MA. సంస్కతం, MA ఇంగ్లీషు చదివి ప్రధమశ్రేణిలో పాసయింది మాధవి. ఎవరి సాయం లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ లో PHD పరీక్ష కోసం TCET, NET పరీక్షలను కష్టపడి వ్రాసి, PHDలో ఎంట్రన్స్ వ్రాసి అందులో చేరేందుకు అర్హతలు పొందింది మాధవి. ఇదంతా ఆ వాగ్దేవి దయ, తన తల్లి తండ్రుల, గురువుల ఆశీస్సులు, పిల్లల ప్రోత్సాహం అని ఎప్పుడూ సంబరపడుతూ ఉంటుంది మాధవి.
PHD లో చేరటానికి భర్త ఎదురుతిరిగి విపరీతంగా తనను హింసించడంతో ఇంక PHD చేసి డాక్టరేట్ పొందాలనే తన మనోభీష్టాన్ని మనసులోనే అదుముకుంది మాధవి. ఇంతవరకూ తన చదువులో వీసమంతైనా భర్త సాయం తనకు ఏనాడూ లేకపోయినా అతికష్టం మీద ఎలాగోలా చదవగలిగి ఫస్ట్ క్లాసులను పొంది ‘తనకు ఇంతే ప్రాప్తం’ అనుకుని తన మనసుకు పదేపదే సర్దిచెప్పుకుంది మాధవి.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
Profile Link:
Youtube Play List Link:
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
నా గురించి పరిచయం.....
నా పేరు నీరజ హరి ప్రభల. మాది విజయవాడ. మావారు రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస. వాళ్లు ముగ్గురూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ భర్త, పిల్లలతో సంతోషంగా ఉంటున్నారు.
నాకు చిన్నతనం నుంచి కవితలు, కధలు వ్రాయడం చాలా ఇష్టం. ఆరోజుల్లో వాటిని ఎక్కడికి, ఎలా పంపాలో తెలీక చాలా ఉండిపోయి తర్వాత అవి కనుమరుగైనాయి. ఈ సామాజిక మాధ్యమాలు వచ్చాక నా రచనలను అన్ని వెబ్సైట్ లలో వ్రాసి వాటిని పంపే సౌలభ్యం కలిగింది. నా కధలను, కవితలను చదివి చాలా మంది పాఠకులు అభినందించడం చాలా సంతోషదాయకం.
నా కధలకు వివిధ పోటీలలో బహుమతులు లభించడం, పలువురి ప్రశంసలనందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మన సమాజంలో అనేక కుటుంబాలలో నిత్యం జరిగే సన్నివేశాలు, పరిస్థితులు, వాళ్లు పడే బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని ఎదుర్కొనే తీరు నేను కధలు వ్రాయడానికి ప్రేరణ, స్ఫూర్తి. నా కధలన్నీ మన నేటివిటీకి, వాస్తవానికి దగ్గరగా ఉండి అందరి మనస్సులను ఆకర్షించడం నాకు సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న దారుణాలకు, పరిస్ధితులకు నా మనసు చలించి వాటిని కధల రూపంలోకి తెచ్చి నాకు తోచిన పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాను.
నా మనసులో ఎప్పటికప్పుడు కలిగిన భావనలు, అనుభూతులు, మదిలో కలిగే సంఘర్షణలను నా కవితలలో పొందుపరుస్తాను. నాకు అందమైన ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర నైసర్గిక స్వరూపాలను దర్శించడం, వాటిని ఆస్వాదించడం, వాటితో మమేకమై మనసారా అనుభూతి చెందడం నాకు చాలా ఇష్టం. వాటిని నా హృదయకమలంలో అందంగా నిక్షిప్తం చేసుకుని కవితల రూపంలో మాలలుగా అల్లి ఆ అక్షర మాలలను సరస్వతీ దేవి పాదములవద్ద భక్తితో సమర్పిస్తాను. అలా నేను చాలా దేశాల్లలో తిరిగి ఆ అనుభూతులను, అనుభవాలను నా కవితలలో, కధలలో పొందుపరిచాను. ఇదంతా ఆ వాగ్దేవి చల్లని అనుగ్రహము. 🙏
నేను గత 5సం… నుంచి కధలు, కవితలు వ్రాస్తున్నాను. అవి పలు పత్రికలలో ప్రచురణలు అయ్యాయి. పుస్తకాలుగా ప్రచురించబడినవి.
“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో నేను కధలు, కవితలు వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో నాకధలకి చాలా సార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు లభించాయి. వాళ్ల ప్రోత్సాహం జీవితాంతం మరువలేను. వాళ్లకు నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు రవీంద్రభారతిలో నాకు “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి ఘనంగా సన్మానించడం నా జీవితాంతం మర్చిపోలేను. ఆజన్మాంతం వాళ్లకు ఋణపడిఉంటాను.🙏
భావుక వెబ్సైట్ లో కధల పోటీలలో నేను వ్రాసిన “బంగారు గొలుసు” కధ పోటీలలో ఉత్తమ కధగా చాలా ఆదరణ, ప్రశంసలను పొంది బహుమతి గెల్చుకుంది. ఆ తర్వాత వివిధ పోటీలలో నా కధలు సెలక్ట్ అయి అనేక నగదు బహుమతులు వచ్చాయి. ‘మన కధలు-మన భావాలు’ వెబ్సైట్ లో వారం వారం వాళ్లు పెట్టే శీర్షిక, వాక్యానికి కధ, ఫొటోకి కధ, సందర్భానికి కధ మొ… ఛాలెంజ్ లలో నేను కధలు వ్రాసి అనేకమంది పాఠకుల ప్రశంశలను పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్ వెబ్సైట్ లో “పశ్చాత్తాపం” అనే నా కధకు విశేష స్పందన లభించి ఉత్తమ కధగా సెలక్ట్ అయి నగదు బహుమతి వచ్చింది. ఇలా ఆ వెబ్సైట్ లో నెలనెలా నాకధలు ఉత్తమ కధగా సెలెక్ట్ అయి పలుసార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి.
గత 5సం.. నుంచి “మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్“ లో నేను కధలు వ్రాస్తూ ఉంటున్నాను. ఆ వెబ్సైట్ లో నాకధలకి చాలా సార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు లభించాయి. వాళ్ల ప్రోత్సాహం జీవితాంతం మరువలేను. వాళ్లకు నా ధన్యవాదాలు🙏.
ఇటీవల నేను వ్రాసిన “నీరజ కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు” 75 కవితలతో కూడిన పుస్తకాలు వంశీఇంటర్నేషనల్ సంస్థ వారిచే ప్రచురింపబడి మా గురుదంపతులు ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి అవార్డీ శ్రీ అయ్యగారి శ్యామసుందరంగారి దంపతులచే కథలపుస్తకం, జాతీయకవి శ్రీ సుద్దాల అశోక్ తేజ గారిచే కవితలపుస్తకం రవీంద్ర భారతిలో ఘనంగా ఆవిష్కరించబడటం, వాళ్లచేత ఘనసన్మానం పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు పొందడం నాఅదృష్టం.🙏
ఇటీవల మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడి గారిచే ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు అందుకోవడం నిజంగా నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం.🙏
చాలా మంది పాఠకులు సీరియల్ వ్రాయమని కోరితే భావుకలో “సుధ” సీరియల్ వ్రాశాను. అది అందరి ఆదరాభిమానాలను పొందటమే కాక అందులో సుధ పాత్రని తమ ఇంట్లో పిల్లగా భావించి తమ అభిప్రాయాలను చెప్పి సంతోషించారు. ఆవిధంగా నా తొలి సీరియల్ “సుధ” విజయవంతం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది.
నేను వ్రాసిన “మమతల పొదరిల్లు” కధ భావుకధలు పుస్తకంలో, కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో కొత్తకెరటం పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి” పుస్తకంలో ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు పుస్తకాలుగా వెలువడి బహు ప్రశంసలు లభించాయి.
రచనలు నా ఊపిరి. ఇలా పాఠకుల ఆదరాభిమానాలు, ఆప్యాయతలే నాకు మరింత రచనలు చేయాలనే ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది శ్వాస వరకు మంచి రచనలు చేయాలని, మీ అందరి ఆదరాభిమానాలను పొందాలని నా ప్రగాఢవాంఛ.
ఇలాగే నా రచనలను, కవితలను చదివి నన్ను ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని ఆశిస్తూ
మీ అభిమాన రచయిత్రి
నీరజ హరి ప్రభల.
విజయవాడ.
Photo Gallery
Comments