top of page
Original_edited.jpg

మాధవి - పార్ట్ 3

  • Writer: Neeraja Prabhala
    Neeraja Prabhala
  • Jul 31, 2024
  • 8 min read

Updated: Aug 28, 2024


ree

'Madhavi - Part 3/3' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 31/07/2024

'మాధవి - పార్ట్ 3/3' పెద్ద కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

బాగా చదువుకోవాలన్న తన ఆశయాన్ని పక్కన పెట్టి, తలిదండ్రుల కోరికపై శరత్ ని పెళ్లి చేసుకుంటుంది మాధవి. అతనికి తనంటే ఇష్టం లేదనీ, వేరొకరిని ప్రేమించాడనీ తెలుసుకొని బాధ పడుతుంది. అందరి మెప్పూ పొందటానికి ఎంతో కష్టపడుతుంది. అయినా అత్తగారి సాధింపులు తప్పవు. మాధవికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో అందరూ చిన్నచూపు చూస్తారు.

పిల్లల్ని కష్టపడి చదివిస్తుంది. తనుకూడా ప్రైవేట్ గా చదివి ఎం. ఏ. పాసవుతుంది.


ఇక మాధవి పార్ట్ 3 చదవండి 


కానీ తాను PHD చేయలేకపోయానే అనే వ్యధ, సంగీతం నేర్చుకోలేకపోతున్నాననే బాధ ఆమెని కడదాకా వేధిస్తూనే ఉంటుంది. చదువన్నా, సంగీత, సాహిత్యాలన్నా ఆమెకు ప్రాణం. 


నాలుగు సం…తర్వాత ఒకరి తర్వాత మరొకరు క్రమేపీ వాళ్ల చదువులు పూర్తిచేసి కాంపస్ సెలక్షన్స్ లో మంచి కంపెనీలలో ఉద్యోగాలలో చేరారు. మాధవికి, ఆమె తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. శరత్ వ్యవహారం మామూలే. అతను మారడని అర్ధమైంది మాధవికి. 


రెండు సం…తర్వాత తల్లిదండ్రుల ఆర్థిక అండతో విద్యకి మంచి సంబంధాన్ని వెతికి వైభవంగా పెళ్లిచేసింది మాధవి. తన ఉద్యోగానికి రిజైన్ చేసి విదేశానికి తన భర్తతో వెళ్లింది విద్య. కొన్నాళ్లకు అక్కడ వేరే ఉద్యోగాన్ని పొందింది విద్య. వాళ్లు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. 


మరో ఐదు సం…లలో తల్లిదండ్రుల సాయంతో మిగిలిన ఇద్దరు పిల్లల పెళ్ళిళ్లను ఘనంగా చేసింది మాధవి. వాళ్లు కూడా తమ తమ భర్తతో సంతోషంగా విదేశాల్లో కాపురం చేసుకుంటున్నారు. మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరో ఐదారేళ్లల్లో విదేశాలకి వెళ్లి వాళ్లకి పురుళ్లని పోసింది మాధవి. కూతుర్లు, అల్లుళ్లు‌, మనవళ్లు, మనవరాళ్లని చూసి చాలా సంతోషించింది మాధవి. 


కాలం దేనికోసం ఆగదు కదా! రెండు మూడేళ్ల వ్యవధిలో మాధవి తల్లితండ్రులు వృధ్ధాప్యం కారణంగా స్వర్గస్తులైనారు. మాధవికి తన వెన్ను విరిగినంతగా తల్లడిల్లి బాధపడింది. తనని, తన బిడ్డలని ఇన్నేళ్లు కంటికిరెప్పలా కాపాడుతూ, అన్నివిధాలా తనకు కొండంత అండగా నిలిచిన దేవతల్లాంటి తన తల్లిదండ్రులను కోల్పోయిన మాధవికి తీరని శోకం కలిగింది. క్రమేపీ తనకి తానే ధైర్యం చెప్పుకుని ఆ దుఃఖం నుండి ఆమె బయటపడింది. ఎంతటి గాయాన్నైనా కాలమే మాన్పుతుంది కదా!


కాలం సాగుతోంది. తల్లిదండ్రులు పోయాక మాధవికి పుట్టింట ఏ అండా లేదని ఆమెని మరింత శాడిస్టుగా బాధలు పెట్టసాగాడు శరత్. పెళ్లై నలభై ఏళ్ళు అయినా మాధవికి ఆ రాక్షసుడైన భర్త నుండి బాధలు, కష్టాలు ఏ మాత్రం తీరకపోగా అవి మరింత ఎక్కువైనాయి. అతని చెడు తిరుగుళ్లకు అడ్డూ, అదుపూ లేకపోగా మాధవిని ఇంటినుంచి వెళ్లగొట్టాలనే కుటిల ప్రయత్నతో తరచూ ఆమెని వాతలు పెడుతూ, నిత్యం బూతులు తిడుతూ, కొడుతూ ఆమెని మానసికంగా, శారీరకంగా హింసించసాగేడు శాడిస్ట్ శరత్. 


పెళ్లైనప్పటి నుండి భర్త అరాచకాలను పిల్లల పెంపకం, వాళ్ల కెరీర్ కోసం, కుటుంబ పరువు, ప్రతిష్టలకోసం భరిస్తూ వస్తున్నదే కానీ ఏనాడూ తన తల్లితండ్రులకు, తోడబుట్టిన వాళ్లకు చెప్పుకోలేదు మాధవి. అంతులేని ఓర్పు, సహనమే ఆమె సహజ భూషణములు. 


ఊహ తెలిసినప్పటి నుంచి తమ తల్లి బాధలను, కష్టాలను చూస్తూ పెరిగిన పిల్లలు, శాడిస్టుతనం, రాక్షస ప్రవర్తన ఉన్న తండ్రి స్వభావం తెలిసిన పిల్లలు తమ తండ్రికి ఎన్నోమార్లు, ఎన్నోవిధాలా నచ్చచెప్పి ఆయన్ని శతవిధాలా మార్చ ప్రయత్నించి విఫలమైనారు. తమ వద్దకు వచ్చి హాయిగా ఉండమని తల్లికి చెప్పారు. వచ్చే వయసురీత్యా, శరీర బాధల రీత్యా విదేశాల్లో కూతుళ్ల వద్దకు వెళ్లి వాళ్లకు తనొక సమస్య కాగూడదని మాధవి తన మనసులో స్ధి‌రనిర్ణయం చేసుకుని ఆ విషయమే పిల్లలకు సున్నితంగా చెప్పింది. చేసేదిలేక వాళ్లు మాధవికి నెలనెలా కాస్త డబ్బుని పంపుతున్నారు. ఆ డబ్బునే జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ తన వైద్యం, నిత్య జీవనానికీ వాడుకుంటోంది మాధవి. తనకున్నంతలోనే ఏదైనా అనాధలకు, దేవాలయాలకు ఇస్తోంది. 


తన మనశ్శాంతి కోసం చిన్నప్పటి నుండి తనకు ఉన్న సాహిత్యాభిలాషతో చక్కటి కధలు, తన మనసులోని భావాలను వ్యక్తం చేసే మంచి కవితలు వ్రాయడం మొదలెట్టింది మాధవి. అది సహించలేక ఆ శాడిస్ట్ భర్త శరత్ మాధవి వ్రాస్తున్న కాగితాలను చించివేసి బూతులతో దూషిస్తూ ఉన్నా సహించేది కానీ తన రచనలను మాత్రం ఏనాడూ మానలేదు. అచిరకాలంలోనే తన కెంతో ఇష్టమైన “మన తెలుగు కధలు” వెబ్సైట్ వాళ్ల చేత రవీంద్రభారతిలో “ఉత్తమ రచయిత్రి” గా అవార్డుని పొంది ఘన సన్మానం పొందింది. అది తన అదృష్టం‌, పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంది మాధవి. 


ఆ తర్వాత అనేక పుస్తకాలను రచించి పలు సన్మానాలను పొందింది. తను వ్రాసిన కధలు, కవితల పుస్తకాల ఆవిష్కరణ తను నిత్యం దైవసమానంగా భావించి పూజించే సంగీత గురుదంపతుల చేత, ప్రముఖ సినీకవుల చేత ఆవిష్కరణకార్యక్రమం తన కూతుళ్ల, అల్లుళ్ల సమక్షంలో ఘనంగా జరగడం, ప్రముఖ వంశీ సంస్ధ చేత రవీంద్రభారతిలో సన్మానం, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి చేత ఘన సన్మానం పొందడం తన అదృష్టం, పూర్వజన్మ సుకృతంగా ఎప్పుడూ భావిస్తుంది మాధవి. ‘ఇదంతా ఆ అమ్మవారి దయ’ అని అనుకుంటూ ఉంటుంది. 


మాధవి ఇలా ఉండడాన్ని కూడా తట్టుకోలేక శరత్ తన కూతుళ్లకు డబ్బులు మాధవికి పంపవద్దని అనేక విధాలా బెదిరించినా వాళ్లు మంచి పిల్లలు కనుక తమ తండ్రి మాటని పెడచెవిన పెట్టి తమ తల్లికి డబ్బులు పంపుతూ ఆమెని ఆదుకుంటున్నారు. ఈ చర్య వలన రెండేళ్ల పాటు శరత్ తన కూతుళ్లతో మాట్లాడటం మానేశాడు కూడా. 


తల్లికి సపోర్టుగా ఉంటున్నందున తమ తండ్రికి తాము దూరమవుతున్నామని గ్రహించిన పిల్లలు తమ తల్లికి “అమ్మా! నీ జీవితం నీది. మాతో చెప్పితే నీ బాధలు, కష్టాలు తీరేవి కావు. మేము, మా భర్తలు ఎంత చెప్పినా ఆయన వినట్లేదు. ఆయన ఇంక మారడు. మా శాడిస్టు తండ్రి నిన్ను పెట్టే బాధలు ఇంక తీరవు. నీవు అక్కడే ఉంటూ విలువైన నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఆయన ఎప్పుడు, ఏ క్షణాన నిన్ను చంపుతాడో అని మాకు నీ గురించే దిగులు. నిన్ను రక్షించేందుకు ఆ సమయాన ఇంట్లో ఎవరూ కూడా ఉండరు. నీవు లాయర్లను సంప్రదించి విడిగా వేరే ఇంటికి వెళ్లు. అద్దెని మేం కడతాము” అని ధైర్యం చెప్పారు తల్లికి. 


కానీ తాను ఈ వయసులో ఎక్కడికి వెళ్లినా భర్తనొదిలేసిన స్త్రీ అని బంధువులు, తోబుట్టువులు, సమాజంలో అందరూ తనను చాలా హీనంగా చూస్తారు. “ముందు నుయ్యి- వెనుక గొయ్యి” లాగా ఉంది తన జీవితం అనుకుంది మాధవి. పైగా తమ వియ్యాలవారికి కూడా లోకువై ఆ ప్రభావం తన పిల్లల కాపురాల మీద పడుతుందని భావించింది మాధవి. పైగా విడిగా వెళ్లి బ్రతుకుతూ, కోర్టుల చుట్టూ తిరిగే శారీరక, మానసిక ధైర్యం లేదు మాధవికి. తనకు అర్థబలమూ, అంగబలమూ లేదు. అదే విషయం తన కూతుళ్లకు చెప్పి ఆ ఇంట్లోనే తన సైకో, శాడిస్ట్ భర్తతో ఉంటోంది. 


కొన్నాళ్లకు శరత్ కు “డయాబెటిస్ హీల్ అల్సర్” వచ్చి కాలుని తీసివేస్తే మాధవే ఆయనను హాస్పిటల్ లో చేర్చి మానవత్వంతో ఆయనకు బెడ్ పాన్ లు వంటి సేవలు చేసింది. రెండు సం…మంచానికే పరిమితమైన శరత్, మాధవి సపర్యలతో తిరిగి కోలుకున్నాడు. మంచంలో ఉన్నా కూడా శరత్ కి కాలు పోయింది కానీ నోరు, చేయి, అతని శాడిస్ట్ మనస్తత్వం పోలేదు. మాధవిని ఎంతగానో హింసించసాగేడు. ‘పుట్టుకతో వచ్చిన బుధ్ధి పుడకలతో గానీ పోదు కదా!’ అనుకుంది మాధవి. 

 

కూతుళ్లు, అల్లుళ్లు‌ వచ్చి శరత్ ని చూశారు. తండ్రి తమ తల్లికి అంత నరకం చూపినా ఆమె మానవత్వంగా శరత్ కు చేసిన, చేస్తున్న సేవలను అనేకవిధాలా మెచ్చుకున్నారు. రెండు వారాల తర్వాత వాళ్ళు తమ దేశాలకు వెళ్లారు. 


మరో ఏడాది తర్వాత జైపూర్ కాలుని పెట్టించింది భర్తకు మాధవి. తనకి ఇంత సేవలు చేసినా శరత్ ఏమాత్రం మాధవి పట్ల కృతజ్ఞత చూపకుండా తనకి కాలొచ్చిందని రెచ్చిపోతూ ఆమెని తన చేతి కర్రతో కొడుతూ, నోటితో బూతులు దూషిస్తూ ఆమెని మానసికంగా, శారీరకంగా హింస పెడుతూనే ఉన్నాడు. ఇంక తన జీవితానికీ బాధలు, కష్టాలు తీరవా? అనుకుని నిత్యం బాధపడుతోంది మాధవి. 


తలికి స్వతహాగా ఉన్న ఓర్పు, సహనమే ఆమె పాలిట ఆమె జీవితంలో శాపాలుగా మారాయని ఆమె పిల్లలు ఎప్పుడూ తమ తల్లిని తలుచుకుంటూ బాధపడుతారు. 


మాధవి రచనలు చేస్తూనే “తుల్యాంక వెల్ నెస్ యోగా కేంద్రం” లో చేరి మంచి గురుదంపతుల సమక్షంలో నిత్యం యోగాలో చేరి యోగా చేస్తోంది. అక్కడ ఆమెకు మంచి స్నేహితులు కూడా లభించారు. సంగీతంలో, యోగాలో తనకు అంత మంచి గురుదంపతులు గురువులుగా లభించడం తన అదృష్టమని, తన పూర్వజన్మ సుకృతమని ఎల్లప్పుడూ భావిస్తోంది మాధవి. 


 తన తల్లిదండ్రులు కూతురి పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరుతుందని భ్రమపడి వరుడి గుణగణాలు, అతని ప్రవర్తన, విద్యార్హత, ఆ కుటుంబ మంచి చెడులను ఏమాత్రం విచారించకుండా వాళ్లు ధనవంతులు, సాంప్రదాయ ఉమ్మడికుటుంబం, తమ పిల్లని చక్కగా చూసుకుంటూ ఆమెకు అండగా ఉంటారని ఆశించారు. వాళ్లకి తను నోరుతెరిచి ఏదీ ఎన్నడూ చెప్పకపోయినా, ఎంతో జీవితానుభవాన్ని చవిచూసిన తన తల్లి తండ్రులు తన జీవితంగురించి, తన కష్టాలను, బాధలని గ్రహించి, తనకెంతో అండగా నిలవగా, అంత వృధ్ధులైన వాళ్లతో నిస్సిగ్గుగా “మీ అమ్మాయికి విడాకులిస్తా. మీ కూతురిని మీరు తీసుకుని పోయి మీతో ఉంచుకోండి. నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను“ అని వేధించాడు శాడిస్ట్ శరత్. రంకుతనం, బొంకుతనం నేర్చిన శరత్ కి సిగ్గు, శరం, పరువు, ప్రతిష్టలు, మానాభిమానాలు లేవు. కడదాకా తమ కూతురి జీవితం గురించి ఆలోచించి తీరని మనోవ్యధకి తన తల్లిదండ్రులు గురయ్యారనే బాధ మాధవి మనసుకి ఎప్పుడూ తీరని వ్యధ. అంతా విధిలిఖితమే కదా!


అందుకే పిల్లనిచ్చేటప్పుడు ఆస్తి అంతస్థులను చూడకుండా పిల్లవాడి గుణగణాలు, చదువు, సంస్కారం, వినయవిధేయతలను, కుటుంబ నేపథ్యం మొ.. వాటిని శ్రధ్ధగా తెలుసుకుని ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుని పిల్లల పెళ్లిళ్లు చేయాలి. అప్పుడే ఆ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. లేకపోతే తన జీవితం లాగే శాడిస్ట్, సైకో భర్తతో బాధపడి ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోవాల్సి జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకు తనే ఒక ఉదాహరణ అనుకుంటుంది మాధవి. 


 మాధవి భగ్నమైన తన వైవాహిక జీవితంలో ఏనాడూ నవ్విందీ లేదు. హాయిగా గడిపిందీ లేదు. తన పిల్లలు, సమాజం దృష్ట్యా ఈ బంధాన్ని తెంపుకోలేదు. అలా అని ఈ గుదిబండ భారాన్ని ఉంచుకోనూలేదు. ఆ బాధ్యతని కాలానికి, దైవానికే వదిలేసింది. తన బాధలు, కష్టాలు ఎవరికీ చెప్పేవీ కావు. చెబితే తీరేవీ కావు. అందుకే నివురు కప్పిన నిప్పులాగా వాటిని తనలోనే దాచుకుంటూ బ్రతుకు జీవనయానాన్ని గడుపుతోంది. అది తనని నిత్యం దహిస్తోందని తెలుసు. 


తను నిత్యం పూజించే ఆ దైవమే తనను ఈ దారుణ కష్టాలనుండి, ఈ శాడిస్టు, సైకో భర్త నుండి రక్షించి ఈ ఊబినుంచి తనని బయటపడేయాలని ఆ దైవాన్ని నిత్యం ప్రార్ధిస్తోంది మాధవి. దైవం ఆమె మొరవిని, ఆమె పూజలు, ప్రార్ధనలు ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. 


========================================================================

సమాప్తం

======================================================================== 


నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు


ree

ree

నా గురించి పరిచయం.....


 నా పేరు  నీరజ  హరి ప్రభల. మాది  విజయవాడ. మావారు  రిటైర్డ్  లెక్చరర్. మాకు  ముగ్గురు  అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస.  వాళ్లు  ముగ్గురూ  సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా   విదేశాల్లో  ఉద్యోగాలు  చేస్తూ  భర్త, పిల్లలతో  సంతోషంగా ఉంటున్నారు. 


 నాకు  చిన్నతనం  నుంచి  కవితలు, కధలు  వ్రాయడం  చాలా  ఇష్టం. ఆరోజుల్లో  వాటిని  ఎక్కడికి,  ఎలా  పంపాలో  తెలీక  చాలా ఉండిపోయి  తర్వాత  అవి  కనుమరుగైనాయి.  ఈ  సామాజిక మాధ్యమాలు  వచ్చాక  నా రచనలను  అన్ని  వెబ్సైట్ లలో  వ్రాసి వాటిని పంపే  సౌలభ్యం  కలిగింది. నా కధలను, కవితలను  చదివి  చాలా  మంది పాఠకులు  అభినందించడం  చాలా  సంతోషదాయకం. 

నా కధలకు   వివిధ పోటీలలో  బహుమతులు  లభించడం,  పలువురి  ప్రశంసలనందుకోవడం  నా అదృష్టంగా  భావిస్తున్నాను. 


మన  సమాజంలో  అనేక  కుటుంబాలలో   నిత్యం  జరిగే  సన్నివేశాలు, పరిస్థితులు,   వాళ్లు  పడే  బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని   ఎదుర్కొనే  తీరు   నేను  కధలు వ్రాయడానికి  ప్రేరణ, స్ఫూర్తి.  నా కధలన్నీ  మన  నేటివిటీకి, వాస్తవానికి   దగ్గరగా ఉండి  అందరి  మనస్సులను  ఆకర్షించడం  నాకు  సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న  దారుణాలకు, పరిస్ధితులకు   నా మనసు  చలించి  వాటిని  కధల రూపంలోకి  తెచ్చి  నాకు  తోచిన  పరిష్కారం  చూపే  ప్రయత్నం  చేస్తాను.   


నా  మనసులో  ఎప్పటికప్పుడు  కలిగిన  భావనలు, అనుభూతులు, మదిలో  కలిగే  సంఘర్షణలను   నా కవితలలో  పొందుపరుస్తాను. నాకు  అందమైన  ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర  నైసర్గిక  స్వరూపాలను  దర్శించడం, వాటిని  ఆస్వాదించడం, వాటితో  మమేకమై మనసారా  అనుభూతి చెందడం  నాకు  చాలా ఇష్టం. వాటిని  నా హృదయకమలంలో  అందంగా  నిక్షిప్తం చేసుకుని   కవితల రూపంలో  మాలలుగా  అల్లి  ఆ  అక్షర మాలలను  సరస్వతీ దేవి  పాదములవద్ద  భక్తితో   సమర్పిస్తాను.  అలా  నేను  చాలా  దేశాల్లలో  తిరిగి  ఆ అనుభూతులను, అనుభవాలను   నా కవితలలో, కధలలో  పొందుపరిచాను. ఇదంతా  ఆ వాగ్దేవి  చల్లని  అనుగ్రహము. 🙏 


నేను గత  5సం… నుంచి  కధలు, కవితలు  వ్రాస్తున్నాను. అవి  పలు పత్రికలలో  ప్రచురణలు  అయ్యాయి. పుస్తకాలుగా  ప్రచురించబడినవి. 


“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో  నేను కధలు, కవితలు   వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో   నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు  లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు   రవీంద్రభారతిలో  నాకు  “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి  ఘనంగా  సన్మానించడం  నా జీవితాంతం  మర్చిపోలేను. ఆజన్మాంతం  వాళ్లకు  ఋణపడిఉంటాను.🙏 


భావుక  వెబ్సైట్ లో  కధల పోటీలలో   నేను  వ్రాసిన “బంగారు గొలుసు” కధ   పోటీలలో  ఉత్తమ కధగా  చాలా ఆదరణ, ప్రశంసలను  పొంది  బహుమతి  గెల్చుకుంది. ఆ తర్వాత  వివిధ పోటీలలో  నా కధలు  సెలక్ట్  అయి  అనేక  నగదు  బహుమతులు  వచ్చాయి.  ‘మన కధలు-మన భావాలు’  వెబ్సైట్ లో  వారం వారం  వాళ్లు  పెట్టే  శీర్షిక, వాక్యానికి కధ,    ఫొటోకి  కధ, సందర్భానికి  కధ  మొ… ఛాలెంజ్  లలో  నేను   కధలు వ్రాసి  అనేకమంది  పాఠకుల  ప్రశంశలను  పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్  వెబ్సైట్ లో  “పశ్చాత్తాపం” అనే  నా  కధకు  విశేష స్పందన  లభించి  ఉత్తమ కధగా  సెలక్ట్ అయి  నగదు బహుమతి   వచ్చింది. ఇలా  ఆ వెబ్సైట్ లో  నెలనెలా   నాకధలు  ఉత్తమ కధగా  సెలెక్ట్ అయి  పలుసార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి.


గత  5సం.. నుంచి  “మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్“ లో  నేను కధలు  వ్రాస్తూ ఉంటున్నాను. ఆ వెబ్సైట్ లో  నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక  ప్రశంసలు లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు🙏. 


ఇటీవల నేను  వ్రాసిన  “నీరజ  కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు”  75 కవితలతో  కూడిన పుస్తకాలు  వంశీఇంటర్నేషనల్   సంస్థ వారిచే  ప్రచురింపబడి  మా గురుదంపతులు  ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి  అవార్డీ    శ్రీ  అయ్యగారి శ్యామసుందరంగారి  దంపతులచే  కథలపుస్తకం,  జాతీయకవి  శ్రీ సుద్దాల అశోక్ తేజ  గారిచే   కవితలపుస్తకం  రవీంద్ర భారతిలో ఘనంగా  ఆవిష్కరించబడటం,  వాళ్లచేత  ఘనసన్మానం  పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు  పొందడం  నాఅదృష్టం.🙏 


ఇటీవల  మన  మాజీ ఉపరాష్ట్రపతి  శ్రీ  వెంకయ్యనాయుడి గారిచే  ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు  అందుకోవడం  నిజంగా  నా అదృష్టం. పూర్వజన్మ  సుకృతం.🙏


చాలా మంది  పాఠకులు  సీరియల్ వ్రాయమని కోరితే  భావుకలో  “సుధ” సీరియల్  వ్రాశాను. అది  అందరి ఆదరాభిమానాలను  పొందటమే  కాక   అందులో  సుధ  పాత్రని  తమ ఇంట్లో పిల్లగా  భావించి  తమ  అభిప్రాయాలను  చెప్పి  సంతోషించారు. ఆవిధంగా నా  తొలి సీరియల్  “సుధ”  విజయవంతం అయినందుకు  చాలా సంతోషంగా  ఉన్నది.        


నేను వ్రాసిన  “మమతల పొదరిల్లు”  కధ భావుకధలు  పుస్తకంలో,  కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో  “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో  కొత్తకెరటం   పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి”   పుస్తకంలో  ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు  పుస్తకాలుగా  వెలువడి  బహు  ప్రశంసలు  లభించాయి. 


రచనలు  నా ఊపిరి. ఇలా పాఠకుల  ఆదరాభిమానాలు, ఆప్యాయతలే  నాకు  మరింత  రచనలు  చేయాలనే  ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది  శ్వాస వరకు  మంచి రచనలు  చేయాలని, మీ అందరి  ఆదరాభిమానాలను  పొందాలని  నా ప్రగాఢవాంఛ. 


ఇలాగే  నా రచనలను, కవితలను  చదివి  నన్ను   ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని   ఆశిస్తూ 


                     మీ  అభిమాన రచయిత్రి

                       నీరజ హరి  ప్రభల.

                          విజయవాడ.

Photo Gallery

ree








Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page