మహనీయుల వచనాలు
- Gadwala Somanna
- Jul 23
- 1 min read
Updated: Jul 24
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #MahaniyulaVachanalu, #మహనీయులవచనాలు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 99
Mahaniyula Vachanalu - Somanna Gari Kavithalu Part 99 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 23/07/2025
మహనీయుల వచనాలు - సోమన్న గారి కవితలు పార్ట్ 99 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
మహనీయుల వచనాలు
----------------------------------------
అభాగ్యులకు తోడుగా
అనాథులకు నీడగా
ఉండాలోయ్ లోకంలో
అందరికి ఉపకారిగా
చెట్టు వోలె పచ్చగా
పదిమంది మెచ్చగా
నైతిక విలువలతోడ
బ్రతకాలోయ్ మంచిగా
త్యాగానికి గుర్తుగా
సహనానికి మారుగా
ఆదర్శం చాటుతూ
నడవాలోయ్ గొప్పగా
విజయమే ధ్యేయంగా
వినయమే ప్రాణంగా
జీవించి చూపాలోయ్
ఆకాశమే సాక్షిగా

పెద్దయ్య హితవు
------------------------
మంచిలేని జీవితము
ఎంచి చూడ వ్యర్థము
కొంచెమైనా మంచిని
కల్గియున్న గౌరవము
నవ్వులేని ముఖములు
పువ్వులు లేని వనములు
నూనె లేని దివ్వెలు
వానలేని ప్రాంతములు
క్రియ లేని విశ్వాసము
చూడ నిష్ప్రయోజనము
పెట్టితే గాలిలోన
వెలుగుతుందా! దీపము
శ్రమిస్తేనే ఫలితము
అక్షరాల సత్యము
మితిమీరిన బద్ధకము
వైరితో సమానము

అమ్మ హిత బోధ
---------------------------------------
పసిపాపలా నవ్వుతూ
సోయగాలే రువ్వుతూ
జీవించాలి హాయిగా
పదిమందికి స్ఫూర్తిగా
చేయి చేయి కలుపుతూ
చెలిమితోడ బ్రతుకుతూ
దేశాభివృద్ధికిలలో
ఉండాలోయ్ సాయపడుతూ
విజ్ఞానమే పంచుతూ
అజ్ఞానమే త్రుంచుతూ
విద్యాదాతలు కావాలి
దేశకీర్తిని పెంచుతూ
వైషమ్యాలు వీడుతూ
సమైక్యతను కోరుతూ
సాగిపోవాలోయ్ భువిని
ఇక గళమెత్తి పాడుతూ

అమ్మ ప్రబోధ గీతి
--------------------------------------
బ్రతకాలి నీతిగా
వెలగాలి జ్యోతిగా
విశాల విశ్వంలో
సాగు ఈ రీతిగా
రాణించు గొప్పగా
గగనమే హద్దుగా
జ్ఞానార్జనలో ఇల
ఉండోయ్ ప్రథమంగా
నలుగురికి స్ఫూర్తిగా
దేశభక్తి పూర్తిగా
సభ్య సమాజంలో
చాటాలి మేటిగా
భారతమ్మ బిడ్డగా
మనసున్న మనిషిగా
మంచి పనులు చేయాలి
భూమాత సాక్షిగా
-గద్వాల సోమన్న
Comments