top of page

మహిళా ఓ మహిళా

Mahila O Mahila Written By Venkateswara Rao Korukonda

రచన : కోరుకొండ వెంకటేశ్వర రావు


“మమ్మీ .. మమ్మీ .. ఎల్లుండి శనివారం సాయంత్రం మా స్కూల్‌ లో ఏన్యుయల్‌ డే. నువ్వూ, డాడీ

తప్పకుండా రావాలి. ప్రామిస్‌ ? “కుతూహలంగా చెయ్యి చాచాడు రాహుల్‌”.

" ఓహ్‌ .... తప్పకుండా !" చేతిలో చెయ్యి వేసింది కృష్ణవేణి.

"నువ్వలాగే అంటావ్‌ గానీ డాడీ ఇంతవరకూ మా స్కూల్‌ పేరెంట్స్‌ డేకే రాలేదు. ' ఎప్పుడూ మీ మమ్మీయే వస్తుంది ... మీ నాన్నెందుకు రాడు ' అంటూ నా ఫైండ్స్‌ అందరూ ఆట పట్టిస్తున్నారు

మమ్మీ ... ఈ సారి ఎలాగైనా నాన్నని ఒప్పించి తీసుకు రావాలి. నేను వేస్తున్న స్కిట్‌ మీరిద్దరూ చూస్తేనే నాకు హ్యాపీ" అన్నాడు.

"తప్పక వస్తాం ... సరేనా?" అంటూ కొడుకుని సముదాయించింది.


చక్రవర్తి, కృష్ణవేణి దంపతులకు ఇద్దరు పిల్లలు. రాహుల్‌ సెయింట్‌ జోన్స్‌ స్కూల్‌ లో సెవెంత్‌

చదువుతున్నాడు. ప్రియాంక ఫిఫ్త్ లో ఉంది. చక్తవర్తి “ లైఫ్‌ సెక్యూర్” ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఏరియా సేల్స్‌ మేనేజర్‌ గా చేస్తున్నాడు. ఉద్యోగరీత్యా వత్తిడితో పాటు తరచు కేంప్‌ లకు కూడా వెళ్లాల్సి వస్తుంది. అందువల్ల తన కుటుంబంతో ఎక్కువ సమయం గడప లేకపోతున్నాడు. ఈ విషయంలో కృష్ణవేణి చాలా అసంతృప్తికి లోనవసాగింది. పిల్లలు కూడా తండ్రిని మిస్‌ అవుతున్నారు. కుటుంబం కోసమే కదా ఆయన మాత్రం కష్టపడుతున్నాడు అని తనను తాను సమర్ధించుకోవడం మొదలు పెట్టిన తరుణంలో ఓ సంఘటన ఆమెను బాగా కలచి వేసింది. ఉతికించడానికి ఆయన బట్టలు తీస్తుండగా కోటుమీద లిప్ స్టిక్‌ మరకలు కనిపించడంతో హతాశురాలయ్యింది. సెలవు రోజుల్లో కూడా క్యాంపులని చెప్పి తననిలా మోసం చేస్తున్నాడన్నమాట ! 'రహస్యంగా వివరాలు ఎలా రాబట్టాలా !' అని ఆలోచిస్తుండగా భర్త ఆఫీస్‌ లో పనిచేస్తున్న తన పిన్ని కూతురు సుజాత గుర్తుకొచ్చింది. వెంటనే ఆమెకు ఫోన్‌ చేసి ఓ సారి ఇంటికి రమ్మని ఆహ్వానించింది.


చక్తవర్తి దగ్గర పని చేస్తున్న స్టెనో ‘మేరీ’ అతనిని పూర్తిగా వలలో వేసేసుకుందని సుజాత తెలియజెప్పడంతో కృష్ణవేణికి మైండ్‌ బ్లాకైపోయింది. ఆ మేరీకి జేమ్స్ అనే బాయ్‌ ఫైండ్‌ ఉన్నట్టు, కేవలం డబ్బు కోసమే తన భర్తకు దగ్గరైనట్లు తెలుసుకుంటుంది.కాంప్‌ నుంచి తిరిగొచ్చిన భర్తను నిలదీసింది కృష్ణవేణి.

"అబ్బే ... అలాంటిదేమీ లేదు కృష్ణా ! ” అంటూ సర్ది చెప్పబోయాడు.

కోటు మీది లిప్‌ స్టిక్‌ మరకలు చూపించి “అయితే ఇవేమిటి ?" అని అడిగేసరికి బిత్తర పోయాడు. “నీవన్నీ ఒట్టి అపోహలు ... లేకపోతే చూడు సాస్‌ మరకలు చూసి నువ్వు ఊరికే అపార్ధం చేసుకుంటున్నావు “ అన్నాడు.

" సరే... ఇంక డొంక తిరుగుడు అనవసరం ... మేరీకి, మీకు మధ్యన నడుస్తున్న కధకూడా నా భ్రమేనంటారా ... చెప్పండి ? .." అంటూ సూటిగా ప్రశ్నించింది.

ఇక దాచడం అసాధ్యమని గ్రహించి, "అవును ... అయితే ఇప్పుడేంటి ?" అన్నాడు కాస్త నిర్లక్ష్యంగా.

“మీరు దాంతో కులుకుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నారా ? నెవర్! ఉండండి ... ఇప్పుడే మామయ్యగారికి ఫోన్‌ చేస్తాను “ అంటూ ఫోన్‌ చేతిలోకి తీసుకుంది.

విషయం శృతి మించుతున్నట్లు గ్రహించి, "మధ్యలో నాన్నగారిని ఎందుకు లాగుతావ్‌ ... అయినా, మీ అందరినీ బాగానే చూసుకుంటున్నాను కదా !” అన్న అతని మాటలకు సర్రున లేచింది కృష్ణవేణి.

“అవన్నీ నాకనవసరం ... నేను కావాలా... అది కావాలా ... ఇప్పుడే తేల్చండి. ” అని ఖరాఖండిగా అనేసరికి, అప్పటికే కాస్త డ్రింక్‌ మీదున్న చక్రి, 'నాకు ఇద్దరూ కావాలి, ఓకేనా ?”అన్నాడు కూల్‌ గా.

సరే ... ఆవిడతోనే కులకండి. నేను, పిల్లలు రేపు ఊరెళ్ళి పోతున్నాము. అని ప్రకటించింది. “ఓహో... అలానా... పుట్టింట్లో ఎన్నాళ్ళు ఉంటావ్‌. అదీ చూస్తాను ... హాయిగా వెళ్ళు...

నిన్ను ఆపే వాళ్ళు ఎవరూ లేరు. సరేనా ? "అన్నాడు వెటకారంగా. మరునాడు ఉదయం చక్రి లేవక ముందే కృష్ణవేణి పిల్లలతో తన పుట్టినింటికి వెళ్ళిపోయింది.

ఇదిలా ఉండగా, గుంటూరు లో ఉన్న కృష్ణవేణి చిన్ననాటి స్నేహితురాలు భానుప్రియ జీవితం మరోలా ఉంది. ఆమె విజయవాడలో ప్రముఖ పారిశ్రామిక వేత్త రామకృష్ణ గారి రెండవ కుమార్తె. ఢిల్లీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ లో డిగ్రీచేసి, హైదరాబాద్‌ లోని “పారిస్‌ డిజైనర్స్‌” సంస్థలో ఎగ్జీకూటివ్‌ గా పనిచేస్తుంది. ఫాస్ట్‌ గా ఉండే ఆధునిక మహిళకు ప్రతిరూపం భాను అని చెప్పొచ్చు.

తన ఆఫీస్‌ లో మేనేజర్‌ గా పనిచేసే అభినయ్‌ ఆరడుగుల అందగాడు. అందరి తలలో నాలుకలా ఉండే అభిని ఇష్టపడని వారే లేరంటే అతిశయోక్తి కాదేమో! ఆఫీస్‌ వేళలు తప్పిస్తే, మిగతా సమయాన్ని రకరకాల సేవా కార్యక్రమాలలో వినియోగిస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ చాలా హుషారుగా, అందరినీ నవ్విస్తూ, చలాకీగా ఉండే అభి ప్రేమలో పడుతుంది భానుప్రియ.

మన అంతస్తుల్లో చాలా వ్యత్యాసం ఉంది ప్రియా... ఒకటికి రెండుసార్లు ఆలోచించు ఫ్లీజ్‌! అని నచ్చజెప్పడానికిప్రయత్నించాడు అభి. ససేమిరా అంటుంది భాను. తన తల్లిదండ్రులకూ ఈ ప్రపోజల్‌ ఎంతమాత్రం ఇష్టం లేకున్నా చివరికి తన పంతమే నెగ్గాలని భీష్మించుకు కూర్చుంది.

దాంతో వారికి అభినయ్‌ తో ఆమె పెళ్లి చెయ్యక తప్పలేదు. పెళ్లయ్యాక ఓ రెండేళ్లవరకూ అంతా బాగానే సాగింది. ఆ తరువాత ఒక్కొక్కటిగా భేదాభిప్రాయాలు తలెత్తసాగాయి.

మొదటి ఏడాది తనో ఎక్స్ పోర్ట్ ఆర్డర్‌ పనుల్లో బిజీగా ఉండడం, ఆ తర్వాత ప్రెగ్నన్సీ వల్ల మరో ఏడాది ఇట్టే గడిచి పోయింది. అభీ తన సోషల్‌ సర్వీస్‌ కార్యక్రమాల్లో మునిగి ఉన్నా, ఇద్దరికీ ఏమీ ఇబ్బంది కలుగ లేదు. సంపన్న కుటుంబంలో పుట్టిన కారణంగా స్వతహాగా అబ్బిన అభిజాత్యం, తన మాట నెగ్గించుకునే తత్వం భానుప్రియ వ్యక్తిత్వంలో విడదీయరాని స్వభావాలుగా చెప్పుకోవాలి. ఆఫీస్‌ నుండి అభి తిన్నగా ఇంటికి వచ్చి, తనను ప్రతి రోజూ ఏదైనా పార్కుకి గానీ, సినిమాకి గానీ తీసుకెళ్లాలి. వారానికో ఔటింగ్ లాంటి సర్ప్రైజెస్ ఇస్తుండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే, రోజూ ఓ థ్రిల్లింగ్‌ గా కొత్తగా ఉండాలి. ఇవన్నీ భాను అభీష్టాలు. అభి తన సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటూ ఆమెకు పూర్తి సమయం కేటాయించడం లేదు. ఈ విషయం అతనితో ప్రస్తావిస్తే, “నా మనసుకి ఆనందాన్నిచ్చే సోషల్‌ సర్వీస్‌ ని ఎలా వదులుకోను

చెప్పు ... అదీకాక, పెళ్లికాక ముందు నుంచే నా హాబీస్‌ గురించి నీకు తెలుసుగా ... నన్ను అర్ధం చేసుకోడానికి ప్రయత్నించు ప్లీజ్! అని తేల్చేసాడు.


దాంతో, అభి పట్ల తనకు మొదట్లో ఉండే ఆకర్షణ క్రమేపీ సన్నగిల్ల సాగింది. దానికి తోడు, బాబు

ఆలన, పాలన విషయాల్లో అతని చేయూత కరువవడంతో, ఆమెలో అసంతృప్తి మెల్లమెల్లగా పేరుకోసాగింది. చిలికి, చిలికి గాలివాన అయినట్లుగా రోజు రోజు కీ వాదోపవాదాలు పెరిగి, చివరికి పంతాలు, పౌరుషాల వరకు వచ్చేసాయి. ఓ రోజు అభీని నిలదీసింది “నేను కావాలో, నీ సోషల్‌ సర్వీస్‌ కావాలో తేల్చుకో “ అంటూ.

"నేను రెండింటినీ వదులుకోలేను భానూ..." అన్నాడు స్థిరంగా.

“ఓకే... నా అవసరం, విలువ రెండూ గ్రహించాక ఏనాటికైనా నువ్వే నన్ను వెదుక్కొని వస్తావ్. అంతదాకా నేను బాబుని తీసుకొని మా పుట్టినింటికివెళ్ళిపోతున్నాను. బాయ్‌ .." అంటూ అదే రోజు టాక్సీలో తన పుట్టింటికి బయలు దేరింది భానుప్రియ. ఆమె ప్రయత్నాన్ని ఎలా విరమింప జేయాలో తెలియక అలా చూస్తూ ఉండి పోయాడు అభినయ్‌.

భర్తతో వాదీపవాదాల అనంతరం కృష్ణవేణి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. నాన్న చనిపోయాక అమ్మ అన్నయ్య, వదినల దగ్గరే ఉంటోంది. వాళ్లకి ఒక బాబు, ఒక పాప. ఇద్దరూ దగ్గర్లోని కాన్వెంట్‌ లో చదువుతుంటారు. రాహుల్‌, ప్రియాంకలు వాళ్ళిద్దరితో బాగా కలిసిపోయారు. కొన్నాళ్ల వరకు రోజులు బాగానే గడిచాయి. కానీ, రాను రాను వదిన ప్రవర్తనలో వ్యత్యాసం ప్రస్ఫుటంగా కనిపించసాగింది. చీటికీ, మాటికీ రాహుల్‌, ప్రియంకల మీద అకారణంగా విరుచుకు పడటం, అప్పుడప్పుడు నాలుగు దెబ్బలు వేయడం గమనించిన కృష్ణవేణి, వదినను నిలదీయడంతో ఆమెలోని అక్కసంతా వెళ్లగక్కింది.

“ఎవరైనా పుట్టింటికి చుట్టపు చూపులా వస్తారు. కానీ, నీలా తిష్ట వేయడానికి కాదు. ఆత్మాభిమానం ఉన్న ఏ స్త్రీ అయినా భర్తతోనే స్వర్గం అనుకుంటుంది. అంతే కానీ, నీలా ఇలా తెగదెంపులు చేసుకోదు. అర్ధమైందా ?" అంటూ పరుషంగా మాట్లాడేసరికి కృష్ణవేణి మనసు చివుక్కుమంది.


“అవును... ప్రమీల చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. ఏ స్త్రీ అయినా, కొంత వయసు వచ్చే దాకానే తన గురించి ఆలోవించాలి. కానీ, పెళ్లయి పిల్లలు పుట్టాక , తన గురించి కాక భర్త, పిల్లల గురించే ఆలోచించాలి. లేనిపోని పంతాలు, పట్టింపులకు పోయి విభేదాలు సృష్టించుకుంటే, నష్టపోయేది తాను మాత్రమే కాదు, పిల్లలు కూడా. ఇప్పటికే పిల్లలిద్దరూ ' నాన్న కావాలి ' అంటూ పలవరిస్తున్నారు. వారికి తండ్రి ప్రేమను దూరం చేసే హక్కు తనకి ఎంతమాత్రం లేదు. ఇప్పటికైనా మించి పోయింది లేదు. చక్తవర్తి కూడా రెండు, మూడు సార్లు ఫోన్‌ చేసి రమ్మని బ్రతిమాలాడు. తనే 'నో' అని ఖరాఖండిగా చెప్పేసింది . ప్రమీల అన్నట్లు నా ఇల్లు అదే కానీ, పుట్టినిల్లు కాదు. భర్త, భార్య, పిల్లలు అంతా కలిసి ఉంటేనే అది కుటుంబం అవుతుంది. ఆయనలో ఏవైనా లోపాలుంటే తను భార్యగా వాటిని సహనంతో సరిదిద్దాలి. అంతే గానీ, ఇలా లేనిపోని పంతాలతో వేరుగా వచ్చేయడం తనకు ఎంతమాత్రం తగని పని. అయన మనసు

పూర్తిగా విరిగిపోక ముందే తను కళ్ళు తెరవాలి. తన తక్షణ కర్తవ్యం గుర్తెరిగి భర్త దగ్గరికి పిల్లలతో సహా బయలు దేరింది కృష్ణవేణి.

విషయం తెలుసుకున్న చక్తవర్తి చాలా సంతోషించాడు. నిజానికి, భార్య వెళ్ళిపోయాక ఇల్లంతా

బోసిపోయినట్లుగా తయారయింది. వేళ కి నిద్రాహారాలు కరువయ్యాయి. ఒంటరితనంతో పిల్లలు పదే పదే గుర్తుకు వస్తున్నారు. ఎంత డబ్బులిచ్చినా ఇంకా తెమ్మంటూ వేధిస్తున్న మేరీ వైఖరి ఒక వైపు అతన్ని ఆందోళనకు గురి చేస్తూంది. బస్‌ స్టాండ్‌ కి వెళ్లి భార్యా, పిల్లలను రిసీవ్‌ చేసుకున్నాడు. ఆ రోజు అందరూ చాలా సంతోషంగా గడిపారు.


కృష్ణవేణి, సుజాత సహకారంతో భర్తని సన్మార్గంలో పెట్టడానికి ఓ వ్యూహాత్మకమైన పధకం రచించింది. మేరీ, తన బాయ్‌ ఫ్రెండ్‌ జేమ్స్ ని ప్రతి ఆదివారం బీచ్‌ లో ఓ రహస్య ప్రదేశం లో కలుసుకుంటూ ఉంటుందని, ఆ సీన్‌ చక్తవర్తికి చూపించి, అతనిలో పరివర్తన తేవాలని నిర్ణయించుకున్నారు. తదుపరి ఆదివారం సరదాగా బీచ్‌ కి పోదామని కృష్ణవేణి చక్రవర్తిని ఒప్పిస్తుంది. అనుకున్న పథకం ప్రకారం, బయలు దేరే సమయానికి సుజాత ఇంటికి రావడంతో, అంతా కలిసి బీచ్‌ కి బయలు దేరారు.


ఆర్కే బీచ్‌లో కూర్చున్నాక సుజాత చక్తవర్తితో "బావా, ఇవ్వాళ నీకో సర్ప్రైజ్ చూపిస్తాను. సిద్దంగా

ఉండు !” అంది సరదాగా. అదేదో నేనూ చూడచ్చా” అడిగింది కృష్ణవేణి. “సారీ అక్కా... అది 'కేవలం బావగారికి మాత్రమే. నువ్వు పిల్లల్ని చూసుకో.. మేమిద్దరం కాసేపట్లో ఒచ్చేస్తాం .. సరేనా?” అంటూ బావ చెయ్యి పట్టుకుని ముందుకు సాగింది. ఇద్దరూ రహస్య ప్రదేశానికి పక్కన పొదల్లో దాక్కున్న తరువాత దగ్గరలో వాటేసుకుని వున్న ఉన్న మేరీ, జేమ్స్‌ లను బావకిచూపించింది. అతని కనులు ఎర్రబడ్డాయి.


మేరీ ఇలాంటిదని చక్రి ఊహించనే లేదు. నిన్న కాక మొన్న తన తల్లి కిడ్నీట్రీట్‌ మెంట్‌ కోసమని రెండు లక్షల సహాయాన్ని అర్ధించింది. మిమ్మల్నే ఓ దైవంలా ఆరాధిస్తున్నాను ... ఎలా అయినా మీరే ఈ ఆపద నుంచి గట్టెక్కించాలి ... ప్లీజ్! అంటూ వాపోయింది. వెంటనే పీఎఫ్‌. లోన్‌ కోసం అర్జీ ఇచ్చాడు. అతని గుండెల్లో బాధ సుడులు తిరిగింది. అక్కణ్ణుంచి తటాలున లేవబోయాడు.


ఇంతలో మేరీ మాటలు వినిపించ సాగాయి . "జేమ్స్‌... మై డార్లింగ్‌... ముందుగా నీకొచ్చిన జాబ్‌

ఆఫర్‌కి కంగ్రాట్యులేషన్స్‌ ... అన్నట్టు పోస్టింగ్‌ ముంబైలో అన్నావ్‌ కదూ ... దట్స్‌ వండర్‌ ఫుల్‌... ఓ వారం రోజుల్లో ఆ బకరాగాడి లోన్‌ కూడా వచ్చేస్తుంది ... ఇద్దరం హాయిగా పక్షుల్లా ఎగిరి పోదాం ... అక్కడ సెటిల్‌ అయ్యాక నా రాజీనామా పంపిస్తా... పాపం ఆ చక్రవర్తి ... అయ్‌ రియల్లీ పీటీ హిమ్‌! హహహ..." అంటూ జేమ్స్‌ ని వాటేసుకుని ముద్దు పెట్టుకుంది . చక్రవర్తి బుర్ర తిరిగిపోయింది. దిగాలుగా ఇసుకలో చతికిలబడి పోయాడు. బావని మెల్లగా కృషవేణి దగ్గరికి తీసుకొచ్చింది.

ఆ సంఘటన చక్తవర్తిలో అనూహ్యమైన మార్చు తెచ్చింది. ఈ ప్రపంచంలో నిజమైన మమతానురాగాలను కురిపించేది కేవలం భార్య, పిల్లలేనని గ్రహించి తన వాళ్ళని మరింతగా ప్రేమించడం మొదలుపెట్టాడు. నాన్న ఇదివరకులా కాకుండా తమతో ఎక్కువ సమయం గడపడంతో పిల్లలిద్దరిలో సంతోషం వెల్లివిరిసింది.

భానుప్రియ బాబుని తీసుకొని తన పుట్టినిల్లు చేరుకుంది . అయితే, రామకృష్ణ రెండో భార్య అయిన సుమలతకి భాను రాక అంతగా రుచించలేదు. ఓ రాత్రి ఆమె తన భర్తతో.. ఇదిగో... చూడండి... అమ్మాయిలా భర్తను వదిలేసి రావడం ఎంత వరకు సమంజసమో మీరే కాస్త ఆలోచించండి. ఆడది ఎప్పటికైనా చేరాల్సింది భర్త దగ్గరికే కదా... అమ్మాయికి మీరైనా కాస్త నచ్చ జెప్పండి ... ప్లీజ్! అంటూ ఒగలు పోయింది.

మరునాడు తండ్రి ఈ సంగతి ప్రస్తావించగనే తన తక్షణ కర్తవ్యం బోధపడింది.

“ ఓకే డాడీ ... నేను ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటాను. అంది క్లుప్తంగా. సాయంత్రానికల్లా బాబుని తీసుకొని, తన ఫ్రెండ్ విజయ ఇంటికి పేయింగ్‌ గెస్ట్‌ గా వెళ్ళిపోయింది. విజయవాడలోని ' సిగ్మండ్‌ ఫ్యాషన్స్‌ 'లో జాబ్‌ సంపాదించింది. ఒకట్రెండు సార్లు అభినయ్‌ ఇంటికి తిరిగి రమ్మని ఫోన్‌ చేసాడు. కానీ, ఆ పిలుపులో పశ్చాత్తాపం కానీ, 'ఇక ముందు అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది !' అన్న హామీ కానీ కనిపించ లేదు.


ఎంతైనా చివరికి తన మిడిల్‌ క్లాస్‌ మెంటాలిటీ చూపించు కున్నాడు. ఆధునిక మహిళ అభిరుచులను గౌరవించలేని భర్త దగ్గర పాత తరం గృహిణిలా, ఓ దాసీలా పడుండడం తన వల్ల కాదు. అయినా, తన కెరీర్‌ తనకి అన్నింటికన్నా ముఖ్యం. బాబుని మంచి కాన్వెంట్‌ లో జాయిన్‌ చేసి ఓ ప్రయోజకునిగా తీర్చి దిద్దుతా స్థిరమైన ఓ నిర్ణయం తీసుకుంది.


ఆ మర్నాడే లాయర్‌ ని సంప్రదించి అభినయ్‌ కి డైవర్స్ నోటీసు పంపించింది. అభికి ఫోన్‌ చేసి ... చూడు అభీ... మనిద్దరి అభిరుచులు, అభిప్రాయాలూ పూర్తిగా భిన్నం. ఏదో తొందర పడి పెళ్లి చేసుకున్నాం. అంత మాత్రాన బలవంతంగా కడ దాకా కలిసుండాల్సిన అవసరం లేదు. అర్ధం చేసుకో. ఉమ్మడి అంగీకారంతో విడిపోదాం ... విడాకుల పేపర్స్‌ పంపాను. నీ కన్‌సెంట్‌ త్వరగా ఇస్తే సంతోషిస్తాను. బాబు బాధ్యత నాదే... కంగారు పడకు ! ” అంది.

"సరే... అలాగే కానీ... నీ ఇష్టం" అన్నాడు అభినయ్‌ ముక్తసరిగా.కృష్ణవేణి భర్త, పర స్తీ వ్యామోహంలో పడి ,తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే, మొదట అభిమానం అడ్డురాగా, అతనితో వాదులాడి పుట్టినింటికి వెళ్లిన మాట వాస్తవమే. కానీ, భర్తను సన్మార్గంలో పెట్టాల్సిన తన బాధ్యతను, పరిస్థితి చెయ్యి దాటక ముందే గుర్తించి, తన పిల్లలకు ఓ మంచి కుటుంబాన్ని ఇచ్చి, ఒక ఆదర్శ గృహిణిగా నిలిచింది.


అక్కడ స్వతంత్ర భావాలు గల ఒక ఆధునిక మహిళగా భానుప్రియ ఆలోచనా విధానం

ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఆమెలోని స్త్రీ తన ఇల్లాలి స్థానం కన్నా, ఆర్ధిక స్వతంత్రతో కూడిన తన కెరీర్‌ కే ప్రాధాన్యతను ఇవ్వాలని అభిలషించింది. స్వతహాగా సర్దుబాటు గుణం లేని ఆమె, అను నిత్యం భర్తతో గడవలు పడుతూ జీవించడం ఓ ప్రత్యక్ష నరకంగా భావించింది. అందుకే భిన్న ధృవాల్లాంటి తను, అభి కలిసి ఉండడం కన్నా, విడిపోయి హాయిగా బ్రతకడమే మంచిదని అభిప్రాయపడింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం తప్పా, ఒప్పా అని తర్కించేకన్నా ఇది ఆమె తీసుకున్న వ్యక్తిగతమైన ఛాయిస్ గా మనంపరిగణించడమే మంచిదేమో ?!.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.రచయిత పరిచయం :

1. పేరు: కోరుకొండ వెంకటేశ్వర రావు

2. విద్యార్హతలు : B.Com , LL.B ( Academic ), M.B.A., CAIIB

3. వయసు : 64

4. పదవీ విరమణ :31 మార్చి 2016 బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి చీఫ్ మేనేజర్ గా .

5. నివాసం : విశాఖపట్నం

6. సాహితీ ప్రస్థానం :

సుమారు 40 పై చిలుకు కధలు పల్లకి, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ , ఆంధ్ర భూమి ఆదివారం , మయూరి, నవ్య వంటి ప్రింటెడ్ పత్రికలలోనూ, ప్రతిలిపి వంటి ఆన్ లైన్ పత్రికలలోనూ వచ్చాయి. కవితలు సుమారు 35 వరకు ప్రతిలిపిలో వచ్చాయి.


164 views5 comments
bottom of page