top of page

గీతా సుబ్రహ్మణ్యం


'Geetha Subrahmanyam' written by N. Dhanalakshmi

రచన : N. ధనలక్ష్మి

“సంజనా! అంతా రెడీ కదా.. ఈ రోజు నువ్వు చేసే ఇంటర్వ్యూ మన ఛానల్ కి పేరు తేవడమే కాదు, మన ఛానల్ గౌరవం పెంచేది! కాబట్టి కొంచెం జాగ్రత్తగా అన్నీ చూస్కో”

“సర్! మీరు ఏమీ కంగారు పడకండి.. నేను అన్నీ చెక్ చేశాను” అంది సంజన.

పోలీస్ హారన్ వినపడగానే అందరూ అలెర్ట్ అయ్యారు.

"వెల్కమ్ మామ్! మీరు మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు చాలా థాంక్స్ మామ్”

యూ ఆర్ మోస్ట్ వెల్కమ్. సర్.. జస్ట్ వన్ అవర్ మాత్రమే నేను ఇంటర్వ్యూ ఇవ్వగలను”

“ఓకే మామ్.. సంజనా! లెట్స్ స్టార్ట్ ఇంటర్వ్యూ”

సంజన : మనం ఎంతగానో ఎదురుచూస్తున్న IPS ఆఫీసర్ గీతా సుబ్రహ్మణ్యం ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు.. “మామ్! ఫస్ట్ మన రాష్ట్ర ప్రజల తరఫున మీకు పెద్ద థాంక్స్ మామ్! ఎంతో మంది ఆడపిల్లల్ని కాపాడటమే కాకుండా వాళ్ళ అమ్మ నాన్నలకు కడుపుకోత లేకుండా చేశారు. హాట్స్ ఆఫ్ మామ్ ..

గీతా సుబ్రహ్మణ్యం : చాలా ఎక్కువగా పొగుడుతున్నారు. నా డ్యూటీ నేను చేశాను. ఆ ప్లేస్ లో మీరు ఉన్నా అలాగే చేస్తారు.

సంజన : అది మీ గొప్పతనం మామ్. ప్రాణాలు అడ్డుపెట్టి ఎందరో ఆడపిల్లల మాన ప్రాణాలను కాపాడుతూ మీరు చచ్చిబతికారు. ఇపుడు మీ చేయి ఎలా ఉంది మామ్?

గీతా సుబ్రహ్మణ్యం : పర్లేదు సంజన! ఇపుడు బాగానే ఉంది. మీ లాంటి శ్రేయాభిలాషులు ఉన్నంతకాలం నాకు ఏమీ కాదు

సంజన : మామ్ ! మీ హస్బెండ్ పేరు అరవింద్ గారు. కానీ మీ పేరు పక్కన సుబ్రమణ్యం అని మీ నాన్న గారి పేరు ఉంటుంది. సాధారణంగా అమ్మాయి పెళ్లి అయిన తరువాత తన ఇంటి పేరు మారుతుంది కదా! అందుకే అడిగాను ..

గీతా సుబ్రహ్మణ్యం : అందరికీ నాన్న అంటే ఇష్టం ఉంటుంది కానీ నాకు ప్రాణం. అయినా నాన్నఅనే వారు లేక పోతే నేను అనే దాన్ని ఈ లోకంలో ఉండేదాన్ని కాదు. నేను పుట్టడమే చనిపోయి పుట్టాను. కానీ మా నాన్న అపుడు నన్ను గుండెలకి హత్తుకొని, ‘నా బిడ్డకు ఏమీ కాదు. నా కోసం తాను ఉండాలి’ అని అనడంతో నేను ఏడ్చానట! మా అమ్మ చెప్పేవారు, మా నాన్న ప్రేమవల్లే నేను బ్రతికాను అని. నేను ఈ రోజు ఇలా IPS ఆఫీసర్ అవడానికి కారణం కూడా మా నాన్న గారే..

ఒక అమ్మాయి తన ప్రేమను అంగీకరించలేదని ఒక ఉన్మాది ఆమెపై యాసిడ్ పోశాడు. ఈ విషయం న్యూస్ ఛానల్ లో ప్రసారం అవుతోంది. నేను అది చూసి “వాడిని చంపాలి నాన్నా!” అంటే మా నాన్న గారు "చూడు గీతా! ఇలాంటి న్యూస్ చూసిన ప్రతివారూ వాడికి ఆ శిక్ష వేస్తే బాగుంటుంది అనుకున్నారు కానీ ఆ తప్పు ఎందుకు జరిగింది? అలా జరగకుండా ఏమి చేయాలి? అని ఎవరూ అనుకోరు తల్లీ! నువ్వు శిక్ష వేయాలనుకుంటే వేసే పొజిషన్ లో ఉండాలి కానీ ఇలా టీవీ చూస్తూ నోటికి వచ్చింది అలా వాగకూడదు” అన్నారు.

ఆ తరువాత నన్ను కరాటే సెంటర్ లో జాయిన్ చేశారు. నేను IPS ఆఫీసర్ కావాలనే లక్ష్యం రావడానికి మెయిన్ కారణం మా నాన్న గారే ..

సంజన : అయితే మీరు ఫస్ట్ అట్టెంప్ట్ లో ర్యాంక్ కొట్టారేమో కదా మామ్ ??

గీతా సుబ్రహ్మణ్యం : హ హ.. అసలు కాదు సంజన! ఒక సారి కాదు, రెండు సార్లు ఫెయిల్ అయ్యాను. నేను ఇక సాధించలేనేమోనని అనుకొని ఆశ వదిలివేసి, ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళాను.

సంజన : మరి మామ్ .. ఎలా ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చారు?.

గీతా సుబ్రహ్మణ్యం : ఇంకా ఎవరి వల్ల..? మా నాన్న వల్ల!

సంజన : నాన్నగారు ఏం చెప్పారు మామ్?

గీతా సుబ్రహ్మణ్యం : చెప్పలేదు. చూపించారు. అది నా జీవితాన్ని మలుపు తిప్పబోతోంది అని నాకు తెలియదు ఆ క్షణంలో..

నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక సారి మా నాన్న నా దగ్గరికి వచ్చి

నాన్న: గీతా! నాతో పాటు కిచెన్ లోకి రామ్మా..

నేను: నాన్నా! ప్లీజ్ నేను రాలేను.

నాన్న: కన్నా! నువ్వు నాతో రా..

నాన్న లోపలకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో ఒక బౌల్ లో ఎగ్స్, మరో బౌల్ లో పొటాటో, ఇంకో బౌల్లో కాఫీ గింజలు పెట్టారు.10 నిముషాలు అయింది. 15 నిమిషాలు అయింది. అవి కుక్ అవుతూనే ఉన్నాయి. నాకు ఫుల్ కోపం వచ్చింది. "ఏంటి నాన్నా? నన్ను పిలుచుకు వచ్చి మరీ ఇలా వెయిట్ చేయిస్తునారు?" అన్నాను.


“తల్లీ గీతా! నువ్వు చూసావుగా.. నీకు ఏమి అర్థం అయింది?”

“ఏమీ అర్థం కాలేదు నాన్నా!”

“గీతా! కుక్ కాక ముందు మూడూ ఒక సిట్యుయేషన్ లో ఒకే లాగా ఉన్నాయి. వాటిని ఒకేలాగా కుక్ చేసాము. కుక్ అయిన తరువాత వాటి సిట్యుయేషన్ లు మారాయి ..

ఫస్ట్ : ఆలూ కుక్ కాకుండా ముందు గట్టిగా ఉంది. కానీ వేడి నీళ్లలోకి వెళ్ళగానే మెత్తపడింది..

సెకండ్ : ఎగ్స్ ఫస్ట్ మెత్తగా ఉన్నాయి. కుక్ అయిన తరువాత లోపల నుంచి గట్టి పడ్డాయి ..

థర్డ్: కాఫీ గింజలు .. ఇవి మిగతా రెండిటికన్నా డిఫరెంట్.. కుక్ అయిన తరువాత తాను మారడమే కాకుండా మొత్తం నీటిని మార్చింది .. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో ఎలా ఉండాలో ..

ఫస్ట్ ఆలూ లాగా స్ట్రాంగ్ గా ఉండి ప్రాబ్లమ్స్ రాగానే మెత్తపడిపోతావా ..

లేదా ఎగ్ లాగా ఫస్ట్ మెత్తగా ఉండి .. ప్రాబ్లెమ్ రాగానే లోపలనుంచి నిన్ను నువ్వు మార్చుకొని ఎదురుకోవడానికి సిద్ధం అవుతావో ..

కాఫీ గింజలు ఏమి చేసాయి? వాటి రూపంతో పాటు చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా తనకు నచ్చినట్టు మార్చుకొని .. దేనికైనా సిద్ధం అయ్యాయి. మరి నువ్వు ఈ మూడిట్లో ఎలా ఉంటావో ఛాయిస్ ఈజ్ యువర్స్” అని అక్కడి నుంచి వెళ్లారు. నేను ఆ మూడింటిని చూసి కాఫీని తీసుకుని తాగాను. దాని అర్థం దేనికైనా నేను సిద్ధం

అని ..

తరువాత నేను అనుకున్నట్టు ఎగ్జామ్స్ ని క్రాక్ చేయడమే కాదు.. నా లైఫ్ లో ఎదురైన ప్రతి పనిని సాధించాను ..

తరువాత ట్రైనింగ్ లో నాకు పరిచయమైన అరవింద్ ని ఇష్టపడ్డాను. అరవింద్ ఫస్ట్ నాకు ప్రపోజ్ చేశారు. కానీ ఏమీ చెప్పకుండా తాను నచ్చిన విషయం అరవింద్ కన్నా ముందు నాన్న కు చెప్పాను. నాన్న నా నిర్ణయం మీద నమ్మకంతో ఒప్పుకున్నారు. అరవింద్ కి చెప్పాను ‘నీతో నాకు పెళ్లి అయిన తరువాత నీ పేరును నా పేరు వెనుకాల ఉంచుకొను. నేను ఎప్పుడూ గీత సుబ్రహ్మణ్యం లాగే ఉంటాను. ఇప్పుడు చెప్పు.. నాతో నీకు పెళ్లి ఓకే నా?’ అని. అరవింద్ ఒప్పుకున్నాడు. తరువాత మా బాబుకి కూడా మా నాన్న పేరు పెట్టుకున్నాం. తనని ఎప్పుడూ నాన్నా! అనే పిలుస్తాను.

ఆఖరికి మా నాన్న చనిపోయే ముందు రోజు కూడా నాకు దైర్యం చెప్పారు. “నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ను నువ్వు కోల్పోకు . నన్ను తలుచుకున్న ప్రతి సారి, నీ పెదాలపై చిరునవ్వు రావాలి. నువ్వు కాపాడే ప్రతి ఒక్కరిలో నేను నీకు కనపడతాను” అన్నారు.

నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే కారణం మా నాన్న. మీరు అందించే ప్రశంస ప్రతి ఒకటి, ఆయనకు చెందుతుంది. ఐ ఆమ్ ప్రౌడ్ టూ బి డాటర్ అఫ్ సుబ్రహ్మణ్యం!” అని చెప్పడం ఆ టీవీ చానెల్ వాళ్ళు, ఆ షో మొత్తం చూస్తున్న ఆడియన్స్, ఆ టీవీ లో ఇంటర్వ్యూ చూస్తున్న బుల్లి సుబ్రమణ్యం కూడా కరతాళ ధ్వనులు చేశారు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.
100 views0 comments

コメント


bottom of page