top of page

నీవే బ్రహ్మవి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Video link

'Nive Brahmavi' Written By Siriprasad

రచన : శిరిప్రసాద్

భయపెట్టే పీడకలలు...

ఆ కలల్లో వెంటాడే స్త్రీ...

అతనికి పరిష్కారం దొరికిందా..

లేక బలయ్యాడా?

ఆద్యంతం ఉత్కంఠతో సాగే సిరిప్రసాద్ గారి కథలో తెలుసుకోండి.

ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

ఇక కథ ప్రారంభిద్దాం


ఉలిక్కి పడి నిద్ర లేచాడు దాస్. కొంచం సేపు మంచం అంచున కూర్చుని, కళ్ళు నులుపుకుని లేచి బాత్రూమ్ లోకి వెళ్ళాడు. కాళ్ళు కడుక్కుని, వంటగది లోకి వెళ్ళి రెండు గ్లాసుల మంచినీళ్ళు తాగాడు.


పీడ కల ! … యెందుకొచ్చిందో? దాని అర్ధం యేమిటో ? చెడు జరగబోతున్నదని సంకేతమా? … యేమో !


ఒక అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ దగ్గిరకొచ్చింది. 'నన్నెందుకు చంపావు?... నా జీవితంలో యింకా యెంతో సంతోషం మిగిలివుందనుకున్నాను. అర్ధాంతరంగా ఎందుకు చంపావ్ ? నీకు నేను ఏం ద్రోహం చేసాను?... అసలు అంత నిర్దాక్షిణ్యంగా నన్ను యెలా చంపగలిగావ్? నేను నిన్ను చంపేస్తాను... '


అదీ ఆ కల సారాంశం. 'తను యెవర్నీయెప్పుడూ చంపలేదు. అందులో అందంగా కనిపిస్తున్న ఆ అమ్మాయిని?... నో... నో... కలలో కూడా యెవర్నీ చంపలేదు. చాలామంది మీద చంపేయాలన్నంత కోపం వచ్చినా, వూహల్లో కూడా వాళ్ళని చంపలేదు. ఆ కోపం యెలా వస్తూండేదో, అలాగే పోయేది!... మరి యీ కల అర్ధం యేమిటి ?'


మళ్ళీ టాయిలెట్ కి వెళ్ళి , మరో గ్లాసుడు మంచినీళ్ళు తాగి, భయం భయంగా మళ్ళీ నిద్రకుపక్రమించాడు.


ఒక 16 x 12 గది , ఎటాచ్డ్ టాయిలెట్, చిన్న కిచెన్ - అదే దాసు వుండే యిల్లు; గది నిండా పుస్తకాలు, వొక టేబుల్, మూడు కుర్చీలు, వొక బీరువా గోద్రెజ్ మేక్ అనిపించే డూప్లికేట్ ‘గోర్డెజ్’ బీరువా, గ్యాస్ స్టౌ, కొన్ని గిన్నెలు, వొక ప్రెషర్ కుక్కర్ , చిన్న వాటర్ ఫిల్టర్ అవి అతని నివాసాన్ని అలంకరించిన సామాను. వయసు యాభై దాటి వుంటుంది. పెళ్ళి చేసుకోలేదు. పెళ్ళి అంటే సంకెళ్ళు అనే తాత్పర్యం చెప్తుంటాడు దాసు అందరికీ. తను చెప్పింది పాటించాలి కాబట్టి పెళ్ళి చేసుకోలేదు. కానీ, యిప్పుడిప్పుడే తోడుంటే బాగుండు ననుకుంటున్నాడు. ఈ కల వచ్చిన రాత్రి మాత్రం ఖచ్చితంగా అనుకున్నాడు.


ఆలస్యంగా నిద్రపట్టడంతో ఆలస్యంగా లేచాడు దాస్. రాత్రి వచ్చిన కల లీలగా గుర్తుంది. తీవ్రత తగ్గిపోయింది. కాఫీ పెట్టుకుని తాగాడు. తల కొంచం భారంగా వుండడంతో యింకో కప్పు కలుపుకున్నాడు.


'ఇంతకీ ఆ అమ్మాయి యెవరు?... తననే యెందుకు టార్గెట్ చేసుకుంది? అసలు కలలకి అర్ధం వుంటుందా ?... తన మనస్సులో అలాంటి ఆలోచనలు, అసలు హత్య అనే ఆలోచనే, యెప్పుడూ రాలేదు. మనసులో యెప్పుడూ కలగని ఆలోచనలు కలల రూపం యెలా తీసుకుంటాయి? సైకాలజీ పుస్తకాలు తిరగేయాలి' అనుకున్నాడు దాస్. తన లైబ్రరీ లో సైకాలజీ పుస్తకాలు యేమున్నాయా , అని యిండెక్స్ తిరగేసాడు. కలల మీద వొక పుస్తకం వుందికానీ దాని పక్కన వొక రిమార్క్ రాసివుంది, 'సుధామ తీసుకున్నాడు' అని. సుధామ యిప్పుడు లేడు ; పోయి యేడాదైంది. ఇప్పుడు వాళ్ళింటికి పోయి పుస్తకం యేమడుగుతాంలే, అని వూరుకున్నాడు .


ఆ రాత్రి చాలాసేపు నిద్ర పోలేదు దాస్. ఏ రెండు గంటలకో నిద్ర ముంచుకొచ్చింది. మూడున్నర టైం లో కాబోలు దాస్ వులిక్కి పడి లేచాడు. మళ్ళీ అదే కల. అదే అందగత్తె. అదే అరుపు, 'నన్నెందుకు చంపావ్ ?' అక్కడితో ఆగకుండా, 'నిన్ను చంపేస్తాను,' అని మళ్ళీ హెచ్చరించింది.


ఇది యిలాగే యింకో రెండురోజులు కొనసాగితే తనకి పిచ్చెక్కుతుంది. వెంటనే యేదైనా చర్యలు తీసుకోవాలి, అనుకున్నాడు. ఉదయం పదింటికి తన స్నేహితుడు రాజుకి కి ఫోన్ చేసాడు. ఒకసారి కలుద్దామన్నాడు. అతను బిజీ గా వున్నట్టు చెప్పాడు. సాయంత్రం అయితే బీరూ, బిర్యానీ తీసుకుని వస్తానన్నాడు. ఓకే చెప్పాడు దాస్.


ఆ సాయంత్రం రాజు ఆరున్నరకి వచ్చాడు. రెండు బీరు బాటిళ్ళు , హాఫ్ బాటిల్ విస్కీ , చిరుతిండి, బిర్యానీ పార్సెల్ తీసుకొచ్చాడు.


దాసు తనకొస్తున్న కల గురించి రాజు కి వివరించాడు. రాజు హేళనగా నవ్వాడు. దాస్ కి కోపం వచ్చింది. నియంత్రించుకున్నాడు. నిజానికి అలాంటి కల వస్తోందని యెవరికి చెప్పినా వాళ్ళు ముందు హేళన చేస్తారు. ఆ కల అలాంటిది మరి! దాసు కోపాన్ని అర్ధం చేసుకున్న రాజు, 'దాసూ! కలలకి అర్ధం పర్ధం వుండదు . నాక్కూడా అప్పుడప్పుడు అలాంటి కలలు వస్తుంటాయి. ఆ మధ్య నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్నట్టు కలొచ్చింది. నిజానికి నేనెప్పుడూ గుడికి వెళ్ళలేదు. నిజానికి యే గుడికీ వెళ్ళలేదు యిప్పటిదాకా... మరి ఆ కలనేమంటావ్ ?' అన్నాడు.


'తనని దర్శించుకోమని వెంకన్న వుత్తర్వులేమో?' అన్నాడు దాస్.

పెద్దగా నవ్వాడు రాజు, 'కోట్లమంది భక్తులున్న ఆయనకి వొక నాస్తికుడు వొక లెక్కా?'

మందు కొడుతూ, కొడుతూ జోక్స్ వేసుకుంటూ సరదాగా టైం పాస్ చేస్తున్నారు యిద్దరూ.

'దాసూ, నీకు రాత్రిపూట వొక్కడివే వుండడానికి భయమైతే చెప్పు, నేను వచ్చి వుంటా!... ఆ మంచం మీదే అడ్జస్ట్ అవ్వుదాం...' అన్న రాజు మాటకి దాసు నవ్వి, 'భయం కాదు కానీ యెందుకలా అవుతోందో తెలుసుకోవాలనే వుత్సుకత వుందిరా !... నేనేమిటి, ఆ అందమైన అమ్మాయిని చంపడమేమిటి, అది నా కల్లోకొచ్చి నన్ను సతాయించడమేమిటి?... ఒక సైకియాట్రిస్ట్ ని సంప్రదిస్తే యెలా వుంటుందంటావ్ ?... పదే పదే రిపీట్ అవుతోంది కదా!...' అన్నాడు.


'ఊ... నా ఫ్రెండ్ వొకడికి వొక సైకియాట్రిస్ట్ -కం -కౌన్సెలర్ బంధువున్నాడు... కొంచం ఏజ్డే. నిన్ను గైడ్ చేస్తాడు... 'అన్నాడు రాజు.


'అయితే ఆయన్ని కలుస్తాను,' అన్నాడు దాస్ వుత్సాహంగా .

'ఓకే . నేను ఆయన అపాయింట్మెంట్ తీసుకుని చెప్తాను,' అన్నాడు రాజు.

అపాయింట్మెంట్ ప్రకారం మర్నాడు సాయంత్రం దాస్, డాక్టర్ గిరి, సైకియాట్రిస్ట్ ని కలిసాడు.


ఆయనకి దాస్, తనకి పదే పదే వస్తున్న కల గురించి, వొక కథ చెప్పినట్టు చెప్పాడు.

డాక్టర్ గిరి నవ్వాడు, 'మీరు నా దగ్గిరకి రావడం మంచిదైంది. అదే యే భూతవైద్యుడు దగ్గిరకో వెళ్ళుంటే, వాడు ఖర్చు పెట్టించి, భయపెట్టి, మీ మెదడు మీద పూర్తి ఆదిపత్యం తీసుకుని మిమ్మల్ని చంపేసేవాడు. జ్యోతిష్కుడి దగ్గిరకి వెళ్ళుంటే, జపాలూ, తపాలూ, వుంగరాలూ అంటూ మీ జేబు కి చిల్లు పెట్టేవాడు...' అన్నాడు, కొంచం హేళన డోస్ కలిపి.

'నేను వాళ్ల దగ్గిరకి వెళ్ళేవాడ్ని కాదులెండి. మంచి నిద్రకోసం విస్కీ నో, నిద్ర మాత్రల్నో ఆశ్రయించేవాడ్ని!...' అన్నాడు దాస్ నవ్వుతూ.


'మీరు చెప్పిన వాటికీ, నేను చెప్పిన వాటికీ పెద్ద తేడా లేదు, దాస్ గారూ!... నేను చెప్పింది తక్షణం జరిగే నష్టం, మీరు చెప్పింది దీర్ఘకాలిక నష్టం ' అన్నాడు.

'అంతేనంటారా?' అడిగాడు దాస్.


‘అంతే !... కలలు రావడానికి కారణం మంచి నిద్రలో మీ కనుపాపల్లో జరిగే చలనానికి మీ మైండ్ వుత్తేజితమై మీ మనసు మూలల్లో వున్న భావాల్నీ, జ్ఞాపకాల్నీ, ఎప్పటివో వూహల్ని కలల రూపంలో మీకు ప్రదర్శిస్తాయి. శాస్త్రజ్ఞులు కలల్ని అర్ధం లేనివని చెప్పినా, ఫాదర్ అఫ్ సైకాలజీ సిగ్మన్డ్ ఫ్రాయిడ్, కలలు మీరు అణగతొక్కిన కోరికలు, అన్నాడు,' కొంచం గాప్ యిచ్చాడు డాక్టర్. కొంచంసేపు అయ్యాక,


'ఎవరినైనా చంపేయాలని పించేదా, యెప్పుడైనా ?' అడిగాడు డాక్టర్.

'ఛీ... ఛీ ... ' అని ముఖంలో కొంచం చిరాకు చూపించాడు దాస్.

' యవ్వనంలో వున్నప్పుడు యెపుడైనా ప్రేమలో పడ్డారా?...'అడిగాడు డాక్టర్ మళ్ళీ.

'ఎ బిగ్ నో...' అంటూ తల అడ్డంగా వూపాడు దాస్.

' మరి పెళ్ళెందుకు చేసుకోలేదు?' డాక్టర్ ప్రశ్న.

'ఆ సంసారమనే బాదర బందీ యిష్టం లేక... నా స్వేచ్చని నేనే వదులుకోలేక ' దాస్ జవాబు. .


'దట్స్ గుడ్!... మిమ్మల్ని యిష్టపడ్డ అమ్మాయిలే వుండేవారు కాదా?' డాక్టర్ ప్రశ్న.

'తెలియదు...' దాస్ కొంచం సాలోచనగా కనిపించాడు.

'మీరు గుర్తు తెచ్చుకోండి ... మీ చిన్నతనం నించి జరిగిన నంఘటనలు .... తర్వాత సిట్టింగ్ లో మాట్లాడుకుందాం,' అన్న డాక్టర్ తో దాస్, ' మళ్ళీనా ?' అని ఆశ్చర్యంగా అడిగాడు.

'ఏ సైకాలజిస్టు వొక్క సిట్టింగ్ లో సమస్యని పరిష్కరించడు,' అంటూ నవ్వాడు డాక్టర్. 'మీ దిన చర్య చెప్పండి దాస్ గారూ!'


'నేను లెక్చరర్ ని కాబట్టి వుదయం చెప్పాల్సిన లెసన్స్ కొంచం ప్రిపేర్ అవుతాను. కాలేజ్ నించి వచ్చాక, రచయితగా వో రెండు గంటలు రాసుకుంటాను. ఈవెనింగ్ వాక్. తర్వాత ఫ్రెండ్స్ తో లేదా వొంటరిగా రెండు పెగ్గులు తాగుతాను. రొట్టెలు చేసుకుని తింటాను. తర్వాత మళ్ళీ రాసుకోడమో, టీవీ చూడడమో . ..' చెప్పాడు దాస్.


'నిద్ర ఎన్నింటికి?' డాక్టర్ ప్రశ్నకి జవాబుగా పన్నెండవుతుంది, అన్నాడు దాస్.

'ఓకే దాస్ గారు. రోజూ పదింటికి పొడుకునే ప్రయత్నం చేయండి. ఉదయం తొందరగా లేవండి. మిగిలిన విషయాలు యెల్లుండి మాట్లాడుదాం ... ఇంతకీ మీరు రచయిత అన్నారు కదా, యేమి రాస్తుంటారు? ... రొమాంటిక్, నేర పరిశోధన, చారిత్రకం?...' కుర్చీ లోంచి లేచి దాస్ ని అడిగాడు.


' సోషల్ , రొమాంటిక్ ...' అన్నాడు దాస్, డాక్టర్ వైపు ప్రస్నార్ధకంగా చూస్తూ.

'ఓకే ... సీయు, దాస్ గారు. ఎల్లుండి వచ్చేటప్పుడు మీ లేటెస్ట్ నవల యేదైనా వుంటే తీసుకొస్తారా? మా ఆవిడ వూరెళ్ళింది . టైం పాస్ కోసం,' అంటూ షేక్ హ్యాండ్ యిచ్చాడు. తల వూపాడు దాస్.

మిశ్రమ అనుభూతులతో క్లినిక్ నించి బయట పడ్డాడు దాస్.

*****


ఎల్లుండి రానే వచ్చింది. సాయంత్రం మంచి పాంట్, షర్ట్ వేసుకుని దాస్ డాక్టర్ దగ్గిరకి వెళ్ళాడు. ఒక గంట తర్వాత తన వంతు వచ్చింది. డాక్టర్ క్యాబిన్ లోకి వెళ్ళి , నమస్కారం చేసి, యెదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు.

'దాస్ గారూ, యెలా వున్నారు?' అడిగాడు డాక్టర్ గిరి.

'ఫైన్ సర్!...' దాసు కొంచం సందిగ్ధంగా అన్నాడు.

'మళ్ళీ కల వొచ్చిందా?... ఆ అందాల రాసి వార్నింగ్ యిచ్చిందా ?...'

'నిన్న చాలా సేపు వచ్చింది సార్. పూర్తిగా గుర్తు లేదు కానీ, అదే మేటర్!...నా నవల అడిగారు కదా! ... యిదిగో! ఇది మీకు యిచ్చేస్తున్నా... నెమ్మదిగా చదువుకోండి!...''అన్నాడు దాస్.


'థాంక్యూ దాస్ గారు!.... నాకొక … ఐడియా వచ్చింది..... ఎలాంటి అభ్యంతరం లేకపోతే, మీరు వొక రాత్రి డ్రీం ల్యాబ్ లో పడుకోగలరా ? ...' అడిగాడు డాక్టర్ గిరి.

'డ్రీం లాబా?... కొద్దిగా విన్నాను దాని గురించి. యూనివర్సిటీ లో సైకాలజీ డిపార్టుమెంటు లో వుండేది !...'


'అవును. మీ నిద్ర గురించి, ఆ సమయం లో మీ మెదడు, శరీరం యెలా పనిచేస్తున్నాయి అనేవి చూచాయగా తెలుస్తాయి. మీకు కల రాగానే వొక సూచన ... అంటే వొక అలెర్ట్ వస్తుంది. వెంటనే అక్కడి రిసెర్చ్ స్కాలర్ మిమ్మల్ని నిద్ర లేపి, మీకు వచ్చిన కల గురించి అడిగి, నోట్ చేసుకుంటుంది .... ఆ నోట్స్ ని స్టడీ చేసి నేనొక నిర్ణయానికి వస్తాను. మీరు యెస్ అంటేనే... ' అంటూ డాక్టర్ గిరి దాస్ కళ్ళల్లోకి సూటిగా చూసాడు.


దాస్ కొంచం సందిగ్ధం లో పడ్డాడు. ఎదో వెతకబోతే యింకేదో దొరికినట్టు, కొత్త రోగాలు బయటపడవు కదా, అని భయపడ్డాడు. అయినా వొక లబ్ధ ప్రతిష్టుడైన రచయిత అయివుండి , యిలాంటి వాటికి భయపడడమా , నో ఛాన్స్! ఇది మంచి అనుభవమే. ఈ అనుభవం వస్తువుగా వొక నవల రాయచ్ఛేమో , హూ నోస్!


'ఓకే డాక్టర్ గారూ. ఐ అయాం రెడీ !...' అన్నాడు దాస్. వెంటనే డాక్టర్ తన స్నేహితుడి తో మాట్లాడి తర్వాతి రోజు కి డ్రీం లాబ్ లో దాస్ కి ప్రవేశం కల్పించాడు. డ్రీం లాబ్ చిరునామా తీసుకుని, డాక్టర్ వద్ద సెలవు తీసుకుని బయటికి నడిచాడు దాస్.


మర్నాడు రాత్రి ఎనిమిదికి డ్రీం ల్యాబ్ చేరుకొని, వివరాలు తెలుసుకున్నాడు. దగ్గిర్లో హోటల్లో భోజనం చేసి, రాత్రి తొమ్మిదిన్నరకి డ్రీం ల్యాబ్ లో నిద్రకుపక్రమించాడు. రాత్రి యే పన్నెడుకో నిద్రలోకి జారుకున్నాడు.


నిద్ర లేపింది రీసెర్చ్ స్కాలర్. మత్తుగా వుంది. కళ్ళు నులుపుకుంటూ, లేచి కూర్చున్నాడు. 'మీ కల గురించి పూర్తి వివరాలు చెప్పండి, ' అంది ఆ అమ్మాయి. మొత్తం వివరాలు చెప్పాడు.


'నన్నెందుకు చంపించావ్? అది కూడా నా మొగుడి తోనే!... నీకేం ద్రోహం చేసాను? ... నిజమే!... నేను నా భర్తని వదిలేసి యింట్లోంచి బయటికెళ్ళాను. నా మొగుడు చెడ్డ వాడని కాదు. నాకు నచ్చలేదు. ఆ జీవితమే నచ్చలేదు. స్వేచ్ఛ కోసం వెంపర్లాడాను. అది దొరికాక ... నిజమే... నన్ను అర్ధం చేసుకున్న వాళ్ళతో పడుకున్నాను. తప్పేంటి? అది నా యిష్టం... కృష్ణ నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు... కానీ అతను వ్యక్తం చేయలేదు. అయినా నాకు అర్ధమయింది. ... అతని తండ్రితో తాత్కాలిక స్నేహం కొంతకాలం నడిచింది కాబట్టి, ఆగాను. ఆ తండ్రి పోయాడు. బతికుండివుంటే ఆయనతోనే వుండిపోయేదాన్ని . నేను యింట్లోంచి బయటికొచ్చాకే యీ లోకం యెంత దుర్మార్గ మైందో తెలిసింది. అయినా కృష్ణ లాంటి మంచోడు నన్ను యిష్టపడడం నా అదృష్టమే! కొంత కాలం తర్వాత, కృష్ణ తో వుండి పోయేదాన్ని!... ఏ అరవైకో హిమాలయాలకి వెళ్ళి పోవాలని నా ప్లాన్... యింతలోనే నా మొగుడ్ని నా దగ్గిరకి చేర్చి వాడితోనే చంపించేసావ్!... ఈ అన్యాయానికి నిన్ను వదిలే ప్రసక్తే లేదు!...'


ఆ రీసెర్చ్ స్కాలర్ నోట్ చేసుకుంది. దాస్ మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయాడు.

మరో గంట తర్వాత మరో కల వచ్చింది. మళ్ళీ అలెర్ట్. మళ్ళీ ఆ రిసెర్చ్ స్కాలర్ దాస్ ని నిద్రలేపి కల వివరాలు అడగడం జరిగింది. ఈ సారి చిన్న కలే !


'ఒక అందమైన యిల్లు. బంజారా హిల్స్ లో అనుకుంటా. ఆ యింటి ముందు పచ్చని లాన్ . దాని మీద వో అందమైన యువకుడు కూర్చుని వున్నాడు. నన్ను తీక్షణంగా, కోపంగా చూస్తున్నాడు. నాకు గాభరా అయ్యింది. వెనుక ద్వారం గుండా ఆ యింటినుండి బయటపడి పరిగెత్తు తున్నాను ... '


'అంతేనా?' ఆ అమ్మాయి అడిగింది.

'అంతే !' అన్నాడు దాస్.

'సరే... పడుకోండి!' అంటూ ఆ అమ్మాయి వెళ్ళి తన సోఫా లో కూర్చుంది.

***


మర్నాటి సాయంత్రం దాస్ డాక్టర్ గిరిని కలవడానికి వెళ్ళాడు. అతనికి కొద్ది కొద్ది గా అర్ధమౌతోంది. ఇందులో మానవాతీతమైన విషయం యేమీ లేదు. ఈ రోజు డాక్టర్ తేల్చేస్తాడనుకుంటా, అనుకున్నాడు.


ఒక గంట గడిచింది. డాక్టర్ యింకా పిలవలేదు. లోపల పేషెంట్ వున్నట్టు గా అనిపించడం లేదు. నిశ్శబ్దంగా వుంది. మరో అర గంట తర్వాత డాక్టర్ పిలిచాడు.

'గుడ్ ఈవెనింగ్ డాక్టర్!' అంటూ ఆయన యెదురుగా కూర్చున్నాడు.

'మీ నవల 'మంచుమంట ' చదివాను దాస్ గారు. ఎంత అద్భుతంగా రాశారు!... ఎన్నాళ్ళు పట్టింది యీ నవల రాయడానికి ?' డాక్టర్ అడిగాడు.


'అప్పుడే చదివేసారా?... ఆశ్చర్యం!... అది రాయడానికి పదేళ్ళు పట్టింది. అంటే కొంత భాగం రాసాక తొమ్మిదేళ్లు గాప్ వచ్చింది. కిందటి సంవత్సరం సీరియల్ గా వచ్చింది. నవలగా ప్రచురించబడి నాలుగు నెలలైంది......' అన్నాడు దాస్.

'ఈ నవల మీరు మనసు పెట్టి రాసినట్టున్నారు...?'

'ఎస్ ... ఐ ఫుట్ మై హార్ట్ అండ్ సోల్ యింటూ యిట్ !...' గర్వన్గా చెప్పాడు.

'మీకు ఆ కలలెందుకు వస్తున్నాయో యింకా అర్ధం కాలేదా దాస్ గారూ?... ‘నన్నెందుకు చంపావ్’ అని మీ కలల్లో మీ వెంట పడుతున్నది మీ నవల్లో హీరోయిన్ గీతే!... మీరు మీ నవల చివర్లో గీతని చంపేసారు కదా! ...'


'అవును ... ఆమె భర్త ఆమెని యింటికి రమ్మంటాడు.... తను రానంటుంది. అతను తన తలను, ఆమె తలకేసి కొడతాడు. ఇద్దరూ రక్తపు మడుగులో పడి చనిపోతారు...' అని కొద్దిసేపు ఆగాడు దాస్.


'మీ నవల్లో హీరో కృష్ణ కూడా మీ కలలోకి వచ్చాడు కదా!... మీ వైపు కోపంగా చూశాడని చెప్పారు కదా రిసెర్చ్ స్కాలర్ కి?...' డాక్టర్ ప్రశ్నకి నవ్వొచ్చింది దాస్ కి. అవునన్నట్టు గా తలూపాడు.

'గీతని చంపినందుకే అతనికి మీ మీద కోపం!...' డాక్టర్ గిరి ' అమెరికా ని కనిపెట్టినప్పుడు కొలంబస్ యెంత సంతోషపడ్డాడో , యీ డాక్టర్ కూడా అంత సంతోష పడుతున్నాడు!

'దాస్ గారూ, మీకు తెలియకుండా మీరు కథల్లో సృష్టించే పాత్రలు మీ మైండ్ లో తిష్ట వేసుక్కూర్చున్నాయి. మీకు బాగా నచ్చిన పాత్రలు మీ మీద ప్రభావం చూపుతున్నాయి. అయినా మీ నవలకి అలాంటి దుఖాంతం యెందుకిచ్చారు?...' డాక్టర్ చాలా వుత్సుకతతో అడిగినట్టుగా అనిపించింది దాస్ కి. తన నవల నచ్చిందన్న మాట! అయినా అది యెవరికి నచ్చదు? ... గర్వంగా ఫీలయ్యాడు దాస్.


'నవల అప్పటికే రాత ప్రతిలో యెనిమిది వందల పేజీలకొచ్చింది. ఎలా ముగించాలో తెలియక అలా ముగించాను. మన సమాజంలో జారత్వానికి అదే శిక్ష కదా!... భర్తని వదిలేసి వివాహేతర సంబంధాలు పెట్టుకునే స్త్రీ ని భర్తో, సమాజమో చంపేస్తుంది... చట్ట ప్రకారం శిక్షలు పడవు, కోర్ట్ ని ఆశ్రయించడం నామోషీ. అందుకే అలా ముగించా ...' అన్నాడు దాస్.


'అది మీ హీరోయిన్ కి నచ్చలేదు. ఇంకో రకంగా చెప్పాలంటే మీకు నచ్చలేదు. అందుకే మీ మనస్సు గీత రూపం లో ప్రొటెస్ట్ చేస్తోంది... అభ్యంతర పెడుతోంది... మీ కలలకి మీ నవల ముగింపే కారణం. ఒప్పుకుంటారా?' చిరునవ్వుతూ అడిగాడు డాక్టర్.


ఆలోచనలో పడిపోయాడు దాస్. ఎంత విచిత్రం! నా పాత్రలే నన్ను ఆక్షేపిస్తున్నాయా!... తల గట్టిగా అటూ, యిటూ వూపుతూ అన్నాడు, 'నమ్మశక్యం కావట్లేదు డాక్టర్!... మీరు ఆధారాలతో చెప్తున్నట్టున్నారు ... నమ్మి తీరాల్సిందే!'


'మీ లేటెస్ట్ నవల ని నేను అడిగింది అందుకే. నవల చదువుతుండగానే నాకు అర్ధమయింది. ఇలాంటి సంఘటనలు అరుదుగా సంభవిస్తుంటాయి. బట్ నొథింగ్ టు వర్రీ !...'


'ఈ సమస్యనించి బయట పడలేనంటారా?...' కొంచం దీనంగా అడిగాడు దాస్.

ఒక క్షణం ఆలోచించాడు డాక్టర్ గిరి. 'దాస్ గారు, యిందుకు రెండు ఆప్షన్స్ వున్నాయి...'

'ఏమిటి సార్ అవి?' వుత్కంఠ గా అడిగాడు దాస్.

'నెంబర్ వన్, యీ కలల గురించి మర్చిపోవడం, అంటే, డోంట్ కేర్. కొద్ది రోజులకో, కొన్ని నెలలకో అవి రాకుండా పోతాయి. వాటిని పట్టించు కోకూడదు. నెంబర్ టు , యిది నాకు యిష్టమైన ఆప్షన్. మంచుమంట నవల రెండో భాగం రాయడం. తలలు పగిలి చచ్చిపోయారనుకున్న భార్యా భర్తల్ని హాస్పిటల్ లో చేరిస్తే భార్య, అంటే మన అందాల రాసి హీరోయిన్ ఆ ప్రమాదం నించి బయటపడుతుంది. అంటే బతుకుతుంది. తర్వాత హీరో కృష్ణ పట్ల ప్రేమ మొలకెత్తుతుంది. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటారు. తర్వాత కొనసాగింపు మీ యిష్టం ... యేమంటారు ?'


డాక్టర్ సమాదానం దాస్ కి నచ్చింది.

'తల పగిలి అంత బ్లీడింగ్ అయ్యాక కూడా యెలా బ్రతుకుతుంది?' అంటూ దాస్ అనుమానం వ్యక్తం చేసాడు.

'ఒంటి మీద పదిహేడు కత్తిపోట్ల ని తట్టుకుని, బ్రతికి, ఎంపీ ఐన వొక పెద్దాయన గురించి వినలేదా?... ఆయుష్షు వుంటే బ్రతుకుతారు. మీ సాహిత్యానికి మీరే బ్రహ్మ ! ఆయుష్షు పోయడం, తీయడం మీ చేతుల్లో పని! ' అన్నాడు డాక్టర్ గిరి.


'మీ ఆప్షనే నా ఆప్షన్ కూడా డాక్టర్! ఈ రోజే మంచుమంట పార్ట్ టు కి శ్రీకారం చుడతా!... నా పాత్రలకి న్యాయం చేస్తా!...' అంటూ దాస్ డాక్టర్ గిరికి థాంక్స్ చెప్పి లేచాడు.

మంచుమంట రెండో భాగం డాక్టర్ యిచ్చిన ఐడియా తో రాయడం మొదలెట్టగానే దాస్ కి ఆ కలలు రావడం ఆగిపోయాయి.

[సమాప్తం]


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

అందరికీవందనాలు.

చిన్నతనంనించి కథలురాయడం నా హాబీ. 15 వయేట మొదటికథ అచ్చయితే, 18 వయేట ఆంధ్రపత్రిక వారపత్రిక దీపావళికథల పోటీలోనా కథ 'విప్లవం' కి బహుమతి వచ్చింది. తర్వాత కొన్ని కథలు పత్రికల్లో వచ్చాయి. అక్కడితో సాహితీ ప్రస్థానం ఆగిపోయింది. కొన్నిసంవత్సరాల తర్వాత యీ మధ్య మళ్ళీ రాయడం మొదలెట్టాను. అయితే డిజిటల్ మీడియాలోనే రాస్తున్నాను. 2020 సంక్రాంతి సమయం లో ఒక కథకి [చెన్నైఅనే నేను] ప్రతిలిపిలో మూడో బహుమతి వచ్చింది. ఈమధ్య అందులోనే మరో కథ10 ఉత్తమ కథల్లో వొకటిగా నిలిచింది. గోతెలుగు డాట్కామ్ లో వొక హాస్య కథ ప్రచురింపబడింది. కొన్నిసంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రాయగలననే ఆత్మవిశ్వాసం కలిగింది.

'శిరిప్రసాద్' అనేకలం పేరుతో రాస్తుంటాను.

ఇంతకంటే చెప్పుకోతగ్గ విషయాలు లేవు. కృతజ్ఞతలు.
104 views0 comments

Comments


bottom of page