top of page

ప్రేమపాశం'Premapasam' - New Telugu Story Written By Siriprasad

Published In manatelugukathalu.com On 11/02/2022

'ప్రేమపాశం' తెలుగు కథ

రచన: శిరిప్రసాద్

 (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మనోజ్
అయిన వాళ్ళందరూ దగ్గరే ఉన్నారు.కానీ ఇంకా ఆమె ప్రాణం ఎవరికోసమో ఎదురు చూస్తూ వుంది.

పుట్టింటి తరఫున మిగిలిన తమ్ముడి కోసమేమో...

అతడు వచ్చాక ఏం జరిగిందో సిరి ప్రసాద్ గారి కథలో తెలుసుకోండి.

ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది.మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

ఇక కథ ప్రారంభిద్దాంఅప్పుడు నాకు అయిదేళ్లేమో?... ఒక సంఘటన కొంచం ఆశ్చర్యం, కొంచం బాధ కలిగించింది.

మా యింటి ఆవరణ పెద్దది. ఎన్నో చెట్లు , చాలా వరకు పళ్ళ చెట్లు వుండేవి. పొగడ చెట్టు చాలా విస్తీర్ణం లో విస్తరించి వుండేది. ఉదయాన్నే నేల మీద తివాసీ పరచినట్టు పొగడ పూలు రాలి పడేవి. వాటి సువాసన ముందు ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ కూడా దిగదుడుపే! పొగడ చెట్టు కింద చుట్టూ వొక గట్టు వుండేది. దానిమీద పిల్లలం ఆడుకునే వాళ్ళం. పెద్దవాళ్ళు కూర్చుని ముచ్చట్లు చెప్పుకునే వారు. కొంచం పక్కగా, అంటే ముఖద్వారానికి మరో పక్క, పొన్న చెట్టు యేపుగా పెరిగి అందమైన తెల్లటి పూలతో అలంకార ప్రాయంగా అలరారేది! మల్లె చెట్టు వేసవి లో యింటి ఆవరణని రాత్రంతా సువాసనలతో నింపేసేది. ఇక, జామ, వుసిరి , నారింజ వంటి పళ్ళ చెట్లు అందరికీ యే జబ్బులూ రాకుండా రక్షణ కవచాన్ని తొడిగేవి! రెండు మూలల్లో కొబ్బరి చెట్లు తమ ఫల సంపదని బరువుగా మోస్తూ కనపడేవి. కూరగాయల మొక్కలు అక్కడక్కడ మేమూ వున్నామనిపించేవి. గోంగూర, తోటకూర నిటారుగా పెరిగితే, బచ్చలి తీగ వో చెట్టుని చుట్టేస్తూ పై పైకి గర్వం గా ఎదిగేది.


ఆడుతూ పాడుతూ నడుస్తున్న ఆ రోజుల్లో బామ్మ అస్వస్థత పాలైంది. వయసు యే డెభైయ్యో వుంటుందేమో ! ఆ వయసుకి అంత అనారోగ్యం కలగటం కొంచెం ఆశ్చర్యమే. ఆ రోజుల్లో ఆయుర్వేద డాక్టర్లు, ఆర్ ఎం పీ లు వుండేవారు. నలుగురైదుగురు పెద్ద డాక్టర్లూ వుండేవారు. నాలుగైదు రోజుల తర్వాత బామ్మ పరిస్థితి మరీ దిగజారింది. బామ్మ నాడి పడిపోతోందని నాన్న కలత చెందారు.


పెద్ద డాక్టర్ వచ్చి నాడి చూసి, 'మీ అమ్మగారు యింకా కొన్ని గంటలకంటే బతకదు. ఎవరికైనా కబురు చేయాలంటే చేసుకోండి,' అని చెప్పారు. మా నాన్న బాధ పడుతూ కనిపించాడు. చుట్టాలందరికీ కబురు పంపించారు. దగ్గిర్లో వున్నవాళ్లు పది మంది దాకా వచ్చారు. అందరూ మాట్లాడుకుని యింటి బయట హడావిడిగా తాటాకులతో చిన్న గది లాంటిది తయారు చేశారు. అక్కడ వొక నవారు మంచం వేశారు. పక్కన నేలమీద యెండు గడ్డి పఱచి దాని మీద మెత్తటి గుడ్డ పరిచారు. బామ్మని నెమ్మదిగా లేపి, నలుగురు మోసుకుంటూ ఆ ప్రత్యేకమైన గది లోకి తీసికెళ్ళి నవారు మంచం మీద పడుకోబెట్టారు. ఏవో మందులు మింగిస్తున్నా, నాన్న ముఖం విచారంగా కనపడింది. ఒక గిన్నె లో మంచి నీళ్లు పోసి, తులసి ఆకుల్ని వేశారు.


ఒక చెంచా ని ఆ గ్లాస్ లో పడేసి ఆ గదిలో వొక చోట పెట్టారు.

నాకు తెలిసి బామ్మ యెక్కువ మాట్లాడేది కాదు. మౌనం పాటించే ముని లాగా తోచేది. బాగున్నప్పుడు యెలా వుండేదో తెలియదు. ఆవిడ గురించి యింట్లో మాట్లాడుకునే వాళ్ళో, లేదో కూడా తెలియని వయస్సు. ఆటపాటలు, స్కూల్ కి పోవడం, అమ్మ అన్నానికి పిలిచినప్పుడు వెళ్ళి అన్నం తినడం -యివే పనులు ఆ వయస్సులో!

కుటుంబం పెద్దది కావడం తో అమ్మ యెప్పుడూ యేదో పని చేస్తూనే కనిపించేది. బామ్మ పని చేయడం నేను చూడలేదు. అందరం రోజూ వొకటి రెండుసార్లు బామ్మతో మాట్లాడుతుండే వాళ్ళం. చాలా సంక్షిప్తంగా అయినా!


అలాంటి మౌనముని యిప్పుడు కదలకుండా కళ్ళు మూతబడి మంచం మీద పడుకునివుంది. అందరూ ఆందోళన తో కనిపిస్తున్నారు. నలుగురైదుగురు చుట్టాలు వచ్చారు. బాబాయి కూడా వచ్చాడు. ఏవేవో యేర్పాట్లు చూస్తున్నాడు.


మా వీధిలో వుండే చిన్న డాక్టర్ బామ్మ చెయ్యి పట్టుకుని నాడి చూసి, ' ఈశ్వర్ , తులసి తీర్ధం పొయ్యి' అని అరిచాడు. నాన్న పరుగున వెళ్ళి తులసి ఆకులు వేసివున్న నీళ్లు బామ్మ నోరు బలవంతంగా తెరిచి కొద్ది కొద్దిగా నోట్లో వేసాడు. అందరూ కలిసి మంచం మీద నించి బామ్మని కింద పడుకోబెట్టారు. ఆ డాక్టర్ నాడి చూస్తున్నాడు. బాబాయిని అడిగాను, ' బామ్మని కింద పడుకోబెట్టారెందుకు ?' అని.


'మంచం మీద చనిపోతే నరకానికి పోతారని, కింద పొడుకోబెట్టాం,' అని చెప్పాడు బాబాయ్.

'నరకం అంటే?' అడిగాను.

'నరకమ్ అంటే అక్కడ యముడు వుంటాడు; అందరికీ శిక్షలు వేస్తాడు. అయినా యింత చిన్న వయసులో యీ విషయాలు నీకు అర్ధంకావు. ఇంట్లోకి పోయి, యేదైనా తిను, ఆకలి వెయ్యట్లేదా?' అన్నాడు.


లోపలికి వెళ్ళి కూర్చున్నాను. అమ్మ అన్నం పెట్టింది. గబ గబా తినేసి మళ్ళీ బయటికి పరిగెత్తి ఆ గది లో యేమి జరుగుతోందా అని చూసాను. బామ్మమళ్ళీ మంచం మీద కనిపించింది. బాబాయిని అడిగాను. 'మళ్ళీ నాడి మంచిగా అయ్యింది,' అన్నాడు. 'అంటే చచ్చి పోలేదా?' అడిగాను. లేదన్నట్టుగా తల వూపాడు. ఇంకా కొందరు చుట్టాలొచ్చారు. అందరూ బామ్మ గురించే మాట్లాడుకుంటున్నారు.


చుట్టాలు కొందరు బామ్మ దగ్గిరకెళ్ళి పెద్దగా పిలుస్తున్నారు. ఆమెలో కదలిక లేదు. నాన్న అంటున్నాడు, 'యిందాక కళ్ళు తెరిచి చూసిందిరా!'

'నాకు కనబడలేదే ?' అన్నాడు బాబాయి. '

'ఈశ్వర్ భ్రమ పడ్డట్టున్నాడు,' అన్నాడు యింకో బంధువు.

'అలా అనిపించింది నాకు, భ్రమో, నిజమో?' అన్నాడు నాన్న.


ఆ రోజు బామ్మని మంచం మీద పడుకోబెట్టడం , మళ్ళీ కిందకి దించడం , యిలా చాలా సార్లు చేశారు. మధ్య మధ్య లో గ్లాసులో నీళ్ళు నోట్లో పోస్తున్నారు. సాయంత్రం పెద్ద డాక్టర్ వచ్చాడు. మంచం పక్కన కుర్చీలో కూర్చుని పరీక్షలు చేసాడు. బామ్మ చెవిలో గట్టిగా అరిచాడు, 'బామ్మ గారూ యెలా వున్నారు?' అని. బామ్మ లో చలనం లేదు.


కొంచం బయటికొచ్చి, నాన్నతోనూ, చుట్టూ గుమిగూడిన అందరితోనూ అన్నాడు, 'రెండురోజుల కిందటే పోతారనుకున్నాను. ఊపిరి కొట్టుమిట్టాడుతోంది. ఏవైనా తీరని కోరికలున్నాయేమో అడిగి తెలుసుకోండి...'

'అమ్మకి తీరని కోరికలేముంటయ్యి డాక్టర్? హాయిగా బ్రతికింది. నాన్న లేడని తప్ప, ఆవిడకేమీ లోటు లేదు ...మీరు అంత గట్టిగా అరిచినా వులకలేదు , పలకలేదు...' అన్నాడు నాన్న.


'పళ్లరసమో, మజ్జిగో తాగితే యివ్వండి. ఎదో వొకటి అడుగుతూ వుండండి. కళ్ళు తెరిచినా, మాట్లాడినా నాకు కబురు చేయండి. ఏ టైం లోనైనా ఫర్వాలేదు...' అన్నాడు డాక్టర్.

'బ్రతికే అవకాశం వుందా డాక్టర్?' అని అడిగాడు బాబాయ్. తల అడ్డంగా వూపాడు డాక్టర్. 'అయినా మనం యేమీ చెప్పలేం. బ్రహ్మ యిన్ని వూపిరులు అని ఆయుష్షు రాస్తాడట. ఆఖరి వూపిరి వరకు బతకాల్సిందే!... ఇంత అస్వస్థత నించి కోలుకుని యింకో పాతికేళ్ళు బతికిన వారూ వున్నారు ...' అన్నాడు డాక్టర్, నవ్వుకాని నవ్వు నవ్వుతూ. నాన్న ఉత్తరీయం అడ్డు పెట్టుకుని కళ్ళు తుడుచుకున్నాడు.


ఆ రోజు బామ్మని చాలాసేపు మంచం మీదే పడుకోబెట్టారు. రాత్రి నాన్న పెద్దగా అడిగాడు బామ్మని, 'యేదైనా మాట్లాడమ్మా!... మాకు భయం వేస్తోంది...' ప్రతిస్పందన లేదు. ఆ రాత్రి పెద్దనాన్న వచ్చాడు. ఆయన ఆయుర్వేద డాక్టర్. బామ్మ నాడి చూసి, కింద పొడుకోబెట్టమన్నాడు. నాడి చాలా బలహీనంగా వుందట. ఆ రాత్రంతా బామ్మని కిందే వుంచేశారట !


మర్నాడు పొద్దున బామ్మ తమ్ముడు వచ్చాడు.

'ఏంట్రా నిన్నో, మొన్నో రావాల్సింది. ఇంత లేటుగానా రావడం?' నాన్న గట్టిగానే అరిచాడు.

'మొన్న ట్రైన్ తప్పి పోయింది బావా!.. నిన్న యేదో పని బడింది. సాయంత్రం బయల్దేరి మూడు బస్సులు మారి వచ్చే సరికి యీ టైం అయింది. అక్క గురించి యేమంటారు డాక్టర్లు?...' అన్నాడు బామ్మ తమ్ముడు కృష్ణమూర్తి. నాన్నకి, కృష్ణ మూర్తి కి పెద్ద వయోభేదం లేకపోయేసరికి, బావా అనో, బామ్మర్దీ అనో వొకరినొకరు పిల్చుకుంటారు.


'మొన్నే పోతుందన్నారు డాక్టర్లు. బలహీనంగా కొట్టుకుంటోంది నాడి. నిన్న డాక్టర్ వచ్చి ఆవిడకి తీరని కొరికేదైనా వుందేమో కనుక్కోమన్నాడు. పలికితే కదా!...' నాన్న ఆ మాట అనగానే, ఆయన బామ్మ పక్కన కూర్చుని, బామ్మ చేతిని తన చేతులోకి తీసుకున్నాడు. మెత్తగా వొత్తుతూ అడిగాడు, ' అక్కా, నేనొచ్చేసానే ! ఒక్కసారి చూడవే నన్ను!... రైలు మిస్సయితే మూడు బస్సులు మారివొచ్చానే !... నీకు యిష్టం అని సున్నుండలు తెచ్చానే!... మమ్మల్ని బాధ పెట్టకే !... వొక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడవే అక్కా!... '

అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా బామ్మ కళ్ళు తెరిచి, తమ్ముడి చెయ్యిని గట్టిగా నొక్కి, వొళ్ళంతా తడిమింది. అంతే క్షణాల్లో కళ్ళు మూసుకు పొయ్యాయి. తల పక్కకి వాల్చేసింది. వెంటనే మా యింటి పక్క డాక్టర్ నాడి చూసి, 'పోయింది!' అన్నాడు. ఆవిడ నోరు తెరిచి గ్లాస్ లోని నీళ్ళు కొన్ని పోశారు.


ఒక్కసారిగా ఆడవాళ్ళు యేడుపు మొదలెట్టారు.

ఆ కృష్ణ మూర్తి వైపు చూసి, నాన్న అన్నాడు, 'యమపాశం కంటే అమ్మకి నీ పట్ల వున్న ప్రేమపాశం చాలా గట్టిదిరా బామ్మర్దీ!...'

రెండు హృదయాల మూగ భాష ప్రేమ..నాలుగు కన్నుల ఎదురు చూపు ప్రేమ. అది ఎవరి మధ్య అయినా!

[సమాప్తం]


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం :

అందరికీవందనాలు.

చిన్నతనంనించి కథలురాయడం నాహాబీ. 15 వయేట మొదటికథ అచ్చయితే, 18 వయేట ఆంధ్రపత్రిక వారపత్రిక దీపావళికథల పోటీలోనా కథ 'విప్లవం' కి బహుమతి వచ్చింది. తర్వాత కొన్ని కథలు పత్రికల్లో వచ్చాయి. అక్కడితో సాహితీ ప్రస్థానం ఆగిపోయింది. కొన్నిసంవత్సరాల తర్వాత యీ మధ్య మళ్ళీ రాయడం మొదలెట్టాను. అయితే డిజిటల్ మీడియాలోనే రాస్తున్నాను. 2020 సంక్రాంతి సమయం లో ఒక కథకి [చెన్నైఅనే నేను] ప్రతిలిపిలో మూడో బహుమతి వచ్చింది. ఈమధ్య అందులోనే మరో కథ10 ఉత్తమ కథల్లో వొకటిగా నిలిచింది. గోతెలుగు డాట్కామ్ లో వొక హాస్య కథ ప్రచురింపబడింది. కొన్నిసంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రాయగలననే ఆత్మవిశ్వాసం కలిగింది.

'శిరిప్రసాద్' అనేకలం పేరుతో రాస్తుంటాను.

ఇంతకంటే చెప్పుకోతగ్గ విషయాలు లేవు. కృతజ్ఞతలు.139 views0 comments

Comments


bottom of page