top of page
Writer's pictureSiripurapu Hanumath Prasad

అనిర్వాచ్య బంధం


'Anirvachya Bandham' Written By Siriprasad

రచన : శిరిప్రసాద్


రామారావు దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. మగ నర్సు నరసింహ ఆయన దగ్గిరకొచ్చి ,'యేమైనా కావాలా సార్?' అని అడిగాడు. తీక్షణంగా చూసాడు వొక క్షణం. తర్వాత తల అడ్డంగా వూపాడు రామారావు.


ఊడిపోతున్న లుంగీ ని కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చేతి వేళ్లలోకి లుంగీ అంచులు పొవట్లేదు. చిరాకు వచ్చింది. కోపంగా నరసింహ వైపు చూసాడు. కొడతాడేమో అనిపించింది నరసింహకి. 'నేను కట్టేదా?' అడిగాడు.' ఊఁ ' అంటూ అరిచాడు రామారావు. అతి కష్టం మీద నరసింహ లుంగీ కట్టాడు. తన గుప్త భాగం కి నరసింహ చేతి వేలు తగిలింది. ఒక్కసారిగా కోపంతో వణికి పోయాడు. గట్టిగా తిట్టే ప్రయత్నం చేసాడు. మాట సరిగా రాలేదు. ఒక్కసారి విదిలించేసరికి కట్టిన లుంగీ వూడి కిందపడింది. దాన్ని పైకి తీసి బలంగా కట్టాడు నరసింహ. గట్టిగా వుందో ,లేదో లాగి చూసుకున్నాడు. లుంగీ మళ్ళీ వూడింది. ఈ సారి కోపంగా చూసే వంతు నరసింహ కొచ్చింది. ఆ నరసింహ చూపులకి కొంచం శాంతించాడు. మొత్తానికి లుంగీ కట్టడం పూర్తి చేసాడు నరసింహ. జేబులో చెయ్యి పెట్టి వున్న యాభై రూపాయల నోటు తీసి నరసింహ కిచ్చాడు. దాన్ని ఠక్కున జేబులో వేసుకున్నాడు. ఎవరైనా గమనిస్తున్నారేమోనని చుట్టూ చూసాడు. ఎవరూ చూడట్లేదు. అమ్మయ్య అనుకున్నాడు.


నరసింహ రామారావు ని కుర్చీలో కూర్చోబెట్టి నెమ్మదిగా పాలు తాగించాడు. పావు గంట పట్టింది. తర్వాత జేబులో చెయ్యి పెట్టాడు రామారావు. నోట్లు తగల్లేదు. నరసింహ ఆశగా చూసాడు. జేబులో పైసలు లేకపోవడం తో నిరాశ పడ్డాడు. ఇంకా యేమి కావాలని నాలుగైదు సార్లు అడిగాడు. ఏమీ మాట్లాడ లేదు రామారావు. బిక్క చూపులు చూసాడు. నరసింహ నెమ్మదిగా ఆ గది నించి నిష్క్రమించాడు.


రామారావు అల్జీమర్స్ అనే మతిమరపు వ్యాధితో బాధపడుతున్నాడు. వయసు అరవై అయిదో సంవత్సరం వరకు వొక మధ్య తరహా సంస్థ కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వున్నత పదవిలో వుండి, అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేసాడు. కార్యకలాపాలు లేక మధుమేహం పెరిగి, దాని ఫలితంగా మరికొన్ని వ్యాధుల పాలపడి, నాలుగేళ్ళకి మతిమరపు వచ్చి, అది పెరిగి అల్జీమెర్స్ గా పరిణామం చెంది, తనతో వుండే వార్ని, తనకి సహాయం చేస్తున్నవారినీ తప్ప యింకెవరినీ గుర్తు పట్టలేని స్థితికి చేరుకున్నాడు. శరీరం లో అవయవాలన్నీ స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయా అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి. దానిక్కారణం మెదడు లో వచ్చిన మార్పులే! అమిలాయిడ్ అనే ప్రోటీన్ మెదడు పొరల్లో పలకల్లా పోగై మెదడు చేసే పనుల్ని అడ్డుకుంటుంది. ముఖ్యం గా జ్ఞాపక శక్తిని, గ్రాహణ శక్తిని తగ్గి స్తుంది. మనుషుల్ని గుర్తుపట్టలేరు. శరీరం లో అవయవాల మధ్య సమన్వయం లోపిస్తుంది. మేధాశక్తి కనుమరుగౌతుంది. శరీరాన్ని నియంత్రించే మెదడు బలహీన పడడం అంటే నెమ్మదిగా అవయవాలన్నీ బలహీన పడడం , పనిచేయకుండా పోవడం. మెదడు కణాలు నిర్వీర్యం కావడం వల్ల మానసిక క్షీణత సంభవించడం.


రామారావు అరవై ఐదు సంవత్సరాల వయస్సు వరకు యెంతో వుత్సాహంగా పనిచేసేవాడు. ఐదేళ్ళలో యింత క్షీణత సంభవించడం డాక్టర్లకి ఆశ్చర్యం కలిగించింది. పరీక్షల్లో ఆయనకి జన్యు సంబంధంగా వున్న సమస్యలు, కుటుంబంలో పాత తరాల్లో యీ వ్యాధి వుండి వుండచ్చనే అంచనాతో, ఆయనకి చికిత్స ప్రారంభించారు. ఇటువంటి సమస్యలతో బాధపడేవారికోసం ఏర్పాటైన స్వామీ రామానంద ఆశ్రమం అనబడే హోమ్ లో ఆరు నెలలుగా వుంటున్నాడు. ఆ హోమ్ లో యిలాంటి వ్యాధిగ్రస్తులు దాదాపు ముప్ఫయి మంది వున్నారు. ఇది కొంచం కాస్టలీ హోమ్ అని చెప్పచ్చు. వైద్య సేవలు, నర్సింగ్ చార్జీలు, రూమ్ రెంట్, తిండి ఖర్చులు, ఆయాల సేవలకి కలిపి నెలకి యాభై వేలు అవుతుంది. ఆ మొత్తం భరించగలిగే వాళ్ళు, యింటి దగ్గిర పేషెంట్ ని జాగ్రత్తగా చూసుకోలేని వాళ్ళు యీ హోమ్ సహాయం తీసుకుంటారు.


రామారావు మొదటినించీ మంచి వుద్యోగం లో వుండేవాడు. అదృష్టం అన్నారు బంధుమిత్రులు. కష్టఫలే అనుకున్నారు ఆఫీస్ మిత్రులు. చమటోడ్చే పని కాకున్నా, అష్టావధానం లాంటి మేధో మధనం అతని వుద్యోగం. అభివృద్ధి మెట్లు చక చకా యెక్కేసాడు. వివాహ బంధం మాత్రం అంతంత మాత్రం. భార్య, పేరుకు సీత, అతణ్ణి పట్టించుకునేది కాదు. మిత్రులతో తరచూ బయటికెల్తూ, కొన్ని సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, భర్త సమయాలకి సమన్వయం చేసుకోలేక పోయేది. రామారావు మొదట్లో తేలిగ్గా తీసుకునే వాడు. కానీ తర్వాత తర్వాత మెదడు లో అనుమాన బీజం పడింది. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా వాళ్ళ మధ్య సమన్వయం కుదర లేదు. సీత కి కూడా భర్త ప్రవర్తనలో మార్పులు కనిపించేవి. ఒక్కోసారి వారం, పది రోజులు టూర్ మీద వూళ్ళు తిరుగుతుండేవాడు. వాళ్ళ మధ్య పొరపొచ్చాలు పెరిగి, పెరిగి కొండంత అయ్యాయి. ఇద్దరూ తిట్టు కోవడం, వొకరి మీద వొకరు చేతికందిన వస్తువులు విసురుకోవడం నించి, రామారావు భార్య మీద చెయ్యి చేసుకోడం దాకా వెళ్ళింది. అంతే, ఐదేళ్ల బాబుని, నాలుగేళ్ళ పాపని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. విషయం తెలిసిన సీత అన్నదమ్ములు యిద్దరు రామారావు ని నిలదీయడమే కాకుండా, తమ సోదరిని అనుమానిస్తున్నందుకు రామారావు ని చితక బాదారు. అంతకుముందు భార్యాభర్తలిద్దరూ కలిసే అవకాశం ఏమైనా వుండివుంటే, ఆ సంఘటనతో అది కూడా పోయింది.


రామారావు విడాకుల కోసం కోర్ట్ గుమ్మం తొక్కాడు. వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు అసహ్యం గా మారి జడ్జి గారికే యేవగింపు కలిగింది. ఇద్దరికీ విడాకులు మంజూరు చేస్తూ, నెల నెలా భరణం ఆదేశిస్తూ వుత్తర్వులు యిచ్చారు. పిల్లలిద్దరినీ తల్లి సంరక్షణలోనే వుంచింది కోర్టు. నెల నెలా భరణం బదులు ఒక్కసారే పాతిక లక్షలు యిస్తాననే రామారావు విజ్ఞప్తిని యిద్దరి అంగీకారంతో కోర్టు అంగీకరించింది. తనకు తండ్రినించి వచ్చిన పెద్ద యింటిని అమ్మేసి, పాతిక లక్షలు యిచ్చేసి మాజీ భార్యకి గుడ్ బై చెప్పాడు. తర్వాత ముంబై కి బదిలీ చేయించుకుని అక్కడ యిరవై యేళ్లు వివిధ సంస్థల్లో పనిచేసి, చివర్లో హైదరాబాద్ లో వో కంపెనీకి సి యీ ఓ గా వచ్చాడు. విడాకుల నించి వచ్చిన స్వతంత్రం అతని జీవితంలో యెంతో మంది స్త్రీలని ప్రవేశపెట్టింది. అందరినీ అనుభవించాడు తప్ప, ఎవరికీ పెళ్ళికి సందివ్వలేదు. అతని దృష్టి లో ఆడది డిస్పోసబుల్ వస్తువైంది. విడాకులిచ్చాక యిన్నేళ్ళలో భార్యా బిడ్డలు గుర్తురాలేదా, అంటే గుర్తుకొస్తుండేవాళ్ళే ! గుర్తుకొచ్చినప్పుడల్లా బీపీ భయంకరంగా పెరిగిపోయేది. రాను, రాను వయసు పెరుగుతుండడంతో, అతని అలవాట్లు, ఆవేదనలు, ఆగ్రహాలు తమ గుర్తుగా మధుమేహం, బీపీ, కొంత నరాల బలహీనత లని బహూకరించాయి. మూడేళ్ళనాడు తన పీఏ పట్ల ఆకర్షితుడై శారీరక సంబంధం పెట్టుకున్నాడు. మానసికంగా కూడా కొంచం దగ్గిరయ్యాడు. రామారావు రోగాల గురించి తెలిసిన ఆ పీఏ అతని దగ్గిర గుంజుకోగలిగినంత గుంజుకుని, దూరం జరిగిపోయింది.


అప్పుడే రామారావు జీవితంలో అంతవరకు నీడలా వున్న వొంటరితనం నిజరూపం చూపించింది. ఒక సహాయకుడ్ని [అటెండెంట్ ] నియమించుకున్నాడు. అల్జీమర్స్ పెరిగిపోవడం తో ఆ సహాయకుడు రామారావు సహోద్యోగి రమణ తో సంప్రదించి రామారావు ని యీ హోమ్ లో చేర్చి తను నెల నెలా జీతం తీసుకునే వాడు. ఇన్ని వ్యతిరేక శక్తులు రామారావు ని ఏడిపిస్స్తున్నా, వొక్క అదృష్టం యేమిటంటే , రామారావు వల్ల వొక మంచి జీవితం పొందిన అతని కంపెనీ లోని వొక వుద్యోగి రమణ రామారావు కి సన్నిహితంగా వుంటూ , ఆర్ధిక వ్యవహారాలు చూస్తున్నాడు. సాధారణంగా జనాలకి ఎన్ని కష్టాలు కలిగినా, యెప్పుడో చేసిన యేదో పుణ్యం యేదోరూపంలో వారిని ఆదుకుంటూ వుంటుంది . రామారావు సహోద్యోగి రమణ రూపంలో ఆ చిన్న అదృష్టం రామారావుని వరించింది. రామారావు పెట్టుబడులు, బాంక్ డిపాజిట్లు, వాటి మీద నెలనెలా వచ్చే వడ్డీ, వ్యవసాయ భూములమీద వచ్చే ఆదాయం, రెండు కంపెనీల్లో పెట్టిన ప్రమోటర్ షేర్స్ మీద వచ్చే డివిడెండ్, ఇన్కమ్ టాక్స్ చూసుకుంటాడు. అతని లోని నిజాయితీ నే రామారావు అదృష్ట రేఖ!


రామారావు ని రామానంద ఆశ్రమం లో చేర్చిన తర్వాత, రమణ, ఆయన భార్యా బిడ్డల కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. రామారావు యింట్లో ఆయనకీ సంబంధించిన ఫైళ్లు, యితర డాక్యూమెంట్స్ ని పరిశీలించి కొన్ని ఆధారాలు సంపాదించాడు. ఆఫీస్ లో పని వొత్తిడి వల్ల యెక్కువ సమయం కేటాయించలేక పోతున్నాడు. ఒక వారాంతంలో రెండు వందల కిలోమీటర్ల దూరం లో వున్న రామారావు భార్య పుట్టింటి కి ప్రయాణ మయ్యాడు.

రామానంద ఆశ్రమంలో ......


రామారావు నడవలో దిక్కులు చూస్తూ అటూ, యిటూ నడుస్తున్నాడు. పక్క రూమ్ లో వొక స్త్రీ కిందపడి, లేవలేక పోతోంది. ఆమె వైపు తీక్షణంగా చూసాడు రామారావు. ఆమె కూడా అలాగే చూస్తోంది, బాధతో అరవలేక అరుస్తూ. రామారావు మైండ్ ఆమె బాధని కొద్దిగా గ్రహించింది. లోపలికి వెళ్ళి వణుకుతున్న చేతుల్తో యెలాగో ఆమెని లేవదీశాడు. నెమ్మదిగా కుర్చీలో కూర్చోపెట్టాడు.


రామారావు రూమ్ బయటికి వచ్చి చప్పట్లు కొట్టాడు. పెద్ద ధ్వని చేయకున్నా చప్పట్లు వినపడి అలెర్ట్ గా వున్న ఆయా యాదమ్మ వచ్చి చూసింది. రామారావు సంజ్ఞలతో చెప్పిన విషయాన్ని అర్ధం చేసుకుని, డ్యూటీ డాక్టర్ ని పిలుచుకొచ్చింది. ఆయన ఆవిడని ప్రశ్నలు వేసి విషయం తెలుసుకున్నాడు. కొంచెం సేపు కాలు వత్తి చూసాడు. బహుశా కాలు మడత బడి బెణికిన్దని నిర్ణయించి దగ్గిరలో వున్న ఆర్తోపెడిక్ హాస్పిటల్ కి హోమ్ అంబులెన్సు లో తీసికెళ్ళారు. ఆమెని అంబులెన్సు లో తీసికెళ్ళడం చూసి, రామారావు బాధ పడ్డాడు. ఆ అంబులెన్సు వెనకాలే గేట్ దాకా పరుగులాంటి నడకతో వెళ్ళాడు. సెక్యూరిటీ వాళ్ళు ఆపేయడంతో అక్కడ ఆగిపోయి అంబులెన్సు వెళ్ళిన వైపే దీనంగా చూస్తూ నిలబడ్డాడు. ఇది గమనించిన నరసింహ రామారావు దగ్గిరగా వెళ్ళి విషయం అడిగాడు. రామారావు తడబడుతూ చెప్పాడు, 'ఆ... వి... డ... కింద... ప... డింది... ఎ... క్క... డి... కి ... తీ... సి... కె... ల్తు... న్నా... రు ?'


రామారావు ఆవేదన నరసింహకి అర్ధమైంది. ఒక క్షణం అతని మనసు పులకించింది. ఆ సంఘటనకి ఆయన రియాక్షన్ చూస్తూ, రామారావు కి ట్రీట్మెంట్ పనిచేస్తున్నట్టుంది, అనుకున్నాడు. ఆయన్ని లోపలికి రమ్మన్నాడు. రానన్నట్టుగా తల అడ్డంగా వూపాడు. ఆయన్ని చూస్తుండమని సెక్యూరిటీ కి చెప్పి, నరసింహ తన సూపెర్వైజర్ ని కలిసి, అప్పుడే జరిగిన సంఘటన, దానికి రామారావు ప్రతిస్పందన చెప్పాడు. సూపర్వైజర్ కూడా రామారావు లో కొంచం మార్పు వస్తోందని అనుకుంటున్నట్టు చెప్పాడు.


గంట తర్వాత అంబులెన్సు తిరిగి వచ్చింది. దాని వెనకాలే లోపలికి వెళ్ళాడు రామారావు. ఆ గంటసేపూ ఆవిడకి యేమైందో అన్న తపన ఆయన మెదడుని తొలిచేసింది. అంబులెన్సు నించి ఆవిడ్ని కిందకి దింపటం చూసి మనసులో ఆనందపడ్డాడు. ఆమె కాలికి కట్టు వుంది. ఆ గాయం ఆయనలో కూడా బాధ కలిగించింది. నెమ్మదిగా ఆవిడని, ఆవిడ్ని పట్టుకుని లోపలికి తీసుకెళ్తున్న యాదమ్మని అనుసరించాడు రామారావు.


గదిలోకి తీసికెళ్ళాక ఆవిడని బెడ్ మీద పడుకోబెట్టి, హార్లిక్స్ తీసుకు రావడానికి యాదమ్మ బయటికి వెళ్ళింది. మంచం పక్కన కుర్చీలో కూర్చుని, ఆమెని తదేకంగా చూస్తున్నాడు రామారావు. ఆమె కూడా ఆయన్ని అలాగే చూస్తోంది. తనపట్ల ఆయన చూపించిన శ్రద్ధ అర్ధమై కృతజ్ఞతగా చూస్తూందా, అన్నట్లుంది ఆమె చూపు. నెమ్మదిగా బెడ్ మీదకి వొరిగి ఆమెని చేత్తో స్పృశించాడు. కట్టు మీద యేదో మంత్రం వేస్తున్నట్టు చేతిని అటూ, యిటూ తిప్పాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నెమ్మదిగా వొత్తాడు . ఆమె కళ్ళు చెమర్చాయి. అది ప్రేమా, కృతజ్ఞతా, అమాయకత్వమా అర్ధం కాలేదు, వాళ్ళిద్దరినీ అప్పుడే హార్లిక్స్ గ్లాసుతో లోపలికి వచ్చి చూసిన యాదమ్మ కి.


డ్యూటీ డాక్టర్ లోపలికి వచ్చి, నందిని ని పలకరించి, నాడి చూసి, వొక క్షణం రామారావుని చూసాడు. కుర్చీలో స్థిరంగా కూర్చుని ఆమె వైపే చూస్తున్నాడు. 'రామారావు గారూ, నందిని మీకు తెలుసా?' అని అడిగాడు. ముందు తెలుసన్నట్టుగా, తర్వాత తెలియదన్నట్టుగా తల వూపాడు రామారావు. చిరునవ్వు నవ్వి, 'నందినిని జాగ్రత్తగా చూసుకుంటారా?' అని అడిగాడు. ఎస్ అన్నట్టుగా తల వూపాడు. రామారావు భుజం తట్టి బయటికి నడిచాడు డాక్టర్.


ఈ నందిని గురించి కొంచం తెలుసుకోవాలి కదా! ఆమె వయసు అరవై ఐదు. నందినికి కూడా అల్జీమర్స్ వ్యాధి వచ్చి రెండేళ్లు అయ్యింది. ఆమె కొడుకు హైదరాబాద్ లో ఉన్నంత వరకు తల్లిని జాగ్రత్తగా చూసుకున్నారు. అతడు కంపెనీ పనిమీద యేడాది పాటు లండన్ కి వెళ్ళాల్సి వచ్చింది. కూతురు తన యింట్లో తల్లిని పెట్టుకోడానికి ఆమె భర్త వొప్పుకోలేదు. అందుకే యిద్దరూ ఆలోచించి యీ హోమ్ లో చేర్చారు. నందిని వుద్రేక స్వభావి. డబ్బున్న మహిళ కావడంతో ఫ్రెండ్స్ తో పార్టీలు, పేకాట లాంటివి అలవాటై, చివరికి యీ జబ్బు బారిన పడింది. ఈ హోమ్ లో చేరాక మూడు, నాలుగు నెలల్లో వుద్రేక స్వభావం పూర్తిగా పోయి, స్వస్థత చిహ్నాలు చూపింది.

రామారావు నందిని దగ్గిరే కూర్చున్నాడు. ఇద్దరి మధ్యా మాటల్లేవు కానీ, వొకరి కొకరు పదే పదే చూసుకుంటున్నారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో నరసింహ, యాదమ్మ యిద్దరికీ లంచ్ తీసుకొచ్చి యిచ్చారు. నందిని ని నెమ్మదిగా లేపి కూర్చోబెట్టింది యాదమ్మ. లంచ్ ప్లేట్స్ తీసుకుని నెమ్మదిగా తింటున్నారు యిద్దరూ. పది నిముషాల్లో తినేది, యిద్దరికీ గంట పడుతుంది. అటెండంట్స్ ఓపిగ్గా కూర్చుని తినిపిస్తారు. ఇద్దరూ ధనవంతులు కావడం వల్ల, టిప్స్ బాగా దొరుకుతాయి. అందుకే యెంత విసుగొచ్చినా, దాన్ని కనపడనీయకుండా సేవ చేస్తుంటారు. భోజనం తర్వాత నరసింహ రామారావు ని బలవంతంగా ఆయన గదికి తీసికెళ్ళాడు. మంచం మీద నడుము వాల్చిన రామారావుకి నందినీ నే కనిపిస్తోంది. ఆమె యెవరో తనకి కావాల్సిన మనిషిలా తోస్తోంది. మెదడు పొరల్లోంచి జ్ఞాపకాలు బయటికి రావట్లేదు. తన శరీరం, మనస్సు ఆమెకి దగ్గిర కమ్మంటున్నాయి. ఆమెని కౌగలించుకుని వొక్కసారి యేడిస్తే బాగుండుననుకున్నాడు. ఆ భావాన్ని మాత్రం మనసు పదే పదే గుర్తుచేస్తోంది. మెదడుని, ప్లేక్స్ మబ్బుల్లా కమ్మేసినా, ఆ మబ్బుల చాటునుండి ప్రేమ అనే చందమామ అప్పుడప్పుడు తొంగి చూస్తుంటాడు. ఆ ప్రేమ ఆ నందిని పట్లే! నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు రామారావు.

ఆ సాయంత్రం టీ తాగి రామారావు నందినీ గది లోకి తొంగి చూసాడు. అక్కడ యిద్దరు ముగ్గురు అతిధులు కూర్చుని ఆమెని మాట్లాడిస్తున్నారు.


నందిని కిందపడిన విషయం, ప్లాస్టర్ వేయించిన సంగతి నందిని కూతురు పద్మ కి ఫోన్ చేసి చెప్పారు. పద్మ, ఆమె భర్త , మరొకరు సాయంత్రం వచ్చి నందినిని పరామర్శించారు. ఆవిడ చెప్పిన ముద్ద మాటలు పూర్తిగా అర్ధం కాకున్నా, వొక విషయం అర్ధమైంది వాళ్ళకి. పక్కనెక్కడో వుంటున్న మరో పేషెంట్ సహాయం చేస్తున్నాడని. యాదమ్మని అడిగి ఆయన వివరాలు తెలుసుకున్నారు. రామారావు గురించి తనకు తెలిసిన వివరాలు చెప్పింది యాదమ్మ. వాళ్ళంతా వెళ్ళిపోయిన మరుక్షణం రామారావు ఆమె గదిలోకొచ్చి కూర్చున్నాడు. రాత్రి భోజనం వరకు అక్కడే కూర్చుని నందినిని తదేకంగా చూస్తుండి పోయాడు.


రామారావు కుటుంబ వివరాలు ఆయన యింట్లో దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా సేకరించి కారులో కోదాడ వెళ్ళాడు రమణ. కొంచం కష్టం మీద రామారావు భార్య సీత పుట్టింటిని పట్టుకున్నాడు. వాళ్ళు ఆ వూళ్ళో డబ్బున్నవాళ్ళు కావడం, రైస్ మిల్స్ రెండు, సిమెంట్ ఫ్యాక్టరీ లో షేర్ వుండడం వల్ల వాళ్ళ ఐడెంటిటీ చాలా మందికి తెలుసు. నెమ్మదిగా ఆ యింటికి చేరాడు రమణ.


రమణకి మర్యాద చేసి కూర్చోబెట్టారు. సీత అన్నయ్య యేడేళ్ల క్రితం మరణించాడట. తమ్ముడు పక్షవాతంతో మంచం పట్టాడు. ఫిజియో థెరపీ తో కొ ద్ది కొద్దిగా కోలుకుంటున్నాడట. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళై వ్యాపారాలు చూసుకుంటున్నారు.


సీత వివరాలు అడిగేసరికి అందరూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. సీత, పిల్లలు హైదరాబాద్ లో సెటిల్ అయ్యారట. కూతురికి పెళ్ళి అయ్యింది. హైదరాబాద్ లోనే వుంటుంది . కొడుకు యేదో మల్టీ నేషనల్ కంపెనీ లో జాబ్ చేస్తున్నాడు. ఇంజనీర్. రమణ రామారావు గురించి వాళ్ళకి వివరంగా చెప్పాడు. ఆయన ప్రస్తుత పరిస్థితి, ఆయన పెట్టుబడులు, ఆస్తుల వ్యవహారాలు చెప్పాడు. సీత కూతురి అడ్రస్, ఫోన్ నెంబర్ యిచ్చారు. సీత ఆరోగ్యం బాగుండకపోవడంతో యేదో హాస్పిటల్ లో చేర్చారని చెప్పారు. పిల్లలు యింట్లో లేకపోవడంతో పూర్తి వివరాలు తెలుసుకోలేక పోయాడు. అక్కడ్నించే రామారావు కూతురికి ఫోన్ చేసాడు. ఆమెకి విషయం కొంచం అర్ధమై, తనను కలుసుకోమని చెప్పింది. ఫోన్ లో వివరాలు చెప్పడం బాగుండదు, అని చెప్పింది. తన సోదరుడు విదేశాలకి వెళ్ళినట్టు , మరి కొద్ది రోజుల తర్వాత హైదరాబాద్ వస్తున్నట్టు చెప్పింది. తనను వెంటనే కలవమని కోరింది.


ఆ కుటుంబం దగ్గిర శలవు తీసుకుని, హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యాడు రమణ. రామారావు కుటుంబం ఆచూకీ తెలియడం మంచిదే. కానీ ఆయన బిడ్డ మాటల ధోరణి బట్టి ఆ కుటుంబానికి రామారావు అంటే చాలా కోపం వున్నట్టు అనిపించింది. అసలు తండ్రి యెవరో కూడా తెలియనట్టు మాట్లాడింది ఆయన కుమార్తె. భారంగా నిట్టూర్చాడు రమణ. తన యేకైక మిషన్, రామారావు ని, ఆయన ఆస్తుల్ని వాళ్ళకి అప్పచెప్పడం. ఒకవేళ, డబ్బు తీసుకున్నాక వాళ్ళు తండ్రిని చూసుకోకపోతే? అందుకే, ఆయన ట్రీట్మెంట్ కోసం వేరే అకౌంట్ ఓపెన్ చేసి, అందులో ఆయనకు నాలుగైదేళ్లకి సరిపడా వేరే అకౌంట్ నించి డబ్బు వేసాడు. ఆ డబ్బు వాళ్ళకి యివ్వకుండా , అసలు చెప్పకుండా వుంటే మంచిదనుకున్నాడు. డబ్బు మనుషుల్ని చెడగొట్టే మీడియం కదా!


ఒక క్షణం రమణకి అనిపించింది, రామారావు కుటుంబం ఆయన ఆస్తుల్ని, డబ్బుని వద్దనుకుంటే? అప్పుడు తనే వొక మంచి నిర్ణయం తీసుకోవాలి. భార్యా భర్తలు విడాకులు తీసుకోవడం వల్ల , భరణం కూడా పరస్పర అంగీకారంతో ఒక్కసారే సెటిల్ చేసుకోవడం వల్ల, చట్టప్రకారం ఆ కుటుంబానికి రామారావు ఆస్థిని , డబ్బుని ఆశించే హక్కు లేదు. కానీ చట్టం వేరు, ధర్మం వేరు. అందుకే వాళ్లకి అన్నీ వివరించి తన అభిప్రాయం చెప్పడం, రామారావు బాధ్యత తీసుకోమని చెప్పడం తక్షణ కర్తవ్యం. హై వే మీద కారుని వేగంగా పోనిస్తూ రమణ మూడు గంటల్లో హైదరాబాద్ పొలిమేరలకి వచ్చేసాడు. యూసఫ్ గూడా లో రామారావు కూతురు వుంటుంది . ఆరోజే ఆ అమ్మాయిని కలిస్తే మంచిది, అనుకున్నాడు. బంజారా హిల్స్ చట్నీస్ లో దోస తిని యూసూఫ్గూడా కి బయల్దేరాడు.


రామారావు నందిని రూమ్ లో కూర్చున్నాడు. నందినిని తదేకంగా చూస్తున్నాడు. ఆమె బెడ్ మీద నించి లేచింది. కొద్దిగా నడిచే ప్రయత్నం చేసింది. ఆమెని పట్టుకుని కొంచం నడిపించాడు రామారావు. కొద్ది క్షణాల తర్వాత నందిని రామారావు ని అడిగింది,'మీ భార్య యెక్కడ ?'

ఒక్కసారి వుద్రేక పడ్డాడు రామారావు. పిడికిళ్లు బిగుసుకున్నాయి. ముఖం వుబ్బింది. కళ్ళు యెర్ర బడ్డాయి. ఒళ్ళంతా వూగి పోయింది. కష్టం మీద నోట్లోకి మాటలు తెచ్చుకున్నాడు. 'అది... లేదు... పాతికేళ్ళ ... కిందటే ... పోయింది!... దాని ... గురించి ... అడక్కు!' అన్నాడు. .

తలవూపింది నందిని.


'నీ ... ఆయన ... లేరా?... ' అడిగాడు రామారావు.

తల అడ్డంగా వూపింది . 'ఆ ... దుర్మార్గుడు ... పోయాడు...' అంది కోపంగా.

విచారంగా చూసాడు.


ఆ ఆగ్రహం మెదడుని వుత్తేజ పరిచినట్టుంది. ఇద్దరి మనస్సులో ఆ ప్రశ్నలు, వాటికి జవాబులు తట్టాయి. తట్టడమే కాదు, ఆ చేదు జ్ఞాపకాలు ఆ క్షణాల్లో ప్రేరణ పొందాయి. ఆ ద్వేషం, కోపం, చిరాకు తాలూకు జ్ఞాపకాలు అచేతనం నించి చేతనావస్థ లోకి పొంగుకుంటూ వచ్చాయి. మరి కొద్ది క్షణాల్లో అవి మళ్ళీ ప్లేక్స్ అనే పొదలమాటుకి వెళ్ళిపోయాయి.


ఇద్దరూ గట్టిగా కౌగలించుకున్నారు. కాలం స్తంభించింది. ఎంతసేపు ఆ కౌగిలిలో బందీలయ్యారో తెలియదు. నెమ్మదిగా ఆమె పెదాల మీద ఆయన పెదాలు అతుక్కు పోయాయి. ఇద్దరి నాలుకలు వొకదానితో వొకటి పెనవేసుకు పోయాయి. ఇద్దరి కళ్ళవెంట కన్నీరు ధారలు కడుతోంది. రెండు శరీరాలు వాటి మధ్య జనించిన ఉష్ట్నాన్ని ఆస్వాదిస్తున్నాయి. ఇద్దరూ ఒకర్ని ఒకరు నలిపేసుకుంటున్నారు. అనిర్వచనీయమైన ఆకర్షణో , అవిదితమైన పూర్వజన్మ బంధమో, అసంబద్ధమైన అరాచకమో -వాళ్ళిద్దరూ పెనవేసుకు పోయారు!


యూసూఫ్ గూడా వెల్తూ, రమణ రామానంద ఆశ్రమానికి ఫోన్ చేసాడు. రామారావు యెలా వున్నాడో తెలుసుకోవడానికి. డ్యూటీ డాక్టర్ ఫోన్ ఎత్తాడు. రమణ ప్రశ్నకి సమాధానంగా చెప్పాడు, 'రమణ గారూ! రామారావు గారు బాగానే వున్నారు. ఆయనలో మంచి మార్పు కనిపిస్తోంది. అంటే ఆ మార్పు అసలు సమస్యలో వొక్క శాతమే కావచ్చు, కానీ, ప్రభావశీలమైనదే! పక్క రూమ్ లో వో ముసలావిడ వుంది. ఆమెదీ యిదే ప్రాబ్లెమ్. ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. సన్నిహితంగా వుంటున్నారని కూడా నరసింహ చెప్తున్నాడు. అంటే మైండ్ కొంచం పనిచేస్తున్నదన్నమాట !... ట్రీట్మెంట్ కి రెస్పాండ్ చేస్తున్నారని అర్ధం... లెట్ అజ్ హోప్ ఫర్ ది బెస్ట్! '

రమణ సంతోషంగా అన్నాడు, 'థాంక్ యు డాక్టర్. ఇంతకీ ఆ పక్క రూమ్ ఆవిడ పేరేమిటి?' 'నళిని అనుకుంటా...' అన్నాడు డాక్టర్.


రామారావు పాత లవర్స్ లో యెవరైనా నేమో అని అనుమానపడ్డాడు.

'ఓకే సర్ . నేను కలుస్తాను...' అంటూ ఫోన్ ఆపు చేసాడు. గూగుల్ మాప్ ఖచ్చితంగా రామారావు కూతురి యింటిముందుకు తీసుకొచ్చింది. బాల్కనీ నించి చెయ్యి వూపింది రామారావు కూతురు. సెక్యూరిటీ కి చెప్పింది. సెక్యూరిటీ గార్డ్ రమణని యింటి లోపలికి తీసికెళ్ళి, సోఫాలో కూర్చోపెట్టాడు. ఇంటిని నిశితంగా పరిశీలించాడు రమణ. రామారావు వియ్యంకులు సంపన్నులేనన్నమాట, అనుకున్నాడు. ఇంతలో రామారావు కూతురు కావచ్చు, వచ్చింది. రమణ కి నమస్కారం పెట్టి యెదురుగా కూర్చుంది.


రమణ సంభాషణని ప్రారంభిస్తూ అన్నాడు, 'నేను మీ నాన్న గారి సహోద్యోగినమ్మా. ఆయన నాకు చేసిన సహాయానికి ఆయనకి రుణ పడివున్నాను. ఆయనకి ఆరోగ్యం బాగాలేదు. అలాగని ఆయన్ని మీరు చూసుకోవాలని చెప్పడానికి రాలేదు. నేనే వొక హోమ్ లో చేర్పించాను. ఒకరకంగా చెప్పాలంటే ఆయన్ని దగా కోర్లనించి కాపాడడానికే నిర్ణయించుకుని, ఆయన ఆస్తుల్ని, బ్యాంకు లో వున్న డబ్బుని కాపలా కాస్తున్నాను,' అని ఆగాడు.

గొంతు యెండిపోయినట్టు అనిపించింది ఆ అమ్మాయికి. 'నన్నేం చేయమంటారు?... అసలు మా వివరాలు మీకెలా తెలిసాయి? ఆయనే చెప్పి పంపాడా? ... పాతికేళ్ళ కిందటే మా బంధం తెగిపోయింది...' అన్నది.


'నాకు పూర్తిగా కాకపోయినా కొంతవరకు తెలుసమ్మా!... మీ తల్లి తండ్రులు విడాకులు తీసుకున్నంత మాత్రాన, ఆయన మీ తండ్రి కాకుండా పోతాడా?...' అన్నాడు రమణ ఆ అమ్మాయిని వోప్పించే ప్రయత్నంగా.


ఆ అమ్మాయి సోఫా లో కొంచం అసహనంగా కదిలింది. 'ఇప్పుడు అలాంటి నీతులు వినలేం అంకుల్. పాతికేళ్ళలో మేమెలా వున్నామో కూడా పట్టించుకోని వెధవ తండ్రి యెలా అవుతాడు?...' తీక్షణం గా చూస్తూ అడిగింది. 'ఆయన భార్యని వద్దనుకున్నాక, పిల్లలెందుకు?'

'నిజమేనమ్మా!... మీ అమ్మా, నాన్నా యిద్దరూ తప్పు చేశారు. అందుకే అలా జరిగింది. మీరు ఆయన్ని తండ్రిగా అంగీకరిస్తారనే అణువంత ఆశతో వచ్చాను. మీ బ్రదర్ వచ్చాక యిద్దరూ మాట్లాడుకోండి. వద్దనుకుంటే పట్టుబట్టి మిమ్మల్ని కలిపేటంత చనువు మీ దగ్గిర నాకు లేదు. హు ఆర్ యూ, అని అడిగితె నేను తెల్లమొహం వెయ్యాల్సిందే. అయితే ఆయన స్థిర, చరాస్తుల విలువ పదికోట్లకి పైనే వుంటుంది. అదంతా యెవరో దొంగల పాలు కావడం నా కిష్టం లేదు. నేనే కొట్టేసి వుండచ్చు . కానీ, నాలో అంత ధుర్మార్గం లేదు. ఇక ఆయన ఆరోగ్యాన్ని కాపాడేందుకు, మళ్ళీ మామూలు మనిషి అయ్యేందుకు ప్రయత్నం మొదలెట్టాను కాబట్టి చివరిదాకా చూసుకుంటాను. నాకు ఆయన పట్ల కృతజ్ఞత వుంది అని చెప్పా కదా!... 'అన్నాడు కొంచెం నిరాశ ధ్వనించేలా.


ఆ అమ్మాయి ఆలోచించింది. ఇంతలో కాఫీ వచ్చింది. కొంచం కొంచం సిప్ చేస్తూ ఆ అమ్మాయి వైపే చూస్తున్నాడు రమణ. కొద్ది క్షణాల తర్వాత ఆమె పేరు అడిగాడు. పద్మ అని చెప్పింది.

కాఫీ కప్ యెదురుగా వున్న టీ పాయ్ మీద పెట్టి, పద్మ, 'అంకుల్! మిమ్మల్ని చూస్తుంటే యెంతో గౌరవం కలుగుతోంది. మీలాంటి నిజాయితీ పరులు అరుదుగా కనిపిస్తారు. నా బ్రదర్ రెండురోజుల్లో వస్తాడట. అప్పుడు యిద్దరం మాట్లాడుకుని మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం,' అన్నది.

'సీత గారికి ఆరోగ్యం బాగా లేదన్నారు, ఏమైంది?' అడిగాడు రమణ.

'సీతా?!...' అని ఆశ్చర్యం గా రమణ వంక చూసింది. అంతలోనే, 'మా అమ్మ గురించి అడుగుతున్నారా?' అంది.

'అవునమ్మా,' అన్నాడు రమణ.


'మా అమ్మ పేరు నళిని అండీ. డివోర్స్ అయ్యాక, పేరు మార్చుకుందిట. చట్ట ప్రకారమే!... తనకి డెమెన్షియా సమస్య. ఏమీ గుర్తుండవు. అన్నయ్య లండన్ వెళ్తూ,రామానంద ఆశ్రమంలో వదిలి వెళ్ళాడు,' అంది.


ఒక్క క్షణం ఆశ్చర్య పోయాడు రమణ. ఇందాక డ్యూటీ డాక్టర్ చెప్పిన పేరు కూడా నళినే కదా, అనుకున్నాడు. వెంటనే అన్నాడు, 'రామారావు గారిని కూడా అదే ఆశ్రమంలో చేర్చానమ్మా!.... ఇప్పుడే తెలిసిన విషయం యేమంటే, రామారావు గారూ, నళిని గారూ ఒకరినొకరు గుర్తించక పోయినా, చాలా సన్నిహితంగా వుంటున్నారని, వొకరికొకరు తోడుగా వుంటున్నారని. అది శుభసూచకమే కదా!'

పద్మ మాట్లాడలేదు.


'మీ బ్రదర్ వచ్చాక, ఫోన్ చేయండి. మరోసారి కలిసి మాట్లాడుదాం,'అన్నాడు రమణ, జేబు లోంచి విజిటింగ్ కార్డు తీసి యిస్తూ.

తల వూపింది పద్మ. 'ఆయన ఆస్తిపాస్తులకోసం వెంపర్లాడేవాళ్ళం కాదండీ. మాకు వందకోట్ల ఆస్థి వుంది. మా అన్నయ్య కూడా బాగానే సంపాదించుకుంటున్నాడు. కానీ, యిద్దరూ కలిస్తే, మాకు వున్న ఆ వొక్క లోటు తీరుతుంది, అని ఆలోచిస్తున్నా!...' అన్నది.

పద్మ దగ్గిర సెలవు తీసుకుని బయటికి నడిచాడు రమణ.

పద్మ, రమేష్ చర్చించుకుని వొక నిర్ణయానికి వచ్చారు. తల్లిని హోమ్ నించి తీసుకెళ్ళి రమేష్ యింట్లో వుంచాలని , ఆ రకంగా వాళ్ళిద్దరినీ విడదీయాలనీ అనుకున్నారు. కానీ, హోమ్ లో డాక్టర్లు అలా చేయ వద్దనీ, కలిసివుంటే, యిద్దరూ కోలుకునే అవకాశం వుందనీ చెప్పారు. రమణ విజ్ఞప్తి మేరకు డాక్టర్లు అన్నా చెళ్ళెళ్ళకి చాలా సేపు కౌన్సెలింగ్ యిచ్చారు. ఆ కౌన్సిలింగ్ తో అన్నాచెల్లెళ్ళిద్దరూ తల్లితండ్రుల్ని ఆ హోమ్ లోనే వుంచేయాలని నిర్ణయించుకున్నారు. రమణ నించి అన్నీ బాధ్యతల్ని రమేష్ తీసుకున్నాడు.

[సమాప్తం]


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం :

అందరికీవందనాలు.

చిన్నతనంనించి కథలురాయడం నాహాబీ. 15 వయేట మొదటికథ అచ్చయితే, 18 వయేట ఆంధ్రపత్రిక వారపత్రిక దీపావళికథల పోటీలోనా కథ 'విప్లవం' కి బహుమతి వచ్చింది. తర్వాత కొన్ని కథలు పత్రికల్లో వచ్చాయి. అక్కడితో సాహితీ ప్రస్థానం ఆగిపోయింది. కొన్నిసంవత్సరాల తర్వాత యీ మధ్య మళ్ళీ రాయడం మొదలెట్టాను. అయితే డిజిటల్ మీడియాలోనే రాస్తున్నాను. 2020 సంక్రాంతి సమయం లో ఒక కథకి [చెన్నైఅనే నేను] ప్రతిలిపిలో మూడో బహుమతి వచ్చింది. ఈమధ్య అందులోనే మరో కథ10 ఉత్తమ కథల్లో వొకటిగా నిలిచింది. గోతెలుగు డాట్కామ్ లో వొక హాస్య కథ ప్రచురింపబడింది. కొన్నిసంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రాయగలననే ఆత్మవిశ్వాసం కలిగింది.

'శిరిప్రసాద్' అనేకలం పేరుతో రాస్తుంటాను.

ఇంతకంటే చెప్పుకోతగ్గ విషయాలు లేవు. కృతజ్ఞతలు.


136 views0 comments

Comentários


bottom of page