top of page

ఆత్మారాం ఆత్మావలోకనం


'Athmaram Athmavalokanam' written by Siriprasad

రచన : శిరిప్రసాద్

తండ్రి చేసే ప్రతి పనినీ చాదస్తంగా అనుకునేవాడు ఆత్మారాం.

తనదాకా వచ్చాక ఆత్మావలోకనం చేసుకున్నాడు.

తప్పు తెలుసుకున్నాడు.

ప్రముఖ రచయిత సిరిప్రసాద్ గారు రచించిన ఈ కథలో ఆత్మారాం మానసిక స్థితిని చక్కగా వివరించారు.




ఆత్మారాం తన కెంతో యిష్టమైన పడక్కుర్చీలో పడుకుని టీ వీ చూస్తున్నాడు. టీవీ లో వస్తున్న ప్రోగ్రామ్ బోర్ అనిపించి , ఆలోచనల్లోకి జారిపోయాడు.

ఆత్మారాం వాళ్ళ కుటుంబం లో రెండో సంతానం. పెద్దాయన ఈ మధ్యే ఢిల్లీ కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. కేంద్ర ప్రభుత్వం లో గజెటెడ్ ఆఫీసర్. ఆత్మారాం కేంద్ర ప్రభత్వ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కాబట్టి తీరిగ్గా యింటి పట్టునే వున్నాడు.

ఆత్మారాం తర్వాత యిద్దరు అమ్మాయిలు. వాళ్ళకి పెళ్ళిళ్ళయి వొకరు ముంబాయి లోనూ, మరొకరు బెంగుళూరు లోనూ వుంటున్నారు.

ఆత్మారాం తండ్రి స్టేట్ గవర్నమెంట్ లో ఆఫీస్ సూపరింటెండెంట్ గా చేసి, రిటైర్ అయి వూళ్ళో సొంత యింట్లో వుంటున్నారు. తల్లి కూడా అక్కడే వుంటూ , ఆయనకి సపర్యలు చేస్తూ వుంటుంది . ఉన్న కొద్ది భూమి ని కౌలు కిచ్చి, ప్రతినెలా వచ్చే కొద్దిపాటి పెన్షన్ తో సుఖంగానే వుంటున్నారు.

ఆత్మారాం చిన్నతనం గురించి కొంచం తెలుసుకోవాలి. ఆత్మారాం ని ఒక రెబెల్ చైల్డ్ అనొచ్చు. రెబెల్ అంటే అంతర్గతం గానే! బహిరంగంగా యెప్పుడూ తల్లి తండ్రుల్ని యెదిరించే ధైర్యం చేయలేదు. కానీ మనసులో వుడికి పోతుండేవాడు. తండ్రి చాదస్తుడని, ఛండశాసనుడని అతని అభిప్రాయం. మొదటిగా ఆత్మారాం అని తల్లితండ్రులు తనకి పెట్టిన పేరు నచ్చలేదు. అలా అని వాళ్ళతో యెప్పుడూ అనలేదు. కానీ యెవరైనా 'ఆత్మారాం' అని పిలవగానే గుండె మండిపోతుండేది. వయసు పాతిక దాటాక, నెమ్మదిగా పేరుతొ రాజీ పడ్డాడు. మనసు వుడికిపోవడం క్రమంగా తగ్గింది. చిన్నతనంలో మాత్రం తండ్రి చాదస్తానికి తను బలైపోతున్నాడని వూహించుకునే వాడు. ఆ వూహలు వుద్రేకాన్ని కల్గించేవి. తండ్రి యేమి చెప్పినా దానికి వ్యతిరేకంగా చేయాలనే కాంక్ష బలీయంగా వుండేది . తన జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలని నెమరు వేసుకుంటున్నాడు ఆత్మారాం, పడక్కుర్చీ యిస్తున్న సౌఖ్యంలో!

2.

ఆత్మారాం స్కూల్ నించి వచ్చి, చక చకా కాళ్ళు కడుక్కుని, అమ్మ పెట్టిన అన్నం హడావిడిగా తినేసి ఆటలకి వెళ్ళేవాడు. తన యీడు పిల్లలతో క్రికెట్ ఆడుతుండేవాడు. చీకటి పడ్డాక అమ్మ గేట్ దగ్గిరకి వచ్చి బిగ్గరగా ఆత్మారాం ని పిలిచేది . అట్లా ఐదారుసార్లు పిలిచాక యింటికొచ్చేవాడు. మళ్ళీ కాళ్ళు, చేతులు కడుక్కొని, కొంచం సేపు హోమ్ వర్క్ చేసుకుని, అన్నం తినేసి పడుకునే వాడు. ఇది దాదాపుగా అతని దినచర్య. నాన్న పొద్దున్న ఆఫీస్ కి వెళ్ళి రాత్రి యెనిమిదింటికి యింటికి వస్తుంటాడు. ఆలోగా ఆత్మారాం, అన్న సీతారాం నిద్రకుపక్రమించేవాళ్ళు.

ఆదివారం, సెలవు రోజుల్లో పిల్లలకి పండగే. రోజూ ఐదారు సార్లు ఆటలకి వెళ్ళి వస్తుండేవాళ్ళు . ఆరోజుల్లో నాన్న యింట్లో వుంటే యింటినిండా నిశ్శబ్దం. ఆయన ముందు గదిలో పేపర్ చదువుతూనో , టీవీ చూస్తూనో రోజంతా గడిపేవాడు. ఒక్కోసారి ఫ్రెండ్స్ తో వరండా లో పేకాట ఆడుతుండేవాడు. ఆయన కంట పడకుండా పిల్లలు యింట్లోంచి బయటికి, బయటి నించి యింట్లోకి తిరుగుతుండేవాళ్ళు .

నాన్నంటే ఆత్మారాం కి, సీతారాం కి చచ్చేంత భయం. ఒక రోజు ఆత్మారాం కాళ్ళు కడుక్కోకుండా యింట్లోకి పరుగున వచ్చాడు. అది నాన్న కంట పడింది. ఆత్మారాం ని పిలిచి, 'ముందు బయటికి పో! ఎన్ని సార్లు చెప్పాలిరా వెధవా, కాళ్ళు కడుక్కుని యింట్లోకి రమ్మని?' గట్టిగా అరిచాడు. బిక్క మొహం వేసుకుని బయటికి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాడు. వాడితో బాటు బయటికొచ్చిన నాన్నకి , ఆత్మారాం కాలిమీద కాలు వేసి రుద్దడం కనపడింది. వెంటనే వుగ్ర రూపం దాల్చాడు. 'పాదం మీద పాదం పెట్టి రుద్దుకోవద్దని యెన్ని సార్లు చెప్పానురా?' అంటూ ఆత్మారాం ని గట్టిగా వొకటి పీకాడు. ఏడుస్తూ అమ్మ దగ్గిరకి వెళ్ళాడు ఆత్మారాం.

'పిల్లవాణ్ణి కొట్టద్దని యెన్నిసార్లు చెప్పాలండీ, మీకు? కాలు మీద కాలు వేసి రుద్దుకోకూడదని యెవరు చెప్పారు మీకు?...'

'మా నాన్న!... మంచి మాట యెవరు చెప్పినా వినాలి. నాలుగైదు సార్లు నెమ్మదిగానే చెప్తా. వినకపోతేనే వొకటి వడ్డిస్తా!... నువ్వెందుకు నా హితవు ని నీరుకారుస్తున్నావ్! ...'

'మీ హితవు!... పిల్లలకి చదువు పెద్ద స్ట్రెస్. మళ్ళీ మీ రూల్స్ మరో పెద్ద స్ట్రెస్!... పిల్లలని చూడండి కొంచం.'

భార్య చెప్పిన హితవు కి, వచ్చిన కోపాన్ని దిగమింగుకున్నాడు.

ఆ సంఘటనలు గుర్తుకొచ్చిన ఆత్మారాం నవ్వుకున్నాడు. నాన్న మీద కోపాన్ని పెంచిన ఆ సంఘటనలు అప్పట్లో తనలో నాన్న పట్ల కోపం పెంచి, ఆయన చెప్పిన వాటికి వ్యతిరేకంగా చేసేవాడు తను. కాలు మీద కాలు వేసి బలంగా, కచ్చగా రుద్దుతుండే వాడు. ముఫై ఐదేళ్ల వయసులో కావచ్చు. ఒక సాయంత్రం ఆఫీస్ నించి యింటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటున్నాడు. ఎప్పటిలా కాలు మీద కాలు వేసి రుద్దుకుంటుండగా బాలన్స్ తప్పి ముందుకు పడ్డాడు. నుదుటి మీద ట్యాప్ తగిలి గాయం అయింది. నెత్తురు కారుతుంటే భయం వేసి భార్య హాస్పిటల్ కి తీసికెళ్ళింది. నుదిటి మీద పది కుట్లు పడ్డాయి, రకరకాల టెస్ట్స్, డాక్టర్ ఫీజు కలిపి రెండు వేలయ్యింది. ఆ రోజు నాన్న కాళ్లు కడుక్కునే విషయంలో అంత పర్టిక్యులర్ యెందుకుండేవాడో అర్ధమైంది. రెండేళ్ళకి మళ్ళీ అలాగే జరిగింది. ఈ సారి డాక్టర్స్ మరికొన్ని టెస్ట్స్ చేసి, యేమీ లేదని తేల్చారు. ఆ సాయంత్రం కొలీగ్స్ తో కొంచం మందుకొట్టాడు. ఆ తర్వాత యింట్లో, కాలు మీద కాలు వేసి రుద్దడం, మళ్ళీ అదే విధంగా ముందుకు పడడం, ముందు పళ్ళు విరగడం జరిగింది. డెంటిస్ట్ కి వేలరూపాయలు సమర్పించుకున్నాడు. అప్పట్నుంచి కాళ్ళు కడుక్కోడమనే విషయం లో తండ్రి నియమం పాటించడం మొదలెట్టాడు.

3.

ఆత్మారాం టెన్త్ క్లాస్ లోకి ప్రవేశించడం నరకంలోకి ప్రవేశించడం తో సమానమైంది. తన అన్న చాలా సులువుగా టెన్త్ దాటి, ఇంటర్ రెండో సంవత్సరం లోకి వెళ్ళిపోయాడు. ఆత్మారాం కి నాన్న వొక సమస్య అయి కూర్చున్నాడు. రోజూ మానిటర్ చేస్తుండేవాడు. ఇంగ్లీష్ లో ట్యూషన్ పెట్టించాడు. టెన్త్ క్లాస్ భవిష్యత్తు కి గేట్వే అనేవాడు. ఆత్మారాం తెల్లవారు ఝామున లేవగలిగే వాడు కాదు. రాత్రి పన్నెండు దాకా అయినా కూర్చుని చదువుకోగలడు కానీ, పొద్దున్న యేడు గంటలకి ముందు లేవలేడు. నాన్న రోజూ ఆ విషయం లో తిట్టి పోసేవాడు. బ్రహ్మ ముహూర్తం లో లేచి చదువుకుంటే బుర్రలోకి బాగా యెక్కుతుందట ! బ్రహ్మ నుదిటి మీద రాసింది బ్రహ్మ ముహూర్తం మార్చగలదా, శ్రద్ధగా చదువుకోవాలి కానీ, యెప్పుడు చదువుకుంటే యేమిటి ? అసలే తన ఆరోగ్యం అంతంత మాత్రం. ఊళ్లోకి వచ్చే ప్రతి రోగం తనని పరామర్శించి వెళుతుంది. పైగా బలహీనంగా వుంటాడు తను . నాన్నే కదా టానిక్ లు కొనితెస్తుంటాడు! టెన్త్ సబ్జెక్ట్ ల కంటే నాన్నే యెక్కువ స్ట్రెస్ యిస్తున్నాడు . ఇలాంటి ఆలోచనలు మనసు నిండా పెట్టుకుని, తండ్రిని తిట్టుకుంటూ టెన్త్ సెకండ్ క్లాస్ లో గట్టెక్కాడు. ఆ రిసల్ట్ వఛ్చిన రోజు రణరంగమే!

'వీడు యెందుకూ పనికిరాని వెధవ. బ్రహ్మ ముహూర్తం లో లేచి చదువుకుంటే తొంభై శాతం మార్కులు వచ్చివుండేవి. వీడు ఎలా పైకి వస్తాడో, అర్ధం కావట్లేదు. ట్యూషన్ పెట్టించాను కాబట్టి ఇంగ్లీష్ లో నలభై మార్కులు వచ్చాయి; లేకుంటే ఫెయిల్ అయ్యేవాడే; నా పరువు తీసేవాడే!' అని అమ్మని అరిచాడు.

'సరేలెండి. మీరేం వెలగబెట్టారు?... ఐ ఏ ఎస్ పాస్ అయ్యారా?... ఎప్పుడూ వాడ్ని ఆడిపోసుకుంటారు!... అందుకే వాడు పరీక్షలు సరిగా రాయలేక పొయ్యుంటాడు.'

'నీ గారాబమే వాణ్ణి యిలా తయారు చేసింది!... వాడ్ని చెడగొట్టీదే నువ్వు!... ఈ సమయం లో చదువులో పెట్టే కష్టమే బంగారు భవిష్యత్తుకి పెట్టుబడి!... కానీయ్! … వాడి కర్మకి వాడే కర్త.... '

తలుపు చాటు నుండి అమ్మా నాన్నల సంభాషణ విన్నాడు ఆత్మారాం. కాసేపు మనసులో వుద్రేక పడ్డాడు. అమ్మని అన్ని మాటలన్నందుకు నాన్నని కొట్టాలనుకున్నాడు. కానీ తను ఆ పని చేయలేడని తెలుసు. నెమ్మదిగా అక్కడ్నించి నిష్క్రమించాడు.

తర్వాత ఇంటర్ లో యే గ్రూప్ యిప్పించాలో తర్జన భర్జన పడ్డాడు నాన్న. చాలా వాదోపవాదాలు అయ్యాక ఎం పి సి తీసుకోడానికి వొప్పుకున్నాడు. నిరాశ చెందిన నాన్న ఇంటర్ లో పెద్దగా మానిటర్ చెయ్యలేదు. పైగా పక్క వూరికి బదిలీ కావడం తో రోజూ అప్ అండ్ డౌన్ చేస్తుండే వాడు. పొద్దున్నే వెళ్ళి రాత్రి పదింటికి వచ్చేవాడు. దాంతో ఇంటర్ లో ఆయన నస తగ్గిపోయింది. ఆదివారాల్లో మాత్రం వాయిస్తుండేవాడు. వారానికి సరిపడా డోస్ యిచ్చే వాడు. ఆత్మారాం ఇంటర్లో యెనభై శాతం మార్కులతో పాస్ అయి, ఎంసెట్ లో సముచితమైన రాంక్ తెచ్చుకుని ఇంజనీరింగ్ లో చేరాడు.

ఇక ఆత్మారాం కి చిన్నప్పుడు నాన్న సూక్తి ముక్తావళి లో నచ్చని మరో అంశం యింటికి వచ్చిన పెద్దవాళ్ళ కాళ్ళకి మొక్కి, ఆసిర్వాదం తీసుకోమనడం. నాన్న చెప్పినందువల్లో, మరే కారణమో ఆత్మారాం కి అది సుతరామూ యిష్టం వుండేది కాదు. చాలా సార్లు నాన్న యింటికొచ్చిన ఆయన ఫ్రెండ్స్, చుట్టాలకి కాళ్ళకి దణ్ణం పెట్టమన్నప్పుడు, అలా చేయకుండా పరిగెత్తుకుంటూ బయటికి ఆటలకి వెళ్ళిపోయేవాడు. ఇంటికి వచ్చాక అక్షింతలు రెడీ గా వుండేవి!

'ఎన్ని సార్లు చెప్పాలిరా వెధవన్నర వెధవా! పెద్దవాళ్ళని గౌరవించాలానే యింగిత జ్ఞానం లేదా? ఎన్నిసార్లు చెప్పినా అర్థంకాదా? రెటమతమా ?... ఛీ...ఛీ... '

తలవంచుకుని నిలబడ్డాడు ఆత్మారాం. కడుపు రగిలిపోయింది. ప్రపంచం లోని పెద్దవాళ్ళందరూ చచ్చిపొతే బాగుణ్ణు, అనుకున్నాడు. నాలుగైదు రోజులు ఆ వుద్రేకం అతణ్ణి తినేసింది.

పడక్కుర్చీలో పడుకుని, ఆత్మావలోకనం లో పడ్డ ఆత్మారాం కి కళ్ళంట నీళ్ళొచ్చాయి. తను కస్టమర్ కేర్ లో పనిచేసే రోజుల్లో వయసులో పెద్దవాళ్ళని విసుక్కోడం, కోపం గా మాట్లాడ్డం చేసేవాడు. జనరల్ మేనేజర్ రెండుసార్లు తిట్టాడు. మరో రెండు సార్లు మెమో యిచ్చి, పనిష్మెంట్ యిచ్చాడు. తర్వాత లైఫ్ స్కిల్ ట్రైనింగ్ కి నామినెటే చేసింది కంపెనీ. లక్ష రూపాయలు ఫీజుకట్టి మరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి పంపారు. ఆ ట్రైనింగ్స్ వల్ల వచ్చిన మార్పు స్పష్టం గా కనిపించింది. ఇంటికి వచ్చిన బంధువుల్లో పెద్దవాళ్ళకి పాద నమస్కారం చేయడం మొదలెట్టాడు. తర్వాత భార్య యిచ్చిన ట్రైనింగ్ మరింత సమర్ధవంతంగా మార్చింది. తను కొద్ది కొద్ది గా పెరుగుతున్నప్పుడు వయసు విలువ తెలియసాగింది.

4.

తన నడకని కూడా తప్పు పెట్టేవాడు నాన్న. 'మెడ వంచి నడుస్తావెందుకు?...గూని వస్తుంది. ఇప్పట్నుంచైనా మెడ స్ట్రెయిట్ గా పెట్టి, స్ట్రెయిట్ గా నడు . చెప్పిన మాట వినడం నేర్చుకోరా!... నీ మేలు కోసమే చెప్తున్నాను!'అని ఎన్ని సార్లు కోప్పడ్డారో గుర్తులేదు. అయినా ఆయనకెందుకు నేనెలా నడిచేది? తల వంచుకుని నడవడం నా అలవాటు. అలా నడిస్తే తప్పు చేసిన వాడు నడిచినట్టుంటుందట ! తలవంచుకుని నడిస్తే తప్పు చేసినట్టా? ఆయన సూక్తి ముక్తావళి అర్ధం లేకుండా పోతోంది. ఏం చెప్తున్నారో ఆయనకైనా అర్ధమౌతోందా?.... అనుకుంటూ మనసులో ఆగ్రహించేవాడు ఆత్మారాం.

కంపెనీ వాళ్ళు రెండుమూడేళ్ల కోసారి మెడికల్ చెక్ అప్ చేయించేవారు. ఒకసారి ఆ చెక్ అప్ సమయం లో డాక్టర్ అడిగాడు, 'మీరు కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తుంటారా?' అని. 'ఫుల్ టైం కాదుకానీ, కంప్యూటర్ ముందు అప్పుడప్పుడు పనిచేస్తుంటాను,' అని చెప్పేసరికి, మెడకి ఎక్సరే రాసాడు.

ఆ ఎక్సరే చూసి డాక్టర్ సర్వికల్ స్పాండిలోసిస్ వుందన్నాడు . 'మీరు సరైన పోశ్చర్ లో నడవాలి; కూర్చోవాలి; పనిచేయాలి. సరైన పోశ్చర్ లేకనే స్పాండి లోసిస్ యింత తొందరగా వచ్చింది. ఫీజియో ని కలవండి. కొన్ని ఎక్సర్సైజస్ చెప్తారు, అవి చేయండి. కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు స్ట్రెయిట్ గా కూర్చుని పని చేయండి. అవసరం అనిపిస్తే కాలర్ పెట్టుకోండి!' అని చెప్పాడు. క్రమంగా అది పెరిగి దాదాపు పర్మనెంట్ గా కాలర్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడనిపించింది, నడిచే విధానం గురించి కూడా నాన్న యెందుకంత పర్టిక్యులర్ గా వుండేవారో, యెందుకలా తిట్టేవారో!

ఆత్మారాం తొమ్మిదో తరగతిలో కావచ్చు, వొక రోజు వొక వాస్తు నిపుణుడు యింటికొచ్చాడు. తండ్రి ఆయన కాళ్ళకి దణ్ణం పెట్టి, మంచి నీళ్ళు, కాఫీ తో సపర్యలు చేసాడు. ఆ వాస్తు పండితుడు యింటి ఆవరణలో వున్న నాలుగైదు చెట్లు వుండకూడదు, కొట్టేయమన్నాడు. వాటిల్లో తనకిష్టమైన వుసిరి చెట్టు, తను యెప్పుడూ అలవోకగా యెక్కేసే పొగడ చెట్టు వున్నాయి. ఆ మర్నాడు ఆ చెట్లని తండ్రి కొట్టించేస్తుంటే యేడ్చేసాడు ఆత్మారాం. ఆ వాస్తు పండితుడ్ని, తండ్రిని తిట్టుకున్నాడు ఆత్మారాం. చెట్లని కొట్టే వాస్తు యేమిటో అర్ధం కాలేదు. ఆ చెట్లలో కొన్ని యింటి బయట వుండాలిట, కొన్ని వుండకూడని దిక్కుల్లో వున్నాయట ! వాడు యెలా చెప్పగలిగాడో, యీయన యెలా కొట్టించ గలిగాడో అని ఆశ్చర్యం, దుఃఖం కలిగాయి ఆత్మారాం కి.

ఆ తర్వాత వొక రోజు ఆత్మారాం ఆడుకొని, పరిగెత్తుకుంటూ యింట్లోకొచ్చి, చెప్పులు విడిచి వంటింట్లోకి నీళ్ళ కోసం పరిగెత్తాడు. ఆరోజు నాన్న సెలవు పెట్టి యింట్లో నే వున్నాడని ఆత్మారాం కి తెలియదు. ఆత్మారాం లోపల చెప్పులు విడవడం చూసి, పిలిచాడు. ఒక్క క్షణం భయపడ్డాడు ఆత్మారాం. ఏమిటన్నట్టు నాన్న కళ్ళల్లోకి చూసాడు.

'ఆ చెప్పులు వరండా లో విడవాల్సింది, యిక్కడ విడిచావేంటిరా?' కోపంగా చూస్తూ అడిగాడు.

'దాహమేసి' అన్నాడు వణుక్కుంటూ.

'ఈశాన్యం మూల చెప్పులు విడుస్తావా?' అంటూ చెంప మీద కొట్టబోయాడు. ఇంతలో అమ్మ వచ్చి ఆయన్ని ఆపింది. 'మీ దిక్కులు, మూలలూ వాడికేం తెలుస్తాయండీ ? అర్ధం లేని పనులు!' అంటూ చూపుల్తొనే ఆత్మారాం ని అక్కడ్నించి వెళ్లిపొమ్మంది అమ్మ. అమ్మా నాన్నలు కొద్దిసేపు తిట్టుకున్నారు. బంగారం లాంటి చెట్లని కొట్టించడానికి మీకు మనసెలా వొప్పిందండీ, అంటూ బాధపడింది కూడా.

ఆ తర్వాత మరోసారి ఆత్మారాం చెప్పులు మళ్ళీ ఈశాన్యం మూల విడవడం, ఆ సారి నాన్న చేతిలో వొక దెబ్బ పడడం కూడా జరిగింది.

అలా వాస్తు మయమైన జీవితం గడిపి వుద్యోగ రీత్యా నగరానికి వెళ్ళిపోయాడు.

ఇది గుర్తు చేసుకుని నవ్వుకున్నాడు ఆత్మారాం. నాన్నకి యే యాభై యేళ్ళకో వాస్తు పిచ్చి పుడితే , తనకి నలభై కె ఆ వ్యసనం తగులుకుంది. యాభై లక్షలకి కొన్న కొత్త యింటిని వాస్తు పాటింపు కోసం మూడు విడతలు గా యిప్పటికి యెనిమిది లక్షలు ఖర్చు పెట్టాడు. కొద్ది రోజుల క్రితం మరో వాస్తు నిపుణుడు చూసి వుడ్ వర్క్ మార్చాలని చెప్పాడు. దానికి మూడు లక్షలకి కార్పెంటర్ కి కాంట్రాక్టు యిచ్చాడు.

తనకి నాన్న జీన్ వచ్చింది. నాన్నని యే విషయాల్లో తిట్టుకున్నాడో, ఆ విషయాల్ని పెద్దయ్యాక తనూ అనుసరిస్తున్నాడు. అప్పట్లో ఆయన చెప్పినవి కామ్ గా చేసివుంటే మనాదన్నా తగ్గి వుండేది, అనుకుని నిట్టూర్చాడు.

5.

'కాఫీ తీసుకోండి!' అంటూ భార్య కాఫీ కప్పు చేతికిచ్చింది. చెమర్చిన కళ్ళు భార్యకి కనపడకుండా జాగ్రత్త పడ్డాడు ఆత్మారాం. భార్య లోపలికి వెళ్ళాక లుంగీ తో కళ్ళు తుడుచుకున్నాడు. 'ఈ రోజు యీ విషయాలన్నీ యెందుకు గుర్తు కోస్తున్నాయో, అర్ధం కాలేదు. గడచిన పది, పదిహేనేళ్ళు గా అమ్మానాన్నలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు. భార్య వినయ విధేయతలు కలది కాబట్టి, అత్తామామల్ని మంచిగా చూసుకుంటుంది. ప్రతి రోజూ ఫోన్ లో మాట్లాడుతుంది. ఏటా నెల రోజులు వాళ్ళు యిక్కడికి రావడం, పది, పదిహేను రోజులు తాము అక్కడికి వెళ్ళడం ఆనవాయితీగా నడుస్తోంది.

ఇంతలో ఆత్మారాం కి మరో సంఘటన గుర్తుకొచ్చింది.

పదవతరగతి చదివే రోజుల్లో కావచ్చు, వొక రోజు పక్కింటి వెంకటేశం గాడు ఆత్మారాం ని బయటికి పిలిచాడు. చేతిలో వొక వుంగరం పెట్టి, 'ఆత్ము , దీన్ని నీ దగ్గిర దాచి పెట్టరా . నేను నాలుగైదు రోజుల తర్వాత తీసుకుంటాను,' అన్నాడు. '

'ఎక్కడిదిరా యిది?' అని అడిగాడు ఆత్మారాం.

'మా అన్నదిరా. వాడు నాకిచ్చాడు. నాలుగు రోజుల తర్వాత తీసుకుంటా అన్నాడు. నా దగ్గిర దాయడానికి ప్లేస్ లేదురా,' అని వాళ్ళింట్లోకి పరిగెత్తాడు.

మర్నాడు పొద్దునే కృష్ణ మూర్తి అంకుల్ వచ్చాడు. నాన్న వరండా లో వున్నారు. ఆఫీస్ కి బయలుదేరుతున్నారు.

'సుబ్బారావ్, ఆత్మారాం వున్నాడా?' అని అడిగాడు.

'ఏమిటి విశేషం?' అని అడిగాడు సుబ్బారావ్.

'మాది వొక బంగారు వుంగరం కనపడడం లేదోయ్ ... మా వెంకటేశం గాడ్ని అడిగితే యేదో నసిగాడు. అనుమానం వచ్చి రెండు పీకితే మీ అబ్బాయికి చూపించాట్ట. తర్వాత నించి కనపడ లేదని చెప్పాడు. ఆత్మారాం కి తెలుసేమో కనుక్కుందామని వచ్చాను. ఏమీ అనుకోకు...' అన్నాడు.

సుబ్బారావు కొంచం కఠినంగా అన్నాడు, 'మా వాడికి ఎన్ని అవలక్షణాలున్నా, దొంగతనం లేదోయ్ కృష్ణ మూర్తీ!'

'చ.. చ.. నా వుద్దేశం అదికాదు. మీ వాడి మీద నీకున్న కాన్ఫిడెన్స్ మావాడి మీద నాకు లేదులే!' అంటూ నవ్వాడు కృష్ణ మూర్తి.

వెంటనే ఆత్మారాం ని పిలిచి విషయం చెప్పి, 'వెంకటేశం నీకు వుంగరం చూపించాడా?' అని అడిగాడు. ఆత్మారాం కి కాళ్ళల్లో వణుకు మొదలైంది.

'ఇచ్చాడు నాన్నా. మా అన్నయ్య నీ దగ్గిర దాయమని యిచ్చాడు , అని చెప్పాడు నాన్నా,' అని భయం, భయం గా నాన్న వైపు చూసాడు.

'సరే. తీసుకురా. అంకుల్ వచ్చి అడిగాడు' అని ఆదేశించాడు. వెంటనే లోపలికి పరిగెత్తి నిముషం లో వుంగరం తెచ్చి తండ్రికిచ్చాడు. దాన్ని ఆయన కృష్ణమూర్తి కిచ్చి క్షమాపణ అడిగాడు. కృష్ణ మూర్తి వుంగరం తీసుకుని వెళ్ళిపోయాడు.

ఆత్మారాం వీపు పగలగొట్టాడు తండ్రి. 'వేరేవాళ్ళ వస్తువులు తీసుకోకూడదు, అని నీకెన్ని సార్లు చెప్పారా?.... నా మాటంటే లక్ష్యం లేదా? నా కడుపున చెడపుట్టావురా వెధవా! నువ్వు యింకెప్పుడు బాగుపడతావురా?' అంటూ కోపం తో వూగిపోయాడు . ఆత్మారాం పెద్దగా యేడుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. తల్లి సర్ది చెప్పి స్కూల్ కి తయారు చేసింది.

ఆ సంఘటన గుర్తొచ్చి, కొంచెం సేపు బాధ పడ్డాడు. అంత చిన్న విషయాల్ని అప్పట్లో అంత సీరియస్ గా యెందుకు తీసుకునే వారో, అనుకున్నాడు. మళ్ళీ చెమర్చిన కళ్ళని చేత్తో తుడుచుకున్నాడు. పడక్కుర్చీ లోంచి లేచి వొళ్ళు విరుచుకుని, గదిలోకి వెళ్ళబోయి, ఆగాడు. హఠాత్తుగా వొక విషయం గుర్తొచ్చింది. తన ఫ్రెండ్ శ్రీనివాస్ పదిరోజుల కిందట రెండు సూట్ కేసులు తెచ్చి, యింట్లో వుంచమన్నాడు . ఊరికి వెళ్తున్నామని, పదిరోజుల తర్వాత వచ్చి తీసుకుంటానని చెప్పాడు. పది రోజులైందిగా, యింకా రాలేదేమిటబ్బా, అనుకుని స్నానానికి వెళ్ళాడు.

స్నానం చేసి, పూజ చేసుకుంటున్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. భార్య తలుపు తీసింది. ఏవో మాటలు వినపడ్డాయి. అంతలోనే భార్య వచ్చి , 'ఇన్కమ్ టాక్స్ వాళ్ళటండీ, వచ్చారు. కూర్చోమని చెప్పాను,' అన్నది కొంచం కంగారుగా. ఈ జీతగాడి యింటికి ఐ టీ వాళ్ళు రావడమేమిటి, అనుకుంటూ పూజని అర్ధాంతరంగా ముగించి హాల్లోకి వచ్చాడు. మొత్తం ఆరుగురు వున్నారు. సోఫా నిండగా, మామూలు కుర్చీలో వొకడు కూర్చున్నాడు.

'ఆత్మారాం అంటే మీరేనా?' అని అడిగాడు వాళ్ళలో టై కట్టుకున్న వాడు.

'ఔనండీ . ఆ పేరుతొ యెక్కువ మంది వుండర్లేండి ,'అన్నాడు నవ్వుతూ ఆత్మారాం.

ఆ టై కట్టుకున్న వ్యక్తి తనను రాజారామ్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిచయం చేసుకుని, మిగిలిన ఐదుగుర్నీ పరిచయం చేసాడు. వారిలో ఇద్దరు ఐ టీ ఆఫీసర్లు. ముగ్గురు ఈ డీ ఆఫీసర్లు. కాఫీ తెమ్మని భార్యకి ఆర్డర్ వేసాడు. మంచి నీళ్ళు కావాలా అని అతిథుల్ని అడిగాడు.

ఆత్మారాం ఉద్యోగ, ఆదాయ వివరాలు అడిగి రాసుకున్నారు. కంగారు పడకుండా చెప్పాడు ఆత్మారాం. తనకేం భయం; తను యే తప్పూ చేయలేదు, అనుకున్నాడు తనకి తను ధైర్యం చెప్పుకుంటూ.

'మీ యింట్లో, లాకర్లలో సెర్చ్ చేయాలి. ఇదిగో సెర్చ్ వాఁరెంట్. మీకు శ్రీనివాస్ కి యేమిటి సంబంధం?'

విషయం అర్ధమైంది ఆత్మారాం కి.

'సర్, శ్రీనివాస్ నా క్లాసుమేట్. మేమిద్దరం స్నేహితులం...' అన్నాడు.

'శ్రీనివాస్ గారింట్లో సెర్చ్ జరుగుతోంది. అప్పుడు మీ వివరాలు కనపడ్డాయి. అందుకే సెర్చ్ వాఁరెంట్ తీసుకొచ్చాం' అన్నాడు టై వాలా.

'మేమిద్దరం యే ఆరునెల్లకో వొకసారి కలిసే స్నేహితులం. అంతే . మా మధ్య ఆర్ధిక లావాదేవీలేవీ లేవు. నా పేరెందుకు రాసాడు?'

'మీరు కూడా పార్టనర్ అన్నట్టు డీడ్ లో వుంది. ' అన్నాడు మళ్ళీ.

'లేదండీ. అతనికీ, నాకూ యెలాంటి ఆర్ధిక లావాదేవీలూ లేవు. అయితే యిప్పుడేం జరిగింది? టాక్స్ లు కట్టడం లేదా?' అడిగాడు ఆత్మారాం.

'అదే అయితే మీ దాకా వచ్చే వాళ్ళం కాదు. మీరంతా కలిసి స్టేట్ బాంక్ కి ఫేక్ టైటిల్ డీడ్ పెట్టి ప్రాపర్టీ ని మోర్ట్ గేజ్ చేసి, యాభై కోట్లు లోన్ తీసుకున్నారు,' అంటూ బాంబు పేల్చాడు టై వాలా.

'ఆ విషయాలేవీ నాకు తెలియదు. నేను యెక్కడా , యే డాక్యుమెంట్ మీదా సంతకం చేయలేదు. ఒకవేళ నా సంతకాలు యెక్కడైనా మీకు కనిపిస్తే అవి ఫోర్జ్ చేసినవే. ఆ విషయం లో కూడా వాడి మీద కేసు పెట్టుకోవచ్చు. ఇది దేవుడి సాక్షిగా చెప్తున్నాను. మీరు సెర్చ్ చేస్తే చేసుకోవచ్చు. మీ సాటిస్ఫాక్షన్ కి,' అన్నాడు ఆత్మారాం అత్యంత ఆత్మ విస్వాసం ప్రదర్శిస్తూ.

ఇంతలో భార్య కాఫీలు తెచ్చింది. కాఫీ తాగుతూ వాళ్ళల్లో వాళ్ళు గుసగుస లాడుకుంటున్నారు. ఆత్మారాంకి ఆ క్షణం లో రెండు ముఖ్యమైన విషయాలు గుర్తుకొచ్చాయి. ఒకటి: శ్రీనివాస్ రెండు సూట్ కేసులు తన దగ్గిర దాచాడు. సెర్చ్ లో అవి దొరికితే వాటిల్లో వుండే సరుకు ని బట్టి తను అరెస్ట్ కావచ్చు; కనీసం పద్నాలుగు రోజులు రిమాండ్ లో వుంచచ్చు ; రెండు: నాన్న పేకాట ఫ్రెండ్ శేషాచారి కొడుకు, తన ఇంజనీరింగ్ క్లాసుమేట్ విష్ణువర్ధన్ యిప్పుడు ఇన్కమ్ టాక్స్ కమీషనర్ గా యెక్కడో పనిచేస్తున్నాడు. వాడి ప్రస్తుత కాంటాక్ట్ నెంబర్ లేదు కానీ, వాడి పేరు వాడుకోవచ్చు. వెంటనే ఆత్మారాం వాళ్ళతో అన్నాడు, 'సర్, నాగురించి మీకు తెలియదు అనుకుంటూ చెప్తున్నాను, నేను చాలా నిజాయితీ గా పనిచేసే డెప్యూటీ జనరల్ మేనేజర్ ని. నా గురించి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి ఫరదర్ ఏక్షన్ తీసుకోండి. ఐటీ కమీషనర్ విష్ణు వర్ధన్ నా క్లాసుమేట్ . ఈ మధ్య టచ్ లో లేను కానీ, మేమిద్దరం మంచి స్నేహితులం,' అన్నాడు. లోపల గుండె వేగంగా కొట్టుకుంటోంది. శ్రీనివాస్ సూటుకేసులు తీసుకుని తన యింట్లో పెట్టుకోవడం చాలా పెద్ద తప్పు. ఆ కారణంగానే యిప్పుడు ఆత్మ రక్షణలో పడాల్సి వచ్చింది.

'ఓహ్! విష్ణువర్ధన్ నా బ్యాచ్ మెట్ . ఇప్పుడే మాట్లాడుతాను,' అని బయటికి వెళ్ళి , పది నిముషాల తర్వాత లోపలికి వచ్చాడు. ఈ లోగా ఈ డీ నుంచి వచ్చిన వాళ్లిద్దరు యిల్లు చూస్తామన్నారు. ఇద్దరికీ యిల్లంతా చూపించాడు. ఆ సూట్ కేసులు యెక్కడ పెట్టింది ఆత్మారాం కి గుర్తులేదు. గదుల్లో యెక్కడా కనిపించలేదు. భయం వొక వైపు, ఆ సూట్ కేసులు యెక్కడికి పోయాయో అనే ఉత్సుకత మరో పైపు. ఆత్మారాం ని ఆ క్షణం లో మరికొంచం భయపెట్టాయి. సూటుకేసుల్లో ఏమున్నా, వాటిని జాగ్రత్తగా వుంచాల్సిన బాధ్యత తన మీద వుంది కదా!

ఐ టీ వో లోపలి వచ్చి, ఈ డీ అసిస్టెంట్ డైరెక్టర్ తో యేదో మాట్లాడాడు. తర్వాత, ఆత్మారాం వైపు తిరిగి ,' విష్ణువర్ధన్ తో మాట్లాడాను. ఆయన యిప్పుడు ముంబై లో కమీషనర్ గా వున్నాడు. తన కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి. తనతో రాత్రికి వొకసారి మాట్లాడమని చెప్పాడు. మీ మీద మంచి రిపోర్ట్ యిచ్చాడనుకోండి. అయినా మీ సంతకాలు తీసుకుంటాం. మీ బాంక్ డీటెయిల్స్ కూడా తీసుకుంటాం. మీ సంతకం ఫోర్జరీ అయివుంటే అప్పుడు ఆలోచిస్తాం. నేనడిగినవన్నీ యివ్వండి . ఎల్లుండి మా ఆఫీస్ కి వచ్చి కలవండి,' అన్నాడు. అమ్మయ్య అనుకున్నాడు ఆత్మారాం. మనసులోనే దేవుళ్లందరికీ దణ్ణం పెట్టుకున్నాడు.

అందరూ వెళ్ళి పోయాక, భార్యని పిలిచి సూట్ కేసుల గురించి అడిగాడు. మొన్న పండక్కి యిల్లు శుభ్రం చేస్తుండగా అడ్డమొచ్చి, పైన అటక మీద పెట్టించానండీ, అన్నది. వాటిని సత్వరం మరో చోటికి షిఫ్ట్ చేయాలి, యీ రాత్రికే అనుకున్నాడు.

ఆ రాత్రికి విష్ణువర్ధన్ కి ఫోన్ చేసాడు. ఎవరి ఫోన్ అయినా ట్యాప్ అయివుండచ్చుకదా అని జాగ్రత్తగా, కొద్దిగా కోడెడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నారు. మర్నాడు శ్రీనివాస్ యింట్లో రైడ్స్ పూర్తయ్యాక, తనే వచ్చి సూట్ కేసులు తీసికెళ్ళి పోయాడు. కొంచం సేపు యిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీనివాస్ చేసిన పని నమ్మకద్రోహం అన్నాడు ఆత్మారాం. శ్రీనివాస్ సింపుల్ గా సారీ చెప్పి వెళ్ళి పోయాడు. తన యింటికి పెట్టుకున్న సి సి టీ వీ సిస్టం గుర్తొచ్చి దానిని కొంతసేపు బంద్ చేసి వుంచాడు. ఇంటిముందు కూడా కార్పొరేషన్ యింకా సి సి టీ వీ కెమెరా లు పెట్టలేదు కాబట్టి ఆ ఆధారం కూడా లేనట్టే. శ్రీనివాస్ సూట్ కేసులు తీసుకుని వెళ్ళాక హాయిగా నిట్టూర్చాడు ఆత్మారాం.

మూడు రోజుల తర్వాత భార్యని పిలిచి, ' మనం వొక పదిరోజులు నాన్న దగ్గిరకి వెళ్ళివద్దామోయ్ ,' అన్నాడు. అన్నదే తడవు, కుటుంబం తో సహా కారులో వూరు వెళ్ళాడు. వెళ్ళీ వెళ్ళగానే ఆమ్మానాన్నలకి పాదాభివందనం చేసి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాడు.

[సమాప్తం]

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం :

అందరికీవందనాలు.

చిన్నతనంనించి కథలురాయడం నాహాబీ. 15 వయేట మొదటికథ అచ్చయితే, 18 వయేట ఆంధ్రపత్రిక వారపత్రిక దీపావళికథల పోటీలోనా కథ 'విప్లవం' కి బహుమతి వచ్చింది. తర్వాత కొన్ని కథలు పత్రికల్లో వచ్చాయి. అక్కడితో సాహితీ ప్రస్థానం ఆగిపోయింది. కొన్నిసంవత్సరాల తర్వాత యీ మధ్య మళ్ళీ రాయడం మొదలెట్టాను. అయితే డిజిటల్ మీడియాలోనే రాస్తున్నాను. 2020 సంక్రాంతి సమయం లో ఒక కథకి [చెన్నైఅనే నేను] ప్రతిలిపిలో మూడో బహుమతి వచ్చింది. ఈమధ్య అందులోనే మరో కథ10 ఉత్తమ కథల్లో వొకటిగా నిలిచింది. గోతెలుగు డాట్కామ్ లో వొక హాస్య కథ ప్రచురింపబడింది. కొన్నిసంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రాయగలననే ఆత్మవిశ్వాసం కలిగింది.

'శిరిప్రసాద్' అనేకలం పేరుతో రాస్తుంటాను.

ఇంతకంటే చెప్పుకోతగ్గ విషయాలు లేవు. కృతజ్ఞతలు.


167 views0 comments

Comments


bottom of page