top of page

ఋణం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Runam' written by Siriprasad

రచన : శిరిప్రసాద్

తనను బాస్ అవమానించినా సంయమనం పాటించాడు రాజు.

అవసరమైన సమయంలో బాస్ కి సాయం చేసాడు.

అతని మంచి స్వభావానికి గుర్తింపు వచ్చిందా లేదా అనేది ప్రముఖ రచయిత శిరి ప్రసాద్ గారు రచించిన ఋణం కథలో తెలుస్తుంది.


"రాజూ!"


"సర్!"


"స్ట్రాంగ్ కాఫీ తీసుకురా!"


"అలాగే సర్!"


కాఫీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు రాజు.

కాఫీ సిప్ చేస్తూ రాజుని అడిగాడు వేణుగోపాల్ 'రాజూ, ఆఫీస్ విశేషాలేంటి?'

'ఏముంటాయి సర్ ?... అందరూ బిజీ గా పనిచేసుకుంటున్నారు!'

ఒక క్షణం సాలోచనగా రాజు వంక చూసాడు వేణుగోపాల్.

'నా గురించి స్టాఫ్ ఏమనుకుంటున్నారు?...'

'ఏమనుకుంటారు సార్!... వాళ్ళు పనిచేసేవాళ్ళు; మీరు చేయించుకునే వాళ్ళు!...'

'అందుకే ఏమనుకుంటున్నారో తెలిస్తే, మంచి మార్పులు తీసుకు రావచ్చు. అందరూ హాపీ గా పనిచేసుకోవచ్చు...'

'ఇప్పటికే మీరు టైమింగ్స్ లో స్ట్రిక్ట్ గా వుండేసరికి తిట్టుకోని వాడు లేడు ...'

'ఏం తిట్టుకుంటున్నారు?'


'మీరు చండశాసనుడని, అసలు యీయనకి భార్యాపిల్లలున్నారా అని, యీయన మనిషేనా, లేక రాక్షసుడే మనిషిగా జన్మ యెత్తాడా అంటూ రకరకాలుగా తిట్టుకుంటున్నారు. అవన్నీ తెలుసుకుంటే మీరు పని చేయలేరు. '


వికటాట్ట హాసానికి కొంచం అటూయిటూగా నవ్వాడు వేణుగోపాల్. 'ఎవరు అట్లా తిడుతోంది?...'


'ఎవరని చెప్తాను?... అందరూ తిడుతూనే వుంటారు. మీ లాంటి వాళ్ళుంటే, కంపెనీ దివాళా తీస్తుందట!'


'పని చేస్తే లాభాలు పెరగాలికానీ, దివాళా తీయడం ఏమిటి?'


'అంటే... సంతోషం గా పనిచేస్తే వేరు, ఏడుస్తూ పనిచేస్తే వేరు, అంటుంటారు...'

'ఒక్క టైమింగ్స్ ఫాలో అవ్వమంటేనే యిలా ఏడిస్తే, తర్వాతి సంస్కరణ లకి ఏమైపోతారో?!...'


'ఇంకా ఏం చేయబోతున్నారు సార్?'


'చాలా వున్నాయ్. తర్వాత చెబుతాను...'


వీడు తన దగ్గిర ఇన్ఫర్మేషన్ లాగడమే కానీ, తను ఏమీ చెప్పి చావడు, అనుకుంటూ రాజు క్యాబిన్ నించి బయటికెళ్ళాడు.


రాజు వెళ్ళిన కొద్దిసేపటికి అకౌంటెంట్ ని పిలిచాడు వేణుగోపాల్.


'రామం గారు, యీ రాజుకి యెంత శాలరీ పే చేస్తున్నాం?'


'ముఫై వేలు సర్ '


'ఈ కాంటీన్ వాడెందుకు నడుపుతున్నాడు? ఆఫీస్ పని చేయకుండా ..... '


'మన స్టాఫ్ యాభై మందే కదా సర్ . కాంట్రాక్టర్ కోసం రెండు సార్లు యాడ్ యిచ్చాం . గిట్టుబాటు కాదని యెవరూ ముందుకు రాలేదు. రాజు తనే నడుపుతానన్నాడు. '


'కాఫీ అంటే యిక్కడే చేస్తాడు. మధ్యాన్నం స్నాక్స్ యెప్పుడు చేస్తాడు? ఆఫీస్ పని ఎగ్గొట్టి?'


'స్నాక్స్ కి ముడిసరుకు యింటి దగ్గిర చేసి తెస్తాడు. ఒక గంటలో చేసేస్తాడు. రెండు ఐటెమ్స్ మాత్రమే... ఆఫీస్ పని మాట రాకుండా చేస్తున్నాడు.'


'కాంటీన్ పనికి యెంత యిస్తున్నాం ?'


'ఒక పదివేలు మిగులుతుందేమో సర్ ... '


'నో... నో... కాంటీన్ కి వేరే కాంట్రాక్టర్ ని అరెంజ్ చేస్తాను. నెక్స్ట్ మంత్ నించి వాడు ఆఫీస్ వర్క్ మాత్రమే చెయ్యాలి '


'ఓకే సర్ ... '


రామం బయటికి వెళ్ళి పోయాడు.


సేఫెక్స్ ఫార్మా హైదరాబాద్ ఆఫీస్ కి ఇన్ ఛార్జ్ వేణుగోపాల్. ఈ మధ్యే ముంబై నించి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు.


రాజు టెన్త్ క్లాస్ తో చదువు ఆపేసి యిక్కడ అటెండర్ గా వుద్యోగం లో చేరాడు.


నిజానికి రాజు, వేణుగోపాల్ టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్ లో క్లాసుమేట్స్. డబ్బుల్లేక రాజు టెన్త్ తో చదువు ఆపేసాడు. రాజు ఎప్పుడూ స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు. వేణుగోపాల్ తండ్రి రాజు తో తనని పోలుస్తుండేవాడని వేణుగోపాల్ కి ఉక్రోషం వుండేది. రాజు చదువు ఆపేసినప్పుడు చాలా సంతోష పడ్డాడు. ఇక వేణుగోపాల్ చదువు అప్రతిహతంగా కొనసాగింది. ఎం ఫార్మా చదివి, ఐ ఐ ఎం , బెంగుళూరు లో మానేజ్మెంట్ కోర్స్ చదివి మంచి వుద్యోగం సంపాదించుకున్నాడు. మూడు కంపెనీలు మారి, మూడేళ్ళ క్రితం సేఫెక్స్ లో చేరాడు. నెలకి మూడు లక్షలు జీతం, మరో లక్ష వసతులు, బోనస్ గా యేటా ఐదారు లక్షలు సంపాదిస్తున్నాడు. కంపెనీ కార్లో దర్జాగా తిరుగుతుంటాడు.

భార్య కూడా వున్నత కుటుంబానికి చెందినది. ఇద్దరు పిల్లలు.


హైదరాబాద్ ఆఫీస్ కి మూడు వారాల క్రితం ట్రాన్స్ఫర్ అయినప్పుడు తండ్రి, 'వెరీ గుడ్ వేణూ ! ఇక్కడ నీకు ఎలాంటి సమస్యలూ వుండవు. నీ హై స్కూల్ క్లాసుమేట్ రాజు మీ ఆఫీస్ లోనే అటెండర్ గా పనిచేస్తున్నాడు. నీకు యే సమస్యా లేకుండా చూసుకుంటాడు. వాడుండేది కూడా మన యింటికి దగ్గిర్లోనే!' అన్నాడు.


కడుపు మండిపోయింది వేణుగోపాల్ కి. 'ఒక అటెండర్ నాకు సమస్యలు లేకుండా చూసుకోవడం యేమిటి? నాన్నకి మైండ్ దొబ్బిందా యేమిటి ?' అని మనస్సులోనే అనుకున్నాడు.


రాజు మొదట్లో వచ్చిన యిరవై వేల జీతం తోనే , పెళ్ళి చేసుకుని, ముగ్గురు పిల్లల్ని కన్నాడు. తన తల్లితండ్రుల్ని దగ్గిరే వుంచుకుంటూ , పొదుపుగా అందరి అవసరాలూ తీరుస్తున్నాడు. ఎప్పుడు కూలుతుందో తెలియని పాత యింట్లోనే వుంటూ కూరగాయల మొక్కలు వేసి ఆ మందం ఖర్చులు తగ్గించుంటూ, అదనపు సంపాదన కోసం అవకాశాలు వచ్చినప్పుడు, వాటిని వుపయోగించుకుంటూ , కొద్ది కొద్దిగా కూడబెడుతున్నాడు. పిల్లలు తన లాగా టెన్త్ తో చదువు ఆపేయకుండా పెద్ద చదువులు చదివి, మంచి వుద్యోగాలు చేయాలని అతని ఆకాంక్ష. జీతం ముఫై కి పెరిగింది. రెండేళ్లుగా కాంటీన్ నడుపుతూ నాలుగు లక్షలు బాంక్ లో వేసుకున్నాడు.

***

మర్నాడు ఆఫీస్ లో…

'సర్ !...'


'చెప్పు రాజూ!'


'కాంటీన్ కి వేరే కాంట్రాక్టర్ ని పెడుతున్నారట , నిజమేనా?'


'నిజమే!... నువ్వు ఫుల్ కాన్సంట్రేషన్ తో జాబ్ చేయాలి. అందుకే!'


'మీ నిర్ణయమేనా? ...ఆఫీస్ లో ఎవరన్నా చెప్పారా?'

'నా నిర్ణయమే. ఎందుకు?'


'ఏంలేదు సర్ ... మన స్టాఫ్ లో యెవరైనా నవ్వుతూ, నవ్వుతూ నా నడ్డి విరక్కొడుతున్నారేమో అని అనుమానం ... ఓకే సర్ !' అంటూ కేబిన్ డోర్ ని వేగంగా వేసుకుంటూ, బయటికి వెళ్ళాడు రాజు.


వేణుగోపాల్ నవ్వుకున్నాడు. ఈ వెధవ నడ్డి విరక్కొట్ట డానికే హెడ్ ఆఫీస్ తననిక్కడికి పంపిందనుకుంటా, అనుకుంటూ, మళ్ళీ మళ్ళీ నవ్వుకున్నాడు.


ఆఫీస్ లో స్టాఫ్ అందరూ వేణుగోపాల్ నిర్ణయానికి అవాక్కయ్యారు. రాజు పట్ల సానుభూతిని వర్షించారు. యూనియన్ వాళ్ళు కొట్లాడతామన్నారు. వద్దన్నాడు రాజు. కాంటీన్ నడపడం తన ఉద్యోగ బాధ్యతల్లో లేదు. దానిపై తనకి యెటువంటి హక్కూ లేదు. తనకి కష్టకాలం మళ్ళీ మొదలైందనుకున్నాడు. ఇలాంటి సమయాల్లోనే సంయమనం పాటించాలి. అదే తనకు తండ్రి చెప్పిన సత్యం. 'కష్టాలు దేవుడు పెట్టే పరీక్షలురా, వాటిల్లో పాసైతే సుఖాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయిరా!' అంటుంటాడు తండ్రి. మంచి రోజుల కోసం యెదురు చూడడమే తను చేయాల్సిన పని, అనుకున్నాడు. ఇష్ట దైవానికి మనస్సులోనే నమస్కరించుకున్నాడు.


వేణుగోపాల్ రిటైల్ డివిజన్ ఇన్ ఛార్జ్ సుమతిని ఇంటర్ కామ్ లో రమ్మని పిలిచాడు. సుమతి వయ్యారంగా నడుస్తూ క్యాబిన్ లోకి వచ్చింది. ఆమెని కూర్చోమని సంజ్ఞ చేసాడు.

'సుమతీ! చాలా మంది రిటైలర్స్ వచ్చిపోతున్నారెందుకు ?'


'ఎస్సెన్షియల్ , ఎమర్జెన్సీ డ్రగ్స్ వాళ్ళకి డైరెక్ట్ గా సప్లై చేస్తుంటాం కదా!... మన డిస్ట్రిబ్యూటర్స్ నించి ఫోన్ వస్తుంది, మనం సప్లై చేస్తాం.'


'ఓకే. లాస్ట్ టూ మంత్స్ లిస్ట్ కావాలి నాకు.'


'ఓకే సర్ !' అంది వయ్యారంగా పమిట సర్దుకుంటూ.


'ఈ ఆఫీస్ విశేషాలు ఏమిటి?' వుత్సాహంగా అడిగాడు వేణుగోపాల్. సుమతి కొంచం లూజ్ అనిపించింది. అందుకే సంభాషణని కొనసాగించాడు.


'ఏముంటాయి సార్ ... మీరు ఇల్లు తీసుకున్నట్టున్నారు ... '


'అవును . బంజారా హిల్స్ లో. లీజ్ అగ్రిమెంట్ సైన్ అయింది.'


'ఫామిలీ షిఫ్ట్ చేస్తారా?'


'చెయ్యాలి కదా!... సమ్మర్ లో షిఫ్ట్ చేస్తా. ముంబై లో వున్నారు. నా భార్య కూడా జాబ్ చేస్తుంది. తనకి కూడా ట్రాన్స్ఫర్ కావాలి కదా ! ‘


'మీ పేరెంట్స్ యిక్కడే వుంటారట కదా!'


'మా ఫాదర్ వుంటాడు. వంటమనిషి, ఒక ఆయా ని యేర్పాటు చేసాను. హి యీజ్ హ్యాపీ . ఆ యిల్లు చాలా పాతది. సరిపోదు. మన కంపెనీ, నా పోస్ట్ స్టేటస్ ని మెయిన్టయిన్ చేయాలి కదా!... ఎం డీ ఇన్స్ట్రక్ట్ చేసాడు. మీరు ఎక్కడ వుంటారు?'


'నేను మాసాబ్ ట్యాంక్ లో. '


'ఓహ్!... మీరు యెవరెవరు వుంటారు?'


'మా మదర్ నాతొ వుంటుంది. నేను డివోర్సీ ని.

'

'అదేంటి?'


'వాడు రోజూ నాతొ తగాదా పెట్టుకునే వాడు. అనుమానం మనిషి. ఉద్యోగం మానేస్తానంటే వద్దనే వాడు. వాడి శాలరీ అంతా వాడే ఖర్చు పెట్టుకునే వాడు. '


'ఓహ్, సారీ సుమతీ!... మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుడం లేదా?'


'లేదు. మీ లాంటి జెంటిల్ మాన్ దొరికితే ఆలోచిస్తా!' అంటూ చిలిపిగా నవ్వింది. ఆ నవ్వుకి ఫిదా అయిపోయాడు వేణుగోపాల్.


' ఈ సండే కలుద్దాం. వియ్ విల్ హావ్ లంచ్ టుగెదర్. నేను వుంటున్న హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ . లంచ్ బాగుంటుంది'' సుమతి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి జవాబు కోసం చూస్తున్నాడు.


'తర్వాత చెప్తాను - నాలుగు రోజులుందిగా!... '


సండే అన్నందుకు తనని తిట్టుకున్నాడు. ఈరోజే డిన్నర్ కి పిలిచి వుండాల్సింది అనుకున్నాడు.


'అటెండర్ రాజు రిటైలర్స్ తో తెగ మాట్లాడుతుంటాడు. వాడికేం పని?'


సుమతి యిదే మంచి అవకాశం అనుకుంది. రాజు తన వర్క్ లో తెగ ఇంటర్ ఫియర్ అవుతుంటాడు. తనని చాలా సార్లు యిబ్బంది పెట్టాడు. బ్లాక్ లో అమ్మే డ్రగ్స్ లో తనకి రావాల్సిన వాటా వాడే కొట్టేస్తున్నాడే మో అని తనకి అనుమానం.


'అవును సర్. మీ ముందు పనిచేసిన రామన్ రాజుకి అలుసిచ్చాడు. ఈ రాజుకి అరవం రావడం తో వాళ్లిద్దరూ యెప్పుడూ అందరి గురించి చెప్పుకుంటుండే వాళ్ళు. చాలా చిరాకుగా వుండేది !... '


'నా గురించి ఏమైనా చెప్పాడా?' అడిగాడు వేణుగోపాల్.


'మీరు స్ట్రిక్ట్ అని, యెవ్వరి మాటా వినరని చెప్పాడు. చూస్తే మీరు మంచివారులా కనిపిస్తున్నారు ... '


'వాడ్ని దూరం పెట్టేసేయ్. రిటైలర్స్ దగ్గిర డబ్బులు తీసుకుంటున్నాడేమో!... ఎంక్వయిరీ చెయ్యి. అటెండర్లకి ప్రాముఖ్యం యివ్వడమేమిటి? ఆ రామన్ గాడు క్లర్క్ నించి యీ స్థాయికి వచ్చాడు. అలాంటి వాళ్లకి డీసెన్సీ, డిగ్నిటీ వుండవు. ఎనీవే, నువ్వు వెళ్ళచ్చు . ఒకవేళ డిన్నర్ కి ప్రాబ్లెమ్ లేదంటే యివ్వాళో, రేపో వెల్దాము.....' అని సుమతి వైపు కొంటెగా చూసాడు.


'రేపు మార్నింగ్ చెప్తాను సార్ !' అని క్రీగంటి తో చిలిపి చూపు వొకటి వేణుగోపాల్ కి విసిరింది. దాన్ని వొడిసి పట్టుకుని గుండెల్లో దోపేసుకున్నాడు. చాలా యీజీగా పడిపోయిందే , అనుకున్నాడు.


***

మర్నాడు అనుకున్న ప్రకారం వేణుగోపాల్ సుమతిని తన హోటల్ రూమ్ కి తీసికెళ్ళాడు. ఇద్దరూ ఆఫీస్ వ్యవహారాల గురించి మాట్లాడుకున్నారు.

అరగంట అయ్యాక, 'కాఫీ తాగుతారా, కొంచెం స్కాచ్ తీసుకుంటారా,' అని సుమతిని అడిగాడు.


సుమతి వుబ్బి తబ్బిబ్బయింది. వేణుగోపాల్ తర్వాత యేమి అడగబోతాడో వూహించుకుంది. రామన్ కి తను లైన్ వేసే ప్రయత్నం చాలాసార్లు చేసింది. కానీ వాడు పడలేదు. నుదుటి నిండా విభూతి, మధ్యలో బొట్టు పెట్టుకుని యెప్పుడూ యేదో చదువుకుంటుండేవాడు. ఈ యుగానికి చెందినవాడు కాదు. బట్, దిస్ ఫెల్లో వేణుగోపాల్ యెలాంటి ప్రయత్నం లేకుండా పడిపోయాడు. ఎంజాయ్ చేస్తే సరి. వీడు నా బుట్టలో పడితే, ఆఫీస్ అంతా తన కంట్రోల్ లోకి వస్తుంది. తన మీద కామెంట్లు చేసే వెధవలందరికీ పాఠం చెప్పాలి. డబ్బు సంపాదికోవచ్చు.


'స్కాచ్ తాగుదాం. చాలా రోజులైంది... ' నసిగింది. నసుగుతూ వేణుగోపాల్ ని క్రీగంట మత్తుగా చూసింది.


స్కాచ్ తాగి యిద్దరూ సాత్వా పరుపుతో విలాసవంతం గా వున్న డబల్ బెడ్ మీద వీర విహారం చేశారు. మళ్ళీ మరో డ్రింక్, మళ్ళీ మరో అనుభవం. తర్వాత ఫ్రెష్ అప్ అయి, బఫె డిన్నర్ కి వెళ్ళి ప్రత్యేక మైన ఐటమ్స్ అన్నీ లాగించారు. సమయం రాత్రి పదిన్నర దాటింది. వేణుగోపాల్ సుమతి ని వాళ్ళింటి దగ్గిర డ్రాప్ చేసాడు. ఇంటి ముందు చీకట్లో కారు లోనే ఒక దీర్ఘమైన ఫ్రెంచ్ కిస్ యిచ్చి , విజయగర్వం తో హోటల్ కి బయల్దేరాడు. రాత్రికి మంచి నిద్ర పడుతుంది, అనుకున్నాడు.


ఇంతలో ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టినట్టు గుర్తొచ్చి , ఆన్ చేసాడు. తండ్రి ఫోన్ నించి చాలా మిస్డ్ కాల్స్ వున్నట్టు మెసేజ్ చూసాడు. ఇంత రాత్రివేళ చేస్తే తండ్రికి నిద్రాభంగం అవుతుందనుకున్నాడు.


ఇంతలో మళ్ళీ తండ్రి నించి ఫోన్.

ఏమై వుంటుందబ్బా అనుకుంటూ ఆన్సర్ చేసాడు. అవతలి వైపు రాజు. వాడక్కడేం చేస్తున్నాడు, అనుకుంటూ, 'చెప్పు రాజూ! .. నువ్వు డాడీ నెంబర్ నించి చేస్తున్నావేమిటి?...'


'సాయంత్రం నించి ట్రై చేస్తున్నాం సార్. హోటల్ కి కూడా చేసాం. మీరు రూమ్ లో లేరని చెప్పారు. '


'సరే, యింతకీ యెందుకు చేస్తున్నావ్?' చిరాగ్గా అడిగాడు.


'అర్జెంటు గా ఓమ్ని హాస్పిటల్ కి రండి. డాడీ .... '


'డాడీ... ?'


'ఇక లేరు ...'


హతాశుడయ్యాడు వేణుగోపాల్.


'ఎలా?'


'హార్ట్ ఎటాక్ ... మీరు ఫోన్ ఎత్తక పొతే, డాడీ నాకు చేశారు. నేను వెంటనే వెళ్ళి , అంబులెన్సు లో తీసుకొచ్చాను. మీకు యేదో చెప్పాలని అనుకున్నారు. నాకు చెప్పేందుకు టైం లేదు ...'



***

కారు 120 కి. మీ. వేగంతో డ్రైవ్ చేస్తూ హాస్పిటల్ కి చేరుకున్నాడు వేణుగోపాల్. అప్పటికే అక్కడ తండ్రి మిత్రులు ఐదారుగురు వున్నారు. రాజు వేణుగోపాల్ దగ్గిరకి వఛ్చి తండ్రి శవం దగ్గిరకి తీసికెళ్ళాడు. ఒక్కసారి గా గుండె పగిలేలా యేడ్చాడు . తండ్రి కాళ్ళు పట్టుకుని తనలో తను గొణుక్కుంటూ తండ్రికి క్షమాపణలు చెప్పుకుంటున్నాడు. అరగంట గడిచాక, తమాయించుకుని అక్కడి డాక్టర్ ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు.


హాస్పిటల్ బయటికొచ్చి తండ్రి మిత్రుల దగ్గిర కొద్ధి సమయం గడిపాడు. శవాన్ని ఆ రాత్రికి అక్కడే మార్చువరీ లో వుంచి వుదయాన్నే యింటికి తీసికెళ్ళాలని నిర్ణయించారు. అత్యంత దగ్గిర బంధువులకి తండ్రి ఫోన్ నించి మెసేజెస్ పెట్టాడు.


'రాజూ, యింతకు ముందు గుండె సమస్యలున్నాయని యెప్పుడైనా చెప్పారా, నాన్న?'


'ఏమీ లేవు వేణు. చాలా ఆరోగ్యాంగానే వుండేవారు . ఒక్కసారే యిలా ముంచుకొచ్చింది. ఛాతీలో నొప్పి గా వుంది, వొకసారి రా, అని ఫోన్ చేశారు. ఒకే ఒక్క నిముషంలో అక్కడికి చేరుకున్నాను. వెంటనే అంబులెన్సు కి ఫోన్ చేసి ఛాతీ మీద మర్దన చేసాను. బాగానే వున్నట్టు కనిపించారు. పావు గంటలో హాస్పిటల్ లో వున్నాము. మన కంపెనీ తో టై అప్ వుండడం వల్ల వెంటనే ట్రీట్మెంట్ మొదలెట్టారు. అరగంట సేపు బతికే వున్నారట. మళ్ళీ ఎటాక్ రావడం తో పోయారు. నీకు యేదో చెప్పాలన్నారు. చెప్పలేక పోయారు. నాతొ వొక్క విషయం చెప్పగలిగారు, తన ఫ్రెండ్స్ కి వెంటనే చెప్పమని. వేణూ, నువ్వు దొరక లేదు. చివరి చూపు దొరికితే బాగుండేది. కనీసం వంద సార్లు ఫోన్ చేసాను. చివర్లో హోటల్ వాళ్ళు, అప్పుడే బయటికెళ్లావని చెప్పారు...'


'థాంక్స్ రాజూ. నువ్వైనా సమయానికి అటెండ్ అయ్యావు. నాకు ఆ అదృష్టం లేదు ... ఈ కర్మలు అన్నీ నువ్వే చూసుకోవాలి. నాకు అస్సలు తెలియదు...'

'మొత్తం నేనే చూసుకుంటా. అన్నీ ఏర్పాట్లూ చేస్తాను. వేణూ, హాస్పిటల్ లో బిల్ సెటిల్ చేసుకు రా!'


రాత్రి రెండున్నరకి యింటికి చేరుకున్నారు వేణుగోపాల్, రాజు. భార్యకి ఫోన్ చేసి మొదటి ఫ్లైట్ లో వచ్చేయమని చెప్పాడు వేణుగోపాల్. నిద్రపట్టకపోవడంతో వేణుగోపాల్ తండ్రి గదిలో వస్తువులని పరికించాడు. ఒక డైరీ కనపడింది. అందులో తండ్రి యేవేవో రాసుకున్నాడు. ఒక చోట అతని దృష్టి నిలిచిపోయింది.


'రాజు కి నేను ఋణపడిపోతున్నాను. ఒక కొడుకు కంటే యెక్కువగా చూసుకుంటున్నాడు. వాడి పై చదువులకి సహాయపడ లేకపోయానే అనే బాధ అప్పట్నుంచీ నన్ను పీడిస్తూనే వుంది. వాడికి ప్రాప్తం లేదనుకుంటా. వేణు కి చెప్పి వాడికి ప్రమోషన్ యిప్పించాలి; జీతం యెంత వీలైతే అంత పెంచమని చెప్పాలి. అయినా వాడి ఋణం తీరదు. ఆరునెలల క్రితం జబ్బు పడ్డప్పుడు మంచంలో వున్న వారం రోజులు కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆ పరమాత్మే వాడికి మేలు చేయాలి.'


అది యెనిమిది నెలల క్రితం రాసుకున్నట్టు కనిపిస్తోంది. పోతానని తెలుసేమో నాన్నకి! నిట్టూర్చాడు. తన తండ్రి రాజుకి ఋణ పడిపోతే, తను తండ్రికి ఋణ పడిపోయాడు. ఆ సమీకరణం తో తను చేయవలసింది అర్ధమైంది వేణుగోపాల్ కి.


మనసంతా ఖాళీ గా అనిపించింది. ఇప్పుడు తండ్రి పోవడం తో తను అనాధ అయినట్టు అనిపించింది. తండ్రి శాశ్వతం గా వుండిపోయే ఒక భరోసా అనుకున్నాడు. ఇప్పుడు సడెన్ గా ఆ భరోసాని దేవుడు లాగేసుకున్నట్టనిపించింది. ఆయనతో చెప్పాలనుకున్న వూసులు, చూపించాలని అనుకున్న ప్రేమ, ఆయన ఆశీస్సులతో సమాజం లో పెరిగిన తన స్థాయి, అనూహ్యం గా పరిమళించిన తన జీవన స్థాయి, అన్నీ అర్థం లేని వ్యర్థాలు గా కనిపిస్తున్నాయి. తండ్రి లేని భవిష్యత్తు ఒక క్షణం అగమ్యగోచరం గా కనిపించింది.


వారం రోజులు జబ్బు పడ్డట్టు తనకి తెలియనీయ లేదు. తను ఆందోళన చెందుతాడనా, ముంబై లో వున్న తనకి ఇబ్బంది కలగకూడదనా, సెలవు పెట్టాల్సి వస్తుందనా, ఏదో మంచి ఉద్దేశమే అయివుంటుంది. రాజు పక్కనున్నాడనే ధైర్యం కూడా కావచ్చు. తండ్రికి సేవ చేసుకోగలిగే రెండు అవకాశాలు చేజారి పొయ్యాయి! ధారలుగా కారుతున్న కన్నీళ్ళ ని తుడుచు కోకుండా వదిలేశాడు.


మర్నాడు కార్యక్రమాలన్నీ దగ్గిరుండి రాజు నే చూసుకున్నాడు. అతని సమర్ధత కి ఆశ్చర్యం వేసింది వేణుగోపాల్ కి. అన్ని పనులు, బాధ్యతలు వొక్కడే అద్భుతంగా నెరవేర్చడం రాజు పట్ల అతని మనస్సులో వున్న యీర్ష్య ని దూరం చేసి గౌరవాన్ని పెంచింది. ఎం బీ ఏ వుండి తను ఒకసారి ఒక పనే చేయగలడు. టెన్త్ క్లాస్ వాడు యింత సమర్ధత కనపరచడం ఆశ్చర్యమే. అందుకే తండ్రి అన్నాడు తనకి హైదరాబాద్ బదిలీ అయినప్పుడు, రాజు వున్నాడు, టెన్షన్ పడకు అని. అది యీ రకంగా నిజమైంది. హాట్స్ ఆఫ్ రాజూ అనుకున్నాడు మనస్సులో.


పన్నెండు రోజుల కార్యక్రమాలు సజావుగా సాగిపోయాయి.

ఆఫీస్ లో మళ్ళీ ప్రవేశించిన వేణుగోపాల్కి తనలో పన్నెండు రోజుల క్రితం వున్న ఫైర్ కనపడలేదు. విచారం, గిల్ట్, శిక్ష అనుభవించి ఖైదు నించి బయటికొచ్చిన భావం. అసంతృప్తి, యింకా గుండెలో బయటికి రాకుండా మిగిలిపోయిన నీరు గుండెని బరువెక్కిస్తూ, యింకా తడి ఆరని కళ్ళు ,అనేక భావాలు.


పది రోజుల తర్వాత రాజు ని తన కేబిన్ లోకి పిలిచాడు వేణుగోపాల్.


'రాజూ, యీ ఆర్డర్ తీసుకో...' అని ఒక కాగితం రాజు చేతుల్లో పెట్టాడు.


అది చదివిన రాజు కళ్ళల్లో ఆనందం కనిపించింది. అంతలోనే ఆ కాగితం తిరిగి వేణుగోపాల్ కి యివ్వబోతూ, 'వేణూ, యిప్పుడీ ప్రమోషన్ యేమిటి ? థాంక్స్ చెపుతున్నాను కానీ, అందరూ యేమనుకుంటారు ? కర్మల్లో నీకు హెల్ప్ చేసినందుకు నాకు ఫేవర్ చేసావనే చెడ్డ పేరు వస్తుంది నీకు. అది నా కిష్టం లేదు. మీ నాన్న గారు నాకూ తండ్రి లాంటి వాడే. నేను చేసిన సహాయం సహాయం కాదు. నా బాధ్యత అనుకున్నాను. '


'లేదు రాజూ. ఇంతకాలం నేను యితరులు ఏమనుకుంటారో అని యే వొక్కరికీ వాళ్ళకి దక్కాల్సిన న్యాయం కూడా చేయలేదు. ఇకనుంచి నేను నా కోసం బతుకుతాను. నాకోసం అంటే యితరులేమనుకుంటారో అనే సంశయం వదిలి, నాకు సబబనిపించిన నిర్ణయాలు తీసుకుంటాను. ఈ వుత్తర్వులు తీసుకో. రామన్ టైమ్ లోనే నీ ప్రమోషన్ విషయం కొంతకాలం నడిచింది. నేను స్పీడ్ పెంచి వారం లోగా హెడ్ ఆఫీస్ నించి ఆర్డర్స్ తేగలిగాను. ఇది రామన్ చేసిన హెల్ప్ అనుకో!'


వణుకుతున్న చేతులతో ఆర్డర్ తీసుకున్నాడు. ఆనంద భాష్పాలతో ధన్యవాదాలు తెలియచేసుకున్నాడు రాజు. జీతం యిరవై వేలు పెరుగుతుంది. అంటే తన జీవితం లో ఒక్కసారే రెండు మూడు మెట్లు యెక్కినట్టు.


వేణుగోపాల్ హైదరాబాద్ లో పనిచేసిన రెండేళ్లలో వ్యాపారం రెట్టింపు చేయడమే కాక, మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రమోషన్ మీద ముంబై ఆఫీస్ కి బదిలీ అయ్యాడు.


ముంబై వెళ్లే ముందు తమ పాత యింటికి మరమ్మత్తులు చేసి, దాన్ని రాజు పేరు మీదకి మార్పించి దస్తావేజులు రాజు చేతిలో పెట్టాడు. సంభ్రమాశ్చర్యాలతో రాజు అవాక్కయ్యాడు.


'రాజూ, యిది నాన్న అభీష్టం అనుకో! నేను ముంబై లో మంచి ఫ్లాట్ కొనుక్కున్నాను. నాన్న కి గుర్తుగా నీకు యిస్తున్నాను. నాన్న నీకూ నాన్నే. నేనిక్కడ లేనంతకాలం, అమ్మ పోయిన తర్వాత నాన్నని పదిలంగా చూసుకున్నావని తెలిసింది. అందుకే యిది హక్కుగా భావించి తీసుకో. నాకు అపరాధ భావన లేకుండా చెయ్యి, ప్లీజ్ !' అల్ ది బెస్ట్. ' అన్నాడు వేణుగోపాల్.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం :

అందరికీవందనాలు.

చిన్నతనంనించి కథలురాయడం నాహాబీ. 15 వయేట మొదటికథ అచ్చయితే, 18 వయేట ఆంధ్రపత్రిక వారపత్రిక దీపావళికథల పోటీలోనా కథ 'విప్లవం' కి బహుమతి వచ్చింది. తర్వాత కొన్ని కథలు పత్రికల్లో వచ్చాయి. అక్కడితో సాహితీ ప్రస్థానం ఆగిపోయింది. కొన్నిసంవత్సరాల తర్వాత యీ మధ్య మళ్ళీ రాయడం మొదలెట్టాను. అయితే డిజిటల్ మీడియాలోనే రాస్తున్నాను. 2020 సంక్రాంతి సమయం లో ఒక కథకి [చెన్నైఅనే నేను] ప్రతిలిపిలో మూడో బహుమతి వచ్చింది. ఈమధ్య అందులోనే మరో కథ10 ఉత్తమ కథల్లో వొకటిగా నిలిచింది. గోతెలుగు డాట్కామ్ లో వొక హాస్య కథ ప్రచురింపబడింది. కొన్నిసంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రాయగలననే ఆత్మవిశ్వాసం కలిగింది.

'శిరిప్రసాద్' అనేకలం పేరుతో రాస్తుంటాను.

ఇంతకంటే చెప్పుకోతగ్గ విషయాలు లేవు. కృతజ్ఞతలు.


100 views1 comment
bottom of page