top of page

ప్రతిబింబం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Video link

'Prathibinbam' written by Siriprasad

రచన : శిరిప్రసాద్


విధి ఆమెను వంచించింది.

అయినా ధైర్యం కోల్పోలేదు ఆమె.

కష్టాలను ఎదుర్కొని ముందడుగు వేసింది.

సహాయం చెయ్యక పోగా నిందలు వేశారు కొందరు.

సందర్భం చూసుకొని వాళ్ళ తప్పును తెలియజేసిందామె.

ఈ కథను ప్రముఖ రచయిత సిరి ప్రసాద్ గారు రచించారు.రాధ ఒకటే ఏడుస్తోంది. చిన్న పిల్లలు యిద్దరినీ అక్కున చేర్చుకుని విలపిస్తోంది. హాల్లో భర్త శవం ఫ్రీజర్ బాక్స్ లో...


బంధువులు, మిత్రులు, సహోద్యోగులు కన్నీళ్ళతో నివాళులు అర్పిస్తున్నారు. తల్లి, అక్క, చెల్లెలు పక్కనే కూర్చుని రాధ ని ఓదారుస్తున్నారు.


'ఇంత చిన్న వయస్సులో సుధీర్ పోవడం బాధాకరం. పిల్లలు చిన్న వాళ్ళు. తండ్రిని ఆ బాక్స్ లో యెందుకు పడుకోబెట్టారో, అందరూ యెందుకు వచ్చిపోతున్నారో , తల్లి యెందుకు ఏడుస్తోందో తెలియని వయస్సు... విధి యెంత క్రూరమైందో !...'

అందరూ అనుకుంటున్న మాటలు.


సుధీర్ వొక మల్టీ నేషనల్ కంపెనీ లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా వుద్యోగం చేస్తున్నాడు. తక్కువ కాలం లో ప్రొమోషన్స్ సాధించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అమ్మకాలు భారీగా పెంచడమే కాకుండా, కస్టమర్ ల ఫీడ్ బ్యాక్ తరచూ తీసుకుంటూ, పోటీ కంపెనీ ల వ్యూహాలను గమనిస్తూ, రీసెర్చ్ డిపార్టుమెంట్ తో టచ్ లో వుంటూ , ప్రోడక్ట్ నాణ్యత ని పెంచే ప్రయత్నాలు చేస్తూ, టాప్ మానేజ్మెంట్ దృష్టిలో టాప్ పెర్ఫార్మెర్ గా పేరుమోసాడు. ముఫై ఐదేళ్లకే అతని జీవితం ముగియడం అతని కుటుంబానికే కాక, సహోద్యోగులు, మిత్రులకి మింగుడు పడడం లేదు. ఆరునెలలకోసారి అన్నీ వైద్య పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తగా వుండే సుధీర్ హార్ట్ ఎటాక్ తో పోవడం అందరికీ షాక్ లా వుంది.


మధ్యాహ్నం కల్లా సుధీర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తర్వాత సుధీర్ పనిచేసిన కంపెనీ జనరల్ మేనేజర్ నారాయణన్ రాధ దగ్గిరకి వచ్చి వోదార్చాడు . రాధ కి కంపెనీ లో సుధీర్ పనిచేసిన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లోనే జూనియర్ ఎగ్జిక్యూటివ్ గా వుద్యోగం యివ్వడానికి నిర్ణయించినట్టు చెప్పాడు. రాధ ఎం బీ ఏ చేయడం వల్ల అది సాధ్యమైంది. మార్కెటింగ్ ప్రణాళికలలో తనకు భార్య యెన్నో సూచనలు చేస్తుండేదని సుధీర్ యెన్నో సార్లు తనతోనూ, మీటింగ్ ల్లోనూ చెప్పేవాడని, అందువల్ల రాధ వుద్యోగం లో సులువుగా అడ్జస్ట్ అవ్వగలదనీ నారాయణన్ చెప్పాడు. రాధ కళ్ళ వెంట నీళ్లు ధారలు కట్టాయి. థాంక్స్ కూడా చెప్పలేక పోయింది.


సుధీర్ మరణించిన నెల రోజుల తర్వాత రాధ వుద్యోగంలో చేరింది. ఆఫీస్ స్టాఫ్ అందరూ ఆమెని సహృదయంతో స్వాగతించారు. మొదట్లో ఆమెకి పెద్దగా పని చెప్పలేదు. గణాంకాలు సేకరించడం, వాటిని ఫార్మాట్ లో టైపు చేసి మార్కెటింగ్ ఛీఫ్ కి యివ్వడం, ఆ గణాంకాల మీద కొద్దిగా విశ్లేషణ చేసి చర్చిండడం ఆమె పని. వేరే సహోద్యోగుల పనిలో కూడా కొంత తీసుకుని వాళ్ళకి సహాయం చేస్తోంది.


సుధీర్ కిష్టమైనట్టే గంజి లో వుతికి ఇస్త్రీ చేయించిన కాటన్ చీర, దానికి మాచింగ్ బ్లౌజ్, అప్పుడప్పుడు సుధీర్ కిష్టమైన రంగుల్లో చుడీదార్ ధరించి ఆఫీస్ కి వెళుతూ వుంటుంది. స్టికర్ బొట్టు ఆమెకి అందాన్నిస్తుంది. ఈ రోజుల్లో అది ఫ్యాషనే అయినా, కుంకుమ బొట్టు తనకి నిషిద్ధమని తెలుసు. తలలో పూలు పెట్టుకోడం తనకి యిష్టమైన అలవాటు. ఆ అలవాటైన అభిరుచిని వదులుకుంది. తనతో పాటు తల్లి వుంటున్నా, ఆమె యెప్పుడూ రాధకి యిది చెయ్యి, యిది చెయ్యకూడదు, చెయ్యద్దు, అని యే విషయంలోనూ సలహా యివ్వదు. తన బిడ్డకి పట్టిన దురదృష్టానికి యెప్పుడూ కన్నీళ్లు కారుస్తూనే వుంటుంది. పిల్లల్ని చూసుకుంటూ రాధ ఆఫీస్ నించి యింటికి యెప్పుడొస్తుందా అని యెదురు చూస్తూంటుంది.


రాధ వుద్యోగం లో చేరి ఆరు నెలలు గడిచిపోయాయి. నారాయణన్ రాధని తన క్యాబిన్ కి పిలిచి, కన్ఫర్మేషన్ ఆర్డర్ చేతికిచ్చాడు. 'రాధా, నువ్వు ప్రొబేషన్ పూర్తి చేసుకున్నావు. ఇది నిన్ను జాబ్ లో కంఫర్మ్ చేస్తూ ఆర్డర్ యిస్తున్నాను. ఈ ఆరు నెలలు నువ్వు వర్క్ నేర్చుకుంటూనే, నీ కొలీగ్స్ కి సహాయం చేస్తూ మంచి పేరుతెచ్చుకున్నావ్. చాలా సంతోషం. త్వరలో నీకు ప్రమోషన్ వచ్చినా ఆశ్చర్యం లేదు. కీప్ ఇట్ అప్!'


'థాంక్యూ సర్ ! అందరూ యెంతో అభిమానం తో చూసుకుంటున్నారు..... ' కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాధకి. మాట్లాడలేక పోయింది. అది గమనించిన నారాయణన్ తన చూపుల్తొనే వోదార్చి , వెళ్ళమన్నట్టు సంజ్ఞ చేసాడు. నారాయణన్ సుధీర్ ని యెంతగానో అభిమానించేవాడు. సుధీర్ వుండగా బిజినెస్ టార్గెట్స్ రీచ్ అవ్వడం చాలా సులభంగా అనిపించేది. ఇప్పుడు యెంత కష్ట పడ్డా అభివృద్ధిని చూపలేక పోతున్నాడు. రాధ సుధీర్ ని యెన్ని సార్లు జ్ఞాపకం చేసుకుంటుందో, నారాయణన్ కూడా అన్ని సార్లు జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. సుధీర్ ని మిస్ అయి, జీవితంలో చాలా పోగొట్టుకున్నాడు. జీవితం సాఫీ గా సాగిపోవడం విధికి యిష్ట ముండదేమో!


రాధని కలీగ్స్ అందరూ స్వీట్స్ అడిగారు. తన భర్తకి యిష్టమైన తిరునల్వేలి హాల్వా, పిల్లలకి యిష్టమైన మైసూర్ పాక్ తెప్పించింది. కొలీగ్స్ అందరూ హ్యాపీ!


హెచ్ ఆర్ డిపార్టుమెంట్ లో ఆఫీసర్ వింధ్య యింటర్ కామ్ లో రాధని పిలిచి, కాంటీన్ కి రమ్మంది. ఇద్దరూ కాంటీన్ లో కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. రాధ ముఖ కవళికల్ని గమనిస్తూ, వింధ్య వొక విషయం రహస్యంగా చెప్పింది.


'రాధా, మన ఆఫీస్ లో కొంతమంది వెధవలున్నారు. కొంతమంది లేడీస్ కూడా అలాంటివాళ్ళు వున్నారు. నువ్వు మంచి చీరలు, డ్రెస్ వేసుకొని, అందరితో సరదాగా వుంటుంటే, వాళ్ళ కడుపు మండిపోతోంది. నీ సుధీర్ పోయినందుకు నీకు యేమాత్రం బాధ లేదట. పైగా జాబ్ వచ్చినందుకు హ్యాపీ గా వున్నావుట!... ఛీ... ఛీ... యింకా నీకు, ఒకరిద్దరు మొగాళ్ళకి లింక్ పెట్టి , ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ మాటలు నీ నోటీస్ కి వచ్చాయో, లేదో?...... జాగ్రత్తగా వుండు ......'

ఒక్క క్షణం మ్రాన్పడి పోయింది రాధ. అంతలోనే తేరుకుని, చిన్న నిట్టూర్పు విడిచింది.


'అనుకోనీ వింధ్యా!... నేను శుద్ధంగా వున్నప్పుడు అలాంటి వాగుడు యెందుకు పట్టించుకోవాలి? ...... ఎనీవే థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఐ విల్ టేక్ పాసిబుల్ కేర్!...' అంది.


'మనస్సులో పెట్టుకుని బాధపడకు. ఇలాంటి వాళ్ళు అన్ని చోట్లా వుంటారు. ఎక్కడికి వెళ్ళినా , హచ్ ఫోన్ వాళ్ళ యాడ్ లో కుక్కలా వెంటే వుంటారు!... '


'తల వూపింది రాధ. తర్వాత యిద్దరూ వాళ్ళ సీట్స్ కి వెళ్లిపోయారు.


ఆ సాయంత్రం నారాయణన్ స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేసాడు. కంపెనీ మార్కెట్ లో ప్రవేశ పెట్ట బోతున్న కొత్త ప్రొడక్ట్స్ గురించి వివరించాడు. ఆ ప్రొడక్ట్స్ ని పబ్లిక్ లో ప్రచారం చేసేందుకు తీసుకుంటున్న ప్రమోషన్ ఆక్టివిటీస్ ని చెప్పి, స్టాఫ్ నించి సలహాలు కోరాడు. నలుగురైదుగురు కొన్ని సలహాలివ్వడం, ఆయన నోట్ బుక్ లో రాసుకోవడం జరిగింది. చివరిగా ఆయన మాట్లాడుతూ, రాధ జాబ్ లో కంఫర్మ్ అయిన సంగతి చెప్పి, సుధీర్ ని గుర్తు చేసుకున్నాడు. స్టాఫ్ అందరూ చప్పట్లతో రాధ ని మెచ్చుకున్నారు.


రాధ తో, ‘నువ్వు మాట్లాడతావామ్మా’, అని అడిగాడు. తల వూపింది రాధ. చేతిలో వున్న మైక్ నిచ్చి, మెచ్చుకోలుగా ఆమె వంక చూసాడు.


రాధ నెమ్మదిగా మాట్లాడసాగింది, 'అందరికీ నమస్కారం. జాబ్ లో కంఫర్మ్ కావడం సంతోషంగా వుంది. ఇదేమీ పెద్ద విషయం కాక పోయినా నాలాగా జాబ్ కొచ్చిన వాళ్ళకి సంతోషం కలిగిస్తుంది. నాకు యెంతో గైడెన్స్ యిస్తున్న జీ ఎమ్ గారికీ, నా డిపార్ట్మెంట్ ఇన్ ఛార్జ్ కి, నా కొలీగ్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ జాబ్ నాకు చాలా అవసరం. నేను ఎం బీ యే చేసినా జాబ్ లో జాయిన్ కాకుండా, గృహిణి గానే వుండిపోయాను . ఇప్పుడు సుధీర్ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాక, జాబ్ అవసరం యేర్పడింది. కంపెనీ నానుంచి ఆశించే విధంగా వర్క్ చేస్తాను. మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను. మీ అందరూ నన్ను వొక సోదరిగా భావించి నాకు గైడెన్స్ యివ్వమని కోరుతున్నాను. ఇంకొక్క విషయం చెప్పాలని వుంది ...' గొంతు గద్గదమైంది. అటెండర్ మంచినీళ్లు తెచ్చి యిచ్చాడు.

'ఒకరిద్దరు నా గురించి తప్పుగా కామెంట్ చేస్తున్నట్టు తెలిసింది. అవి నా దృష్టిలోకొచ్చినయ్ కాబట్టి, వాటి గురించి మాట్లాడాలని వుంది... తప్పుగా అనుకోకండి. నేను భర్త పోయినందుకు బాధ పడట్లేదని, ఎంజాయ్ చేస్తున్నానని అనుకుంటున్నారట. నేను ఎంజాయ్ చెయ్యట్లేదు. నా భర్తని మర్చిపోలేదు. సుధీర్ అసలు మర్చిపోగలిగే వ్యక్తి కాదు. ఎంతోమంది కొలీగ్స్, స్నేహితులు ఆయన్ని హృదయం లో ప్రతిష్టించుకున్నారు. నేను కూడా సుధీర్ ని భర్తగా, స్నేహితుడిగా, ఆత్మీయుడిగా నా గుండెలో పదిలపరచుకున్నాను. అలాంటి నన్ను అంతమాట అనడం భావ్యమా?...’ ఒక క్షణం ఆగి, మంచి నీళ్ళు చప్పరించి, మళ్ళీ కొనసాగించింది.


‘ సుధీర్ కి వొక గురువు గారి మీద విస్వాసం వుండేది . సుధీర్ పోయిన పదిహేను రోజులకి తనని కలవమని ఆ స్వామి కబురు చేశారు. నేను, అమ్మ, పిల్లల్ని తీసుకుని ఆయన దగ్గిరకి వెళ్ళాము. ఆయన నన్ను వోదార్చారు. అయినా దుఃఖం ఆగట్లేదు. ఆయన వొక ప్రశ్న వేశారు, ‘అమ్మా, నువ్వు అంతగా యేడుస్తుంటే , నీ భర్త తిరిగి వస్తాడా’, అని. నేను అడ్డంగా తలూపాను. ‘మరి యెందుకు యేడుస్తున్నావ్,’ అని అడిగారు. ‘మర్చిపోలేక పోతున్నాను,’ అన్నాను. ‘నువ్వు చేస్తున్న పని వల్ల యెలాంటి ప్రయోజనం లేదని తెలిసీ, ఆ పని చేయడం వివేకం కాదు. నాకు తెలుసు, ఆయన మరణం గుర్తుకొచ్చి యేడుస్తున్నావ్ ; ఆ సన్నివేశాలు మర్చిపోవాలి, గుర్తుకొస్తున్నప్పుడు వాటిని బలవంతంగా పక్కకి తోసేయాలి. మంచి అనుభవాలు గుర్తుకొస్తే, సంతోషపడు. కానీ దుఃఖాన్ని వదిలేయాలి. నేను వేదాంతం చెప్పడం లేదు. నీ కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాను. చిన్న పిల్లలు పెరిగి, పెద్దయి నిన్ను చూసుకోవాలంటే కనీసం యిరవై యేళ్లు దుఃఖాన్ని మరచి, కర్తవ్యాన్ని గుర్తుంచుకోవాలి. కాలం గాయాన్ని మరపిస్తుంది. బి బోల్డ్,’ అని కఠినంగానైనా, ఖచ్చితంగా చెప్పారు. అందుకే సుధీర్ మరణం గుర్తుకొచ్చినప్పుడల్లా, నా బాధ్యతని గుర్తుచేసుకుంటున్నాను. ఇక నా డ్రెస్ గురించి. నాకు బాగుంటాయని రకరకాల చీరెలు, చుడీదార్లు కొనిచ్చేవాడు సుధీర్. వాటిని పారేసి కొత్తవి కొనుక్కోలేను. తనకి యిష్టమైనవనే యిష్టంగా కట్టుకుంటున్నాను. పూర్వం రోజుల్లో లాగా తెల్ల చీర కట్టుకు రమ్మని వాళ్ళ వుద్దేసమా ?... ఇలాంటి ఘటన వాళ్ళింట్లో జరిగితే అలాగే చేస్తారా?... ఫ్రెండ్స్, యిక మరో విషయం. నాకు అయిష్టంగా వున్నా, చెప్పక తప్పట్లేదు. నాకు, వేరే మగవాళ్ళకి సంబంధం అంటకడుతూ మాట్లాడుతున్నారట...... '


అవాక్కయి వింటున్నారు స్టాఫ్ అంతా.


'అటు వంటి అపవాదులు మోపడం భావ్యమేనా?... నన్ను మీ సోదరిగా భావించి, ఆలోచించండి. ఇట్లా నిందలు మోపే వొక భక్తుడితో వొక పందిని చూపి సాయి బాబా యిలా అన్నారట ,'చూడు - ఆ పంది అమేధ్యాన్ని యెంత రుచిగా తింటున్నదో ! నీ స్వభావం కూడా అట్లా0టిదే. ఏంతో పుణ్యం చేసి యీ మానవ జన్మని పొందావు. ఇప్పుడు యితరులపై యిలాంటి నిందలు వేసే నీకు నా దర్శనం, ఆశీస్సులు తోడ్పడుతాయా?’ అని. ఇలాంటి నిరాధారమైన నిందలు వేయడం మానండి. తరచుగా మనం వాట్స్ యాప్ లో సందేశాలు చూస్తుంటాం . మన కర్మ తిరిగి మన దగ్గిరకి వస్తుందని. మనం వేసే నిందలు, తిట్టే తిట్లు, చేసే పనులు తిరిగి మన దగ్గిరకే వస్తాయి. దయచేసి చెవులు కొరుక్కోడం మానేయండి. అందరికీ నమస్కారం!' అంటూ ముగించింది రాధ. ఒక నిముషం నిశ్శబ్దం. అందరూ వొకవిధమైన షాక్ కు లోనయ్యారు. తర్వాత అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. నారాయణన్ కళ్ళు తుడుచుకుంటూ, అభినందిస్తున్నట్టుగా రాధ కళ్లల్లోకి చూసాడు.


నారాయణన్ సుధీర్ కంటే ఐదేళ్లు పెద్దవాడు. ప్రేమ వ్యవహారం లో ఫెయిల్ అయ్యి, పెళ్ళి చేసుకోలేదు. రెండేళ్లు వెయిట్ చేసి, రాధ ని వొక రోజు అడిగాడు భయం భయం గా ,'నీ పట్ల నాకు యెంతో ప్రేమ, గౌరవం వున్నాయి రాధా. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్ళి చేసుకోవాలని వుంది…… నీకు అభ్యంతరం లేకపోతేనే!... నా కింద పనిచేస్తున్నావనే అడ్వాంటేజ్ తీసుకోవడం లేదు. '


రాధ నిర్ఘాంతపోలేదు. ఆయనకీ పెళ్ళి కాలేదని తెలుసు. లవ్ ఫెయిల్యూర్ అని తెలుసు. మానవత్వం వున్న మంచి మనిషనే విషయం ఎప్పుడోనే అర్ధమైంది. తనకంటే పదేళ్ళు పెద్ద. ఇలాంటి వివాహానికి పదేళ్ళ వ్యత్యాసం పెద్ద యీష్యూ కాదు. పిల్లలు యింకా చిన్నవాళ్ళు కావడం వల్ల వాళ్ళు తండ్రిగా నారాయణన్ ని అంగీకరించడం కష్టం కాదు. ముఖ్యంగా తనకి పెద్ద అండ లభిస్తుంది.


'ఆలోచించుకుని చెప్తాను సర్ ' అంది రాధ. వారం రోజులు, నెల రోజులు గడిచిపోయాయి. రాధ నించి రెస్పాన్స్ లేదు. ఆందోళన తో తన తల్లితండ్రుల్ని తీసుకుని రాధ యింటికి వెళ్ళాడు. అక్కడ సుహృద్భావ వాతావరణం లో జరిగిన చర్చలు రాధ కి సంతోషం కలిగించాయి. ఏ కొద్ది అనుమానాలున్నా, అవి నివృత్తి అయిపోయాయ. అక్కడే అందరి సమక్షంలో సరేనంది రాధ, కొత్త జీవితానికి నాంది పలుకుతూ!

[సమాప్తం]

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

అందరికీవందనాలు.

చిన్నతనంనించి కథలురాయడం నాహాబీ. 15 వయేట మొదటికథ అచ్చయితే, 18 వయేట ఆంధ్రపత్రిక వారపత్రిక దీపావళికథల పోటీలోనా కథ 'విప్లవం' కి బహుమతి వచ్చింది. తర్వాత కొన్ని కథలు పత్రికల్లో వచ్చాయి. అక్కడితో సాహితీ ప్రస్థానం ఆగిపోయింది. కొన్నిసంవత్సరాల తర్వాత యీ మధ్య మళ్ళీ రాయడం మొదలెట్టాను. అయితే డిజిటల్ మీడియాలోనే రాస్తున్నాను. 2020 సంక్రాంతి సమయం లో ఒక కథకి [చెన్నైఅనే నేను] ప్రతిలిపిలో మూడో బహుమతి వచ్చింది. ఈమధ్య అందులోనే మరో కథ10 ఉత్తమ కథల్లో వొకటిగా నిలిచింది. గోతెలుగు డాట్కామ్ లో వొక హాస్య కథ ప్రచురింపబడింది. కొన్నిసంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రాయగలననే ఆత్మవిశ్వాసం కలిగింది.

'శిరిప్రసాద్' అనేకలం పేరుతో రాస్తుంటాను.

ఇంతకంటే చెప్పుకోతగ్గ విషయాలు లేవు. కృతజ్ఞతలు.82 views0 comments

Comentários


bottom of page