top of page

గజి బిజి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Gajibiji' written by Siriprasad

రచన : సిరిప్రసాద్


ఐదుగురు మిత్రుల పేర్లు.. వారి భార్యల పేర్లు... గజిబిజి గా అనిపించవచ్చు.

కానీ కథలో అంతర్లీనంగా ఇమిడివున్న భార్యాభర్తల బంధం, ఒకరి పట్ల ఒకరికి ఉన్న అనురాగం హృదయానికి హత్తుకునేలా రాశారు ప్రముఖ రచయిత సిరి ప్రసాద్ గారు. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్


మన్మధ రావు తన క్లాసుమేట్స్ ని స్వాగతిస్తూ గేటు దగ్గిర నిలబడ్డాడు. మిత్రులు వొక్కొక్కరుగా వస్తున్నారు. తరచూ కలిసే మిత్రులు ఆరుగురు. అందరూ డెబ్బై యేళ్ళ పై బడ్డ వాళ్ళే. క్లాసుమేట్స్ కాబట్టి వయోభేదం యెక్కువ వుండదు. ఈ ఆరుగురు క్లాసుమేట్స్ వొక్కోసారి వొక్కక్కరి యింట్లో కలుస్తారు. ఒక్కోసారి నెలకే కలుస్తారు. ఒక్కోసారి రెండు నెలలు పట్టచ్చు. వీళ్ళంతా వాళ్ళ పిల్లలు వుండే దేశాలు చాలా సార్లు తిరిగేసి, యిక మళ్ళీ వెళ్ళమని ప్రతిజ్ఞ చేసిన వాళ్ళే. అందుకే అందరూ స్వేచ్ఛగా, హ్యాపీ గా కాలం గడిపేస్తున్నారు. అప్పుడప్పుడు వొక్కొక్కరికి అనారోగ్యం కలగచ్చు. అలాంటప్పుడు అందరూ పరస్పరం సహాయం చేసుకుంటారు.

పాఠకులకి కన్ఫ్యూషన్ లేకుండా వాళ్ళ వివరాలు కింద పొందుపరుస్తాను.


మన్మధరావు, 71 సంవత్సరాలు; భార్య భాగమతి 68 సంవత్సరాలు.

మదన్ కుమార్, 72 సంవత్సరాలు, భార్య అనిత 67 సంవత్సరాలు

మాణిక్య రావు, 71 సంవత్సరాలు, భార్య సుమిత్ర 67 సంవత్సరాలు

మంజునాథ, 72 సంవత్సరాలు, భార్య ఉమ , 66 సంవత్సరాలు

రామా రావు, 73 సంవత్సరాలు, భార్య కౌసల్య, 49 సంవత్సరాలు [రెండో భార్య మరి]

నరసింహ, 71 సంవత్సరాలు, భార్య లక్ష్మి, 69 సంవత్సరాలు


ప్లాన్ ప్రకారం టైం కే అందరూ చేరుకున్నారు. ఉడిపి హోటల్ నించి జొమాటో ద్వారా తెప్పించిన యిడ్లీ, వడ అందరూ స్వీయ సహాయంతో డైనింగ్ టేబుల్ మీద అమర్చుకున్నారు. ఫ్లాస్క్ లో వేడి కాఫీ సిద్ధంగా పెట్టుకున్నారు. ముచ్చట్లు చెప్పుకుంటూ వొక గంట సేపు తిన్నారు.


'మాణిక్యం, నువ్వు యీ మధ్య మన క్లాసుమేట్ సుజాతని కలిసానన్నావ్ కదా! నిన్ను గుర్తు పట్టిందా?' అని అడిగాడు మన్మధరావు.


మధ్యలో మంజునాథ కలగజేసుకుని, 'సుమతిని కలిసానన్నావ్ కదా?' అని ప్రశ్నించాడు.

పక్కనే కూర్చున్న వాళ్ళ భార్యలు చెవులు రిక్కించి వింటున్నారు.


మాణిక్యరావు కొంచం ఆలోచించాడు. 'ఆ యిద్దరిలో యెవరిని కలిసానో గుర్తు రావడం లేదు...' అన్నాడు బుర్ర గోక్కుంటూ.


'సరే, సుజాతో, సుమనో, ఆ అమ్మాయి నిన్ను గుర్తుపట్టిందా?' అడిగాడు మన్మధ రావు.

'అమ్మాయేంటి, అమ్మమ్మని పట్టుకుని!...' అంటూ మొగుణ్ణి సవరించింది భాగమతి.

'అమ్మాయో , అమ్మమ్మో, యెవరో వొకరు ... నిన్ను గుర్తు పట్టిందా?' కొంచం కోపం ప్రదర్శించాడు మన్మధరావు.

'ఇప్పుడు గుర్తుపట్టక పొతే ఏమయ్యింది ట? పరిచయం చేసుకుని వుండచ్చు !' అంది మాణిక్యరావు భార్య.


చేతిలోని చెంచాని విసిరి కొట్టాడు కోపంతో మన్మధరావు.


'అంతలోనే అంత కోపం యెందుకు వస్తుంది? కోపాన్ని వదిలేశానన్నారు కదా!' అంది మన్మధరావు భార్య.


'చంచాని విసిరికొట్టడం తో కోపం పోయిందిలే!' అన్నాడు మన్మధరావు.

'ఇంతకీ నీ జవాబు యేమిటి ?' మాణిక్యరావు ని అడిగాడు రామారావు.

'ఏమోరా గుర్తురావట్లేదు. నన్ను గుర్తుపట్టిందో, లేదో అడగలేదు. ఇద్దరం కొంచెం సేపు మాట్లాడుకున్నాం. ఇంతలో తన బిడ్డ అనుకుంటా వచ్చి, పోదామా అని అడిగింది. బై చెప్పి వెళ్ళిపోయింది...' అన్నాడు మాణిక్యరావు.

'ఫోన్ నెంబర్ తీసుకోలేదా?' మంజునాథ ప్రశ్నించాడు.

'ఎక్కడ? టైం యిస్తే కదా!' అని ఆ సంభాషణని ముగించాడు మాణిక్యరావు.


బ్రేక్ ఫాస్ట్ ముగిసింది. అందరూ స్నాక్స్ ని, ఆ ఉడిపి హోటల్ ని పావుగంట సేపు పొగిడారు. వాళ్ళ వయసుకి వుప్పూ , కారం, మసాలా తక్కువగా వుండే ఆ హోటల్ స్నాక్స్ నచ్చకుండా యెలా వుంటాయి? అలా అని యెప్పుడూ అలాంటి ఫుడ్డే తింటారని కాదు. నాన్ వెజ్ ఫుడ్ లంచ్ లో తెప్పించుకుంటారు. జొమాటో, స్విగ్గీ వాళ్ళ పాలిట వరం. డబ్బు యెలా ఖర్చుపెట్టాలో తెలియని వయసు మరి!


అప్పుడే మాణిక్యరావు భార్య సుమిత్ర మన్మధరావు ని అడిగింది , 'కిందటి సారి లావణ్య తో మీ లవ్ ఎఫైర్ గురించి చెప్తూ సగంలో ఆపేసారు. దాన్ని పూర్తి చేయండి మరి.'

మన్మధరావు కొంచం సేపు ఆలోచించాడు. గుర్తుకు రాలేదు. అప్పుడు సుమిత్రని అడిగాడు, 'యెక్కడ ఆపేసానో చెప్పండి'


సుమిత్ర నవ్వుతూ అన్నది,'లావణ్య కి ఐ లవ్ యు కార్డు యిచ్చారు. అదే టైం లో ఆ అమ్మాయి తండ్రి అక్కడికి వచ్చి ఆ అమ్మాయి చేతిలోంచి ఆ కార్డు తీసుకున్నాడు. అందులో మెసేజ్ చూసి మిమ్మల్ని తిట్టాడు. అక్కడితో ఆపేసారు.'


'ఓహో!..... ఆ తర్వాత యేముంది ... సౌజన్య కి వాళ్ళ నాన్న వారం రోజుల్లో యెవడితోనో పెళ్ళి చేసేసాడు. నేను రిసెప్షన్ కి వెళ్ళి వో గిఫ్టు యిచ్చి, డిన్నర్ చేసాను...'


'లావణ్య అని చెప్పారు కదా! ఇప్పుడు సౌజన్య అంటున్నారేమిటి?' అడిగింది సుమిత్ర.

కొంచం కన్ఫ్యూజ్ అయ్యాడు మన్మధరావు. 'రామారావు, నువ్వు చెప్పవోయ్, ఆ అమ్మాయి పేరు లావణ్యా, సౌజన్యా?' అని రామారావు వైపు తిరిగి, అడిగాడు.


'సుకన్య అనుకుంటాను మన్మథరావ్!... సౌజన్య కాదు. సౌజన్య మన లెక్చరర్ కదా!' అన్నాడు రామారావు అనుమానంగా.


'ఔను. సౌజన్య కి మన క్లాసుమేట్ రవి లవ్ లెటర్ యిచ్చాడు. అప్పుడావిడ, రవీ నువ్వు అమెరికా పోయి నీ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మనిషి ముఖం తో రా , అప్పుడాలోచిస్తా, అన్నది. వాడు యేడుపు ముఖం వేసుకుని నా దగ్గిరకొచ్చాడు,' అన్నాడు మన్మధరావు.

'నీ పేరు యేమిటి ?... ఊర్మిళా కదా?... కాదు...కాదు... ' కుడి చేతి చూపుడు వేలు గాలిలో తిప్పుతూ, పైకి చూస్తున్నాడు, గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం లో.


'నా పేరే మర్చిపోయారు! ... ఇంక ఆ అమ్మాయి పేరేం గుర్తుంటుంది?' చిరునవ్వుతో, చిరుకోపంతో అన్నది సుమిత్ర.


'సారీ!... సారీ!... ఆ అమ్మాయి పేరేదైతే నేమి, ప్రేమ ఫెయిల్ ఐయింది,' అన్నాడు ఆ టాపిక్ ని క్లోజ్ చేసే వుద్దేశంతో . మన్మధరావు భార్య భాగమతి వూరుకోలేదు. 'ఆ అమ్మాయి యెవరో తేలాల్సిందే. దాన్ని కలిసి యీయన్ని పెళ్ళి చేసుకోలేదెందుకని, చేసుకొని వుంటే నాకీ చెర తప్పి వుండేది కదా, అని నిలదీస్తాను... 'అని గట్టిగా అన్నది.


మంజునాథ కలగజేసుకుని, 'ఆ అమ్మాయి ఎప్పుడోనే పోయిందిగా, బ్రెస్ట్ కాన్సర్ తో! ' అన్నాడు మన్మధరావు ని ఆ యిబ్బంది నించి బయటపడేయడానికి.


మన్మధరావు చిరాగ్గా అన్నాడు మంజునాథ తో, 'బ్రెస్ట్ కాన్సర్ తో పోయింది అది కాదు, సుభద్ర!'

'నువ్వు కంఫ్యూజ్ అయ్యి, మమ్మల్ని కంఫ్యూజ్ చేస్తున్నావ్ మన్మథరావ్ !... సుభద్ర పోయింది కోలన్ కాన్సర్ తో!' అన్నాడు కన్ను కొడుతూ మంజునాథ.


ఆలోచన లో పడిపోయాడు మన్మథరావ్.


భాగమతి తో అన్నాడు మదన్ కుమార్,' చూడమ్మా, నీకు ఆ అమ్మాయి మీద కోపం వుండే వుండచ్చు . చచ్చిపోయిన వాళ్ళ మీద కోపం వుండొద్దు. నేను చెబుతున్నా కదా, యీ టాపిక్ వదిలేసి, కార్డ్స్ ఆడుకుందాం, రండి.'


భాగమతి మాట్లాడలేదు.


మన్మధరావు కి మైండ్ లో కొంచం గందరగోళం గా అనిపించింది. వెంటనే వేరే ఆలోచనలో పడిపోయాడు.

అందరూ డ్రాయింగ్ రూం లో చేరారు. మూడు గ్రూపులుగా విడిపోయి కార్డ్స్ ఆడడం మొదలెట్టారు. మోడరేట్ స్టేకులతో ఆడుతుంటారు. అలా ఆడినరోజు టర్నోవర్ పదివేలుంటుంది. ఆ డబ్బుని గెలిచిన వాళ్ళు తీసుకుంటారు; వాళ్ళ వంతువచ్చినప్పుడు మంచి ఆతిధ్యం యిస్తారు.


స్విగ్గీ వాడు లంచ్ తేవడం తో ముందు ఆడవాళ్ళు లేచారు. ఆ పాకెట్లన్నీ విప్పి గిన్నెల్లో వేయడం వొక పెద్ద పని. నిదానంగా ఆ పని పూర్తిచేసేసరికి మగవాళ్ళు కార్డ్స్ పక్కన పెట్టి లేచారు.

లంచ్ సమయంలో నరసింహ రామారావు ని అడిగాడు,' కాలేజ్ లోఅందరికీ పేర్లు పెడుతుండేవాడివి కదరా? వాటి సంగతి ఏమిటో కొంచం చెప్పరాదా?'


పెద్దగా నవ్వింది నరసింహ భార్య లక్ష్మి. 'అవి వినీ వినీ విసిగెత్తి పోయాను. అయినా చెప్పండి మీ ఫ్రెండ్స్ కోసం !'


'అదేమంత గొప్ప విషయం రా!... ఏదో హాస్టల్ మెస్ లో అలా సరదాగా పేర్లు పెట్టేవాణ్ణి. రోజూ సర్వర్లు వొకే ఐటమ్ సర్వ్ చేస్తుండేవారు. రైస్ సర్వ్ చేసేవాడు యెప్పుడూ రైసే సర్వ్ చేసేవాడు. వాడిని రైస్ ఛాన్స్లర్ అని పిలిచేవాడ్ని. వాడు కుష్. సాంబారు పోసేవాడికి సాంబశివరావు అని పేరుపెట్టాను. వాడు ఏడుస్తుండే వాడు. కూర్మా వేసేవాడ్ని కూర్మం అని పిలిచేవాణ్ణి. ఇంకా గుర్తులేదు కానీ, అందరికీ వొక నిక్ నేమ్ పెట్టేవాణ్ణి. వాళ్ళంతా కలిసి నన్ను తంతారేమో అని భయపడేవాణ్ణి. అందుకే పండగలప్పుడు తలా పది రూపాయలిచ్ఛేవాణ్ణి. అంతా గప్ చుప్... '

అందరూ కాసేపు నవ్వుకున్నారు.


సాయంత్రం స్నాక్స్, రాత్రి లైట్ డిన్నర్ తెప్పించుకుని తిన్నారు. అందరూ బాధ పడుతూ వీడ్కోలు చెప్పుకుని బయల్దేరారు. దగ్గిరగా ఉంటున్న వాళ్ళు తరచూ కలుస్తుంటారు కానీ, అందరూ కలవాలి అంటే నెలా, రెండు నెలలు పడుతుంది. నెక్స్ట్ మీటింగ్ ఏప్రిల్ ఆఖరుకు ఫిక్స్ చేసుకున్నారు. ఆ డేట్ ఫిక్స్ చేయడానికి మంజునాథ పంచాంగం తీసి, తిథి, వార, నక్షత్రాలు పరిశీలించి అందరికీ సూట్ అయ్యే డేట్ ఫిక్స్ చేస్తాడు. దానికి కూడా వొక గంట పడుతూ వుంటుంది, భార్యలు వాళ్ళ చాదస్తాన్ని తిడుతున్నా కూడా!


గేట్ దాకా వెళ్ళాక నరసింహ అందర్నీ ఆపి, దగ్గిరకి రమ్మన్నాడు. ఏమిటో అనుకుని కొంచం ఆశ్చర్యంతో అందరూ చుట్టూ చేరారు.

'చైనాలో కరోనా అనే వైరస్ తీవ్రంగా స్ప్రెడ్ అవుతున్నదని చూసారు కదా, టీ వీ ల్లో, పేపర్ లో. అది వొక వేళ ఇండియా లో కొస్తే చాలా డేంజర్. ఇప్పటికే చైనాలో కర్ఫ్యూ పెట్టేశారట. ముసలోళ్ళకి యింకా డేంజర్ అని, మా అమ్మాయి కెనడా నించి ఫోన్ చేసి చెప్పింది. అది ఒకవేళ ఇండియా కొస్తే?' అన్నాడు నరసింహ.


'ఏముందోయ్ ! మనం కాళ్ళు జావుక్కూర్చున్నామ్ కదా! మనల్ని యెగరేసుకు పోతుంది!' అన్నాడు మంజునాథ.


రామారావు కలగజేసుకుని అన్నాడు, 'మనం ఫైటర్స్ మి మంజూ! అలాగ తలొగ్గేసి సరెండర్ ఐపోతామా, యేమిటి ?... ఫైట్ చేస్తాం!...'


మన్మధ రావు అన్నాడు,' అది సరేరా. మనం వూహల్లో కొంచం దూరం పోయాం కాబట్టి, యింకొంచెం దూరం పోయి ప్లాన్ చేద్దాం. ఒకవేళ హోటళ్లు బంద్ అయితే యింట్లో వంట. మూడు నాలుగు నెలలకి గ్రోసరీ తెచ్చి పెట్టుకోవడం, మందు దొరక్కపోతే కష్టం కాబట్టి వో ఆరునెల్లకి సరిపడా మందు స్టాక్ చేద్దాం. పేకముక్కలు వో రెండు డజను సెట్లు స్టాక్ చేద్దాం. గ్యాస్ ఎక్స్ట్రా సిలెండర్ సిద్ధం చేసుకుందాం... యింకా ఆలోచించండి. రోజూ కాన్ఫెరెన్స్ కాల్ లో డిస్కస్ చేస్తూ ఏక్షన్ తీసుకుందాం. డోంట్ వరీ ...'


అందరూ ఓకే చేసి, బయల్దేరారు.


ఆ రోజు ఆరుగురూ కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుకున్నారు.


మన్మధరావు విచారంగా మాట్లాడాడు, 'వైరస్ అన్నీ దేశాల్లో ఎంటర్ అయిపోతోంది. మనదేశం లో కేసులు స్లో గా పెరిగిపోతున్నాయి. మన అనుభవాన్ని రంగరించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలి.' అన్నాడు.


'నిజమేరా నా అనుభవంతో చెప్తున్నాను. ఇండియా లో జనసాంద్రతకి అది తొరగా వ్యాపిస్తుంది. మన హాస్పిటల్స్ యెంతవరకూ సిద్ధంగా వున్నాయో, అనుమానమే. ప్రభుత్వాలు కూడా రెడీ గా లేవనిపిస్తోంది.....' అన్నాడు మంజునాథ.


'అంత భయపడక్కర్లేదు లేరా!...... యిలాంటివి ఎన్ని చూడలేదు?' అన్నాడు మాణిక్యరావు.

రామారావు కలగజేసుకుని, 'మనం అందరికంటే ముందుండాలి. నిర్లక్ష్యం వద్దు. మా సన్స్ యిద్దరికీ నిన్న ఫోన్ లో అదే చెప్పాను. నిర్లక్ష్యం వల్లే ప్రమాదం పెరుగుతుంది,' అన్నాడు.

'సరేరా. నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. వినండి. మన పిల్లలు యెవరూ వచ్చే పరిస్థితుల్లో వుండరు. మనం ఆ దేశాలు పట్టుకుని పోయే సీన్ లేదు. మనం ఆరుగురం కలిసి వొక్క చోటే వుందాం . ఒకరికి వొకరు అండగా. మన్మధరావు యిల్లు పెద్దది. ఐదు రూమ్స్ వున్నాయి. పెద్ద హాల్ వుంది. కామన్ టాయిలెట్స్ రెండున్నాయి. ఆ పని చేద్దాం. కార్లలో చాపలు, పరుపులు వేసుకుని రండి యెందుకైనా మంచిది.,' అన్నాడు మదన్ కుమార్.


'నాకు ఓకే ,' ప్రకటించాడు మన్మధరావు.

'అయితే మా వూరి నించి వచ్చిన పనివాడున్నాడు. వాడ్ని కూడా తీసుకొస్తాను. మనకి చేదోడు, వాదోడు గా వుంటాడు. ఏమంటారు?' అన్నాడు మాణిక్య రావు.

'ఓకే' అన్నారు అందరూ ముక్త కంఠం తో.

మదన్ తన ప్లాన్ లో మిగిలిన అంశాలన్నీ చెప్పాడు. అందరూ ఒప్పేసుకున్నారు.


అయిదుగురు మిత్రులు, వారి భార్యలు మార్చ్ 10 న మన్మధరావు యింటికి షిఫ్ట్ అయ్యారు. పదకొండు నించి అంతర్జాతీయ ప్రయాణాలపై నిబంధనలు/నిషేధాలు అమలుకానున్నాయని ప్రకటన రాగానే, మిత్రబృందం త్వరలో పూర్తిగా లాక్డౌన్ యే క్షణానైనా విధించవచ్చని శంకించింది. కానీ అంచలంచలుగా రక రకాల పరిణామాల తో లాక్ డౌన్ యిరవైనాలుగు నించి మొదలైంది. ఆలోగా అందరూ కలిసి కావాల్సినవన్నీ సమకూర్చుకున్నారు. ఆరునెలలకి సరిపడా మందూ, మందులు సహా అన్నీ సమకూర్చుకున్నారు.


లాక్ డౌన్ వీళ్ళందరికీ కలిసి వుండే వొక అవకాశంగా మారింది. మతిమరపు వేధింపుల మధ్య, కాలాన్ని కరిగించేస్తున్నారు.


లాక్ డౌన్ సడలించిన తర్వాత, కొద్దిగా నిర్లక్ష్యం తో బయటికి వెళ్లడం మొదలెట్టారు జనం. ఆ నిర్లక్ష్యానికి కొందరు మూల్యం చెల్లించుకుంటున్నారు.


మొదటి వేవ్ లో వాళ్ళ బంధువులు వొకరిద్దరు కరోనా కి బలైనట్టు తెలిసింది. వెళ్ళి చూడలేని పరిస్థితి. కుటుంబాల్ని పరామర్శించి, ధైర్యం చెప్పలేని దైన్యావస్థ. మరో రెండునెలలు గడిచేసరికి పరిస్థితులు మరింత మెరుగుపడ్డాయి. ఎన్నికలనీ, రాజకీయ సమావేశాలు, సినిమా హాళ్ళు ఓపెన్ కావడం, యివన్నీ మన్మధరావు మిత్రబృందాన్ని భయపెట్టినయ్.


మరో రెండు నెలల తర్వాత వొక రోజు మన్మధరావు, భార్య కరోనాతో మరణం సంభవించిన తమ బంధువుల యింటికి పరామర్శించడానికి వెళ్ళారు. మిగిలిన మిత్రులు వద్దని చెప్పినా, మొహమాటానికి లోనై గట్టిగా నిర్బంధించ లేక పోయారు. మాస్కులు పెట్టుకుని, పేస్ షీల్డ్ పెట్టుకుని, కార్ లోనే వెళ్ళి వచ్చారు. ఆ రాత్రి అందరూ మామూలుగానే కలిసి మందు కొట్టారు, ముచ్చట్లు చెప్పుకున్నారు.


మర్నాడు వుదయమే మన్మధరావు కి కొంచం జలుబు అనిపించింది. అందరి లో వొక్క సారి ఆందోళన. అన్నీ ముసలి ప్రాణాలే కదా! ఎందుకైనా మంచిదని ఫోన్ లో ఫామిలీ డాక్టర్ ని సంప్రదించాడు మన్మధ రావు. ఆ డాక్టర్ కొన్ని ప్రశ్నలు వేసి, ముందుగా మన్మధ రావు ని అందరినించీ వేరు పడ మని చెప్పి, కొన్ని సూచనలు చేసాడు. మళ్ళీ మర్నాడు మాట్లాడ మన్నాడు. ఆ రోజు అందరూ బాధపడ్డారు. మన్మధరావు కి ధైర్యం చెప్పారు. మూడో రోజు కరోనా లక్షలన్నీ బయట పడ్డాయి. వెంటనే టెస్ట్ చేయించుకోవడానికి విజయా డయాగ్నోస్టిక్స్ కి ఫోన్ చేసారు. పదముగ్గురూ టెస్ట్ కిచ్చారు.


మర్నాడు టెస్ట్ రిసల్ట్ వచ్చింది. మన్మధరావు కి పాజిటివ్, మిగిలిన పన్నెండు మందికీ నెగటివ్. మన్మధరావు పూర్తిగా ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయాడు. మందులు యింటికే వచ్చాయి. హైదరాబాద్ లో ప్రభుత్వం సమర్ధంగా వ్యవహరించడం అందరికీ సంతోషమైంది. మర్నాడు వుదయం మన్మధరావు భార్య భాగమతి అందరినీ వుద్దేశించి అన్నది, ' ఆయనకి మతిమరపు వుంది, కళ్ళు కూడా సరిగా కనపడవు, వొక్కో సారి కళ్ళు తిరిగి పడిపోతుంటాడు. అందువల్ల నేను కూడా ఆయనతో పాటే ఆ గదిలో వుండి చూసుకుంటాను. ఆ రెండు బెడ్లనూ దూరం చేస్తే మధ్యలో గ్యాప్ ఆరడుగులు వుంటుంది . ఆ బెడ్ రూమ్ పెద్దది కదా! నేను మాస్క్ పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటాను. మీరంతా నాకు కూడా సపర్యలు చేయాల్సి వస్తుంది......'


'ఆమ్మో! అక్కడ వుంటే మీకు కూడా వస్తుంది కదా భాగమతీ !... అంత రిస్క్ తీసుకోకుండా, మన్మధని హాస్పిటల్ చేర్పిస్తే యెలా వుంటుంది ?' అన్నది అనిత.


' అది నిజమే! నీకు కూడా అంటుకుంటుంది భాగమతీ!,' అన్నది ఉమ.

'హాస్పిటల్ లో చేర్చడం యెందుకు ? అక్కడ యెవర్నీ సరిగా పట్టించుకోరు. డాక్టర్ కూడా హోమ్ ఐసోలేషన్ చాలన్నారు కదా!... ఇంకో విషయం, ఆడవాళ్ళకి వైరస్ అంటుకోవడం తక్కువ అంటున్నారు కదా!... హస్బెండ్ కోసం ఆ మాత్రం రిస్క్ తీసుకోనక్కర లేదా?' అంది భాగమతి.

'వద్దమ్మా, యీ రిస్క్ తీసుకోకూడదు,' అన్నాడు మంజునాథ.

'మన డాక్టర్ని అడుగుదాం,' అన్నాడు మదన్.


'డాక్టర్ని అడిగితే వద్దంటారు, లేదా హాస్పిటల్ లో అడ్మిట్ చేయమంటారు. నేను అన్నీ జాగ్రత్తలూ తీసుకుంటా. వేడినీళ్లు పుక్కిలిస్తాను, మాస్క్ పెట్టుకుంటాను, చేతులకి గ్లౌసెస్ పెట్టుకుంటాను, సానిటైసర్ వాడుతుంటాను, యింకా మీరు చెప్పండి జాగ్రత్తలు. అన్నీ చేస్తాను...' అన్నది భాగమతి.


అందరూ వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నారు. చివరికి యెవ్వరూ భాగమతి కి వద్దని గట్టిగా చెప్పలేక పోయారు. బెడ్స్ ని సర్దించి, భాగమతి ఆ రూమ్ లోకి చేరింది.

మూడో రోజుకి మన్మధరావు కి కొద్దిగా ఆయాసం మొదలైంది. చిత్రంగా భాగమతికి కూడా ఆయాసం అనిపించింది. ఆమెకి కోవిడ్ టెస్ట్ చేయించారు. టెస్ట్ రిసల్ట్ వచ్చే టైం కి ఆమెకి యింకో రెండు లక్షణాలు, రుచి, వాసన పోవడం, జ్వరం రావడం జరిగింది. మన్మధ రావు కొడుకు రోజూ ఫోన్ చేస్తున్నాడు. ఆ రోజు మంజునాథ అకౌంట్ కి పది లక్షలు బదిలీ చేసి, యిద్దర్నీ మంచి హాస్పిటల్ లో చేర్చమన్నాడు.


ఏ హాస్పిటల్ కి ఫోన్ చేసినా బెడ్స్ ఖాళీ లేవనే సమాధానం వచ్చింది. నరసింహ కొడుకు స్నేహితుడు పోలీస్ కమీషనర్ ఆఫీస్ లో పనిచేస్తాడు. అతన్ని పట్టుకుని వొక మంచి హాస్పిటల్ లో బెడ్స్ సంపాదించి, యిద్దరినీ చేర్చారు.


అందరిలోనూ విషాదమే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చివరికి చేసిన వొక్క పొరపాటు యింత పని చేస్తుందని వూహించలేక పోయారు. నిజానికి అందరూ వద్దన్నా కూడా మన్మధరావు మొండిగా యిల్లు దాటాడు.


గంట గంటకీ యిద్దరి పరిస్థితి గురించి ఫోన్ చేస్తూ హాస్పిటల్ సిబ్బంది తో చివాట్లు కూడా తిన్నారు

.

మరో మూడు రోజుల తర్వాత మన్మధరావు కి కోవిడ్ నెగటివ్ వచ్చింది. ఆయాసం కొంచం తగ్గింది. ఆయన్ని డిశ్చార్జ్ చేసి, యింటి దగ్గిర ఆక్సిజన్ పెట్టుకోమన్నారు. హాస్పిటల్ బెడ్స్ కి వున్న డిమాండ్ అలాంటిది. మిత్రులందరూ మన్మధరావు ని యింటికి తీసుకొచ్చారు. కష్టం మీద ఆక్సిజన్ యూనిట్ ని సంపాదించి, అమర్చారు.


భాగమతి కి ఆయాసం యెక్కువైంది. ఐ సి యూ లోనే వుంది. మరో వారం దినమొక గండం అన్నట్లు గడిచిపోయింది. మన్మధరావు పూర్తిగా కోలుకున్నాడు. అమ్మయ్య, అనుకున్నారు మిత్రులందరూ. భాగమతి కోసం దేవుడికి పూజలు చేస్తూనే వున్నారు.

ఆ రోజు వుదయం హఠాత్తుగా అలాంటి వార్త వినాల్సి వస్తుందని వాళ్ళెవరూ వూహించలేదు. కోవిడ్ భాగమతిని మింగేసింది.


ఆ వార్తకి అందరూ మ్రాన్పడి పోయారు. అందరి కళ్ళంట కన్నీరు ధారలు కట్టాయి. చెప్పలేక, చెప్పలేక మన్మధరావు కి చెప్పారు. మతిమరపు వున్నా, యింకా ఎన్ని రోగాలు వున్నా మన్మధరావు బాధని నిగ్రహించుకుని, వొక్క మాట అన్నాడు, ' భర్త గుడ్డివాడని గాంధారి కళ్ళకి జీవితాంతం గంతలు కట్టుకుందట!... నాకోసం భాగమతి కోరి కోవిడ్ ని కొనితెచ్చుకుంది. ఇది దాని కర్మో, నా ఖర్మో యిలా జరిగిపోయింది!' అంటూ విషాదం తో తలవంచుకుని కూర్చున్నాడు.

మన్మధరావు ని వోదార్చడం వొక యెత్తు అయితే, కన్న కొడుకు వున్నా, లేని తనం తో, పరాయి వాడి చేతిలో భాగమతి కి నలుగురు మధ్యలో అంత్యక్రియలు జరిపించడం మరో యెత్తు !

'నువ్వు వొంటరి వాడివి కావురా, మన్మధా!... నీకు మేమంతా వున్నాం!' అంటూ అందరూ మన్మధరావు కి ధైర్యం చెప్పారు.


అలాగే కదలకుండా తలవొంచుకు కూర్చున్న మన్మధరావు కు ధైర్యం చెప్తూ, భుజం మీద తట్టాడు మంజునాథ. మన్మధరావు శరీరం పక్కకి వొదిగిపోయింది. ఒక్క క్షణం యేమి జరిగిందో అర్ధం కాక తెల్ల మొహాలు వేసిన మిత్రులందరూ, విషయం అర్ధమయ్యాక ఘొల్లుమన్నారు.

[సమాప్తం]

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం :

అందరికీవందనాలు.

చిన్నతనంనించి కథలురాయడం నాహాబీ. 15 వయేట మొదటికథ అచ్చయితే, 18 వయేట ఆంధ్రపత్రిక వారపత్రిక దీపావళికథల పోటీలోనా కథ 'విప్లవం' కి బహుమతి వచ్చింది. తర్వాత కొన్ని కథలు పత్రికల్లో వచ్చాయి. అక్కడితో సాహితీ ప్రస్థానం ఆగిపోయింది. కొన్నిసంవత్సరాల తర్వాత యీ మధ్య మళ్ళీ రాయడం మొదలెట్టాను. అయితే డిజిటల్ మీడియాలోనే రాస్తున్నాను. 2020 సంక్రాంతి సమయం లో ఒక కథకి [చెన్నైఅనే నేను] ప్రతిలిపిలో మూడో బహుమతి వచ్చింది. ఈమధ్య అందులోనే మరో కథ10 ఉత్తమ కథల్లో వొకటిగా నిలిచింది. గోతెలుగు డాట్కామ్ లో వొక హాస్య కథ ప్రచురింపబడింది. కొన్నిసంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రాయగలననే ఆత్మవిశ్వాసం కలిగింది.

'శిరిప్రసాద్' అనేకలం పేరుతో రాస్తుంటాను.

ఇంతకంటే చెప్పుకోతగ్గ విషయాలు లేవు. కృతజ్ఞతలు.
87 views1 comment

1件のコメント


కమలాకర్..

ఈ కధ ముందు కొంచం ఎలాగో అనిపించింది, కానీ, ముగింపు ఎంతో 'అద్భుతం 'గా ముగించావో, అంత హృదయం కదిలే లా ఉంది, బాస్ 🙋‍♀️. శభాష్!!

いいね!
bottom of page