'No Ball' Written By Siriprasad
రచన : శిరిప్రసాద్
మహిత తెలుగు సినీ రంగంలో పైకొస్తున్న తార. కిందటి సంవత్సరం ఆమె నటించి, విడుదలైన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం యెదురుచూస్తున్నారు . కథ బాగుంటేనే నటిస్తాను, అని ఆమె వొక టీ వీ ఛానల్ యింటర్వ్యూ లో చెప్పడం వల్ల అందరూ మా కథ బాగుంది, అంటూ ఆ అమ్మాయిని డేట్స్ అడుగుతున్నారు. తన అదృష్టానికి మురిసిపోతున్న ఆ అమ్మాయి రెండు సినిమాలని ఓకే చేసింది, కథలు పూర్తిగా వినకుండానే.
ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లలో మహితని అనుసరిస్తున్న వాళ్ళు ఐదు లక్షలకి చేరుకున్నారు. ఫేస్బుక్ లో వేల మంది అనుసరిస్తున్నారు. రెండు శారీ షాప్స్, మూడు ఎలక్ట్రానిక్ షాప్స్ ఓపెనింగ్ కి పిలవగా వెళ్ళి అభిమానుల్ని అలరించింది. సినిమా ప్రొమోషన్స్ కోసమో, రియాలిటీ షో ల లోనో టీవీ ఛానెల్స్ లో కనిపిస్తూ తన అందచందాలను ప్రదర్శిస్తుంటుంది. అలా ఆమె ప్రభ వెలిగిపోతుండగా, ఆమె పుట్టిన రోజు సమీపించింది. ఇంస్టాగ్రామ్ లో అభిమానులు ఆమె జన్మదినాన్ని వర్చ్యువల్ గానే అయినా ఘనంగా సెలెబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. నెల రోజుల ముందునించే బర్త్ డే కి కౌంట్ డౌన్ మొదలెట్టేసారు.
యు ట్యూబ్ లో భౌ భౌ ఛానెల్ వాళ్ళు మహిత పుట్టిన రోజు పండగని రోజంతా లైవ్ లో ప్రసారం చేస్తామని ప్రటించేసారు. భౌ భౌ ఛానల్ కి ప్రతిస్పర్ధి ఛానల్ చౌ చౌ ఛానెల్ కూడా అలాంటి ప్రకటనే చేయడం, భౌ భౌ కి అనుమానం కలిగించింది. ఎందుకైనా మంచిదని మహితని భౌ భౌ ఛానెల్ వాళ్ళు ముందుగానే హెచ్చరించారు.
మహిత పుట్టిన ‘తేదీని’ అన్నీ సోషల్ మీడియా సైట్స్ వొకటే చూపిస్తున్నా, పుట్టిన సంవత్సరం మాత్రం వేరేగా వుంది. అందువల్ల ఆమె వయసు 17 నించి 21 సంవత్సరాల మధ్య వుండొచ్చు . అభిమానులకి అది పెద్ద సమస్య కాదు. ఆమె విజయవంతంగా రాణిస్తున్నంత కాలం వాళ్ళకి వేరే విషయాలు పట్టవు. ఒకసారి మహిత తన ఇంస్టాగ్రామ్ లో మదర్ తెరెసా తన ఆరాధ్య దైవం అని పోస్ట్ పెడితే అయిదు లక్షల లైక్స్ వచ్చాయి. పాతిక వేల మంది మంది మహితని మదర్ తెరెసా తో పోల్చుతూ పోస్ట్లు పెట్టారు.
మహిత తన పుట్టిన రోజు యింకా రెండు రోజులు వుందనగా వొక టీవీ ఛానల్ యింటర్వ్యూ లో తను పుట్టిన రోజు అనాధ బాలబాలికల మధ్య వొక అనాధాశ్రమం లో జరుపుకోనున్నట్టు ప్రకటించింది. అంతే , సోషల్ మీడియా లో మహితని అభిమానులు ఆకాశానికి యెత్తేసారు. ఆమెకి కావాల్సింది కూడా అదేనేమో!
పుట్టిన రోజు ముందురోజు మేనేజర్ శర్మ కి ఫోన్ చేసింది మహిత.
'శర్మ గారూ, రేపటి యేర్పాట్లు చేస్తున్నారా?' అడిగింది.
'ఎస్ మాడం ! ... ఆ అనాధాశ్రమం లో ముఫై మంది పిల్లలున్నారు. బట్టలకి ముఫై వేలు అవుతుంది'. శర్మ చెప్పాడు.
'అంతెందుకండీ?... పది వేలు చాలు. కొత్త బట్టలు వీడియోల్లో కొత్తగానే కనిపిస్తాయి కదా!' అంది మహిత.
'స్వీట్స్ మేడం ?' అడిగాడు శర్మ.
'పిల్లలకి మూడు కిలోలు పాల కోవా తీసుకోండి. ఛానెల్స్ వాళ్ళకి మంచి స్వీట్స్ హాఫ్ కిలో పాకెట్స్ సెపెరేట్ గా అందరికీ తీసుకోండి!' అన్నది.
'ఓకే మేడం . కేక్ పదికిలోలది గ్రాండ్ గా వుండేది ఆర్డర్ యిచ్చేసాను మేడం . కేక్ వీడియోల్లో గ్రాండ్ గా కనపడాలి కదా మేడం !' బతిమలాడాడు శర్మ.
'అది ఓకే ' అంది మహిత.
మహిత పుట్టిన రోజు రానే వచ్చింది. కాంచీపురం పట్టు చీర కట్టుకుని, అందంగా ముస్తాబై ఆనంద అనాధ శరణాలయం కి బయల్దేరింది. వెళ్ళేముందు మేనేజర్ కి ఫోన్ చేసింది, 'శర్మగారూ ! , మీరు అక్కడే వున్నారా?' అని అడిగింది.
'ఉన్నాను మాడం . పది కిలోల కేక్ కూడా వచ్చేసింది. చాలా గ్రాండ్ గా వుంది!... ఒకటే కాండిల్ పెడుతున్నాను. పిల్లలందరికీ చాక్ లేట్లు , స్వీట్స్, కొత్త బట్టలు సిద్ధం చేసాను. మీరు రావడమే ఆలస్యం!' అన్నాడు శర్మ.
'అవన్నీ సరేనండీ! . మీడియా వాళ్ళు వస్తున్నారా?' అని కొంచం చిరాగ్గా అడిగింది.
'అయ్యో, అదేంటి మేడం!... అసలు విషయం యెలా మరుస్తాను ?... మొత్తం అన్నీ పత్రికల సినిమా కరెస్పాండెంట్స్, టీవీ ఛానెళ్ల వాళ్ళు, యూట్యూబ్ నించి భౌ భౌ , చౌ చౌ ఛానెల్ వాళ్ళు రెడీ గా వున్నారు..పోలీస్ బందోబస్త్ కూడా జబర్దస్త్ గా వుంది .' అన్నాడు శర్మ.
'ఓకే ... బయల్దేరుతున్నాను...' అంటూ కారెక్కింది మహిత.
అనాధ శరణాలయం దగ్గిర పిల్లలందరూ గేట్ దగ్గిర ఎదురుచూస్తున్నారు, చేతిలో గులాబీ పువ్వుతో. ఈ గులాబీ పూలు కూడా శర్మే ఆరెంజ్ చేసాడు. కారు దిగుతూనే మహిత ఆశ్చర్యంతోనూ, ఆనందంతోనూ ఆ దృశ్యాన్ని చూసింది. పిల్లలందరూ చుట్టూ మూగి హ్యాపీ బర్త్ డే చెప్పారు. గులాబీలు యిచ్చారు. అందరి చెంపలూ తడుముతూ థాంక్స్ చెప్పింది. గేట్ దగ్గిర యిద్దరు స్త్రీలు మహితకి హారతి యిచ్చారు. మీడియా వాళ్ళు కెమెరాలు తిప్పుతున్నారో, లేదో అని చుట్టూ వో లుక్ యిచ్చింది.
లోపల పిల్లలందరి చప్పట్ల మధ్య కేక్ కోసింది. పిల్లలకి అక్కడి మనుషులు కేక్, స్వీట్స్ పంచిపెట్టారు. అందరికీ తన చేతుల మీదుగా బట్టలిచ్చింది. రెండు నిముషాలు మాట్లాడింది, 'పిల్లలూ మీ అందరి మధ్య పుట్టిన రోజు జరుపుకోడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలా జరుపుకోడం నా పూర్వజన్మ పుణ్య ఫలం. మీరందరూ అనాధలని అనుకోకండి! మీలో చదువుకోవాలనే వుత్సాహం వున్నవారి చదువు ఖర్చులు భరిస్తాను. మీరంతా బాగా చదువుకుని, యింజినీర్లు , డాక్టర్లు కావాలని నా కోరిక. .....'
మధ్యలో కలగచేసుకుంటూ, 'మీకులా యాక్టర్స్ అవద్దా ఆంటీ?' అని అడిగిందో పిల్ల. పెద్దగా నవ్వి, ఆ పాపని యెత్తుకుని ముద్దాడి, 'అంతకంటేనా!... అయితే కొంచం ఆలస్యంగా యాక్టరువి కామ్మా!... నాకు పోటీ రావద్దు ,' అంది. మీడియా వాళ్ళతో సహా అందరూ పెద్దగా నవ్వి, చప్పట్లు కొట్టారు.
ఫంక్షన్ అయ్యాక యింటికి వచ్చి, సోఫా లో కూర్చుని రిమోట్ తో టీవీ ఛానెల్స్ తిప్పుతోంది. ఒకటే మోత . మహితకి ప్రశంసలే ప్రశంసలు. ఇంస్టాగ్రామ్. ట్విట్టర్ లు కూడా మోత మోగి పోతున్నాయి. అభిమానులు మహితని మళ్ళీ మదర్ తెరెసా తో పోల్చుతూ పోస్ట్ లు పెడుతున్నారు. లక్షల్లో లైకులు, కామెంట్లు.
ఫోన్ మోత ఆగట్లేదు. ఒకరి తర్వాత వొకరు , హీరోలు, నిర్మాతలు, దర్శకులు, నృత్య దర్శకులు, మేక్ అప్ మెన్ లు, అన్నీ క్రాఫ్ట్స్ నించి చాలామంది ఫోన్ చేశారు. బంధువుల నించి కూడా వొకటే ప్రశంసలు! బంధువులొకామె చెన్నై నించి ఫోన్ చేసి, తన పనిపిల్ల వొక అనాధ అని, ఆ అమ్మాయికి సహాయం చేయమని కోరింది. నువ్వే చేసి చావచ్చు కదా అని మనస్సులో అనుకుని, అలాగే చూద్దాం అని చెప్పింది.
మహిత పుట్టిన రోజు కార్యక్రమం సోషల్ మీడియా లో ఆ రోజంతా ట్రేండింగ్ లో వుంది. మహిత మబ్బుల్లో తేలిపోతోంది.
సినీ రంగంలో తన క్లోజ్ ఫ్రెండ్స్ యిద్దరు యువ హీరోయిన్లు, ముగ్గురు యువ హీరో లు, యింకో ముగ్గురు బయటి మిత్రులకి రాత్రి వూరు శివార్లలో వున్న ఇష్క్ బార్ అండ్ బ్యాండ్ అనే పబ్ లో పార్టీ యిచ్చింది. తొమ్మిదింటికి అందరూ పబ్ చేరుకున్నారు. కాసేపు అందరూ పలకరించుకున్నారు. 'నీ పుట్టిన రోజు డ్రెస్ కేక! ఎక్కడ తీసుకున్నావ్?'
అని అడిగింది ఫ్రెండ్, కో స్టార్ మణిశ్రీ .
'చెన్నై వెళ్లానే , నాకు తెలిసిన బౌటిక్ కి, ఫ్లైట్ లో ఓన్లీ వన్ బర్త్ డే డ్రెస్ కోసం! వాడి దగ్గిర నేను అడిగిన డిసైన్ లోడ్రెస్ దొరక లేదు. ముంబై లో మరో బౌటిక్ కి ఫోన్ చేసి బుక్ చేసాడు. రెండు లక్షలు అయ్యింది. ముంబై నించి కొరియర్ లో వచ్చింది. బాగుందంటావా?' అని అడిగింది.
'వెరీ నైస్,' అంది ఫ్రెండ్ సితార, మనస్సులో, 'సుల్తాన్ బజార్ లోనో, చార్మినార్ దగ్గిరో కొన్నట్టుంది,' అనుకుంది, హేళనగా.
కొద్దిసేపయ్యాక, కాక్ టైల్స్వచ్చాయి. ఇద్దరు ప్యూర్ విస్కీ ఆర్డర్ చేశారు. ఒక్కో డ్రింక్ తర్వాత ఒక్కో గంట డాన్స్! మస్త్ ఎంజోయ్మెంట్ !... డాన్స్ చేస్తూ, చేస్తూ ఒక హీరో మహితని గట్టిగా కావలించేసుకుని, గట్టిగా ముద్దు యిచ్చాడు. మరొకడు మెత్తగా నడుముని వొత్తుతున్నాడు. అన్నీ తెలుస్తున్నా మహిత యేమీ చేయలేకపోయింది. మంచి మూడ్ లో వుంది. ఒంటి గంట దాకా ఎంజాయ్ చేశారు.
పబ్ బయటికి వచ్చాక నలుగురైదుగురు సెల్ఫీ అడిగారు. తూలుకుంటూనే వాళ్ళతో సెల్ఫీ దిగింది. అందరికీ బై చెప్పి కారు దగ్గిరకి వచ్చింది. ఓ ఫ్రెండ్ వచ్చి ‘నన్ను డ్రైవ్ చేయమంటారా’ అని అడిగాడు. డాన్స్ చేస్తున్నప్పుడు తన బట్టక్స్ మీద రెండు, మూడుసార్లు కొట్టింది అతనేమోనని అనుమానం వచ్చి, ‘నో, థాంక్స్’ అని చెప్పి కారు యెక్కి స్టార్ట్ చేసేసింది. వాడికి గుడ్ నైట్ చెప్పింది. తాగి వుండడం వల్ల అడ్వాంటేజ్ తీసుకుని, ఏమైనా చేస్తాడేమో, అని కూడా కొంచం భయపడింది.
కారు వేగంగా డ్రైవ్ చేసుకుంటూ, జూబిలీ హిల్స్ లోకి ప్రవేశించింది. ఒక జంక్షన్ లో ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కనిపించింది. కారుని కంట్రోల్ చేయలేక పోయింది. చౌరస్తా లో వెహికిల్స్ లైన్ కట్టి వున్నాయి. చివర్లో ఆగివున్న పోలీస్ జీప్ ని వెనకనించి గట్టిగా గుద్దింది. ఆ జీపులో తూలుతో కూర్చున్న వొక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ వూపుకి జీప్ లోంచి బయట నేల మీద పడ్డాడు. నడుము విరిగినట్టనిపించింది అతనికి. నిస్సహాయంగా చూస్తున్న మహిత వణికిపోయింది..
అప్పుడే డీ సి పీ [ట్రాఫిక్] సర్ప్రైస్ చెకింగ్ కి వచ్చాడు. అందరికీ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై వుక్కు పాదం మోపుతామని ముందు రోజే సిటీ కమీషనర్ ప్రకటించాడు. అందువల్ల బంజారా, జూబిలీ హిల్స్ లోని అన్ని జంక్షన్ ల లో సర్ప్రైజ్ చెకింగ్ చేస్తున్నారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ కి మహిత వంతు వచ్చింది. తూలుతున్నా, స్ట్రయిట్ గా నిలబడే ప్రయత్నం చేస్తూ, స్ట్రెయిట్ గానే నిలబడ్డాననుకుంది. టెస్ట్ చేసి కానిస్టేబుల్ 'వంద ' అన్నాడు.
డీసీపీ అన్నాడు, 'నువ్వు సినిమా యాక్టర్ వి కదా!... మంచిగా పయికొస్తున్నావ్ !... ఇలాంటి పనులేంటమ్మా? పోలీస్ జీప్ నే గుద్దావు , మా కానిస్టేబుల్ కింద పడ్డాడు; గాయ పడ్డాడు. ఆల్కహాల్ చాలా తీసుకున్నట్టున్నావ్, ముఫై వుండాల్సింది, వంద వుంది! … మా కానిస్టేబుల్ తో స్టేషన్ కి వెళ్ళండి!'
కానిస్టేబుల్ వొకడు మహిత కారుని తీసికెళ్ళి పోయాడు. మరో కానిస్టేబుల్ మహితని జీప్ లో స్టేషన్ కి తీసికెళ్ళాడు. ఈ దృశ్యాలన్నీ చౌ చౌ ఛానల్ విలేఖరి కెమెరా లో బంధించాడు. నిజానికి వాడు యెప్పట్నుంచో మహితని అనుసరిస్తున్నాడు. వాడు కూడా పోలీస్ జీప్ వెనకాల పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు బైక్ మీద. అతన్ని స్టేషన్ ముందే ఆపేసాడు పోలీస్ కానిస్టేబుల్ . లోపలికి వెళ్ళిన మహితకి డ్రింక్ ప్రభావం సగానికి పడిపోయింది. అడ్డకోలు ప్రశ్నలు వేసి, మహిత దగ్గిరున్న డబ్బు తీసుకుని, యింకా పెద్ద మొత్తానికి వొప్పించి, రెండు రోజులు టైమిచ్చి, స్టేషన్ బెయిల్ యిచ్చి మూడింటికి వదిలారు.
చౌ చౌ విలేఖరి తను రికార్డు చేసింది మూడు చానెళ్ళకి యాభై వేలకి అమ్మేశాడు. మర్నాడంతా టీవీ ల్లో డ్రింక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ప్రముఖ నటి అంటూ ఆ దృశ్యాలన్నింటినీ పదే పదే చూపించారు. వార్తా పత్రికల్లో మొదటి పేజీలో మహిత అరెస్ట్ వార్త ప్రముఖంగా ప్రచురింప బడింది. మూడో పేజీలో వో మూల చిన్న ఫోటో పెట్టి, పుట్టిన రోజు నాడు అనాధాశ్రమం లో బట్టలు పంచుతున్న నటి అని వేశారు.
పొద్దున్నే ఆ వార్తని టీవీల్లో, పత్రికల్లో చూసుకుని మహిత తల మీద కొట్టుకుంది, 'ఛీ... ఛీ...' అనుకుంటూ!
[సమాప్తం]
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
అందరికీవందనాలు.
చిన్నతనంనించి కథలురాయడం నాహాబీ. 15 వయేట మొదటికథ అచ్చయితే, 18 వయేట ఆంధ్రపత్రిక వారపత్రిక దీపావళికథల పోటీలోనా కథ 'విప్లవం' కి బహుమతి వచ్చింది. తర్వాత కొన్ని కథలు పత్రికల్లో వచ్చాయి. అక్కడితో సాహితీ ప్రస్థానం ఆగిపోయింది. కొన్నిసంవత్సరాల తర్వాత యీ మధ్య మళ్ళీ రాయడం మొదలెట్టాను. అయితే డిజిటల్ మీడియాలోనే రాస్తున్నాను. 2020 సంక్రాంతి సమయం లో ఒక కథకి [చెన్నైఅనే నేను] ప్రతిలిపిలో మూడో బహుమతి వచ్చింది. ఈమధ్య అందులోనే మరో కథ10 ఉత్తమ కథల్లో వొకటిగా నిలిచింది. గోతెలుగు డాట్కామ్ లో వొక హాస్య కథ ప్రచురింపబడింది. కొన్నిసంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రాయగలననే ఆత్మవిశ్వాసం కలిగింది.
'శిరిప్రసాద్' అనేకలం పేరుతో రాస్తుంటాను.
ఇంతకంటే చెప్పుకోతగ్గ విషయాలు లేవు. కృతజ్ఞతలు.
Comments