top of page

ఊఁ అంటావా... ఊఁహూఁ అంటావా?...

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'U Antava Uhu Antava' Written By Siriprasad

రచన : శిరిప్రసాద్

పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా , మాట్రిమోనీ లో డబ్బు కూడా కట్టేసాడు సురేష్ .

రోజులు గడుస్తున్నాయి.

మరి అతనికి తగిన సంబంధం కుదిరిందా లేదా ప్రముఖ రచయిత సిరిప్రసాద్ గారి కథలో తెలుసుకోండి.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

ఇక కథ ప్రారంభిద్దాం

సురేష్ ఆఫీస్ కి బయల్దేరాడు.

'అమ్మా! వెలుగు మాట్రిమోనీ డాట్ కామ్ కు డబ్బులు కట్టేసాను. ఇవ్వాళ చూడు. మంచివి కనిపిస్తే నోట్ బుక్ లో వాళ్ళ ఐ డీ నెంబర్ నోట్ చేసి పెట్టు. సాయంత్రం యింటికి వచ్చాక చూస్తాను. తొందరపడి యెవరికీ ఫోన్ చేసేయ్యకు. నాన్న, నువ్వు, నేను కూర్చుని చర్చించుకున్నాకే, మాట్లాడడం!.... అర్థమైందా?'

'అర్ధమైంది లేరా!.... ఇక వెళ్ళు ! ఆఫీస్ కి టైం అవుతోంది!'

సురేష్ ఆఫీస్ కి వెళ్ళాక, ముందు తలుపు వేసి, సురేష్ రూమ్ లోకి వెళ్ళింది. సురేష్ విడిచిన బట్టలు తీసి వుతకడానికి పడేసింది. టవల్ ని బయట ఆరేసింది.

మంచం మీద పడేసి వున్న చెత్తంతా తీసి, బెడ్ షీట్ మార్చింది. 'వీడికి పెళ్ళి చేస్తే కానీ క్రమశిక్షణ అలవడదు,' అనుకుంది. మూల పెట్టివున్న హెల్మెట్ ని చూసింది. హెల్మెట్ యిక్కడే వదిలేసి వేళ్ళాడే, అనుకుంది. ట్రాఫిక్ పోలీస్ చలానా పడుతుందో , యేమో ; వొక్కసారి చలానా పడితే తప్ప బుద్ధి రాదు వీడికి, అనుకుని, రూమ్ నించి బయటికి వచ్చింది. కొడుకు యెంత క్రమశిక్షణగా వున్నా తల్లి యింకా యెక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తుంది!

హాల్లో వున్న కంప్యూటర్ ని ఆన్ చేసింది. అది కూడా తనలాగే ముసలిదయి పోతోంది అనుకుంది, మరి బూటింగ్ కి పది నిముషాలు తీసుకుంటుంది కదా!

వంటగదిలోకి వెళ్ళి , తనకోసం మిగుల్చుకున్న మూడు యిడ్లీలు తిని, కాఫీ కలుపుకుని, గ్లాస్ తో కంప్యూటర్ ముందు కూర్చుంది. వెలుగు మాట్రిమోనీ సైట్ తెరిచింది. సురేష్ ఐ డీ వెంటనే తెరుచుకుంది. ప్రొఫైల్ వొకసారి చదివింది. ఇలాంటి ప్రొఫైల్ తో యెంతమంది అబ్బాయిలు వున్నారో!... అమ్మాయిలు మాత్రం చాలా తక్కువ మందే వుంటున్నారు. సెక్స్ రేషియో తక్కువగా వుండడమో , పై చదువులు చదువుతున్నారో, పెళ్ళిని వాయిదా వేసుకుంటున్నారో, అసలు పెళ్ళే వద్దనుకుంటున్నారో, తల్లితండ్రుల ప్రోద్బలం వుండట్లేదో, కారణం తెలియదు. చిన్న చిన్న మ్యారేజ్ బ్రోకర్లు యింతవరకు సరైన సంబంధం చూపలేక పోయారు. అందుకే వెలుగు మాట్రిమోనీ డాట్ కామ్ లో రిజిస్టర్ చేయించింది.

సురేష్ చాలామంది అబ్బాయిలలాగే బీ యీ చదివాడు. సాఫ్ట్ వేర్ లో జాబ్ చెయ్యాలనుకున్నాడు. క్యాంపస్ ప్లేసెమెంట్స్ లో మూడు కంపెనీ ల నించి ఆఫర్స్ వచ్చాయి. మంచిదొకటి సెలెక్ట్ చేసుకుని, జాయిన్ అయ్యాడు. జాబ్ లో చేరే వరకూ కూడా సురేష్ ప్రత్యేకంగా వుండేవాడు. అందరిలా వుండకూడదు అనుకునేవాడు. తన క్లాసుమేట్స్ అందరూ అర్ధరాత్రి వరకూ చదివి, పొద్దున ఆలస్యంగా నిద్ర లేచేవాళ్ళు. తను పదింటికి పడుకుని, పొద్దున్న ఐదింటికి లేచేవాడు. అందరూ ఎగ్జామ్స్ ముందు చదువుతుంటే, తను ఎగ్జామ్స్ ముందు హాయిగా పడుకునేవాడు, సిలబస్ అంతా పూర్తై పోయేది, కాబట్టి!... ఇక అందరిలా బీరు కాక, పాలు తాగుతుంటాడు. ఉదయం పూట స్నానం చేసి హనుమాన్ చాలీసా చదువుకుంటాడు. పెరట్లో మందారమో, గులాబీనో కోసుకొచ్చి సరస్వతీ దేవి ఫోటో మీద పెట్టి దణ్ణం పెట్టుకుంటాడు. క్లాస్ లో 'పప్పు,' 'తేడా గాడు' అని పేర్లు పెట్టి క్లాసుమేట్స్ హేళన చేస్తుండే వారు. అయినా డోంట్ కేర్! వీళ్ళెవరూ చదువయ్యాక మన ముఖం చూడరు. అంతా స్వార్ధపరులే . వీళ్ళకోసం నేనెందుకు బ్రతకాలి, నా కోసం నేను బ్రతుకుతాను, అనుకుంటుంటాడు. నిజమే, యెవరి జీవితం వాళ్ళు జీవించాలి. వేరే వాళ్ళ లోకి పరకాయ ప్రవేశం చేస్తే భవిష్యత్తులో అన్నీ కష్టాలే. అసలు యే వ్యక్తినీ వాళ్ళ ముఖం చూసి, పై పై రంగులు చూసి, కనిపించే ప్రవర్తన చూసి, అంచనా వెయ్యకూడదు. చాలా మంది గోముఖ వ్యాఘ్రాలు వుంటారు, మిగిలిన వాళ్ళు మేక వన్నె పులులు! అందుకే సురేష్ ఫ్రెండ్స్ తో 'హాయ్' అంటే 'హాయ్' ! అంతే !

తన కంటూ కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకున్నాడు. వాటి ప్రకారం నడుచుకుంటూ వుంటాడు. ఆల్మోస్ట్ అసంకల్పిత ప్రతీకార చర్యలా !

ముఫై దాటాక పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ యిచ్చాడు. తల్లి, స్వరూప కి భయం వేస్తూనే వుంది, సురేష్ పెళ్ళికి ఆలస్యం చేస్తున్నాడు, సంబంధాలు దొరకడం కష్టమని. అయినా వాడితో గట్టిగా మాట్లాడాలంటే భయం. తండ్రి శేషగిరి పెద్దగా పట్టించుకోడు. పెళ్ళికి ముందు కూతురికి, కొడుక్కి తగినంత స్వేచ్ఛ యిచ్చేవాడు. వాళ్ళకి తెలియకుండా నిఘా పెట్టేవాడు. అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు అనవసరం గా జోక్యం చేసుకుని, వాళ్ళని రెచ్చకొట్టడం దేనికని తన పనేదో, తను చేసుకుంటూ, యింట్లో వున్నా లేనట్టు, లేకున్నా వున్నట్టు వుంటుంటాడు.

ఆఫీస్ లో తన సహచరులిద్దరికి చెప్పాడు సురేష్, 'వెలుగు మాట్రిమోనీ లో రిజిస్టర్ చేసాను. ప్రోస్పెక్ట్స్ యెలావుంటాయో ?' అని.

ఒక కొలీగ్ అన్నాడు, 'తెలిసిన వాళ్ళలోనో, బంధువుల్లోనో యెవరైనా వుంటే చూసుకోడం బెటర్. మాట్రిమోనీల్లో కాండిడేట్లని నువ్వు తట్టుకోలేవు, సురేష్,'

రెండో వాడు అన్నాడు, 'వొక్కసారే వో యిరవై బాణాలు వెయ్యవోయ్! … ఒక్కొక్కటి వేస్తూ పొతే పదేళ్లు పడుతుంది.'

కొద్దిగా నిరాశ పడ్డాడు సురేష్.

అది చూసి, 'నిరాశ పడొద్దు. మన పెద్దోళ్ళు చెప్తుంటారు కదా, మన భార్య కావాల్సిన అమ్మాయి యెక్కడో వుండే వుంటుంది ; వెతుక్కోవడమే మనం చేసేది, అని. ఆల్ ది బెస్ట్!' అన్నాడు.

సాయంత్రం యేడున్నరకి యింటికి చేరాడు సురేష్. స్నానం చేసివచ్చి, హాల్లో సోఫా లో కూర్చున్నాడు. అమ్మా నాన్నలు నోట్ బుక్ తో రెడీ గా వున్నారు.

'ఒక పది సెలెక్ట్ చేశారా, యివ్వాల్టికి. చూస్తావా?' అడిగింది అమ్మ.

'ఇవ్వు!' అని నోట్ బుక్ తీసుకుని, ఆ పది ఐడీ లు వొకటి తర్వాత వొకటి చూసాడు. ఆ పదింటిలోంచి రెండు టిక్ చేసాడు. 'అదేంటిరా, రెండే నచ్చాయా?' అంది అమ్మ నీరు కారి పోతూ.

'అంతేనమ్మా!... ఆఫీస్ లో ఇద్దర్ని అడిగాను. ఈ సైట్స్ లో అంతా ముదుర్లే వుంటారుట ! కలవడం కష్టం అన్నారు. తెలిసిన మ్యాచ్ లేవైనా వుంటే చూసుకోడం బెటర్ అన్నారు,' అన్నాడు సురేష్.

'ఆ పని అయిదు వేలు కట్టకముందు అడిగివుండాల్సింది కదా!' అన్నది అమ్మ.

'ఆ అయిదు వేలు పొతే ఏమౌతుందిలే, ఆ అయిదు వేలతో అనుభవం కొనుక్కున్నామనుకుందాం!' అన్నాడు సురేష్.

నాన్న కేలండర్ చూసి టైం బాగుంది, ఫోన్ చేయమని అమ్మకి చెప్పడం తో, అమ్మ ఒకరికి ఫోన్ చేసింది. పది రింగుల తర్వాత ఆ అమ్మాయి తల్లి రెస్పాండ్ చేసింది. ముందు మాటలయ్యాక అమ్మ విషయం చెప్పి, అమ్మాయి ఫోటో పంపమంది. అవతలి నించి ప్రశ్న: మీ అబ్బాయికి కుజ దోషం వుందా ?'

'లేదండీ!'

'మా అమ్మాయికి వుంది. సారీ అండీ,' అని ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది.

'ఎంత పొగరు!' అంది అమ్మ విచారంగా. 'తల్లికే కుజ దోషం వున్నట్టుంది.'

రెండో నెంబర్ తిప్పింది. 'మా అమ్మాయి అమెరికా సంబంధం చూడమంటోంది. సారీ,' అని పెట్టేసింది. సురేష్ ప్రాధమికంగా వొప్పుకున్న రెండు మ్యాచ్ లూ పది నిముషాల్లో తేలిపోయాయి.

'ఏంటి నాన్నా, టైం బాగుందన్నావ్?' అన్నాడు నాన్నతో వ్యంగ్యం గా.

'అందుకే పెద్ద ప్రమాదాలే తప్పి పోయి వుంటాయిలే!' అన్నాడు నాన్న కేలండర్ మీద కాన్ఫిడెన్స్ తో!

ఆఫీస్ నించి వచ్చిన సురేష్ ని కూర్చోబెట్టి లిస్ట్ చెప్పింది స్వరూప.

'వరంగల్ ఐడీ కి ఫోన్ చేస్తే, అమెరికా అల్లుడు కావాలన్నారు; మిరియాలగూడ అమ్మాయి కి పెళ్ళి అయిపోయిందట; భీమవరం అమ్మాయి కి అత్తా, అత్తామామలు వుండగూడదంట ; మాచెర్ల అమ్మాయి బెంగళూరు లో జాబ్ చేసేవాడే కావాలిట; విజయవాడ అమ్మాయి తల్లి యెన్ని యిళ్ళు వున్నాయి, యెన్ని కార్లు వున్నాయి, యిలాంటి ప్రశ్నలు వేసి నో చెప్పింది. ఇంక... '

'ఆపు... ఆపు ... మన బంధుమిత్రులందరికీ వొక సర్కులర్ పంపించు ... వాళ్ళకి తెలిసిన మ్యాచ్ లేమన్నా వుంటే చెప్పమని ...' అన్నాడు సురేష్.

'అది కూడా అయ్యింది. వెయిట్ చేద్దాం మరి...' అంది అమ్మ.

ఆరు నెలలు అలవోకగా గడిచిపోయాయి. రెండు రాష్ట్రాల్లో వెలుగు మాట్రిమోనీ లో రిజిస్టర్ చేసుకున్న తన కులంలో పెళ్ళికాని అమ్మాయిలనందరినీ వొక రౌండ్ వేయడం జరిగిపోయింది. ఇక ప్రొఫైల్ ని ఎడిట్ చేసి 'సెక్ట్ నో బార్' అని యాడ్ చేసాడు. ఇంకో ఐదారువందల ప్రొఫైల్స్ కనిపించాయి. ఆ విషయం అమ్మకి చెప్పి, వో పదిరోజులకి ఆవిడకి పని కల్పించాడు సురేష్.

మళ్ళీ మొదలైంది. ఒక పది ఐడీ లు సెలెక్ట్ చేసి నోట్ బుక్ లో రాసింది. రాత్రి పదింటికి వచ్చిన సురేష్, ఆ ఐడీ లు , ప్రొఫైల్స్ చూసే వోపిక లేక, అమ్మకి ఫుల్ పవర్స్ యిచ్చేసాడు . ఇక ఐడీ లు నోట్ బుక్ లో రాయడం, ముగ్గురూ చర్చించి వొక నిర్ణయానికి రావడం వుండదు. ఐడీ నచ్చితే అమ్మ వెంటనే ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని, అంతా ఓకే అనుకుంటే ఫరదర్ ఏక్షన్ తీసుకునే అధికారం యిచ్చేసాడు .

స్వరూప రోజంతా వెలుగుమాట్రిమోనీ డాట్ కామ్ ముందు కూర్చోడం, ఐడీ లు చూడడం, ఫోన్లు చేయడం, నిరాశ పడడం మామూలై పోయింది. మరో మూడు నెలల తర్వాత వొక మ్యాచ్ తగిలింది. అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్; హైదరాబాద్ లోనే వుద్యోగం, నెలకి లక్ష జీతం; పెళ్ళి చూపులకి రమ్మని అమ్మాయి తండ్రి ఆహ్వానం. ఇంక ఆలస్యమెందుకని, ఆ శనివారమే వెళ్ళారు ముగ్గురూ.

అతిధి మర్యాదలు పెద్దగా జరగక పోయినా, అమ్మాయి నచ్చిందనే ఆనందం స్వరూప, శేషగిరి లని వుబ్బి తబ్బిబ్బు చేసింది. అమ్మాయి పేరు అమిత. సురేష్, ఆ అమ్మాయి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.

కొంతసేపు సాఫ్ట్ వేర్ ఇష్యూస్ మాట్లాడుకున్నారు. ఇద్దరూ వొకే ప్లాట్ ఫార్మ్ మీద పనిచేస్తుండడంతో టెక్నికల్ యిష్యూస్ గురించి చర్చించుకున్నారు. ఇద్దరి హాబీలు - వంట చేయడం [నిజానికి యిద్దరూ వంటగది వైపే చూడరు]. సినిమాలు, హాలిడే డెస్టినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు. ఇద్దరికీ అభిమాన నటుడు మహేష్ బాబే! ఇద్దరి ఆంబిషన్స్ వాళ్ళ వుద్యోగాల్లో అభ్యున్నతి సాధించడం, వొక అద్భుతమైన సొంత యిల్లు కట్టుకోడం, అది సాధ్యం కాకపొతే వొక విల్లా, సిటీ కి దూరంగా, కొనుక్కోడం. హోమ్ థియేటర్ యేర్పాటు చేసుకుని ఓ ఓ టీ లో రిలీజ్ అయ్యే సినిమాలు అందులో చూడడం, వగైరా, వగైరా. చివరగా సురేష్ అన్నాడు, 'మీ పేరూ అందంగా వుంది, మీరూ అందంగా వున్నారు!' అని. ఒక చిరునవ్వు విసిరింది. దాన్ని వొడిసి పట్టుకుని జేబులో వేసుకున్నాడు.

ఇంటికి వెళ్తూ దారిలో చెప్పాడు సురేష్, 'నాకు ఓ కే అమ్మా. మిగిలిన విషయాలు మీరే చూసుకోండి. ఆ అమ్మాయి చాలా ప్లెసెంట్ గా వుంది. ఓకే అంటుందనుకుంటా,' అన్నాడు. అమ్మ అడిగింది, 'కట్నం మాటేమిట్రా?'

'కట్నమా?... యేమిటమ్మా , మీరింకా రాతి యుగంలోనే వున్నారు. ఇప్పుడు ట్రెండ్ పెళ్ళి ఖర్చులు కూడా యిద్దరూ షేర్ చేసుకోడం,' అన్నాడు సురేష్.

'సరేలే. ఊరికే అడిగాను. ఎదో కట్నకానుకలు అడుగుదాం, ఫార్మాలిటీ కోసం. ఏమీ అడక్కపోతే, నీకేదో లోపం వుందనుకుని చస్తారు! .... ఇప్పుడు లోకం తీరు వొక విధంగా లేదుగా!' అంది అమ్మ.

'జాతకం గురించి యేమి చెప్తారు నాన్న?...' మౌనంగా వున్న నాన్నలో కదలిక తెచ్చేందుకు.

'శాస్త్రి గారు మీరిద్దరూ వొకరికోసం వొకరు పుట్టారని చెప్పారు!... ఇంతకంటే మంచిగా కలిసే జాతకాలు వుండవుట !...' అన్నాడు నాన్న.

'ఓహ్! కలిసొస్తే అన్నీ యిలాగే కలిసొస్తాయి!...' అన్నాడు సురేష్ నెమ్మదిగా విజిల్ వేస్తూ!

అమ్మానాన్నలకి అర్ధమైంది, సురేష్ కి అనిత బాగా నచ్చిందని. ఐనా సురేష్ ని కొంచం రెచ్చగొట్టాలని, నాన్న అడిగాడు, 'ఆ అమ్మాయికి పొగరు లేదుగా?'

సురేష్ వెంటనే రియాక్ట్ అయ్యాడు, 'అల్లాంటిదేమీ నాకు కనిపించలేదు. మీకేమనిపించింది?'

'మాకు అలాంటిదేమీ కనపడలేదులేరా! నాన్న వూరికే అడిగారు,' అంది అమ్మ.

'అన్నీ బాగా కలిసినట్టే వున్నాయి. వాళ్ళే ఆ అమ్మాయి అభిప్రాయం ముందు చెప్పి, మన అభిప్రాయం అడగాలికదా, రూల్ ప్రకారం?' సురేష్ అడిగాడు. అవునంది అమ్మ.

ఒక రోజు. రెండు రోజులు. అనిత సైడ్ నించి రెస్పాన్స్ రాలేదు. అసహనంగా అన్నాడు సురేష్ అమ్మతో, 'నువ్వే చేయరాదా ఆ ఫొనేదో?' ఇంకో రెండు రోజులు చూద్దాం అంది. అప్పటికీ ఫోన్ రాలేదు. స్వరూప కి అనుమానంగానే వుంది. మళ్ళీ వెలుగు మాట్రిమోనీ సైట్ ఓపెన్ చేసి చూడ సాగింది. వారం తర్వాత అనిత తల్లి ఫోన్ చేసి, అమ్మాయికి నచ్చలేదన్నట్టుగా చెప్పింది. కారణం అడిగీ అడగనట్టుగా అడిగింది. 'అబ్బాయికి స్వతంత్ర అభిప్రాయాలు లేవంది. ఇప్పటి పిల్లలకేం చెప్పగలమండీ ?' అని సాగదీసింది.

అనిత పట్ల ఆకర్షితుడయ్యాడు సురేష్. ‘ స్ట్రెయిట్ గా కూర్చోడం, అలాగే నడవడం, అలాంటివే అభిప్రాయాలు. కళ్ళు పెద్దవి; చెక్కిళ్ళు యెఱ్ఱగా, చేత్తో పిండేయాలన్నట్టుగా వున్నాయి; శరీర అవయవాలన్నీ సరైన నిష్పత్తిలో వుండి చూడగానే చూపుల్ని బంధించేసేట్టుగా వుంది. తనని సిల్లీ కారణాల మీద రిజెక్ట్ చేసింది. తను కొంచం సాంప్రదాయంగా కనిపించినా, భావాలు ఆధునిక మైనవే. ఖర్చు తక్కువగా పెట్టినా, అవసరాలకి వెనుకాడడు. భార్యని అర్ధాంగిలా చూసుకుంటాడు. ఇవన్నీ చెపితే నమ్మరు. తెలుసుకునే ప్రయత్నం చేయరు. అసలు అమ్మాయిలు ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో తెలియదు. కనీసం వాళ్ళకైనా వాళ్ళేమి ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో తెలిస్తే జీవితానికి సంబంధించి నిర్ణయాలు సరిగా తీసుకుంటారు కదా!’ అనుకుని కాసేపు బాధపడ్డాడు సురేష్.

తర్వాతి వారం లో మూడు మ్యాచ్ లు ఫైనలైజ్ చేసి, అమ్మాయిల్ని చూసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఫైనల్ గా యిద్దరికీ ఓకే అనిపించే వొక మ్యాచ్ సెటిల్ అయింది. ఆ అమ్మాయి పేరు సరళ, సాఫ్ట్ వేర్ ఇంజనీర్. హైదరాబాద్ లోనే జాబ్.

పెళ్ళి బాగానే జరిగింది. వివాహ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక, సరళ అత్తగారింట్లో అడుగు పెట్టింది. అడుగుపెడుతూనే అనుకుంది, 'యిక్కడ చేయాల్సిన మార్పులు చాలానే వున్నాయి. '

ఇల్లు కొంచం పాత మోడల్ అనిపించింది. దాన్ని త్వరలో నవీకరించాలి, అనుకుంది. అత్తగారు మెత్తగానే కనిపిస్తోంది. కొద్ది రోజులు గమనించాలి. మామగారు కొంచం దూరంగా అంటే సన్నిహితంగా వుండడం లేదు. ఈ మ్యాచ్ ఆయనకి యిష్టం లేకపోవచ్చు. తెలుసుకోవాలి. ఆడపడుచు అతి చేస్తోంది. కంట్రోల్ లో పెట్టాలి. ఇక్కడుండదు కాబట్టి ఓకే. మొదటి మూడు రోజుల్లో సరళ మనసులో మెదిలిన ఆలోచనలవి. సురేష్ అంతా బాగుందనే అనుకున్నాడు. ఉత్సాహంగా వున్నాడు. తనకి పెళ్ళి అయ్యిందనే ఆలోచనే సంబరంగా వుంది.

ఒక వారం గడిచేసరికి సరళ కి బోర్ కొట్టింది. శలవు ని తగ్గించుకుని, ఆఫీస్ కి వెళ్ళడం మొదలెట్టింది. సురేష్ యింట్లోనే వున్నాడు.

'అదేంటిరా యింకో వారం శలవు వుందన్నదిగా! ఇవ్వాళే వెళ్ళిందే !' అమ్మ అడిగేసరికి నీళ్ళు నమిలాడు సురేష్. 'అర్జంట్ వర్క్ వుందిట ; మేనేజర్ రమ్మన్నాట్ట!' అన్నాడు సురేష్, అది అబద్ధమే అయినా, నమ్మకం కలిగించేలా.

'నిన్న చెప్తే, బాక్స్ సిద్ధం చేసేదాన్నిగా!' అంది అమ్మ.

'కాంటీన్ లో తింటుందిలే. ఆఫీస్ కాంటీన్లు చాలా శుభ్రంగా, డీసెంట్ గా వుంటాయి ! బాక్స్ రేపట్నుంచి యివ్వచ్చులే,' అన్నాడు సురేష్.

మరోవారం, మరో నెల గడిచిపోయాయి.

సరళ కి యిల్లు వొక ఆశ్రమంలా అనిపిస్తోంది. ఒక ఆదివారం సురేష్ ని యేదైనా పబ్ కి వెల్దామా అని అడిగింది. కొంచం ఆలోచించి ఓకే అన్నాడు. ఓకే అన్న దగ్గిరనించీ కొంచం భయం. పబ్ కి యింతకు ముందు యెప్పుడూ వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళి చూస్తే యేమౌతుందిలే అనుకున్నాడు. ఎప్పట్నుంచో ఫ్రెండ్స్ రమ్మంటుండేవాళ్ళు. ఎప్పుడూ వెళ్ళలేదు. సడన్ గా సరళ అడిగేసరికి ఆశ్చర్యం వేసింది. పెళ్ళయ్యాక మొగుడి తోనే కదా కోరికలు తీర్చుకునేది, అనుకుని ఆలోచించడం ఆపేసాడు. ఆ రాత్రి యిద్దరూ జూబిలీ హిల్స్ లో వో పబ్ కి వెళ్ళారు .

'కొంచం తొందరగా వచ్చాం కదా!... ఎక్కువ మంది లేరు!...' అన్నాడు సురేష్.

'అవును... కొంచం ముందే వచ్చాం.....' అంది సరళ.

'ఎప్పుడైనా వచ్చావా?...'

'ఒక్కసారి. నా ఫ్రెండ్ బర్త్ డే పార్టీ యిచ్చింది... బీరు కొట్టాం... డాన్స్ చేసాం!...' అంటూ చిన్నగా నవ్వింది, గత వ్యామోహం కొంచం మనసులో ముసురుతుండగా.

'బీర్ తీసుకు రానా?... '

'నీకు అలవాటుందా?'

'అలవాటు లేదు... యేదో కంపెనీ యిస్తాను ...' అన్నాడు కొంచం సిగ్గుపడుతూ.

'చెరొకటి తీసుకురా!... '

కౌంటర్ కి వెళ్ళి రెండు బీర్ కాన్లు తెచ్చాడు. ఇద్దరూ నెమ్మదిగా సిప్ చేస్తున్నారు. సురేష్ కి భయం. అయినా మగాడనే అహం వో మూల కొద్దిగా వుండడంతో తెగించాడనే చెప్పాలి.

డీజే సౌండ్ పెరుగుతూ, యిద్దరూ మాట్లాడుకునే అవకాశాన్ని తగ్గించేసింది. డాన్స్ ఫ్లోర్ కి వెళ్ళి నాలుగు స్టెప్పులేశారు. రిథమ్ కుదరలేదు. నవ్వుకుంటూ వెళ్ళి వో మూల కూర్చున్నారు. కొంచం ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నారు. బీర్ తాగడం అయిపోయింది. చుట్టూ వున్న అందరూ వాళ్ళ వేష భాషలతో రౌడీల్లా కనిపించారు సురేష్ కి. ఒక గంట గడిచాక యిద్దరూ లేచారు. నెమ్మదిగా బయటికి నడిచారు. డ్రమ్ముల హోరు కి దూరంగా.

పక్కన షాప్ లో చిప్స్ కొనుక్కుని, దగ్గిరలో వున్న చిన్న పార్క్ లోకి వెళ్ళారు . నియాన్ లైట్స్ కాంతి లో సరళ అందంగా కనపడింది సురేష్ కి. పది నిముషాలు కూర్చుని యింటికి బయల్దేరారు. కారు వేగంగా నడుపుతూ. 'ఈ సాయంత్రం అనుకున్నట్టుగా గడిచిందా?' అని తనని తనే ప్రశ్నించుకున్నాడు, సురేష్, కొంచం అసంతృప్తి మనస్సులో తారట్లాడుతుండగా!

నాలుగు రోజుల తర్వాత సరళ ఆఫీస్ నించి యింటికి వస్తూనే బాంబు పేల్చింది. తన్ని బెంగళూరు ప్రాజెక్ట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. నాలుగు రోజుల్లో అక్కడ రిపోర్ట్ చేయాలి. సురేష్ ఆశ్చర్యంగా, ఆందోళనగా చూసాడు. 'మీ మేనేజర్ తో మాట్లాడి యిక్కడ్నించే పనిచేయచ్చుగా!... నన్ను మాట్లాడమంటావా?' అని భార్యని అడిగాడు. 'నేను చాలా చెప్పి చూసాను... కుదరదు. ఆరునెలల్లో యెలాగైనా యూ ఎస్ వెళ్ళాలి, కనీసం రెండేళ్ళయినా !... నువ్వు కూడా యూ ఎస్ కి ట్రై చెయ్యి!' అంది సరళ.

భోజనాల దగ్గిర సురేష్ యీ వార్తని ప్రకటించాడు. అమ్మా, నాన్న నమ్మలేనట్టు చూసారు.

'అదేంటమ్మా! కొత్తగా పెళ్లయిందని వాళ్ళకీ తెలుసుకదా! అలా యెలా ట్రాన్స్ఫర్ చేశారు?' నాన్న ప్రశ్నకి, సరళ, 'తెలుసు మామయ్యా, యీ జాబ్స్ యింతే వుంటాయి ...' అంది.

'ఆరునెల్ల తర్వాత యూ ఎస్ కి పంపిస్తున్నారట... సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అందరూ కలలు కంటారు, అమెరికా వెళ్ళాలని. తనకి ఆ అవకాశం వస్తోంది!' అన్నాడు సురేష్.

'ఎందుకమ్మా యీ వుద్యోగాలు? మేమంతా వుద్యోగాలు చేశామా?... మాకు వెళ్ళలేదా ?... హాయిగా యిద్దరూ కలిసి వొకచోట వుండక ...' అంది అమ్మ.

సురేష్ కలగచేసుకుని, ' కొంతకాలం వుద్యోగం చేస్తానని సరళ పెళ్ళికి ముందే చెప్పిందే అమ్మా!' అన్నాడు.

అమ్మానాన్నలు మ్రాన్పడి పోయారు. ఇద్దరూ తమతో కలిసి వుంటారని, మనవలూ , మనవరాళ్ళతో ఆడుకోవచ్చని అనుకున్నారు. ఒక శుభం జరిగి యెంతో కాలం కాలేదు, అప్పుడే యీ కష్టం తోసుకొచ్చిందే అని బాధపడ్డారు. కొంతసేపు నిశ్శబ్దం చోటు చేసుకుంది. తర్వాత నాన్న సురేష్ తో అన్నాడు, 'మీలో వొకరక్కడ, వొకరిక్కడ వుండేకంటే , నువ్వు కూడా బెంగళూరు కి ట్రాన్స్ఫర్ చేయించుకో సురేష్. కొత్తగా పెళ్ళయిన వాళ్ళు వొక్కచోట వుండక , యిప్పట్నించే విడిగా వుండడం యేమిటి ?'

'మిమ్మల్నిక్కడ వదిలేసి... ' గొణిగాడు సురేష్.

'మీరు కొంతకాలం ఎంజాయ్ చేయండి. తర్వాత మేమే అక్కడికి వస్తాం!' అన్నాడు నాన్న.

అందరూ ఆ మాట కి నవ్వీ నవ్వకుండా నవ్వారు.

******

సరళ తో పాటు సురేష్ కూడా బెంగళూరు వెళ్ళాడు. ఇద్దరూ హోటల్ లో దిగారు. సరళ ఆఫీస్ కి వెళ్ళి రిపోర్ట్ చేసింది. సురేష్ ఎలక్ట్రానిక్ సిటీ కి దగ్గిరలో వున్న వర్కింగ్ వుమెన్స్ హాస్టల్స్ ని పరిశీలించాడు. ఒక హాస్టల్ చాలా డీసెంట్ గా కనపడింది. మర్నాడు యిద్దరూ హాస్టల్ కి వెళ్ళి సరళ కి చూపించి, ఆమె ఓకే చేయగానే, అడ్వాన్స్ కట్టి , హోటల్ కి వెళ్ళారు. మరో రెండు రోజులు హోటల్ లో వున్నారు. తర్వాత సురేష్ హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యాడు. సరళ హాస్టల్ కి వెళ్ళిపోయింది. సురేష్ బయల్దేరేముందు సరళ సురేష్ తో అంది, 'నువ్వు తొందరపడి బెంగళూరు కి ట్రాన్స్ఫర్ చేయించుకోకు. నేను యూ ఎస్ కి వెళ్ళాల్సి రావచ్చు. కొద్ది రోజులు వెయిట్ చేద్దాం!'

సరేనన్నాడు సురేష్.

సురేష్ నెలకొకసారి వీకెండ్ లో బెంగళూరు కి వెళ్ళి వస్తున్నాడు. నాలుగు నెలల తర్వాత వొక సారి సరళ, 'నీతో వొక ముఖ్య విషయం మాట్లాడాలి సురేష్,' అంది. ఏమిటన్నట్టు చూసాడు సురేష్.

కొంచంసేపు మాట్లాడలేదు సరళ.

'చెప్పు సరళా!' అన్నాడు సురేష్.

తలవంచుకుని కూర్చుంది. హోటల్ రూమ్ లో కాఫీ మెషిన్ దగ్గిరకి వెళ్ళి , రెండు కప్పుల కాఫీ తయారు చేసుకొచ్చింది. ఒక కప్పు సురేష్ కిచ్చి, తానొకటి తీసుకుంది. నెమ్మదిగా సిప్ చేస్తూ అంది, 'సురేష్, మనిద్దరి మధ్యా కంపాటిబిలిటీ వుందనుకుంటున్నావా ?'

సరళ యిచ్చిన ఝలక్ కి షాక్ తిన్నాడు సురేష్.

'మళ్ళీ చెప్పు సరళా!' అన్నాడు తను సరిగా విన్నాడో, లేదో అనుకుంటూ.

'ఎందుకో మన మధ్య కంపాటిబిలిటీ లేదనిపిస్తోంది సురేష్. మన మెంటాలిటీలు వేరు, జీవితం పట్ల మన అవగాహన వేరు. నువ్వు తల్లితండ్రుల కి సరైన కొడుకువి అయ్యావు కానీ, నాకు సరైన భర్తవి కాలేకపోయావు. పెళ్ళయ్యాక యెక్కడికైనా వొక వారం రోజులు తీసుకెళ్తావనుకున్నాను. అది చేయలేదు ....'

సరళ కి అడ్డుతగులుతూ, 'సరళా, నేను ప్రొపోజ్ చేస్తే నువ్వీమీ మాట్లాడలేదు. ఇష్టం లేదనుకున్నా. అంతే !... అంత మాత్రాన సరైన భర్తని కానా?' అన్నాడు. ముఖంలో ఆశ్చర్యం, నమ్మలేనితనం కనిపించాయి.

'నా పర్మిషన్ కావాలా?... నీలో స్పీడ్ లేదనుకున్నా. స్పీడ్ లేక పోగా ఏమాత్రం చురుకుదనం కూడా లేదు. నాకు యిలాంటి వాళ్ళంటే యిష్టం వుండదు. మా మేనేజర్ నేనిక్కడ జాయిన్ అయిన నాలుగో రోజే పబ్ కి తీసికెళ్ళాడు. ఒక వీకెండ్ లో దగ్గిర్లో వున్న హాలిడే రిసార్ట్ కి తీసికెళ్ళాడు......'

మగాడికైనా, ఆడదానికైనా అలాంటి విషయాల్లో అలాంటి పోలికలు తెస్తే గుండె మండిపోతుంది. సురేష్ ముఖం , సాయం సంధ్యా సమయంలో సూర్యుడిలా , యెఱ్ఱగా మారిపోయింది. నోట్లోంచి మాట రావడం లేదు.

సరళే మళ్ళీ నోరు విప్పింది. 'పెళ్ళికి ముందే యివన్నీ యెందుకు ఆలోచించలేదు, అని అడగాలనుకుంటున్నావ్ కదా? .... నా ప్రాధాన్యతలన్నీ మా పేరెంట్స్ కి చెప్పాను. వాళ్ళు వినలేదు. పైగా ఫోర్స్ చేశారు. అది నీ తప్పు కాదు. నా తప్పే . ఏమీ చెయ్యలేక తల వంచుకుని పెళ్ళికి కూర్చున్నాను. ఇప్పుడు నా మనస్సు యెదురు తిరుగుతోంది. మొన్న అడ్వకేట్ ని కలిసి అడిగాను. పరస్పర అంగీకారంతో విడాకులు కోర్ట్ విచక్షణ మీద తొందరగానే దొరకచ్చు, అన్నాడు. నువ్వు ఆలోచించుకో. కలిసి వుంటే అది బలవంతంగా కలిసివున్నట్లే. నాకు సంతోషం కాదు. చెప్పు!'

సురేష్ మ్రాన్పడిపోయాడు.

'ఇంత చెప్పాక , నేను చెప్పడానికేం మిగిల్చావు? ... ఈ విషయం చెప్తే అమ్మానాన్నలు యేమైపోతారా , అని ఆలోచిస్తున్నాను... '

'అమ్మానాన్నలే నీ జీవితం అనుకుంటే పెళ్ళి చేసుకోకూడదు, సురేష్... ' అంది సరళ.

'నేను నీ అంత క్రూరంగా ఆలోచించలేను. నువ్వు అమ్మానాన్నల్ని గౌరవించవని నేను వూహించలేదు..... సాంప్రదాయ కుటుంబం అని అన్నారు ..... తప్పు చేసాను......' తనలో తను అనుకుంటున్నట్టుగా అన్నాడు.

'నేను నీ అంత స్టుపిడ్ ని కాదు... నా అమ్మానాన్నల్ని గౌరవించనని యెలా అంటావ్ ?... మీ అమ్మానాన్నలు నాకు స్ట్రేంజర్స్ ... ఎంత గౌరవించాలో అంత గౌరవిస్తాను... నీకు చెప్పడానికి భయమైతే నేను చెప్తాను. ఐ కాంట్ లివ్ విత్ యు ... ' అన్నది సరళ కోపంగా.

ఇదంతా నిజమా, కలా , అర్ధం కావట్లేదు సురేష్ కి. తన దగ్గిర ఏం తప్పు జరిగిందో యెంతకీ తట్టట్లేదు. సరళ ని యెంత ప్రేమగా చూసుకుంటున్నాడు తను ! దాని ఫలితం యిదేనా !

లేచి టాయిలెట్ లోకి వెళ్ళాడు. ముఖం కడుక్కున్నాడు. అప్పుడు టైమ్ పది అయింది. హైదరాబాద్ కి లాస్ట్ బస్సు 11 గంటలకి. బయటికొచ్చి బట్టలు సర్దుకుని బయట పడ్డాడు. అది గమనించిన సరళ లిఫ్ట్ దగ్గిరకి వచ్చింది. 'ఏ విషయం నాకు రేపటికల్లా చెప్పు!' అని వెనక్కి వెళ్ళిపోయింది. సురేష్ బస్సు డిపో కి వెళ్ళాడు. టికెట్ కొనుక్కుని, బయటికొచ్చాడు. నాలుగు అరటిపళ్ళు కొనుక్కున్నాడు. రోడ్డు కవతల బార్ కనపడింది. వెళ్ళి వొక బీర్ కొట్టాడు. కళ్ళంట ధారలుగా కన్నీరు కారుతూ చెంపల మీదుగా కింద పడుతోంది. మరో బీర్ తీసుకుని దించకుండా వొక్క గుటకలో తాగేశాడు. రెండు అరటి పళ్ళు తిని, బస్సెక్కి కూర్చున్నాడు.

******

బెంగళూరు లో యేమి జరిగిందీ అమ్మానాన్నలకి చెప్పలేదు. ముభావంగా త్వరగా తయారై, టిఫిన్ చేసి ఆఫీస్ కి బయల్దేరాడు. బైక్ కాకుండా, కార్ తీసి, బయల్దేరాడు. దారిలో మామగారి నించి ఫోన్ వచ్చింది. ఒక్క క్షణం ఆలోచించాడు, మాట్లాడాలా, వద్దా, అని. అయినా మాట్లాడితే సంగతి యేమిటో తెలుస్తుంది. వాళ్ళకి నిన్న జరిగింది చెప్తే, వాళ్ళ ముద్దుల కూతురు యెంతకి తెగించిందో వాళ్ళకి తెలుస్తుంది.

'అల్లుడు గారూ, నేను... నీ మామగారిని మాట్లాడుతున్నాను ...'

'చెప్పండి అంకుల్ ...' అన్నాడు సురేష్.

'మా అమ్మాయి పొద్దున్నే ఫోన్ చేసి విషయం చెప్పింది... అది చేస్తున్న పని మంచిది కాదు... ఆ విషయం తేల్చడానికే , దాన్ని దారిలో పెట్టడానికే మేము బెంగళూరు వెళ్తున్నాం. టాక్సీ మాట్లాడుకుని బయల్దేరాం. నువ్వు తొందర పడద్దు. మీ అమ్మా, నాన్నలకి అప్పుడే చెప్పద్దు. నేను దాంతో మాట్లాడాక, నీకు చెప్తాను. దయచేసి మా గురించి తప్పుగా భావించద్దు. అది తప్పు చేస్తోంది. మేము కరెక్ట్ చేయాలి. చేస్తాం. మాకు ఆ నమ్మకం వుంది...' అంటూ బతిమాలాడుతున్నాడు.

'అంకుల్, సరళ నన్ను చాలా బాధపెట్టింది... అవమానించింది... అయినా మీరు సరళని మార్చగలిగితే ప్రయత్నించండి ... ఐ హావ్ నో హోప్స్ ...' అని ఫోన్ కట్ చేసేసాడు సురేష్. గుండె బరువెక్కింది. ఆఫీస్ కి పోబుద్ధి కాలేదు. అయినా అటు వైపే పోతున్నాడు.

సాయంత్రం ఆఫీస్ నించి తొందరగా బయట పడ్డాడు. ఎవరికైనా యీ విషయం చెప్పి, సలహా తీసుకుందా మంటే అంత సన్నిహితులెవరూ దగ్గిరలో లేరు. అమ్మా, నాన్న యెంత బాధపడతారో? వాళ్ళకి చెప్పకుండా యెక్కువ కాలం దాచలేడు. ఇవ్వాళే తన అభిప్రాయం చెప్పాలన్నది. రాక్షసి! ఎంత పొరపాటు జరిగిపోయింది! ఊహించలేదు! అత్తా కోడళ్ళకి సమస్యలు వస్తాయనుకున్నాడు కానీ, యింత ఘోరం వూహించలేదు. అది అసలు మనిషేనా? ఏ సూర్ఫణకో దీని రూపంలో మళ్ళీ పుట్టిందా?... !... కోపం పెరిగింది. కారు రోడ్డుకి వొక సైడ్ ఆపాడు. దిగి, కాఫీ తాగుదామనిపించి చుట్టూ చూసాడు రెస్టారెంట్ కనిపిస్తుందేమో అని. రెస్టారెంట్స్ లేవు కానీ, వొక బార్ కనపడింది. ఆలోచించకుండా లోపలికి వెళ్ళి బీర్ ఆర్డర్ యిచ్చాడు.

******

ఇంటికి చేరిన సురేష్ స్నానం చేసి, డ్రెస్ చేసుకుని వచ్చి హాల్లో సోఫా లో కూర్చున్నాడు. నాన్న మొబైల్ చూసుకుంటున్నాడు. అమ్మ దగ్గిరగా వచ్చి , 'ఏమిట్రా అలా వున్నావ్? పొద్దున బెంగళూరు నించి వచ్చినప్పటి నించి చూస్తున్నాను... ఏమైంది?' అని అడిగింది.

నాన్న తలెత్తి, 'నేనూ అబ్సర్వ్ చేసాను ... ఏమైంది?' అని అడిగాడు.

కొద్దిసేపు మౌనంగా వుండి అన్నాడు, ' సరళ మనం అనుకుంటున్నట్టు మంచిదేం కాదు. విడాకులు కావాలని అడిగింది... '

'అసలేం జరిగిందిరా?' ఆందోళన గా అడిగింది అమ్మ. నాన్న కళ్ళజోడు తుడుచుకుంటూ, 'సురేష్ నీ నించి తప్పేమీ వుండదు, నాకు తెలుసు. ఆ అమ్మాయి విడాకులు అడిగిందంటే వేరే కారణం యేదో వుండి వుంటుంది ...అది యేమిటో తెలుసుకున్నావా?..' అన్నాడు.

ఇంతలో సురేష్ మామగారి నించి ఫోన్ వచ్చింది.

'అల్లుడు గారూ, సారీ అండీ. సరళ యిలా చేస్తుందని మేము కల్లో కూడా అనుకోలేదు. దానికి దయ్యం పట్టినట్టుంది ..... మా ప్రయత్నం కూడా ఫెయిల్ అయ్యింది. చాలా మొండిగా మాట్లాడుతోంది... మీ మధ్య గొడవలేమీ లేవు అంది... అది చేతులారా జీవితాన్ని పాడుచేసుకుంటోంది... మీరు డివోర్స్ కి వొప్పుకోకండి... ప్లీజ్...' అంటున్నాడు మామగారు. 'నేను తర్వాత మాట్లాడుతానండీ!' అని సురేష్ ఫోన్ ని డిస్కనెక్ట్ చేసాడు.

అమ్మానాన్నలకి బెంగళూరు లో యిద్దరి మధ్యా జరిగిన సంభాషణ మొత్తం చెప్పాడు. అవాక్కయ్యారు అమ్మా నాన్న.

తర్వాతి వీకెండ్ కి బెంగళూరు వెళ్ళిన సురేష్, సరళ అడ్వకేట్ ని కలిశారు. సురేష్ కి ఆశ్చర్యం కలిగేలా అడ్వకేట్ తయారు చేసిపెట్టిన పిటిషన్ ని తీసి యిద్దరికీ యిచ్చాడు. కొన్ని మార్పులు చెప్పి మళ్ళీ టైపు చేయించాడు సురేష్. టైపింగ్ కి టైం పడుతుందని, సురేష్ బయటికెళ్ళాడు. అరగంట తర్వాత వచ్చి సంతకాలు చేసి అడ్వకేట్ కి యిచ్చాడు. ఒక ఫోటో కాపీ తీసుకుని వొక్కడే హోటల్ కి వెళ్ళిపోయాడు. సరళ తో యేమీ మాట్లాడలేదు.

కోర్ట్ యిద్దరినీ కనీసం ఆరు నెలలు విడిగా వుండమని, తర్వాత నిర్ణయిస్తామని చెప్పింది. కౌన్సిలింగ్ చేయడం లేదెందుకని అడ్వకేట్ ని జడ్జి ప్రశ్నించాడు. అడ్వకేట్ యేదో గొణిగాడు.

వాయిదాలతో కోర్ట్ లో మొత్తం మీద సంవత్సరం గడిచిపోయింది. ఎటువంటి షరతులు లేకుండా విడాకులు మంజూరయ్యాయి. అడ్వకేట్ ఫీజు మొత్తం సరళే యిచ్చింది. చివరిగా బై చెప్పి సురేష్, సరళ జీవితం లోంచి బయటికొచ్చేసాడు. మనసులో మిశ్రమ భావాలు. బరువు దించినట్టుంది; బాధగా వుంది. తన గురించి సరళ అన్న మాటలు అతని చెవుల్లో రింగు మంటూనే వున్నాయి.

******

సురేష్ ముభావంగా వుండడం చూసి, అమ్మానాన్నలకి గుండె తరుక్కు పోయేది. ముగ్గురూ కలిసి ప్రతివారాంతం పుణ్యక్షేత్రాలకి వెళ్ళి వచ్చేవారు. ఆరునెలల తర్వాతినించి అమ్మ సురేష్ ని మళ్ళీ పెళ్ళి చేసుకోమని వెంటపడడం మొదలెట్టింది. రెండు నెలలు వాయిదా వేసాడు . . ఆ తర్వాత ఒకరోజు అమ్మానాన్నలిద్దరూ సురేష్ కి క్లాస్ పీకారు. పెరుగుతున్న వయస్సు వాళ్ళిద్దరినీ యెప్పుడైనా కబళిస్తుందని, వొక్కడిగా బతకడం కష్టమని నూరి పోశారు. చివరికి ఒకరోజు ‘వెలుగు డైవోర్సీ డాట్ కామ్’ లో రిజిస్టర్ చేసాడు. డైవోర్సీ డాట్ కామ్ సైట్ లో విడాకులు తీసుకున్న వాళ్ళ ప్రొఫైల్స్ మాత్రమే వుంటాయని, వయసు, పిల్లలున్నారా అనేవి జాగ్రత్తగా చూడాలని, తర్వాత డివోర్స్ యెందుకు తీసున్నారో, అసలు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారా అనేవి చూసుకోవాలని అమ్మకి చెప్పాడు.

అమ్మకి పని మళ్ళీ మొదలైంది. డైవోర్సీమ్యాచ్ లు కూడా చాలా వుండడం గమనించి, బాధపడింది. ఈ దేశం యిలా తగలడుతోందేమిటో అని అమ్మానాన్న లిద్దరూ బాధ పడేవారు. సురేష్ కి తగిన మ్యాచ్ లు సార్ట్ చేయగా పదిహేను తేలాయి. ఒక్కొక్కరినీ ఫోన్ లో సంప్రదిస్తోంది. చాలా వరకూ యెవరూ ఫోటోలు పెట్టట్లేదు. వాళ్ళ వివరాలు, వాళ్ళ ఎక్స్ పెక్టషన్స్ తెలుసుకుని ముందుకు వెళ్లాలనుకున్నాడు సురేష్.

ఫోన్ లో అందరితో మాట్లాడగా ఒక మ్యాచ్ షార్ట్ లిస్ట్ అయింది. ఫోన్ నెంబర్ తీసుకుని అమ్మ మాట్లాడింది. వివరాలు తెలుసుకుని వొక సారి కలుద్దామని అంది. వాళ్ళు తర్వాతి ఆదివారం వొక హోటల్లో కలుద్దామన్నారు.

ఆ రోజు నిర్దేశిత హోటల్ కి వెళ్ళి టేబుల్ ఫిక్స్ చేసాడు సురేష్. ముగ్గురూ పెళ్ళివాళ్ళకోసం యెదురు చూసారు. పావుగంట ఆలస్యం గా వచ్చారు. వాళ్ళని చూసి ముగ్గురూ ఆశ్చర్య పోయారు. సురేష్ అంతకు ముందు యిష్టపడ్డ అనిత పెళ్ళి చూపుల కోసం వచ్చింది. ఇద్దరూ వొకరిని చూసి వొకరు ఆశ్చర్య పడుతూ చిరు నవ్వుతో పలకరించుకున్నారు.

ఇరువైపులా మనసు విప్పి ఫ్రాంక్ గా మాట్లాడుకున్నారు. అనిత విడాకులు యెందుకు తీసుకుందని అడిగాడు. తన మాజీ భర్త వొక తాగుబోతని, చాలా మందితో సంబంధాలున్నాయని, తనపై రెండు సార్లు చెయ్యి చేసుకున్నాడని చెప్పింది. తన విడాకుల ప్రహసనం వివరంగా చెప్పాడు సురేష్.

అనిత లో చాలా మెచ్యూరిటీ వచ్చిందని అనుకున్నాడు సురేష్. అనిత కూడా సురేష్ గురించి అలాగే అనుకుంది. ఇద్దరూ వొప్పుకోడంతో సింపుల్ గా పెళ్ళి జరిగింది.

తర్వాత సురేష్ తో నాన్న అన్నాడు, ' అప్పుడు ఆ జ్యోతిష్కుడు చెప్పింది యిప్పుడు యిట్లా నిజమైంది!... ఫైనల్ గా యిలా కలిశారు! '

[సమాప్తం]


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం :

అందరికీవందనాలు.

చిన్నతనంనించి కథలురాయడం నాహాబీ. 15 వయేట మొదటికథ అచ్చయితే, 18 వయేట ఆంధ్రపత్రిక వారపత్రిక దీపావళికథల పోటీలోనా కథ 'విప్లవం' కి బహుమతి వచ్చింది. తర్వాత కొన్ని కథలు పత్రికల్లో వచ్చాయి. అక్కడితో సాహితీ ప్రస్థానం ఆగిపోయింది. కొన్నిసంవత్సరాల తర్వాత యీ మధ్య మళ్ళీ రాయడం మొదలెట్టాను. అయితే డిజిటల్ మీడియాలోనే రాస్తున్నాను. 2020 సంక్రాంతి సమయం లో ఒక కథకి [చెన్నైఅనే నేను] ప్రతిలిపిలో మూడో బహుమతి వచ్చింది. ఈమధ్య అందులోనే మరో కథ10 ఉత్తమ కథల్లో వొకటిగా నిలిచింది. గోతెలుగు డాట్కామ్ లో వొక హాస్య కథ ప్రచురింపబడింది. కొన్నిసంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రాయగలననే ఆత్మవిశ్వాసం కలిగింది.

'శిరిప్రసాద్' అనేకలం పేరుతో రాస్తుంటాను.

ఇంతకంటే చెప్పుకోతగ్గ విషయాలు లేవు. కృతజ్ఞతలు.



1,897 views0 comments

Comments


bottom of page