మహిళా తేజం
- T. V. L. Gayathri
- 5 hours ago
- 2 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #మహిళాతేజం, #తప్పులనుదిద్దుకుందాం

గాయత్రి గారి కవితలు పార్ట్ 50
Mahila Thejam- Gayathri Gari Kavithalu Part 50 - New Telugu Poems Written By T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 18/12/2025
మహిళా తేజం - గాయత్రి గారి కవితలు పార్ట్ 50
మహిళా తేజం
(వచన కవిత)
**********************************
ఆకాశంలో సగం ఆడదాని హృదయ వైశాల్యం.
ప్రకాశవంతంగా మార్చు కుంటుంది తన గృహం.
సవ్వడి లేకుండా జగతిలో ఆమె చేసే కార్యాలనేకం.
కొవ్వొత్తిలాగా కరుగుతున్నా కోరదులే తన సుఖం.
తన వారి కోసం తనువు నమ్ముకొనే త్యాగానికైనా సిద్ధం.
తన దేహాన్ని అగ్నిలో తోసినా మౌనంగా నిలిచే తత్వం
ఎన్నో అరాచకాల నెదుర్కొంటూ జీవించే ధీరత్వం.
కన్నీరు నదిమి పెట్టి కాలంలో కలిసేదాకా ప్రయాణం.
మానసిక స్థైర్యంతో మానవ మృగాల మధ్య జీవనం.
ఘనమైన చరితలో తనకంటూ ఉన్నదెన్నో స్థానం?
అంతులేని ప్రేమవాహిని కామె హృదయమే జన్మస్థానం.
చింతలను దిగమింగి చిరునవ్వుతో నడయాడే స్త్రీత్వం.
దైవానికి ప్రతిరూపమై ధరలో నిలిచిన మహిళాతేజం.
జీవితానికర్థం తెలిపే స్త్రీ మూర్తులను పూజించుకొందాం!
మన అహాన్ని ప్రక్కన పెట్టి ఆడవారినందల మెక్కిద్దాం!
వనితా విజయానికి మనమంతా బాసటగా నిలుద్దాం!//
******************************************

తప్పులను దిద్దుకుందాం!
( వచన కవిత)
************************************
భ్రూణహత్యలు చేసే దుర్మార్గం పూర్వకాలంలో లేదే!
ప్రాణాలు తీసే కసాయితనం భారతీయ సంస్కృతి కాదే!
ఆడమగ యనే వివక్షను చూపే వాళ్ళాకాలాన లేనే లేరు!
కూడదంటూ గొడవ చేసే కూళలీ యుగాన పుట్టుకొచ్చారు.
స్త్రీని దైవంగా చూసే సంప్రదాయమెక్కడో మాయమైంది.
మౌనంగా రోదిస్తూ మగువ బ్రతుకు మరుగున పడింది.
ఆడపిల్లల్ని కనడమే పాపమనే మనుజుల మూర్ఖత్వం
పాడుపడిన బుర్రలతో పసి కందుల్ని చిదిమి వేయటం.
నాశనమవుతున్న విలువలతో నయవంచకుల వీరంగం.
దేశ భవితను ఊహిస్తేనే నిరాశతో క్రుంగి పోవుట తథ్యం.
జనాభా నిష్పత్తిలో అసాధారణంగా కనిపించే వ్యత్యాసం.
కనీవినీ యెరుగని నష్టాన్ని భావితరానికి మనమే అందిస్తాం!
ఇప్పటికే జరిగిన అనర్థాన్ని అడ్డుపెట్టే ప్రయత్నాన్ని చేద్దాం!
తప్పులను దిద్దుకుందాం!పిచ్చి తల్లుల్ని హాయిగా బ్రతకనిద్దాం!
ముద్దుగా పెంచుకుంటూ మురిపెంగా బుల్లెమ్మల్ని చదివిద్దాం!
హద్దు లేని అవకాశాలనెన్నింటినో ఆడపిల్లల కందించుదాం!
మహిళా విజయంలో మనమంతా భాగస్వాముల మవుదాం!
మహిని గెలిచే స్త్రీలను మనస్ఫూర్తిగా అభినందించుకుందాం!

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
