మల్లెల మనసు
- Karanam Lakshmi Sailaja
- Jul 18
- 5 min read
#KLakshmiSailaja, #కేలక్ష్మీశైలజ, #MallelaManasu, #మల్లెలమనసు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

(మల్లె తీగ వంటిదీ.. మగువ జీవితం..)
Mallela Manasu - New Telugu Story Written By K. Lakshmi Sailaja
Published In manatelugukathalu.com On 18/07/2025
మల్లెల మనసు - తెలుగు కథ
రచన: కే. లక్ష్మీ శైలజ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రాత్రి ఎనిమిది గంటలకు ఉసూరుమంటూ ఇంటికి వచ్చింది వాసవి.
“ఏమిటో ఈ మధ్య ఎక్కువగా ఇంటికి లేట్ గా వస్తున్నావు?” వ్యంగ్యంగా అన్నాడు రాజు, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వాసవిని చూస్తూ.
“చెప్పాగదా రాజూ ఆడిట్ జరుగుతోంది. ఒక వారం రోజులు లేట్ గా వస్తాననీ” ఆ వ్యంగ్యాన్ని పట్టించుకోకుండా అంది వాసవి.
“మీ స్టాఫ్ నాకు గాంధీ బొమ్మ దగ్గర సాయంత్రం ఆరు గంటలకే కనపడ్డారు. నేనింటికొచ్చినా నువ్వేమో రాలేదు” ఆరాగా అన్నాడు.
“ఆఫీస్ లో వాళ్ళవి అంత ముఖ్యమైన సీట్స్ కాదని నీకు తెలుసు. తెలిసీ ఎందుకిలా అడుగుతున్నావు” వాసవి కనుబొమ్మలు ముడివేస్తూ అడిగింది.
వాళ్ళ పెళ్ళయిన నాలుగు నెలల నుంచీ వాసవి గమనిస్తూనే ఉంది. ఎప్పుడూ ఇలా అనుమానంగా మాట్లాడుతూనే ఉంటాడు.
“అబ్బో. అడగ్గూడదేంటి? నా కన్నీ తెలిసిపోతాయని భయమా?” రాజు వంకర నవ్వుతో అన్నాడు.
“ఏం తెలిసిపోతాయి? నాకేం భయం? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్ధం కావడం లేదు. ” విసుగ్గా అంది వాసవి.
“అంత విసుగెందుకు? నువ్వు, ఆ సూపరింటెండెంట్ మాత్రమే ఆఫీస్ లో ఎనిమిదివరకు వుండాలా?” కోపంగా అన్నాడు రాజు.
“మరి 'ఏ' సెక్షన్ నేనే కదా? సీనియర్ ను. బడ్జెట్ క్లర్క్ దగ్గరరేగా ఫైల్స్ ఆడిట్ వాళ్ళు ఎక్కువగా చూసేది. నువ్వూ నాలాంటి ఉద్యోగమే కదా చేస్తున్నావు? శాఖ వేరు అంతే. నీకు తెలియదా?” వాసవి కూడా అంతే కోపంగా అంది.
“అయినా మా ఆఫీస్ విషయాలన్నీ మా స్టాఫ్ కు ఫోన్ చేసి కనుక్కుంటూ ఉన్నావుగా? ఇంకా నేనేం దాచి పెట్టానని అడుగుతున్నావు?” అంది మళ్ళీ.
“సరే. మీ సూపరింటెండెంట్ కు ఫోన్ చేసి రేపు నేను సెలవు పెడుతున్నాను. 'ఆఫీస్ కు రాలేను. ఆరోగ్యం బాగాలేదు. ఆసుపత్రికి వెళ్తున్నాను' అని చెప్పు” రాజు ఆజ్ఞాపించాడు.
“ఇప్పుడు బాగుండదేమో రాజు. అయినా నేనెప్పుడూ సూపరింటెండెంట్ కు ఫోన్ చెయ్యలేదు. నా సెలవు చీటీలు కూడా ఎప్పుడూ నువ్వేకదా ఆఫీస్ లో ఇచ్చి వస్తావు” అని ఫోన్ చెయ్యడానికి సందేహిస్తూ అంది వాసవి.
“నీకేం ఫర్వాలేదులే. నువ్వంటే ఏ టైమ్ అయినా ఫోన్ తీస్తాడులే మీ సూప్” గొంతు నిండా ఎగతాళితో అన్నాడు రాజు.
“అదేంటలా మాట్లాడుతున్నావు” అసహ్యంగా చూస్తూ అంది వాసవి.
“ఎలా మాట్లాడుతున్నాను. నాకన్నీ తెలుసులే. ఫోన్
చెయ్యి ముందు” గట్టిగా అరిచాడు రాజు.
రాత్రి తొమ్మిదిగంటలకు అతని మాటలు చుట్టుపక్కల వాళ్ళు వింటారేమోనని వాసవి కంగారుపడింది.
“అలా నేనెప్పుడూ ఫోన్ చెయ్యను కదా! ఈ టైం లో చేస్తే ఏమనుకుంటారో?” అంది జంకుతూ.
“నీ నక్క వినయాలు నా దగ్గర కాదు” క్రౌర్యంగా చూస్తూ అన్నాడు రాజు.
“ఇలా మాట్లాడితే కష్టం రాజు. నాలుగు నెలల నుంచి ఇలాగే మాట్లాడుతున్నావు, ఎంతకని ఓర్చుకునేది? నేనిక్కడ ఉండలేను” ఏడుస్తూ అంది వాసవి.
“ఉండలేకుంటే వెళ్ళు. నీకిష్టమైన వాళ్ళతో వెళ్ళు. నాకు తెలుసు నీ వేషాలు” ఇంకా గట్టిగా అన్నాడు రాజు.
“నన్ను ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్తున్నావా?” వాసవి నిర్ఘాంత పోతూ అంది.
ఇక లాభం లేదని ఫోన్ చెయ్యడానికి ఫోన్ చేతిలోకి తీసుకుంది వాసవి.
కీపాడ్ ఒక మూడు సార్లు ప్రెస్ చేస్తుండగా “సూపరింటెండెంట్ కు ఎప్పుడూ ఫోన్ చెయ్యలేదన్నావు. నెంబర్ అంత బాగా గుర్తుందా నీకు?”
“నాకు నెంబర్ గుర్తుండడమేంటి? మా అమ్మ నెంబర్, నీ నెంబర్ తప్ప నాకెవరి నెంబర్ గుర్తులేదు” అసహనంగా అంది వాసవి.
“మరి నెంబర్ డయల్ చేస్తున్నావుగా?” ప్రశ్నార్థకంగా అన్నాడు.
“నెంబర్ ఎక్కడ డయల్ చేశాను?” ఆమె కూడా ప్రశ్నార్థకంగా చూసింది.
“నువ్వు నొక్కుతున్నావు. నంబర్ కదా?” అనుమానంగా అన్నాడు.
“నాకు వాళ్ళ సెల్ నంబర్స్ అన్నీ ఎలా గుర్తుంటాయి?” అసహనంగా అంది వాసవి.
“ఒకవైపు నెంబర్ ప్రెస్ చేస్తున్నావు. ఇంకోవైపు నెంబర్ తెలీదంటున్నావు. నాటకాలాడుతున్నావా?”
అతని మాటలకు వాసవి ఫోన్ విసిరి పడేసి ఏడుస్తూ ఉండిపోయింది చాలా సేపు.
***
ఉదయాన్నే అనుకోకుండా వచ్చిన వాళ్ళమ్మను చూసి ఆశ్చర్యపోయాడు రాజు.
“ఏమిటమ్మా, ఫోన్ అయినా చెయ్యకుండా ఇలా వచ్చావు?” అన్నాడు కొంచెం కంగారుగా కూడా.
“నీకు చెప్పి గానీ రాకూడదా ఏంటి?” రుక్మిణి ప్రశ్నించింది.
“అని కాదు గానీ..” అంటూ నసిగాడు.
ఆమె “వాసవీ” అని పిలుస్తూ ఇంట్లోకి వెళ్ళింది. ఆమె అటు వెళ్ళగానే, 'గంట ప్రయాణం దూరంలో పల్లెటూర్లో ఉండే అమ్మ తెల్లవారుఝామునే లేచి ఎందుకొచ్చిందబ్బా' అని ఆలోచిస్తూ కూర్చున్నాడు రాజు.
ఒకరగంట తరువాత కోడలితో కూడా టిఫెన్ తినిపించి కొడుకు చేత చీవాట్లు తినిపించడానికి కోడలిని కూడా తీసుకొని హాల్ లో కొచ్చి కూర్చుంది రుక్మిణి.
రాజుకింకా అయోమయంగానే ఉంది.
“రాత్రి ఏమన్నావు వాసవిని?” ఆమె అడిగిన ప్రశ్నతో వాసవి రాత్రి రుక్మిణి తో మాట్లాడింది అని అర్థమయ్యింది రాజుకు.
“రాత్రి పది గంటలకు వాసవి నాకు ఫోన్చేసింది. నువ్వు అసభ్యంగా మాట్లాడి ఇంట్లో నుండి వెళ్ళి పొమ్మన్నావని చెప్పింది. పెళ్ళి చేసి మనింటికి పిలిపించింది మేము కదా? మరి మాకు తెలియకుండా ఎలా వెళ్తుంది? అందుకే రాత్రి ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది. 'ఉదయాన్నే నేను వస్తాను. అంతవరకూ ఉండ' మని నేనే చెప్పాను. ఏమన్నావు నువ్వు?” తీక్షణంగా అడిగింది రుక్మిణి.
'రాత్రి వేరే రూమ్ లో పడుకుంది వాసవి. అందుకే ఫోన్ విషయం తనకు తెలియలేదు' అనుకుంటూ
“ఏం లేదమ్మా. ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చిందని..” అతని మాట పూర్తి గాకుండానే
“లేటుగా వస్తే..నీ నోటికొచ్చినట్లు అనేస్తావా? ఆడవాళ్ళంటే అలుసా? నీతో సమానంగా ఉద్యోగం చేస్తోంది. పెళ్ళికి ముందే ఉద్యోగం చేస్తుందని తెలుసు కూడా. మరలా.. ఎలా మాట్లాడతావు?” కోపంగా అంది రుక్మిణి.
రాజు కోపంగా వాసవిని చూశాడు.
అది గమనించి రుక్మిణి “వాసవి మీద కోప్పడటం కాదు నువ్విప్పుడు చెయ్యాల్సింది. నువ్వు మాట్లాడిన అవాకు చవాకు మాటలు రికార్డు చేసి పోలీస్ స్టేషన్ లో ఇచ్చుంటే, వాళ్ళు నీకు 'బడిత పూజ ఎలా చేసి ఉండేవాళ్ళో' అని ఆలోచించు” రుక్మిణి గర్జించినట్లుగా అంది.
“ఆఫీస్ లో మగవాళ్ళతో మాట్లాడితేనో, అవసరానికి ఆలస్యంగా ఎక్కువసేపు ఆఫీస్ లో ఉంటేనో ఆడవాళ్ళందరినీ అనుమానంగా చూసి, అవమానకరంగా మాట్లాడితే వాళ్ళెందుకు మీ మగవాళ్ళ మాటలు పడాలి? వాళ్ళు సంపాదిస్తున్నారు. వాళ్ళను గౌరవంగా చూసుకోవాలి” అని మళ్ళీ అంది.
“నీకు అనుమానం వస్తే అడుగు. వివరం తెలుసుకో. అంతేగానీ నీ నోటికొచ్చినట్లు మాట్లాడితే పూర్వం లాగా ఎవ్వరికీ చెప్పకుండా ఏడుస్తూ ఇంట్లోనే కూర్చునే అవసరం లేదు వాళ్ళకు” అని రాజుతో అంటూ
“ఇప్పుడు చెప్పమ్మా వాసవీ. వాడి డౌట్ ఏంటి? నువ్వు మీ సూపరింటెండెంట్ గారి నెంబర్ ఎలా గుర్తు పెట్టుకున్నావని కదా? రాత్రి నువ్వు చెప్పినప్పుడు నాకు వివరంగా అర్థం అయ్యింది. ఇప్పుడు నువ్వే వాడికి చెప్పు అర్థమయ్యేట్టు” అంది అనునయంగా.
“అత్తయ్యా, ఇంతకుముందు స్మార్ట్ ఫోన్ లేనప్పుడు మనం 'కీ పాడ్' మీద ఆల్ఫాబెట్స్ ను నొక్కి పేరు కొట్టేవాళ్ళం. ఇప్పుడు కూడా ఆల్ఫాబెట్ ‘ఏ’ కోసం నెంబర్ రెండును ఒకసారి నొక్కితే ‘ఏ’ పేరుతో ఉన్న పేర్లు, నంబర్లు చూపిస్తుంది. ‘బి’ కోసం అదే రెండును రెండుసార్లు నొక్కితే ‘బి’ పేరుతో ఉన్న -పేర్లు, నంబర్లు చూపిస్తుంది. అలా నేను మీకు ఫోన్ చెయ్యాలంటే నేను అత్తయ్య అని సేవ్ చేసుకున్నందున ’ఏ’ కోసం నొక్కితే అత్తయ్య అని వస్తుంది. అలా ఏపేరు గలవాళ్ళకయినా వారి పేరులో మొదటి అక్షరం, లేదా రెండు అక్షరాలూ కొడితే వాళ్ళ పేరు వస్తుంది. ఆ కీపాడ్ శబ్దం నెంబర్ కొట్టినట్లుగానే ఉంటుంది. నేనలా కొడుతూ ఉంటే నన్ను అనుమానంగా మాట్లాడితే నాకు కోపం, ఏడుపు వచ్చాయి” వాసవి వివరంగా చెప్పి కళ్ళు తుడుచుకుంది.
“నువ్వు ఏడవకమ్మా. ఇలాంటి దౌర్భాగ్యపు కొడుకును కన్నందుకు నేనేడవాలి” అంటూ
“ఏరా అర్థమయ్యిందా?” కొడుకు వైపు నిరసనగా చూస్తూ అంది.
“ఆ.. అయ్యింది” నెమ్మదిగా అన్నాడు రాజు.
“ఆడపిల్లల మనసు మల్లెపువ్వంత స్వచ్ఛమైనది. ఆ పువ్వు నలుక్కుండా మగవాడు చూసుకోవాలి. అప్పుడే వాళ్ళు మనస్ఫూర్తిగా సంసారం చెయ్యగలరు. నేనొక రెండురోజులు ఇక్కడే ఉండి తరువాత ఊరు వెళతాను. నువ్వు భార్యతో కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్చుకో” అంది రుక్మిణి కొడుకుతో. వాసవి ఆనందంగా చూసింది అత్తగారి వైపు.
కొడుకు తప్పును ఎత్తి చూపించి, కొడుక్కు మంచి మార్గం చెప్పి, కోడలిని కడుపులో పెట్టుకొని చూసే రుక్మిణి లాంటి అత్తగారు ఉండటం ఎంత అదృష్టం? పెద్దవాళ్ళు కూడా తమ కొడుకు తప్పును ఒప్పుకోగలగాలి. ‘నాకొడుకు ఏం చేసినా కోడలు పడి ఉండాలి’ అని అనుకోకూడదు. అలాంటప్పుడే సంసారాలు చక్కబడతాయి.
సమాప్తం
కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
సమాప్తం

రచయిత్రి పరిచయం: నా పేరు కె.లక్ష్మీ శైలజ
నేను ఏం. ఏ. ఎం. ఫిల్., చేశాను.
మహిళా అభివృద్ధి శిశుశంక్షేమ శాఖలో గెజిటెడ్ ఆఫీసర్ గా చేసి రిటైర్ అయ్యాను. స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర A . కోడూరు. ప్రస్తుతం హైదరాబాదు లో నివాసం. నా పందొమ్మిదవ సంవత్సరం లో మా అమ్మ ప్రోత్సాహం తో మొదటి కథ వ్రాశాను. పాతిక కవితలు వ్రాశాను. ఇవి వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కెనడే వారి (బి.వి.ఆర్.ఫౌండేషన్) బహుమతులను ..అమ్మ, నాన్న, నేను...స్వయంకృతం.. అనే కవితలు గెలుచుకున్నాయి. 10 వ్యాసాలు వ్రాశాను. నేను టెలిఫోన్స్ గురించి వ్రాసిన వ్యాసానికి నంద్యాల కాలేజెస్ లన్నింటిలో ప్రథమ బహుమతి వచ్చింది.
ఇప్పటికి వంద కథలు... తెలుగు వెలుగు, బాల భారతం, ఆంధ్రభూమి, వార్త, సంచిక, ఈనాడు, వార్త, ప్రజాశక్తి, సూర్య, విశాలాంధ్ర, ఉషా, సాహితీ కిరణం, అంతర్జాల పత్రిక మనోహరం లలో , మన తెలుగు కథలు లో ప్రచురితమయ్యాయి. మనతెలుగు కథలు ఐదు కథలు నందు వారం వారం బహుమతులను, సంచిక, సాహితీ కిరణం లందు కథలకు బహుమతులు వచ్చాయి
నా పబ్లిష్ అయిన కథలను ...మనందరి కథలు ...అనే పేరున రెండు
సంకలనాలుగా ప్రింట్ చేయడం జరిగింది.
కొనిరెడ్డి ఫౌండేషన్ ప్రొద్దుటూరు వారు.. మనందరి కథలు... కు మార్చ్ ఎనిమిది 2025 న పురస్కారం ఇవ్వడం జరిగింది.
రచయిత్రుల గ్రూప్ ...లేఖిని...సాహిత్య సాంస్కృతిక సంస్థ... లో 74 మంది రచయిత్రుల తో కూడిన సంకలనం..కథల లోగిలి.. లో నా కథ... పుత్రునికి పునర్జన్మ ...ప్రచురించారు. నారం శెట్టి బాల సాహిత్య పీఠం వారి కథాసంకలనం లో ...జిమ్మీ నా ప్రాణం...అనే కథ ప్రచురించారు.
జిమ్మీ నా ప్రాణం కథ.
వేరే వారి కథలను మన తెలుగు కథలు, మనోహరం లలో చదివి వినిపించాను. సంగీత ప్రవేశం లో జూన్ 2022 న తానా గేయ తరంగాలు జూమ్ మీటింగ్ లో గేయం రచించి పాడటం జరిగింది. నెల్లూరు లో ఘంటసాల పాటల పోటీ లందు ఎస్. పి. వసంత గారు బహుమతిని ఇవ్వడం జరిగింది.
ఇంకా చిత్ర కళలో.. చందమామ.. వారు బహుమతిని ఇవ్వడం జరిగింది.
చాలా చక్కని కథ. మంచి సందేశం ఇచ్చారు. కథనం బాగుంది. రచయిత్రి కి అభినందనలు.