top of page

మల్లీశ్వరి


'Malliswari' New Telugu Story

Written By Varanasi Bhanumurthy Rao

'మల్లీశ్వరి' తెలుగు కథ

రచన: వారణాసి భానుమూర్తి రావు

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"ఠక్.. ఠక్.. ఠక్" తలుపు తడుతున్నాను నేను. కాలింగ్ బెల్ గూడా లేదు. బయట ఎండలు మండి పోతున్నాయి. ఒక్కటే ఉక్క పోత. తిరుపతి ఎండలు తట్టు కోలేము. అంతలోనే ఒకావిడ తలుపు తెరిచింది. ‌ ''మల్లీశ్వరీ! బాగున్నావా?'' తలుపు తెరచిన వెంటనే పలకరించాను నేను. అనుకోని అతిధిని చూసి ఆశ్చర్యంగా చూసింది నా వైపు మల్లీశ్వరి. కళ్ళకున్న సన్‌ గ్లాసెస్ తీసి మల్లీశ్వరి వైపు చూశాను. ‌ ''నువ్వా.. బాగున్నావా బావా? ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి..'' ''దాదాపు పది సంవత్సరాలు అయింది కదా?'' అన్నాను నేను. ''అవును''.. ఆమె కళ్ళల్లో కన్నీరు దాచడానికి ప్రయత్నిస్తోంది. నాకు గూడా ఆమెను చూసిన వెంటనే మనసంతా బాధగా ఉంది. వెంటనే మల్లీశ్వరి వంటింట్లోకి వెళ్ళి చల్లని కుండలో వున్న మంచి నీరు గ్లాసులో తెచ్చి ఇచ్చింది. ఇంటిలో ఫ్రిజ్ గూడా లేనట్లే వుంది. ''మోహన్, పిల్లలు.. ఎలా ఉన్నారు?'' అంటూ నేను తెచ్చిన చాక్లెట్లు, బిస్కట్లు, ఆపిల్ పళ్ళు, అరటి పళ్ళు టేబుల్ మీద ఉంచాను. ''అంతా బాగానే ఉన్నారు.. ఎప్పడు వచ్చావు నువ్వు హైదరాబాద్ నుండి?" అన్నది మల్లీశ్వరి. "తిరుపతికి పని మీద వచ్చాను. అలాగే స్వామి దర్శనం చేసుకొని, నువ్వు ఎలా ఉన్నావో అని చూసి పోవడానికి వచ్చాను." ''భోజనం చేసి వెళ్ళాలి. ఆయన గూడా కొంత సేపట్లో వస్తారు. పిల్లలు స్కూల్ కి వెళ్లారు” అన్నది మల్లీశ్వరి. ''ఆబ్బే.. పరవా లేదు." అన్నాను నేను. మల్లీశ్వరి నాకు మేనత్త కూతురే అవుతుంది. మా నాన్న చెల్లెలి కూతురు. వరసకి మరదలు. మేమంతా చిన్నప్పుడు మా పల్లెలో పక్క పక్క ఇళ్లల్లో ఉండే వాళ్ళం, రోజంతా స్కూల్ కి వెళ్లడం, సాయంకాలం ఆడు కోవడం, పొలాల వెంబడి గంతు లెయ్యడం, చెట్లు ఎక్కి కోతి కొమ్మచ్చి ఆడడం.. ఇలా మా బాల్యం గడచి పోయింది. మల్లీశ్వరి చిన్నప్పుడు ఎంత అందంగా ఉండేది అంటే.. పల్లెలోని వాళ్లంతా ఆమెను నిలబడి చూసే వాళ్ళు. ఒక సారైనా ఆమెతో మాట్లాడాలని ఉవ్విళ్లూరే వారు. ముఖంలో తరగని చిరు నవ్వు, మెరిసే విశాల మైన కళ్ళు, చక్కటి గుండ్రని ముఖం. ఏ దేవతో తప్పయి ఈ పల్లెలో పుట్టిందా అనిపించేది. మల్లీశ్వరి నా మరదలు అయినందుకు ఊర్లో వాళ్ళు నన్ను గేలి పట్టిచ్చే వారు. ''నీకేమోయ్.. రంభ లాంటి పెళ్ళాం రెడీ గా ఉంది అనే వాళ్ళు''. నేను గూడా మల్లీశ్వరి ని పెళ్లి చేసు కోవాలని కలలు కనే వాడిని. కానీ ఏనాడూ హద్దు మీరి ప్రవర్తించింది లేదు. స్కూల్ కి వెళ్లి ఇంటికి వచ్చేంత వరకు ఆమెకు బాడీ గార్డ్ గా ఉండే వాడిని. కానీ మల్లీశ్వరి ఇప్పుడు కృశించి పోయిన ముఖం తో చాలా అనారోగ్యంగా ఉంది. ఆమె ముఖంలో ఆ కళ లేదు. కళ్ళు తేలి పోయి నట్లు నిర్జీవంగా ఉన్నాయి. ముఖంలో ఏదో రోగం వచ్చినట్లు పాలిపోయింది. సరయిన ఆహారం, విశ్రాంతి లేనందు వలనో, లేదా కుటుంబ పరిస్థితుల వల్లనేమో ఆమె అనారోగ్యంగా ఉంది. ఇల్లు చాలా ఇరుకిరుగ్గా ఉంది. ఒక హాల్, ఒక కిచెన్ తప్ప ఏమీ లేదు. అంత పెద్ద భూస్వామి కొడుక్కిచ్చి పెళ్లి చేసాడు మా మామయ్య. వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి చలించి పొయ్యాను. ''ఎందుకిలా అయి పోయావు? ఎంత చక్కగా ఉండే దానివి?'' మల్లీశ్వరి పద్మావతి ఉమెన్స్ కాలేజ్ లో ' బి ఏ ' లో చేరినపుడు, నేను ' ఎం కాం ' లో చేరాను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ డిగ్రీ కాలేజీలో. ఆక్కడే సరదాగా అప్పుడప్పుడు కలిసే వాళ్ళం. మల్లీశ్వరి నాన్న గారు పెద్ద భూస్వామి. దాదాపు నూరు ఎకరాలు భూములు ఉండేవి. ఇల్లంతా సందడి సందడిగా ఉండేది. ఎక్కడ చూసినా పాడి పంటలే వాళ్ళ ఇంట్లో. పది మంది జీత గాళ్ళు పని చేసే వారు‌ వాళ్ళ ఇంటిలో ఎప్పుడూ. మల్లీశ్వరి 'ఐఏఎస్' చదివి కలెక్టర్ గావాలని ఉవ్విళ్లూరేది. నేను గూడా చాలా ఎంకరేజ్ చేసే వాడ్ని. దానికి తగ్గట్లే అన్ని విషయాల్లోనూ చాలా చురుగ్గా ఉండేది. మార్కుల్లో క్లాసులో ఫస్ట్ వచ్చేది. ఒక రోజు మల్లీశ్వరి నా దగ్గరికి వచ్చింది. ఆమె ముఖంలో ఏదో టెన్షన్ ప్రస్ఫుట మవుతోంది. ''బావా..'' నన్ను చూడ గానే ఏడ్చేసింది. ''ఏమయింది?'' అన్నాను నేను. "మా నాయన నాకు పెళ్లి సంబంధం ఖాయం చేశాడు. నేను పెళ్లి చేసుకోను అంటే గూడా ఒప్పు కోలేదు. అధికార పార్టీ ఎం ఎల్ ఏ గారి చెల్లెలి కొడుకంట.. నాకేమో బి ఏ తరువాత ఐఏఎస్ చేయాలని ఉంది." మల్లీశ్వరి రెండు చేతుల్తో ముఖాన్ని కప్పుకొని ఏడుస్తూ అన్నది. మల్లీశ్వరిని చూసి నాకు చాలా బాధ వేసింది. ఇద్దరం సెటిల్ ఆయిన తర్వాత నేనే మల్లీశ్వరిని పెళ్లి చేసు కోవాలను కొన్నాను. గ్రాడ్యు యేషన్ ఆయిన తర్వాత నేను సి ఏ లోనూ, తాను ఐఏఎస్ చేయాలని అనుకొన్నాము. ఇటీవల మా మామయ్య విలేజ్ సర్పంచ్ అయిన కాడ్నుంచి ఆయన తీరే మారి పోయింది. ఆయన మాటల్లో దర్పం పెరిగింది ''మరి నేను మాట్లాడనా మీ నాయనతో?'' ''మాట్లాడు'' సరే నని, పబ్లిక్ టెలీఫోన్ నుండి వాళ్ళ నాయనతో భయ భయంగానే మాట్లాడాను. నాకు కళ్ళు తిరిగి బైర్లు కమ్మి నట్లయింది ఆయన మాటలు విన్నాక. ''ఒరేయ్ రామ్ నారాయణ! మల్లీశ్వరిని నీ కెపుడూ ఇస్తామని అనుకోలేదు. అసలు నువ్వెంత? నీ స్థాయి ఎంత? పోనీ నీ కాడ అన్ని ఆస్తులు, అంతస్తులు ఉన్నాయా? నువ్వు రేపో మాపో ఏదో క్లర్క్ అయిన తరువాత నీ చేతుల్లో పెడితే మా అమ్మి సుఖ పడుతుందా? . మా అమ్మి సంగతి మరచిపో.. లేదంటే మీ అమ్మ నాయనకు కు మూడు తుంది నా దగ్గర'' అన్నాడు ఆయన కటువు గానే. అయన గర్వాన్ని, ఆ మాటల్లో ఉన్న హేళన విన్న మల్లీశ్వరి కన్నీరు మున్నీరుగ ఏడ్చింది. ''ఇప్పుడెట్లా బావ? మా నాయన చండ శాసనుడు. ఆయన ఒకడు చెప్పింది వినడు గదా!'' ''ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పెళ్లి చేసు కొందామా బావా? ఎక్కడి కయినా పారి పోదామా? నేను నిన్ను తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను బావా!'' అని నా చేతుల్ని పట్టుకొని చిన్న పిల్లలా ఏడ్చింది. నా కంత దైర్యం లేదు. పారి పోయి పెళ్లి చేసుకొంటే మా శవాలను చూసే దాకా మా మామ నిద్ర పోడు. ఆయన సంగతి నాకు తెలుసు. మల్లీశ్వరి కి ధైర్యం చెప్పినాను. జరిగేది జరగక మానదు అని చెప్పాను. మల్లీశ్వరి కి ఇష్టం లేక పోయినా, ఆమెకు ఆ ఎమ్మెల్యే సంబంధం కట్ట బెట్టాడు వాళ్ళ నాయన. అలా మల్లీశ్వరి కన్న కలలు వాళ్ళ నాన్న మంకు తనం వల్ల కల్లలయి పొయ్యాయి మా మామయ్య చని పోయిన తర్వాత కొన్ని రోజులు మల్లీశ్వరి సంసారం బాగానే గడిచింది. కానీ మోహన్ పేకాట, హార్స్ రేస్ ల వ్యసనాల వల్ల చాలా డబ్బు పోగొట్టు కొన్నాడని మల్లీశ్వరి చెప్పింది. ఆస్తులన్నీ కరిగి పొయ్యాక, ఉన్న పొలాల్లో అంత ఫలసాయం రాక పోవడం వల్ల, ఏదో కాంట్రాక్టర్ దగ్గర చిన్న ఉద్యోగం వెలగ బెడుతున్నాడు మోహన్ తిరుపతిలో. నేను మా మామయ్య చేసిన అవమానంతో కసిగా చదివి బీకామ్ తర్వాత సి ఏ లో చేరి అన్ని సబ్జెక్టులు ఫస్ట్ అట్టెంప్ట్ లో పాస్ అయి, చార్టర్డ్ అకౌంటెంట్ గా హైదరాబాదు లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఆర్థికంగా బాగానే సెటిల్ అయ్యాను హైదరాబాద్ లో. అంతలో మోహన్ వచ్చాడు. మోహన్ వచ్చాక ఇద్దరం లంచ్ చేసాము. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ లేక పోతున్నాడు మోహన్. ఏదో అన్యాయం చేసినట్లుగా ఫీల్ అయి పోతున్నాడు. ''మోహన్.. అంతా ఓకే గదా..” ''అసలేం బాగా లేదు రామ్. తెలిసి తెలిసీ జీవితాన్ని నాశనం చేసుకొన్నాను. అంతే గాకుండా మల్లీశ్వరి జీవితాన్ని గూడా నాశనం చేసాను. ఆడ పిల్లల జీవితాలతో ఆడుకోగూడదు రామ్'' అన్నాడు మోహన్. "నువ్వేం తప్పు చెయ్యలేదు.. అది వాళ్ళ నాన్న చేసిన తప్పు.'' అన్నాను నేను. ''అవును రామ్. అడపిల్ల తల్లి తండ్రులు పెళ్లి పెళ్లి అని వాళ్ళ జీవితాల్ని నాశనం చెయ్య గూడదు. వాళ్ళను బాగా చదివించి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు పెళ్లి ప్రస్తావన తేగూడదు. ఈ పితృ స్వామ్య వ్యవస్థలో ఆడపిల్లల జీవితాల్ని మనం నాశనం చేస్తున్నాము. లక్షణంగా చదివి ' ఐఏఎస్ ' కావలసిన మల్లీశ్వరి ని ఇలా వంటింటికి పరిమితి చేసి నాను. ‌ మల్లీశ్వరి భవిష్యత్తును నేనే నాశనం చేశాను'' అన్నాడు మోహన్. ''అవును. నా ఇద్దరు ఆడ పిల్లల్ని నేను బాగా పెంచుతాను. వాళ్ళను బాగా చదివించి వాళ్లు ఆర్థికంగా నిలబడిన తరువాతే పెళ్లి. అది గూడా వాళ్లకు నచ్చిన పిల్లవాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను'' అన్నాడు మోహన్ మళ్ళీ. ''అవును.. మోహన్ మనం తప్పని సరిగా మారాలి. మన పెద్ద వాళ్ళు చేసిన తప్పులే మనం చెయ్యగూడదు. ఆడపిల్లల జీవితాలను తల్లి తండ్రులుగా మనమే నాశనం చెయ్య కూడదు. మన తరంలో ఆయినా ఆడ పిల్లలు, మగ పిల్లలు అనే తేడా లేకుండా వాళ్ళని పెద్ద పెద్ద చదువులు చదివించాలి. వాళ్ళ ఆశల్ని, ఆశయాల్ని తెలుసు కొని, దానికి తగ్గట్లుగా తల్లి తండ్రులు బాధ్యతగా ప్రవర్తించాలి. ఆడ పిల్లలు సంఘంలో తలెత్తుకు తిరిగేలా వాళ్ళను తీర్చి దిద్దాలి” అన్నాను నేను మోహన్ భుజం తడుతూ. బరువైన హృదయంతో లేచి బయలు దేరాను నేను. ‌ ************************************************ ఆరు సంవత్సరాల తర్వాత నేను ఒక వ్యవసాయ భూమిని మదన పల్లిలో కొన్నాను. దాని రిజిస్ట్రేషన్ కొరకు మదన పల్లి లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్ళాను. డాక్యుమెంట్లు అన్నీ సబ్మిట్ చేసి నా వంతు రావడం కోసం వేచి యున్నాను. ఎడమ చేయి బొటన వ్రేలితో నా ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకొన్నారు. ఇన్ని నియంత్రణలతో పకడ్బందీగా ప్రభుత్వం చేస్తున్నా మోసాలు జరుగు తూనే ఉన్నాయి. ఒక్కొక భూమిని ఇద్దరు ముగ్గురుకి గూడా అమ్మేసి చేతులు దులుపు కొంటున్నారు భూ బకాసురులు. ప్రభుత్వ భూములు హాం ఫట్ అయి పోతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో లంచాలు లేనిదే పనులు జరగడం లేదు. ఇక్కడ గూడా ఎంత లంచం అడుగు తారో అని భయంగా వుంది. నా కయితే లంచం ఇవ్వడం ఇష్టం లేదు. లంచం ఇచ్చినా, తీసుకొన్నా నేరమే గదా? అంతలో ఒక అటెండర్ నన్ను ప్రక్కకు పిలిచాడు. ఇతను అందరి తరపునా లంచం తీసుకొని సాయంత్రానికి ఎక్కడో హోటల్లో కూర్చొని పంచుకొంటారని నాకు తెలిసింది. ‌ దీనిలో పెద్ద పెద్ద ఆఫీసర్లకు గూడా వాటా లుంటాయని విన్నాను. ఏమి చేద్దాం.. మన దేశంలో ఈ అవినీతి కాన్సర్ లా ప్రాకి పోయింది. అవినీతి ఒక విష వలయం. ముందు రాజ కీయ నాయకులు అవినీతికి దూరంగా వుంటే దేశం బాగు పడుతుంది. "సార్!" పిలిచాడు అటెండర్ గట్టిగా మరోసారి. ఆలోచనల నుండి తేరుకొని, ఏమి అన్నట్లు ఆ అటెండర్ ని సీరియస్ గా చూశాను. ''ఎంత అవుతుంది?''మౌనంగా సైగ చేశాను. "ఇప్పుడు మీ డాక్యుమెంట్లు వస్తాయి.. అమ్మ గారి సంతకం కోసం. ఎక్కడికీ వెళ్ళకండి" అని నా కళ్ళల్లోకి ఆశగా చూశాడు. సరే ఇవ్వక తప్పదని ఒక ఐదు వేలు కాగితాలలో చుట్టి పెట్టినవి ఇచ్చాను అతనికి. "ఏమిటి సార్ ఇది.. ఆ జమానా పోయింది. ఇప్పుడు అమ్మ గారు సబ్ రిజిస్ట్రార్ గా వచ్చాక లంచం మాటెత్తితే మమ్మల్ని డిస్మిస్సు చేస్తారు'' అన్నాడు అతను భయ పడుతూ. నేను గూడా భయ పడుతూ ఠక్కున కరెన్సీ కట్టను జోబీ లోకి దోపు కొన్నాను. ఎందు కంటే లంచం ఇచ్చినా నేరమే.. తీసుకొన్నా నేరమే గదా! నా పేరు పిలిచాడు ఆ అటెండరు గట్టిగా. 'రామ్ నారాయణా' అని మళ్ళీ పిలిచాడు. నేను సబ్ రిజిస్ట్రార్ గారి ముందర నిలబడుకొని వున్నాను. 'మీరేనా.. రామ్ నారాయణ' అని అన్నది ఆమె తలెత్తి. అంతే.. ఆమెను ఎక్కడో చూసినట్లుంది.. ఆమె‌ ముఖంలో తేజస్సు, అందం, ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. 'మీరు. ‌రామ్ గదూ?' అన్నది అమె. 'నేను.. నేను మల్లీశ్వరి ని‌ బావా.. గుర్తు పట్టలేదా?' అంది ఆమె నవ్వుతూ. "కథ అంతా మళ్ళీ చెబుతాను.. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీటు చేద్దాం" అంది మల్లీశ్వరి. ఆమె విశాల మైన టేబుల్ మీద ఎన్నో ఫైళ్ళు పడి ఉన్నాయి. అక్కడ ఒక నేమ్ ప్లేట్ గూడా చూశాను. దానిమీద "ఎస్. మల్లీశ్వరి, సబ్ రిజిస్ట్రార్" అని తెలుగులో ఉంది. "ఇంటికి రండి బావా!" అని మల్లీశ్వరి‌ అడ్రస్సు చెప్పింది. మరుసటి రోజు సాయంత్రం బెంగుళూరు రోడ్డు ప్రక్కన ఉన్న కాలనీలో ఆమె ఇల్లు వుంది. విశాలమైన ఇండిపెండెంట్ ఇంట్లోకి వెళ్ళాను. అంతలో మోహన్ గూడా వచ్చాడు. ''హల్లో రామ్.. ఎన్ని రోజులకు మీ దర్శనం..?" అన్నాడు మోహన్. "నేను హైదరాబాదు లోనే ఉన్నాను. మదన పల్లి లో ఒక వ్యవసాయ భూమి కొన్నాను. ఎప్పటి కైనా వ్యవసాయం చేసి పది మందికి సహాయం చెయ్యాలని నా ఆశ. నిన్న రిజిస్ట్రార్ ఆఫీసులో మల్లీశ్వరి కనబడింది. ఎనీ హౌ.. కంగ్రాచు లేషన్స్ టు బోత్ ఆఫ్ యూ..'' అన్నాను నేను. అంతలో మల్లీశ్వరి కాఫీ, బిస్కట్లు, మంచి నీరు ఒక ట్రే లో తెచ్చి పెట్టింది. ముగ్గురూ సోఫాల్లో కూర్చొన్నాం. ''అంతా కలలా ఉంది. మల్లీశ్వరి కి ఇంత మంచి జాబ్ ఎలా వచ్చింది! మల్లీశ్వరిని ఈ పోస్ట్ లో చూసి చాలా సంతోషంగా ఉంది'' అన్నాను నేను. "నువ్వు తిరుపతికి వచ్చి మాకు చెప్పినప్పటి నుండి చాలా గిల్టీ గా ఫీల్ అయ్యాను రామ్. నా కెట్లా చదువు రాదు. మల్లీశ్వరి గోల్డ్ మెడలిస్టు. తెలివైనది. ఏపిపిఎస్సి గ్రూప్ 2 పరీక్ష వ్రాయ మన్నాను. ఒక సంవత్సరం చాలా కష్ట పడి చదివి బాగా ప్రిపేర్ అయి మొదటి చాన్సు లోనే పరీక్ష పాస్ అయి‌, ఇంటర్వ్యూ గూడా బాగా చేసింది. అందుకే తనని ఈ పోస్ట్ వరించింది. వుద్యోగం లో గూడా చేరి రెండు సంవత్సరాలు అయ్యింది'' అన్నాడు మోహన్. “పిల్లలు గూడా బాగా చదువు కొంటున్నారు'” అన్నాడు మోహన్. "చాలా మంచి పని చేశావు‌ మోహన్. మీరిద్దరూ ఈ కాలపు యువతరానికి ఇన్స్పిరేషన్‌. కష్టపడితేనే దానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. మన జీవితాల్ని మనమే మలచు‌కోవాలి. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. మల్లీశ్వరి ఈ నాటి ఆడ పిల్లలకు ఒక రోల్ మాడల్. ‌ ప్రతి ఆడపిల్ల ఇలా ఆత్మ విశ్వాసంతో ముందుకు అడుగులు వెయ్యాలి" అని చెప్పాను. ''నువ్వే మాకు అసలయిన ఇన్స్పిరేషన్ రామ్! నిన్ను చూసే మేము చాలా నేర్చుకున్నాము'' అన్నది మల్లీశ్వరి. ‌ ఆ దంపతుల కిద్దరికీ అభినందనలు చెప్పి ఆనందంగా సెలవు తీసుకొని బయలు దేరినాను. ----------+---------+------------+-----------------+-----------------------------

వారణాసి భానుమూర్తి రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

వారణాసి భానుమూర్తి రావు గారు ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె లో జన్మించాడు. అతను వృత్తిరీత్యా కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పనిచేసాడు. ప్రవృత్తి రీత్యా కథలు , వచన కవితలు రాస్తున్నాడు. ఇప్పటికి అతను 60 కథానికలు, 600 దాకా వచన కవితలు రాశాడు. అతని కథలు ఆంధ్ర జ్యోతి , విజేత , ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో 1981 లో 'జీవన గతులు ' అనే కథ అచ్చయ్యింది. తరువాత ' ఈ దేశం ఏమై పోతోంది? ' అనే అదివారం ఆంధ్రప్రభ దిన పత్రిక లో అచ్చయ్యింది. ఆంధ్ర జ్యోతిలో పది కథలు దాకా అచ్చయ్యాయి. నల్లటి నిజం , జన్మ భూమి , అంతర్యుద్ధం , వాన దేముడా! లాంటి కథలు అచ్చు అయ్యాయి. 2000లో "*సాగర మథనం* ", 2005 లో " *సముద్ర ఘోష*" అనే కవిత సంపుటిలను ప్రచురించాడు. అందులో "సముద్ర ఘోష" పుస్తకాన్ని అక్కినేని నాగేశ్వర రావు గారికి అంకితం చేశారు. ఈ పుస్తకాన్ని జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి. నారాయణ రెడ్డి విడుదల చేసారు. అతను రాసిన కథ "పెద్ద కొడుకు" ( రాయల సీమ రైతు బిడ్డ మీద కథాంశం) భావగీతి ప్రతిలిపి 2014 కథల పోటీలో ప్రతిలిపి ద్వారా ప్రత్యేక బహుమతి పొందింది.ఈ కథను 60000 మంది పాఠకులు చదివారు. 4500 మంది స్పందించారు.

వారణాసి భానుమూర్తి రావు రాయలసీమ వ్యవహారిక బాషలో వ్రాయడానికి ఇష్టపడతారు.ఇప్పుడు " రాచపల్లి కథలు " , " నాన్నకు జాబు " అని తమ చిన్ననాటి అనుభవాలన్నింటినీ అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు.‌ .అలాగే తన మొట్టమొదటి నవలా ప్రక్రియను " సంస్కార సమేత రెడ్డి నాయుడు " తెలుగు వారి కోసం వ్రాశారు .ఆ తరువాత '' వరూధిని - ప్రవరాఖ్య '' శృంగార ప్రబంధ కావ్యాన్ని తమ దైన శైలిలో నవలీ కరణ చేశారు . కరోనా పై వీరు రాసిన కవిత ఆంధ్ర ప్రభలో ప్రచురించారు. సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ ను కనబరచిన వీరికి సాహితీ భూషణ , ప్రతిలిపి కవితా ప్రపూర్ణ ,సహస్ర కవి రత్న అనే బిరుదులు లభించాయి.

వారణాసి భానుమూర్తి రావు గారు ఇటీవల అనగా ఏప్రిల్‌ నెల 2022 లో రెండు పుస్తకాలు పాఠక లోకానికి అందించారు. 1. *మట్టి వేదం* కవితా సంపుటి 2. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* తెలుగు నవల . గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ వారిచే సాహిత్య రంగంలో విశేష మైన సేవలు చేసినందుకు గానూ , వీరి *మట్టి వేదం* కవితా సంపుటికి , *గిడుగు రామమూర్తి సాహిత్య పురస్కారం -2022* ని అందు కొన్నారు.

తెలుగు కవులు లో వారణాసి వారి కథలు రాయల సీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో కలిగి వుంటాయి.చిత్తూరు జిల్లాకు చెందిన వారణాసి భానుమూర్తి గారి కథలు , కవితలు వివిధ ఆన్ లైన్‌ పత్రికలలో వచ్చాయి. త్వరలో మరి కొన్ని నవలలు , కథల సంపుటాలు , కవితా సంకలనాలు వెలువడుతున్నాయి.ఇంతవరకు మూడు కవితా సంపుటిలు , ఒక నవలను పాఠక లోకానికి అందించారు.

*వీరి ముద్రిత రచనలు* ------------------

1. *సాగర మథనం* : 2000 సంవత్సరంలో అవిష్కరించారు. డాక్టర్ గోపీ గారు , తెలుగు అకాడమీ ప్రధాన సంచాలకులు , ఈ కవితా సంపుటి మీద ముందు మాట వ్రాశారు.

2. *సముద్ర ఘోష*: 90 కవితలున్న ఈ కవితా సంపుటి 2005 సంవత్సరంలో జ్డానపీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ( సినారె) అవిష్కరించారు. ఈ పుస్తకాన్ని , పద్మ విభూషణ్ డాక్టర్ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకిత మిచ్చారు .

3. *మట్టి వేదం* : 70 కవితలున్న ఈ కవితా సంకలనాన్ని 2022 ఏప్రిల్‌ నెల 17 వ తేదీ వెలువరించారు.‌ ఈ పుస్తకానికి కే రే జగదీష్ గారు , ప్రముఖ కవి , జర్నలిస్టు ముందు మాట వ్రాశారు

4. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* : ఇది రచయిత గారి తొలి నవలా ప్రక్రియ. ఈ నవల 17 ఏప్రిల్ 2022 నాడు అవిష్కరణ జరిగింది. ఈ నవల రాయల సీమ కక్షలు , ఫాక్షన్ ల మధ్య ఎలా రెండు కుటుంబాలు , రెండు గ్రామాలు నలిగి పొయ్యాయో తెలిపిన కథ. శ్రీమతి రాధికా ప్రసాద్ గారు ఈ నవలకు ముందు మాట వ్రాశారు. ఈ నవలకు ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 అందు కొన్నారు.

5. *పెద్ద కొడుకు* : 19 కథల సంపుటి. వారణాసి భానుమూర్తి రావు గారు వ్రాసిన కథల సంపుటి *పెద్ద కొడుకు* తుమ్మల పల్లి కళా క్షేత్రం , విజయ వాడ లో మల్లె తీగ వారు నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు , ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చేర్ పర్సన్ , కళారత్న శ్రీ బిక్కి కృష్ణ , తదితరుల చేతుల మీదుగా 20.11.2022 తేదీన అవిష్కరించారు. ఇందులో 19 కథలు ఉన్నాయి. ప్రతి కథ ఆణి ముత్యమే. కళా రత్న శ్రీ బిక్కి కృష్ణ గారు ముందు మాట వ్రాసిన ఈ పెద్ద కొడుకు కథల సంపుటి మానవీయ విలువల్ని అనేక కోణాల్లో రచయిత స్పృశించారు. వారణాసి గారు ఈ " పెద్ద కొడుకు " కథల సంపుటిని పాఠక లోకానికి అందించారు. ఇందులోని కథలన్నీ ఆణి ముత్యాలే! సమాజానికి సందేశ మిచ్చే కథలే!

*అముద్రిత రచనలు*

1 . *వరూధిని ప్రవరాఖ్య* : అల్లసాని పెద్దన గారి మను చరిత్రము నవలీ కరణ చేశారు‌. ఇది ఇంకా అముద్రితము.త్వరలో ప్రచురణకు వస్తుంది.

2 .*రాచ పల్లి కథలు* : తన చిన్న నాటి అనుభూతుల్ని , గ్రామీణ ప్రాంతాల్లో తను గడిపిన అనుభవాల్ని క్రోడీకరించి వ్రాసిన కథానికలు . త్వరలో ప్రచురణకు వస్తుంది.

3 . *నాలుగవ కవితా సంపుటి* త్వరలో వస్తుంది.

4 . *నాయనకు జాబు* అనే ధారావాహిక ఇప్పుడు వ్రాస్తున్నారు. లేఖా సాహిత్యం ద్వారా కథను వాస్తవిక సంఘటనలతో చెప్పడం ఈ జాబుల ప్రత్యేకత.

*విద్యాభ్యాసం* -----------

వారణాసి భానుమూర్తి గారి విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలో జరిగినది.

ఐదవ తరగతి వరకూ ప్రాధమిక పాఠశాల మహల్ లో , తరువాత ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకూ మహల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగింది. ఆ తరువాత తొమ్మిది , పది తరగతులు మేడికుర్తి కలికిరి చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లో చదివారు.‌ ఇంటర్మీడియట్ మరియు బి కాం బీ.టీ కాలేజీలో చదివారు.‌ తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఎస్ వీ యూనివర్సిటీ లో చదివారు.‌ వుద్యోగ నిమిత్తం హైదరాబాదు వెళ్ళిన తరువాత అక్కడ కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అక్కౌంటన్సీ ( FCMA) చేశారు.‌ ప్రొఫెషనల్ అక్కౌంట్స్ లో నిష్ణాతులయ్యారు.

*వృత్తి* ------

వారణాసి భానుమూర్తి గారు అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ జనరల్ మేనేజర్ గా వివిధ కార్పోరేట్ కంపెనీలల్లో పని చేశారు. హైదరాబాదు మహా నగర మంచి నీటి సరఫరా మరియు మురుగు నీటి సంస్థలో చీఫ్ జనరల్ మేనేజర్ (అక్కౌంట్స్) గా పని చేశారు.ఒక పేరు పొందిన నిర్మాణ సంస్థలో సీనియర్ జనరల్ మేనేజర్ (అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ ) గా పని చేసి వివిధ బాధ్యతలను 36 సంవత్సరాల పాటు నిర్వర్తించారు. కాస్ట్ అక్కౌంట్స్ హైదరాబాదు చాప్టర్ కి వైస్ చేర్మన్ హోదాలో బాధ్యతలను నిర్వర్తించారు.

వృత్తి ఏమైనప్పటికీ , ప్రవృత్తిగా కవిగా , రచయితగా రాణించారు. పదవ తరగతి నుండీ కవితలు , కథానికలు వ్రాశారు.ఇతని కథలు , కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‌

ఇతనికి ఇంత వరకు లభించిన బిరుదులు; 1. ప్రతిలిపి కవితా ప్రపూర్ణ 2. సహస్ర కవి రత్న 3. సాహితీ భూషణ 4. గిడుగు రామమూర్తి వారి సాహిత్య పురస్కారం 2022 లో. 5. ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 6. కళావేదిక వారి సాహితీ పురస్కారం 31.12.2022 న అందుకొన్నారు.72 views7 comments

7 Comments


Jogeswararao Pallempaati • 19 hours ago

చక్కటి సందేశంతో ముగించడo బాగుంది, మాష్టారూ! ఎందరికో దిక్సూచి!

Like

sastry mv • 3 hours ago

చాలా బాగుంది. ఆడపిల్లను స్వతంత్రంగా ఎదగనిచ్చే విషయంలో భర్త సహకారం అభినందనీయం. ఇది చాలామందికి inspirstion కావాలని ఆశిస్తున్నాను.

Like
Replying to

VBM Rao • 2 days ago

ధన్యవాదములండీ.

Like

bala bharathi • 1 hour ago

అద్భుతమైన కథఆడపిల్లల తలిదండ్రులకు కనువిప్పు కలిగించిన కథ ప్రతి అమ్మాయీచదవలసిన క కథ కథనమూ అద్భుతం

Like
Replying to

VBM Rao • 2 days ago

ధన్యవాదములండీ.

Like

Hindu Dharma Margam • 4 hours ago

అద్భుతమైన కథ..ఆడ పిల్లను స్వతంత్రంగా ఎదగ నీయాలి. దానికి వారి తల్లిదండ్రుల సపోర్ట్ ఎంతయినా అవసరం. బంగారు భవిష్యత్తు కోసం ఆడపిల్లల్ని చదివించాలి.‌ ఈ కథ ఉత్తమోత్త మైన కథ. వ్యాఖ్యాతగా మీ గాత్రం , కథ చదివిన తీరు అద్భుతం..

Like

ధన్యవాదములు. ‌ఫోటో బాగున్నది. మీరు కథను చదివే విధానం అత్యద్భుతం. 👍👏🙏 VBM Rao

Like
bottom of page