మనకు నేస్తాలు - గ్రంథములు
- T. V. L. Gayathri
- Sep 16
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #మనకునేస్తాలుగ్రంథములు

Manaku Nesthalu Grandhamulu - New Telugu Poems Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 16/09/2025
మనకు నేస్తాలు - గ్రంథములు - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
ఆనాడు బాల్యమున నక్షరంబులు వ్రాయ
బడికి వెళ్ళితి నేను పలకబలపము బట్టి.
వేమన శతకములో విలువైన రత్నాలు
కూడబెట్టుచు నేను గొప్పగా పొంగితిని.
భాగవతమును చదివి పలుకులో మాధురీ
భావామృతమును గ్రోలి' బాపురే!'యనుకొంటి.
మాతృభాషను బొగడి మనిషిగా నిలుచుండి
గ్రంథముల ప్రేమించు కాలమున పెరిగితిని.
పుస్తకంబులు మనకు భూరి పెన్నిధి వోలె
శాస్త్ర విజ్ఞానమను సంపదల నిడుచుండు.
చైతన్య దీప్తులను జగతి కందించు ఘన
గ్రంథరాజంబులే కలిమిగా విలసిల్లు.
జగతినే నడిపించి సంస్కృతీ విభవమును
నిలబెట్టు గ్రంథాలు నీతులను బోధించు.
తోడుగా చరియించి తోషంబు నందించి
చిరయశముతోనిల్పి చింతలను తొలగించు.
హస్తభూషణములయి నాత్మీయతను బంచి
పుస్తకంబులు దివ్య భోగాలు కొనిదెచ్చు.
పరమాత్ముడిని గాంచు పథమునే చూపించి
వరమొసగు గ్రంథములు వసుధలో దేవుళ్ళు.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments