top of page

మానవసేవ

#మానవసేవ, #ManavaSeva, #KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguMoralStories, #నీతికథలు

ree

Manava Seva - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao

Published In manatelugukathalu.com On 11/08/2025

మానవసేవ - తెలుగు కథ

రచన: కర్లపాలెం హనుమంతరావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

 

అదొక చిన్న తాటాకు గుడిసె. రాత్రి.. కుండపోతగా వర్షం కురుస్తున్నది. 


మూసివున్న గుడిసె తలుపును తట్టారు ఎవరో! గుడిసె యజమాని తలుపు తెరిచి చూస్తే.. బైట ఒక వృద్దుడు వానకు తడిసి వణుకుతూ కనిపించాడు. యజమాని వృద్ధుడిని లోపలికి రమ్మని పిలిచి మంచం మీద కూర్చోబెట్టాడు. 


ఇంతలో మరోసారి గుడిసె తలుపు తట్టినట్లు చప్పుడయింది. యజమాని వెళ్ళి చూస్తే బైట వర్షంలో.. చీకట్లో.. వళ్ళంతా తడిసి భయంతో గజగజలాడుతూ నిలబడివుంది ఒక యువతి. ఆమెను కూడా ఆప్యాయంగా లోపలకి రమ్మని పిలిచి పొడి బట్టలు ఇచ్చి చాటుకు వెళ్ళి మార్చుకోమన్నాడు. 


మరో రెండు నిమిషాల తరువాత మళ్ళీ గుడిసె తలుపు దబదబా కొడుతున్న చప్పుడయింది. ఎప్పట్లానే యజమాని వెళ్ళి తలుపు తీయగానే వంటి మీద సరిగా బట్టలైనా లేని ఒక పదేళ్ళ పిల్లవాడు గబగబా లోపలికి వచ్చెసాడు. 


ఇంటి యజమాని ఆకలి మీద ఉన్న ఆ ముగ్గురికి తినేందుకు ఫలహారం తయారుచేసే పనిలో పడ్డాడు. ఇంతలో మళ్ళీ గుడిసె తలుపు దగ్గర అలికిడయింది. వెళ్ళి చూస్తే బైట వానకు తడుస్తూ నిలబడి ఉన్నాడు ఒక ఆజానుబాహుడు. ఆ దివ్యసుందరుడి వేషభాషలు చూడగానే యజమానికి అర్థమయింది – అతగాడు తను నిత్యం పూజించే శ్రీరామచంద్రుడేనని. 


నిలువుగుడ్లేసుకు నిలబడ్డ ఆ యజమాని కేసి చూసి అడిగాడు రాముడు "నా దర్శనం కోసం అనుక్షణం అలమటిస్తావు కదా భక్తా! ఈసారి కోరకుండానే నీకు దర్శనం ఇద్దామని వచ్చాను. మరి వర్షంలో తడిసి ముద్దవుతున్న నన్ను లోపలికి రమ్మని ఆహ్వానించవా?" 


ఇంటి యజమాని ఒక క్షణం తటపటాయించి అన్నాడు "క్షమించు రామచంద్రా! తెల్లారినాక దర్శనభాగ్యం కలిగిస్తే మనసారా నిన్ను కొలుచుకుంటాను. ఇప్పటికైతే నీకు ఆశ్రయం ఇచ్చే స్థితిలో లేను!" అంటూ తలుపు మూసేసాడు. 


ఇంటి యజమాని ప్రవర్తనకు నివ్వెరపోయారు ఆశ్రితులు ముగ్గురూ! "అదేంటి సామీ! సాక్షాత్తూ నీవు ప్రార్థించే రామచంద్రమూర్తే వచ్చి ఆశ్రయం కోరితే అట్లా తిరస్కరించేవు?" అని అడిగాడు వృద్ధుడు. 


ఇంటి యజమాని బదులు ఇవ్వకుండా నిశ్శబ్దంగా వంట చేసే పనిలో మునిగిపోయాడు. 


ఇంతలో మళ్ళీ గుడిసె తలుపు దగ్గర టకటక చప్పుడయింది. యజమాని వెళ్ళి తలుపు తీసి చూస్తే చంక కింద కర్రతో ఒంటి కాలిమీద నిలబడి వానలో తడిసే వికలాంగుడు ఒకడు కనిపించాడు. అతనికి చేయి సాయం అందించి సాదరంగా లోపలికి తీసుకు వచ్చి కూర్చోబెట్టి ఇందాక వృద్ధుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు. 


"తాతా! నీకు వయసు మీరింది. ఇంతవానలో ఎక్కడికీ వెళ్ళలేకే కదా నా ఇల్లు వెదుక్కుంటూ వచ్చి తలుపు తట్టావు? అట్లాగే ఈ అమ్మాయి కూడా వానకు తడుస్తూ చీకట్లో భయపడుతూ నా ఇంటి ముందు కొచ్చి నిలబడి ఆశ్రయం కోరింది. వయసులో ఉన్న ఆడపిల్ల. ఈమె వళ్ళంతా తడిసి చీకట్లో వంటరిగా ఉన్నట్లు ఏ తుంటరి కుంక కంటబడితే ఏమవుతుందో తెలుసు. అందుకే అడగగానే ఈ పిల్లకూ ఆశ్రయం ఇచ్చింది.

 

అభం శుభం తెలీని ఈ పసివాడు జడివానలో తడుస్తూ నా ఇంట్లోకి వచ్చేసాడు. తెల్లారిన తరువాత వీడి పెద్దవాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళకు అప్పగించడం నా కనీస బాధ్యత కదా! అందుకే లోపలే ఉండనిచ్చాను. నా రాముడు మీ అందరిలాగా నిస్సహాయుడు కాదుగదా? పథ్నాలుగేళ్ళు వనవాసంలో ఎండకూ వానకూ బడి తిరిగినవాడు. నేను ఆరాధించే దేవుడు దర్శనమిచ్చాడు కదా అని సంబరపడిపోయి లోపలికి రానిస్తే ఏమయేది? 


జానెడంతైనా జాగా లేని ఈ గుడిసెలో ఈ వికలాంగుడికి ఆశ్రయం కల్పించేందుకు ఆస్కారం ఉండేది కాదు. మానవసేవే మాధవుడి సేవ అన్నది కూడా భగవంతుడే కాబట్టి ఆయన ఈ భక్తుడి చర్యను తప్పుపట్టడులే " అన్నాడు గుడిసె యజమాని. 


 ***

కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

కర్లపాలెం హనుమంతరావు -పరిచయం


రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.

 


Comments


bottom of page