top of page

మరణ శిక్ష



'Marana Siksha' - New Telugu Story Written By Padmavathi Divakarla

Published In manatelugukathalu.com On 04/04/2024

'మరణ శిక్ష' తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పట్టణం దాటి పది కిలోమిటర్లు దూరం వచ్చిన తర్వాత, ఆటో ఆపమని చెప్పి కిందకి దిగాడు అంకిత్. జేబులో చెయ్యపెట్టి పర్సులో మిగిలిన ఆఖరి పచ్చ నోటు వంక ఆప్యాయంగా చూసి తనివితీరా తడిమి, ఆటో డ్రైవర్ చేతిలో పెట్టాడు. అతనివంక విచిత్రంగా చూసాడా ఆటో డ్రైవర్, "ఎక్కడికెళ్తారు సార్ ఇక్కణ్ణుంచి?" అని అడిగాడు. 


ఎందుకంటే అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. చుట్టుపక్కలెక్కడా ఇల్లూ, వాకిళ్ళూ కూడా లేవు. కొద్ది దూరంలో చాలా స్టీప్ గా ఉన్న కొండప్రదేశం పక్కనే లోతైన లోయ మాత్రమే ఉంది. 


"ఏమో నాకే తెలియదు!" విరక్తిగా ఓ నవ్వు నవ్వి అక్కణ్ణుంచి ముందుకి కదిలాడు అంకిత్. అతనివైపు అయోమయంగా ఓ క్షణం చూసి, తనకెందుకని అనుకున్నాడో ఏమో ఆటో వెనక్కి తిప్పి అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. 


అక్కణ్ణుంచి అటవీ ప్రాంతం మొదలవుతుంది. ఓ పక్కన ఎత్తైన పర్వత ప్రదేశం ఉంది. ఆ కొండ మీదో చిన్న పాతకాలంనాటి శివుడి గుడి ఉంది. శివరాత్రి, కార్తీక సోమవారాలులాంటి పర్వదినాల్లో తప్పించి అక్కడికెవరూ వెళ్ళరు. ఆ గుడి పూజారి మాత్రం ప్రతీ రోజూ ఉదయం వెళ్ళి శివునికి ధూపదీప నైవేద్యాలు మాత్రం సమర్పించి వస్తూంటాడు. పిక్నిక్ సీజన్లో మాత్రం జనం వనభోజనాలకోసం అక్కడికి వెళ్తూఉంటారు అంతే! మిగతా రోజుల్లో పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుందా ప్రదేశం. 


ఆటో అతను కనుమరుగయ్యేదాకా చూసి, అక్కణ్ణుంచి ముందుకి కదిలాడు. ఎప్పుడో ఉదయం తిన్న టిఫిన్ అరిగిపోయి, ఆకలి వేస్తోంది. దాహం కూడా వేస్తోంది. చేతిలో ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి కడుపునిండా నీళ్ళు తాగిన తర్వాత మనసు కొద్దిగా శాంతించింది. ఖాళీ అయిన వాటర్ బాటిల్ ని దూరంగా విసిరేసాడు. అయినా, ఇంకొద్ది గంటల్లో దేహం చాలించబోతున్న తనకి ఆకలేమిటి, దప్పికేమిటి? 


విరక్తిగా నవ్వుకొన్నాడు. శివాలయానికి దారితీసే మట్టి రోడ్డులో నడుచుకుంటూ ముందుకు సాగిపోయాడు. మనసులో ఆలోచనలు చెలరేగుతున్నాయి. సాధ్యమైనంత వరకూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఎంత ప్రయత్నించినా ఆలోచనలు మాత్రం అతన్ని వదలటం లేదు. 


చిన్నప్పుడే తండ్రి పోవడంతో, తల్లి వర్ధనమ్మ కాయకష్టంతో పెరిగాడు అంకిత్. చాలా కష్టపడి కొడుకుని పెంచిందామె. చదువు పూర్తై, మంచి కంపెనీలో ఉద్యోగం రావడంతో చాలా సంతోషించాడు. తనని అంత కష్టపడి పెంచి, చదివించినందుకు ఆమెని పువ్వుల్లో పెట్టుకొని చూడాలనుకున్నాడు. కానీ అతని ఆశ నెరవేరలేదు. 


ఉద్యోగం వచ్చిన రెండునెలల్లోనే ఆమె కనుమూసింది. తన అనారోగ్యాన్ని కూడా ఖాతరు చెయ్యకుండా కష్టపడిన ఆమె ఆరోగ్యాన్ని రకరకాల జబ్బులు బాగా దెబ్బ తీసాయి. సరైన చికిత్స అందకముందే, కొడుకుని వంటరివాణ్ణి చేసి ఆమె వెళ్ళిపోయింది. తండ్రిప్రేమ ఎరుగని అంకిత్ తల్లి అండనే బతికాడిన్నాళ్ళూ. ఆమె కూడా పోవడంతో దిక్కులేనివాడయ్యాడు. తనకి భగవంతుడు ఎందుకు ఇంత ఘోరమైన శిక్ష విధించాడో బోధపడలేదు అంకిత్కి. 


తల్లి ఋణం తీర్చుకొనే అవకాశమే లభించలేదు అంకిత్ కి. చాలా రోజులవరకూ మామూలు మనిషి కాలేకపోయాడు. సరిగ్గా అప్పుడే అంకిత్ జీవితంలో ప్రవేశించింది అలేఖ్య. ఎడారిలాంటి తన జీవితంలో ఒయాసిస్లా సేద తీర్చిందామె సాంగత్యం. ఆమెతో పరిచయం అయిన కొద్దిరోజుల్లోనే జీవితంలో తనకి తగిలిన దెబ్బలని మర్చిపోగలిగాడు అంకిత్. అమెతో మాట్లాడితే మధువనంలో విహరించినట్లు ఉండేది. అమెని మనసారా ప్రేమించాడు అంకిత్. అలేఖ్య కూడా అతనితోటే తన జీవితమనేది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని షికార్లు, సినిమాలు తిరిగారు. ఇక తన జీవితం ఆనందమయం కాబోతోందని అనుకున్నాడు అంకిత్. 


అప్పుడే తెలిసింది అలేఖ్య తన కంపెనీ యజమాని దామోదరరావు ఒక్కగానొక్క కూతురని, తండ్రి తదనంతరం ఆమె ఆ కంపెనీ వారసురాలని. ఆ విషయం తెలియగానే అతని భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. ఇన్నాళ్ళూ నింగినంటిన ఆశలు ఒక్కసారి నేలకూలాయి. 


సినిమాలో ప్రేమలాగ వాళ్ళిద్దరి ప్రేమ సుఖాంతం కాలేదు. వాళ్ళిద్దరి ప్రేమ దామోదరరావు కంట్లో పడింది. అతని హోదాకి తను ఏ మాత్రం తగనని అంకిత్ కి బాగా తెలుసు. అయినా తన ప్రేమ మీద, అలేఖ్య ప్రేమ మీద అంతులేని నమ్మకం ఉన్న అంకిత్ వెనక్కి తగ్గలేదు. తన కూతురు అలేఖ్య అతనితో కలుసుకోకుండా కట్టడి చేసాడు దామోదరరావు. 


అంతటితో ఊరుకోలేదు అతను. ఫలితంగా అంకిత్ ఉద్యోగం కోల్పోయాడు. ఇంకా దామోదారరావు కసి తీరలేదు. తన కూతురిపై కన్ను వేసిన అంకిత్ కి తగిన బుద్ధి చెప్పడానికి కొంతమంది కిరాయి రౌడీలను నియమించాడు. ఆస్పత్రి పాలైన అంకిత్ కోలుకొనేసరికి అలేఖ్యకి పెళ్ళి కూడా కుదిరిపోయింది. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. 

అలాంటి పరిస్థితిలో ఆమెని కలుసుకోవడం దాదాపు అసాధ్యమైన పనైనా సాహసం చేసాడు అంకిత్. 


తన ప్రాణాలకు తెగించి సాహసం చేసి ఆమెని కలిసాడు అంకిత్. అలేఖ్య ఒప్పుకుంటే దామోదరరావుని ఎదురించైనా ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. కానీ అప్పుడు ఆమె మాటలు విన్న అంకిత్ పూర్తిగా హతాశుడైయ్యాడు. 


"నువ్వంటే నాకు ప్రేముంది, కాదనను. కానీ, ఇప్పుడు ఏ ఉద్యోగమూ లేని నువ్వు నన్నెలా పోషిస్తావు? నీ మాట విని నిన్ను పెళ్ళాడితే నాన్న తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా మనకి ఇవ్వరు. ప్రాణంకన్నా పరువుని మిన్నగా భావిస్తారు. పైగా నాన్న ఇప్పుడు తెచ్చిన సంబంధం నీకన్నా ఎన్నో రెట్లు గొప్పది. పెళ్ళికొడుకు రేయాన్ష్ కి యుఎస్లో పలు వ్యాపార సంస్థలున్నాయి. అశ్వైరవంతుడేకాక, అందగాడు కూడా! పెళ్ళవగానే అమెరికాలోనే కాపురం! ఇంతవరకూ ఇంట్లో గారాబంగా పెరిగిన నేను, నీవెంట వెళ్ళి కష్టాల జోలికి పోలేను. నీ కోసం అంతమంచి సంబంధం వదులుకోలేను. నా మాట విని నన్ను మరిచిపో! అది మనిద్దరికీ శ్రేయస్కరం. " అని మరో మాటకు తావులేకుండా అతని మొహం మీదే తలుపేసుకుంది. 


అలేఖ్య మాటలు అశనిపాతంలా తోచాయి అంకిత్ కి. ప్రేమించి తన వెంట తిప్పుకొని చివరికి తనని మోసం చేసిందని ఆలస్యంగా గ్రహించాడు. అటు ఉద్యోగం పోయింది, ప్రేమ కూడా దక్కలేదు. మరో ఉద్యోగం కూడా అతనికి దొరకుండా తన పరపతిని ఉపయోగించాడు దామోదరరావు. ఫలితంగా అంకిత్ బతుకు నానాటికీ దుర్భరం అయింది. ఇల్లు కూడా దామోదరరావు నియమించిన గుండాల కబ్జాకి గురై, నిలువనీడ లేకుండా పోయింది. చేతిలో ఉన్న డబ్బు కాస్తా అయిపోయింది. ఎక్కడా అప్పు పుట్టే ప్రసక్తే లేదు. ఇంక, ఈ ఊరు వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళాలని సిద్ధమైయ్యాడు. 


అప్పుడు జరిగింది మరో సంఘటన. అతనిపై కసి తీరని దామోదరరావు అన్యాయంగా చోరీ కేసులో ఇరికించాడు. ఫలితంగా పోలీసుల లాఠీ దెబ్బలు రుచి చూడవలసి వచ్చింది. ఎక్కడలేని కేసులు అతనిమీద బనాయించ బడ్డాయి. ఇవన్నీ అలేఖ్యని ప్రేమించడంవలన వచ్చిన దుష్పరిణామాలని తెలిసినా ఆమెమీద ఆగ్రహం కలగలేదు అంకిత్కి. అంతగా ఆమెని ప్రేమించాడు మరి! అతి కష్టం మీద బైయిల్ పై విడుదలైన అంకిత్ కి జీవితం మీద ఆశ నశించింది. ఇంక కష్టాలు భరించే ఓపిక లేదు. ఆత్మహత్యే శరణ్యమని ఓ నిర్ణయానికి వచ్చాడు. 


ఆలోచించుకుంటూ ఆ కొండపైకి చేరుకున్నాడు అంకిత్. అప్పటికి అక్కడ అంతటా చీకట్లు ముసురుకుంటున్నాయి. గుడి ఆవరణలో ఉన్న మర్రిచెట్టు గాలికి తలూపుతోంది. కొండమీదనున్న శివాలయం వరండాలో నిలబడ్డాడు. బయటనుండి దేవుణ్ణి క్షమించమని, వచ్చే జన్మంటూ ఉంటే ఇలాంటి జన్మ మాత్రం ప్రసాదించొద్దని మనసులోనే వేడుకున్నాడు. అలసటవల్ల కొద్దిసేపు అరుగుమీద కూర్చోవాలనుకున్నాడు. ఇంకొద్దిసేపట్లో చనిపోబోయే మనిషికి అలసటేమిటి అనుకొని నవ్వొచ్చింది అతనికి. అయినా కొద్దిసేపు అక్కడ కూర్చున్నాడు. ఇక తన నిర్ణయం అమలుపర్చడానికి కొండ అంచువరకూ వెళ్ళాడు. 


వంద అడుగులకు పైగా ఉన్న ఆ లోయ భయంకరంగా కనిపించింది. ఒక్కసారి అంకిత్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తల్లి గుర్తుకు వచ్చింది. తన జీవితం ఇలా అంతమవుతుందని అమెప్పుడూ భావించి ఉండదు. తను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన అలేఖ్య కూడా ఆ చివరి క్షణంలో గుర్తుకు వచ్చింది. 


తనకి ఈ స్థితి కల్పించిన భగవంతుణ్ణి చివరిసారిగా స్మరించి లోయలోకి దూకడానికి ఉద్యుక్తుడయ్యాడు అంకిత్. 

"హల్లో.. గురూ ఆత్మహత్యా ప్రయత్నమా! ప్రేమ ఫెయిలైయ్యిందా లేక అప్పులుపాలయ్యావా?" ఎవరిదో గొంతు వెనకనుండి వినిపించడంతో ఉలిక్కిపడి తన ప్రయత్నం ఆపి, మాట్లాడిందెవరా అని వెనుతిరిగి చూసాడు అంకిత్. 


చీకట్లో ఎవరో మనిషి తను ఇంతకుముందు కూర్చున్న అరుగు మీద కూర్చొని ఉండటం కనిపించింది. ఎత్తుగా బలిష్టంగా ఉన్నాడా వ్యక్తి. కోరమీసాలు, మాసిన గడ్డంతో భయంకరంగా ఉన్నాడు. కండలు తిరిగిన శరీరం. చీక్కట్లో నల్లగా మెరుస్తున్నాడు. ఓ చేతిలో సిగరెట్, మరో చేతిలో మందుసీసాతో భయం గొల్పుతూ ఉన్నాడు. అతన్ని చూడగానే తనపై ఇంతకుముందు దాడిచేసిన కిరాయి గుండాలు గుర్తుకు వచ్చారు అంకిత్కి. 


నవ్వు వచ్చింది. ఇంకొద్ది క్షణాల్లో యమపురికి చేరబోతున్న తనని చంపడానికి ఇతన్ని నియమించాడా దామోదరరావు? ఆ క్షణంలో ఏ మాత్రం భయం కలగలేదు అతనికి. 

అంకిత్ ఏమీ మాట్లాడకపోగా అతని పెదవులపైన విరిసిన నవ్వుని చూసి విస్మయం చెందాడు ఆ మనిషి. 


"ఏం, ఆగిపోయావు, ఆత్మహత్య చేసుకోకుండా?" అన్నాడు నవ్వుతూ అంకిత్ వైపు తిరిగి. నవ్వితే మరింత భయంకరంగా కనిపించాడా వ్యక్తి. 


"హేయ్! ఎవరు నువ్వు? దామోదరరావు నియమించిన గుండావా?" అడిగాడు అంకిత్. 

"దామోదరరావా? అతనెవరు?" ఆశ్చర్యంగా అడిగాడు ఆ వ్యక్తి. 


"మరి నువ్వెవరు? ఎవరు పంపించారు నిన్ను? ఎందుకిక్కడికి వచ్చావు?" అడిగాడు అంకిత్. 


ఎక్కడో చూసినట్లుంది కానీ, అతనెవరో చప్పున గుర్తుకు రాలేదు. 


"బిల్లా.. ఆ పేరెప్పుడైనా విన్నావా?" అన్న ఆ మనిషి మాటలకి ఉలిక్కిపడ్డాడు అంకిత్. 


అప్పుడు గుర్తొచ్చింది అతన్ని ఎక్కడ చూసాడో అన్న సంగతి. టివిలో చూసాడు. 


'బిల్లా!' అన్న పేరు వినగానే ఎవరికైనా గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం ఖాయం. అంత భయంకరమైన వ్యక్తి బిల్లా! కరుడు కట్టిన నేరస్థుడు! నేర సామ్రాజ్యంలో మకుటంలేని మహారాజు బిల్లా! ఎంత మందిని కడతెర్చాడో లెక్కలేదు. ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీసాడో అతనికే తెలియదు. కబ్జాలకి కేర్ ఆఫ్ అడ్రెస్ అతను. చాలా మంది మహిళలను వేధించాడు కూడా! చాలాసార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి పారిపోయేవాడు. బిల్లా ఎవరికైనా ఎదురుపడ్డాడంటే, వాడికి మూడినట్లే! 


అలాంటి బిల్లా కొన్నాళ్ళ కిందట పోలీసులకు చిక్కి జైల్లో ఉన్నాడని విన్నాడు అంకిత్. అతను చేసిన నేరాలకుగాను కోర్టు మరణ శిక్ష విధించిందని, త్వరలో ఆ శిక్ష అమలు జరుగుతుందని కూడా వార్తల్లో చూసాడు. జైలు నుండి ఎలా బయటపడ్డాడు బిల్లా? ఎక్కడికెందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు? అంకిత్ మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. అలాంటి బిల్లా పేరెవరికి తెలియదు? అప్రయత్నంగా తెలుసునని తలూపాడు అంకిత్. 


బిగ్గరగా నవ్వాడా వ్యక్తి. "నిజమే! నేను తెలియనిదెవరికి? అది సరే! నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోబోతున్నావు చెప్పు, వింటాను. " అన్నాడు బిల్లా. బిల్లా ఎదుట నిలబడటానికి భయపడలేదు అంకిత్. చావబోతున్న వాడికి భయమెందుకు? అతని ఎదురుగా నిర్భయంగా కూర్చొని తన కథంతా చెప్పుకొచ్చాడు అంకిత్. అంతా విని నిట్టూర్పు విడిచాడు బిల్లా. ఆ తర్వాత చేతిలోని సీసా ఎత్తి గటగటా తాగాడు అందులోని ద్రవాన్ని. 


తర్వాత అంకిత్ వైపు ఛీత్కారంగా చూసి, "కేవలం ఆడదాని ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకుంటావా? నీకు జరిగిన అవమానానికి ఆ అమ్మాయికి తగిన బుద్ధి చెప్పవలసింది. నేనైతేనా.. " అంటూ ఏదో చెప్పబోయే బిల్లా మాటలకి అడ్డువచ్చాడు అంకిత్. 


"కేవలం ప్రేమ మాత్రమే కారణం కాదు. నేను ఈ భూమి మీద బతకడానికి అన్ని దార్లూ మూసివేసాడు ఆ దామోదరరావు. జీవితంలో చిత్తుగా ఓడిపోయాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. " అని చెప్పి అక్కణ్ణుంచి లేచాడు అంకిత్. 


"ఆగు! నీ కథ చెప్పావు, మరి నా కథ వినవా?" అన్నాడు బిల్లా. 


"నీకథ తెలియనిదెవరికి? ఏ పేపరు చూసినా నీ కథే, ఏ టివి ఛానెల్ చూసినా నీ గురించిన వార్తలే! ఇప్పుడు నువ్వు జైలు నుండి తప్పించుకున్నావని తెలిసే ఉంటుంది, నీ గురించిన చర్చా వేదిక ప్రతీ ఛానెల్లో వస్తూ ఉంటుంది ఈపాటికి!" చెప్పాడు అంకిత్. 


బిల్లా చరిత్ర పూర్తిగా తెలిసిన అంకిత్ కి అతనంటే భయం కన్నా అసహ్యం ఎక్కువ కలిగింది. 


బిగ్గరగా నవ్వాడు బిల్లా. "మొత్తానికి నిజం చెప్పావు! నేనెంత మందినో చంపాను. ఎన్నో అత్యాచారాలు చేసాను. దొంగతనాలు, దోపిడీలకు లెక్కేలేదు. ఇప్పుడు కూడా జైలు నుండి పారిపోయి వస్తూ జైలర్ని, నలుగురు పోలీసుల్ని చంపాను. మరణశిక్ష పడిన నాకు కూడా బతుకు మీద తీపి ఉంది. నేను చావడానికి సిద్ధంగా లేను. కావాలంటే అందుకోసం ఇంకెంతమంది ప్రాణాలు తీయడానికైనా వెనుకాడను. 


అలాంటిది, ఏ తప్పు చెయ్యని నువ్వు కావాలని మృత్యవాత ఎందుకు పడాలని అనుకుంటున్నావో నాకు మాత్రం బోధపడటం లేదు. అసలు ఎలాంటి తప్పూ చేయని నీకు మరణశిక్ష ఎందుకు? అది నీకై నువ్వు విధించుకున్న శిక్ష కాక మరేమిటి? మరణశిక్ష పడిన నేనే నా జీవితం గురించి భయపడటంలేదు. నువ్వెందుకు జీవించడానికి భయపడుతున్నావు?" అని అంకిత్ని సూటిగా ప్రశ్నించాడు. 


బిల్లావైపు అసహ్యంగా చూసాడు అంకిత్. బిల్లాలాంటి నరరూప రాక్షసులకు ఈ సమాజంలో స్థానం లేదు. అలాంటివాళ్ళు బతకకూడదు. మరణ శిక్ష నుండి తప్పించుకున్న బిల్లా మున్ముందు ఇంకెంత మంది ప్రాణాలు తీస్తాడో?


"ఇప్పుడసలు ఇక్కడికెందుకొచ్చానో తెలుసా? ఈ శివాలయంలో గర్భగుడి కింద నిధి ఉందన్న రహస్యం ఈ మధ్యే నాకు తెలిసింది. ఈ నిధి గురించి ప్రయత్నించే లోపలే పోలీసులకు పట్టుబడ్డాను. ఇప్పుడు ఈ నిధిని చేజిక్కించుకొని మారుపేరుతో ఈ సమాజంలో పెద్దమనిషిలా బతుకుతాను. " అన్నాడు. 


ఈసారి అంకిత్కి అసహ్యంతోపాటు బిల్లాపై కోపం కూడా కలిగింది. కొండ అంచుదాకా వెళ్ళిన అంకిత్ గిరుక్కున వెనుదిరిగాడు. తనెలాగూ కొద్ది క్షణాల్లో మరణించ బోతున్నాడు. మరణించేముందు ఓ మంచిపని చెయ్యాలన్న సంకల్పం అతని మదిలో ఒక్కసారి జనించింది. ఆ తలంపు కలగ్గానే ఊహించనంత వేగంగా కదిలి తన బలమంతా ఉపయోగించి బిల్లా చెయ్యపట్టిలాగి అతనితోపాటు లోయలోకి జారిపోయాడు అంకిత్. 


ఊహించని ఈ హఠాత్ పరిణామానికి అదుపు తప్పిన బిల్లా కూడా బిగ్గరగా కేకలు వేస్తూ అంకిత్ తో పాటు వంద అడుగుల అగాధంలోకి జారిపోయాడు. బిల్లాకి పడిన మరణ శిక్ష ఆ విధంగా అమలు చేసాడు అంకిత్. చనిపోబోయే ముందు ఓ మంచి పని చేసానన్న తృప్తితో తనువు చాలించాడు అంకిత్. 

***

పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.




165 views0 comments
bottom of page