top of page

వర్షం కురవని రాత్రి పార్ట్ 1

విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ

'Varsham Kuravani Rathri Part 1' - New Telugu Story Written By D V D Prasad

'వర్షం కురవని రాత్రి పార్ట్ 1' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

హఠాత్తుగా అలికిడైయ్యేసరికి కళ్ళు బలవంతాన తెరిచాడు తిరుమలరావు. ఒక్క క్షణం తనెక్కడ ఉన్నాడో అర్థం కాలేదు. పరిసరాలన్నీ కొత్తగా ఉన్నాయి. గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగాడు. హఠాత్తుగా పోలీసులు చుట్టుముట్టేసరికి ఒక్కసారిగా గందరగోళానికి గురైన తిరుమలరావు వాళ్ళవైపు అయోమయంగా చూసాడు.


"మిస్టర్.. యూ ఆర్ అండర్ అరెస్ట్!.." అన్నాడు ఎస్ఐ రాజారావు, చేతిలోని బేడీలను తిరుమలరావు వైపు చూపిస్తూ.


ఏం అర్థంకాక అతనివైపు బిత్తరచూపులు చూస్తూ, "ఎందుకు?.. నేనేం నేరం చేసాను?" అడిగాడు తిరుమలరావు కంగారుగా నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకుంటూ.


"హత్యచేసి, రెడ్హ్యాండెడ్గా పట్టుబడి ఇంకా ఏం నేరం చేసానని మమ్మల్ని.. అదీ పోలీసుల్ని ప్రశ్నిస్తున్నావా?" విరుచుకు పడ్డాడు ఎస్ఐ రాజారావు తిరుమలరావువైపు కోపంగా చూస్తూ.


అప్పుడు చూసాడు తిరుమలరావు తన ఎదురుగా ఉన్న మంచాన్ని, ఆ మంచంపైన విగతజీవిగా పడిఉన్న ఆమెని. అప్పటికే క్లూస్ టీం తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. రాజారావు నిశితంగా పరిశీలిస్తున్నాడు. ఆమె గొంతు నులిమి హత్య చేయబడిందని ముఖకవళికలవల్ల తెలుస్తోంది. మంచంపైన బెడ్షీట్ చిందరవందరగా ఉండటంతో చనిపోయేముందు ఆమె తీవ్రంగా పెనుగులాడిందని బోధపడింది.


చుట్టుపక్కల అంతా పరిశీలించాడు రాజారావు. ఆ రూములో ఉన్న బీరువా తలుపులు తెరిచి ఉంది, వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి. ఆ బీరువా పక్కన పడి ఉన్న ఓ పర్సు రాజారావు దృష్టినాకర్షించింది. కర్చీఫ్తో జాగ్రత్తగా దాన్ని తీసి చూసాడు. ఆ పర్సుని చూడగానే తన జేబులు తడుముకున్నాడు తిరుమలరావు. తన జేబులో ఉండవలసిన పర్సు లేదు. రాజారావు చేతిలో ఉన్నది తన పర్సేనని గుర్తించాడు.


"అరే!.. అది నా పర్సు. అక్కడికెలావెళ్ళింది?" అయోమయంగా గొణుకున్నాడతను.


"ఆమెని హత్య చేస్తున్నప్పుడు పెనుగులాటలో పడిపోయి ఉంటుంది." అంటూ కఠినంగా అతనివైపు చూసాడు రాజారావు.


ఇదెలా జరిగిందో ఏమాత్రం అర్థం కాలేదు తిరుమలరావుకి. అతని ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. అక్కడ జరుగుతున్న తతంగం చూస్తూంటే అతనికి మతిపోతోంది.


"నేను హత్యచెయ్యలేదు! నాకేం తెలియదు!" కంగారుగా రాజారావు వైపు తిరిగి, "సార్! అసలేం జరిగిందంటే.. నిన్నరాత్రి నేను ఫ్యాక్టరీ నుండి పని ముగించుకొని రాత్రి ఎనిమిదిగంటలకి బైక్పై తిరిగి వస్తూంటే వర్షంలో చిక్కుకుపోయాను. అంతపెద్ద వర్షంలో వెళ్ళలేక ఈ ఇంటి తలుపుతట్టాను.


అప్పటికే పూర్తిగా తడిసిపోయాను. ఈ ఇంటాయన నాకు టవల్, పొడిబట్టలు ఇస్తే కట్టుకున్నాను. ఆ తర్వాత, కాఫీ ఇస్తే తాగాను, అంతే, ఆ తర్వాత ఏం జరిగిందో నాకేం తెలియదు." అన్నాడు తిరుమలరావు.


ఆ మాటలు విన్న ఎస్ఐ రాజారావు పెద్దగా నవ్వాడు."ఫూల్ చెయ్యడానికి నీకు నేనే దొరికానా? కథలు బాగా చెప్తున్నావు, టివి సీరియల్స్కీ, సినిమాలకి రచయితగా బాగా పైకివస్తావు! అసలు నిన్న రాత్రి వర్షం పడందే!" చెప్పాడు.


"వర్షం పడకపోవటమేమిటి? నిజం చెప్తున్నాను ఇన్స్పెక్టర్గారూ, చిన్నాచితకా వానకాదు! చాలా పెద్దవాన. వాన చాలా ఎక్కువగా ఉండటంతో గత్యంతరంలేక ఈ ఇంట్లో తలదాచుకున్నాను. ఇదిగో, అతనే నన్ను లోపలికి పిలిచింది." అన్నాడు తిరుమలరావు అప్పుడే హడావుడిగా ఇంట్లోకి ప్రవేశిస్తున్న ఒకతనివైపు చూపిస్తూ.


ఆ వచ్చినతను, "మీరందరూ ఎవరు? మా ఇంట్లో ఏమిటి చేస్తున్నారు? పోలీసులు ఎందుకు వచ్చారు?" కంగారుగా అడిగాడతను.


"ఇంతకీ మీరెవరు?" అడిగాడు రాజారావు అతనివైపు అనుమానంగా చూస్తూ.

"నేనా.. , నేను ఈ ఇంటి యజమానిని. నా పేరు చలపతి. సిటీలో అన్నపూర్ణా మార్కెట్లో ఉన్న 'శుభం' డైలీ మార్ట్, శుభం శారీ సెంటర్ ఓనర్ని. నిన్న బిజినెస్ పనిమీద సూరట్ వెళ్ళి ఇప్పుడే వచ్చాను. ఇంట్లో నా భార్య సునీత ఒక్కర్తే ఉంది. ఇంతకీ మా ఇంట్లో మీరందరూ ఎందుకున్నారు? ఇంట్లో ఏమైనా దొంగతనం జరిగిందా? మా ఆవిడ ఏదీ? సునీతా!.. సునీతా!.." అని ఇంట్లోపలికి రాబోయాడు.


"చలపతిగారూ.. ! మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. నిన్న రాత్రి మీ ఆవిడ హత్య చేయబడింది. ఎవరో అజ్ఞాతవ్యక్తినుండి ఇక్కడ ఓ హత్యజరిగిందని ఫోన్ వస్తే వచ్చాను. ఇదిగో, ఇతను ఇక్కడ రెడ్హ్యాండెడ్గా దొరికాడు." తిరుమలరావుని చూపిస్తూ చెప్పాడు రాజారావు.


"ఏమిటి, నా సునీతని ఇతను హత్య చేసాడా!" చలపతి ముఖం కోపంతో ఎర్రబడింది. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. దూకుడుగా ముందుకి వచ్చి తిరుమలరావు కాలర్ పట్టుకున్నాడు."ఏయ్ మిష్టర్, ఎవరు నువ్వు? అభంశుభం తెలియని నా భార్యనెందుకు హత్య చేసావు? ఆమె నీకేం అపకారం చేసింది?" అతన్ని ఊపేస్తూ అడిగాడు కోపంగా.


"నాకేం తెలియదు, నాకేం తెలియదు! నిన్న మీరు ఇంట్లోకి పిలిస్తే వచ్చాను అంతే.." భయంతో వణుకుతూ అంటున్న తిరుమలరావుని చలపతి చేతుల్లోంచి విడిపించాడు రాజారావు.

తిరుమలరావు మాటలు వింటూనే చివ్వున తలెత్తి, "అంతా అబద్ధం సార్! ఇతనెవరో నాకు తెలియదు. అసలు నేను ఇప్పుడే ట్రైన్ దిగి వేస్తేను, నిన్న నేను పిలిచేనంటాడేమిటి? నేను ఇంట్లో లేని సమయం చూసి మా ఇంట్లో జొరబడి, దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు కాబోలు, నా భార్య ప్రతిఘటించేసరికి, హత్యచేసాడు." కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ అని, భార్య పడి ఉన్న చోటకి వెళ్ళి రోదించ సాగాడు చలపతి.


అతన్ని వారించి, "హత్య జరిగింది కాబట్టి, మీరు ఏమీ ముట్టుకోకండి. హంతకుడెలాగూ దొరికాడు, వేలిముద్రలు సరి చూసుకోవాలి." అన్నాడు రాజారావు..


"నేనీ హత్యచేయలేదు. నాకు ఈ హత్యతో ఏ మాత్రం సంబంధం లేదు." గాబరాగా అన్నాడు తిరుమలరావు.


"చూడు, మిష్టర్!.. డెడ్బాడీ పక్కనే రెడ్ హ్యాండెడ్గా దొరికావు. అదిగో చూడు, బీరువా లాకర్ తాళం తీసి ఉండటమేకాక వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి. నువ్వు ఈ పని చెయ్యలేదంటే ఎవరు నమ్ముతారు? క్లూస్ టీం తమ పని మొదలెట్టారు. నువ్వు ఎన్ని కథలు చెప్పినా హతురాలి మెడమీద, బీరువా మీద వేలిముద్రలే నిన్ను పట్టిస్తాయి, అందాకా ఓపికపట్టు." అన్నాడు ఎస్ఐ రాజారావు.


అప్పుడే బాడీని పోస్ట్మార్టంకి తీసుకెళ్తూ ఉంటే చనిపోయిన ఆమె ముఖం చూసిన తిరుమలరావు కెవ్వున అరిచాడు.

"ఏమైంది! నువ్వెంత అరిచి గీపెట్టినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు." అన్నాడు రాజారావు.


"సార్! నిజం చెప్తున్నాను, నేను ఈవిడని ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. నేను ఇక్కడకు వచ్చినప్పుడు ఇంకో ఆమె ఉండేది, ఈమెవరో నాకు తెలీదు."


"మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకో కథా! నిన్న రాత్రి తాగిన మందు ఇంకా దిగినట్లు లేదు! స్టేషన్కెళ్తే అన్నీ తెలుస్తాయి." అని కానిస్టేబుల్ కనకారావువైపు తిరిగి, "ఇతన్ని పోలీస్ జీపు ఎక్కించు! అక్కడ సకల మర్యాదలు చేస్తే అసలు విషయమంతా బయటకు వస్తుంది." అన్నాడు.


రాజారావు చలపతివైపు తిరిగి, "మీరు కూడా ఓ సారి స్టేషన్కి రావలసి ఉంటుంది." అన్నాడు.


"అలాగే!.." కళ్ళు తుడుచుకుంటూ తలూపాడు చలపతి.


కానిస్టేబుల్తో ఆ ఇంట్లోంచి బయటకు రాగానే ఆ పరిసరాలన్నీ వింతగా చూసాడు తిరుమలరావు. ఏదో మాట్లడబోయేసరికి, "నువ్వింకేం చెప్పకు. ఏం చెప్పాలన్నా కోర్టులో చెప్పుకో!" అని కసిరి జీపెక్కాడు రాజారావు.


జీపెక్కిన తిరుమలరావు, "సార్! నేను నిజం చెప్తున్నాను సార్! ఇప్పుడు వీధిలోకి వస్తే తెలుస్తోంది. నేను నిన్న రాత్రి వర్షంలో చిక్కుకున్న ఇల్లు ఇదికాదు.." అంటూ ఇంకా ఏదో చెప్పబోతూంటే, "ఆపు, నీ సోది, నోరు విప్పినప్పుడల్లా ఓ కొత్త స్టోరీ వినిపిస్తున్నావు. స్టేషన్కి వెళ్ళేంతవరకూ నోరుమూసుకు పడి ఉండు." అని లాఠీతో గదమాయించాడు రాజారావు. దెబ్బతో తిరుమలరావు నోరు మూతపడింది.


x x x x x x x


"అయితే నువ్వు ఈ హత్య చెయ్యలేదంటావు!" తిరుమలరావు వైపు సూటిగా చూస్తూ అన్నాడు క్రైం బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు.


"అవును సార్! నాకు ఏ పాపమూ తెలియదు. ప్రతీ రోజూ లాగే నిన్న కూడా ఫ్యాక్టరీలో నేను నా పని ముగించుకొని వస్తూంటే దారిలో వర్షం కురవడంవల్ల ఆ ఇంటి వరండాలో నిలబడ్డాను. అప్పటికే బాగా తడిసి ఉన్నాను. అప్పుడు ఆ ఇంట్లోంచి ఒకతను బయటకు వచ్చి నన్ను లోపలికి ఆహ్వానించాడు. ఆ ఇంటావిడ వేడివేడి కాఫీ ఇస్తే తాగాను సార్!


కాఫీ తాగగానే ఏదో మత్తు ఆవరించినట్లైంది. అంతే, ఆ తర్వాత ఏం జరిగిందో మాత్రం అసలు గుర్తు లేదు. నన్ను పోలీసులు చుట్టుముట్టేవరకూ నాకేం తెలియదు సార్!" అన్నాడు తిరుమలరావు తనని ఈ నేరం నుండి ఎలాగైనా రక్షిస్తాడేమోనని ఇన్స్పెక్టర్ సాంబశివరావువైపు ఆశగా చూస్తూ.


సాంబశివరావు సాలోచనగా తలపంకించాడు.

"సో.. నువ్వు ఈ హత్య చెయ్యలేదంటావు. మరి, బీరువామీద, చనిపోయిన ఆమె సునీత మెడమీద కూడా నీ వేలిముద్రలే ఉన్నాయి మరి." అన్నాడు సాంబశివరావు.


"అదే నాకూ అర్థం కావడంలేదు సార్! అసలు నేనక్కడకి ఎలా వచ్చానో కూడా బోధపడటం లేదు." తల గోక్కుంటూ చెప్పాడు తిరుమలరావు.


"అదేంటీ నువ్వేకదా చెప్పావు, వర్షం పడుతుంటే అక్కడ తలదాచుకున్నావని."


"నిజమే కాని, మా ఫ్యాక్టరీ ఉంది గోపాల్పూర్వద్ద. నేను రాత్రి ఎనిమిది గంటలకి ఇంటికి బయలుదేరాను. ఫ్లైఓవర్ దాటినతర్వాత వాన మొదలైంది. ముందు చిన్న వానేకదా అనుకున్నది, క్రమేణా ఉదృత రూపం దాల్చింది. దగ్గరలో ఆగడానికి ఎక్కడా అవకాశం లేకపోవడంతో అలాగే తడుస్తూ కొద్దిదూరం వచ్చిన తర్వాత ఆ ఇల్లు కనబడింది. అక్కడ ఆ ఇల్లు ఒకటే ఉంది. చుట్టుపక్కల మరే ఇళ్ళు లేవు. బైక్ అక్కడ ఆపి వరండాలో నిలబడ్డాను.


డిసెంబర్నెల చలి, పైగా వానలో తడవటంవల్ల ఆ వరండాలోనే వణుకుతూ నిలబడ్డాను. ఇంతలో ఆ ఇంట్లో ఉన్న అతను తలుపు తెరిచి నన్ను ఇంట్లోకి ఆహ్వానించాడు. ఇంటావిడ వేడివేడి కాఫీ ఇస్తే తాగాను. అప్పుడే కొద్దిగా వణుకు, చలి తగ్గింది. అంతే, కాఫీ తాగిన ఐదునిమిషాలకి ఎందుకో తెలియదు ఎక్కడలేని నిద్ర ముంచుకు వచ్చింది. పోలీసులు చుట్టుముట్టేంతవరకూ నాకేమీ తెలియలేదు. అయితే నేను ఇక్కడికి అంటే గజపతినగర్ కాలనీకి ఎలా వచ్చానో ఏమాత్రం తెలియడం లేదు. నేను నిజమే చెప్తున్నాను సార్, నన్ను నమ్మండి." అన్నాడు తిరుమలరావు.


అతని మాటలు విన్న సాంబశివరావు పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు.


"సార్! అతని మాటలు నమ్మకండి, రెడ్హ్యాండెడ్గా హత్యా ప్రదేశంలో దొరకడమే కాకుండా, అతని వేలిముద్రలు కూడా సరిపోయాయి. పైగా పెద్ద వాన పడినట్లు, తను వర్షంలో తడిసినట్లు బుకాయిస్తున్నాడు." అన్నాడు రాజారావు.

ఒక్కక్షణం పచార్లు ఆపి, రాజారావు వైపు చూసాడు సాంబశివరావు.

=================================================================================ఇంకా వుంది..

=================================================================================

దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


71 views0 comments

Comments


bottom of page