'Sarkaruvari Pattalu'- New Telugu Story Written By Padmavathi Divakarla
'సర్కారువారి పట్టాలు' తెలుగు కథ
రచన: పద్మావతి దివాకర్ల
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఊరు ఊరంతా చాలా హడావుడిగా ఉంది. రంగురంగుల తోరణాలు ఊరంతా కట్టారు. అధికార పార్టీ జెండాలు రెపరెప లాడుతున్నాయి. అభిమాన హీరో సినిమా విడుదలైతే ఎంత హడావుడిగా ఉంటుందో సరిగ్గా ఆ ఊళ్ళో అలాంటి పండుగ వాతావరణమే నెలకొంది. అంతా కోలాహలంగా ఉంది. రాజకీయనాయకుల ఫ్లెక్సీలు దారి పొడుగునా దర్శనం ఇస్తున్నాయి. ఎక్కడవిన్నా, ఎవరినోట విన్నా ఒకటే మాట, "ఇవాళ మీటింగ్ల పట్టాలు ఇస్తారంట సర్కారోళ్ళు." అన్న మాటే వినపడుతోంది.
పట్టాలు దొరకబోతున్నందుకు ఆ ఊరి బీదా బిక్కీ ముసలి ముతకా జనంతో పాటూ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆ సమావేశం జరుగుతుందా, తమ చేతికి ఎప్పుడు పట్టాలు అందుతాయా అని అందరిలోనూ ఒకటే ఉత్కంఠత నెలకొంది. ప్రతిపక్షాల వాళ్ళు మాత్రం రాబోయే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ జనాలకి పనికిరాని స్థలాలు అంటగట్టి, పట్టాలు పంచి ఓట్లు దోచుకోవడానికి పన్నాగం పన్నారని ప్రచారం చేస్తున్నారు.
అయితే, అన్ని రకాల ఉచితాలకి బాగా అలవాటు పడ్డ జనం మాత్రం ఉచితంగా పట్టాలు తమకు లభించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. ఊరి మధ్యలో కమ్యునిటీ హాల్ బయట ఎత్తైన పెద్ద వేదిక ఏర్పాటు చేసారు. వేదికంతా బాగా అలంకరించారు. పుష్పగుచ్ఛాలు అమర్చారు. సభకి ముఖ్య అతిథిగా వస్తూన్న మంత్రి మంగపతిరావు నిలువెత్తు కటౌట్ పెట్టారు. అంతేకాక అధికార పార్టీ అద్యక్షుడు, ముఖ్యమంత్రి, స్థానిక ప్రజాప్రతినిధిల కటౌట్లు, ఫ్లెక్సీలు కూడా ఊరు ఊరంతా వెలిసాయి.
అధికార పార్టీ కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ నియోజిక వర్గానికి చెందిన మంత్రి మంగపతిరావు జనాలకి పట్టాలు అందిస్తాడని ప్రచారం చేస్తూ కరపత్రలు పంచిపెట్టారు ఆ పార్టీ కార్యకర్తలు. జిల్లా కలక్టర్ని కూడా ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సభా ప్రాంగణంలో అయిదువందలకు పైగా కుర్చీలేసారు. రాబోయే అతిథుల కోసం, పార్టీ కార్యకర్తల కోసం, సభకి హాజరవబోయే జనం కోసం వేర్వేరుగా వంటలు వండుతున్నారు ఆ పక్కనే. అ వంటల సువాసనతో అక్కడున్న అందరి ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి.
పదకొండు గంటలకి సభ ప్రారంభం కావలసి ఉండగా, ఉదయం ఎనిమిది గంటలకే ఊరి జనం అంతా అక్కడ పోగయి జరగబోయే కార్యక్రమం గురించి చర్చించు కుంటున్నారు. పార్టీ కార్యకర్తలు హడావుడిగా సభా ప్రాంగణమంతా కలియ తిరుగుతూ పనులు పర్యవేక్షిస్తున్నారు. అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న సభ ఎప్పటిలాగే ఓ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ముందు ముఖ్య వక్త వరహాల్రావు వేదికనలకరించిన ప్రముఖులందర్నీ పేరు పేరునా సభకి పరిచయం చేసాడు.
ఆ తర్వాత మాట్లాడుతూ, "ఈ రోజు చాలా శుభదినం. ఈ సందర్భంగా ఊరి వాళ్ళందర్నీ నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఘనత సాధించడానికి కారణమైన అధికార్లకు కూడా నా హార్దిక అభినందనలు. సభకి విచ్చేసిన గౌరవనీయులైన మన కలక్టర్గారి ప్రసంగం అనంతరం మన అభిమాన మంత్రి మంగపతిగారు అందరికీ పట్టాలు అందిస్తారు. అనంతరం అందరికీ విందు భోజనం ఉంటుంది." అని మారుమోగుతున్న కరతాళి ధ్వనుల మధ్య తన ప్రసంగం ముగించాడు.
అనంతరం కలక్టర్గారు అక్కడి జనానికి అర్ధం కాని ఆంగ్ల భాషలో ఓ అరగంట సేపు ఏకధాటిగా ప్రసంగించాడు. ఆ తర్వాత మంత్రి మంగపతిరావు ప్రసంగించడానికి కుర్చీలోంచి లేవగానే కరతాళ ధ్వనులు మిన్నంటాయి. తమ హర్షం వెలిబుచ్చుతూ అందరూ జయజయ ధ్వనులు చేసారు. మంగపతిరావు ఆ ఊరి వాళ్ళను పొగుడుతూనే తన గురించి, తన పార్టీ గురించి, తన ప్రభుత్వం సాధించినవి, ప్రతిపక్ష పార్టీ తమ హయాంలో సాధించలేనివి అందరికీ పదేపదే గుర్తు చేసి, ఈ సారి కూడా తమకే ఓటు వేసి తమకి మళ్ళీ ప్రభుత్వo ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని మరిమరీ కోరాడు అందర్నీ.
అతని ప్రసంగం అంతా చాలా ఓపిగ్గా విన్నారు ప్రజలంతా. మనసులో తమకు అందబోయే పట్టాలపైనే అందరి దృష్టి ఉంది. ఆ తర్వాత ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. అక్కడ ఉన్న జనాల్లో ఒక్కసారి కలకలం బయలుదేరింది. ఒకొక్కళ్ళనీ వేదిక మీదకి పిలిచి మంత్రి మంగపతిరావు చేతుల మీదుగా కాగితాలు అందజేసారు సభ నిర్వాహకులు. తమకందిన కాగితాలను సంతోషంగా తీసుకొన్నారు అందరూ. కాకపోతే అందులో ఏమి రాసుందో కూడా చదవలేకపోయారు ఎవరూ.
ఈ లోపున చాలా మంది ఒకేసారి భోజనాలు చేయడానికి ఎగబడ్డారు. కొంతమందైతే తమకి చెందిన స్థలాలు ఎక్కడున్నాయో ఉత్సుకతతో ఆరా తీస్తున్నారు. ఆ కాగితాల్లో ఏముందో అక్కడున్న ఆ ఊరికి చెందిన పార్టీ కార్యకర్తలెవరికీ కూడా తెలియకపోవడంతో ఆ ఊళ్ళో ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడైన పరంధామయ్యకి చూపించారు.
రైతు కూలీ రామయ్య చేతిలోని కాగితం అందుకొని చదివిన పరంధామయ్య ఇలా చెప్పాడు, "మన ఊళ్ళో సర్కారు ఏర్పాటు చేసిన వయోజన విద్యా కేంద్రంవల్ల సంపూర్ణ అక్షరాస్యత సాధించిన సందర్భంగా ఊరి వాళ్ళని అభినందించి ఇచ్చిన ప్రశంసా పత్రం ఇది. ఆ విషయమే ఈ కాగితాల్లో రాసి ఉంది, కాకపోతే మీకెవరికీ చదవడం రాకపోవడంతో స్థలం పట్టాలని మీరందరూ భ్రమిస్తున్నారు. చిత్రం, చివరికి ఈ విషయం పార్టీ కార్యకర్తలెవరికీ కూడా తెలియదు."
అప్పటికీ అర్థం కాకపోతే వాళ్ళకి అర్ధమైన రీతిలో బోధ పరిచారు, "మీరనుకున్నట్లు ఇవి సర్కారు వాళ్ళిచ్చిన స్థలం పట్టాలు కావు. మీకందరికీ రాయడం, చదవడం పూర్తిగా వచ్చిందని మెచ్చుకుంటూ రాసిచ్చిన కాగితాలు ఇవి."
ఆ మాటలు విన్న రామయ్యతో పాటు అక్కడ మూగిన వాళ్ళందరూ తెల్లబోయారు. సర్కారు వాళ్ళిచ్చిన పట్టాలు చేత పట్టుకున్న వాళ్ళెవరికీ నోట మాట రాలేదు. అయోమయంగా వాటినే చూస్తూ ఉండిపోయారు. వాళ్ళని అలా చూసిన పరంధామయ్యకి జాలి వేసింది.
వయోజన విద్య కేవలం కాగితాలకే పరిమితమైనందువల్ల జరిగిన ఈ దుస్థితికి చింతించిన పరంధామయ్య, "మీకు చదవడం, రాయడం రాకపోవటం వల్ల చాలా కష్టనష్టాలకు గురవుతున్నారు. మీ నిరక్షరాస్యతే రాజకీయనాయకులకి కొండంత బలం. వాళ్ళు తమ పబ్బం బాగానే గడుపుకుంటున్నారు. ఏదో తూతూ మంత్రంగా వయోజన విద్య జరిగినట్లు, దానికి బోలెడంత డబ్బులు ఖర్చైనట్లు లెక్కలు చూపి, అది సఫలమై గ్రామమంతా వంద శాతం అక్షరాస్యత సాధించినట్లు చాటుకొని జబ్బలు చరుచుకుంటున్నారు.
అయితే, అందుకు విరుగుడుగా నేను ఈ వారం నుండే మీకందరికీ సాయంకాలం పూట చదువు చెప్పి వాళ్ళు చెప్పిన మాటలు నిజం చెయ్యాలని సంకల్పించాను. మీరందరూ సహకరిస్తే, నిజంగానే మన ఊరు త్వరలో ఈ ఘనత సాధిస్తుంది. మీరు కూడా మీ నిరక్షరాస్యత వలన ఎక్కడా మరి మోసానికి గురి కారు." అని చెప్పాడు.
గ్రామస్తులందరూ సంతోషంగా తలలు ఆడించడంతో పరంధామయ్య మనసు ఆనందంతో నిండిపోయింది. తను తలపెట్టిన మహత్కార్యం సఫలం కావాలనే సదుద్దేశంతో ఆ వారం నుండే సాయంకాలం స్కూలు ఆవరణలో చదువు చెప్పడం ఆరంభించాడు. అలా ఓ మహత్కార్యానికి బీజం పడింది.
***
పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.
Comments