top of page

వర్షం కురవని రాత్రి పార్ట్ 2

విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ

'Varsham Kuravani Rathri Part 2' - New Telugu Story Written By D V D Prasad

'వర్షం కురవని రాత్రి పార్ట్ 2' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

మర్డర్ స్పాట్ లో దొరికిన తిరుమలరావు తనకేమి తెలియదంటాడు.

వాన పడుతుంటే ఒక ఇంట్లో షెల్టర్ తీసుకున్నానని, తరువాత స్పృహ తప్పిందని చెబుతాడు.


ఇక వర్షం కురవని రాత్రి పెద్ద కథ రెండవ భాగం చదవండి.


"ఇతను చెప్తున్నమాటలు, జరిగిన సంఘటనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఎక్కడో చిన్న తేడా ఉంది. నిందితుడేమో వర్షంలో చిక్కుకున్నానంటున్నాడు, కానీ ఇక్కడ చుక్క వాన పడందే! పైగా, ఆ ఇంట్లో తను చూసిన ఆమె హతురాలు కాదంటున్నాడు. అతను వానలో చిక్కుకున్నప్పుడు ఆశ్రయం తీసుకున్న ఇల్లు ఫ్లైఓవర్ దగ్గర ఉందంటున్నాడు. కానీ, హత్య జరిగిన ఇల్లు గజపతినగర్లో ఉంది.. ఎక్కడో లింక్ మిస్సయింది. ఏది నిజమో తెలియడంలేదు. అంతేకాక, స్టేషన్కి హత్యజరిగినట్లు ఎవరో అజ్ఞాతవ్యక్తినుండి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసిందెవరు? అసలు అతనికెలా తెలిసింది అక్కడ హత్య జరిగినట్లు?" అని ఒక్క క్షణం ఆగాడు సాంబశివరావు.


రాజారావువైపు తిరిగి,"తిరుమలరావు చెప్పిన చోటుకి, హత్య జరిగిన స్థలానికిమధ్య పది పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ భోరున వాన కురిసి, ఇక్కడ ఒక్క చుక్క కురవకపోయినా పెద్దగా ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఆందుకని నిన్న గోపాల్పుర్, ఆ పరిసర ప్రాంతాల వానగానీ కురిసిందా వాకబు చెయ్యు. అంతేకాక, తిరుమలరావు చెప్పినట్లు ఆ ప్రాంతాల్లో అలాంటి ఇల్లు ఏమైనా ఉందా కూడా వాకబు చెయ్యు. అలాగే తిరుమలరావు గురించి వాళ్ళ ఆఫీసులో ఎంక్వైరీ చెయ్యు." అని ఆదేశాలు జారీ చేసాడు సాంబశివరావు.


"అలాగే సార్!" అని అక్కణ్ణుంచి వెళ్ళాడు రాజారావు.


తనముందున్న పోస్ట్మార్టం రిపోర్ట్, వేలిముద్రల నిపుణల రిపోర్టులు క్షుణ్ణంగా పరిశీలించాడు సాంబశివరావు. హత్య రాత్రి తొమ్మిది, పది గంటలమధ్య జరిగినట్లు ఉందా రిపోర్ట్లో. హుతురాలి మెడపైన, ఆ ఇంటి బీరువామీద కూడా ఉన్న వేలిముద్రలు తిరుమలరావు వేలిముద్రలతో సరిపోయాయి. సాక్ష్యాలన్నీ తిరుమలరావుకి వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ అతను చెప్పిన కథనం వేరేగా ఉంది. కొద్దిసేపు తర్వాత చలపతి ఇంటివైపు బయలుదేరిన సాంబశివరావుకి ఆ ఇంటి తాళం కప్ప వెక్కిరించింది. చుట్టుపక్కల చలపతి గురించి వాకబు చేసాడు. ముందు పోలీసులకు భయపడి ఎవరూ పెదవి విప్పలేదు. చలపతి ఇంటికి ఎదురుగా ఉన్నాయన మాత్రం సాంబశివరావుని తన ఇంట్లోకి ఆహ్వానించాడు.


చలపతి గురించి ఆరాతీస్తే,"చలపతిరావు సేల్స్ రిప్రజెంటేటివ్గా పని చేస్తాడు. టూర్ల మీద తిరుగుతాడు. రోజూ ఇంటికి రాడు సార్! రెండుమూడు రోజులకోసారి మాత్రమే వస్తూంటాడు. భార్యాభర్తలెప్పుడూ గొడవ పడుతుంటాడు." అని చెప్పాడు.


"ఎందుకు గొడవ పడుతూ ఉంటాడో మీకేమైనా తెలుసునా?" అడిగాడు సాంబశివరావు.


"చలపతిరావుకి భార్య మీద అనుమానమెక్కువ సార్! వాళ్ళవిడకీ భర్తమీద అనుమానమే! అంతకు మించి నాకింకేమీ తెలియదు సార్!" చెప్పాడు సుధాకర్.


అతని నుండి అంతకు మించి మరే సమాచారం రాబెట్టలేకపోయాడు సాంబశివరావు. తిరిగి వెళ్ళి కానిస్టేబుల్ కనకారావుకి ఏదో చెప్పాడు. అతను అలాగేనని తలూపి జీపు దిగి వెళ్ళాడు.


సాంబశివరావు ష్టేషనుకి తిరిగివెళ్లేసరికి రాజారావు వచ్చి ఉన్నాడు."సార్! అక్కడ వాకబు చేసాను, నిజంగా పెద్దవానే పడిందిట సార్, కన్ఫర్మేషన్ కోసం వాతావరణ శాఖ వాళ్ళనుకూడా కలిసాను. తిరుమలరావు చెప్పినట్లు ఫ్లైఓవర్ దాటిన తర్వాత విడిగా ఓ ఇల్లు ఉంది, కానీ ఆ ఇంట్లో ఆర్నెల్లనుండి ఎవరూ ఉండటం లేదుట. ఆ ఇంటికి కాస్త దూరంగా ఉన్న ఇంటి నుండి సమాచారం తెలిసింది. ఇంటి ఓనర్ అమెరికా వెళ్ళి దగ్గరదగ్గర ఆర్నెల్లు అవుతోందిట." అని తను సేకరించిన సమాచారం యావత్తు సాంబశివరావుకి చెప్పాడు రాజారావు. అలాగే తిరుమలరావు గురించిన తను సేకరించిన సమాచారం కూడా చెప్పాడు.


"ఓకే, మనకి ఉపయోగపడే సమాచారం సేకరించావు. దీన్నిబట్టి చూస్తే తిరుమలరావు చెప్పినదాంట్లో అబద్ధమేమీ లేదు. ఏవరో అతన్ని ఈ హత్యలో ఇరికించినట్లు స్పష్టంగా తెలుస్తోంది, ఇంతకీ ఎవరా వ్యక్తి? ఇప్పుడు చలపతి గురించిన పూర్తి వివరాలు సేకరించాలి. కనకారావుకి ఆ పని అప్పగించాను. చూద్దాం అతను ఏ సమాచారం తెస్తాడో!" అన్నాడు సాంబశివరావు.


అంతలో ఒక మధ్యవయస్కుడు పోలీసు స్టేషనులోకి అడిగుపెట్టి సరాసరి సాంబశివరావు వద్దకు వచ్చి నమస్కారం పెట్టాడు. సాంబశివరావుకూడా ప్రతినమస్కారం చేసి అతనివైపు ప్రశ్నార్థంకంగా చూసాడు.


"సార్! నా పేరు రామానందం. నేను చలపతి ఇంటికి రెండిళ్ళ అవతల ఉంటున్నాను." చెప్పాడతను. హత్య విషయమేదో అతను చెప్పడానికి వచ్చాడని గ్రహించిన సాంబశివరావు అతన్ని కూర్చోమని సైగ చేసాడు. రామానందం కుర్చీలో కూర్చున్నాక,"ఇప్పుడు చెప్పండి!" అన్నాడు సాంబశివరావు.


"చలపతికి తన ఇంటి ఎదురుగా ఉన్న సుధాకర్తో పడదు. సునీత కారణంగా వాళ్ళిద్దరిమధ్య గొడవ జరిగింది. సునీతకీ, సుధాకర్కి మధ్య సంబంధం ఉందని చలపతికి అనుమానం. హత్య జరిగిన రోజు సుధాకర్ వాళ్ళింటివైపు వెళ్ళడం నేను చూసాను సార్! ఆ విషయం మీకు చెప్పాలని వచ్చాను.." చెప్పాడతను.


"ఐ సీ!.. అయితే నేనక్కడికి వెళ్ళినప్పుడీ విషయం చెప్పలేదేమీ?" అడిగాడు సాంబశివరావు అతన్ని పరిశీలనగా చూస్తూ.


"మీరు సుధాకర్ ఇంటివైపు వెళ్ళడం చూసాను. అంతేకాక, అక్కడ నేను మీతో ఏం మాట్లాడినా సుధాకర్ నేనే చెప్పానని నా వైపు అనుమానంగా చూస్తాడని భయపడి చెప్పలేదు." అన్నాడు రామానందం.


"ఓకే!.. చాలా పనికివచ్చే సమాచారం అందించారు. థాంక్యూ. అయితే కావలసివచ్చినప్పుడు మీరు సాక్ష్యం మాత్రం చెప్పవలసి ఉంటుంది." అన్నాడు సాంబశివరావు.


అలాగేనని తలూపి వెళ్ళిపోయాడతను. సాంబశివరావు మరోసారి కేసు పూర్తిగా మననం చేసుకున్నాడు. సాక్ష్యాలన్నీ తిరుమలరావుకి వ్యతిరేకంగా ఉన్నాయి. హతురాలిమెడపై అతని వేలిముద్రలున్నాయి. హత్య జరిగిన ప్రదేశంలో రెడ్హ్యాండ్గా దొరికాడు. అయితే, ఇప్పుడు కొత్త విషయాలు ముందుకు వచ్చాయి. హతురాలి భర్త చలపతికి, అతని భార్యకి మధ్య విభేదాలున్నాయి. ఒకరి ప్రవర్తనమీద ఇంకొకరికి అనుమానం. హత్యలో సుధాకర్ పాత్ర ఏమిటి? రామానందం చెప్పినట్లు అతనికి సునీతతో ఏమైనా సంబంధం ఉందా? ఇంతకీ చలపతి ఏమైనట్లు? ఇలా ఆలోచిస్తున్నాడు సాంబశివరావు.


రాజారావు అన్నట్లు ఇది చాలా సింపుల్ కేసేమో? తిరుమలరావే హత్య చేసి ఉండొచ్చేమో, అనవసర విషయాలన్నీ తను కెలకటం లేదు కదా! తిరుమలరావు మాటలవల్ల కేసు తికమకగా మారడం లేదు కదా! ఇలా ఆలోచనలు ఒకంతట తెగడంలేదు.


అప్పుడు కానిస్టేబుల్ కనకారావు ఫోన్ చేసాడు,"సార్! చలపతి కనిపించాడు సార్! హోటల్ మోతీలో ఒక ఆమెతో కలిసి మాట్లాడుతూండగా చూసాను సార్!" అన్నాడు.


"గుడ్! వాళ్ళిద్దర్నీ ఓ కంట కనిపెడుతూ ఉండు. ఏమైనా కొత్త విశేషం తెలిస్తే వెంటనే ఫోన్ చెయ్యు!" అన్నాడు సాంబశివరావు.


"అలాగే సార్!" అన్నాడు కనకారావు.


ఒకగంట తర్వాత కనకారావు ఇచ్చిన ముఖ్యమైన సమాచారం అనుసరించి సాంబశివరావు వెంటనే బయలుదేరాడు. అసలు నేరస్థులను పట్టుకున్న తర్వాత తిరుమలరావు విడుదలయ్యాడు. హత్య ఆరోపణల్లోంచి బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నాడతను. తనని రక్షించిన సాంబశివరావుకి కన్నీళ్ళతో తన కృతజ్ఞత తెలియజేసాడు. పోలీస్ స్టేషన్లో సాంబశివరావు ఎదురుగా నేరస్థులిద్దరూ తలవంచుకొని నిలబడ్డారు.


"వాళ్ళిద్దరూ కలసి ఈ హత్య చేసారని ఎలా కనిపెట్టారు సార్! అసలు వాళ్ళమీద మీకెలా అనుమానం కలిగింది?" అడిగాడు రాజారావు.


"హత్యా ప్రదేశంలో దొరికిన ఆధారాలబట్టీ, నేరం నేరుగా తిరుమలరావుపై పడుతుంది. సాక్ష్యాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. మొదటి అనుమానితుడు తిరుమలరావే! అయితే, తనని వర్షం కురిసిన రాత్రి చలపతి ఇంట్లోకి పిలిచాడని అతను చెప్పడం విశేషం. అసలు జరిగిన సంగతేమిటంటే, సునీతతో పెళ్ళైన రెండేళ్ళ తర్వాత చలపతి రేఖ ప్రేమలో పడ్డాడు. రహస్యంగా పెళ్ళిచేసుకుందామన్నా, సహజీవనం చేద్దమన్నా రేఖ ఒప్పుకోలేదు. సునీతకి విడాకులిచ్చిన తర్వాతే తను పెళ్ళి చేసుకుంటానని పట్టుబట్టింది. విడాకులకోసం ప్రయత్నించిన చలపతికి ఆరంభంలోనే చుక్కెదురైంది.


సునీత విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. విడాకులు తీసుకోవడానికి సరైన కారణాలు లేవు. ఎలాగైనా రేఖని పెళ్ళి చేసుకోవాలని కోరిక పెంచుకున్న చలపతి చీటికీ మాటికీ భార్యతో తగువుపెట్టుకునేవాడు. అలాగైనా సునీత విడాకులు అడుగుతుందని అనుకున్నాడు, కానీ ఆమె భర్త టార్చర్ భరించిందేకానీ నోరు విప్పలేదు. ఇలాకాదని, మధ్యమధ్య ఏదో పనిమీద ఇంటికి వచ్చే సుధాకర్తో సంబంధం అంటగట్టి వేధించేవాడు. దాంతో వాళ్ళిద్దరికీ గొడవ పెరిగిందేకానీ విడాకులకు మార్గం మాత్రం సుగమం కాలేదు. చివరికి సునీతని హత్య చేయడానికే నిశ్చయించుకొని అవకాశం కోసం ఎదురు చూడసాగాడు చలపతి. అందుకు రేఖ సహాయం కోరాడు. వాళ్ళకి ఆ అవకాశం తిరుమలరావు రూపంలో వచ్చింది.


ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ఇంటి తాళం చలపతిరావు స్నేహితుడి వద్ద ఉంది. అతని సహాయంతో ఆ ఇంట్లో రేఖని తరుచూ కలుసుకుంటూ ఉండేవాడు చలపతి. ఈ విషయాలన్నీ కనకారావు సేకరించాడు. వర్షంవల్ల ఆ ఇంట్లో ఆశ్రయం పొందిన తిరుమలరావుకి కాఫీలో మత్తుమందు కలిపి ఇచ్చారు. అది తెలియక, కాఫీ తాగిన అతను నిద్రలోకి జారిపోయాడు. ముందు గజపతినగర్లో గల ఇంట్లో సునీతని హత్య చేసారు. ఆ తర్వాత వాళ్ళు స్పృహతప్పిన తిరుమలరావుని అక్కుణ్ణుంచి తీసుకువచ్చి అతని వేలుముద్రలు అలమరాపై, అలాగే హతురాలి మెడపై కూడా వేలిముద్రలు పడేట్లు చేసారు.


దొంగతనంకోసం ఆ ఇంటికి తిరుమలరావు వచ్చి, తనని ప్రతిఘటించిన సునీతని హత్య చేసినట్లు స్కిట్ తయారు చేసారు. అలా ఆ హత్యానేరం నుండి తప్పించుకోవడమేకాక, పక్కా సాక్ష్యాలతో తిరుమలరావుని ఇరికించారు. తెల్లారి అప్పుడే ఊరినుండి వచ్చినట్లు నాటకం ఆడాడు. సాక్ష్యంకోసం సూరట్ నుండి టికెట్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేయడంతో దొరికిపోయాడు చలపతి. ఏంచేసినా నిప్పూ, నిజం రెండూ దాగవు. వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యని కౄరంగా హత్య చేసినందుకు, సాక్ష్యాలను తారుమారు చేసినందుకు చలపతికి తగిన శిక్షపడవలసిందే!


అతనికి ఈ హత్య చేసేందుకు ప్రేరేపించి, ఈ నేరంలో భాగస్వామిని అయిన అతని ప్రేయసి రేఖ కూడా శిక్షకి అర్హురాలు. చలపతిపైన నిఘా పెట్టేసరికి అతని స్నేహితుడు దొరికాడు, చలపతి ప్రేయసీ దొరికింది. తమ ప్రేమకి అడ్డుగా ఉన్న సునీతని తమ దారి నుండి అడ్డు తొలగించుకోవడానికి వాళ్ళిద్దరూ కుట్ర పన్నారు. పాపం తిరుమలరావు అనుకోకుండా అందులో ఇరుక్కున్నాడు.


మధ్యలో సుధాకర్ ఎపిసోడ్ కొద్దిగా తికమకకి గురిచేసింది. రామనందం చెప్పినట్లు అతను హత్య జరిగిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళినమాట వాస్తవమే కానీ తలుపు తెరుచుకోకపోవడంతో తిరిగి వచ్చాడు. అదంతా సుధాకర్ ఇంటివద్ద ఉన్న సిసిటివిలో రికార్డైంది. అలాగే అంతకుముందు తిరుమలరావుని అక్కడికి తేవడం కూడా అందులో కనిపించడం చలపతి దురదృష్టం, ఎందుకంటే సిసిటివి తన ఇంటి ఎదురుగా ఉందని అతనికి తెలియకపోవడంవల్ల చాలా సులభంగా చట్టానికి చిక్కాడు." అని ముగించాడు సాంబశివరావు.


నేరస్థుడైన చలపతి, అతని పక్కన నిలబడ్డ ప్రేయసి రేఖ ఇద్దరి ముఖాలు కిందికి వాలిపోయాయి.

================================================================================= సమాప్తం

=================================================================================

దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


49 views0 comments
bottom of page