top of page

మారిన మనసు


'Marina Manasu' - New Telugu Story Written By Yasoda Pulugurtha

'మారిన మనసు' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

కీర్తన డాక్టర్ చెప్పిన‌ మాటలకు తెల్లబోయి చూసింది. "మీరు చెప్తోంది నిజమేనా డాక్టర్! తను ఇద్దరు టీనేజ్ ఆడ పిల్లల తల్లి. నాకు తెలిసినంత వరకూ ఆమె భర్త అర్జున్ చాలా మంచివాడు. పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు లేవు. తన లైఫ్లో‌ ఎలాంటి ఒత్తిళ్ళు, ఆరళ్ళు లేవు. అలాంటప్పుడు దానికి ఇలా చేయవలసిన అవసరమేం ఉంటుంది...??"


"చూడండి కీర్తనా! నువ్వు మా శ్రీరామ్ భార్యవి, ఈమె ప్రాణ స్నేహితురాలివి కనుక నీకు పేషెంట్ పరిస్థితిని గురించిన వివరంగా చెప్పాను. ఆమె కుటుంబ పరిస్థితులు ఏంటో కానీ... ఆమె ఖచ్చితంగా డ్రగ్స్ కి అలవాటు పడుతోందని మాత్రం చెప్పగలను. ఈ విషయం ఆమె భర్తకు ఇన్ఫామ్ చేసారా!?" అడిగాడు డాక్టర్ విక్రమ్.


"ఫోన్ కలవట్లేదు, మెసేజ్ పెట్టాను. అతను ఆఫీస్ పని మీద హాంగ్ కాంగ్ వెళ్లాడని చెప్పారు పిల్లలు. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు అతని కోసం." చెప్పింది కీర్తన.


"సరే! ఆమెకు మెలకువ వచ్చేప్పటికీ అటెండెంట్ ఎవరో ఒకరు ఆమెతో ఉండేలా చూసుకోండి. అసలే తీవ్రమైన డిప్రెషన్ లో ఉందామె. నేను మధ్యాహ్నం మళ్లీ వస్తాను." చెప్పి వెళ్లిపోయాడు విక్రమ్.


"నేనే ఉంటాను తన దగ్గర." అంది కీర్తన ఆందోళనను అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ.


రాధిక, కీర్తన చదువుకునే రోజుల్నించీ మంచి స్నేహితురాళ్లు. కీర్తనకు డిగ్రీ అవుతుండగానే పెళ్ళయిపోవటంతో ఆమె పిల్లలు రాధిక పిల్లల కంటే పెద్దవాళ్లు. ఆమె భర్త శ్రీరామ్ డాక్టర్. కీర్తన పెద్ద కూతురికి పెళ్ళయింది. నాలుగు నెలల క్రితం కూతురి డెలివరీ కోసం ఆస్ట్రేలియా వెళ్లి వారం క్రితమే వచ్చింది కీర్తన.


మధ్యాహ్నం కీర్తన భోజనం చేస్తుండగా, సడన్గా రాధిక వాళ్ల మెయిడ్, రాధిక ఫోన్ నుండి కాల్ చేసి, "కీర్తనమ్మా! రాధికమ్మ బాత్రూమ్ లో స్పృహ తప్పి పడిపోయిందమ్మా, సారు వేరే దేశం వెళ్ళున్నారు, పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళుండటంతో ఎవరికి చెప్పాలో అర్థం కాక మీకు చెబుతున్నాను." అని కంగారుగా చెప్పేసరికి, కీర్తన గబగబా వెళ్ళి ఆమెను హుటాహుటిన హాస్పిటల్ లో ఎడ్మిట్ చేసింది.


తరచూ స్నేహితురాళ్ళిద్దరూ ఫోన్ లో సంభాషిస్తూ, ఒకరితో ఒకరు తమ వ్యక్తిగత విషయాలు పంచుకుంటూనే ఉంటారు. ఇద్దరి మధ్య రహస్యాలేం ఉండవు. 'తను ఆస్ట్రేలియా లో ఉన్న ఆ నాలుగు నెలల్లో రాధిక ఇంట్లో ఏమైనా జరిగిందా!? అయినా తనక్కడున్నా కూడా, అప్పుడప్పుడు తనూ, రాధిక ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు కదా!? ఒకవేళ నేను కూతురినీ, పాపాయినీ చూసుకునే హడావుడిలో ఉంటానని నాతో ఫ్రీగా ఏదైనా పంచుకోలేక పోయిందా రాధీ!? అయినా ఓ పద్ధతైన సాధారణ ఇల్లాలు అసలిలా డ్రగ్స్ కు ఎలా అలవాటు పడింది!?" ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కి కీర్తనకు. మనసు మనసులో లేదామెకు.


****************


అది 'హాంగ్ కాంగ్' లో ప్రసిధ్ది చెందిన 'హొటల్ డిస్నీలేండ్'. హైద్రాబాద్ లోని 'డి.ఇ.షా గ్రూప్' లో ఫైనాన్షియల్ ఆపరేషన్స్ కి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న 'అర్జున్ మారెళ్ల' ఒక వారంరోజుల క్రితం కంపెనీ పనిమీద హాంగ్ కాంగ్ వచ్చాడు. ఒక్క హాంగ్ కాంగ్ కే కాదు, వివిధ దేశాల కొత్త కొత్త పెట్టుబడుల నిర్వహణ నమూనాలను సమీక్షించడానికి, కంపెనీ పెట్టుబడులను ఏ విధానంలో విస్తరించాలో అవలోకన చేసే నిమిత్తం బిజినస్ టూర్స్ చేస్తూ ఉంటాడు. ఆరోజు రాత్రి ఎనిమిది గంటలకు అర్జున్, లీనా జుమానీ ఆ హొటల్ కి డిన్నర్ కి వచ్చారు. ఎదురెదురుగా కూర్చున్న వాళ్ల చేతుల్లో ఖరీదైన షాంపైన్ తో నిండిన గ్లాసులు. 'ఆస్కార్ డి లా రెంటా' డిజైనర్ వేర్ పింక్ షార్ట్ ఫ్రాక్ లో లీనా కళ్లు తిప్పుకోలేనంత అందంగా ఉంది.


ఆమె అందమైన లిపిస్టిక్ పూసిన పెదవులు ఆ విద్యుద్దీపాల కాంతికి మెరిసిపోతున్నాయి. మాటి మాటికీ అర్జున్ కళ్లల్లోకి తన కళ్లను కలుపుతూ మత్తుగా నవ్వుతోంది. 'లీనా జుమానీ హాంగ్ కాంగ్ లో ఒక ఇన్ వెస్ట్ మెంట్ కంపెనీలో డైరక్టర్ గా పనిచేస్తోంది. లీనా పూర్వీకులు గుజరాతీలు. లీనా తల్లితండ్రులు లీనా పుట్టక ముందే వ్యాపార నిమిత్తమై చైనా వచ్చేసారు. తరచుగా బిజినెస్ టూర్స్ కి హాంగ్ కాంగ్ వచ్చే అర్జున్ అంటే మోజు పడుతోంది. కవ్విస్తూ సమ్మోహనపరిచే ఆమె సాహచర్యాన్ని అర్జున్ కోరుకుంటున్నాడు. ఆఫీసు పని అయిపోయినా మరో నాలుగురోజులు ఆమె కోసమే అక్కడ ఉండిపోతున్నాడు.


సంవత్సరమే క్రితమే పరిచయం అయింది లీనా ఒక బిజినస్ కాన్ఫరెన్స్ లో. ఆమెకు భర్తతో పది సంవత్సరాల క్రితమే విడాకులై ఒంటరిగా ఉంటోంది. అర్జున్ తరచుగా లాంగ్ బిజినస్ టూర్స్ మీద వెడుతుంటే ఈ మధ్య రాధిక అడ్డు చెపుతోంది. ఆమెకు ఏదో అనుమానంగా ఉంటోంది. భర్త ప్రవర్తనలో కొట్టొచ్చినట్లుగా ఏదో మార్పు కనపడుతోంది. ఆడపిల్లలు టీనేజ్ దాటి యుక్త వయస్సులోకి వస్తున్నారని వారిని పెట్టుకుని ఒంటరిగా ఉండలేకపోతున్నానని, బిజినెస్ టూర్స్ లేని ఉద్యోగానికి మారిపొమ్మని మాటి మాటికి అనడంతో ఇద్గరిమధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి


"నేను బాగా సంపాదిస్తున్నందుకే కదా ఇంత రాజభోగాలూ అనుభవిస్తున్నావు. టూర్లు మానేసి నీ కొంగు పట్టుకుని తిరగమంటావా అంటూ" అపహాస్యం చేయడం మొదలుపెట్టాడు.


డిగ్రీ పూర్తి చేసిన రాధికను ఇంక పైకి చదివించలేనన్నాడు తండ్రి. అక్కలిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాకా తన ఇరవై ఆరవ ఏట అర్జున్ తో పెళ్లి అయింది. ఎవరిదో బంధువుల పెళ్లిలో రాధికను చూసి అర్జున్ తల్లి హేమలత ముచ్చటపడింది. రాధికను కోడలిగా చేసుకోవాలని ఉవ్విళ్లూరింది. మీలాంటి గొప్పవారితో సంబంధం సరితూగలేమని రాధిక తండ్రి శేషగిరి చెప్పినా ఆవిడ వినలేదు. ఇంజనీరింగ్ చదివి, ఐఐమ్ చదివిన అర్జున్ అప్పటికే మంచి ఉద్యోగంలో స్తిరపడ్డాడు. మీ అమ్మాయి మాకు బాగానచ్చిందని, మిగతా విషయాల గురించి ఆలోచించవద్దంటూ గట్టిగా ఒప్పించి మరీ రాధికను వారింటి కోడలిగా చేసుకున్నారు.


రాధికకు శేషగిరి చెల్లెలి కొడుకు ప్రకాష్ తో పెళ్లి జరిపించాలని అనుకుంటూండగా అనుకోకుండా అర్జున్ సంబంధం కలసి రావడంతో మేనరికానికి స్వస్తి చెప్పారు. ప్రకాష్ మూడు సార్లు డింకీ కొట్టి మొత్తానికి ఎలాగో డిగ్రీ పూర్తిచేసి హైద్రాబాద్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఒకరోజు అర్జున్ వాష్ రూమ్ లో ఉన్నప్పుడు అతని మొబైల్ రింగైంది. దగ్గరే ఉన్న రాధిక ఫోన్ ఎత్తగానే " గుడ్ మార్నింగ్ మై స్వీట్ హార్ట్ అంటూ అవతలి వైపునుండి ఒక స్త్రీ గొంతుక".


అర్జున్ కి బిజినెస్ పరమైన ఎన్నో ఫోన్ కాల్స్ లేడీస్ నుండి వస్తూ ఉంటాయి. కానీ ఇదే వాట్సాప్ నంబర్ నుండి బోల్జన్ని మెసేజస్ ఉన్నాయి లవ్ సింబల్స్ తో. "హాంగ్ కాంగ్ కి ఎప్పుడొస్తున్నావంటూ, ఐ మిస్ యూ, లవ్ యూ, యూ ఆర్ ది కింగ్ ఆఫ్ మై లైఫ్" లాంటి ఎన్నో మెసేజ్ లు. ఇద్దరూ కలసి ఉన్న ఎన్నో క్లోజ్ అప్ ఫొటోలను కూడా షేర్ చేయడంతో తన అనుమానం నిజం అయింది. మనస్సులో ఎవరికీ చెప్పుకోలేని బాధ. కీర్తనతో అర్జున్ కి వేరే అమ్మాయితో సంబంధం ఉందని ఎలా చెప్పగలుగుతుంది?


తన భర్త అదివరకటిలాగ తనతో ప్రేమగా ఉండడం లేదని చెప్పుకోగలదా? ఒకరోజు ప్రకాష్ బావ ఇల్లు కొన్నానని గృహప్రవేశానికి రమ్మనమని ఇంటికొచ్చి మరీ ఆహ్వానించాడు. ప్రకాష్ పెద్ద విల్లా కొన్నాడు. ఎంతో బాగుంది. ఒక ప్రైవేట్ కంపెనీలో సాధారణ ఉద్యోగం చేసే ప్రకాష్ ఇంటిని చూసి బంధువులందరూ విస్తుపోయారు. ఏదో బిజినెస్ కూడా చేస్తూ బాగా సంపాదిస్తున్నాడుట అని చెప్పుకోవడం తను వింది. అప్పుడప్పుడు ప్రకాష్ అర్జున్ లేనప్పుడు వస్తూ రాధికతో బాతాఖానీ కొడ్తూ ఆ ఇంటిపరిస్తితిని తృటిలో అర్ధం చేసుకున్నాడు.


రాధిక భర్త మంచి ఉద్యోగంలో ఉన్నాడని ఎప్పుడూ ఫారిన్ టూర్లలో ఉంటాడని తెలుసుకున్నాడు. రాధిక డల్ గా ఉండడం, తను అడిగిన దానికి ఏదో అన్యమనస్కంగా జవాబులివ్వడం కనిపెట్టాడు.


"ఎందుకు రాధీ డల్ గా కనిపిస్తున్నావంటూ" బావ ఆప్యాయంగా అడిగేసరికి "ఏం లేదు బావా, ఎందుకో ఈ మధ్య ఉత్సాహంగా ఉండడంలే”దని చెప్పి తప్పించుకుంది.


"ఇదిగో.. ఈ పేకట్ లో హోమియో మాత్రలున్నాయి. ముఫై పొట్లాలుంటాయి. రోజుకొక పొట్లం లోని మాత్రలు వేసుకుంటే ఉపశమనం కలిగి ఉత్సాహం వస్తుదంటూ" ఒక పేకెట్ ను అందించాడు. ఏదో ఆలోచిస్తూ ఆ పేకట్ లో ఉన్న ఒక పొట్లం విప్పి అందులో తెల్లటి తీయటి మాత్రలను వేసుకుని చప్పరించింది. కొద్ది సేపటికి మనసులోని దిగులంతా చేత్తో తీసేసిన భావన. మనసు శరీరం చాలా తేలిగ్గా హుషారుగా అయిపోయాయి.


“ఒక నెలరోజుల పాటు ఈ మాత్రలు వేసుకో. ఒంట్లో శక్తి వస్తుంది. నేనూ వాడాను, నా స్నేహితులకూ ఇచ్చాను. నీలా డిప్రెషన్ తో బాధపడేవాళ్లకు గొప్ప రిలీఫ్ గా ఉంటుంది. ఈ మాత్రలిచ్చిన శాస్త్రిగారు చాలా గొప్ప వైద్యుడు. మాత్రలు ఖరీదు కూడా ఎక్కువే, ఏదో నీకు తోచిన డబ్బు ఇస్తే చాల”నగానే అప్పటికే ఏదో ట్రాన్స్ లో ఉన్న రాధిక బీరువా తెరిచి ఒక నోట్ల కట్ట తీసి ప్రకాష్ చేతికిచ్చింది. అందులో ఎన్ని నోట్లు ఉన్నాయో కూడా చూడలేదు.


జాగ్రత్త చెపుతూ ప్రకాష్ వెళ్లిపోయాడు. రాధిక ఆ మాత్రలకు బాగా అలవాటు పడింది. రోజంతా మత్తుగా ఉండి హాయిగా ఉంటోంది. మరుసటి రోజు కీర్తన ఫోన్ చేసి "వచ్చినప్పటినుండి బంధువుల రాకతో బిజీగా ఉన్నానే రాధీ, నీవే ఒకసారి మా ఇంటికి రాకూడదూ అంది.


"అర్జున్ టూర్ నుండి వచ్చాక వస్తా”నని చెప్పింది.


"నిద్ర మత్తులో ఉన్నావా ఏమి”టంటూ జోక్ చేసింది కీర్తన.


@@@


అక్కడ అర్జున్, లీనా డిన్నర్ పూర్తి అవుతుండగా అర్జున్ మొబైల్ రింగైంది. విసుగ్గా చూసాడు. కూతుళ్ల నుండి మిస్డ్ కాల్సే కాకుండా కీర్తననుండి కూడా మిస్డ్ కాల్స్, మెసేజస్.


కీర్తనకు ఫోన్ చేసాడు. వెంటనే కీర్తన ఫోన్ ఎత్తి రాధిక పరిస్తితిని చెపుతూ వెంటనే బయలదేరి రమ్మంది.


"సారీ లీనా, వెంటనే ఇండియా వెళ్లాలి, త్వరలో మళ్లీ కలుస్తా”నంటూ ఆమెనుండి వీడ్కోలు తీసుకున్నాడు.


రాధిక కు స్పృహ వచ్చింది. కీర్తనను చూడగానే పసిపిల్లలా ఏడ్చేసింది. ఏడవనీ, కరువుతీరా ఏడవనీ, మనసు కరిగి నీరవ్వనీ అనుకుంటూ కీర్తన మాట్లాడకుండా తననే చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి సర్దుకుంది.


"ఏమైంది రాధీ, ఏమిటలా అయిపోయావు? నాలుగు నెలల క్రితం నేను ఆష్ట్రేలియా వెళ్లేముందు చూసిన రాధీవేనా? నీ ప్రాణ స్నేహితురాలిని, నీ మనసులోని బాధ ఏమిటో నాకు చెప్పాలనిపించలేదా"?


రాధిక దుఖంతో వివశురాలౌతోంది. "నాకు బ్రతకాలని లేదే” అంటూ అర్జున్ హాంగ్ కాంగ్ లో మరో స్త్రీ సాంగత్యానికి అలవాటుపడ్డాడని చెపుతూ ఏడ్చేసింది.


"డ్రగ్స్ తీసుకుంటే నీ బాధ తీరిపోతుందా రాధీ? ఎంతో పధ్దతిగా ఉంటూ అర్జున్ కి తగిన ఇల్లాలనిపించుకునే నీవు డ్రగ్స్ కి అలవాటు పడడం ఏమిటి?” తీక్షణంగా ప్రశ్నిస్తున్న కీర్తన మాటలను మధ్యలోనే ఆపేస్తూ, "నేను డ్రగ్స్ తీసుకోవడం ఏమిటీ, నీ వేమంటున్నావో నాకు అర్ధం అవడం లేదు కీర్తనా”?


"డాక్టర్ చెప్పారు. నీవు సివియర్ డిప్రెషన్ కి లో ఉన్నావని, డ్రగ్స్ తీసుకోవడం వల్లే కళ్లు తిరిగి బాతురూమ్ లో స్పృహ తప్పి పడిపోయావని".


“నిజమే, నేను డిప్రెషన్ లో ఉన్నాను. ఒకరోజు బావ నా పరిస్తితి చూసి హోమియో మాత్రలు తెచ్చి ఇచ్చాడు. అవి వేసుకున్నప్పటినుండీ హాయిగా ఏ బాధలూ, ఆలోచనలూ ఉండడం లేదు. నిన్న ఉదయం లేచి బాత్ రూమ్ కి వెడుతుంటే కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించింది. ఆ తరువాత నాకేమైందో తెలియదు".


కీర్తన వెంటనే రాధిక వాడే మాత్రలను తెప్పించి డాక్టర్ కి చూపెట్టింది. అది 'మెపిడ్రోన్' అనే ఒకరకం మాదక ద్రవ్యమని, చూడడానికి హోమియోపతి మాత్రల్లా ఉంటాయని, మనిషిని ఎల్లవేళలా ఒకరకమైన మత్తులో ఉంచుతూ స్లోగా అవి మెదడుపై ప్రభావం చూపిస్తూ పిచ్చివాళ్లను చేస్తాయని చెప్పాడు. కొద్ది రోజులనుండే తీసుకుంటున్న మూలాన ఇంకా దాని తీవ్రత అంతగా లేదని చెప్పాడు. డాక్టర్ మాటలు విన్న రాధిక తెల్లబోయింది.


బావ తనను మభ్యపెట్టి డబ్బుకోసం మోసం చేసినందుకు బాధపడింది. అర్జున్ ఫ్లైట్ దిగి హాస్పటల్ కి వచ్చేసాడు. అతని అంతరాత్మ అతన్ని నిలకడగా ఉండనీయడంలేదు. రాధికకు తాను చేస్తున్న అన్యాయం అర్ధమైంది. ఏమిటో గిల్టీగా ఉందతనికి. రాధికను తాను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. మనసు చాపల్యంతో తాను దారితప్పడమే కాదు, తన భార్యను పిల్లలను పూర్తిగా విస్మరిస్తున్నాడు.


అర్జున్ ని చూడగానే కీర్తన తన ఆగ్రహావేశాన్ని దాచుకోలేక పోయింది. "చూడండి అర్జున్, అతి చనువు తీసుకుని అంటున్నానని అన్యధా భావించకండి. మా రాధిక భర్తగా మీ మీద నాకు ఎంతో గౌరవం ఉండేది. మీ ఇద్దరిదీ అన్యోన్యమైన సంసారమని మురిసిపోయేదాన్ని. టీన్ ఏజ్ లో ఉన్న ఇద్దరాడపిల్లలను పెట్టుకుని మీరిలా ప్రవర్తించడం బాగుందా? రాధీ మీ ప్రవర్తనకు డిప్రెషన్ కు లోనై డ్రగ్స్ కు అలవాటు పడుతోంది. దానికి ఏదైనా అయి చచ్చిపోయి ఉంటే"?


కీర్తన మాటలకు తృళ్లిపడ్డాడు. అతని కళ్లలో పశ్చాత్తాపం. మనసులో నుండి దుఖం తన్నుకొస్తోంది. "నన్ను క్షమించు రాధీ, మరెప్పుడూ నిన్ను కష్టపెట్టనంటూ" రాధిక భుజాలచూట్టూ చేతులేస్తూ కన్నీళ్లతో తడిపేసాడు. ప్రకాష్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని, అతనికి డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసారు.

***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
79 views0 comments

Comments


bottom of page