'Marokonam' New Telugu Story Written By Dr. Kiran Jammalamadaka
'మరోకోణం' తెలుగు కథ రచన: డా: కిరణ్ జమ్మలమడక
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"నాన్నా నీకు ఆఫీస్ లో ఎలా?"
"ఏంటి ఎలా?"
"నీకు పరుపులు బెడ్ షీట్స్ ఉంటాయా మరి?"
"నాకా ఎందుకు?"
"మరి ఎలా బజ్జొంటావ్ ఆఫీస్ లో? డెస్క్ మీదే బజ్జొంటావా ?"
"లేదు రా! అందరూ నీలానే బజ్జొంటారా ? నువ్వు డే కేర్ లో పడుకుంటావని అందరూ నీలానే పడుకోరురా.. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. నేను ఆఫీస్ కి వెళ్లి బజ్జోను, పని చేసుకుంటాను" అని నవ్వుకుంటూ మా అబ్బాయి ఆరుష్ ని డే కేర్ లో దింపి ఆఫీస్ కి వెళ్ళిపోయాను.
నిజానికి ఆఫీస్ కూడా ఒక చోటు, నా కొడుకు తనకి తెలుసున్న చోటు తో పోల్చుకున్నాడు.
ఆఫీస్ లో ఏ గంట ఎలా గడుస్తుందో నాకే తెలీదు. తోటి వాళ్ళు కాలక్షేపం కబుర్లు దగ్గర నుండి కొత్త సమస్యల దాకా తెస్తూనే వుంటారు, అలవాటు పడ్డాను..
"మీ కౌంటర్ పార్ట్ వొస్తున్నాడంట కదా ! కాస్త వేరే షర్ట్ లో రమ్మనండి, ఆ బ్లాక్ షర్ట్ లో చూడలేకపోతున్నాం " అంది నా కొలీగ్ సౌమ్య, నాకు యెదురొస్తూ.
‘అవును.. జిమ్ వొస్తున్నాడు. ఈ వారం వాడితో భజన తప్పదు’ అనుకుంటూ మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉంటే మేనేజర్ రవి పింగ్ చేసాడు, రమ్మని.
మరుక్షణం రవి కేబిన్ లో వున్నాను నేను.
"జిమ్ వొస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకో! ఎయిర్ పోర్ట్ ప్లాన్ ఏమైనా వుందా?" అని అడిగాడు.
‘నీ సర్వీసెస్ బుద్దులు పోనిచ్చుకున్నావ్ కాదు. ఇప్పుడు నువ్వు ప్రోడక్ట్ కంపెనీ లో వున్నావు, కాసంత ఆలా నడుచుకో’ అని మనసులో అనుకోని
"చూస్తా రవి, ఎర్లీ మార్నింగ్ వొస్తున్నాడు. పైగా గర్ల్ ఫ్రెండ్ తో వొస్తున్నాడు. నేనేం వెడతాను? మనం వెళ్ళినప్పుడు తిన్నావా వచ్చావా అని ఎవడూ అడగరు. వాళ్ళు వొస్తే మాత్రం మనం దణ్ణాలు పెట్టి సాష్టాంగ పడాలి. అయినా ఆలోచిస్తా " అని బయటకు వొచ్చి జిమ్ షెడ్యూల్ ఒక సారి చూసా..
ఇంతలో ఒక పర్సనల్ మెయిల్ వొచింది. దాని సారాంశం ‘జిమ్ గర్ల్ ఫ్రెండ్ తో వొస్తున్నాడంట. ఏదైనా ఎకనామికల్ హోటల్, ఆఫీస్ కి దగ్గర గ ఉండేది చూడమన్నాడు. వీలైతే లడక్ డీటెయిల్స్ సంపాదించమన్నాడు. బుద్ధుడి గుడి రూట్ కూడా.. "
"ఏడిసాడు.. వీడికి ఇండియన్స్ అంటే లోకువ" అనుకోని హోటల్ ఒకటి దగ్గర చూసి డీటెయిల్స్ పంపా. కంపెనీ బస ఒక్కరికే ఇస్తుంది, ఫామిలీ కి ఇవ్వదు. బిజినెస్ ట్రిప్ కదా! ఇంతకీ హైదరాబాద్ లో బుద్దుడి గుడి వుందా? ఎక్కడ? అని ఆలోచిస్తూ, నా టీం ని రోజు కంటే కొంచెం ముందు రమ్మని కోరాను. గట్టిగ చెబితే హైరానా పెట్టానని ఓంబుడ్స్ లో వేస్తారు.
మిగిలిన గెస్ట్స్ వొచ్చినప్పుడు వుండే హుషారు మా టీం లో జిమ్ వొచ్చినప్పుడు కనిపించదు, ఎందుకంటె మిగిలిన వాళ్ళ లాగ వెరైటీ డిషెస్, హోటల్స్, బేర్స్ వీడు కొనుక్కోనీడు రూల్స్ కి విరుద్ధం అంటాడు, కొంత అంటీ ముట్టనట్టు ఉంటాడు కానీ బానే ఉంటాడు. వాడికి టెక్నికల్ గా మంచి గౌరవమే వుంది మా టీం కి.
జిమ్ రావటం నేను చూపిన హోటల్ లో దిగటం, ఆఫీస్ ఫార్మాలిటీస్ అన్ని ముగిసాయి. ఆ రోజు వాడు ఎలాగూ బయటకు రమ్మన్నాడని నెపంతో వాడితో సహా టీంని కాఫీకి తీసుకెళ్ళాను.
"మరీ కాఫీ షాప్ ఏంటి బాబాయ్ " అన్నాడు మా టీం లో ఒకడు.
"ఒక వేళ జిమ్ కంపెనీ క్రెడిట్ కార్డు వాడకపోతే, నేను నా పర్సనల్ క్రెడిట్ కార్డు తీయాలి అదే వేరే, హోటల్ కి వెడితే.. నీవు కూడా ఓ చేయి వెయ్యాలి వొస్తుంది. సరేనా !" అన్నాను నవ్వుతూ.
వాడు సర్దుకొని "ఎందుకులే బాబాయ్.. ఆ డబ్బులే ఉంటే మీ తోటే రావాలా ? నేనే విడిగా ఎంజాయ్ చేస్తా " అని సణిగాడు.
ఇంతలో జిమ్ వాడి గర్ల్ ఫ్రెండ్ తో వొచ్చాడు. వాడి గర్ల్ ఫ్రెండ్ ని కొంత మందికి గర్ల్ ఫ్రెండ్ గాను, కొంతమందికి వైఫ్ గాను పరిచయం చేసాడు, వాడి సందిగ్ధం పాడు గాను.. సహా జీవనం కాబోలు అని నవ్వుకున్నాం. ఆవిడ సరదా సరదాగా మాట్లాడుతోంది. ఎవరికి తోచింది వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. జిమ్ మాత్రం మసాలా టీ ఆర్డర్ ఇచ్చాడు.
చిత్రం ఏమిటంటే వీళ్ళు ఇండియా వొస్తే ఇండియన్ ఫుడ్స్ ఆర్డర్ ఇస్తారు. మనం మాత్రం ఎక్కడికి వెళ్లినా ఇండియన్ ఫుడ్స్ మాత్రమే ఆర్డర్ ఇస్తాం. ఏదేదో పిచ్చ పాటి కబుర్లు చెపుతున్నారు. మాటల్లో ఒకడు సంస్కృతము, లాటిన్ భాషల్లో ఒక్క లాటిన్ నుండే ఎక్కువ పదాలు వొచ్చాయి అంటే కాదు సంస్కృతము నుంచే అని జిమ్ అన్నాడు.
అంతా విజ్ఞాన ప్రదర్శన చేస్తూ ఉంటే నేనూ చెయ్యాలని, అందరినీ నావైపు తిప్పుకోవడానికి "జిమ్! బుద్ధిజం లో విగ్రహారాధన నిషిద్ధం కదా, మరి బుద్దుడి తలలు, విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటారు?", అని మా టీం వైపు గర్వంగా చూసా.
మా టీం కూడా నన్ను మద్దతుగా చూసింది. నేను లీడర్ ని కదా ఆమాత్రం ఉండాలి, అందరం ఇంటికి బయలు దేరుతుండగా మర్నాడు షాపింగ్ కి రమ్మని రిక్వెస్ట్ చేసాడు జిమ్. మా టీం వైపు చూసా ఏ బ్యాచ్లర్ అయినా వెడతారేమోనని, అందరు విననట్టు మొహం పెట్టారు.
"సరే నేను వొస్తా " అన్నాను తప్పక. రోడ్ పక్కనే జిమ్ వాళ్ళని దింపుతూ రేపు ఆఫీస్ దగ్గర కలుద్దామని చెప్పాను ఎందుకంటే వాళ్ళు బస చేసిన హోటల్ లో సరైన పార్కింగ్ సదుపాయం లేదు.
***
మర్నాడు కారులో ఆఫీస్ కి దగ్గరికి టైం కి వొచ్చి జిమ్ కోసం వెయిట్ చేస్తున్నాను. సరైన టైం కె వొస్తాడు జిమ్. ఈ వేళ ఎందుకు రాలేదా అని ఆలోచిస్తూ కారులో ఎసి ఆన్ చేసుకొని కూర్చున్నాను.
ఎండలో జిమ్ తన గర్ల్ ఫ్రెండ్ తో గబా గబా అడుగులు వేసుకుంటూ రావడం కనిపించింది, దగ్గరకు వొచ్చా క జిమ్ "సారీ !హోటల్ ముందు బురదలో జారి పడ్డాను"
"అయ్యో బట్టలు పడిపోయాయి! బట్టలు మార్చుకొని రండి " అన్నాను. ఇండియాని ఏం తిడతాడో ఏంటో అనుకున్నాను.
కానీ వాడు అదేం విష్యం కాదన్నట్టు "నో ప్రాబ్లెమ్ " అన్నాడు.
"నీ కార్ పాడవుతుందనుకుంటా.. నాకు ఓకే పర్వాలేదు.. ఆరిపోయింది గా" అన్నాడు. ఆమె కూడా తలాడించింది.
కార్ లో కూర్చున్న తరువాత ఆమె మరోసారి సారీ చెపుతూ "రాత్రి నిద్రపోలేదు " అంది.
"ఏం" అని అడిగాను.
"హి హాడ్ ఏ బాడ్ స్టమక్ " అంది.
"ఈజ్ హి ఒకే నౌ?" అన్నాను.
"ఎస్ "
"రాత్రి ఏం తీసుకున్నావ్ జిమ్" అని అడిగాను కార్ పోనిస్తూ.
" వీట్ బౌల్స్ విత్ సం హెర్బల్ వాటర్ " అన్నాడు.
నాకు వాళ్ళు చెప్పింది అర్థం కాలేదు. ఈలోగా బయట పానీ పూరి బండి ని చూపించాడు జిమ్ నా మొహం చూసి. నాకు నవ్వు ఆగలేదు.
“ఇంతకీ ఎక్కడికి వెడదాం?” అన్నాను నేను.
దానికి జిమ్, "షర్ట్స్ కొందామని అనుకుంటున్నాను” అన్నాడు.
సరే అని ఇనార్బిట్ మాల్ కి తీసుకెళ్ళాను. కొనుక్కొని, పార్కింగ్ కి రమ్మని చెప్పా. మా సాఫ్ట్వేర్ వాళ్ళు అంతా ఇక్కడే కొంటారు. బాగా విదేశీ లుక్ ఉంటుంది.. అని తీసుకెళ్లా.
బ్రాండ్ షాప్స్ లోకి వెళ్లి బాగా ఖరీదు అని వొచ్చేసారంట. పదిహేను వందలు.. రెండు వేలు లేక పోతే ఎక్కడ దొరుకుతాయి.. వీడు మరీను.. అయినా వీడి సంగతి తెలిసి ఇక్కడికి తీసుకొచ్చాను అని నన్ను నేను తిట్టుకుని దగ్గర్లో వున్నా బిగ్ బజార్ కు తీసుకెళ్ళాను.
ఐదొందలు చొప్పున రెండు షర్ట్స్ తీసుకొన్నాడు, వాడి గర్ల్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసిందట. మా కుర్రాడి చొక్కాయి వెయ్యి రూపాయలు ఉంటుంది, యెంత దొరలైతే ఏంటి చేతులు వెనక్కి పెట్టుకున్నాక!
ఇంతలో జిమ్ దృష్టి ఒక బుద్దుడి విగ్రహం మీద పడింది. కొన్ని నిముషాలు దాని ధర చీటీ చూసి వొచ్చేసాడు.
"విగ్రహం బాగుంది కానీ రేట్ ఎక్కువ” అన్నాడు తన గర్ల్ ఫ్రెండ్ తో ".
"ఇట్స్ ఒకే " అని అంది..
దానికి జిమ్ బుర్ర అడ్డం గా ఊపుతూ షర్ట్స్ పట్టుకొని లైన్ లో బిల్ పే చెయ్యడానికి నుంచొని నా వైపు చూసాడు, దానిని నేను బేరాలుండవ్ అన్నట్టు సైగ చేశాను.
అసలే డ్రైవింగ్ అంటే చిరాకు నాకు. పైగా ఇప్పుడు మహేంద్ర హిల్స్ కు వెళ్ళాలి.. ఇద్దర్ని తొందర పెట్టాను.
"ఏమైనా తీసుకుంటావా" అని తన గర్ల్ ఫ్రెండ్ ని అడిగాడు జిమ్.
ఆమె వద్దు అంది, దొందూ దొందే అని నవ్వుకున్నాను.
మొత్తానికి గుడి కి వెళ్ళాం, చుట్టూ అంతా తిరిగాం. ప్రశాంతం గా వుంది. నాకైతే నిద్ర వొచింది. వాళ్ళు కాసేపు అటూ ఇటు తిరిగారు.
ఆమె నా దగ్గరకు వొచ్చి "గుడి ఆఫీస్ ఎక్కడ?" అని అడిగింది.
ఆ పక్కనే వున్నా స్టాఫ్ ని అడిగి తీసుకెళ్లా.
"వీ వుడ్ లైక్ టు డొనేట్ సం అమౌంట్ " అంది.. ఆ ప్రాసెస్ ఏదో అడిగితె ఓ బుక్ ఇచ్చారు.
వివరాలు రాయమన్నారు, ఆమె వ్రాసి సరిగ్గా వుందా అని నాకిచ్చి చూడమంది.
నేను చూసి వెనక్కి ఇస్తూ.. " అర్ యు షూర్ ఇట్స్ నాట్ హుండ్రెడ్స్? అన్నాను. 2500 కి 25000 వేసిందేమో అని, పొరపాటున ఒక సున్నా ఎక్కువ పడిందేమో అని అడిగా.
తాను దానికి "నో " అని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెక్ అక్కడ ఇచ్చి నమస్కారం పెట్టారు ఇద్దరునూ.
"నా పుట్టిన రోజుకి గిఫ్ట్ ఇచ్చాడు జిమ్. నేను చారిటీ చేద్దాం అంటే ఇండియా లో చేద్దాం అన్నాడు " అంది జిమ్ గర్ల్ ఫ్రెండ్.
నేను ఏమి అనలేదు, అనలేక పోయాను. చాలా సేపు నిశ్శబ్దం గా ఉన్నాక "లడక్ ఎప్పుడు? వన్ వీక్ వెకేషన్ పెట్టినట్టు వున్నావ్ " అన్నాను దారిలో జిమ్ తో.
జిమ్ "వెళ్ళటం లేదు. చార్జీలు నాన్ ఇండియన్స్ కి 4 రేట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు " అన్నాడు.
"నిజమే.. మన జూ లో మనకి ఐదు రూపాయలు ఉంటే, నాన్ ఇండియన్స్ 100 రూపాయలు ఉంటుంది. సరే లే " అన్నాను.
వాళ్ళని ఈసారి మాత్రం హోటల్ దగ్గర డ్రాప్ చేశాను. వాళ్ళు వెళ్లే ఫ్లైట్ డీటెయిల్స్ కనుక్కొని ఇంటికి బయలుదేరా.
ప్రొద్దుటి నుండి జరిగిన సంఘటనలు అన్నీ ఒకదాని వెనక మరొకటి మెదలసాగాయి. నాకూ, నా కొడుకు ఆరుష్ కి ఏమి తేడా కనిపించలేదు. వాడిలాగే అందరూ నాలాగానే వుంటారు అనుకోని ఆలోచిస్తున్నాను.
కానీ జిమ్ కొన్ని గంటల్లోనే నా ఆలోచన విధానాన్ని మార్చాడు తన జీవన దృక్పధం తో..
కార్ నా ప్రమేయం పెద్ద గా లేకుండానే బిగ్ బజార్ ముందు ఆగింది. షాప్ మూసేసే టైం అవ్వటం తో వడి వడి గా లోపలకి వెళ్లి. బుద్ధ విగ్రహాన్ని కొని "ఐ యామ్ డ్రాపింగ్ జిమ్ టు ఎయిర్ పోర్ట్, డోంట్ వెయిట్ ఫర్ మీ " అని నా భార్య కి సందేశం పెట్టి, కార్ లో నా పక్కనే వున్నా బుద్ధ విగ్రహాన్నిచూస్తూ కార్ ని హోటెల్ వైపుకు దూకిచ్చా.
కాఫీ షాప్ లో నేను అడిగిన ప్రశ్న కి జిమ్ చెప్పిన సమాధానం నాకు ఇప్పుడిప్పుడే ఇంకుతోంది..
"బుద్ధిజం ఒక జీవన విధానం. బుద్ధుడు మాకు దేవుడు కాదు. బోధకుడు మాత్రమే.. ఆ బోధనలు దృశ్యం గా చూపటానికి ఈ సింబల్, గుర్తు. అందుకే అతని ప్రతిమలు పెట్టుకుంటాం.. జీవితం లో ఆయన బోధనలు అనుసరించాలని ఇదంతా "
అలా.. ని ఇన్నాళ్లు నేను అనుకోలేదు. ఇప్పుడు నాకర్థం అయ్యింది.
***
కిరణ్ జమ్మలమడక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: Dr: కిరణ్ జమ్మలమడక
కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్స్ చేసి, GE లో సీనియర్ మేనేజర్ గా, భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. కిరణ్ , "స్ప్రింగ్" అనే సంస్థ ను స్థాపించి, తద్వారా విద్యార్థులకు మోటివేషనల్, లైఫ్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూ వుంటారు. తన సంస్థ ద్వారానే కాకుండా పిల్లలు , పెద్దలు ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం తో ముందుకుసాగాలనే ఉద్దేశం తో కథలు రాయటం మొదలుపెట్టారు, ప్రముఖ పత్రికల్లో ఆయన కథలు కొన్ని ప్రచురితమయ్యాయి ,తెలుగు వెలుగు 'కథా- విజయం 2019' పోటీలో భాగంగాఎన్నిక అయ్యిన "మిరప మొక్క " ప్రజాదరణ పొందినది. పదేళ్లలోపు పిల్లల కోసం రాసిన "యాత్ర", పదేళ్ల పైబడినపిల్లల కోసం రాసిన నవల "అతీతం" లను తానా - మంచిపుస్తకం 2021 లో ప్రచురించింది.
Comments