మార్పు కోసం
- Dr. Chilakamarri Srivalli
- Jun 11
- 6 min read
#ChilakamarriSrivalli, #చిలకమర్రిశ్రీవల్లి, #MarpuKosam, #మార్పుకోసం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Marpu Kosam - New Telugu Story Written By - Chilakamarri Srivalli
Published in manatelugukathalu.com on 11/06/2025
మార్పు కోసం - తెలుగు కథ
రచన: చిలకమర్రి శ్రీవల్లి
వేసవి సెలవులు వచ్చేసాయి, మూడవ తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న గోపి, తన తండ్రి కృష్ణతో కలిసి, తాతగారింటికి వెళ్ళడానికి, రైలు యెక్కాడు.
"నాన్నా! రైలు ఇంకా కదలడంలేదేంటి? ఎప్పుడు బయలు దేరుతుంది" అని ఉరకలేస్తున్న వుత్సాహంతో, కిటీకీ లోంచి బయటికి, లోపలికి చూస్తూ, అడిగాడు.
"టైమైంది. నువ్వు తొయ్యడమే ఆలస్యం" అన్నాడు కృష్ణ.
త్వరగా తాత గారింటికి వెళ్ళాలని అనుకుంటూ, రైలు కిటికీ పట్టుకుని, వూ వూ అని శబ్దం చేస్తూ తోస్తూండగా, రైలు బయలుదేరింది. కిటికీ నుంచి, వెనక్కి వెడుతున్న స్టేషన్ని, కదులుతున్న చెట్లూ పొలాలు, వాగులూ వంతెనలను, గోపి సంభ్రమంగా చూస్తూండగా, వారు దిగవల్సిన ఏలూరు స్టేషన్ వచ్చింది. ఆటోలో ఇంటికి వెళ్ళారు.
"తాతయ్యా! నేనొచ్చేసా" అని అరుచుకుంటూ గోపి లోపలికి వెళ్ళి తాతయ్యని కౌగలించుకున్నాడు.
గోపి మాట చెవిన బడగానే అతడి నాయనమ్మ బయటికి వచ్చి, "ఓరి భడవా! వచ్చేసావా! నాన్నా, నువ్వూ స్నానం చేసి రండి. " అని ఆదేశమిచ్చింది.
"ఊహూ! ముందు కథ చెప్పు తాతయ్యా! ఆ తర్వాతే స్నానం" అని మొరాయించాడు గోపి.
"అలా కాదు. ముందు నాయనమ్మ చెప్పినట్లు విని, స్నానం చేసి, భోజనం చేసి వస్తే, ఒకటి కాదు, ఎన్నో కథలు చెబుతాను" అన్నాడు బుజ్జగింపుగా తాతయ్య.
"సరే" అని గోపి పరుగున వెళ్ళి ఒక అరగంటలో అన్ని పనులు పూర్తిచేసుకుని, కథ వినడానికి తాతయ్య దగ్గరకి వచ్చాడు.
@@@
జువాలజీ ప్రొఫెసరుగా రిటైరైన తాతయ్యకి, జంతువులకు సంబంధించిన కథల ద్వారా, మంచి చెడులను, ప్రేమ ఆప్యాయతలను, పిల్లలకి బోధ పడేలా చెప్పడం యెంతో యిష్టం. ఈరోజు రాత్రి కూడా, ఆయన మిత్ర లాభం నీతిగా వున్న, రెండు చేపల కథను గోపికి చెప్పాడు.
కథ విన్న గోపి, "చేప కథ బాగుంది. ఇంతకీ తాతయ్యా, సముద్రంలో బోల్డు చేపలున్నాయి కదా! వాటిలో నీకే చేప అంటే యిష్టం?" అని అడిగాడు.
ఒక్క నిమిషం ఆలోచించించి, "నాకు తిమింగలం అంటే యిష్టం" అని బదులిచ్చాడు తాతయ్య.
"తిమింగలమా? తిమింగలమంటే?"
"వంద అడుగుల పొడుగు, వందటన్నుల బరువు, వుండి, ఈ ప్రపంచంలో అన్ని జీవరాశుల కన్నా పెద్దది, శక్తివంతమైనది, తెలివైనది తిమింగలం. అంత పెద్దది అయినా అది ఎంతో దయగా, శాంతంగా వుంటుంది. ”
"వంద అడుగులా?" అని రెండు చేతులు బారచాచి, ఆశ్చర్యం ప్రకటించాడు గోపి.
"ఆ వంద అడుగులే! ఇంక ఈ రోజు కథ అయిపోయింది కదా! పోయి పడుకో" అని తాతయ్య, గోపిని పంపించివేసాడు.
@@@
రెండు చేపల గురించి కన్నా, తిమింగలం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, గోపి నిద్రపోయాడు. మరునాడు వుదయం నిద్రలేస్తూనే, తాతయ్య దగ్గరికి పరిగెత్తాడు. తాతయ్య వాలు కుర్చీలో పడుకుని పేపరు చదువుతుండడం గమనించి, వెళ్ళి నేలమీద, ఆయన దగ్గర కూర్చుని, తొడమీద తట్టి, "తాతయ్య! తిమింగలం చూపించవా?" అని ముద్దుగా అడిగాడు.
గోపి అభ్యర్ధన విన్న తాతయ్య, పేపరు మడిచి ప్రక్కన బెట్టి, "తిమింగలాలు సముద్రంలో వుంటాయి. మన వూరికి సముద్రం లేదు. విశాఖపట్నమో, చెన్నయ్యో వెళ్ళాలి. " అని ఆప్యాయంగా చెప్పాడు.
"మనం ఇవాళే వెడదాం. ఆలస్యం చేస్తే బడి తెరిచేస్తారు" అని గోపి ప్రాధేయ పూర్వకంగా తాతయ్య చేతులు పట్టుకుని అడిగాడు.
"ఈ సెలవుల్లో వెళ్ళలేం! రైలు టికెట్లు దొరకవుగానీ, ఈ లోగా ఒక పని చెయ్యి. నా దగ్గర తిమింగలం గురించి చెప్పే పుస్తకాలున్నాయి. అవి చూడు. అందులో ఎన్నో బొమ్మలు, విశేషాలు, వుంటాయి”
తాతయ్య సమాధానం గోపికి నచ్చలేదు. కానీ తాతయ్య మాటల్లో, వున్న నిజాన్ని గ్రహించిన అతడు యేమీ చేయలేక, "అలాగే ఇప్పుడు పుస్తకాలివ్వు. నేను వేసవి సెలవులకి వస్తా! అప్పుడు తీసుకుని వెళ్ళాలి. ప్రామిస్" అని తాతయ్య దగ్గర వాగ్దానం తీసుకున్నాడు.
@@@
వేసవు సెలవులు వచ్చాయి కానీ, తిమింగలాన్ని చూడడం కుదరలేదు. తెలిసో, తెలియకో తాతయ్య, తిమింగిలం విశాఖలోనో, చెన్నయిలోనో చూడ వచ్చని చెప్పాడు. కానీ ఆ సముద్ర ప్రాంతాలలో తిమింగలాలు కనబడవని నాన్న చెప్పారు. అదే మాట టీచర్లు కూడా చెప్పారు. దాంతో గోపి హతాశుడయ్యాడు.
అయితే, ఆతనిలో తిమింగలం గురించిన ఆసక్తి కరిగిపోవడం బదులు పెరిగిపోయింది. ఎలాగైనా, తిమింగలాల గురించి బాగా తెలుసుకోవాలి అన్న ఆకాంక్ష, అతనిలో బలపడింది. ఆ కారణంగా అతడు, ఇండియాలో జంతు శాస్త్రాన్ని అభ్యసించి, పరిశోధనకు అమెరికా వెళ్ళాడు. అక్కడ శాంటాక్రూజ్, కాలిఫోర్నియాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లో చేరాడు. అతని అదృష్ట వశాత్తు, ఆ యూనివర్సిటీకి తిమింగిలాల శబ్దశాస్త్రానికి సంబంధించిన అధ్యయన ప్రాజెక్టు చేపట్టేందుకు నిధులు వచ్చాయి.
ఆ అధ్యయన బృందంలోకి గోపిని ఒక సైంటిస్టుగా, తీసుకున్నారు. ఈ అధ్యయనంలో, తిమింగలాలు చేసే శబ్దాల రకాలు, వాటి ఫ్రీక్వెన్సీల వంటి సాంకేతిక విషయాలతో బాటు వాటి ప్రయోజనాలను గురించి పరిశోధన చెయ్యాలి.
విభిన్న అవసరాలకోసం తిమింగిలాలు విభిన్న శబ్దాలను చేస్తాయి. ముఖ్యంగా సంభాషణ, వేట మరియు మార్గ చోదన వంటి మూడు సందర్భాలలో తిమింగలాల శబ్దాలు అసక్తిని కలిగిస్తాయి. ఉదాహరణకు సంభాషణ కోసం చేసే శబ్దాలను "పాటలు" అని, వేట కోసం చేసే శబ్దాలని "కిక్" లని అంటారు. గోపి ఆనందానికి అంతేలేదు.
@@@
తిమింగలాలను చూడటానికైనా, పరిశోధన సాగించడానికైనా అనువైన స్థానం అంటార్కిటికా. వేసవి నెలల్లో అనేక జాతులు క్రమం తప్పకుండా అక్కడికి వలస వస్తాయి. సాధారణంగా కనిపించే హంప్‌బ్యాక్‌లు, మింకే తిమింగలాలు, ఫిన్ తిమింగలాలు మరియు నీలి తిమింగలాల తోపాటు. స్పెర్మ్ తిమింగలాలు మరియు ఓర్కాస్ (కిల్లర్ తిమింగలాలు) వంటి దంతాల తిమింగలాలు కూడా అంటార్కిటిక్ జలాల్లో తమ నివాసాన్ని ఏర్పరుస్తాయి. ఆరు వారాల పాటు ప్రయాణం చేసి కాలిఫోర్నియా యూనివర్సిటీ అధ్యయన బృందం అక్కడికి చేరుకుంది. అక్కడ మూడు వారాల పాటు బస చేసి, తిమింగిలాల శబ్దాలను వినీ, వాటిని రికార్డు చేసి, విశ్లేషణ చేసే పని చేపట్టారు.
మూడు వారాల పాటు ఆ బృందం అనేక రకాలైన శబ్దాలను రికార్డు చేసి, తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. ప్రశాంత వాతావరణంలో కడసారిగా శబ్దాలను రికార్డు చేస్తున్న వారికి ఇబ్బందికరంగా ఒక జపాన్ బృందం అక్కడికి వచ్చి చేరింది. వారెవరా, ఎందుకొచ్చారా అని వీరు తెలుసుకునే అవకాశం ఇవ్వకుండా, వారు కొద్ది దూరంలో వున్న ఒక్క తిమింగలాన్ని లక్ష్యం చేసుకుని ఒక క్షిపణి వదిలారు. ఆ క్షిపణి దెబ్బకు, గాయపడ్డ ఆ తిమింగిలం చేసిన రోదన శబ్దం రికార్డయ్యింది. రికార్డింగ్ వద్ద వున్న జింగ్ అనే పేరుగల చైనా ఇంజినీర్, వులిక్కి పడింది. వ్యధాభరితమైన ఆవేదన ఆమెను ఆవరించింది. గోపి బృందానికి అర్ధమైంది. వారి లక్ష్యం పరిశోధన కాదు. క్రూరంగా తిమింగలాలను వేటాడటం.
ఇంతలో హృదయాన్ని ముక్కలు చేసే ఒక దృశ్యం అవిష్కృతమైంది. ఆ తిమింగిలం రోదన విన్న ఇతర తిమింగలాలు, భయమన్నది లేకుండా వడిగా ఆ తిమింగిలం రక్షణకి వచ్చాయి. నిజానికి ఏ ఒక్క తిమింగిలమైనా దాని తోక ఝాడించి వుంటే అన్ని ఓడలు ఎగిరిపోయేవే. కానీ అవి పరమ శాంత మూర్తులు.. కరుణా హృదయులు. అవి బాధతో చేస్తున్న శబ్దాలు గోపి బృందానికి హృదయ విదారకంగా, ఆ జపాన్ వారికి వుల్లాసకరంగా వున్నాయి. ఏ హృదయమూ లేని రికార్డింగ్ యంత్రం నిర్వికారంగా ఆ శబ్దాలను భద్ర పరుస్తోంది.
కేరింతలు కొడుతూ, అందివచ్చిన అవకాశాన్ని వుపయోగించుకుని జపనీయులు క్షిపణులతో మరో రెండు తిమింగలాలను గాయపరిచి, ఆ మూడింటిని ఓడలో కెక్కించుకుని వెళ్ళిపోయారు. మూగగా కన్నీరు కారుస్తూ తిమింగలాల గుంపు వారి వెనుకనే కొంత దూరం వరకు వెళ్ళాయి. ఇంక అక్కడ వుండలేక గోపి బృందం, రక్తసిక్తమైన ఆ సముద్ర భాగం నుంచి ప్రయాణ మయ్యారు.
@@@
ఓడ సాగుతోంది. రికార్డయిన తిమింగిలాల శబ్దాలను వింటూ బృందం లోని కొంత మంది సభ్యులు వాటిని విశ్లేషణ చేస్తున్నారు. ఆ శబ్దాలను వింటూంటే, గోపి కి గుండె పట్టేసినట్లైంది. పదే పదే ఆ మూడు తిమింగిలాల మరణ కాల రోదన, చెవులలో మార్మోగుతోంది. వికలమనస్కుడై అతడు డెక్ మీదకు వచ్చి, తన ఆలోచనలను వేరే అంశం మీదకు మళ్ళించే ప్రయత్నం చేస్తూ, నడవసాగాడు. కొద్ది దూరం వెళ్ళాక అతనికి జింగ్ యెదురైంది.
“జింగ్! వంట్లో బాగోలేదా? అదోలా వున్నావు?" అని గోపి ప్రశ్నించాడు.
"లేదు గోపి. మనసే బాగోలేదు. ఆ తిమింగిలాల వేట, వాటి రోదన పదే పదే గుర్తుకు వచ్చి మనసుని బాధిస్తున్నాయి. "
"నా పరిస్థితి అదే! అందుకే డెక్ మీదకు వచ్చాను. "
"నాకు బాధతో పాటు ఆశ్చర్యం కలుగుతుంది. తిమింగిలం గుండె నాలుగు మీటర్లు పొడుగు, 180 కిలోల బరువు వుంటుంది, అందుకే అనుకుంటా అది విశాల భావాలతో వుంది. మనది పిడికెడు గుండె. అడుగు పొడవు, 300 గ్రాములబరువూ వున్న గుండె, అందుకే అనుకుంటా సంకుచితంగా వుంటున్నాము. ఏ జీవరాశిని మనిషి స్వేచ్చగా, హాయిగా బ్రతకనివ్వడు కదా!"
“జింగ్! నువ్వన్నది సత్యం. పూర్వం కాశ్మీరంలో మిహిరకులుడనే రాజుండే వాడు. అతనికి ఏనుగులు ఆపదలో వున్నపుడు చేసే ఘీంకారాలంటే ఇష్టం. అందుకని ఏనుగుని కొండ మీదనుంచి క్రిందకు త్రోసి, దాని హాహాకారాలు విని వినోదించే వాడట. మనిషి, జీవరాశుల్లో అత్యంత క్రూరమైన జీవి. "
"నిజమే, స్వార్ధమే పరమార్ధంగా బ్రతకడం, ప్రతి వస్తువుతో వ్యాపారం చేయడం సామాన్యమైపోతోంది. "
జింగ్ బదులు చెప్పే లోపు వారిద్దరినీ లాబ్ కి రమ్మని పిలుపు వచ్చింది. దాంతో సంభాషణ ను ఆపి వారు లోనికి వెళ్ళారు.
@@@
మనసులో బాధను పంచుకుంటే తగ్గుతుందంటారు. గోపి, జింగ్ ల విషయంలో అదే జరిగింది. వారిద్దరూ కొంచెం తేలిక పడిన మనసుతో, ఆలోచించ సాగారు. రాత్రి నిద్రపోయే ముందు అసలు తిమింగలాలను యెందుకు వేటాడుతారు అనే అంశం గురించి గూగుల్ లో శోధించారు. వారికి విస్తుపోయే నిజాలు తెలిసాయి.
మరునాడు సాయంత్రం వారిద్దరూ డెక్ మీద సమావేశమయ్యారు.
"గోపి! నీకిది తెలుసా! తిమింగిలాలను అనేక పదార్దాల వుత్పత్తికి వాడతారు. రకరకాల నూనెలు, పరిమళ ద్రవ్యాలు, కొరడాలు, చేపల వలలు, లాంటి వస్తువులు తయారు చేసే వారు కొందరైతే, దాని మాంసం భుజించే వారు కొందరు. "
"అవును జింగ్! తిమింగిలం నుంచి వచ్చే నూనెను క్షిపణుల తయారీలో వాడతారు. మనిషి ఒక మూగ ప్రాణాన్ని తీసేసి, క్షిపణులని తయారు చేసి, తనని తానే అంతం చేసుకుంటున్నాడు. ”
"అవును కదా! సుగంధ ద్రవ్యాలు, కొవ్వొత్తులు తయారు చేసే స్వార్ధమే కాదు, అంతకన్న మించి తనను తానే నాశనం చేసే మూర్కత్వమూ వుంది. ”
"అసలు ఒక ప్రాణాన్ని తీసే హక్కు మనిషికెవరిచ్చారు? ప్రకృతిలో తిమింగలాలకు ఒక పాత్ర వుండబట్టే, భగవంతుడు వాటిని సృష్టించాడు. ”
“భగవతుడి యందు భక్తి, ప్రకృతి పట్ల గౌరవం కోల్పోయి, మానవత్వంలేని బ్రతుకు నీడుస్తున్నాడు మానవుడు. ”
“జీవితాన్ని తిమింగలాల గురించి ఆధ్యయనం చేయడానికి అంకితం చేసుకున్నాను. కానీ నా కళ్ళ ముందు ఆ తిమింగలాలు బాధతో విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోతూంటే నిస్సహాయంగా చూసాను. “
“బాధపడకు గోపి! అ నాటి నిస్సహాయత నేడొక వుద్యమరూపం దాల్చాలి. ”
“ఏమంటున్నావ్ జింగ్! నలుగురిని మార్చడం కష్టమైన ఈ రోజుల్లో తిమింగలాల కోసం వుద్యమమా?”
ఆ వుద్యమమే. ఆలోచిస్తే మనిషికి అసాధ్యమన్నది లేదు. ఆలోచించు"
@@@
తిరిగి యూనివర్సిటీకి చేరుకున్నాక గోపి, జింగ్ విడివిడిగా తిమింగిలాల గురించి తమ తోటి వారికి చెప్పనారంభించారు. వారిదరూ, మెల్లగా నలుగురయ్యారు. నలుగురు నాలుగు వందలు, నాలుగు వందలు నాలుగు వేలయ్యారు. తిమింగిలం రోదనే మార్పుకి బీజం వేసింది. మనం సంతోషంగా వున్నప్పుడు, ఎక్కడో కొన్ని జీవాలు, స్వార్ధపరుల హింసకు గురై రోదిస్తూ వుంటాయన్న స్పృహ జగతిలో వ్యాపించడం మొదలైంది.
@@@@@
చిలకమర్రి శ్రీవల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: చిలకమర్రి శ్రీవల్లి
జననం మరియు స్కూలు చదువు తిరుపతిలో. పుదుచెర్రీ లో వైద్య విద్యాభ్యాసం పూర్తి చేసి ENT సర్జన్ గా వుంటున్నాను. Head & Neck onco లో సూపర్ స్పెషియాలిటీ చేయాలన్నది నా ఆకాంక్ష. ప్రకృతిని, చెట్లని, జంతువులని ప్రేమిస్తాను. ఆకారణంగా veganism అనే జీవిత విధానాన్ని ఆచరిస్తున్నాను. ఇంగ్లీషు లో కవితలు, కథలు వ్రాయడం నా హాబీ. తెలుగులో ఇది నా తొలి కథ. నాకు అవకాశమిచ్చిన మన తెలుగు కథలు.కామ్ వారికి నా కృతజ్ణతలు.
The author has precisely points out the present selfish nature and the need for change in human thought.kudos to the young author.
తొలి కధలోనే హృదయాన్ని కదిలించేలా కధ రాసిన రచయిత్రికి అభినందనలు
తమ స్వప్రయోజనాల కోసం మానవులు మూగజంతువుల ప్రాణాలను నిర్వికారంగా హరిస్తున్న తీరు ఈ కథలో ఎంతో హృద్యంగా, ఆలోచన కలిగించేలా చిత్రీకరించబడింది.
ఈ విలక్షణమైన కథను అందించిన మహిళా రచయిత్రికి హర్షాతిరేకాలతో అభినందనలు.
Nice
"మనసును తాకే కథ. మానవులు లేని, కానీ చాలా అమాయక జంతువులు ఉన్న ప్రపంచాన్ని ఊహించుకోండి."మహిళా రచయిత్రికి అభినందనలు.Lalitha