top of page

రాగార్చన

#రాగార్చన, #Ragarchana, #KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

Ragarchana - New Telugu Story Written By Narahari Rao Bapuram

Published In manatelugukathalu.com On 10/06/2025

రాగార్చన - తెలుగు కథ

రచన: నరహరి రావు బాపురం

సేకరణ: కర్లపాలెం హనుమంత రావు


(కర్లపాలెం హనుమంత రావు హనుమంతరావు గారు 'బొమ్మకు కథ' ఫేస్ బుక్ పేజీలో నిర్వహిస్తున్న పోటీలో ఈవారం( జూన్ 5 - జూన్ 8 ) బహుమతి పొందిన కథ)


"ఎంత హాయిగా ఉందో ఈ రేయి..." అన్నాడు అనురాగ్.


"అవును" అంది అర్చన.


"నిజం చెప్పాలంటే రాత్రుళ్ళు ఎప్పుడూ హాయిగానే ఉంటాయి. మనమే ఉరుకులు పరుగులతో దినంతో పోటీపడుతూ హాయి గొలిపే రాత్రులను పట్టించుకోవడం లేదు"


"మరే! అందుకేగా నేను ఈ ట్రిప్ ప్లాన్ చేసింది!?" సమాధానమిచ్చింది అర్చన.


"థాంక్స్ మై డియర్!" అనురాగ్ అనడంతో "ఒట్టి థాంక్సేనా!? ఇంకేమీ లేదా ఈ డియర్ కు!?" బుంగమూతి పెట్టింది అర్చన.


"ఓయ్! మనం ప్రకృతిలో ఆరుబయట ఉన్నాం. అదీ కాక ఈ చిన్న బోట్లో! నీ బుంగమూతి అలకలు చూస్తే ఏమేమో చేయాలనిపిస్తుంది. ఆ ఆరాటంలో ఏదైనా జరిగిపోతే!" అన్నాడు అనురాగ్ ప్రేమగా!


"అబ్బాయి గారి ఆరాటం చూడాలనే కదా!?" టీజింగ్ గా అంది అర్చన.


"చూస్తావా మరైతే!..." అంటూ మరింత ముందుకు రాబోయాడు అనురాగ్.


"ఓయ్ అబ్బాయి గారూ! కాస్తాగండీ" అంటూ వెనక్కి నెట్టింది అనురాగ్ ను.


"ఆహ్వాన పత్రాలు అందించేది మీరే! అడ్డంకులు సృష్టించేదీ మీరే!" గునిసాడు అనురాగ్.


"మీకేం బాబూ! ఎక్కడ ఉన్నామని ధ్యాసే ఉండదు... ప్రేమలను ప్రకటించేయడమే! మేమే జాగ్రత్తగా ఉండాలి. బోటబ్బాయి కూడా ఉన్నాడు మనతో పాటు. ఆ విషయం మరచిపోతే ఎలా!?" అంది గుసగుసగా అర్చన.


"ఉంటే ఉండనీ లేవోయ్! అదీ అతను అటు తిరిగి ఉన్నాడు... మనమేం చేస్తున్నామో చూడాలంటే వెనక్కు తిరిగి చూడాలి. వాడికంత సీన్ లేదులే..." అని అనురాగ్ మెల్లగా అంటూండగానే "చూడకపోతే ఏం!? చెవులున్నాయిగా అతనికి. మన మాటలు విని ఏం చేస్తున్నామని వెను తిరిగి చూస్తే!?" అనుమానం వెలిబుచ్చింది. <


"మన భాష వాడికేం అర్థం అవుతుంది!? మనం మన రాష్ట్రం బయటికి వచ్చాం. అయినా మనమేం మైక్ పట్టుకొని మాట్లాడుతున్నామా!? చెవుల దగ్గర గుసగుసలాడుకుంటున్నాం..." నవ్వుతూ కన్ను గీటాడు అనురాగ్.


"అయినా కూడా! అబ్బాయి గారూ! మీరు కాస్త దూరంగానే ఉండండి ప్రస్తుతానికి! మన మకాం చేరిన తర్వాత మీ ప్రతాపం చూపుదురు కానీ..." అంటూ సుతిమెత్తగా సుతారంగా మొట్టింది అర్చన.


"అది సర్లే కానీ... ఈ ప్రయాణం ఏవేవో పాటలు గుర్తుకు తెస్తున్నాయి..."


"ఏవిటో అవి!?"


"లాహిరి లాహిరి లాహిరి లో..." అంటూ రెండు లైన్లు పాడాడు రాగయుక్తంగా!


"సో స్వీట్ అనురాగ్... నీ పేరులోనే ఉంది రాగం. ఎంత బాగా పాడావో!?" మెచ్చుకుంది.


"నీవు నా ప్రియ సఖివి కాబట్టి నా పాట బాగుందని మెచ్చుకుంటున్నావు. మొన్న అదేదో పోటీకి వెళ్ళి పాడితే 'పేరులో రాగం ఉంది కానీ గానంలో రాగమే మిస్సయింది...' అని పంపించేసారు, తెలుసా!?" అన్నాడు కినుకగా.


"పోన్లే! నేను చెబుతున్నాను కదా రాగ్... నీ రాగం అద్భుతమని! అదే ఊపులో ఇంకొన్ని పాటలను పాడుకో! విని తరిస్తాం మేము" అంది రాణీ లాగా పోజు కొడుతూ!


"అలాగే అమ్మాయిగారూ..." అంటూ " ఊహలు గుసగుసలాడె..." అని దాదాపు పాట మొత్తం పాడేసాడు మేల్ వర్షన్...ఫీమేల్ వర్షన్ రెండూ కలగలపి.


"వావ్! సూపరో సూపరు! ఎంత బాగా పాడావో!? మధ్యలో... 'ప్రియా' అని వస్తుంది చూడు, ఎంత మధురంగా వినిపించిందో!?" అంది తన్మయత్వంతో!


"నా ప్రియమణిని తల్చుకొని పాడాను... అందుకే అంత బాగా వచ్చేసింద"ని నాలుక్కరచుకున్నాడు.


చురుగ్గా అనురాగ్ వైపు చూసి "ఎవరా ప్రియమణి!? ఏంటా కథ!?" అని ఆరా తీయసాగింది.


"అయిపోయింది... నీ నుండి ప్రశ్నల వర్షం కురిసిందంటే ఇక హాయైన ఈ రేయి సునామీగా మారిపోతుందంతే!" అని గాభరాగా చుట్టుపక్కల చూస్తూ!


"ఒక రెండు ప్రశ్నలు వేసానో లేదో!? ప్రశ్నల వర్షమా!? పో... నీతో మాట్లాడను పో!" అంది అర్చన.


"బాబ్బాబూ! అలా బుంగమూతి పెట్టకే! ఇంతకు ముందే చెప్పాను... ఏదైనా జరిగిపోవచ్చనీ!" అంటూండగానే "అనురాగూ! మాట మార్చకు... ఇంతకూ పియమణి ఎవరూ!?"


"ఇద్దరు వారు. ఒక్కరు కాదు..." అంటూ మళ్ళీ నాలుక్కరచుకున్నాడు అనురాగ్.


"ఇద్దరా!?" కీచుగా అడిగింది.


"అవును... ప్రియ, మణి..." అంటూ 'అంతలోనే మర్చిపోతే ఎలా!? మనం పరిచయం కాకముందు నీ పేరేంటో తెలీక 'ప్రియా' అంటూ పలకరించాను కదా! మన పెళ్ళైన తర్వాత ఆ 'ప్రియ' కు 'మణి' చేర్చి 'ప్రియమణీ' అని పిల్చాను ఓ సారి... నీవు నా జీవితానికి లభించిన శ్రేష్ఠ 'మణి'వని..." అంటూండగానే "అది సరే! మర్చిపోయాను కానీ ఈ 'శ్రేష్ఠ' ఎవరూ!?" అడిగింది ఆత్రంగా!


"శ్రేష్ఠ నా!? ఆ పేరెందుకొచ్చింది ఇప్పుడు!!" అడిగాడు.


"నువ్వే అన్నావుగా...'శ్రేష్ఠ మణి' అని! ఇంతకు ముందు లాగే ఇక్కడా రెండు పేర్లున్నాయేమోనని!?" అంటూ ఆగింది.


"అయినా మీ ఆడాళ్ళు ఉన్నారు చూడూ... మొదట అనుమానం పుట్టి ఆ తర్వాత మీరు పుట్టి ఉంటారు. ప్రతి దానికీ అనుమానమే! ఆరాలూనూ! నేనేదో ఇంపార్టెంట్ అని అర్థం వచ్చేలా 'శ్రేష్ఠ మణి' అంటే!? అది కూడా అమ్మాయి పేరనుకున్నావా!? హతవిధీ!!" అన్నాడు.


అతని మొహం చూసి నవ్వేసింది అర్చన. "తమాషాగా అన్నాను లేవోయ్!" అంది.


"నాకు తెలుసు...నేనూ సరదాగా అన్నాను" అన్నాడు నవ్వుతూ.


"ఇందాక పాటలేవో పాడుతున్నారు. టాపిక్ డైవర్ట్ అయి ఇటు వచ్చేసాం..." అంది.


"ఔను కదా! ...'వెన్నెలా... వెన్నెలా... మెల్లగా రావే..." అంటూ పాడగానే "ఐ సింప్లీ లవ్ దిస్ సాంగ్" అంది.


"అవును... నాక్కూడా చాలా ఇష్టం" అన్నాడు ఆకాశం వైపు చూస్తూ.


"అరే! అటు చూడు...మూన్ బో! ఎంత బాగుందో!?" అన్నాడు ఆకాశంలో ఇంకోవైపు చూపిస్తూ!


"మూన్ బో నా!? ఎక్కడ!?" అంటూ అతను చూపించిన వైపు చూసింది.


"అబ్బ! ఎంత బాగుందో!?... నేను మూన్ బో చూడ్డం ఇదే మొదటిసారి! అయినా నీకెలా తెలుసు!?... మూన్ బో అని!?" అడిగింది.


"ఎక్కడో చదివాను...పగలు కనిపించే రెయిన్ బో లాగే రాత్రుళ్ళు జలపాతాలు, తేలికపాటి వర్షం ఉండి పరిస్థితులు <


అనుకూలంగా ఉన్నప్పుడు మూన్ బొ కనిపిస్తుందని!" చెప్పాడు అనురాగ్.


"దిస్ ఈజ్ ఎ ఫాసినేటింగ్ ఎక్స్పీరియన్స్... మూన్ బో ను, అదీ నువ్వు పక్కన ఉండగా చూడటం..." అంది సంతోషంగా.


ఆ సంతోషాన్ని చూసి మనసులోనే మురిసిపోయాడు అనురాగ్.


"ఏం ఊహల్లో తేలానో ఏమో!?..." అంటూ పాటనందుకున్నాడు. ఇలా పాటల వెల్లువ పోటెత్తిందక్కడ!


"చాలా బాగుంది రాగ్... నీ పాటలు... ఓహ్... ఈ జీవితం అంతా ఇలాగే గడచిపోతే బాగుంటుందనిపిస్తుంది" అంది అర్చన మైమరపుతో!


"ఇలానే కాదు... ఇంతకంటే బాగా గడిచిపోతుంది. ట్రస్ట్ మీ డియర్" అని అర్చన చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు అనురాగ్.


ఒకసారి అనురాగ్ వైపు ప్రేమగా చూసింది అర్చన. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.


"ఐ లవ్ యూ రాగ్" అంది ఎమోషనల్ గా!


"ఐ టూ మై డియర్. అందుకేగా దేవేరిని ఇంతవరకూ పాటలతో అర్చించాను..." ప్రేమగా అన్నాడు అనురాగ్.


తనూ నవ్వుతూ"పాటార్చనా!?" అంది అర్చన.


"అవును...దేవేరి అర్చన గారికి నా పాటలతో గళార్చన..." అంటూంటే "ఊహూ! రాగ్! ఆ పదమేంటో సింక్ కావడం లేదు... 'ప్రేమార్చన' అవుతే బాగుంటుంది!" అంది అర్చన.


"వావ్!" అన్నాడు అనురాగ్.


"వెయిట్...వెయిట్...రాగ్! అంతకంటే ఇంకో మంచి పదం దొరికింది నాకు..." ఎక్సైటింగ్ గా అంది అర్చన.


"చెప్పు మరి!" అదే ఎక్సైటింగ్ తో అడిగాడు అనురాగ్.


"చెప్పనా! మరి చెప్పేస్తున్నా..." అంటూ ఆగింది.


"ఊరించకే నన్నిలా..." అంటూ రాగయుక్తంగా అన్నాడు అనురాగ్.


"రాగార్చన" అంది ప్రేమతో! "డబుల్ వావ్...అంటే ఈ 'రాగ్' దేవేరి 'అర్చన'ను ప్రసన్నం చేసుకోవడానికి చేసిన అర్చనే 'రాగార్చన'. సింప్లీ సుపర్బ్" అన్నాడు అనురాగ్.


అంతలో బోట్ ఒడ్డుకు చేరింది.


ఇద్దరూ తీరం దగ్గర దిగారు.


బోట్ అతనికి డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తుంటే అతను "అయ్యా! ఇందాకా మీరు 'వెన్నెలవే...వెన్నెలవే...అనే పాట పాడటం మర్చిపోయారు" అన్నాడు అచ్చ తెలుగులో!


"నీకు తెలుగు వచ్చా!?" విస్మయంగా అడిగాడు.


"నేను తెలుగోడినే అయ్యా! ఇక్కడకు వచ్చి సెటిల్ అయ్యాం మేము తాత ముత్తాతల తరం నుండీ" అన్నాడు. "ఔనా!" అన్నాడు అనురాగ్.


'ఇంత వరకూ మన మాటలన్నీ అతను విన్నాడని... అర్థం చేసుకున్నాడనీ' ఒక విధంగా ఎంబరాసింగ్ గా ఫీలయింది అర్చన.


అర్చనను చూసి నవ్వుతూ అతని వైపు తిరిగి "అట్లయితే మేం ఇంకో మూడు రోజులు ఉంటాం ఇక్కడ. ఎటూ నీకు తెలుగు వచ్చు కాబట్టి నీవు మాకు ఇక్కడ అన్ని ప్రదేశాలు చూపించాలి" అన్నాడు అనురాగ్. "సరే అయ్యా!" అన్నాడతను.


అనురాగ్, అర్చన ఇద్దరూ కలసి కాటేజ్ వైపుకు నడిచారు.


ముందర ఉన్న కిచెన్ లో తినడానికి ఆర్డర్ ఇచ్చేసి తమ కాటేజ్ లోకి వచ్చేసారు.


ఇద్దరూ ఫ్రెష్ అప్ అయి మాట్లాడుతూ కూర్చున్నారు. అంతలో ఇచ్చిన ఆర్డర్ వచ్చేసింది.


ఇద్దరూ కలసి తిన్నారు.


"ఇక్కడ ఈరోజు మొదటి రోజైనా చాలా బాగా గడచింది" అన్నాడు అనురాగ్ బెడ్ పైన వాలుతూ. అక్కడ తిన్నది అంతా క్లీన్ చేసేసిన అర్చన"అవును" అంది అనురాగ్ పక్కన చేరుతూ!


"థాంక్యూ రాగ్" అంది ప్రేమగా!


"ఫర్ వాట్!!" అన్నాడు అనురాగ్.


"ఫర్ ఎవ్రీథింగ్!" అంది అర్చన.


అంటూండగానే ఆమె కనులలో నీళ్ళు తిరిగాయి.


అది చూసి "హేయ్! వాట్ హాపెండ్!? ఇప్పుడైతే ఈ రోజు బాగా గడిచింది అనుకున్నాం. అప్పుడే ఇదేంటి!?" అన్నాడు అర్చనను మరింత దగ్గరగా తీసుకుంటూ.


"జరిగినదంతా తలుచుకుంటుంటే..." అని ఏదో అంటూంటే "అవన్నీ మరచిపోయి హాయిగా ఎంజాయ్ చేయాలనేగా "అవుననుకో రాగ్! అయినా అంత ఈజీగా మర్చిపోడానికి అవుతుందా!?" అడిగింది అర్చన.


"అవదు, కానీ మన ప్రయత్నం మనం చేద్దాం... మర్చిపోడానికి. పరిస్థితులతో రాజీ కుదుర్చుకుందాం!" అన్నాడు.


"అదే ఎలా!?" అడిగింది.


"ఎలా అంటే ఏం చెప్పను!? నీకు పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు అని డాక్టర్లు డయాగ్నైజ్ చేసి చెప్పినప్పటి నుంచి నీవు ఇలాగే 'లో ఫీలవుతున్నావు. అర్చూ! డాక్టర్లు చెప్పేదంతా జరిగితీరాలని రూలేం లేదు. మన విషయంలో ఏదన్నా మిరాకిల్ జరగవచ్చు..." అని అనురాగ్ అంటూండగానే "ఎలా రాగ్!?" అంది నిరాశగా!


"చూడు అర్చూ! లోకంలో ఎన్నో మిరాకిల్స్ జరుగుతుంటాయి. అంతెందుకు... అసలు మాటలు రావు అన్న వ్యక్తికి మాటలు వచ్చిన సందర్భం నేను నా చిన్నప్పుడు చూసాను..."


అర్చన కళ్ళతోనే ప్రశ్నించింది...'ఎలా!?' అని.


"మా ఊర్లో సతీష్ అనే వ్యక్తి ఉండేవాడు... దాదాపు ఇరవై ఏళ్ళు ఉంటాయతనికి. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నానప్పుడు. ఒకసారి మా ఊర్లో ఉన్న రాములోరి గుడికి స్వామీజీ వచ్చారు. గుడికి వచ్చే జనాలకు రామకోటి రాయమని చెప్పేవారు ఆయన. కానీ ఒకరోజు సతీష్ తో 'శ్రీరామ' అని అనమని చెప్పారు. సతీష్ పలకలేక పోయాడు. అక్కడ ఉన్నవాళ్ళు 'స్వామీ! వాడికి మాటలు రావు' అన్నారు. 'ఎందుకు రావు!?' అంటూ సతీష్ తో 'శ్రీరామ' అనమని పదే పదే చెప్పడంతో సతీష్ ప్రయత్నించి ప్రయత్నించి చివరకు 'శ్రీరామ' అన్నాడు. ఊర్లో అందరికీ ఆశ్చర్యమే! నాకిప్పుడు అనిపించింది...'ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే' అని..." అంటూ ఆగాడు అనురాగ్.


"నీవు చెబుతూంటే 'ఏదైనా ఎందుకు సాధ్యం కాదు' అని నాకూ అనిపిస్తోంది" అంది అర్చన ఉద్వేగంగా!


"అదే నేనూ చెప్పేది... మన విషయంలో! మనమేం ముసలివాళ్ళం కాలేదు. ఏదైనా మిరాకిల్ జరిగి పిల్లలు పుట్టవచ్చు మనకు. అదే ఆశతో ఉందాం. ఒకవేళ పుట్టకపోయినా పర్లేదు... మనం ఒక బాబును, ఒక పాపను దత్తత తీసుకుందాం!" అన్నాడు అనురాగ్.


"సరే! అలాగే చేద్దాం రాగ్! థాంక్యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సపోర్ట్!" అంది అర్చన.


"నీకొక్కదానికే కాదు... నేను నాక్కూడా సపోర్ట్ ఇచ్చుకుంటున్నాను, నీకిస్తూ! మొత్తానికి మనిద్దరికీ సపోర్ట్ అన్న మాట..."


అంటూ అర్చనను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు అనురాగ్. అర్చన కూడా ఇక భవిష్యత్తు గురించి చింత వదలి అనురాగ్ కౌగిలిలో నిశ్చింతగా ఒదిగిపోయింది.

***

కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

కర్లపాలెం హనుమంతరావు -పరిచయం


రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.

 


Comments


bottom of page