top of page

మార్పు


'Marpu' New Telugu Story(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ప్రకాష్ ఒక బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్. నిజాయితీ కి పెట్టింది పేరు. లోన్ అప్లికేషన్ చూడగానే, లోను యిస్తే తిరిగి వస్తుందా, రాదా అని కచ్చితంగా చెప్పగలడని పై అధికారులలో యితనంటే అభిమానం.


రెండు మూడు పెద్ద బ్రాంచిలలో పని చేసినతరువాత, ప్రకాష్ ని మేనేజర్ గా ప్రమోషన్ యిచ్చి, ఒక పల్లెటూరు లో కొత్త బ్రాంచికి పంపించారు.


ఇతను విజయవాడ నుంచి వెళ్లిపోతున్నాడని తెలిసి, ఇతని వలన ఉపకారం పొందిన పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ మేనేజర్లను ప్రకాష్ ఇంటికి పెద్ద బహుమతులు తో పంపించారు.


తల్లిదండ్రుల నుంచి వచ్చిన నిజాయతీ వలన వాళ్లందరికీ, “నేను రూల్స్ ప్రకారం మాత్రమే పని చేశాను. ప్రత్యేకంగా ఎవరికీ రూల్స్ కి విరుద్ధంగా ఉపకారం చేయలేదు. నేను యిటువంటి బహుమతులు తీసుకోను”అని చెప్పి, వీళ్ళని పంపిన యాజమాన్యం కి ఫోన్ చేసి, “దయవుంచి నిజాయితీ గా వుంటే ఎటువంటి బహుమతులు, డబ్బులు ఎవరికీ ఇవ్వక్కరలేదు. అందుచేత మీరు పంపిన బహుమతులు నేను స్వీకరించలేను” అని చెప్పి పంపించేసాడు.


తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని ఒక మంచిరోజున ఆ పల్లెటూరు బ్రాంచ్ లో జాయిన్ అయ్యాడు. పల్లెటూరు అయినా పంట పొలాలతో వున్న ఊరు. తన బ్యాంకు కాకుండా యింకో ప్రవేట్ బ్యాంకు కూడా వుంది ఆ ఊళ్ళో.


ఒకసారి తనే స్టాఫ్ అందరిని పరిచయం చేసుకుని, తను పని చేసి వచ్చిన బ్రాంచిలు గురించి, తను పని చేసే విధానం, అలాగే స్టాఫ్ నుంచి నిజాయితీ గా కష్టపడే తత్వం ఆశిస్తానని చెప్పి వెళ్లి తన ఛాంబర్ లో కూర్చొని పని మొదలుపెట్టాడు ప్రకాష్.

తన రూమ్ నుంచి చూస్తే బ్యాంకు స్టాఫ్ మొత్తం కనిపించే విధంగా తన సీట్ అమర్చుకున్నాడు.


కొత్తగా వచ్చిన ప్రతీ వాడు మనకి నీతులు చెపుతారు అంటున్న క్యాషియర్ మూర్తి ని నోటితో హెచ్చరిక చేసాడు అసిస్టెంట్ మేనేజర్ రామారావు. కొత్త బ్రాంచ్ అవడం వలన కస్టమర్స్ ఎక్కువ రావడం లేదు. అకౌంట్స్ కూడా ఎక్కువ లేవు. దానితో ప్రకాష్, అసిస్టెంట్ మేనేజర్ రామారావు తప్ప అందరూ లంచ్ టైం అవగానే బ్యాంకు నుంచి వెళ్లిపోతున్నారు.


స్టాఫ్ చాలా మంది అక్కడకి దగ్గర లో వున్న టౌన్లో వుంటున్నారు.

పరిస్థితి గ్రహించిన ప్రకాష్, ఆలా వెళ్లిపోయే స్టాఫ్ ని పిలిచి, “యిహనుంచి సాయంత్రం ఆరుగంటల వరకు అందరూ బ్యాంకులో ఉండాలి” అని చెప్పాడు.


“పనిలేనప్పుడు వూరికే ఎందుకు సార్ కూర్చొని గోళ్లు గిల్లుకోవడం” అన్నాడు క్యాష్ గుమస్తా మూర్తి.


“అయితే మీకు పనిలేదా, అయితే మిమ్మల్ని తీసివేయమని పై ఆఫీసర్స్ కి రాస్తాను” అన్నాడు కోపంగా ప్రకాష్.


“సారి సార్, పొరపాటున అన్నాను. యిహ నుంచి బ్యాంకు టైమ్ అయ్యే వరకు పని చేస్తాం” అని అన్నాడు మూర్తి.


యిలా అద్దాల రూమ్ లో కూర్చొని వుంటే లాభం లేదని, ఒక సీనియర్ క్లర్క్ మురళి ని వెంటపెట్టుకుని ఒక రోజు ఆ ఊరు మాజీ మునసబు గారిని కలిసి, తమ బ్యాంకు గురించి, తమ బ్యాంకులో రైతులకు యిచ్చే లోన్స్ గురించి వివరించి ఆయన సహకారం ఆడిగాడు.

దానికి ఆయన, “అయ్యా ప్రకాష్ గారు! నేను మాజీ అయిన తరువాత నన్ను గుర్తు పెట్టుకున్న వారే లేరు. నేను పదవి కి మాజీ అయినా ఈ చుట్టుపక్కల వున్న పొలాల్లో సగం నావే. మా పూర్వీకుల నుంచి మాది జమిందారి కుటుంబం. తప్పకుండా నేను, నాకు తెలిసిన వారి చేత మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తాము. ఈ ఊరు లో షుగర్ కేన్ ఎక్కువ. తప్పకుండా రైతులకి మీరు ఉపయోగ పడితే, రైతులు మీ బ్యాంకుకి ఉపయోగ పడతారు” అని అన్నాడు.


పనిలో పని విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ని కూడా కలిసి సహకారం అడిగాడు. తిరిగి బ్యాంకుకి వస్తోవుండగా, ప్రకాష్ తో వచ్చిన క్లర్క్, “మనకెందుకు సార్ వీళ్ళని బ్రతిమలాడటం, ఈ ఊరు వాళ్ళు అంతగా ఉపయోగం పడరు సార్” అన్నాడు.


“ఈ ఊరుని నమ్ముకునే బ్యాంకు పెట్టారు, మనకి జీతాలు యిస్తున్నారు. మన ప్రయత్నం మనం చేసి, మనం తీసుకునే జీతానికి నాయ్యం చేయాలి, నిరాశ పడకండి” అని హితవు పలికాడు.


మేనేజర్ గారే అంత శ్రమ పడుతోవుంటే, తను యిలా మాట్లాడటం తగదు అనుకుని, “సార్! నేను కూడా నా సాయశక్తుల మీతో కలిసి పనిచేస్తాను, యింతవరకు మీలాంటి మేనేజర్ గారిని చూడలేదు” అన్నాడు క్లర్క్ మురళి.


రెండు రోజుల తరువాత, మురళి, మేనేజర్ ప్రకాష్ దగ్గరికి వచ్చి, “సార్! మీ ప్రయత్నం పలించింది. ఈ ఒక్కరోజే 15 కొత్త అకౌంట్స్, ముప్పై లక్షలు డిపాజిట్ వచ్చింది” అన్నాడు. "ఆ మునసబు గారే పది లక్షలతో అకౌంట్ ఓపెన్ చేసారు సార్, నేను అసిస్టెంట్ మేనేజర్ గారు ఆయన ఇంటికి వెళ్లి సంతకాలు తీసుకున్నాము” అన్నాడు క్లర్క్ మురళి.


“సంతోషం, నేను కూడా మునసబు గారికి కృతజ్ఞతలు తెలియచేస్తాను” అన్నాడు ప్రకాష్.


అయితే రోజు ఎవరో ఒకరు రావడం, వెంటనే వెళ్లిపోతో వుండటం గమనించి, అటెండర్ ని పిలిచి తన కుర్చీని బ్యాంకు స్టాఫ్ మధ్యలో వేయమని చెప్పి తను కూడా వాళ్ళతో పాటే కూర్చున్నాడు. లంచ్ టైములో వాళ్ళందరిని పిలిచి, “యిహ నుంచి మీకు ఎవరికైన పని ఎక్కువ గా వుంటే నాకు పంపండి, నేను కూడా సహాయం చేస్తాను. మనం అందరం ఈ ఊరి ప్రజల కోసం పనిచేస్తున్నామని గుర్తుపెట్టుకోండి” అని చెప్పాడు ప్రకాష్.


“మీరు ఏసీ రూమ్ వదిలి యిక్కడ కూర్చోవడం ఎందుకు సార్? అన్నాడు క్యాష్ క్లర్క్.

రోజు రోజు కి బిజినెస్ పెరుగుతోంది, రైతులు కూడా లోన్స్ తీసుకుని, పంట డబ్బు రాగానే తీర్చేస్తున్నారు.


ఆ రోజు శనివారం అవడంతో పని ఎక్కువగా లేదు. అసిస్టెంట్ మేనేజర్, క్లర్క్ మురళి కొత్త వాళ్ళని కలవడం కొరకు పక్క గ్రామంలోకి వెళ్లారు.


బ్యాంకు టైమ్ క్లోజ్ అవడం తో క్యాష్ క్లర్క్ క్యాష్ ని లెక్క చూసుకుంటున్నాడు. మిగిలిన లోన్స్ చూసే క్లర్క్ తన టేబుల్ సర్దుకుని బయలుదేరాటానికి సిద్ధం అయ్యాడు.

ప్రకాష్ తన రూంలోకి వెళ్లి పై ఆఫీస్ కి పంపించాలిసిన రిపోర్టులు టైపు చేసుకుంటున్నాడు.


అప్పుడు ఒక అతను కంగారుగా బ్యాంకు లోకి వచ్చి క్యాష్ క్లర్క్ కి చెక్కు యిచ్చి అర్జెంటుగా డబ్బు ఇవ్వమని ఆడిగాడు.

“బ్యాంకు టైమ్ అయిపొయింది అండి. సోమవారం రమ్మ”ని చెక్కు వెనక్కి యిచ్చేసాడు క్యాష్ క్లర్క్.


“అయ్యా! మా అబ్బాయి కి గుండెపోటు వచ్చింది, హాస్పిటల్ వాళ్ళు ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. మీరు డబ్బు యిస్తే నేను పట్నం వెళ్లి హాస్పిటల్ లో డబ్బు కట్టాలి, కాదనకండి” అని బ్రతిమలాడినా కనికరించలేదు క్యాష్ క్లర్క్ మూర్తి.


బయట ఏదో మాటలు వినిపించడంతో, మెసేజెస్ పంపడం ఆపి బయటకు వచ్చి ఏమిటి అన్నాడు ప్రకాష్.


“చూడండి సార్, బ్యాంకు టైమ్ అయిపొయింది, క్యాష్ అకౌంట్ క్లోజ్ కూడా చేసాను. యిప్పుడు తీరిగ్గా వచ్చి డబ్బు కావలి అని అడుగుతున్నాడు” అన్నాడు మూర్తి.


“మీరు నా రూమ్ లోకి రండి” అని ఆ కస్టమర్ ని తనతో తీసుకుని వెళ్లి అతని చేతిలోని చెక్కు తీసుకుని అతని అకౌంట్లో ఎంత బాలన్స్ వుందో చూసి ఆశ్చర్య పోయాడు. అతని సేవింగ్స్ అకౌంట్ లోపదిలక్షల అమౌంట్ వుంది.


అతనిని కూర్చోమని చెప్పి, “మీరు బ్యాంకు టైమ్ అయిపోయిన తరువాత వచ్చి అయిదు లక్షలకి చెక్కు యిచ్చి డబ్బు కావాలంటే ఎలా?” అన్నాడు ప్రకాష్.


“బ్యాంకు మూసేసే టైం తెలుసు సార్, టౌన్ లో వున్న మా అబ్బాయి కి హార్ట్ ఎటాక్ వచ్చింది. పెద్ద హాస్పిటల్ లో ఆపరేషన్ చేయాలి, రక్తం కూడా కావాలి. అక్కడినుంచి వచ్చేసరికి లేట్ అయ్యింది సార్. దయచేసి మీరు చెప్పి డబ్బు ఇప్పించండి” అన్నాడు ఏవో కాగితాలు చూపించబోతో.


“అక్కరలేదు, వుండండి యిప్పుడే డబ్బు యిస్తాము” అని ప్రకాష్ క్యాషియర్ ని పిలిచి, “అతని దగ్గర చెక్కు తీసుకుని, వెంటనే క్యాష్ యిచ్చి పంపండి” అన్నాడు.


“క్యాష్ క్లోజ్ చేసాను సార్, యిప్పుడు ఇవ్వలేను” అన్నాడు మూర్తి.


“ఆహా సరే.. యిదిగో నేను చెక్కు పాస్ చేసి చెక్కు మీద రాస్తున్నాను. క్యాష్ యిచ్చి పంపండి. లేదంటే నీపై యాక్షన్ తీసుకోవాలిసివస్తుంది” అన్నాడు.


అప్పుడే లోపలికి వచ్చిన అసిస్టెంట్ మేనేజర్ తో “వెంటనే ఆయన కి మూర్తి క్యాష్ ఇవ్వకపోతే, క్యాష్ మీరు హ్యాండోవర్ చేసుకుని ఆ పెద్దాయన కి డబ్బు యిచ్చి పంపించండి. ఆయన డబ్బు, వాళ్ళ అబ్బాయి ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన కి యివ్వలేకపోతె, బ్యాంకు కే అవమానం. మనం బ్యాంకులో వుండగానే వచ్చి ఆడిగాడు. రూల్స్ ప్రాణాలు పోతున్నప్పుడు కాదు” అని కోపంగా అరిచాడు ప్రకాష్.


దానితో భయపడి, మూర్తి ఆయనకు డబ్బు యిచ్చి లెక్క రాసుకుని, మిగిలిన క్యాష్, చెక్కులు క్యాష్ చెస్ట్ లో పెట్టి మేనేజర్ గారి రూంలోకి వచ్చి, “సార్! చాలా మంది టైమ్ అయిన తరువాత వచ్చి క్యాష్ అడగటం చూసి, ఇతనూ అంతే అనుకున్నాను, కాని, అతని కొడుకు విషయం తెలుసుకుని, నామీద నాకే అసహ్యం వేసింది. మీరు చెప్పినట్టు రూల్స్ తో ప్రాణాలు తీయడం పాపం సార్. అవసరంకి ఉపయోగ పడనప్పుడు, అతను డబ్బు మన బ్యాంకులో దాచుకోవడం ఎందుకు” అన్న మూర్తి ని చూసి, ‘సెభాష్ మూర్తి’ అన్నాడు ప్రకాష్, అతని భుజం మీద చెయ్యి వేసి బయటకు నడుస్తూ.


శనివారం సాయంత్రం బ్యాంకు ఎలాగో లేదు కాబట్టి, టౌన్ కి వెళ్లి కావలిసిన వస్తువులు కొనుకుందామని బయలుదేరి వెళ్ళాడు ప్రకాష్. టౌన్ లోకి రాగానే ఉదయం వచ్చిన పెద్దాయన అబ్బాయి గురించి గుర్తుకు వచ్చి అక్కడ వున్న ఒకే ఒక్క హార్ట్ హాస్పిటల్ లోకి వెళ్ళాడు. లోపలికి వెళ్లి రిసెప్షన్ దగ్గర నుంచుని వున్నాడు. ఇంతలో బ్లడ్ ల్యాబ్ నుంచి మూర్తి, యింకో అతను చేతిని రుద్దుకుంటో వస్తున్నారు.


కంగారు గా, “ఏమైంది మూర్తి నీకు?” అన్నాడు ప్రకాష్. మేనేజర్ గారిని చూడగానే, “నమస్కారం సార్! నేను బాగానే వున్నాను. ఉదయం వచ్చినప్పుడు పెద్దాయన చెప్పారు, వాళ్ళ అబ్బాయి కి బి పాజిటివ్ బ్లడ్ కావాలి, అందుకు ప్రయత్నం చేస్తున్నా అని. నాది బి పాజిటివ్ బ్లడ్ అవడం తో, మా ఫ్రెండ్ ది కూడా అదే గ్రూప్ అవడంతో యిద్దరం కలిసి బ్లడ్ డొనేట్ చేసాము సార్” అన్నాడు.

“మంచి పని చేసారు, పదా..ఆ పెద్దాయన ని పలకరించి వద్దాము” అన్నాడు ప్రకాష్.

ఆపరేషన్ రూమ్ ముందు విచారం గా కూర్చొని వున్న పెద్దాయన, వీళ్ళని చూసి నిలబడి, “మూర్తి సమయానికి రక్తం యివ్వడం వలన పెద్ద యిబ్బంది తప్పింది సార్. యిహ అంతా దేముడి దయ, ఆపరేషన్ అవుతోంది” అన్నాడు.

ఆయన రెండు చేతులు పట్టుకుని, “భయపడకండి. మీ అబ్బాయి పూర్తి ఆరోగ్యం తో బయటకు వస్తాడు. ఏ అవసరం వున్నా నా నెంబర్ కి ఫోన్ చేయండి” అన్నాడు.

“సార్! రేవు ఎలాగో బ్యాంకు లేదు కాబట్టి నేను మీతో సహాయంగా హాస్పిటల్ లో వుంటాను” అన్నాడు మూర్తి.

మూర్తిలో ఈ మంచి మార్పు కి, ప్రకాష్ తన కృషి ఫలించింది అనుకున్నాడు.

శుభం

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Podcast Link


Twitter Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.44 views0 comments

Comments


bottom of page