top of page

మాతృ భాష


'Mathru Bhasha' - New Telugu Article Written By Sudarsana Rao Pochampally

'మాతృ భాష' తెలుగు వ్యాసం

రచన : సుదర్శన రావు పోచంపల్లి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


మానవులు పుట్టి పెరుగుచున్న కాలములోనే వారి వారి భావనలు ఒకరికొకరు తెలుపుటకు, పరస్పరము అర్థము చేసుకొనుటకు ఒక భాష అవసరమేర్పడింది. ఐతే ఆ భాష మొదట నేర్చుకున్నది తల్లి నుండే. అందుకొరకే భాషను స్త్రీ గా భావిస్తారు. అదే మాతృ భాష లేదా తన్నుడి భాష అంటారు. అంటే భాష ఎప్పుడు ఏర్పడిందంటే మానవుడు పుట్టిన నాటి నుండే. ఈ విశాలమైన భూ ప్రపంచములో నైసర్గికముగా మానవ జీవనానికి ఎన్నో ప్రాంతాలు ఏర్పడ్డాయి- ఆయా ప్రాంతాలలో జన్మించిన మానవుల భావనల ప్రకటనకు వారినుండే సృష్టించ బడిన సాధనమే భాష. అదే మాతృ భాష.


ప్రపంచములో దాదాపు 7000 పై భాషలలో మాట్లాడుకుంటారు. అందులో సాధారణంగా 12 భాషలు ఎక్కువ జనము ఉపయోగిస్తారు.


1. ఇంగ్లీషు. 2. మాండారియన్(చైనీయులు) 3. హింది. 4. స్పానిష్. 5. ఫ్రెంచ్. 6. అరేబియన్. 7. బెంగాలి. 8. రష్యన్. 9. పోర్చ్ గీస్. 10. ఇండోనీషియన్. 11. ఉర్దు. 12. జెర్మనీ.


భారత దేశములో దాదాపు 3000 పై వివిధ భాషలలో జనము మాట్లాడుకుంటారు. అందులో కొన్ని అంతరించి పోయినవని గణాంక వివరాల ద్వారా తెలుస్తున్నది. ఆకాశంలో నక్షత్రాల మాదిరి కొన్ని భాషలు అప్పుడప్పుడు పుడుతూ అంతరించుచూ ఉంటాయి. అధిక జనాభా ఉపయోగించే భారతీయ భాషలు- 1. హింది. 2. బెంగాలి. 3. సంస్కృతము. 4. పంజాబి. 5. కన్నడం. 6. మళయాళం. 7. తుళు. 8. తమిళం. 9. మరాఠి. 10. ఒరియా. 11. ఉర్దు. 12. కాశ్మీరి. 13. సింధి. 14. కొంకణి. 15. అస్సామి. 16. గుజరాతి. 17. తెలుగు.


భాష (నుడి) ప్రపంచములోని ప్రతి మానవుడు తన ఆలోచనలను ఇతరులకు తెలియజేయడానికి- ఇతరుల ఆలోచనలను తాను గ్రహించడానికి ఉపయోగించు మాధ్యమమే నుడి. భాషకు లిపి, భాషా సూత్రాలు, వ్యాకరణము, సాహిత్యము మున్నగునవి ముఖ్యమైన అంశాలు. మన తెలంగాణాకు తోడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వాడేది తెలుగు భాష - ఆంధ్రము అను పేరు ఉన్నా ఆంధ్ర ప్రదేశ్ వారు తెలంగాణాతో(01-11-1956 నుండి 01-06-2014 వరకు ) కలసి జీవించడము చే వారు కూడా ఆంధ్రము నకు బదులు తెలుగు అనే వ్యవహరిస్తున్నారు.


తెలుగును అజంతా భాష అంటారు. ఈ తెలుగు మధ్య ద్రావిడ భాషనుండి ఉద్భవించిందంటారు. తెలంగాణాలో అల్ప సంఖ్యాకుల భాషలు- కోయ, . గోండి, . సవర, పర్ణి, . కుపియ లేదా వాల్మీకి, . (హైదరాబాద్-మహబూబ్ నగర్), ఎరుకల(నిజామాబాద్-కరీం నగర్), . కుయి-(ఖమ్మం), . ఆందీ (హైదరాబాద్-ఆదిలాబాద్), . లంబాడీ లేదా గోర్మతి లేదా బంజారా (వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్).


అభ్యాసము, విద్య, పేదరికము కారణాలవల్ల అలాంటి జనము చాలామటుకు తెలుగు మాట్లాడలేక పోతున్నారు. తెలుగు భాష మూల పురుషులు ఏనాదులు- పురాతన తత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీన్యత 2400 సంవత్సరాల నాటిదంటారు. ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వము కొన్ని శతాబ్దాల వెనుకకు మనము తెలుసుకోవచ్చు. కాని తెలుగు చరిత్రను మనము క్రీ. శ. 6 వ శతాబ్దమునుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించ వచ్చును. ఈ భాష ఎప్పుడు పుట్టింది అని చెప్పనలవికాదు- కాకపోతె మనిషి ఈ ప్రాంతములో ఎప్పుడు పుట్టిందో భాష అప్పుడే పుట్టి ఉండవచ్చు. కాలక్రమేణ అవసరాల కనుగుణంగా సంస్కరిచబడ్డది అనుకోవచ్చు.


పరమేశ్వరుని డమరుక నాదమునుండి ఉద్భవించినదే సంస్కృతము అంటారు. సంస్కృతము హిందు, బౌద్ధ, జైనులకు ప్రధాన భాష. సంస్కృతానికి అమరవాణి- దేవభాష- సురభాష- గీర్వాణిభాష మొదలగు పేర్లున్నాయి.


శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారు- కాలక్రమేణ ఇది బ్రహ్మీ లిపిలో రూపాంతరము చెందింది. ఆ తరువాత దేవనాగరిక లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా తెలుగు లిపి, తమిళ లిపి, బెంగాలి లిపి, గుజరాతి లిపి, శారదా లిపి అనేక ఇతర లిపులు ఉద్భవించాయి. మన తెలుగు భాష ‘దేశ భాషలందు తెలుగులెస్స’ అని కీర్తించబడింది.


వినుకొండ వల్లభ రాయుడు అనునతడు 15 వ శతాబ్దిలో తెలుగు పై పలికిన పద్యము..


‘జనని సంస్కృతంబు సకల భాషలకును

దేశ భాషలందు తెలుగు లెస్స

జగతి దల్లికంటె సౌభాగ్య సంపద

మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే'


అని వల్లించినాడు.


అట్లనే ఆంధ్ర భోజుడుగా కీర్తింపబడిన కన్నడ ప్రభువు శ్రీ కృష్ణ దేవరాయలు కూడా-


తెలుగదేలయన్న దేశంబు తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

ఎల్ల నృపులు గొల్వ ఎరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగు లెస్స.


అని అతని నోట పలికిన మాట. తెలుగు భాష ఎంతో ప్రాశస్తము చెందినది. దాదాపు రెండు వందల ఏండ్లు ఆంగ్లేయులు మన దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలన చేస్తూ వారి భాష మనపై రుద్దిపోయినారు- ఆ జాడ్యము మనకంటుకొని ఆ భాష పట్ల వ్యామోహము పెరిగింది- ఇంకొక కారణ మేమిటంటే చాలా మటుకు జనం ఆంగ్లములో మాట్లాడితే గొప్పగా భావించుట- అన్య దేశమరిగి ఉద్యోగము చేసి అధిక సొమ్ము గడించుట -పెద్ద చదువులు చదువుటకు మన దేశములో సరియైన వసతులు లేక పోవుట మున్నగు కారణాల వల్ల ఆంగ్ల భాషకు ఆకర్షితులై తల్లి భాష యగు తెలుగుకు ఒక రకంగా ద్రోహము చేసినట్టే-


ఆంగ్ల భాష మీద ఆధార పడకుండా ఎన్నో దేశాలు తమ మనుగడ సాగిస్తున్నాయి అవి- -


1. చైనా, 2. రష్యా, 3. జపాన్, 4. ఫ్రాన్స్, 5. జర్మనీ, 6. నెదర్లాండ్, 7. స్వీడన్, 8. డెన్మార్క్, 9. టర్కీ, 10. ఇజ్రాయిల్, 11. ఇటలీ, 12. ఈజిప్ట్, 13. నార్వే, 14. బ్రెజిల్, 15. సౌత్ కొరియా, 16. నార్త్ కొరియా, 17. మొరాకో, 18. పోలాండ్. 19. స్పెయిన్, 20. పోర్చుగల్, 21. తుర్కెమెనిస్తాన్, 22. తైవాన్, 23. ఉజ్బెకిస్తాన్. 24. సోవేనియా, 25. సోవేకియా, 26. మంగోలియా, 27. అర్జంటీనా, 28. యెమెన్, 29. ఉగాండా, 30. చీలి, 31. కొలంబియా. 32. సౌదీ, 33. ఇరాన్, 34. ఇరాక్, 35. అల్జీరియా, 36. అజెర్బైజాన్, 37. గాంబియా, 38. అంగోలియా, 39. సిరియా, 40. బెల్జియం, 41. భూటాన్, 42. కంబోడియా, 43. థాయ్ లాండ్. 44. క్యూబా, 45. ఫిన్లాండ్. 46. జార్జియా, 47. కజికిస్తాన్ మొదలయినవి.


బ్రిటిష్ వారికి ఒక సారి చాకిరీ చేసినమని జీవితాంతము- తరతరాలు వారి భాషనే పట్టుక వ్రేలాడడము ఎంతవరకు సబబు? మన భాష మన భావ ప్రకటన తెలుపగా. ఇతర భాషలు అన్య ప్రాంతాల సంస్కృతిని తెలిపే సాధనం మాత్రమే. బ్రతుకు తెరువు కొరకు భాషే ప్రమాణమైతే మన మాతృ భాషణే ఇంకా అభివృద్ధి పరచి అన్య దేశాల వైపు చూడకుండా ఉన్న దేశములోనే వనరులు సృష్టించ వచ్చుగదా. ఇతర దేశీయులు అభివృద్ధి చెంది మనకు ఉద్యోగాలు ఈయ గలిగినప్పుడు ఎన్నో ప్రకృతి వనరులు గలిగి సువిశాలమైన జనాభాకు కొదువలేకుండా ఉన్న మన దేశములో గాని, రాష్ట్రములో గాని సంపత్తిని సృష్టించ లేరా.


ఆ ఆలోచన గలిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తము కావాలి. ఇతర దేశస్తులు మన దేశమును ఆకర్షించేటట్లు ఉండాలి గాని పర దేశపు బ్రతుకు కొరకు ఎవరికి వారే వారే మాతృ భాషను మరచుట స్వార్థ పరులగుట గర్హనీయము. ఎందుకీ పరాధీనత. భేషజ శూన్యాన్య భాషాభిమానం-


ప్రాచ్య దేశమని ప్రాశస్తము గలిగి

అప్రాచ్యపు అలవాటులు బొందుచు,

పలుకుల తల్లికి పరిపరి విధముల

ములుకులు గుచ్చే పలుకులు బలుకుట


తెలుగు నేలపై వెలుగులు జిందే

తెలంగాణ తల్లి వెల వెల బోవగ

భాషావేశం భావోద్రేకం భేషజమసలు లేశం లేక

ఎంగిలి పలుకుల ఇంగిలీషుతో


తల్లీ తండ్రీ గురువును సైతం

తప్పని యెంచక మమ్మీ డాడీ మాస్టారంటూ

అన్నా తమ్ముడు అక్కా చెల్లెలు మరియింకెందరొ మనవారైనా

ఆంటీ అంకుల్ సిస్టర్ బ్రదర్ లాంటివి ఎన్నో పదములు వాడుచు


భాషకు తోడుగ వేషం మార్చి

భవితలొ ఉండే మన ఉనికిని తలువక

పూర్వ చరిత్రకు పూజ్యం జుట్టి

నేర్చే భాషలొ నేర్పరి గా లేకయు గూడ


మార్పే గోరుచు అలవాటులు నేర్చే భావన

అటునిటు గాక త్రిశంకు స్వర్గం

తిప్పలు దప్పవు మన తెలంగాణ తల్లి కి

తేజం తరిగెడి రోజులు వచ్చును తస్మాత్ జాగ్రత్త-----


తేనెలొలుకు పలుకులీనీ తెలుగు నందే బీజాక్షరములు ఇమిడి యుండునీ, తెలుగునందే అన్య భాషలకన్న మన్నన ఈ తెలుగు నందే బవిరి అక్షరములతొ తళుకారు ఈ తెలుగునందే. సాహిత్యం. ప్రాచీన జ్ఞాన సంపదైన వేదాలు, ఇతిహాసాలైన రామాయణము, భారతము, ఉపనిషత్తులు, మనుస్మృతి, వాస్తు శాస్త్రము, అర్థ శాస్త్రములు మొదలయినవన్ని సంస్కృతములో వ్రాయబడినవే -


మధ్య యుగాల్లో తెలుగు కవులు సంస్కృత సాహిత్య పుస్తకాలను తెలుగు భాషలోకి అనువదించునప్పుడు ఎన్నో సంస్కృత పదాలు తెలుగు భాషలో చేరాయి. అలాగే ఇతర ద్రావిడ భాషలపై సంస్కృత భాష ప్రభావము ఎంతైనా ఉన్నది. తెలుగు భాషలో కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం, మేఘ దూతం- శూద్రకుడు రచించిన మృఛ్చకటికము- భానుడు రచించిన స్వప్న వాసవ దత్తము- శ్రీ హర్షుడు వ్రాసిన రత్నావళి- వాత్సాయనుడు వ్రాసిన కామ సూత్రములు మొదలైనవి ప్రసిద్ధి చెందిన అనువాద గ్రంథములు.


ఆమ్మా ఓ అమ్మా మా తల్లీ

నిను అమ్మీ మమ్మీ అనలేనమ్మా

తెలుగును వదలి తెగులును తగిలి

మలినముతో నే మనలేనమ్మా

ఓంకారోద్భవ బీజాక్షరాలే ఓనమాలుగ దిద్దితినమ్మా


అక్క చెల్లెలు అన్నా తమ్ముల

పర భాషలో పలుకుట యేలా

పవిత్ర భావం వదులుట యేలా

కోయిల గొంతులొ కోమల మెంతో

తెలుగు భాషలొ తినలేనంత తీయదనం

మథుర మంజుల మనోజ్ఞ మై

అధరాలదిరే లాస్య విలాసమై

అమృత బిందువులలదుకొని అక్షర రూపం దాల్చిన

జన కుక్షి ని నింపిన చెప్పన్నాక్షర చేవ రక్షణ కాదా

జన సమ్రక్షణ కాదా

అమ్మా ఓ అమ్మా మా తల్లీ

నిను అమ్మీ మమ్మీ అనలేనమ్మా--


ఇదీ తెలుగు భాష పట్ల గౌరవమున్న నేటి తరము బాలల ఆలోచనా సరళి.

అమ్మ చేతి వంటకం కమ్మనైన ఏడవ రుచి-

మాతృభాష మాథుర్యం ఎనిమిదవ రుచి.


ఇవి అస్వాదిద్దాం- భవిష్యత్ కు బంగారు బాటలు వేద్దాం- తెలుగు భాషామ తల్లికి హస్తార్పణము తో--

సమాప్తం

పోచంపల్లి సుదర్శన రావు.

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


50 views0 comments

Commentaires


bottom of page