మాతృదేవోభవ
- Neeraja Prabhala
- May 11
- 2 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #Mathrudevobhava, #మాతృదేవోభవ

Mathrudevobhava - New Telugu Poem Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 11/05/2025
మాతృదేవోభవ - తెలుగు కవిత
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
నిత్యం మనం అమ్మని స్మరించుకుంటూ తల్లిని పూజించాలి. ఆవిడని పూజించకపోయినా ఫరవాలేదు ఆమెనీ, ఆమె మనసుని ఏమాత్రం నొప్పించకుండా ప్రేమానురాగాలను అందిస్తూ కడదాకా కంటికిరెప్పలా చూసుకుంటే అంతకన్నా అమ్మకు ఇంకేం కావాలి ?
దేవతే మరో రూపంలో అమ్మగా మనకు దర్శనమిస్తున్నది. దేవుడు తనకు మారుగా అమ్మను సృష్టించాడు.
కనిపించే, కని పెంచే ప్రత్యక్ష దైవం అమ్మ. అనిర్వచనీయమైన రూపం అమ్మ.
"అమ్మ" అన్నది అమృతము.అమ్మతనము లోనే ఉంది ఆ కమ్మదనము. అప్పుడే స్ర్తీ జన్మకు పరిపూర్ణత సిధ్ధిస్తుంది.
అమ్మను గురించి ఏం చెప్పగలము? ఎంత చెప్పినా తక్కువే. అసలు చెప్పనలవికాదు. అది అనంతం.ఎన్ని జన్మలెత్తినా తల్లి ఋణమును తీర్చుకోలేము.🙏 తీర్చనలవి కాదు.
నవమాసాలు మోసి తను మరో జన్మ (ప్రసవం అంటే మరో జన్మ) ఎత్తి మనల్ని ఈ భూమి మీదకు తెచ్చి తన పొత్తిళ్ళలో పదిలంగా పొదుపుకుని గుండెలకు హత్తుకుని తనివితీరా ముద్దాడి, అప్పటిదాకా తను అనుభవించిన ప్రసవ వేదనను మర్చిపోయి ఈ ప్రపంచాన్నే గెలిచినంత సంతోషంతో బిడ్డను చూసి మురిసిపోతుంది అమ్మ. అంత అల్ప సంతోషి అమ్మ.
అమ్మ పొత్తిళ్లలోని ఆ వెచ్చదనము, ఆ హాయిని కడదాకా మనం మర్చిపోలేము. అమ్మ ప్రేమకు కొలమానం లేదు. అది అమూల్యము. అనితరసాధ్యం.
ఆకాశమంత విశాలమైన హృదయము, భూదేవి అంత ఓర్పు, సహనం కల ప్రేమానురాగ దేవత అమ్మ. బిడ్డకు చనుపాలిచ్చి, లాలించి, పోషించి, గోరుముద్దలను తినిపిస్తూ వాడి ఆటపాటలను చూసి మురిసిపోతూ, తప్పటడుగులు వేయకుండా, పడిపోకుండా వాడి చిటికిన వేలును పట్టుకుని నడిపించే మార్గదర్శి అమ్మ.
నిద్రాహారాలు మాని తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా అహర్నిశలు బిడ్డ ఆరోగ్యం కోసం తపిస్తూ వాడి ఆకలిని తీర్చే అన్నపూర్ణ అమ్మ.
బిడ్డను ప్రేమగా తన ఒడిలో కూర్చోబెట్టుకుని పలక మీద "ఓంనమశ్శివాయ" అంటూ వాడి చేత నోటితో పలికిస్తూ బలపం చేత తొలిపలుకులను వ్రాయించే సరస్వతి అమ్మ.
బిడ్డ ప్రయోజకుడై వృధ్ధిలోకి రావాలని ముక్కోటి దేవతలను ప్రార్ధిస్తుంది అమ్మ. వాడి అభ్యున్నతిని చూసి సంతోషంతో ఉప్పొంగిపోతూ మనసారా దీవిస్తుంది. అమ్మ. అమ్మ దీవెన తప్పక ఫలిస్తుంది.
జీవితంలో ఎన్ని ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా వాటినన్నిటినీ అధిగమించి తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా కంటికి రెప్పలా బిడ్డను కాపాడుకుంటూ తుది దాకా బిడ్డ కోసమే బ్రతుకుతూ తనువు చాలిస్తుంది అమ్మ. దేవతే మరో రూపంలో అమ్మగా మనకు దర్శనమిస్తున్నది.
" మాతృదేవోభవ" అని మనం తొలిగా నమస్కరించేది అమ్మకే. అటు వంటి అమ్మను గూర్చి ఎంత చెప్పినా తక్కువే. అద్వితీయము, అనిర్వచనీయమైన రూపం అమ్మ. అమ్మను మరిచి పోతే మనకు ఉనికే ఉండదు.
ఈ సృష్టిలో తన కోసం ఏప్రతిఫలము ఆశించని ప్రాణి ఏదైనా ఉందంటే అమ్మ ఒక్కత్తే. అటువంటి అమ్మకు మనం ఎప్పుడూ ఋణపడి ఉంటాము. ఎన్ని జన్మలెత్తినా అమ్మ ఋణం తీర్చుకోలేము. తీర్చనలవి కాదు. అది జన్మజన్మల బంధం.
దేహం ఒడలి వృధ్ధాప్యదశ వచ్చి, అనారోగ్యం దాపురించి మృత్యువు దరిచేర బోతోందని తెలుస్తున్నా బిడ్డ యోగక్షేమాలకై పరితపించే అనురాగ దేవత అమ్మ.
బిడ్డ ఆస్తి అంతస్తులను అమ్మ ఆశించదు. కడదాకా చిటికెడు ప్రేమ, కూసింత ఆదరణను కోరుకుంటుంది.
నేటి యాంత్రిక జీవన విధానంలో అవి కనుమరుగై వృధ్ధాశ్రమాలు, అనాధాశ్రమాలలో అమ్మలు చేరబడుతున్నారు. నిజంగా అది చాలా బాధాకరం. దురదృష్టకరం. ఆస్ధితిని తలుచుకుంటుంటే గుండె బరువెక్కుతోంది.
ఈ విశాల విశ్వంలో చెడ్డవాళ్లైన పిల్లలు ఉండవచ్చేమో కానీ చెడ్డతల్లి మాత్రం ఎక్కడా ఉండదు. అమ్మ అంటే దేవత.
పిల్లలు “అమ్మా” అని ప్రేమగా పిలుస్తూ గుప్పెడు మెతుకులు అమ్మకు పెడితే కొండంత సంతోషంతో నిండునూరేళ్లు ఆరోగ్యంగా బ్రతుకుతుంది అమ్మ.
సంతోషం సగం బలం. ఇంక ప్రపంచంలో వృధ్ధాశ్రమాలు, అనాధాశ్రమాలకు తావుండదు.
హిమవత్పర్వతమంత చల్లని మనసు కలది అమ్మ. ఆ మేరునగరి నీడలో మనమంతా ఎప్పటికీ పిల్లలమే.
మన మదిలో దేవతలా కొలువై ఎల్లవేళలా పూజలందుకుని మనల్ని ఆశీర్వదిస్తూ ప్రగతి పధాన ముందుకు నడిపిస్తుంది అమ్మ.🙏
అమ్మలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం.🙏

-నీరజ హరి ప్రభల
Comments