top of page

మాతృదేవోభవ


' matrudevobhava' written by Neeraja Hari Prabhala

రచన : నీరజ హరి ప్రభల

అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.


అమ్మ!

"అమ్మ" అనేది వాస్తవం. "నాన్న" అనేది నమ్మకం.

దేవుడు తనకు మారుగా "అమ్మ”ని సృష్టించాడు.

కనిపించే ప్రత్యక్ష దైవమే "అమ్మ"

నవమాసాలు మోసి మరో జన్మ ఎత్తి (ప్రసవం) మనలను సృష్టించేది 'అమ్మ'

తన అందమైన పొత్తిళ్ళలో జాగ్రత్తగా పొదుపుకుని 'నేనున్నానంటూ' వెచ్చని రక్షణ ఇచ్చి భద్రతను, ధైర్యాన్ని ఇచ్చేదే 'అమ్మ '

ఆ స్పర్శ అనుభూతి, ఆ పిలుపు మాధుర్యం అనిర్వచనీయం - అమితానందం.

ఈ భూమి మీద కనులు తెరిచి ప్రతి ప్రాణి తొలిగా చూసేది ' అమ్మనే'

'అమ్మ' అనే పిలుపు ఓ కమ్మని రసాస్వాదన. ఆ పిలుపు మధువులోని మాధుర్య మకరందాన్ని గ్రోలుతున్న తుమ్మెదలే మనము. అనంతకోటి జీవ సృష్టిలో మనిషికే వాక్ శక్తి ఉంది.

మన తొలి పలుకు "అమ్మ". తొలి అడుగులు' అమ్మ' తోనే.

తప్పటడుగులు వేసి పడిపోతామని మనల్ని చేయి పట్టుకొని నడిపించే దైవమే "అమ్మ."

పీడకలలతో కలత నిదుర చెంది తృళ్ళి పడితే అమ్మ కలవరపడి మన నుదుటి మీద తన చల్లని చేతితో స్పృశించి కమ్మని జోలపాటతో నిదురబుచ్చేదే 'అమ్మ'.

అక్షరాభ్యాసం నాడు తొలి అక్షరం ' అ - అమ్మ' అని వ్రాసి ,దానిని దిద్ది ఆ తల్లి దీవెనలతో విద్యా వంతులయి, ప్రజ్ఞాపాటవాలతో జీవితంలో అత్యున్నతస్థాయి లో వ్రృధ్ధిచెందుతాడు బిడ్డ.

అత్యున్నత హిమశిఖరమంత ఔన్నత్యం కలది అమ్మ. ఆ మేరువు నీడలో ఎదిగి " ఎదిగిన కొద్దీ ఒదగమని " నేర్పుతుంది "అమ్మ".

మహరాజుకైనా-మట్టి మనిషి కైనా తల్లి ప్రేమ ఒకటే.

వార్థక్యంలో కూడా మనకోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని నిద్ర కాచి "అయ్యో! బిడ్డ ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడ ఉన్నాడో, ఏమన్నా తిన్నాడో లేదో " అని అనుక్షణం ఆదుర్దాతో వీధిగుమ్మం వేపు పదే పదే ఎదురుచూసేదే అమ్మ.

అనుక్షణం మన భవితకోసం తాపత్రయ పడి తన జీవితాన్నే పణంగా పెట్టి ప్రాణ త్యాగానికైనా సిధ్ధపడి మనల్ని బ్రతికించే దేవతే "అమ్మ".

"శతాయుష్మాన్ భవ " అని తన అమ్రృత హస్తాలతో నూరేళ్లు ఆయుర్దాయం పోసి చల్లని దీవెనలిచ్చే దేవతే అమ్మ.

గాయం తగిలినా, మ్రృత్యువు దరిచేరుతున్నా బాథతో విలవిల లాడుతూ అప్రయత్నంగా అయినా "అమ్మ" అనే పిలుస్తాము ఆ తల్లి మనల్ని రక్షిస్తుందని.

ఏ బంధమైనా స్వార్థం కోరుతుంది కానీ తల్లి ప్రేమ బంధం స్వార్ధం కోరదు.అలా ఆవిడ ఏనాటికీ ఆశించదు కూడా. అమ్మ అంటే అదే మరి!

ఈ స్రృష్టి లో దుర్మార్గులైన పిల్లలు ఉండవచ్చు కానీ దుర్మార్గులైన తల్లులు ఎక్కడా కానరారు.

ఏ ఋణమైనా తీర్చుకోగలం కానీ తల్లిదండ్రుల ఋణం తీర్చుకోలేము.

వార్థక్యంలో వాళ్లు మనకు భారమని వ్రృథ్థాశ్రమాలకు పంపకుండా కడదాకా కంటికి రెప్పలా కాపాడుకుని, సంతోష పెడితే కొంతవరకైనా వాళ్ళ ఋణం తీర్చుకోగలం.

అమ్మ ఉన్నప్పుడు అమ్మ విలువ తెలీలేదు. ఆవిడ భౌతికంగా దూరమయ్యాక కానీ ఆవిడ విలువ, ఆలోటు తెలుస్తోంది.

ఎన్ని నిధులున్నా తరగని పెన్నిథి అమ్మ.

అమూల్యమైన సన్నిధి అమ్మ.

మాత్రృదేవోభవ.🙏🙏


రచయిత్రి పరిచయం :


"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని . చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గ్రృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు .మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ... ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను .నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి.గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ..నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం..అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏


116 views0 comments
bottom of page