'Memu Saitham' - New Telugu Story Written By Thirumalasri
'మేము సైతం' తెలుగు కథ
రచన: తిరుమలశ్రీ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
తెల్లవారితే లయ పరీక్షాఫలితాలు వస్తాయి. ఆ రాత్రి కౌముది కంటి పైకి కునుకు రావడంలేదు. ఓ పక్క ఉత్కంఠ, మరోపక్క ఆందోళన. లయ ఆమె కూతురు. తెలివైనది. బాగా చదువుతుంది. తప్పక విజయం సాధించుతుందన్న నమ్మకం ఉంది. ఐనా, సహజసిద్ధమైన ఆత్రుత మదిలో. అందుకే నిద్ర ఆమెతో దోబూచులాడుతోంది. లయ మాత్రం హాయిగా నిద్రపోతోంది, చీకూ చింతా లేకుండా. ఆప్యాయంగా తల నిమురుతూ వుండిపోయింది కౌముది..
*
మౌనిక, రఘురామ్ లది మేనరికం. రఘురామ్ అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఆడిటర్ గానూ, మౌనిక స్టేట్ సెక్రెటేరియట్ లో సెక్షన్ ఆఫీసరుగానూ పనిచేస్తున్నారు. వారి తొలిచూలు సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ‘కౌముది’ అని పేరు పెట్టుకున్నారు, ఆ పిల్ల రాకతో తమ జీవితాలు వెన్నెలమయమవుతాయని కాబోలు. కౌముదిని ఎంతో గారాబంగా చూసుకునేవారు.
ఎగిరే పక్షి రెక్కల్ని క్రిందకు పైకి ఊపుతున్నట్టు, కౌముది తన చేతుల్ని ఫ్ల్యాప్ చేస్తుంటే ముద్దుగా అనిపించి నవ్వుకునేవారు దంపతులు. సాధారణంగా ప్రాకడం రాగానే పిల్లలు ఒకచోట ఉండకుండా ఇల్లంతా తిరిగేస్తూ చేతికి అందినదల్లా పట్టుకుని లాగేస్తుంటారు. కాని, కౌముది అలా కాక నోటిలో వ్రేలు పెట్టుకుని చీకుతూ ఓచోట కుదురుగా కూర్చునేది. తమ చిన్నారి బుద్ధిమంతురాలని మురిసిపోయేవారు.
ఐతే, పాపకు ఏడాదిన్నర వయసు వచ్చేసరికి మౌనిక మదిలో ఏదో అనుమానం పొడసూపింది. ఆ వయసులో ఉండే పిల్లలకు భిన్నంగా కనిపించేది పాప. పసిపాపలు చేసే శబ్దాలు– ‘ఊఁ..ఉంగా..’ వంటివి లేవు. బొమ్మలు, లక్కపిడతలు ముందుపడేసినా వాటిని పట్టించుకోదు! ఆటలు, పాటలు, సంగీతం– దేనిపట్లా ఆసక్తి కనపరచదు. బోసినవ్వులు కాని, కేరింతాలు కాని లేవు. ఎదుటివారి చూపుల్లో చూపులు కలపదు. కితకితలు పెట్టినా స్పందించదు. ఎత్తుకోమని చేతులు చాచడం కానీ, పేరుపెట్టి పిలిచినా పలకడంకానీ చేయదు. ముందుకూ వెనక్కీ ఊగుతుంటుంది గుర్రం ఎక్కినట్టు. తరచు చేతివ్రేళ్ళను విదిలిస్తుంటుంది. గిరగిరా తిరుగుతుంది. దీపాల వంక తేరిపారజూస్తుంది.. వింత వింతగా ప్రవర్తిస్తుంది.
ఎందుకైనా మంచిదని, వైద్యపరీక్షలు జరిపిస్తే పాప ఆరోగ్యం బాగానే ఉందనీ, వినికిడి కూడా సవ్యంగానే ఉందనీ చెప్పారు డాక్టర్లు.. కాని, ఆ వయసు పిల్లలలో ఉండవలసిన ఎదుగుదల, చురుకుదనం, అవగాహనాశక్తి కనిపించేవికావు. మాటలు కూడా ఆలస్యంగా రావడమే కాక, వాటిలో తడబాటు, అస్పష్టత గోచరించేవి..పాపకు ఏడాదిన్నర వయసు వచ్చేసరికి ఆ పిల్ల సాధారణ ఎదుగుదలకు, ప్రవర్తనకు భిన్నంగా ఉన్నట్టు నిర్ధారించుకున్నారు..వైద్యనిపుణులచేత పరీక్షలు చేయించగా తేలిందేమిటంటే – కౌముది నార్మల్ చైల్డ్ కాదనీ, ‘ఆటిజమ్’ బేబీ అనీను!!
మౌనిక, రఘురామ్ ల ప్రపంచం ఒక్కసారిగా తలక్రిందులయిపోయింది. రఘురామ్ మగవాడు. దేన్నయినా తట్టుకోగలడు. కానీ, మౌనిక స్త్రీ. మీదుమిక్కిలి - అమ్మ! దిగులుతో కృంగిపోయింది.
చిన్నారికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించాలనీ, మళ్ళీ మామూలు మనిషిని చేయాలనీ కృతనిశ్చయానికి వచ్చింది. నగరంలో పేరున్న ఓ ఆటిజమ్ నిపుణుడి వద్ద పాపకు వైద్యం ఆరంభించింది. ఆటిజంని గూర్చిన ఆర్టికిల్సు, పుస్తకాలు సంపాదించి క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. తల్లిదండ్రులు బిడ్డకు మానసికంగా, ఎమోషనల్ గా ఎంత సన్నిహితంగా ఉంటే, ఫలితం అంత బాగా ఉంటుందని గ్రహించింది.
‘ఆటిజమ్’ ని పూర్తిగా తొలగించలేకపోయినా.. ప్రేమాభిమానాలతో కూడిన సంరక్షణ, వైద్యమూ మిళాయించితే..దాన్ని మిటిగేట్ చేయవచ్చుననీ..కొన్ని సందర్భాలలో బిడ్డ నార్మల్ కి వచ్చే అవకాశం కూడా ఉందనీ బోధపడింది.
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోవడంతో, పాపను ఆయా చూసుకుంటుంది. ఆటిజమ్ బిడ్డను సాకే తెలివితేటలు, సామర్థ్యమూ, సహనమూ ఆయాకి లేవు. తల్లి, దగ్గర ఉండి కంటికి రెప్పలా చూసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఉద్యోగానికి రాజీనామా చేస్తానన్న భార్య వంక విభ్రాంతిగా చూసాడు రఘురామ్. మంచి జీతము, అధికారమూ గల పదవిని ఆమె అవలీలగా వదిలేసుకోవడం అతనికి రుచించలేదు. “ఉన్న ఉద్యోగాన్ని వదలుకోవడం అవివేకమే అవుతుంది. పాప మీద నాకు ప్రేమ లేకకాదు. హౌసింగ్ లోన్, కార్ లోన్, వగైరాలు తీరేంతవరకైనా ఇద్దరమూ ఉద్యోగం చేయక తప్పదు” అంటూ వాదించాడు.
‘అదంతా నాకు తెలియదు. నాకు నా చిన్నారే ముఖ్యం. అవసరమైతే, ఇల్లు అమ్మేసి బ్యాంక్ లోన్ తీర్చేద్దాం” అంది మౌనిక దృఢంగా. ఆ విషయమై ఇరువురి నడుమా పెద్ద ఘర్షణే జరిగింది. ఆమె ‘అమ్మతనం’ ముందు అతని అభ్యంతరాలు వీగిపోకతప్పలేదు.
ఆటిజం పిల్లలు అందరిలోనూ ఒకే విధమైన లక్షణాలు గోచరించకపోవచ్చును. పిల్లలను బట్టి, వయసునుబట్టి అవి మారుతుంటాయి. కొందరిలో కొన్నే కనిపించవచ్చును. కొందరిలో అవి నామమాత్రంగా ఉంటే, మరికొందరిలో ఉధృతంగా ఉండవచ్చును.
ట్రీట్మెంటులో భాగంగా – ప్లే థెరపి, బిహేవియరల్ థెరపి, సెన్సరీ థెరపి, ఆక్యుపేషనల్ థెరపి, స్పీచ్ థెరపీలను ఆశ్రయించడం కద్దు. ఆటిస్టిక్ చైల్డ్ యొక్క అలవాట్లలో ఆశించిన మార్పు తేవడానికి అవసరమైన ఎక్సర్ సైజులుగా వాటిని పేర్కొనవచ్చును.
నెట్ ని సర్ఫ్ చేసి పలు ఆటిజం నిపుణుల ఆర్టికిల్సూ, సలహాలు, సూచనలు, ఆటిజంతో బాధపడే పిల్లల తల్లిదండ్రుల అనుభవాలు వగైరాలను శ్రద్ధగా అధ్యయనం చేయడంతో ఆగిపోలేదు మౌనిక. ఓ స్వచ్ఛంద సంస్థ ఆటిజం పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తూన్న ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి, వివిధ థెరపీలలో శిక్షణను కూడా పొందింది.
ప్లే థెరపిలో – కౌముదితోపాటు నేలపైనే చతికిలబడి, ఆటలు ఆడేది, ఆడించేది మౌనిక. పాపతోపాటు ప్రాకేది. ‘కీ’ ఇవ్వబడ్డ కార్లు, బస్ లు, రైళ్ళ వెంట పడి, వాటిని పట్టుకోవడం వంటివి నేర్పించేది. చిన్నారి మెదడును కదలించే చిన్న చిన్న ఆటలను ఆడి చూపించేది.
బిహేవియరల్ థెరపిలో భాగంగా.. కౌముది చేష్టలు– చేతులు ఫ్ల్యాప్ చేయడం, వెనక్కీ ముందుకూ ఊగడం, బొంగరంలా గిర్రున తిరగడం, తల బాదుకోవడం వంటి అలవాట్లకు ప్రత్యామ్నాయాలను ప్రయత్నించేది. అందువల్ల కొన్ని మిటిగేట్ కావడమో, మరికొన్ని మాయమవడమో జరుగుతుందన్న ఆశ, ఆకాంక్షాను..సెన్సరీ థెరపీని ఆసక్తికరమైన ఓ ఆటగా రూపొందించింది. వివిధ పద్ధతులలో పాప యొక్క సెన్సరీ ఆర్గాన్స్ ని మేల్కొలిపి, వాటి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించేది.
ఆక్యుపేషనల్ థెరపితో– రంగురంగుల బొమ్మలు, ఆటవస్తువులతో ఆటలాడించుతూ, పూసలు గ్రుచ్చడం, బొమ్మలకు రంగులు వేయించడం, రైలులాగ కూతపెట్టి తిరగడం వగైరాలతో పాపలో ఆసక్తిని రేకెత్తించేందుకు ప్రయాసపడేది..ఇక, స్పీచ్ థెరపిలో భాగంగా– కౌముదికి చిన్న చిన్న మాటలు, పదాలు పలకడం నేర్పించేది. వాటిని పదే పదే పలుకుతూ ఉచ్ఛరింపజేసేది.
పాప అమ్మను అనుసరించడానికి ప్రయత్నించేది కానీ, సరిగా పలుకలేకపోయేది. అయినా మౌనిక ఓపికగా మళ్ళీ మళ్ళీ చెప్పేది, చెప్పించేది. పక్షులు, జంతువుల బొమ్మలను చూపించి అవి చేసే శబ్దాలను, కూజితాలను చేసి వినిపించుతూ, పాప అనుకరించేలా ప్రోత్సహించేది.
అంతేకాదు, కౌముది ఏం చేస్తే తానూ అలాగే చేసేది మౌనిక. పాపను నవ్వించడానికి ప్రయత్నించేది. ఎమోషన్స్ ని రగల్చడానికి యత్నించేది. తన చేష్టలలో అలవాట్లలో తోడు దొరికిందనేమో, పాప వదనంలో ప్రసన్నత, ఉత్సాహం పొడసూపేవి– క్రమేపీ. అమ్మ ఇంటిపట్టునే ఉండి రోజంతా తనతో గడపడంతో ఆ చిన్నారిలో కించిత్తు హుషారు చోటుచేసుకోవడం మౌనిక దృష్టిని తప్పించుకోలేదు. స్పందనలు సూచనప్రాయంగా ఆరంభమయ్యాయి. కూతురే లోకమయింది మౌనికకు.
రోజులు, నెలలు గడుస్తూంటే– చిన్నారి కౌముదిలో ఆటిస్టిక్ లక్షణాలు మరింత స్పష్టం కాసాగాయి. వాటిలో ఆశించిన మార్పులు తేవడంలో కొంతవరకు మౌనిక కృతకృత్యురాలయిందనే చెప్పాలి. కొన్ని మెరుగుపడడమో, మరికొన్ని ప్రత్యామ్నాయల మరుగున పడడమో జరిగింది.
అయితే ఇరుగుపొరుగులు, బంధుమిత్రులూ ‘ఆటిజంతో పుట్టిన పిల్లలు బాగుపడడం కల్ల’ అంటూ నిరుత్సాహ పరచుతూంటే, వారి మాటలు మౌనికను మిక్కిలి బాధించేవి. ఆమె అనవసర శ్రమ పడుతోందనీ, బంగారంలాంటి ఉద్యోగాన్ని వదులుకోవడం మూర్ఖత్వమనీ వ్యాఖ్యానిస్తూంటే ఆమెలో పంతం, పట్టుదల, కూతుర్ని మామూలు మనిషిని చేయాలన్న దృఢనిశ్చయమూ, విజయం పొందగలనన్న ఆత్మవిశ్వాసమూ ఇనుమడించాయి.
ఆటిజం వైద్యంలో నేచురల్ థెరపీలు కూడా ప్రముఖమైనవి. వాటిలో– ఎప్సంసాల్ట్ బాత్స్, ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, గ్లూటెన్-ఫ్రీ డయెట్, కెసీన్-ఫ్రీ మరియు సోయ్-ఫ్రీ డయెట్, గ్యాప్స్ డయెట్, రిఫైన్డ్ షుగర్ నిషిద్ధత, ప్రోబయాటిక్స్, గ్రీన్ స్మూతీస్..అధిక డోసెస్ లో విటమిన్-బి, విటమిన్-సి సప్లిమెంట్లు, జింక్, చేపనూనెలు..వైద్యుల సలహా ప్రకారం కౌముదికి వాటిని వాడనారంభించింది మౌనిక.
అనతికాలంలోనే అది సత్ఫలితాలను చూపనారంభించింది. పాప ప్రవర్తనలో, మాటలలో అలతి అలతి మార్పులు చోటుచేసుకోసాగాయి.
ఆటిజం రావడానికి ప్రధాన కారణాలలో ‘టాక్సిక్ లోడ్’ ఒకటి. కనుక చైల్డ్ ‘డిటాక్సిఫయింగ్’ అవసరం. మరింత టాక్సిక్ లోడ్ చేరకుండా, గృహవాతావరణాన్ని ‘డిటాక్సిఫై’ చేయడం ఎంతైనా అవసరం. అందులో భాగంగా– క్లీనింగ్ ప్రోడక్ట్ స్, పెస్టిసైడ్స్, ఎయిర్ ఫ్రెష్ నర్స్ వంటి కెమికల్-బేస్డ్ వస్తువులన్నిటినీ ఇంట్లోంచి తొలగించి.. వాటికి ప్రత్యామ్నాయంగా సహజపద్ధతులను అవలంబించ నారంబించింది మౌనిక. ఆ విధంగా పాపను టాక్సిక్స్ కి దూరంగా ఉంచడానికి ప్రయత్నించేది.
ఇక మందులకు వస్తే, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన, ఆటిజం ట్రీట్మెంటులో ప్రసిద్ధిగాంచిన హోమియోపతిక్ ట్రయో– సల్ఫర్, కాల్కరియా కార్బనికా, లైకోపోడియంలు– కౌముదిలో స్పష్టమైన మార్పుకు కారణమయ్యాయి. ఓపక్క ఆటిస్టిక్ డయెట్, మరోపక్క థెరపీలు, ఇంకోపక్క మెడికేషన్– అన్నిటినీ మించి, మౌనిక తీసుకుంటున్న జాగ్రత్తలు, ప్రత్యేక శ్రద్ధ–
అనతికాలంలోనే కౌముదిని నార్మల్ చైల్డ్ ని చేస్తుందన్న ఆశాభావాన్ని రగిల్చాయి. తాను చదివిన వివిధ కేస్ స్టడీస్ ని చూస్తుంటే, తన చిన్నారి కూడా ఆటిజంని అధిగమించి సాధారణ జీవితాన్ని గడపగలదన్న విశ్వాసం మౌనికలో బలపడసాగింది.
రోజులు నెలలు గానూ, నెలలు సంవత్సరాలు గానూ మారుతూంటే..కౌముది యొక్క భాషలోను, ఉచ్ఛారణలోను, స్పందనలలోను, అవగాహనలోను, అలవాట్లలోను గణనీయమైన మార్పులు గోచరించసాగాయి. ఎదుటివారి చూపుల్లో చూపులు కలపడం, వారి ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, వాటికి స్పందించడం వగైరాలతోపాటు, సెన్సరీ ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్స్ లోనూ అభివృద్ధి కనిపించసాగింది– నెమ్మదిగానే అయినా. కౌముదికి ఐదో ఏడు వచ్చేసరికి ఆటిస్టిక్ లక్షణాలలో చాలమటుకు మార్పులు వస్తే – మరికొన్ని మరుగునపడిపోవడం విశేషం. అదంతా మౌనిక కృషి, పట్టుదల, సేవాఫలితము, బిడ్డపైన కురిపించే ప్రేమానురాగాలేనని ప్రశంసించారు డాక్టర్లు.
కూతుర్ని బళ్ళో చేర్చడానికి నిశ్చయించుకుంది మౌనిక. సమీపంలో ఉన్న ఓ పబ్లిక్ స్కూల్ కి వెళ్ళి ప్రిన్సిపాల్ తోను, టీచర్స్ తోనూ కౌముది యొక్క స్థితిని గురించి విపులంగా చర్చించింది. వారి సహకారంతో పాపను ఒకటవ తరగతిలో చేర్పించింది. అంతవరకు ఇంట్లో తానే చదువు చెప్పింది.
బళ్ళో అడుగిడిన మొదటి రోజున తరగతిలోని పిల్లలందరూ కౌముది వంక అదోలా చూడసాగారు. తాను ఆటిస్టిక్ చైల్డ్ అన్న విషయం కూతురికి తెలియకుండా పెంచింది మౌనిక. బెంచీలో తన పక్కను కూర్చున్న పిల్ల, తనలా చేతులు ఆడిస్తూ “ఎందుకు అలా చేస్తున్నావు?” అని అడిగినప్పుడు కానీ, కౌముదికి తెలిసిరాలేదు– అది ‘నార్మల్ చర్య’ కాదని!..
కౌముది వయసుతోపాటు అభివృద్ధిచెందుతూ, ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతూ కాలేజ్ స్థాయికి చేరుకుంది. డిగ్రీతో ఆపకుండా పీ. జీ. కూడా చేసింది. ఆ తల్లీకూతుళ్ళు నడచింది పూలబాట కాదు. ముళ్ళదారి. ఆ సుదీర్ఘ ప్రయాణంలో మౌనిక ప్రయాస, త్యాగాలు ఇమిడి వున్నాయి.. కౌముది మునుపటిలా పక్షిలా చేతులు ఊపడం ఆగిపోయినా, వ్రేళ్ళను విదిలిస్తూండడం పూర్తిగా తగ్గలేదు. బొంగరంలా తిరగడం, వెనక్కీ ముందుకూ ఊగడం, తల బాదుకోవడం, లైట్ స్విచెస్ ని ఆన్ - ఆఫ్ చేయడం వంటి అలవాట్లు అదృశ్యమైనా.. దీపాల వంక తేరిపారజూస్తుండడం, ఫింగర్ స్నాపింగ్, వస్తువులను గిరగిరా త్రిప్పడం వంటివి కొన్ని అప్పుడప్పుడు చేస్తూనేవుంది.
ఇక పదోచ్ఛారణ, స్పందన, సంభాషణ వగైరాలలో బాగా మెరుగయింది. అనుభూతులకు ఇప్పుడు అతీతురాలుకాదు. చదువుపట్ల, విషయాలపట్ల నిమగ్నతను కూడా పెంపొందించుకుంది. పరీక్షలన్నీ మంచి మార్కులతో పాసవుతూ టీచర్ల అభిమానాన్నీ, ప్రశంసలనూ చూరగొనేది. ఐతే నార్మల్ వ్యక్తిలా త్వరితగతిని వ్యవహరించలేదు. విషయాన్ని ఆకళింపుచేసుకుని స్పందించడానికి కొంత సమయం తీసుకుంటుంది.
ఆమె ఎదుగుదల కూడా అనుకున్నదానికంటె వేగంగా, సంతృప్తికరంగా ఉండి, వైద్యులను అబ్బురపరచింది. యవ్వనం ఆమె అందానికి మెరుగులు దిద్దింది. ఆమెలో ఆటిజమ్ లక్షణాలు దాదాపు నూటికి ఎనభై శాతం తొలగిపోయినట్లేనని నిర్ధారించారు నిపుణులు. అదొక అద్భుతంగా అభివర్ణించారు.
లెక్చరర్ ఉద్యోగం వచ్చిన రోజున తల్లిని పట్టుకుని ఏడ్చేసింది కౌముది. తనకు పునర్జన్మనిచ్చిన తల్లిపట్ల గల ప్రేమ, భక్తిగౌరవాలకు కృతజ్ఞత తోడవడంతో దుఃఖం ఆపుకోలేకపోయింది. తన నిరంతర కృషి ఫలించినందుకు ఆనందబాష్పాలతో కూతుర్ని హృదయానికి హత్తుకుంది మౌనిక. ‘మేము సైతం..సాధించగలం!’ అన్న ధీమా, ఆత్మవిశ్వాసమూ ఆ తల్లీకూతుళ్ళలో ప్రస్ఫుటమవుతూంటే, వారి వంక ఆరాధనగా చూసాడు రఘురామ్, చెమర్చిన కనులతో.
లెక్చరర్ గా కౌముది మంచిపేరు తెచ్చుకుంది. ఆమెలో అస్పష్టంగా మిగిలియున్న కొన్ని ఆటిజమ్ లక్షణాలను చూసి ఆరంభంలో కొందరు ఆకతాయిలు ఆమెను ఆట పట్టించబోయినా, రాను రాను ఆమెను అర్థంచేసుకుని అభిమానించసాగారు.
అదే కాలేజ్ లో సైన్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న సూర్యం, కౌముదిని ప్రేమించి, పెళ్ళిచేసుకోవాలనుకున్నాడు. ఆటిజపు పిల్లను కోడలిగా ఒప్పుకోమన్నారు అతని తల్లిదండ్రులు. ఆమెకు కలగబోయే సంతానానికి కూడా ఆమె జీన్స్ వస్తే తమ వంశం నాశనమవుతుందన్నారు. సూర్యం తన పంతం విడవకపోవడంతో, వాళ్ళు దిగిరాక తప్పలేదు. వారి ఏకైక సంతానం అతను. కౌముది పైన అక్కసు పెంచుకున్నారు వాళ్ళు. కొడుకు కట్నం తీసుకోకపోవడం కూడా అందుకు ఓ కారణం..
ఏడాది తరువాత కౌముది గర్భం దాల్చింది. తీయించేసు కోమని ఒత్తిడిచేసారు అత్తమామలు. కౌముది నిరాకరించింది. సూర్యం భార్యకు వత్తాసు పలికాడు. జెండర్ టెస్ట్ కు కూడా ఒప్పుకోలేదు, తమకు ఏ బిడ్డయినా ఒకటేనంటూ..తన చిన్నారి తల్లి కాబోతోందన్న ఆనందం మౌనికను ఏనుగు అంబారీ ఎక్కించింది.
అందరి భయాలనూ అటకెక్కిస్తూ కౌముది ముద్దులొలికే పండంటి పాపను ప్రసవించింది. ఆరోగ్యవంతంగా పుట్టిన పాపను చూసి మౌనిక మురిసిపోతే, ఆడపిల్ల అని ఈసడించుకున్నారు అత్తమామలు. పాపకు ‘లయ’ అని పేరు పెట్టుకున్నారు కౌముది, సూర్యంలు. పాప రాకతో వారి జీవితాలలో నూతనోత్తేజం పుంజుకుంది..
*
సెల్ ఫోన్ మ్రోగడంతో ఉలికిపడి ఆలోచనలలోంచి తేరుకుంది కౌముది. “ఏయ్, కౌమూ! రేపు సివిల్ సర్వీసెస్ ఫలితాలు వస్తున్నాయట. తెలిసిందా?” అనడిగింది కొలీగ్ జానకి.. “ఊఁ..” అంది తాను. లయకు ‘బెస్టాఫ్ లక్’ చెప్పమని, ఫోన్ పెట్టేసిందామె..
*
అంతా సుఖసంతోషాలే అయితే – అది జీవితం ఎలా అవుతుంది!.. ఓ రోజున ఎక్కడికో వెళ్ళివస్తూన్న మౌనిక, రఘురామ్ లు ఎవరో త్రాగి డ్రైవ్ చేస్తూ కారును గ్రుద్దడంతో అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. తల్లిదండ్రుల అకాలమరణం కౌముదిని బాగా కృంగదీసింది. ఐతే భర్త సహకారంతో త్వరగానే కోలుకోగలిగింది.
ఆ విఘాతం నుండి పూర్తిగా కోలుకోకముందే, పాపకు మొదటి పుట్టినరోజు వేడుకను జరిపిన వారం రోజులకే సూర్యం హఠాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఆ షాక్ కి మరుగునపడిపోయిన ఆటిజం లక్షణాలు మళ్ళీ వెలికిరాసాగాయి కౌముదిలో.
అంతవరకు కొడుక్కి జడిసి నోళ్ళు మూసుకున్న అత్తమామలు, అతని మరణానంతరం కౌముదిని పసిపిల్లతోసహా నిర్దాక్షిణ్యంగా ఇంటినుండి వెళ్ళగొట్టేసారు– ఆటిజందాన్నీ, దాని కూతుర్నీ భరించవలసిన అవసరం తమకు లేదంటూ.
కౌముదికి చచ్చిపోవాలనిపించింది. కానీ తనకు పునర్జన్మనిచ్చిన తల్లీ, పొత్తిళ్ళలోని పసిగుడ్డూ జ్ఞప్తికి రావడంతో నిభాయించుకుంది. కాలేజ్ కి చేరువలో ఇల్లు తీసుకుంది. పాపను చూసుకోవడానికి ఆయాని పెట్టింది. తిరగబెడుతూన్న తన ఆటిజం లక్షణాలకు చెక్ పెట్టేందుకు మందులు వాడనారంభించింది. ఇంటి దగ్గర ఉన్నంతసేపూ పాపను విడచేదికాదు. ఆటలాడించేది. చదువు చెప్పేది. మూడో ఏడూ రాగానే నర్సరీ క్లాసులో చేర్పించింది..
తనకు ఉన్న సమస్యతో ఒంటరిగా ఆడపిల్లను పెంచి పెద్దచేయడమంటే మాటలు కాదు. ఒంటరి ఆడదన్న అలుసుతో లోబరచుకోవాలని చూసే మృగాళ్ళు ఓ పక్కా..తనలోని పరిమితుల మేరకు పిల్లను ప్రయోజకురాలిని చేయడంలో ఎదురయ్యే సమస్యలు మరోపక్కాను. కొండంత అండగా నిలచే సహృదయులైన సహోద్యోగులు, స్నేహితులూ ఉండడం కౌముది అదృష్టం..
చూస్తూండగానే సంవత్సరాలు దొర్లిపోయాయి..వయసు పెరిగేకొద్దీ తల్లియొక్క సమస్యను గుర్తించి అర్థంచేసుకోనారంభించింది లయ. తన వంతుగా తల్లికి సహకరించేది. అమ్మమ్మ యొక్క త్యాగనిరతి, అకుంఠిత దీక్షల గురించి ఆలకించి, తాను పెద్దదయేసరికి ఆమె లేకపోయిందే అని విచారించేది..శ్రద్ధగా చదువుకుని డిగ్రీ పాసయిన లయ. పీజీ చేయకుండా సివిల్ సర్వీసెస్ కి ప్రిపేరయింది. వ్రాతపరీక్షలో పాసయి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చింది..
*
తెల్లవారు ఝామున ఎప్పుడు నిద్రపట్టిందో, మర్నాడు బాగా పొద్దెక్కాక కూతురు తట్టిలేపేంతవరకు మెలకువ రాలేదు కౌముదికి. “అమ్మా! ఫలితాలను ఇప్పుడే నెట్ లో చూసాను. నేను సెలెక్టయ్యానమ్మా!” అంటూ లయ ఆనందంతో కౌగలించుకుని ముద్దులు పెట్టేసుకుంటూంటే, సంతోషంతో ఉక్కిరిబిక్కిరయింది. హఠాత్తుగా ఆమె మదిలో ‘అమ్మ’ మెదలడంతో కన్నులు చెమ్మగిల్లాయి. ‘ఇదంతా నీ చలువేనమ్మా!’ అనుకుంటూ మదిలోనే నమస్కరించింది.
తనకు వచ్చిన ర్యాంక్ కి ఐ. పి. ఎస్. కి సెలెక్ట్ అయింది లయ. “పోలీసాఫీసరునయి సమాజానికి చీడపురుగుల్లా దాపురించిన మృగాళ్ళను ఏరిపారేస్తానమ్మా!..” అంటూన్న తన చిన్నారిని ఆప్యాయంగా చూస్తూ నుదుటిపైన ముద్దుపెట్టుకుంది కౌముది.
‘ఆటిజమ్ ఆడది, కూతుర్ని ఏం పెంచుతుంది!?’ అంటూ అవహేళన చేసినవారి నోళ్ళు మూయిస్తూ, ‘సమాజం నుంచి పిసరంత సానుభూతి, కించిత్తు చేయూతా అందితే.. మేము సైతం..దేనినైనా సాధించగలం!’ అని రుజువుచేస్తూ, సమాజానికి ఓ మంచి పౌరురాలిని అప్పగిస్తున్నందుకు కించిత్తు గర్వం కలిగింది కౌముదికి.
*******
తిరుమలశ్రీ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం :
‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారతప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ అఫ్ అడ్మినిస్ట్రేషన్' గా పదవీ విరమణ చేసారు…వీరి మరో కలంపేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్లోను, ప్రక్రియలలోను(బాలసాహిత్యంతోసహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు185 నవలలు ప్రచురితమయ్యాయి. పలుకథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలోప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్లో ప్రసారంకాగా, మరికొన్నిరంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలుకథలు బహుమతులను అందుకున్నాయి. కొన్నికథలు హిందితోపాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీసంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు100 కథలు, ఆర్టికల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ (లిటరరీ) కాలం వ్రాసారు. ఓ జర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఈ బుక్స్ ప్రచురిత మయ్యాయి... స్టోరీ మిర్రర్ (ఆంగ్లం), ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదాంకితులు, మరియు ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020’ నామినీ… హిందీలో అరడజను కథలు ప్రచురితం కాగా,ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.
''స్టోరీ మిర్రర్- 'ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020' అవార్డ్స్ (రీడర్స్ చాయిస్- ఫస్ట్ రన్నరప్ & ఎడిటర్స్ చాయిస్- సెకండ్ రన్నరప్) ట్రోఫీలు లభించాయి..."
@surekhap4148 • 6 hours ago
Very informative