top of page

మొదటి పరిచయం'Modati Parichayam' - New Telugu Story Written By L. V. Jaya

Published in manatelugukathalu.com on 29/06/2024 

'మొదటి పరిచయం' తెలుగు కథ (అత్తగారి కథలు - పార్ట్ 4)

రచన: L. V. జయ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జాగృతి కి పెళ్ళై ఇరవై ఏళ్ళు అయినా, సమర్థ్ తో తనకి జరిగిన మొదటి పరిచయాన్ని మర్చిపోలేకపోయింది. 


************************************************************************************


"జాగృతి, నీకు ఎలాంటి అబ్బాయి కావాలని అనుకున్నావో ఈ అబ్బాయి అలాగే ఉన్నాడు. MBA చేసాడు, IT కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాడు, నీకంటే సంవత్సరమే పెద్ద. " అంటూ సమర్థ్ ఫోటో ని చూపించింది జాగృతి వాళ్ళ అమ్మ లత. 


ఎలాంటి షోకులు, గొప్పలు లేకుండా హుందాగా ఉండే జాగృతికి, ఫోటో లో ఫ్రెంచ్ బియర్డ్ తో ఉన్న సమర్థ్ నచ్చలేదు. "ఇలాంటి స్టైల్స్ నాకు నచ్చవని తెలుసు కదమ్మా. అయినా ఎందుకు చూపిస్తారు" అంది జాగృతి. 


"అబ్బాయికి నువ్వు నచ్చావుట. " అంది లత. 


"అబ్బాయికి నచ్చితే సరిపోతుందా. నాకు నచ్చక్కరలేదా?" అంది జాగృతి. 


"వాళ్ళు పెళ్ళిచూపులకి వస్తున్నారు. అయినా, ఒకసారి కలిసి, మాట్లాడితే కదా అబ్బాయి ఎలాంటివాడో తెలుస్తుంది" అంటూ జాగృతిని పెళ్ళిచూపులకి ఒప్పించింది లత. 


పెళ్లిచూపులు రోజు, ఉదయంనుండి లత హడావిడి మొదలు అయ్యింది. జాగృతి రెడీ అయ్యి రాగానే, "దేవుడికి దణ్ణం పెట్టుకో. అంతా మంచే జరుగుతుంది. " అంది లత. 


జాగృతి దణ్ణం పెట్టుకుంటూ ఉండగా, దేవుడి రూమ్ లో వెలిగిన లైట్ ని చూసి, "చూసావా. మంచి శకునం. ఈ పెళ్లి నిశ్చయం అయిపోతే బాగుణ్ణు" అంది లత దణ్ణం పెట్టుకుంటూ. 


"అబ్బాయి, వాళ్ళ కుటుంబం ఎలాంటిదో తెలియకుండానే, పెళ్లినిశ్చయం అయిపోవాలని కోరుకుంటారేంటి?" అంటూ విసుగ్గా, బాల్కనీ లోకి వెళ్ళి కూర్చుని, పేపర్ చదువుతూ కూర్చుంది. 


ఇంటికి కొంచెం దూరంలో, ఆగిన ఆటోలోనుండి గుండుతో, పొట్టతో ఉన్న ఒకాయన దిగటం చూసింది జాగృతి. ఆయన, లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ని తన భుజానికి తగిలించుకుని, ఒక ఆవిడ చేయిపట్టుకుని, జాగ్రత్తగా ఆటోలోనుండి దించారు. అడ్రెస్స్ వెతుక్కుంటూ, వాళ్ళు తమ ఇంటి వైపు వస్తుంటే, అర్ధం అయ్యింది జాగృతి కి, వాళ్ళు తనని చూడడానికి వచ్చినవాళ్లే అని.. లోపలకి వెళ్ళి, సమర్థ్ వాళ్ళు వచ్చిన విషయం లత కి చెప్పింది. 


"అబ్బాయిని చూసావా? ఎలా ఉన్నాడు?" అడిగింది లత నవ్వుతూ. 


"గుర్తుపట్టలేకపోయాను. గుండుతో ఉన్నాడు. పెళ్ళిచూపులకి అలా వస్తారా ఎవరైనా?" అంది జాగృతి లతతో. 


"స్టైల్ తో పాటు, భక్తి కూడా ఎక్కువేమో.. మంచిదే కదా. నువ్వు నీ రూంలోకి వెళ్ళి కూర్చో. పిలిచినప్పుడు రా" అని జాగృతితో అని, బయటకి వెళ్ళి, సమర్థ్ వాళ్ళని లోపలకి పిలిచి, కూర్చోబెట్టింది లత. 


జాగృతి తన రూంలో కూర్చుని, 'అమ్మకి ఈ రోజు ఏమయ్యింది. ఎందుకు ఈ రోజు జరగబోయేది అంతా మంచేనని అనుకుంటున్నారు ? ఈ అబ్బాయి నాకు ఫొటోలో నచ్చలేదు. ఇప్పుడు గుండుతో, పొట్టతో ఇంకా నచ్చలేదు. ' అనుకుంది. కొంతసేపటి తరువాత, జాగృతి రమ్మని పిలవడంతో, బయటకి వచ్చి, సమర్థ్ కి, వాళ్ళ అమ్మ రాధకి ఎదురుగా వచ్చి కూర్చుంది. 


సమర్థ్ కి, జాగృతి నచ్చింది. రాధని, జాగృతి తో మాట్లాడమని సౌంజ్ఞ చేసాడు. రాధ, ఏమీ మాట్లాడకుండా జాగృతిని తీక్షణంగా పరీక్షించింది. 


"మాట్లాడవేం? వాగే నోరు, కదిలే కాలు ఊరకనే ఉండవు అంటారుగా. " అంటూ రాధని చూసి, 

"ఓహ్. పళ్ళు తెచ్చుకోలేదా?" నవ్వుతూ అన్నాడు సమర్థ్. సమర్థ్ ని కోపంగా చూసింది రాధ. 


"అవును. తెచ్చుకోలేదు. నేను మాట్లాడాను. నువ్వే మాట్లాడుకో" అంది. 


రాధ కోపాన్ని పట్టించుకోని సమర్థ్, "మా డాడీ, నార్త్ లో చలిప్రదేశాల్లో వర్క్ చేస్తున్నారు. వింటర్ లో, అక్కడ పడే స్నో కి, చలికి తట్టుకోలేక, మా అమ్మకి పళ్ళు ఊడిపోయాయి. అమ్మది ఏజ్ ఏమీ ఎక్కువ కాదు" అన్నాడు నవ్వుతూ. 

 

'ఏమిటి? ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారి గురించి ఇలా మాట్లాడుతున్నాడు?' అనుకుంటూ, తలా పైకెత్తి, రాధని చూసింది జాగృతి. రాధకి, నోట్లో, నాలుగు పళ్ళు మాత్రమే ఉన్నాయి. 'పాపం. అందరిముందు వాళ్ళ అమ్మకి పళ్ళు లేవన్న విషయంతో పాటు, ఊడిపోవడానికి కారణం కూడా చెప్పాడు? కోపం వచ్చినట్టు ఉంది ఆవిడకి. ' అనుకుంది జాగృతి. జాగృతి తనని చూడడం చూసి, రుమాలుని నోటికి అడ్డంగా పెట్టుకుంది రాధ. 


పరిస్థితిని అర్ధం చేసుకున్న లత, "ఏమైనా తీసుకోండి" అంటూ, కాఫీటేబుల్ మీద ఉంచిన తినుబండరాల్ని చూపించింది లత. 


టేబుల్ మీద ఉన్న మైసూర్ పాక్ ని, జంతికల్ని చూసిన సమర్థ్, వాళ్ళ అమ్మని చూస్తూ, "అమ్మ, పళ్ళు తెచ్చుకోవడం మర్చిపోయింది. తినలేదు. అతికితే కతకదూ అంటారు కదా. అందుకని, నేను కూడా తినను" అన్నాడు. 


'ఏమిటో ఈ అబ్బాయి? పాపం వాళ్ళ పళ్ళ గురించే చెప్పి బాధపెడుతున్నాడు' అనుకుంది జాగృతి. 


"మా అమ్మ ఏమీ మాట్లాడటం లేదు ఈ రోజు. నేను మాట్లాడచ్చా మీ అమ్మాయితో?" అన్నాడు సమర్థ్, లతతో. సరేనని, సమర్థ్ ని రూంలోకి తీసుకువెళ్ళమని జాగృతికి చెప్పింది లత. 


కొడుకు ప్రవర్తన అర్ధం కాలేదు రాధకి. 'ఎప్పుడూ నా మాటకి ఎదురుచెప్పని వీడు, ఈ రోజేమిటి? ఇలా మాట్లాడుతున్నాడు? నా పళ్ళ గురించే మాట్లాడి నా పరువుని తీస్తున్నాడు? నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు. అమ్మాయితో మాట్లాడేముందు నన్ను అడగలేదు? నేను అమ్మాయిని అడగమన్నవన్నీ అడుగుతాడో లేదో?' అనుకుంది రాధ. 


జాగృతి తో మాట్లాడడానికి, రూమ్ లోకి వెళ్ళాడు సమర్థ్. సమర్థ్ కి, జాగృతి చాలా నచ్చింది. 'జాగృతి, వాళ్ళ ఫామిలీ చాలా సింపుల్ గా, డిగ్నిఫైడ్ గా ఉన్నారు. ఇలాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తే చాలా బాగుంటుంది' అనుకున్నాడు. పెళ్లంటూ చేసుకుంటే, ఈ అమ్మాయిని తప్ప ఇంకెవ్వరిని చేసుకోను అని నిర్ణయించుకున్నాడు. కానీ, రాధ అడగమన్నవి ఎలా అడగాలో అన్న భయంతో, చెమటలు పట్టాయి సమర్థ్ కి. 


మాటలు ఎలా మొదలుపెట్టాలో తెలియక, అందంగా ఉన్న జాగృతి రూమ్ చూస్తూ, "యువర్ రూమ్ ఈస్ లుకింగ్ నైస్. యు కెప్ట్ ఇట్ నైస్" అన్నాడు సమర్థ్. 


'బయట ఉన్నంతసేపు, సామెతలు చెప్పాడు. వచ్చిరాని తెలుగులో మాట్లాడాడు. ఇప్పుడు ఇంగ్లీష్ లో మొదలుపెట్టాడు ఏంటో?' అనుకుని, థాంక్స్ చెప్తూ, సమర్థ్ ని చూసింది జాగృతి. 


చామనచాయ రంగులో, గుండుతో, పొట్టతో ఉన్నాడు. మెంతిరంగు చెక్స్ షర్ట్ వేసుకున్నాడు. ఫ్యాన్ తిరుగుతున్నా, గుండు మీద నుండి చమటలు కారిపోతున్నాయి. షర్ట్ అంతా చెమటతో తడిసిపోయింది. 


'ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఈ అబ్బాయి స్టైల్, డ్రెస్ సెన్స్, వాళ్ళ అమ్మతో మాట్లాడిన తీరు ఏదీ నచ్చలేదు నాకు. వద్దని చెప్పేస్తాను' అనుకుంది జాగృతి. 

 

"నువ్వు ఉద్యోగం చేస్తున్నావ్ కదా. పెళ్లయ్యాక మానేస్తావా?" అని అడిగాడు సమర్థ్. 


"ఎందుకు మానెయ్యడం?" అంది జాగృతి. 


"వేరే దేశం వెళ్తే మానేస్తావా? అంటే, నేనూ ఇంకా ఎక్కడికీ వెళ్ళలేదు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా నిన్ను తీసుకువెళ్తే మానేస్తావా? " అన్నాడు సమర్థ్. సమర్థ్, జాగృతిని పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకున్నాడు. కానీ, పెళ్లి జరగాలంటే, జాగృతి కి తను కూడా నచ్చాలన్న విషయాన్నీ మర్చిపోయి, రాధ అడగమన్నవి అడుగుతున్నాడు. 


'పెళ్లి, వేరేదేశం అంటున్నాడేమిటి? నేను, అమెరికా లో ఉద్యోగం చేసివచ్చినట్టు, మళ్ళీ వెల్దామనుకుంటున్నట్టు, అమ్మ వీళ్ళకి చెప్పలేదా? ఎందుకు చెప్పిఉండరు? అబ్బాయిలు, వేరే దేశం లో ఉద్యోగం చేస్తున్నారంటే, కళ్ళు మూసుకుని ఆడపిల్లల్నిచ్చి పెళ్ళి చేస్తున్న కాలంలో, అమెరికా లో ఉద్యోగం చేసివచ్చిన అమ్మాయికి, తగ్గ అబ్బాయిలు దొరకరు అని భయపడి చెప్పలేదా?' జాగృతి ఆలోచనలో పడింది. 


'అబ్బాయిలు కూడా వాళ్లే గొప్పవాళ్ళం అనుకుంటారెందుకో? ఇలాంటి వాళ్ళకి సరైన సమాధాం చెప్పాలి. ' అనుకుంది జాగృతి. 


"పెళ్ళైతే, వేరే దేశం వెళ్తే, అమ్మాయిలు ఉద్యోగం ఎందుకు మానెయ్యాలండి?" అని అడిగింది సమర్థ్ ని. 


"కడుపు వచ్చినా మానవా?" అని అడిగాడు సమర్థ్. 


తుళ్ళిపడింది జాగృతి. 'అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి? ' అని సమర్థ్ ని, కోపంగా చూసి, లేచి నించుంది. బయటకి వెళ్ళి, 'ఈ అబ్బాయి నాకు అస్సలు నచ్చలేదు' అని అరిచి చెప్పాలనుకుంది. 


"ఏం మాట్లాడవేం? చెప్పు. మానేస్తావా? " అన్నాడు సమర్థ్. 


"ఇఫ్ ఐ హావ్ టు ఐ విల్. అవసరం అయితే, ఆలోచిస్తాను. మీకెందుకు?" అని కోపంగా చెప్పి, బయటకి వచ్చింది జాగృతి. సమర్థ్ స్టైల్, డ్రెస్సెన్స్ తో పాటు మాటతీరు కూడా నచ్చలేదు జాగృతికి. 


సమర్థ్ కూడా బయటకి వచ్చాడు. రాధకి ఎదో చెప్పాడు. 'ఈ సంబంధం వద్దు అని చెప్పి ఉంటాడు' అనుకుంది జాగృతి. కానీ, రాధ నవ్వుతూ, సమర్థ్ ని, స్వీట్స్ తెమ్మని బయటకి పంపడంతో, అయోమయంలో పడింది. 


"వచ్చేటప్పుడే తీసుకువద్దాం అనుకున్నాం. కుదరలేదు. " అంటూ సమర్థ్ తెచ్చిన స్వీట్స్ ని, జాగృతి చేతిలో పెట్టి వెళ్లారు సమర్థ్, రాధ. 


"చూసావా. అంతా మంచే జరిగింది. అబ్బాయికి నువ్వు నచ్చావు. స్వీట్స్ కూడా తెచ్చి ఇచ్చాడు. ఆవిడ, ఒక్కమాట కూడా మాట్లాడలేదు నీతో. వంటవచ్చా అని కూడా అడగలేదు. " అంది లత ఆనందపడుతూ. 


"ఎందుకంత ఆనందం మీకు? స్వీట్స్ తెచ్చిస్తే, అంతా అయిపోయినట్టేనా? వాళ్ళు ఒప్పుకున్నా, నేను ఒప్పుకోను. నాకు ఆ అబ్బాయి నచ్చలేదు" అని కోపంగా చెప్పింది జాగృతి. 


"ఏమయ్యిందమ్మా? ఎందుకు అంత కోపం నీకు?" అని అడిగింది లత. 


"ఆ అబ్బాయి మాటతీరు, స్టైల్, డ్రెస్ సెన్స్ నచ్చలేదు నాకు. వాళ్ళ అమ్మతో మాట్లాడిన మాటలు విన్నారా? నాతో, రూమ్ లో, ఎలా మాట్లాడాడో తెలుసా? పెళ్ళైతే, వేరే దేశం వెళ్తే ఉద్యోగం మానేస్తావా? అని అడిగాడు. నేను US వెళ్లివచ్చిన విషయం మీరు చెప్పి ఉండరు. అవునా?" సమర్థ్ వాళ్ళకి, తన గురించి, పూర్తి విషయాలు చెప్పనందుకు, లత మీద కోపంగా ఉంది జాగృతి కి. 


"ఉద్యోగం చేసే అమ్మాయి వాళ్ళకి అక్కరలేదేమో? ఆ విషయం వాళ్ళు నాకు ముందు చెప్పలేదు" అంది లత అయోమయంగా. 


"నేను చేస్తున్నానని తెలిసికూడా, పెళ్ళిచూపులకి ఎందుకు వచ్చారు అయితే? ఉద్యోగం చెయ్యని అమ్మాయినే చూసుకోవచ్చు కదా. ఉద్యోగం మానెయ్యడం ఎందుకు? అని నేను అంటే, ‘కడుపు వచ్చినా మానవా?’ అని అడిగాడు. ఇలా మాట్లాడతారా ఎవరైనా? నాకు అబ్బాయి నచ్చలేదు. వీళ్ల గురించి మర్చిపోండి ఇక " అని ఖచ్చితంగా చెప్పింది జాగృతి. 


సమర్థ్ ని, సమర్థ్ తో జరిగిన పెళ్ళిచూపులని మర్చిపోవాలనుకుంది జాగృతి. కానీ, సమర్థ్ తోనే తన పెళ్ళి జరుగుతుందని ఆ రోజు ఊహించలేదు. 


సమర్థ్, జాగృతిని ఉద్యోగం మానెయ్యక్కరలేదు అని పెళ్ళికి ముందు వాగ్దానం చేసాడు. అయినా, పెళ్లి తరువాత, అత్తగారి బలవంతం వల్ల, ఉద్యోగం మానెయ్యాల్సి వచ్చింది జాగృతికి. 


**************************************************************************


తనకి, సమర్థ్ తో జరిగిన పెళ్ళిచూపులని గుర్తుతెచ్చుకున్న ప్రతిసారి, 'ఇంతకీ పెళ్లి ఎవరి ఇష్టప్రకారం జరిగింది? నేను ఎప్పుడు సమర్థ్ ని పెళ్లి చేసుకుంటానన్నాను? పెళ్ళిచూపుల్లో, వాళ్ల అమ్మని సమర్థ్ ఎందుకు వెక్కిరించాడు? కాబోయే అత్తగారు అసలు ఎందుకు మాట్లాడలేదు? ఆవిడని మాట్లాడకుండా చెయ్యటానికే అలా చేశాడా? కడుపు గురించి ఎందుకు అడిగాడు? తెలుగు సరిగ్గా రాకా? సామెతలు ఎలా చెప్పాడు మరి? సమర్థ్ తన ప్రామిస్ అందుకు నిలబెట్టుకోలేకపోయాడు? తన జీవితం ప్రస్తుతం ఎవరి ఇష్టప్రకారం వెళుతోంది?' లాంటి ఎన్నో ప్రశ్నలు జాగృతి బుర్రలో తిరుగుతాయి. 


అవే ప్రశ్నలు సమర్థ్ ని అడిగింది జాగృతి. "అబ్బాయి నీకు నచ్చలేదు కానీ, అబ్బాయికి నువ్వు చాలా నచ్చావు. నువ్వు ఉద్యోగం చెయ్యకపోయినా, నిన్ను బాగా చూసుకోగలడన్న నమ్మకం అబ్బాయికి ఉంది. అందుకే అన్ని అలా జరిగిపోయాయి" జాగృతిని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు సమర్థ్. 


తనకి, సమర్థ్ కి జరిగిన పెళ్లిచూపులు జరిగినరోజు గుర్తువచ్చినప్పుడల్లా, అత్తగారి మీద కోపంతో పాటు, నవ్వు కూడా వస్తుంది జాగృతికి. 

***

అత్తగారి కథలు - పార్ట్ 5 త్వరలో

L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : LV జయ

నా పేరు LV జయ. 
https://www.manatelugukathalu.com/profile/jaya

నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. 
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

ధన్యవాదాలు48 views0 comments

Comments


bottom of page