top of page

మూగ మనసులు


Muga Manasulu Written By Varalakshmi Bellamkonda

రచన : బెల్లంకొండ వరలక్ష్మి


"కంగ్రాచులేషన్స్ స్వప్న మేడం ........ యూ ఆర్ సెలెక్టెడ్... "

ఈ మాటలు విన్న నాకు పట్టరాని ఆనందం...... ఎందుకంటే నాకు జాబ్ వచ్చిన ఆనందం కన్నా నేను చదివిన స్కూల్ లోనే టీచర్ గా జాబ్ రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది..... మరోపక్క విచిత్రం...... నేనేంటి..... టీచర్ ఏంటి? హహహ్హా......

ఇందులో 'విచిత్రం ఏం ఉంది' అనుకుంటున్నారా...... అసలు కాలేజీ చదివే రోజుల్లో నా అల్లరి... చిలిపి పనులు చూసి దీనికి అసలు కుదురు లేదు అనుకునేవారు..... అలాంటిది నేను ఇప్పుడు పిల్లలు అల్లరి చేయకుండా వాళ్ళని క్రమశిక్షణ లో పెట్టడం అంటే ఒకంతకు విచిత్రమేగా.....

ఏదైతేనేం, డిగ్రీ పూర్తి చేసిన ఒక సంవత్సరానికి జాబ్ లో చేరాను.....'నా ఖర్చులకు నాన్న మీద ఆధారపడక్కర్లేదు' అని గర్వంగా అనిపించింది.

జాబ్ లో జాయిన్ అయిన మొదటిరోజు స్టాఫ్ రూమ్ లో కూర్చొని ఏ క్లాస్ కి ఏం చెప్పాలో ఒక లెసన్ ప్లాన్ రాస్తున్న నాకు ఒక గొంతు వినిపించింది.. 'గుడ్ మార్నింగ్ మేడం.......'అని..

ఎవరా అని తల పైకి ఎత్తి చూస్తే నా ఎదురుగా ఆరు అడుగుల తో ఒక మనిషి..... తన ముఖంలో చిన్న చిరు నవ్వు.... తనని తదేకంగా చూస్తుంటే మళ్ళీ ‘ఎలా ఉన్నారు మేడం…’.అని పలకరిపు... వెంటనే తేరుకొని ‘గుడ్ మార్నింగ్ సా’ర్ అని పలకరించాను.

"అదేంటి మేడం నన్ను గుర్తుపట్టలేదా? నేను బాలు ని" అంటూ ప్రశ్న ..... నేను అతనిని చూడడం అదే మొదటిసారి.....

"లేదండీ..... "అంటూ సమాధానం ఇచ్చాను..

"అదేనండి, పోయిన సంవత్సరం మీ ఫ్రెండ్ గోదావరి దగ్గర నాకు రాఖీ కట్టారు గుర్తుందా... అప్పుడు మీరు పక్కనే ఉన్నారుగా...... "అంటూ పరిచయం చేసుకున్నాడు.... విషయం ఏంటి అంటే నేను నా స్నేహితురాలితో సాయంత్రం పూట అలా మా ఊరి గోదావరి దగ్గర వాకింగ్ చేసే అలవాటు ఉంది. అలా ఆ రోజు రాఖీ పండక్కి నా ఫ్రెండ్ తన అన్నయ్య ఫ్రెండ్స్ కి రాఖీ కట్టింది.. కానీ నేను తనని చూసినట్టుగా లేను....

‘ఓహ్ మీరా! ‘అంటూ తెలియని అనుమానంతోనే పలకరించాను....

అలా మొదటి రోజునే పరిచయాలు అయ్యాయి.. ఇద్దరం మా మా క్లాసెస్ కి వెళ్లిపోయాం.

నేను చెప్పవల్సిన అన్ని తరగతుల పిల్లలూ ఆరోజే నాకు బాగా దగ్గరయ్యారు.... ఎందుకంటే మొదటిరోజునే పాఠాలు అంటూ వాళ్ళని విసిగించకుండా ఆటపాటలతో వాళ్ళని సరదాగా అలరించాను.....

అంతే కాకుండా నా తోటి టీచర్స్ కూడా చాలా సరదాగా ఉన్నారు... విచిత్రం ఏంటి అంటే నాకు పాఠాలు చెప్పిన టీచర్ ఇప్పుడు నాకు సహోద్యోగిని ......

ఆవిడే కాదు స్కూల్ చైర్మన్, క్లార్క్, ఆయమ్మ, ఇలా అందరు నేను చదువుకునే రోజుల్లో ఉన్న వారే...... నేను ఇక్కడ టీచర్ అన్నమాటేకానీ.... వీళ్ళకి నేను ఇంకా చిన్ననాటి స్వప్నగానే చూస్తున్నారు...... ఏం చేసినా సర్ది చెప్పేవారు, అర్ధం కాకపోతే వివరించేవారు.....

అలా నేను స్కూల్ లో పనికి నెమ్మదిగా అలవాటు పడుతున్నా.... కానీ బాలు గారు మాత్రం చాలా చాకచక్యం తో పనులు పూర్తి చేసేవారు... ఎందుకంటే తనకి, ఇంతకుమునుపు వేరే స్కూల్ లో పని చేసిన అనుభవం ఉంది మరి.....

తను పిల్లల్ని చూసే విధానం, బోధనా విధానం, నన్ను ఎంతగానో ఆకట్టుకుంది..... ఇద్దరం ఒకే సబ్జెక్టు కావడంతో నాకు ఏమైనా సందేహం వున్నా వెంటనే తను వివరించేవాడు.... అలా మా ఇద్దరికీ సాన్నిహిత్యం పెరిగింది.....

ఎంతగా అంటే ఇద్దరిలో ఒక్కరు స్కూల్ కి రాకపోయినా ఏం అయిందో అని ఎంక్వయిరీ చేసుకునే వాళ్ళం ..........

పేరెంట్స్ మీటింగ్స్ లో కూడా పేరెంట్స్ నుండి మాకు అభినందనలు వచ్చేవి.... అసలు

ఈ జాబ్ ఎలా చేయగలను అనుకున్న నాకు ఈ వృత్తి పై చాలా గౌరవం ఏర్పడింది.... పిల్లలతో నాకున్న అనుబంధం మాటల్లో చెప్పడం కూడా కష్టమే.........

ఒక రోజు మా క్లార్క్ సార్, తన కూతురి వివాహానికి మమల్ని ఆహ్వానించారు.

’ స్టాఫ్ అందరం రాత్రి ఏడు గంటలకి స్కూల్ దగ్గర ఉంటే స్కూల్ బస్సు లో బయలుదేరుదాం’ అని ప్రిన్సిపాల్ సార్ చెప్పారు. దానికి అందరి సమ్మతీ తీసుకున్నారు. నేను రెడీ అయ్యి మా ఇంటినుండి బయలుదేరాను... మా ఇంటికి, స్కూల్ కి కేవలం కొద్దీ దూరమే కావడంతో నేను నడిచి వెళ్లేదాన్ని.... ఆ రోజుకూడా నడిచి వెళ్తుంటే దారిలో ఒకడు వెంటపడుతూ నన్ను ఆపడానికి ప్రయత్నం చేశాడు.... దారి చీకటిగా ఉండడంతో భయం వేసింది...

ఇంతలో’ నేను వచ్చేంతవరకు వెయిట్ చేయలేవా’ అంటూ గొంతు వినిపించింది.... చూస్తే బాలు గారు .....వెంటనే నా భయం పోయి ఏడుపు వచ్చింది.......

’ ఏంటి చూస్తున్నావ్? రా .బైక్ ఎక్కు’ అంటూ కసురుకున్నారు...... నేనేం మాట్లాడకుండా తనతో వెళ్ళాను....

మధ్యలో బైక్ ఆపి, ‘మీకు అసలు బుద్ధి ఉందా.. ఈ టైం లో ఒక్కరే ఎందుకు వచ్చారు... నాన్నగారిని లేదా తమ్ముడిని దింపమని అడగొచ్చుగా…’ అంటూ తిట్టడం మొదలుపెట్టారు…

నేను మౌనం గా ఉండిపోయా. ఇద్దరం నడుచుకుంటూ స్కూల్ దగ్గరకు వచ్చేశాం...

‘ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తా’ అంటూ తను ఆగిపోయారు.... నేను వెళ్లే సరికి మా స్టాఫ్ చాలా మంది వచ్చేసి ఉన్నారు....అందరం కలిసి బస్సు లో పెళ్ళికి వెళ్లి, అక్కడే ఏర్పాటు చేసిన భోజనాలు చేసి తిరుగు ప్రయాణం అయ్యాం.

ఇంటికి చేరుకున్న నాకు నిద్ర పట్టలేదు.... ఎందుకో తెలియదు నాకు. ఒకసారి బాలుగారిని చూడాలి, మాట్లాడాలి అనిపించింది... తను నామీద చూపించే బాధ్యతను చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది..ఎప్పుడు తెల్లవారుతుందా... ఎప్పుడు బాలుగారిని చూద్దామా.... అనుకుంటూ తన ఆలోచనలతో తెల్లవారింది. స్కూల్ కి చేరుకున్నాక నా కళ్ళు బాలు గారి కోసం వెతికాయి....

ఇంతలో "ఎవర్ని వెతుకుతున్నారు" అంటూ వచ్చారు బాలుగారు.

చిన్నగా నవ్వి "ఏంలేదు" అంటూ సమాధానం ఇచ్చా.....

"రాత్రి మిమల్ని అలా తిట్టివుండకూడదు సారీ" అన్నారు..

“అయ్యో ! పర్వాలేదు” సార్ అని సమాధానం ఇచ్చా....

“నిన్న రాత్రి మీరు చాలా బాగా రెడీ అయ్యారు... చాలా బాగున్నారు” అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు.

“థాంక్స్ “అంటూ నేను అక్కడినుండి వెళ్ళిపోయా....

అలా అలా మా ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కాస్తా ప్రేమగా మారింది....

’ తను చెప్తే విందాం ‘అని నేను.....' నేను చెప్తాను' అని తను..........

ఒకరోజు బాలుగారికి, సత్య గారికి (వేరే సార్ ) చిన్న తగాదా వచ్చి మాట్లాడుకోవడం మానేశారు. అంతకు ముందు ఇద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు... కారణం యేదయినా ఇద్దరికీ మాటలులేవు. ఒకరోజు నేను, ఇంకా ఇద్దరు స్టాఫ్ సత్య గారితో మాట్లాడటం చూసారు.... ఆ మర్నాడు నాతో కూడా సరిగ్గా మాట్లాడడం తగ్గించారు... నేను నా అంతటగా మాట్లాడినా మొహమాటంగా మాట్లాడారు....

ఇంతలో నన్ను కలవడానికి నాతో చదువుకున్న నా ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చాడు. తనకి పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ వచ్చిందని చెప్పడానికి మా స్కూల్ కి వచ్చాడు... తను నేను చాలా మంచి స్నేహితులం.... నన్ను టీచర్ గా చూసి, ‘నువ్వు పిల్లలకి పాఠాలు నేర్పుతున్నావా లేక అల్లరి నేర్పుతున్నావా ‘అంటూ ఆటపట్టిస్తుంటే... వాడిని ఒక్కటి వేశా, తిరిగి నన్ను గిచ్చాడు....

ఇదంతా పై ఫ్లోర్ లో ఉన్న బాలు గారు చూసారు...

ఆ రోజు సాయంత్రం నన్ను ఆపి “ఎవరు తను?” అని అడిగారు....

“నా స్నేహితుడు” అని చెప్పా...

“ఫ్రెండ్ ఐతే అంతగా ఓవర్ గా ఉండాలా.... నాకు అలా నచ్చలేదు” అంటూ అజమాయిషీ చేసారు. నాతో ఎంతో ఇష్టంగా ఉన్న అతను సడెన్ గా ఇలా మాట్లాడం చూసి నాకేం అర్థంకాలేదు.....

ఇంక నేను ఓపిక పట్టలేక,” ఐనా నన్ను అదుపులో పెట్టడానికి మీరు ఎవరు? నాకేం అవుతారు?” అని అడిగాను.

దానికి అతను మౌనంగా నిలబడ్డారు ....

నేను అక్కడినుండి వెళ్ళిపోయా.... ఆ రాత్రి అంతా అయోమయ స్థితి లో ఉండిపోయా.. ఏదేమైనా రేపు నా మనసులో మాట చెప్పేద్దాం అని నిర్ణయించుకున్నా...... మరునాడు నేను తన కోసం ఎదురుచూశా.... స్కూల్ మొత్తం వెతికాను.... ఎక్కడా కనిపించలేదు....... తనకోసం అడిగితే,’సార్ కి హెల్త్ బాగాలేదని లీవ్ తీసుకున్నారు’ అని చెప్పారు..... ఏం చేయాలో ఒక క్షణం తోచలేదు... ఫోన్ చేయడానికి అతని నెంబర్ లేదు.... ఎప్పుడూ ధైర్యం చేసి అడగలేదు...... చేసేది లేక ఆ ఒక్కరోజు ఓపిక పట్టాను..... మర్నాడు కూడా తను రాలేదు.... అలా తన కోసం ఎదురు చూస్తూ వారం రోజులు అయ్యాయి.మనసులో ఎదో తెలియని భయం..... బాధ.......

ఇంతలోనే ఒక వార్త, తను వేరే స్కూల్ లో జాయిన్ అయ్యారు అని.....ఒక్కసారిగా ఎం చేయాలో తెలియని పరిస్థితి.......,.ఇంతలో 'మీకు ఫోన్ వచ్చింది మేడం' అని ఆఫీస్ నుండి కబురు పంపించారు...... పిల్లలకి వర్క్ ఇచ్చి నేను ఆఫీస్ రూమ్ కి వెళ్ళా .

“హలో... ఎవరు?” అని అడిగాను...

“నేనే అక్కని “అంటూ మాట్లాడింది.

“హా చెప్పక్కా ! ఏంటి కాల్ చేసావ్ ?”అని అడిగాను.

“ఏంలేదు. రేపు స్కూల్ కి సెలవు పెట్టుకో .నేను పాపతో మన ఇంటికి వస్తున్నా అంది.

“సరే అక్కా” అని ఫోన్ కట్ చేశా.ఇంటికి వెళ్లేసరికి అమ్మమ్మ, తాతయ్య ఉన్నారు.

“ఎప్పుడొచ్చారు?” అని పలకరించి... రాని నవ్వు నటిస్తూ మాట్లాడాను..... “సరే నేను ఫ్రెష్ అయి వస్తా” అని వెళ్ళిపోయా. మర్నాడు ప్రొద్దున్నే అక్క, బావగారు వచ్చేసారు.

అక్క రావడంతోనే,” ఏంటి చెల్లీ! ఇంకా రెడీ అవ్వలేదా? “అంటూ అడిగింది..

“ఎక్కడికయినా వెళ్తున్నామా?” అని అడిగా.

“మ్... సరిపోయింది. చూసుకోవడానికి వాళ్ళు వచ్చే టైం అవుతోందే ...పద, నిన్ను రెడీ చేస్తా” అంటూ నన్ను లోపలికి తీసుకెళ్ళింది.

“నన్ను సెలవు పెట్టమని చెప్పింది పెళ్లి చూపుల కోసమా?” అని అడిగా....

ఒక నవ్వు నవ్వింది...అనుకున్న సమయానికి చూసుకోవడానికి పెళ్లి పెద్దలు వచ్చారు.వచ్చిన వాళ్ళకి నన్ను పరిచయం చేసి ,లోపలికి పంపించేశారు.వాళ్ళకి ‘అన్ని విధాలుగా సంబంధం నచ్చింది’ అని చెప్పి వెళ్లిపోయారు..... పెళ్ళికి ముహుర్తాలు పెట్టించేసారు. పెళ్లి పనులు మొదలు అయ్యాయి... ఆఖరి ప్రయత్నం గా బాలుగారిని కలవాలి అనుకున్నా, కానీ పరిస్థితులు నాకు సహకరించలేదు.... పెళ్లి పిలుపులకు స్కూల్ కి వెళ్ళాను.... కార్డు ఇచ్చి అందరికీ పేరుపేరునా చెప్పా...... పెళ్ళికి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది.. ఇల్లు అంతా బంధువులతో నిండిపోయింది..పెళ్లిరోజు రానేవచ్చింది . ఇంకా కొన్ని గంటల్లో నేను వేరే వారికీ సొంతం అనే బాధ నాలోనే దిగమింగి, పెళ్లిపీటల వైపు అడుగువేశా......

ఇష్టపడ్డ వాళ్ళకి వారి ప్రేమని వ్యక్తపరచలేక వారిలోనే దాచుకున్న ఎందరో ప్రేమికులకి నా ఈ మూగ మనసులు కథ అంకితం.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి

97 views0 comments
bottom of page