top of page

ముగ్గురు స్నేహితులు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.




Video link

'Mugguru Snehithulu' Telugu Story By N. Sai prasanthi

రచన: N. సాయి ప్రశాంతి

ముగ్గురు స్నేహితులు సాహసం చూపి ఒక మాంత్రికుడిని ఎదిరించారు. అంతం చేశారు.

తమకు దొరికిన సంపదను నలుగురికి పంచి తమ మంచి మనసు నిరూపించుకున్నారు.

ఈ సాహస గాధను సాయి ప్రశాంతి గారు రచించారు.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.


ఇక కథ ప్రారంభిద్దాం

అనగనగా ఒక ఊరిలో రాజు, రవి, రాము అవి ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారు చాలా స్నేహంగా ఉండేవారు.

అయితే వారు రకరకాల కుటుంబాల నుండి వచ్చిన వారు. రాజు బాగా ధనవంతుడు. రవి, రాము మధ్యతరగతి వారు.

అయినా కలిసి మెలిసి తిరిగేవారు. అయితే వారి తల్లిదండ్రులు పట్నం వెళ్ళి డబ్బులు సంపాదించుకొని రండి అని చెప్పడంతో ప్రయాణం ప్రారంభించారు.

పట్నం వెళ్లి వ్యాపారం చేయాలని వారి ఆలోచన.

ముగ్గురు కొంత డబ్బు తీసుకుని ప్రయాణం ప్రారంభించారు

అయితే ఆ రోజుల్లో వాహనాలు లేవు కాబట్టి నడిచే వెళ్తున్నారు. మధ్యాహ్న సమయం తిని, కాసేపు విశ్రమించారు. బయలుదేరే సమయంలో అనుకోకుండా వారు ఒక నదిని చూసారు. ఆ నది చాలా చక్కగా ఉంది. అయితే అప్పుడే ఎవరో మనిషి యొక్క ఆర్తనాదాలు విన్నారు. పరుగు పరుగున అక్కడికి వెళ్లగా, అక్కడ ఒక వింతని చూసారు. ఎవరో ఒక వృద్ధుడు తన వస్తువులు నదిలో పడిపోయాయని ఏడుస్తున్నాడు.


అప్పుడు వీరు అక్కడికి వెళ్లి "ఏమయింది తాతా" అని అడిగారు.

ఆయన "చూడండి బాబూ! నేను పనిమీద వేరే ఊరి వెళ్తున్నాను. దాహం వేసి నీరు తాగుదామని ఇక్కడ ఆగాను. అయితే నీరు తాగుదామని దిగే లోపే ఒక భయంకరమైన వ్యక్తి, చూడడానికి మంత్రగాడిలా ఉన్నాడు, ప్రత్యక్షమై "ఈ నది నాదీ, ఈ నది నీరు ఎవరు

ముట్టకూడ"దని చెప్పి, నా వస్తువులు బంగారం మరియు డబ్బు లాక్కుని మాయమైపోయాడు. అయితే ఆ మాంత్రికుడు ఎక్కడుంటాడో నాకు తెలిసినా వయసైపోయినవాణ్ణి, అంతదూరం వెళ్లలేను. మీరు నాకు సహాయం చేయగలరా" అని వివరించాడు.

వారు ఆలోచిస్తూ ఉండగా, "చూడండి బాబూ, వాడు దొంగతనంగా చాలా ధనం సంపాదించాడు. ఇప్పుడు ఏవో శక్తులు రావాలని తపస్సు చేస్తున్నాడు. మీరు వాణ్ణి చంపేస్తే ఆ డబ్బంతా మీదే అవుతుంది" అంటాడు.

డబ్బు మీద ఆశవల్ల ఒప్పుకుంటారు.

అయితే ఆయన ఇలా చెప్పడం మొదలు పెడతాడు


"చూడండి బాబూ! వాడిని గెలవడం అంత సులభంకాదు. వాడిదగ్గర ఒక మాయా పక్షి ఉంది. అది వాడికి సాయం చేయడానికి వేషాలు మార్చి తిరుగుతూ ఉంటుంది. ముందు మీరు దానిని గెలవాల్సి ఉంటుంది. అయితే దాన్ని గెలవాలంటే మీ దగ్గర మాయా ఖడ్గం ఉండాలి. అది ఇప్పుడు మీ ఎదురుగా ఉన్న గుహలో ఉంటుంది. కానీ దానికి రక్షణగా ఏడు సింహాలు ఉంటాయి. ఆ మాయా పక్షి చనిపోతేనే వాడు చనిపోవడం కూడా జరుగుతుంది" అని వివరించాడు.


వాళ్లు చాలా ఆశ్చర్యానికి గురౌతారు.

అప్పుడు మళ్లీ ఆయన "ఈ ప్రయాణం కష్టమైనదే కానీ మీరు గెలిస్తే గొప్ప వీరులుగా మిగిలిపోతారు కానీ జాగ్రత్త. ఏ విధమైన ప్రలోభాలకి గురికాకండి" అని హెచ్చరించాడు.

ఇక వాళ్లు ఆలోచనలో పడతారు.

రవి అంటాడు "వెళ్లిపోదాం. ఎందుకంటే ఆ మాంత్రికునితో పోరాడే శక్తి మనకు లేదు. ఎందుకు మన జీవితాలను పణంగా పెట్టడం" అని.

అప్పుడు రాము "ఒకవేళ మనం గెలిస్తే ఆ సంపదలన్ని మనవే అవుతాయి. మరియు ఊరిజనం ముందు మనం చాలా గొప్ప పేరు పొందుతాం. ఏదేమైనా పదిమందికి గుర్తుండిపోతాం. పోరాడదాం" అంటాడు.

ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంటారు. ఆతర్వాత

సరే పోరాడి ఓడినా మంచిదే కానీ వెనుదిరగవద్దని గుర్తు తెచ్చుకుని ముందుకు ప్రయాణమవుతారు.


ముందుగా వారు ఆ గుహలోకి వెళ్తారు. అక్కడ చాలా గదులున్నాయి. ఒకగదిలో రకరకాల ఆహారపదార్థాలు, మరో గదిలో నగలు, ఇంకో గదిలో చీరలు ఉన్నాయి. వారి ముందుకు వెళ్లే కొద్ది లెక్కలేనంత ధనం, నాణేలు కనిపించాయి

అయితే వీరు ముట్టుకుందామనేలోపే మాయమైపోయాయి

అప్పుడు వారికి ఆ తాత చెప్పింది గుర్తుకు వస్తుంది.

ఏ విధమైన ప్రలోభాలకి లోను కావద్దని.

చివరి గదిలో ఖడ్గం ధగధగా మెరుస్తూ కనిపించింది అయితే సింహాలు కనిపించలేదు. త్వరపడితే ప్రమాదమని వేచి ఉన్నారు. మరో వ్యక్తి వెనక నుండి వచ్చి ఆ ఖడ్గం తీసుకోవాలని చూడగా, సింహాలు ప్రత్యక్షమై అతనిని చంపేసాయి.

అప్పుడు వారు గ్రహించారు అక్కడి మాయాజాలాన్ని.

అప్పటికి రాత్రి కావడంతో నిద్రకుపక్రమించారు.

తెల్లవారగానే ఆ ఖడ్గం ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉండగా, ఒక పుస్తకం కనిపించింది అది తెరచి చూడగా ,అందులో ఆ గుహకి సంబంధించిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ సింహాలను గెలవాలంటే మాయ తోనే సాధ్యం. అంటే మాయ చేసే వాటిని గెలవగలం. ఆ ఖడ్గం సాధించినవారు మాత్రమే సింహాలను చంపగలరు అని.

అంటే ఇప్పుడు వారికి అర్ధమైంది మనం ఆ ఖడ్గాన్ని తాకకుండా మాత్రమే సాధించగలం.

అప్పుడు వారొక ఆలోచన చేసారు


అది లోహంతో తయారుచేయబడింది కనుక దానిని ఆకర్షించే పదార్ధం పెడితే అదే వచ్చేస్తుంది అని.

వారు ఆ విధంగా ప్రయత్నించి చూడగా ఆ ఖడ్గం నిజంగానే వీరివైపుకు ఆకర్షించబడింది.

ఆ ఖడ్గం వీరి చేతుల్లోకి రాగానే సింహాలు ప్రత్యక్షమయ్యాయి

ఆ పుస్తకములో రాసినట్టుగానే ఆ సింహాలు ఈ కత్తి దెబ్బ తాకగానే అచేతనంగా పడిపోయాయి.


అప్పుడు అక్కడ అద్భుతం జరిగింది ఏడుగురు దేవతలు ప్రత్యక్షమై "మానవులారా! మీరు ధన్యులు. మాకు మా తప్పు వల్ల ఇలా సింహాలుగా బ్రతికే శాపం విధించబడింది. ఈ నాడు మీ తెలివి వల్ల మాశాప విమోచనమైంది. అందువల్ల మీకు ఒక వరం ఇస్తున్నాం. ఈ మాయా వస్త్రం గ్రహించండి ఇది వేసుకుంటే మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లగలరు" అని మాయమైపోయారు.


ఆ ఖడ్గం మరియు ఆ వస్త్రం ధరించి వారు ఆ గుహ నుండి బయటకు వచ్చారు.

ఈ విషయాలన్నీ ఆ మాంత్రికునికి తెలిసి కోపంతో రగిలిపోయాడు. మాయా పక్షి ని పిలిచి ఎలాగైనా ఆ ఖడ్గం దొంగిలించమని చెప్పాడు. కానీ వారు ముందే జాగ్రత్తగా ఉండడంతో ఎంత ప్రయత్నించినా ఆ ఖడ్గం దానికి చిక్కలేదు. అయితే ఆ తర్వాత ఆ మాంత్రికుడు తన శక్తితో కాలా అనే రాక్షసుణ్ణి సృష్టించి వారిని చంపేయమని పంపించాడు.


ఈ లోపు వారు ఆ వస్త్రం ఉపయోగించి ఆ మాయా పక్షి ని పట్టుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు.

అప్పుడు వారి దగ్గరగా కాలా వచ్చాడు. ఈ ముగ్గురికీ ఏంచేయాలో తోచలేదు.

పరిగెత్తడం ప్రారంభించారు.

అయితే రాముకి ఒక ఆలోచన వచ్చింది

'వీడికి ఒకటే కన్ను ఉంది కదా.. కత్తితో పొడిస్తే దారి కనబడదు కదా.. అప్పడు మనం తప్పించుకోవచ్చు' అని.

వారు పరిగెడుతూ ఒకచోట కలుసుకున్నప్పుడు ఇదే మాట చెప్పాడు మిగిలిన ఇద్దరితో కూడా. వారు కూడా సరే అన్నారు.

అయితే ముందు రాము ఆ కాలాని తప్పుదారిలో వెళ్లేలా చేస్తే రాజు వచ్చి వెనకనుండి కత్తితో పొడవాలని ఆలోచన చేసారు. అయితే అప్పుడు కాలా రాము వెంట కాక కత్తి చేతిలో ఉన్న రాజు వెంటే పడ్డాడు. అప్పుడు అర్థమైంది వారికి, ఇదంతా ఆ మాంత్రికుని పథకం అని.

పథకం మార్చారు. ఆ కత్తిని కనబడకుండా దాచేసారు. రాము ఆ రాక్షసుడి వెనకాల వెళ్లాడు.

శబ్దంలేకుండా వెళ్లి కత్తిని తీసి ఆ రాక్షసుడి కంట్లో గట్టిగా పొడిచేసాడు. వాడు ఒక్కసారిగా కింద పడ్డాడు. వారు ముగ్గురు పక్కగా పారిపోయారు. కాలా ఆ కత్తి దెబ్బకి చనిపోయాడు.

వారు ముగ్గురు సంతోషించి ఆ మాయా వస్త్రం ధరించి మాయా పక్షి ని పట్టుకోవాలని బయలుదేరారు.

అది వీరినుండి తప్పించుకోవాలని ఒక గుహలో అమ్మవారి విగ్రహంలో దూరింది. వారు ఆ మాయా వస్త్రం సహాయంతో ఆ గుహలోకి ప్రవేశించారు. అయితే అక్కడ వెళ్లగానే విచిత్రమైన శబ్దాలు వినిపించడం మొదలైంది. వారికి భయం వేయడం మొదలైనది. ఇదంతా ఆ మాయా పక్షి యొక్క మాయ అని వారు గుర్తించగలిగారు. అయితే ఆ తర్వాత ఏ మాత్రం భయపడకుండా ముందరికి తమ ప్రయాణం సాగించారు. అప్పుడు వారికి ఆ అమ్మవారి విగ్రహం మరియు ఆ మాయా పక్షి కనిపించాయి. ఆ మాయా పక్షి రూపాలు మార్చుకుంటూ వారిని గందరగోళానికి గురిచేయడం మొదలు పెట్టింది.


అది ఒకసారి పెద్దగా మరోసారి చిన్నగా మారిపోవడం మొదలు పెట్టింది. అయితే ఆ పక్షిని మళ్లీ అమ్మవారి విగ్రహంలోకి వెళ్లేలా చేయగలిగితే పట్టుకోవచ్చని ఆలోచించారు. ఆ విధంగా ప్రయత్నించి ప్రయత్నించి చివరకి అలా వెళ్లేలా చేయగలిగారు.

అప్పుడు రాము దానిని పట్టుకోగా, రాజు కత్తితో కొట్టాడు. అప్పుడు ఆ పక్షి స్థానంలో ఒక గంధర్వుడు ప్రత్యక్షమై నా శాపం తీరిపోయిందని ఇక మాంత్రికుని వినాశనం తథ్యమని చెప్పి మాయమైపోయాడు.


వీరు ఆ గుహ నుండి బయటకు వచ్చి ఆ మాంత్రికుని కోసం వెదకడం మొదలు పెట్టారు.

ఆ మాయావస్త్రం ధరించి వాడి గుహ వద్దకు చేరుకోగానే వాడు ఇదంతా తెలుసుకుని కోపంతో అరుస్తూ, ఒక దున్నపోతు రూపాన్ని ధరించాడు.


వీరు ముగ్గురు వాడిని వెతుకుతూ ఉండగానే వాడు వీరి మీద దాడి ప్రారంభించాడు. పాపం ముగ్గురికీ గాయాలు అవుతూనే ఉన్నాయి. అప్పుడు వారు ముగ్గురికీ ఒక ఆలోచన వచ్చింది మనం కూడా మన మాయా విద్య ఉపయోగించాలని.

వెంటనే ఆ మాయా వస్త్రం ఉపయోగించి ముగ్గురూ మాయమైపోయారు.

ఆ మాంత్రికునికి ఏం అర్థం కాలేదు. వాడు వీరిని వెతుకుతూనే ఉన్నాడు.

వీరు ఎక్కడా కనిపించలేదు కానీ వారు మాయమై ఆ కత్తితో వాడిని కొడదామని దాడి చేయడం ప్రారంభించారు. ఆ దెబ్బలు చాలా బలంగా తాకుతున్నాయి. అప్పుడు అక్కడ వాడు అక్రమంగా సంపాదించిన డబ్బు, నగలు వాహనాలు, వస్తువులు వారికి కనిపించాయి. అదే కత్తితో బలంగా వాడిని పొడిచారు.


అంతే! వాడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ డబ్బు, సంపద చూసి వీరు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ గుహను కూల్చేసి ఆ సంపదలన్నీ తీసుకుని బయటకు వచ్చారు. ఆ మాయా వస్త్రం ఉపయోగించి వారికి ఈ విషయం చెప్పిన తాత దగ్గరకు వెళ్లి ఆయన వస్తువులన్నీ ఆయనకు ఇచ్చేసారు. ఆ తర్వాత అదే మాయా వస్త్రం ఉపయోగించి వాళ్ల ఊరు వెళ్లి కొంత డబ్బు వారు తీసుకుని మిగిలినదంతా పేద ప్రజలకు దానం చేసేసారు. మరికొంత ఆ రాజ్యం యొక్క రాజుకు ఇచ్చేసి తమ గొప్పతనం చాటుకుని మంచి కీర్తిని పొందారు.

***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నమస్తే.నా పేరు సాయి ప్రశాంతి. ఉస్మానియా యూనివర్సిటీ లో మైక్రో బయాలజీ చదివాను. ఎడ్యుకేషన్ సంబంధిత ఆర్టికల్స్ ఎన్నో వ్రాసాను. కథలంటే ప్రాణం. చిన్న పిల్లల కథలు వ్రాయడం నా హాబీ.




613 views0 comments

Comments


bottom of page