top of page

ముందు చూపు'Mundu Chupu' - New Telugu Story Written By D V D Prasad

Published In manatelugukathalu.com On 02/05/2024

'ముందు చూపు' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్వారం రోజుల కిందట చార్ ధాం యాత్రలకని సతీ సమేతంగా వెళ్ళిన ఆనందరావు బద్రీనాథ్లో ఉండగా ఆ రోజు ఉదయమే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించాడన్న వార్త విన్న రామారావు ఒక్కసారి షాక్కి గురైయ్యాడు. తనకి తెలిసిన ఆ వార్త నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి తనకి తెలిసిన మరో నలుగురు మిత్రులకి ఫోన్ చేసాడు రామారావు. వాళ్ళు కూడా ఆ వార్త నిజమేనని చెప్పడంతో కాళ్ళూ చేతులు ఆడలేదు రామారావుకి. అతనెనుందుకు అంత ఆదుర్దాగా ఉన్నాడోనని ఆందోళన చెందుతున్న సతీమణి సరోజకా విషయం చెప్పేసరికి ఆమె కూడా నివ్వెరపోయింది.


"అయ్యో పాపం! యాత్రకి వెళ్ళేముందే మనింటికి వచ్చి వెళ్ళారా దంపతులు. ఆవిడకి ఎంత కష్టం వచ్చింది? పైగా ఊరుకాని ఊరాయే! భార్య తప్ప తెలిసిన వాళ్ళు, దగ్గరవారు ఇంకెవరూ దగ్గర లేనప్పుడు ఇలా జరగడం ఆమె దురదృష్టం. పాపం, ఎలా చేస్తుందో ఏమో?" అని తన విచారం వెలిబుచ్చింది సరోజ. ఆమె కనులనుండి రెండు కన్నీటి బొట్లు జారాయి కూడా.


ఆనందరావు, రామారావు ఇద్దరూ బాల్య మిత్రులు. చిన్నప్పటినుండి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. కాలేజీ చదువులు కూడా వాళ్ళిద్దర్నీ విడదీయలేదు. మరో విశేషమేమిటంటే, చదువు పూర్తైన తర్వాత ఇద్దరూ ఒకే ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగంలో చేరారు. అలా వాళ్ళ స్నేహబంధం నిర్విఘ్నంగా కొనసాగింది. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఒకే ఊళ్ళో ఉంటున్నారు, కాకపోతే ఇద్దరూ వేర్వేరు వీధుల్లో ఉన్నారు. రిటైరై మూడేళ్ళు కూడా పూర్తికాలేదు, ఇంతలో ఆనందరావు అనుకోని విధంగా ఇలా మృత్యువాత పడతాడని ఊహించలేదు రామారావు. నిజానికి రామారావు దంపతులు కూడా వాళ్ళతోనే యాత్రలకి వెళ్ళాల్సి ఉండగా సెలవులు దొరికిన కారణంగా బెంగుళూరు నుండి కూతురు, అల్లుడు, మనవలు రావడంతో తమ ప్రయాణం రద్దు చేసుకున్నారు. స్నేహితుడి కుటుంబంతో కలిసి చార్ ధాం యాత్రకి వెళ్ళలేనందుకు రామారావు బాధపడ్డాడు కూడా. 


ఆనందరావు కుమార్తెలిద్దరికీ పెళ్ళిళ్ళైపోయాయి. బాధ్యతలన్నీ తీరిపోయి, ఇక జీవితంలో చివరి రోజులు ప్రశాంతగా గడపడానికి నిశ్చయించుకున్న ఆనందరావుని మృత్యువు ఇలా అర్ధాంతరంగా కబళించింది. యాత్రలకెళ్ళేముందు ఇద్దరూ కలిసి తనివితీరా గంటలకొద్దీ మాట్లాడుకున్నారు. సాధారణంగా వాళ్ళ మాటల్లో ఆఫీసు విషయాల దగ్గరనుండి రాజకీయాల వరకూ దొర్లుతుంటాయి. స్నేహితులిద్దరూ కలిస్తే వాళ్ళ మాటలకి అంతే ఉండదు! యాత్రలకి బయలుదేరిన ముందురోజే కలిసారిద్దరూ. అత్యంత సన్నిహితుడైన తన మితృని మరణవార్త రామారావు హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. వారం రోజుల క్రితం ఆనందరావు మాట్లాడిన మాటలే గుర్తుకు వస్తున్నాయి. సోఫాలో కూలబడిపోయి, ఆనందరావు సతీమణి విమలకి ఫోన్ చేసాడు. ఆమె ఫోనెత్తగానే, "హల్లో!..." అన్నాడు కానీ తర్వాత ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.


అవతలవైపు నుండి రెండు క్షణాల సేపు విమల కూడా ఏమీ మాట్లాడలేకపోయింది పొంగుకొస్తున్న దుఃఖంవల్ల.


"అన్నయ్యగారూ!...ఆయన నన్ను నన్ను అన్యాయంచేసి, నట్టేట ముంచి వెళ్ళిపోయారు.." అందామె అతి కష్టమీద. ఆ తర్వాత ఆమె కంఠం దుఃఖంతో పూడుకుపోయి మరి మాట్లాడలేకపోయింది.


రామారావు పరిస్థితీ అలానే ఉంది! సరోజ కూడా రామారావు దగ్గరే కూర్చొని ఉంది. స్పీకర్ ఆన్ చేసాడు రామారావు. "యాత్రలకెళ్ళారు, ఆనందంగా తిరిగి వస్తారనుకున్నాం చెల్లెమ్మా! ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. దేవుణ్ణి చూడటానికి వెళ్ళినవాడు ఆ దేముడి దగ్గరకే వెళ్ళిపోయాడు. ఏది ఏమైనా భగవంతుడు నీకు చాలా అన్యాయం చేసాడు. అసలు ఏం జరిగింది?" అడిగాడు.


"వారంరోజులుగా తీర్థయాత్రల్లో తిరుగుతున్నాం. నిన్న రాత్రే బద్రీనాథ్ కి వచ్చాం. కొద్దిగా నలతగా ఉందన్నారు! మాత్ర ఒకటి వేసుకున్నారు. అంతే! ఇంకా దర్శనానికి బయలుదేరేంతలో హఠాత్తుగా అతనికి గుండెనొప్పి వచ్చింది. ఇంతకుముందు ఒకసారి వచ్చిందని మీకు తెలుసుకదా! ఆపరేషన్ కూడా జరిగింది. ఈసారి మరింత తీవ్రంగా గుండెనొప్పి వచ్చింది. మాతో పాటు వచ్చిన వాళ్ళు సహాయం చెయ్యగా అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాను. కానీ, చికిత్స మొదలవకుండానే అతని ప్రాణం పోయింది..." మరి ఆ తర్వాత మాట్లాడ లేకపోయిందామె. అంతుతెలియని శోకం ఆమెని మరి మాట్లాడనివ్వలేదు.


రామారావు కళ్ళల్లో కూడా నీళ్ళు తిరిగాయి. ఫోన్ సరోజ చేతికిచ్చి కనులు తుడుచుకున్నాడు. 


"అన్నయ్యగారికి ఇలా అకస్మాత్తుగా జరుగుతుందని అసలు ఊహించలేదు. ఇంకా మీరు మరో రెండు రోజుల్లో తిరిగి వస్తారనుకున్నాం! ఈలోగా ఇలాంటి విషాద వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. మీరు ధైర్యంగా ఉండండి వదినగారూ! మీరే అధైర్యపడితే, అనిత, సునీతని ఓదార్చేవారెవరు?" అని విమలని ఊరడించడానికి తన వంతు ప్రయత్నం చెయ్యసాగింది సరోజ. మరో పదినిమిషాలు మాట్లాడింది సరోజ. శోకమూర్తిగా మారిన విమలని ఓదార్చింది.


ఆనందరావు అమ్మాయిలు, అల్లుళ్ళు ఎలాగో అక్కడకు చేరుకొని, ఆనందరావు మృతదేహాన్ని ఊరికి తీసుకువచ్చారు. ఆనందరావుని అలా విగతజీవుడిగా చూసిన రామారావు హృదయం కలుక్కుమంది. అంత్యక్రియలు పూర్తయ్యేవరకూ వాళ్ళకి సాయంగా ఉన్నాడు రామారావు. సరోజ కూడా కార్యక్రమాలన్నీ పూర్తయ్యేదాక విమలకి తోడుగా నిలిచింది.


చూస్తూండగానే పక్షం రోజులు ఇట్టే గడిచిపోయాయి. స్నేహితుడితో గడిపిన క్షణాలే రామారావుని అనుక్షణం కలవరపెడుతూ ఉంటే, భార్య సరోజతో కలిసి వాళ్ళింటికి వెళ్ళాడో రోజు. విమలకి రావలసిన ఫామిలీ పెన్షన్ కోసం ఆమెచేత దరఖాస్తు చేయించాలని అనుకున్నాడు. బ్యాంక్ ఖాతాల విషయంలో కూడా ఆమెకి సహాయం చెయ్యవలసి రావచ్చు కూడా. వాళ్ళింటికి వెళ్ళేసరికి, విమలే కాక, అమ్మాయిలిద్దరూ కూడా ఇంట్లో ఉన్నారు.


"చూసారా అన్నయ్యగారూ, ఆయన ఎలాంటి పని చేసారో? ఫామలీ పెన్షన్ కోసం దరఖాస్తు చెయ్యడానికి మీ సహాయం తీసుకోవాలని అనుకున్నాను. అందుకోసం బ్యాంక్ పాస్ బుక్కు, పెన్షన్ బుక్కు కోసం అలమరాలో వెతుకుతూ ఉంటే ఈ ఫైల్ దొరికింది. చూద్దును కదా, అందులో అతను తన వీలూనామాతో పాటు ఈ కాగితాలు ఉంచారు." అంటూ ఓ ఫైల్ అందించిందామె.


ఆ ఫైలు తెరిచి, అందులోని కాగితాలు చూసి ఆశ్చర్యపోయాడు రామారావు. ఫామలీ పెన్షన్ కోసం దరఖాస్తు చెయ్యడానికి కావలసిన అన్ని కాగితాలు అందులో ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ నంబర్ తో సహా అన్నీ ఆనందరావు స్వదస్తూరితో పూర్తి చేసి ఉన్నాయి. కేవలం ఆమె వాటి మీద సంతకం చేసి, కార్యాలయంలో అందజేయడం మాత్రమే మిగిలి ఉంది. అలాగే బ్యాంక్ అక్కౌంట్, ఫిక్సిడ్ డిపాజిట్ల కోసం దాఖలు చెయ్యవలసిన నామినేషన్ల పేపర్లు కూడా నింపి ఉంచాడు. భార్య విమల పేరునా, ఇద్దరు కుమార్తెల పేరున వీలూనామా కూడా చేసి ఓ కవరులో ఉంచాడు. అవి చూసి నిర్ఘాంతపోయాడు రామారావు. అంటే...అంటే...ఆనందరావు తన మరణాన్ని ముందే ఊహించాడా? తను ఏ పరిస్థితిలోనైనా ముందే చనిపోతే, ఆమెకే రకమైన ఇబ్బంది కలగకూడదని అన్ని పేపర్లు ముందుగానే తయారు చేసి ఉంచాడా! సరోజ కూడా వింతగా ఆ కాగితాలవైపు చూస్తోంది.


"తను చనిపోయిన తర్వాత అమ్మకేమీ ఇబ్బంది కలగకూడదని నాన్నగారు ఎలా చేసారో చూసారా?" అంది ఆనందరావు పెద్ద కుమా ర్తె అనిత నీళ్ళు నిండిన కళ్ళతో.


మృత్యువు తనని ఇలా అకస్మాత్తుగా కబళిస్తుందని ఊహించిన ఆనందరావు ముందే జాగ్రత్తపడ్డాడు. ఒకవిధంగా ఆనందరావు ముందుచూపుకి మనసులోనే అతనికి జోహార్లప్పించినా, హృదయం మాత్రం అంతు తెలియని బాధతో నిండిపోయింది. చివరిసారి కలిసినప్పుడు ఆనందరావు అన్న మాటలే రామారావు చెవుల్లో మారుమోగుతున్నాయి. 


"ఒరేయ్! అరవైఏళ్ళు దాటాక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మన జాగ్రత్తలో మనముండాలి. నేను చనిపోతే నా భార్య విమలకి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు. అందుకోసం తగిన ఏర్పాట్లన్నీ ముందుగానే చేసానురా!" అనందరావు మాటల సందర్భంగా అనేసరికి తనకి కోపం వచ్చింది కూడా.


"అలాంటి అపశకునం మాటలు మాట్లాడకురా! ఇప్పుడే నీకేమంత వయసు వచ్చిందని? మొన్ననేగా అరవైరెండు దాటి అరవైమూడులోకి ప్రవేశించావు! వయసు ఒక సంఖ్య మాత్రమే! బాధ్యతలన్నీ తీరిపోయాయి కనుక, ప్రశాంతంగా, ఆనందంగా జీవితం గడపవలసిన సమయమిది." అని తను మందలించాడు కూడా.


చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఆనందరావు. అంటే...ఆనందరావు ఇలాంటిదేదో జరిగే అవకాశం ఉందని ముందే ఊహించి అనూహ్యంగా ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడన్న మాట అనుకున్నాడు రామారావు. తన మరణాంతరం భార్యకి ఏ కష్టమూ కలగకూడదని అతను చేసిన ఏర్పాట్లకి హర్షించినా, రామారావు మనసులో మాత్రం బాధ ఏ మూలో కలుక్కుమంది. తనకి తెలియకుండానే రెండు కన్నీటిబొట్లు రామారావు కళ్ళ నుండి జాలువారాయి.


 *************


దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.77 views0 comments

Comments


bottom of page