ఓడిపోయిన అమ్మ

'Odipoyina amma' written by G. Ashok Kumar
రచన : జి. అశోక్ కుమార్
ఒక ఊరిలో అల్లరి చిల్లరగా, జులాయిగా తిరిగే ఒక కుర్రాడు వుండేవాడు. వీడికి ఎలాగైనా పెళ్లి చెయ్యాలి అని అనుకునే తల్లిదండ్రులు.పెళ్లి చేస్తే బాగుపడతాడు అని వాళ్ళ అభిప్రాయం! అందుకే వెతికి వెతికి పక్క వూరిలో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసారు.
ఆ అమ్మాయి పెళ్ళియిన కొత్తలో చాలా ఇబ్బంది పడింది. తరువాత అన్నీ తనకు అనుకూలంగా మార్చుకుంది. తన భర్తను మార్చుకొని అత్త మామలను బాగా చూసుకుంది. ఆ ఊరిలోనే మంచి పేరు తెచ్చుకుంది. ప్రతి ఒక్కరూ తన మాటే వింటారు. అలా కాలక్రమేణా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు, కానీ ఒక్క మగపిల్లాడు లేడు. అది అత్త మామలకు బాధగా వుండేది.
ముగ్గురు పిల్లలను కనడంతో తనకు నొప్పులు ఎక్కువగా ఉండేవి, అందుకే అందరూ కలసి మాట్లాడుకున్నారు ఈసారి పాపా బాబు నా అని టెస్ట్ చేయించుకోవాలి అని. పాప అయితే తీసేద్దాం అని. తనకు ఇష్టం లేక పోయినా ముగ్గురు ఆడపిల్లల తరువాత కొడుకు పుడతారని ఎవరో చెప్పారు. అందుకే సరే అని ఒప్పుకుంది. ఇప్పుడు తనకు ఐదు నెలలు అందుకే ఎవరికి తెలియకుండా టెస్ట్ చేయించారు. అడపాప అని తేలింది. అత్త, మామ, భర్త ముగ్గురూ ఒకే మాట. ఇప్పుడు నీ ఇష్టం. మాకు మళ్లీ అయినా ఒక మగ బిడ్డ కావాలి అని, నీవు కనాలి అని! తను ఏమో ఇంక నా చేత కాదు అని..
ఆ చర్చలో అందరూ.. ఆఖరికి తల్లిదండ్రులు కూడా అబార్షన్ మేలు అని చెప్పగా తనుకూడ ఇష్టం లేకపోయినా తప్పక ఒప్పుకుంది.
పెళ్లి అయిన తరువాత ఎన్నో మార్చుకుంది, ఎందరినో మార్చింది, కానీ తన వాళ్ల నిర్ణయాన్ని కాదనలేకపోయింది. కుటుంబాన్ని మోసి మోసి తన బిడ్డనే మోయలేకపోయింది. కాదు కాదు.. అలా చేశారు చుట్టూ ఉన్న తన వాళ్ళు, బంధువులు, సమాజం! వారసుడు.. వారసుడు.. అని అలా తయారు చేశారు.
తన బిడ్డను తనే చంపుకునేలా చేశారు. ‘పురిటి నొప్పుల బాధ తెలియని మగాడు మగబిడ్డను కనేదాకా వదలడు. అలాని ఎక్కవ ఆడబిడ్డలను సాకలేడు’ అని అర్థం చేసుకున్న ఆ తల్లి ఓడిపోయింది. మొదటి సారి ఓడిపోయింది.
ప్రపంచాన్ని జయించిన తల్లి తన్ను తాను గెలవలేక ఓడిపోయింది.
***