top of page

ముంగిట ముగ్గు ..... !!



Mungita Muggu written by Goparaju lakshmi kumar

రచన : గోపరాజు లక్ష్మీ కుమార్


సీతా! పాలు పిండుకొచ్చాను.. బాగా మరగ బెట్టి, పెరుగు తోడుపెట్టు.. ఇక్కడి పెరుగంటే పిల్లలకి చాలా ఇష్టం కదా.."అంటూ ఆయన చేతిలో తళ తళ మెరుస్తూ.. మూతికి అరిటి ఆకుతో ఉట్టికట్టిన ఇత్తడి పాల తపేలాను తీసుకొని లోపలికి వచ్చాడు రామకృష్ణ.

"పిల్లలు బండి దిగారంట, ఇంకొక అరగంటలో వచ్చేస్తామని ఫోన్ చేశారు అని భర్త చేతిలోని పాల తపేలా ( పాలు తీసుకొచ్చే పెద్ద సైజు పాత్ర ) తీసుకుంది సీతా మహాలక్ష్మి.

" సరే నేను సెంటర్ లో కెళ్ళి నిలబడతా " అంటూ రాబోయే కొడుకు,కూతురు వాళ్ల పిల్లలకోసం ఆత్రంగా బయలుదేరాడు.

సీత పిల్లలకోసం అల్పాహారం తయారీలో ఉంది.

" సీతమ్మ గోరు.. ఏడుండారు.. గిన్నెలు బయటడేయండి.. "అంటూ యర్రాయమ్మ వచ్చింది.

ఏవే యర్రమ్మ ! నిన్న రమ్మని చెప్పానా.. పండక్కి పిల్లలొస్తారు.. కొన్నయినా అరిసెలు, పోకొండలు, చేద్దామన్నానా.. జాడ లేకుండా పోయావ్.." అంటూ గ్లాస్ లో టీ పట్టుకొని వచ్చింది.

" అయ్యో ఏటి చెప్పేదమ్మా.. మా పిల్ల ఒకటే కొత్త బట్టలు కావాలని ఏడుత్తుండాది .. అందుకే .. మొన్న కోసిన వరి కోత డబ్బులిత్తారేమో అని ఎళ్తే... పంట అమ్మందే డబ్బులెక్కడ తెమ్మంటావ్ అన్నాడా సూరయ్యకాపు.. ఇంకేటి సేసేది లేక పక్కనోళ్ళనడిగి ఐదొందలు అట్టుకెళ్తే.. ఈ డబ్బుకేవి రావు అన్నారు. 'రెండ్రోజులు ఆగవే అంటే'... 'ఇంకెప్పుడు పండగెళ్లాక్కొంటావా' .. అని సిన్న మొఖం చేసుకొంటోంది..."

" బాగానే ఉంది అడిగేది సంవత్సరానికి ఒక్కసారేకదే... కొనివ్వాలి మరి.. "

" మీరలాగే అంటారు, మా పిల్ల సంగతి తరువాత గాని.. ముంగటేడు పండక్కి కూడా ఓయబ్బో... ఎన్నో ఒండేరు .. తీరా ఆళ్లు రాలేదు. పోనీ బస్సులో పంపుతాను అంటే, మీ యబ్బాయి గారేమో పిల్లలు తినరమ్మా... అని సెప్పేరు కదమ్మా.. ఊరంతా అయి పంచేటప్పటికి.. వచ్చిన కాలనొప్పి ఈ ఏడాద్దాక తగ్గలేదు...!

ఎందుకమ్మా మళ్ళా ఈ ఒంటలు, తింటారా పెడతారా..అంటూ యర్రాయమ్మ గిన్నెలు కడగడం మొదలు పెట్టింది.

" ఆ.. నీకు బాగా వెటకారం ఎక్కువవుతుంది.. బియ్యం నానబోస్తున్నా.. రేపీపాటికి నువ్విక్కడుండాలి.. ఇంకేం పనులు పెట్టుకోకు. అంటూ సీతమ్మ అరిసెలకు బియ్యం నాన బెట్టింది... "

కాసేపటికి గుమ్మంలో రెండు ఆటోలు ఒకదాని తరువాత ఒకటి వచ్చి ఆగాయి.

" నానీ ఎలాఉన్నావ్ అంటూ మనమరాలు అనూష ఎదురొచ్చి సీతమ్మను చుట్టేసింది.తరువాత కొడుకు, కోడలు సీతమ్మ కూతురు రమ్య, వాళ్ల కొడుకు నరేంద్ర అందరు లోపలకి వచ్చారు. వారి వెనుకే రామకృష్ణ సంచి నిండా కూరగాయలు తీసుకొని వచ్చాడు..

"ఏమ్మా.. అల్లుడు గారు రాలేదు?" అని అడిగింది కూతురు రమ్య ని..

"నాని డాడీకి బిజీ వర్క్ ఉంది... నేనొచ్చాకదా.. ముందు మంచి బ్రేక్ ఫాస్ట్ పెట్టు ఆకలి దంచుతుంది అమ్మమ్మా.." అంటూ అడిగాడు నరేంద్ర...

"అలాగే అందరు స్నానాలు చేసి రండి" అని.. చేసిన గారెలను ప్లేట్ లలో పెట్టింది సీతమ్మ..

అందరి పరామర్శలు, మాటలతో ఇల్లంతా చాలా సందడిగా ఉంది.

రామకృష్ణ ఒక మధ్యతరగతి రైతు. కొడుకు బాగా చదివి మంచి జాబ్ దొరకడం తో హైదరాబాద్ లో ఉంటున్నాడు. వాళ్ళమ్మాయి అనూష టెన్త్ చదువుతుంది. ఇంక కూతుర్ని కూడా బెంగళూర్ లో మంచి ఉద్యోగం చేస్తున్న ఉదయ్ కుమార్ కిచ్చిపెళ్లి చేశారు. రమ్య కొడుకు నరేంద్ర బీటెక్ రెండో సవత్సరం చదువుతున్నాడు. నరేంద్ర చెల్లెలు సెవెంత్ క్లాస్ లో ఉంది. వీళ్లంతా కలసి పండక్కి ఊరికి వచ్చి నాలుగేళ్లయింది. ప్రతి సంవత్సరం రమ్మని ఫోన్ చేసినా, మీటింగ్స్ అని, సెలవలు లేవని ఇలా ఏదో కారణాలతో రాలేక పోయారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పుణ్యమా అని మళ్ళీ అందరూ కలవడానికి అవకాశం వచ్చింది..

"అమ్మా... ఎల్లొత్తా, పని అయిపోయింది" అన్న యర్రాయమ్మ పిలుపుతో సీతమ్మ పెరట్లోకి వెళ్లి.. రేపు వచ్చేటప్పుడు నీ కూతుర్ని కూడా తీసుకురా.. మా మనవరాలు చేత గొబ్బిళ్లు పెట్టిద్దాం.. అని చెప్పింది.

"సరేనమ్మా అంటూ వెళ్ళిపోయింది యర్రాయమ్మ."

కోడలు మానస వచ్చి, "అత్తయ్యా! నాకు ఆఫీస్ పని ఉంది.. మీ అబ్బాయి కేం కావాలో చూడండి" అంటూ తన లాప్టాప్ తీసుకొనివెళ్ళిపోయింది. కొడుకు కూడా కంప్యూటర్ ముందే కూర్చున్నాడు. అనూష ఫోన్, లౌక్య ఫోన్ తో కాలక్షేపం చేస్తున్నారు. నరేంద్ర మాత్రం "తాతయ్యా!, పొలానికెళ్దాం..పద.. నాకు పడవెక్కి వెళ్లడం అంటే చాలా ఇష్టం." అంటూ రామకృష్ణ తో పొలానికి బయలుదేరాడు. నరేంద్రకి మాత్రం పల్లె అన్నా, అక్కడి సంప్రదాయాలన్నా చాలా ఇష్టం. మర్నాడు భోగి పండుగ కావడం తో అందరు తెల్లవారు జామునే లేచారు. తల స్నానాలు, భోగి మంటలతో తెల్లారి పోయింది. తరువాత యర్రాయమ్మ రాగానే , బియ్యం దంచి పాకానికి రడీ చేసింది. సీతమ్మ మూకుడు దగ్గర కూర్చొని అరిసెలు వేయిస్తుంది. యర్రాయమ్మ కూతురు నాగవేణి కూడా అక్కడే కూర్చుని సాయం చేస్తుంది. నరేంద్ర..."నేనుకూడా చేస్తా. ఏం చేయాలి..అంటూ సీతమ్మ పక్కన కూర్చున్నాడు నరేంద్ర. బయటకు వెళ్తున్న రామకృష్ణ తో "ఏవండీ! వచ్చేటప్పుడు కాస్త ఆవు పేడ తీసుకురండి. అనూష, లౌక్య గొబ్బెమ్మలు పెడతారు..."అంది . ఆమె మాటలు విన్న అనూష.. పరుగున వచ్చి, "నానీ ప్లీజ్! ఇవన్నీ పెట్టకు, ఐ డోంట్ లైక్ టూ టచ్ థిస్ పేడ గీడ" అంటూ మొఖం చిరాగ్గా పెట్టింది..

"లేదమ్మా పేడ ముద్దలు నేనే పెడతా నువ్వు, లౌక్య చక్కగా లంగా ఓణీ వేసుకొని పూజ చేద్దురుగాని. నాగవేణి మిగిలిన పిల్లలు అందరు పాటలు పాడతారు. ఆడపిల్లలున్నప్పుడు తప్పకుండా గొబ్బిళ్లు పెట్టుకోవాలి.. అలా పెడితేనే కిట్టయ్య మనింటికొస్తాడు. ఐదు గొబ్బెమ్మలలో మధ్య లో ఉన్నది కిట్టయ్య. చుట్టూ ఉన్నవి గోపికలు అంటూ గొబ్బిళ్లు గురించి చెప్పింది. ... ఆ... నాగవేణీ మర్చిపోయాను.. నువ్వు కొంచెం వాకిలి ఊడ్చి, ముగ్గెయ్యాలమ్మా అంది సీతమ్మ...

" నానీ ముగ్గు నేనేస్తా. సూపర్ డిజైన్ వేస్తా.. నాకు వచ్చు,.. నానీ కలర్స్ కావాలి.." అంటూ ఫోన్లో డిజైన్స్ చూస్తోంది అనూష.

" లేదమ్మా.. ఈ రోజు పండుగ కదా, ముగ్గులు రంగులతో కాదు. తెల్ల ముగ్గు, బియ్యం పిండి కలిపి వేయాలి. దానిపై పసుపు, కుంకుమ, పూలతో అలంకరించాలి" అనిచెప్పింది.

" ఛీ.. అలా ఏమీ బాగోదు.. వద్దు.. మంచి కలర్స్ వేద్దాం.. అంటూ అక్కడికి వచ్చింది లౌక్య.

" లౌక్యా! అమ్మమ్మ చెప్పింది విను.."అంటూ చెల్లి వైపు కోపం గా చూసాడు నరేంద్ర.

"ఐతే మేమేమీ చేయం... పూజా కూడా.. అన్నీ మీరే చేసుకోండి.. మీ విలేజ్ వాళ్లకి,

ఏమి చెప్పినా అర్ధం కాదు" అని ఫోన్ పక్కన పెట్టి, కోపంగా నరేంద్ర వైపు చూసింది అనూష.

" సీతమ్మ మానవరాళ్ల కోపాన్ని చూసి అను, లౌక్య ఇద్దరూ ఇటు రండమ్మా... " అని పిలిచింది.. "అనూ.. ముంగిట ముగ్గు ఎందుకు వేస్తారో తెలుసా .. మనం వేసే ముగ్గులు, బియ్యప్పిండి కలిపి వేస్తే.. అది చీమలకు.. చిన్నచిన్న జీవులకు ఆహారం అవుతుంది.. తెల్ల ముగ్గు అంటే ఎలా తయారవుతుందో తెలుసా.. నదిలో దొరికే.. చిన్నపాటి నత్తగుల్లలను సేకరించి.. వాటిని ఎండబెట్టి.. తరువాత బట్టీల లో వేసి... బాగా కాలుస్తారు.. దానిలో తడి అంతా ఆరిపోయాక.. అది తెల్లగా మారుతాయి.. వాటిలో కొంచెం నీళ్ళు పోసి దంచినట్లయితే.. తెల్లని పొడిలా.. వస్తుంది. దీనిని తెల్లముగ్గు అని పిలుస్తారు.. ఈ నత్తగుల్ల లోనే నీరు ఎక్కువగా కలిపితే.. అది సున్నం అవుతుంది.. దీనినే ఇంటి గోడలకు వేస్తే.. గోడలు తెల్లగా ప్రకాశవంతంగా కనబడతాయి.. అంతేకాక ఎటువంటి సూక్ష్మజీవులు రాకుండా చేస్తాయి.. సున్నం అంటే ఏమి అనుకుంటున్నారు. అందులోనే కాల్షియం ఉంటుంది.. తాంబూలం వేసుకునేటప్పుడు ఈ సున్నాన్ని కొంచెం తమలపాకుకు జోడించి వేసుకుంటారు.. అంటే కాల్షియం కొంచెం తీసుకుంటున్నారు...


" కరెక్టు అమ్మమ్మా!.. రంగులతో వేసే ముగ్గులు.. మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి... వీళ్ళకి చెప్పినా అర్థం కాదు.. అయినా ఇప్పుడు ముగ్గులు వేసే అమ్మాయిలు ఎవరున్నారు. ముగ్గు వేయడానికి సిటీలో అయితే అసలు ప్లేసే ఉండదు.. ఉన్న కొంచెం నేల కూడా వారి కంటికి కనబడకూడదట. అంతా సిమెంట్ చేసేస్తారు.. ఆ సిమెంట్ నేలపై కెమికల్స్ తో ఉన్న కలర్స్ తో ముగ్గులు వేస్తారు.. పోనీ నాచురల్ గా ఉండే కలర్స్ అంటే ఎవరికీ ఎక్కదు.." అంటూ అమ్మమ్మని సపోర్ట్ చేశాడు నరేంద్ర.

" మరి డిజైన్స్ వేస్తే ఎందుకు వద్దు అంటావు" అని అడిగిన అనూషతో...

" వద్దని అనటం లేదమ్మా... అన్నీ వేసుకోవచ్చు.. కానీ చుక్కల ముగ్గులు వేస్తే.. అందులో ఉన్న మెలికలు.. కలపడం ద్వారానే మన తెలివితేటలు.. బయట పడతాయి. మెలికలు అంటే మన జీవితంలో వచ్చే కష్టాలు... కష్టాలు వచ్చినప్పుడు కుంగి పోకుండా... మెలికలన్నీ కలిపి ముగ్గు ఎలా పూర్తి చేస్తామో.. అలాగే ఎదుర్కొని అన్నీ సాధించాలి..

నెల ముగ్గులు కూడా.. గీతలతో వేస్తారు.. అది మన పల్లెటూరు సాంప్రదాయాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి.

ఆ కాలంలో వచ్చే గుమ్మడి పండు..చెరకు గడలు.. బంతి పువ్వులు.. తాబేలు..సూర్య.. చంద్రులు అంటే మనచుట్టూ ఉండే ప్రకృతి ఇవన్నీ కూడా.. గీతల ముగ్గులు లో ఉంటాయి.. మనం ప్రత్యేకంగా గమనిస్తే తెలుస్తుంది.. " అంటూ నెల ముగ్గులు గురించి చెప్పింది సీతమ్మ.

" వీళ్ళకి ఫోన్ చూసుకోవడానికే టైమ్ సరిపోదు. ఇవన్నీ ఎక్కడ చూస్తారు అమ్మమ్మా.." అంటూ అనూష వైపు చూసాడు నరేంద్ర.

" ముంగిట వేసే ముగ్గు.. మన జీవితానికి అన్నీ పాఠాలు నేర్పిస్తుందమ్మా.. మెలికలు అన్ని కరెక్ట్ గా కలప గలిగితే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. ఏ పని మీద అయినా ఏకాగ్రత పెరుగుతుంది.. అలాగే శరీరానికి ఒక మంచి వ్యాయామం కూడా అవుతుంది.. జీవితంలో ఉండే చిక్కులే మెలికల ముగ్గులు...."చెప్పడం పూర్తి అయ్యేటప్పటికి..మనవరాళ్లు ఇద్దరూ విన్నట్టే అనిపించింది సీతమ్మకు...

సాయంకాలం అతికష్టం మీద లంగా ఓణీ వేసుకుని..దాన్ని జారిపోకుండా పట్టుకోవడం లోనే నిమగ్నం అయిపోయింది.. అనూష.. నాగవేణి మాత్రం.. "గొబ్బియల్లో గొబ్బియల్లో.. రాజు గారి తోట లో విత్తు విత్తు వేశారంట.. ఏం విత్తు వేశారంట.. జామ విత్తు వేశారంట..." అంటూ అన్ని గొబ్బిళ్ళ పాటలు పాడింది.. తన తోటి వాళ్ళు కూడా ఆమెకు కోరస్ ఇచ్చారు..

మూడు రోజులు సరదాగా తెలియకుండానే.. ఆనందంగా గడిచి పోయినాయి.. కోడలు మాత్రం ఎప్పుడూ కంప్యూటర్ లోనే ఉండేది. రమ్య అప్పుడప్పుడు సాయం చేస్తూ ఉండేది వాళ్ళమ్మకు...

ఆ రోజు అందరూ తిరుగు ప్రయాణానికి సర్దుకుంటున్నారు..

" అన్నీ డబ్బాల్లో సర్ధాను.. ఇవి గోనె సంచీలో పెట్టేయండి అంటూ చెప్పింది సీతమ్మ.. "

ఇంతలో కొడుకొచ్చి " అమ్మా అవేమీ వద్దు. ఎవరూ తినరు.. అనూ కి అవి అస్సలు అలవాటు లేదు. చెల్లిని తీసుకెళ్లమను" అన్నాడు. కోడలు కూడా "వద్దు అత్తయ్యా మీ అబ్బాయి కి లైట్ గా షుగర్" అన్నారు, ఇవన్నీ తిని ఎక్కువ ఐతే మళ్ళా ప్రాబ్లెమ్” అంటూ, సర్దిన డబ్బాలు తీసి పక్కన పెట్టింది.

రమ్య కూడా " నాకూ వద్దమ్మా! కొద్దిగా తీసుకెళ్తా. మా పనమ్మాయి అడిగితే పెట్టడానికుంటాయ్” అని కొన్ని పెట్టుకుంది. సీతమ్మ ఇంకేం మాట్లాడలేదు... "బాయ్ నానీ, బాయ్ అమ్మమ్మా" అని చెప్తుండగానే వాళ్ళెక్కిన ఆటోలు స్టేషన్ వైపు పరుగు తీసాయి.

" ఒంటరిగా కూర్చున్న సీతమ్మ వైపు ఒండిన పిండి వంటలు వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. వంట గది వైపు వెళ్ళబోయిన ,ఆమె చూపు హాల్లో సెల్ఫ్ లో పట్టులంగా ఓణీ పై పడింది.

ఒక్కసారిగా అంతవరకు ఆపుకున్న కళ్ళనీళ్లు బయటకు వచ్చాయి. లంగా ఓణీ చేతిలో తీసుకుంది.

నెల రోజుల క్రితమే, ఎప్పుడూ బయటకెళ్ళని తాను, పక్కఊరికెళ్లి, పట్టు లంగా కొని, మరీ కుట్టించింది. ఎప్పుడైనా పండుగలకు వేసుకుంటుందని ఆశతో.. గొబ్బిళ్ల రోజు కూడా, కోడలు డ్రస్ బావుంది. ఎప్పుడైనా పండక్కి వేసుకుంటుంది, అని ఫోటో లు తీసింది. కోడలు బావుందనంగానే సీతమ్మకి చాలా సంతోషం అయింది... కానీ వదిలేసి వెళ్ళింది..

" సీతా...పిల్లలు బండి ఎక్కేసారు”.. అంటూ లోపలికి వచ్చి.. సీతమ్మ మొహం చూసాడు.. ఆమె చేతిలో లంగా ఓణీ.. నువ్వుల కారం పొడి డబ్బా..

కనబడగానే.. అరే సీతా! ఎందుకు బాధ పడతావు.. మనకి ఇష్టమైన ఇవన్నీ.. పిల్లలకు ఇష్టం ఉండకపోవచ్చు.. అది వాళ్ళ తప్పు కాదు.. వాళ్లకు చిన్నప్పటినుండి.

ఎప్పుడూ అలవాటు చేయలేదు కాబట్టి.. ఆ బట్టలు వేసుకోవడం ఇబ్బంది కలిగి ఉండొచ్చు... అదే పండుగో.. పబ్బానికో వేసుకునే అలవాటు వాళ్ళ అమ్మానాన్న చేస్తే.. బాగుండేది.. పిల్లల్ని మనం ఏమీ అనలేం సీతా.. పిల్లలు ఏం చేసినా అది మన చేతుల్లోనే ఉంది.. నువ్వుల కారం పొడి ఇప్పుడు వాళ్లకు అసిడిటీని కలిగిస్తుంది.. కానీ రోగనిరోధక శక్తిని పెంచుతుందని వాళ్ళకేం తెలుసు.. వాటి కోసం మందులు వాడతారు.. నువ్వేం బాధపడకు... ఈసారి చేసినవన్నీ... మనిద్దరం కూర్చుని తిందాం... శుభ్రంగా, ఆరోగ్యంగా పదికాలాలపాటు ఉందాం. సరేనా.. ఏవీ నాలుగు అరిసెలు" ఇలా పట్టుకురా అన్నాడు.. సీతమ్మ కళ్ళనీళ్ళు తుడుచుకుని వెళ్లే లోపు...


"అమ్మగారూ ఉన్నారా!.. అంటూ నాగవేణి వచ్చింది. "మా అమ్మ దొడ్లో కాసిన ఆనపకాయ మీకు ఇమ్మంది. లేతగా ఉందంట. అయ్యగారికి పులుసు అంటే ఇష్టం అంట కదా..!

తీసుకోండి అమ్మా. "అని అక్కడ పెట్టింది.

సీతమ్మ చేతిలో ఉన్న లంగాఓణీ వైపు ఆశగా చూస్తూ.. ఇది ఎన్ని డబ్బులు పెడితే వస్తుందమ్మా?.. నాకు ఇలాంటిదే కొనమని అమ్మని అడిగా.. అని పెద్ద పెద్ద కళ్ళతో చూస్తుంది..

సీతమ్మకి కళ్ళముందు మళ్ళా ఆ దృశ్యం కనబడింది.. అవును గొబ్బిళ్ల రోజు, నాగవేణి చూపంతా అనూష వేసుకొన్న బట్టలమీదే.. ఆరోజు సాయంత్రం మనవరాలికి తాను దిష్టి కూడా తీసింది. అందరి చూపులు పడ్డాయని..... ఇప్పుడు మాత్రం.... నాగవేణి కూడా మనవరాలి లాగే కనబడుతుంది.

"సీతమ్మ నవ్వుతూ... డబ్బులు ఎందుకే దీనికి.. ఇదిగో ఇందా తీసుకెళ్ళు. అని నాగవేణికి ఇచ్చింది. నాగవేణి సంతోషానికి హద్దుల్లేవు...

"అమ్మగారూ! దీన్ని మొత్తానికి ఉంచేసుకుంటా.. అంటూ పట్టరాని ఆనందంతో ఇంటికి పరుగు పెట్టింది.. నాగవేణి". సీతమ్మ మొఖంలోని సంతోషంతో రామకృష్ణ మనస్సు కూడా తేలిక పడింది.

సమాప్తం


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం :

కలం పేరు :లక్ష్మి కుమార్

పేరు : వరలక్ష్మి.గోపరాజు

వృత్తి : హై స్కూల్ టీచర్ (మాథ్స్ )

ప్రవృత్తి : కధలు, వ్యాసాలు వ్రాయడం, చదవడం. ముంగట ముగ్గు నా మరో రచన ఈ మధ్యన వ్రాసిన" దరి చేరిన నావ ", "ఊరికి నీళ్ళొచ్చాయి ' ప్రతి లిపి లో ప్రచురించ బడ్డాయి.తెలుగు భాష అన్నా గోదావరి అన్నా చాలా ఇష్టం

నివాసం : హైదరాబాద్

స్వస్దలం : రాజోలు

604 views3 comments
bottom of page