top of page
Original.png

నా డైరీలో ఒక పేజీ

#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #NaDiaryloOkaPage, #నాడైరీలోఒకపేజీ, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Na Diarylo Oka Page - New Telugu Story Written By Vasundhara Rani Munipalle

Published in manatelugukathalu.com on 15/01/2026

నా డైరీలో ఒక పేజీ - తెలుగు కథ

రచన: వసుంధర రాణి మునిపల్లె 


జీవితం ఒక విచిత్రమైన ప్రయాణం. ఇక్కడ రక్తసంబంధాల విలువ ఒక్కోసారి డబ్బు ముందు వెలవెలబోతుంటుంది. నా జీవితంలో జరిగిన రెండు సంఘటనలు దీనికి నిదర్శనం.


ఆ రోజు ఉదయం ఫోన్ మోగింది. అవతలి వైపు నా ఆడపడుచు భవాని. పలకరింపులు కూడా లేకుండానే, |వదినా, నేను అన్నయ్య మీద కేసు వేద్దామనుకుంటున్నాను" అంది సూటిగా.


నేను నిశ్చేష్టురాలినై, "అదేంటి భవాని, అన్నయ్య నీకేం అన్యాయం చేశారు" అని అడిగాను అమాయకంగా.


"ఊరిలో ఇల్లు అమ్ముతున్నారట కదా, అందులో నా వాటా నాకు కావాలి, ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తాను" అని తెగేసి చెప్పింది.​


నేను ఈ విషయాన్ని మా వారితో చెప్పాను. ఆయన ఎంతో సంస్కారవంతుడు. "ఇద్దాం, కానీ ఇప్పుడే వద్దు, ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, రేపు వాళ్ల పెళ్లిళ్లప్పుడు ఆ డబ్బు ఇస్తే ఓ ఆసరాగా ఉంటుంది, ఇప్పుడిస్తే చేతులారా ఖర్చు చేసేసుకుని తర్వాత ఇబ్బంది పడతారు" అని ఆయన ఉద్దేశ్యం.


అత్తగారు, మామగారు కూడా అదే మాట అనడంతో, అప్పట్లో భవాని కానీ, ఆమె భర్త కానీ మారుమాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. చివరికి ఊరిలో ఇల్లు అమ్మే రోజు రానే వచ్చింది. రిజిస్ట్రేషన్ కోసం ఊరికి వెళ్లిన మా వారికి భవాని అక్కడ అసలు రంగు చూపించింది. నా వాటా నా చేతికి ఇస్తేనే సంతకం పెడతాను, లేకపోతే లేదు అని భీష్మించుకుంది.


అప్పుడు మా వారు, "అదేంటి భవాని, పిల్లల పెళ్లిళ్లకి ఇస్తానన్నాను కదా" అని ఆమెకు సర్దిచెప్పబోయారు.


దానికి ఆమె ఏమాత్రం తగ్గకుండా, "రేపు నా కూతురు ఎవరితోనైనా లేచిపోతే డబ్బు ఇవ్వడం మానేస్తావా" అని కటువుగా మాట్లాడింది.


ఆ మాటతో ఆయన మనసు ముక్కలైంది. ఆ అమ్మాయికి రావాల్సింది ఇచ్చేసి సంతకం చేయించుకున్నారు. ​భవాని మా ఆయన పెద్ద చెల్లెలు. అయితే అత్తగారు మామగారికి తమ చిన్న కూతురి భర్త అంటే చాలా నమ్మకం ఎక్కువ. అందుకే తమ వాటా డబ్బును కూడా ఆయన దగ్గరే దాచుకున్నారు. మా దగ్గర ఉంటే ఖర్చయిపోతాయి, మీ దగ్గరే ఉంచుకుని మాకు నెల నెల వచ్చే వడ్డీ ఇవ్వండి, మీ దగ్గర ఉంటేనే మాకు ధైర్యం అని ఆ చిన్నల్లుడికి ఇచ్చారు.


మా ఆయన ఈ ఊహించని సంఘటనలు చూసి తెల్లబోయి నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు. నాకేమీ ఆశ్చర్యం కలగలేదు, ఇది నేను ఊహించిందే. "సరేలెండి, ఆడపిల్ల సొమ్ము మనకెందుకు, ఆ అమ్మాయి అడిగినప్పుడే ఇచ్చేస్తే అందరికీ మంచిది, అలాగే మీ అమ్మ వాళ్లకు ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ దాచుకోనివ్వండి మనకెందుకు" అని ఆయనకు నచ్చచెప్పాను.


అక్కడితో ఆ అంకం ముగిసింది.​ కాలం గిర్రున తిరిగింది. మా అమ్మా నాన్న కాలం చేశారు. నాన్నగారు కట్టిన ఇల్లు కూడా పాతబడిపోవడంతో, మా అన్నయ్యలిద్దరూ దాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నారు. విచిత్రమేమిటంటే, నేనంటే ఎంతో ప్రేమ వ్యక్తపరిచే మా వదిన, ఈ విషయం నాకు తెలియకుండా ఉంచాలని చాలా ప్రయత్నించింది. చట్టప్రకారం వారసులందరి సంతకాలు కావాలని ఆమెకు తెలుసో లేదో నాకు అర్థం కాలేదు. కానీ నేను భవానిలా పట్టుబట్టలేదు.


నాకు రావలసిన సమాన వాటా కాదు కదా, కనీసం వాళ్లు తీసుకున్న దానిలో సగం కూడా నాకు ఇవ్వకుండా నాతో సంతకం పెట్టించుకున్నారు. అయినా, అందరికీ ఆడపిల్ల సొమ్ము తినకూడదన్న పట్టింపు ఉండదు కదా, నా ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా, న్యాయంగా నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదన్న బాధ కలిగినా, పోనీలే నా అన్నలేగా, ఒక రూపాయి ఎక్కువ తిన్నా బయటవాళ్లు కాదు కదా అని మనసుకి సర్దిచెప్పుకుని సంతకం పెట్టేసి వచ్చేశాను. ఆ తర్వాత దాని గురించి మళ్ళీ ఎప్పుడూ మాట్లాడలేదు.


​ఈ రెండు సంఘటనలు చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది, బాధా కలుగుతుంది. ఒకవైపు నా ఆడపడుచు, తన వాటాని ముక్కుపిండి వసూలు చేసుకుని కూడా, ఇంకా ఏదో ఇవ్వలేదని అసంతృప్తితో ఉంది. మరోవైపు మా అన్నయ్యలు, నాకు ఇవ్వవలసిన దానిలో సగం కూడా ఇవ్వకుండానే, ఇప్పటికే చాలా ఇచ్చేశామని లోలోపల బాధపడుతుంటారు. సమాజంలో మనుషులు ఎంత విభిన్నం! ఒకరు హక్కుల కోసం పోరాడి బంధాలను దూరం చేసుకుంటే, ఇంకొకరు బాధ్యతల నుంచి తప్పించుకుని బంధాలను చులకన చేస్తారు. ఈ ఆస్తి పంపకాల నాటకంలో, చివరికి రెండు వైపులా నష్టపోయింది మాత్రం నేను, మా వారు మాత్రమే. కానీ ఒకటి మాత్రం నిజం... చేతిలో డబ్బు లేకపోయినా, మనసులో ప్రశాంతత, ఎవరికీ అన్యాయం చేయలేదన్న తృప్తి మా దగ్గర మిగిలి ఉన్నాయి. అది చాలు మాకు!                         ***  




సమాప్తం. 

వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె


నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.


నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.

ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page