'Nadi Bajaru rayi' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'నడి బజారు రాయి' తెలుగు కథ
రచన: సుదర్శన రావు పోచంపల్లి
అదొక పల్లె టూరు. ఊరి మధ్యలో ఒక రాయి. దారెంట పోయే వాళ్ళంతా దారికా రాయి అడ్డంగా ఉన్నదని గునిసేవారు. దాన్ని పెకిలించి వేయాలంటె పదిమంది బలం కావాలి. ఎవరూ ముందుకొచ్చేవారు కారు.
ఏండ్ల తరబడి ఆ రాయి అట్లనే నిలిచి పోయింది.
ఒకనాడు ఒక వేదాంతి ఆ ఊరికొచ్చి ఉపన్యాసమిస్తూ. “ప్రపంచములో ఏ వస్తువూ పనికి రానిదని ఉండదు” అని అంటుంటె ఊరి పెద్దమనిషి “ఎందుకు లేదు. మా ఊరి నడుమ ఒక పొడగాటి బలమైన రాయి ఉన్నది. ఏండ్ల తరబడి అక్కడే పాతుక పోయింది. వచ్చీ పోయే వాండ్లకు ఇబ్బందే గాని ఎందుకూ పనికి రాదు” అంటాడు ఊరి పెద్ద.
“నేను ఆ రాయి ఎందుకు పనికి రాదో చూసి చెబుతాను పదండి” అని ఊరి పెద్దతో ఆ రాయి దగ్గరికి పోతారు వేదాంతి, పెద్దమనిషి.
వేదాంతి ఆ రాయిని చూడగానే చెప్పులు విడిచి రెండు చేతులు జోడించి దండము పెడుతాడు. ఊరి పెద్ద మనిషి వెంబడి వచ్చిన జనము విస్తు పోతారు.
వేదాంతి నవ్వుకుంటూ ఊరి వారితో అంటాడు “మీరు ఊరి నడుమ బొడ్రాయిని రాతితో చేయించే పెడుతారు గద. పూజలూ చేస్తారు. అదీ రాయే కద”.
“ఈ రాయి దైవికంగ దారి నడుమ నిలిచింది. మీరు ఏ దేవుడిని చూసినా రాతితో చెక్కబడిన శిల్పమే. ఒక్క పూరీలో మాత్రమే చెక్కతో చేయబడిన దేవుడుంటాడు- పూరీ జగన్నాథుడు అని. మీరు వినే ఉండవచ్చు” అంటాడు వేదాంతి. ‘తెలిసిందా’ అని అడుగుతాడు వేదాంతి.
“శ్రీరాముని ఎత్తు ఎనిమిది అడుగు లంటారు. ఈ రాయి దాదాపు తొమ్మిది అడుగుల పైనే ఉండవచ్చు. మీకు నిజంగా దేవుని మీద నమ్మక ముంటె మంచి శిల్పిని తీసుకవచ్చి ఆతనితో ఆ శ్రీ రాముని విగ్రహము చెక్కించండి. తరువాత ఇట్లనే మీ ఊరిలోని మంచి రాళ్ళను ఎన్నుకొని సీతమ్మవారిని, లక్ష్మణ స్వామిని, ఆంజనేయుడిని చెక్కించి మంచి గుడి కట్టించండి. భక్తులందరు భాగస్వాములే కనుక అందరు విరాళము ప్రోగు చేసి ఆ సత్కార్యానికి పూనుకుంటె ఆ దేవుని కృప ఎప్పుడూ మీ పై ఉంటుంది” అంటాడు వేదాంతి.
దానికి ఊరివారందరూ తలలూపి సమ్మతిస్తారు.
“చందాలు సేకరించేటప్పుడు బీద బిక్కిలను కనిపెట్టి వారిపై అధిక భారము పడకుండా చూడండి. ప్రోగు చేసిన సొమ్ము దుర్వినియోగము కాకుండా గమనిస్తుండండి” అంటాడు వేదాంతి.
“గుడి కట్టాలంటె కొంత విశాలమైన స్థలము వెదకి దారికి అడ్డు ఉండకుండా చూడండి. చుట్టు ప్రహరి నిర్మించి నీళ్ళ వసతి ఏర్పాటు చేయండి. దేవస్థానము ప్రశాంత వాతావరణములో ఉంటె భక్తులకు అంటె బాలురు, వృద్ధులు, స్త్రీలు, అంగవైకల్యము చెందిన వారు మున్నగు వారికి అనుకూలంగా ఉండాలె. నిత్య దీప ధూప నైవేద్యాలు ఆటంకము లేకుండా ఒక పూజారిని నియమించాలి. లోకాన్ని ఏలే దేవునికి మనము పడే కష్టము చాలా చిన్నది. నిజమైన భక్తి పరులకు ఆశక్తిని దేవుడే ప్రసాదిస్తాడు” అని చెబుతాడు వేదాంతి.
“ఒక గుడి కట్టించాలె అంటె ఆర్భాటము చాలా ఉంటుంది. మీకొక కథ చెబుతాను వినండి” అంటూ "కౌపీన సమ్రక్షణార్థం అయం పటాటోప" అంటూ “పూర్వము ఒక సన్యాసి ఉండేవాడు. అతని దగ్గర రెండు గోచిపేగులు తప్ప ఏమి లేకుండెడివి. రోజూ స్నానము చేసి ఒకటి కట్టుకొని రెండవది ఆరవేసేవాడు. బిక్షాటన చేసి కడుపు నింపుకునేవాడు. ఆ ఆరవేసిన గోచి పేగు ఎలుకలు కొడితె అది గూడా రోజూ బిచ్చమెత్తే సాహసము చేయలేక ఒక పిల్లిని సాదుకుంటాడు.
పిల్లికి పాలు రోజు బిచ్చము ఎత్త లేక ఒక ఆవును సాదు కుంటాడు. తాను తపస్సు చేసుకుంటు ఆవును. పిల్లిని సమ్రక్షించ లేక ఒక గుడిసె మాత్రము వేశాడే కాని అది చూసుకొను ఇంటి మనిషి లేక విధిగా పెళ్ళి చేసు కుంటాడు.
సన్యాసి ఇక సంసారిగా మారిపోతాడు. దాన్నే కౌపీన సమ్రక్షణార్థం అయం పటాటోప అంటారు. అదీ సంగతి. ఒక కార్యము నెరవేర్చాలంటె అన్ని హంగులు సమకూర్చు కోవాలి” అని చెబుతాడు వేదాంతి.
వేదాంతి చెప్పిన మాటలకు అందరూ సంతృప్తి చెంది ఆ రోజునుండే చందాల సేకరణకు పూనుకుంటారు ఊరి ప్రజలు.
సరియగు డబ్బు సమకూరగానే ఒక శిల్పిని పిలుచుకవచ్చి ఆ రాయిని చూయించి రాముని విగ్రహము చెక్కమంటారు.
ఆ రాయి చూసి “ఇది విలువైన రాయి. మరి రామునికి తోడుగ సీత, లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాలు కూడా చెక్కవలసి ఉంటుంది” అని శిల్పి అనగా ఊరి అడివిలో తిరిగి అక్కరొచ్చే రాళ్ళను ఎన్నుకుంటారు. శిల్పి సహకారముతో అందంగ శిల్పాలు చెక్కడానికి ఏడాది కాలం పడుతుంది. ఈ లోగా గుడి కట్టడము, ప్రహరి గోడ, బోరింగ్ వేయడము పూర్తి చేస్తారు గ్రామస్థులు.
ఒక మంచి దినము చూసి విగ్రహ ప్రతిష్ఠాపన మంచి పండితునితో చేయించుతారు. ఆ నాటి నుండే పూజారిని నియమిస్తారు. ఊరంతా మూడు రోజులు పండుగ వాతావరణము నెలకొంటుంది. వేదాంతిని కూడా ఆహ్వానించి ప్రత్యేక కట్ణ కానుకలు సమర్పిస్తారు.
ఎందుకు పనికి రాదనుకొన్న రాయే రాముడై చూపరులను ఆకర్షిస్తూ భక్తి కలిగించుట ఊరి వారి సంతోషానికి అవధులు లేకుండా అయితుంది.
ఆ నాటి నుండి గ్రామస్థులు ఏ రాయినైనా అక్కరొచ్చేదనుకుంటారు. ఇంత కాలము గుడి లేని ఊరిలో రాముని గుడి ఏర్పడి గ్రామస్థులే కాక చుట్టుపక్కలవారు కూడా వచ్చి మొక్కి పోతుంటారు.
మనిషికి చదువు ఉన్నా కళ ఉన్నా బాగుపడే మార్గము అనుకుంటూ గ్రామస్థులు గుడికి తోడు ఒక బడిని కూడా ఏర్పరుచుకొని వారి పిల్లలను చదివించ సాగారు.
దేవుడే వేదాంతి రూపున వచ్చి తమను సంస్కరించ జేశాడని దృఢ విశ్వాసం తో ఉంటారు.
దేవాలయము ఆరంభ మైన నాటినుడి ఎవరికి ఏమంచి జరిగినా అది దేవుని దయగా తలచుచు. ఏదేని కష్టనష్టము జరిగినప్పుడు వాళ్ళలో ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చును అందుకే దేవుని దయ లోపించింది అనుకుంటారు.
నడి బజారు రాయే నిత్యముక్తుండయ్యిండని సంతోషంతో ఉం టారు గ్రామస్థులు.
సమాప్తం.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
కధ బావుంది Sir