'Naku Nivu Niku Nenu' New Telugu Story
Written By Ch. C. S. Sarma
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అది విజయవాడ రైల్వేస్టేషన్. రైళ్లరాకపోకల సమయ ప్రసారం తెలుగు, ఇంగ్లీషు, హిందిలో క్రమంగా... అందరికీ అర్ధమయేలా ఒక భాష తరువాత మరో భాషలో జరుగుతూవుంది. ఆ గళం వినసొంపుగా వుంది...
మాధవయ్య వారి సతీమణి అన్నపూర్ణమ్మలు సైకిల్ రిక్షాలో స్టేషన్‌ముందు దిగారు. ఉదయం ఆరుగంటల ప్రాంతం. పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో వారు చీరాల వెళ్లాలి.
అన్నపూర్ణమ్మ దగ్గుతూ వుంది... ఒంట్లో జ్వరం... ఏవో రెండు మాత్రలు మింగి రిక్షా ఎక్కింది. ఇల్లు దగ్గరే అయినందున కాలుగంటలోపలే స్టేషన్‌కు చేరుకున్నారు. అది వారి పెద్దకుమారుడు సదాశివం ఇల్లు...
రెండు చేసంచులు వారి లగేజీ. అలసటగా నీరసంగా ఉన్న అన్నపూర్ణమ్మను మెట్లపై కూర్చోబెట్టి... సంచులు ఆమెకు అందించి, టిక్కెట్ తీసుకొనేందుకు మాధవయ్య కౌంటర్ దగ్గరకు వెళ్లాడు...
******
మాధవయ్యగారు రిటైర్డ్ హైస్కూలు హెడ్‌మాస్టర్. వారి రిటైర్‌మెంటు ఆరునెలల ముందు జరిగింది. వారికి ముగ్గురు కుమారులు ఒక కూతురు.
పేర్లు సదాశివం, సాంబశివం, రామశివం... కుమార్తెల అందరికకన్నా పెద్దది. పేరు భారతి. యం.ఏ.బి.ఈడి., చదివి హైస్కూల్‌లో టీచరగా పనిచేస్తూవుంది. వారి భర్త పార్వతీశంగారు. వారు స్కూల్ మాస్టర్. వారి వివాహం జరిగి.. పన్నెండు సంవత్సరాలయింది. వారు విశాఖపట్నంలో వుంటున్నారు.
సదాశివం ఇంజనీరు... సాంబశివం బ్యాంకు ఆఫీసర్... రామశివం అడ్వొకేట్...
మాధవయ్యగారు ఉద్యోగపర్వంలో వుండగా పిల్లలనందరినీ పద్ధతిగా చదివించి ప్రయోజకులను చేశాడు. పెద్దకొడుకు సదాశివం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఇంజనీర్. తన మేమమామ కాంట్రాక్టర్ గోపాలయ్య కూతురు శాంతితో వివాహం జరిగింది.
సాంబశివం విశాఖపట్నం ఆంధ్రాబ్యాంకులో ఆపీసరు. వీరిది లవ్‌మ్యారేజి. తల్లిదండ్రులకు సంబంధం లేదు. ఎంత ఘాటు ప్రేమయో!... క్రిస్టియన్ వనిత. అతను కుటుంబానికి దూరం.
వారి చినమామగారు రామదొరై. సీనియరు లాయర్. ఉండేది చెన్నై. వారికి ఒక కూతురు సంధ్య. డాక్టర్ చదువుతూవుంది. రామశివానికి సంధ్యను వివాహం చేసుకొని జీవితంలో హాయిగా చెన్నైలోనే స్థిరపడి పోవాలనే ఆశ. ఆ కారణంగా మామగారి వద్దనే పనిచేస్తున్నాడు రామశివం...
మాధవయ్యగారికి పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీలేవు. తాతముత్తాతల ఆస్థి మూడు గ్రవుండ్లలో ఓ పెంకుటిల్లు...ముందు పెద్దఅరుగులు... విశాలమైన వరండాలు రెండువైపులా... మధ్యన వాకిలి. నేరుగా పెరటి వాకిలి... తూర్పు సింహద్వారం... ఇంటిచుట్టూ స్థలం... దొడ్లో జామ మామిడి దానిమ్మ చెట్లు, పడమర దక్షిణం వైపున టెంకాయ చెట్లు.. వీధివాకిట ముందు రెండు వైపులా వేపచెట్లు వుండి ఎండవేడిని తగలనీకుండా... ఆనందాన్ని కలిగిస్తాయి.
వర్షాకాలం శీతాకాలంలో ఎంతో చల్లగా ఆ పరిసరాలు చూచేటందుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. ఆ ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం... ఎవరైనా అక్కడకు వెళ్లి ఒకటి రెండురోజులు వుండి... తిరిగి వారి స్వస్థలానికి వెళ్లాలంటే... మామూలుగా వెళ్లిపోలేరు. ఆ వాతావరణాన్ని వదిలి వెళ్లేదానికి బాధపడతారు.
అలాంటిచోట మాధవయ్య అన్నపూర్ణమ్మలు... ఆలుమగలుగా నలభై వసంతాలను గడిపారు. తమ సంతతి విషయంలో కర్తవ్య నిర్వహణను సక్రమంగా నెరవేర్చారు. బాగా చదివించి ప్రయోజకులను చేశారు. వారు ఉద్యోగస్థులైనారు.
ఉన్న రెండు ఎకరాల మాగాణి భూమిలో ఒక ఎకరాన్ని అమ్మి పి.ఎఫ్.లోన్‌తో కూతురు భారతి వివాహాన్ని జరిపించారు.
సంవత్సరం క్రింద అంటే రిటైర్ అయేదానికి ఆరుమాసాల ముందు పెద్ద కొడుకు సదాశివం స్టీల్ ప్లాంట్‌లో వుద్యోగి... విశాఖపట్నం నుంచి వచ్చి అక్కడ ఇళ్లస్థలం కొనాలనుకొంటున్నానని చెప్పి... ఆ మిగిలి వున్న ఎకరం పంటభూమిని... తల్లి కొంగు పట్టుకొని అమ్మించి... తనవంతు... మరియు తండ్రిగారి భాగంలో సగం తీసుకొని విశాఖ వెళ్లిపోయి రెండు గ్రౌండ్ల స్థలం కొన్నాడు. బ్యాంకులోన్ చేసి ఇల్లు కట్టాడు.
ఆ విషయం తెలిసిన రెండవ కుమారుడు సాంబశివం... భార్యా సమేతంగా వచ్చి తన వాటాను అడిగాడు. రిటైర్ అవగానే వచ్చే పి.ఎఫ్.లో నీ వాటాను ఇస్తానని మాధవయ్యగారు కుమారునికి నచ్చచెప్పారు.... కోడలు వచ్చినపని కాలేదని పెద్దలపై విసుగుతో రుసరుసలాడుతూ భర్తతో కలసి వూరికి వెళ్లిపోయింది.
కొడుకుల కోడళ్ల తీరును చూసిన మాధవయ్య ఐదు అంకణాల బారు వసారాను నిర్మించుకొని... తమ సామాన్లు అందులో సర్దుకొని, ఆ పెంకుటింటిని రెండు గ్రౌండ్ల స్థలాన్ని ఆ వూరి వైశ్యునికి అమ్మివేశాడు.
ముగ్గురు కొడుకులను కూతురునూ పిలిపించి సమంగా ఆరు భాగాలు పెట్టాడు. అల్లుడు కూతురూ తమకు భాగం అవసరం లేదన్నారు. దాన్ని ఐదు భాగాలు చేశాడు. కొడుకులు ఎవరి భాగాలు వారు తీసుకొని వెళ్లిపోయారు. వారంతా వూర్లకు వెళ్లబోయే ముందు రెండు రోజుల క్రితం మాధవయ్యగారు రిటైర్ అయినారు.
కూతురు భారతికి ఒక కొడుకు భరత్... కూతురు ఆనంది... సదాశివానికి ఒక కొడుకు ఆనంద్... కూతుళ్లు కవలలు ద్వారక దీపికలు... సాంబశివానికి ఒక కూతురు స్వాతి... కొడుకు ప్రజ్ఞ... రామశివానికి వివాహం కావాలి.మాధవయ్యగారి సంతతి నలుగురూ అన్నివిధాలా ఆనందంగానే వున్నారు. రామశివంనకు వివాహం కావాల్సివున్నది. సాంబశివం ఒకొక్కసారి... తాను వివాహ విషయంలో తల్లిదండ్రులకు చెప్పకుండా తప్పుచేశానని బాధపడతాడు...
******
టికెట్స్ తీసుకొని మాధవయ్య భార్యను సమీపించాడు. తాను వెళ్లేటపుడు కూర్చొనివున్న అన్నపూర్ణమ్మ, వారు వచ్చేటప్పటికి మెట్లమీద పడిపోయివుంది.
మాధవయ్యగారు ఆత్రంగా ఆమెను సమీపించారు.
‘‘అనూ!... అనూ!!...’’ పిలుస్తూ లేవదీసి కూర్చోబెట్ట ప్రయత్నించారు.
కానీ... అన్నపూర్ణమ్మ కూర్చోలేక కూలబడిపోయింది.
మాధవయ్యగారి వదనంలో విచారం....
‘‘అనూ!.. అనూ!...’’ ఆమె భుజాలను పట్టుకొని వేదనతో గద్గద స్వరంతో పిలుస్తున్నాడు మాధవయ్యగారు.
మెట్లపై స్టేషన్‌లోకి వెళుతున్న ఇరవై సంవత్సరాల యువకుడు వారి గొంతువిని... వారివైపు చూచాడు. వారెవరన్నది అతనికి అర్ధం అయింది.
‘‘సార్!...’’ వేగంగా వచ్చి వారి ప్రక్కన మోకాళ్లపై కూర్చున్నాడు. అన్నపూర్ణమ్మ ముఖంలోకి చూచాడు. శరీరాన్ని తాకాడు. అతనికి ఆమె స్పృహలో లేదన్న విషయం అర్ధం అయింది.
వేగంగా క్రిందికి పరుగెత్తి గోడవారగా వున్న రిక్షాను పిలుచుకొని వచ్చాడు.
వారిని సమీపించి అన్నపూర్ణమ్మను తన చేతుల్లోకి తీసుకొని... ‘‘సార్!... నేను మీ శిష్యుణ్ణి రామచంద్రను సార్!... అమ్మగారి పరిస్థితి సరిగా లేదు. హాస్పటల్‌కు తీసుకొని వెళ్దాము. మీరు ఆ రిక్షాలో కూర్చోండి. అమ్మగారిని పట్టుకోండి. నేను మీ వెనకాలే హాస్పటల్‌కు వస్తాను. అమ్మగారికి ట్రీట్‌మెంటు చేయిద్దాం’’. ఒక గుక్కన వేగంగా నడుస్తూనే చెప్పేశాడు రామచంద్ర.
అయోమయ స్థితిలో ఉన్న మాధవయ్యగారు విచారంగా రిక్షాలో కూర్చున్నాడు. వారి ఒడిలో అన్నపూర్ణమ్మను మెల్లగా పడుకోబెట్టాడు రామచంద్ర. తాను వారి రెండు సంచులను తీసుకొని మరో రిక్షాలో కూర్చొంటూ...
‘‘సార్!... మీరు బాధపడకండి. అమ్మగారికి ఏంకాదు. నీరసంవల్ల అలా పడిపోయారనుకుంటా!... మీరు చాలా మంచివారు సార్!... మీలాంటి వారు నా లాంటి వారిని తయారుచేసేటందుకు... మా కోసం మీరు ఎపుడూ ఆనందంగా వుండాలి సార్!... బాధపడకండి. అమ్మగారు త్వరలో కళ్లు తెరుస్తారు. హాస్పటల్లో మా అక్క పెదనాన్న కూతురు... సుగుణ డాక్టర్ సార్!...’’ ఆవేశంతో నవ్వుతూ చెప్పాడు.
భయాందోళనలతో చెమటనిండిన ముఖంతో మాధవయ్య మాస్టారు తల ఆడిరచాడు.
పావుగంటలో రెండు రిక్షాలు హాస్పటల్ ఆవరణలో ప్రవేశించాయి. పోర్టికోలో ఆగాయి.
రామచంద్ర వేగంగా హాస్పిటల్‌లోకి వెళ్లి ఇరువురు మేల్ నర్సులు... స్ట్రెచర్‌తో వరండాలోకి వచ్చాడు.
అన్నపూర్ణమ్మను తన చేతుల్లోకి తీసుకొని స్ట్రెచర్‌పై పడుకోబెట్టాడు. నర్స్‌లు స్ట్రెచర్‌ను లోనికి తీసుకువెళ్లారు.
రామచంద్ర మాధవయ్యను సమీపించాడు. తన చేతిని వారి చేతికి అందించి వారిని రిక్షానుంచి దించాడు. వారి వీపుచుట్టూ చేయివేసి వారిని మెల్లగా నడిపించి గోడప్రక్కన వున్న బెంచీపై కూర్చోపెట్టాడు. రిక్షావారిని సమీపించి వారికి డబ్బులు ఇచ్చాడు. మాధవయ్యగారిని సమీపించి...
‘‘సార్!... బాధపడకండి. అమ్మగారికి ఏం కాదు...’’ గోడ ప్రక్కన స్టాండుపై వున్న వాటర్‌జార్ గ్లాసును చూచి... గ్లాసునిండా నీళ్లను నింపి... మాధవయ్యగారిని సమీపించి...
‘‘సార్!... మంచినీళ్లు త్రాగండి!...’’ అందించాడు.
మాధవయ్యగారు ఆ నీటిని పూర్తిగా త్రాగారు.
‘‘సార్!... కొంచెం కావాలా!...’’
‘‘చాలు నాయనా!... చాలు!...’’
మాస్టార్‌గారి చేతిలోని గ్లాసును తన చేతిలోనికి తీసుకొని యధాస్థానంలో వుంచి వారిని సమీపించి....
‘‘సార్!... మీరు ప్రశాంతంగా కూర్చోండి. నేను లోనికి వెళ్లి మా అక్కతో మాట్లాడి... అమ్మగారిని చూచి... మీ వద్దకు వచ్చి మిమ్ములను లోనికి తీసుకు వెళ్తాను. సార్!... భయపడకండి... బాధపడకండి... వస్తాను...’’ లోనికి వెళ్లిపోయాడు రామచంద్ర. మాస్టారుగారు సుదీర్ఘమైన నిట్టూర్పును విడిచి... పైపంచతో ముఖాన్ని తుడుచుకొని ఎదురుగా గోడకు తగిలించి వున్న శ్రీసీతారామ పట్టాభిషేకం ఫొటోను చూస్తూ... మనస్సున ఆ త్రేతాయుగ మహాచక్రవర్తిని తలచుకొంటూ కళ్లు మూసుకొన్నాడు.
******
మాస్టారుగారికి వారి విజయవాడ రాక.. అనుభవం... గుర్తుకు వచ్చింది. పోస్టుమన్ అందించిన వుత్తరాన్ని అందుకొన్నాడు మాధవయ్య మాస్టారుగారు. ఆ వుత్తరాన్ని చూచి చాలా ఆశ్చర్యపోయాడు. తాను సెల్ వాడని కారణంగా... తన తనయుడు సదాశివం... అందరి భాగాలనూ సక్రమంగా పంచి ఇచ్చిన కారణం... ఉగాదికి రావలసిందిగా వ్రాసిన ప్రేమలేఖ అది....
‘నాన్న అమ్మలకు నమస్కారములు.
ఇచట నేను మీ కోడలు శాంతి, మనువడు ఆనంద్ మనవరాండ్రు ద్వారక దీపికలు అంతా క్షేమం. మనం లోగడ అనుకొన్నట్టుగానే ఈ ఉగాది పండుగకు మీరు మావద్దకు రావలసినది. రిటైర్ అయినారు కదా!... వచ్చి హాయిగా విశ్రాంతిగా మావద్ద కొంతకాలం వుండవలసినది. ఇది నా ఆలోచనేకాదు... మీ కోడలి వుద్దేశ్యమూ అదే. కనుక రెండు రోజులు ముందుగా బయలుదేరి రావలసినది. నేను స్టేషన్‌కు వచ్చి వుంటాను... తప్పక వెంటనే బయలుదేరండి. పిల్లలు మీరాక కోసం ఎదురు చూస్తున్నారు........ ఇట్లు, మీ సదాశివం.’
యదార్థం చెప్పాలంటే అన్నపూర్ణమ్మగారి పెద్దకొడుకంటే ప్రేమాభిమానాలు అధికం. దానికి కారణం... సదాశివం... అతనికి వూహ తెలిసినప్పటినుండి... పెండ్లి అయ్యేవరకు తల్లికి అన్ని విషయాల్లోను సాయంగా వుండేవాడు.
ఉత్తర సారాంశాన్ని మాధవయ్యగారు ఒకసారి చెప్పి... మరోసారి అర్ధాంగి ఇష్టానుసారంగా చదివి వినిపించారు.
ఆ మరురోజు పినాకినీలో చీరాల నుండి బయలుదేరారు... గోంగూరతొక్కు.. చింతకాయ తొక్కు... ఆవగాయ... మినపవడియాలు... సగ్గుబియ్యం వడియాలు... క్రమంగా కట్టుకొని సంచుల్లో సర్దుకొని స్టేషన్‌కు చేరారు.
రైలు సకాలానికి వచ్చింది. ఎక్కారు. ఒకటిన్నర గంటలో విజయవాడ స్టేషన్ చేరారు. రైలు దిగారు.
మాధవయ్య అన్నపూర్ణమ్మలు కొడుకు సదాశివం తమను రిసీవ్ చేసుకొనేందుకు స్టేషన్‌కు వచ్చివుంటాడని ఉత్తర దక్షిణము తూర్పువైపు చూచారు.
ఐదు.. పది.. ఇరవై నిముషాలు.. వాటి వేగంతో అవి జరిగిపోయాయి.
ఇరువురి ముఖాల్లో నిరాశ నిస్పృహలు...
‘‘అన్నపూర్ణా!...’’
‘‘ఆ... చెప్పండి!...’’
‘‘మనవాడు వచ్చినట్లు లేదు. అందరూ వెళ్లిపోయారు!...’’ సౌమ్యంగా చెప్పాడు మాధవయ్య.
పార్వతమ్మ నాలుగువైపులా ఒకసారి ఆశగా... కలయజూచింది. సదాశివం కనిపించలేదు.
‘వాడు రాలేదుగా!... ఎలా కనిపిస్తాడు?...’ అనుకొన్నాడు.
మాధవయ్యగారు... అర్ధాంగి ముఖభావాలను పరికించి... నిట్టూర్చి... ‘‘అన్నపూర్ణా...’’
‘‘ఆ...’’
‘‘మెల్లగా మనం బయటకు వెళ్లి... ఆటోలో ఇంటికి వెళదాం!... ఏదో అర్జంట్ వర్క్ తగిలి వుంటుంది.. అందువల్ల రాలేకపోయాడు... పద..’’ ఆ లగేజీలతో ఇరువురూ అతి కష్టంమీద స్టేషన్ బయటికి వచ్చారు. ఆటో మాట్లాడుకొని ఎక్కారు. ఆటో బయలుదేరింది.
రేపులేదు.. ఎల్లుండే ఉగాదిపండుగ...
అడ్రస్ వివరంగా తెలిసివున్నందున మాధవయ్యగారు చెప్పగా డ్రైవర్ ఆటోను ఇంటిముందు ఆపాడు.
లగేజీతో మాధవయ్య అన్నపూర్ణమ్మలు ఆటోనుండి దిగారు. ఆటోవాలకు డబ్బులిచ్చి పంపారు మాధవయ్య...
సింహద్వారం దగ్గరకు కోడలు శాంతి... ఆమె వెనకాలే వారి తల్లి జయమ్మగారు వచ్చి... వాకిట దిగిన చుట్టాలను చూచారు. తల్లీ కూతుళ్లు ముఖాలు చూచుకొన్నారు.
‘‘వీళ్ళూ వచ్చారా!...’’ మెల్లగా అన్నాడు మాధవయ్య.
‘‘కనబడుతుందిగా!...’’ అదే స్తాయిలో అన్నపూర్ణమ్మ జవాబు.
‘‘ఆ.. శాంతీ!... అమ్మావాళ్లు ఎపుడు వచ్చారు?....’’ కొని తెచ్చిపెట్టుకొన్న నవ్వుతో... కోడలు తనను పలకరించక మునుపే ఆన్నపూర్ణమ్మగారు కోడలిని పలకరించింది.
‘‘ఆ... నిన్న వచ్చాము వదినా!... రండి... రండి!...’’ నవ్వుతూ శాంతి తల్లి జయమ్మ వారిరువురికి స్వాగతం పలికింది.
ఇంతలో శాంతి తండ్రి రామారావుగారు వచ్చారు.
‘‘బావగారూ... నమస్కారం... ఇదేనా రాక?...’’ నవ్వుతూ అడిగాడు రామారావు.
అతని పలకరింపులో హేళన ధ్వనించింది మాధవయ్యగారికి...
‘నేరుగా చూస్తూ ఇదేనా రాక అని అడగడంలోని అంతరార్ధం ఏమిటో’ అనుకొన్నాడు విరక్తిగా నవ్వుతూ...
‘‘ఆ.. ఆ.. ’’ తల ఆడిరచి లగేజీలతో ఆలుమగలు ఒకరి ముఖాలు ఒకరు చూచుకొంటూ ఇంట్లోకి ప్రవేశించారు.
ఆరోజు ఆదివారం... గదుల్లో వున్న పిల్లలు వారి సవ్వడి విని బయటికి వచ్చారు. నానమ్మ తాతయ్యలను ఆప్యాయంగా పలకరించారు.
కూరగాయలకు వెళ్లిన సదాశివం ఇంటికి చేరాడు. అతని చేతిలోని సంచిని అర్ధాంగి శాంతి అందుకొంది.
సదాశివం... అమ్మానాన్నలను ప్రీతిగా పలకరించాడు.
అతను తన అమ్మానాన్నా ఈ రోజు సాయంత్రం వస్తున్నారన్న విషయాన్నే మరచిపోయాడు. స్నేహితుని ఇంటి గృహప్రవేశానికి వెళ్లి... భోజనం చేసి.. రెండు గంటలు విశ్రమించి... మార్కెట్టుకు వెళ్లి కూరలు కొనుక్కొని ఆమ్మానాన్నల సంగతిని మరచి ఇంటికి వచ్చాడు...
ఎంతో జీవితానుభవంవున్న మాధవయ్య కొడుకును అతని అత్తమామల ముందు... ‘ఏరా స్టేషన్‌కు ఎందుకు రాలేదని...’ అడగలేదు. అలా అడిగితే... అది కొడుకుకే కాదు తనకూ అవమానం అవుతుంది... చిరునవ్వుతో సమాధానమిచ్చి సరిపెట్టుకొన్నాడు. స్నానం చేసివస్తానని సదాశివం తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు.
హాల్లో సోఫాలో వియ్యంకులు ఎదురెదురుగా కూర్చున్నారు. అన్నపూర్ణమ్మ వారు వూరినుండి తెచ్చిన పదార్ధాలనన్నింటినీ సంచులనుండి బయటకు తీసి కోడలికి అందించింది. ఆమెచేతిలోనుంచి ఆమె తల్లి తీసుకొని వంటింట్లో సర్దింది...
సదాశివం రాగానే మాధవయ్య స్నానానికి వెళ్లి వచ్చి... ఒక అరగంట జపం చేసుకొన్నాడు ఆత్మానందం కోసం...
ఈలోగా అన్నపూర్ణమ్మ స్నానం చేసింది. ఆ సమయంలో డ్రస్ మార్చుకొంటుండగా మనుమరాలు దీపిక చెప్పగా తెలిసింది. ఉగాది వెళ్లిన రెండవరోజున వాళ్ల అమ్మమ్మ తాతయ్య అమ్మా నాన్న తను అక్క అన్న అందరూ...చార్‌ధామ్ యాత్రకు నార్త్‌కువెళుతున్నట్టు చెప్పింది. ఆమాట అన్నపూర్ణమ్మకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది....
రాత్రి భోజనాలు ముగిసాయి.
‘‘వాతావరణం బాగుంది సదా!... నేను మీ నాన్నా వరండాలో పడుకొంటాం!...’’ చెప్పింది కుమారుడికి అన్నపూర్ణమ్మ.
‘‘అలాగే అమ్మా!...’ అన్నాడు సదాశివం.
తల్లితండ్రి వరండాలో పడుకొన్నారు.
శాంతి తల్లిదండ్రులు హాల్లో... పిల్లలు సదాశివం అతని భార్య వారివారి పడకగదుల్లో పడుకొన్నారు.
ఒక అరగంట గడిచింది.
‘‘ఏమండీ!...’’ మెల్లగా పిలిచింది అన్నపూర్ణమ్మ.
‘‘ఆ...’’
‘‘నిద్రపోలేదా!...’’
‘‘రావడంలేదు అనూ!... మనవాడు పిలవగానే వచ్చి తప్పుచేశామనిపిస్తోంది!...’’
‘‘నిజంగా తప్పే చేశాము. మీకు మరో విషయం తెలుసా!...’’
‘‘ఏమిటది?....’’
‘‘వీరంతా కలసి ఉగాది వెళ్లిన రెండవరోజున చార్‌ధామ్ యాత్రకు బయలుదేరుతారట. అందుకనే శాంతి అమ్మా నాన్నలు వచ్చారట...దీపిక చెప్పింది...’’
‘‘హు... సరే మంచిదే!... కొడుకుదగ్గర ఒకటి రెండు నెలలు వుండాలనుకున్న నీ కోరిక...’’ మాధవయ్య పూర్తిచేయకముందే...
‘‘ఆ... నాకు అలాంటి కోరిక ఏదీలేదులెండి.. ఏదో మీతో మాటవరసకన్నాను. అంతే. ఉగాది వెళ్లగానే మనం... మనవూరికి వెళ్లిపోదాం...’’ అంది అన్నపూర్ణమ్మ కళ్లను చిత్రంగా త్రిప్పుతూ...
‘‘సరే!...’’ నిట్టూర్చాడు మాధవయ్య.
‘వ్రాసిన వుత్తరంలో ఆ విషయం వ్రాయలేదు. భోంచేసేటపుడు కూడా తమ ఛార్‌ధామ్ యాత్ర పయనం గురించి సదాశివం చెప్పలేదు... దీన్నిబట్టి ప్రస్తుతంలో నేను నా భార్యకన్నా... అంటే కన్న తల్లిదండ్రికన్నా... భార్య తల్లి తండ్రి... అదే అత్తమామలు మిన్న అయినారన్న మాట... హు... విజ్ఞాన విభవం... కాలమహిమ...’ కొడుకును తలచుకొంటూ కళ్లుమూసుకున్నాడు మాధవయ్య...
మరుదినం... ఆ మరుదినం ఉగాది పండుగ... జరిగిపోయాయి.
పెత్తనం అంతా సదాశివం అత్త జయమ్మగారిదే. అన్నపూర్ణమ్మ... మాధవయ్యలు చిత్తరువులై జరుగుతున్న తతంగాన్ని చూస్తూవుండిపోయారు. ఉగాది ముగిసింది.
ఆ రెండవరోజు వారి చార్‌ధామ్ యాత్రకు... ప్రయాణం...
ఆరోజు మధ్యాహ్నం భోజనాలు ముగిశాయి.
శాంతి తల్లి జయమ్మ, తండ్రి రామారావు పిల్లలు హడావిడిగా సామాగ్రిని సర్దుతున్నారు.
సదాశివం వరండాలో కూర్చొనియున్న తండ్రిని సమీపించాడు...
‘‘నాన్నా!...’’
వారిని గురించే ఆలోచిస్తున్న మాధవయ్య...
‘‘ఏం నాయనా!...’’ మెల్లగా అడిగాడు.
‘‘రేపు....’’
‘‘ఆ... రేపు!...’’
‘‘మేము మన వాళ్లతో కలసి చార్‌ధామ్ యాత్రకు బయలుదేరుతున్నాము. ఆయన రైల్వే ఉద్యోగికదా!... వారికి పాస్‌లు ఉన్నాయి... అందువల్ల...’’ సదాశివం పూర్తిచేయకముందే...
‘‘మంచిది... మంచిది... వెళ్లిరండి!...’’ చిరునవ్వుతో చెప్పాడు మాధవయ్య.
ఆరోజంతా సదాశివం అతని భార్యాపిల్లలు అత్తమామలు సామాన్లు సర్దుకోవటంలో బిజీ బిజీ... రాత్రయింది... ఏదో తిన్నారు... పడుకొన్నారు.. తెల్లవారింది... అందరికీ చెప్పి మాధవయ్య అన్నపూర్ణమ్మలు.. ఆటోలో స్టేషన్‌కు చేరారు.
GGGGG GGGG GGGGG
‘‘సార్!...’’ మెల్లగా పిలిచాడు రామచంద్ర...
మాధవయ్యలో చలనం లేదు...
రామచంద్ర వారి ముఖంలోకి చూచాడు. కళ్లనుండి కారిన కన్నీళ్లు చక్కిళ్లపై చారలుగా మారివున్నాయి.
మెల్లగా భుజం తట్టి ‘‘సార్!’’ పిలిచాడు రామచంద్ర...
తొట్రుపాటుతో కళ్లు తెరిచాడు మాధవయ్య... తలను పైకెత్తి రామచంద్ర ముఖంలోకి దీనంగా చూచాడు.
‘‘సార్!... అమ్మగారికి స్పృహ వచ్చింది. మిమ్మల్ని చూడాలంటున్నారు. రండి సార్!...’’ ప్రీతిగా మాధవయ్యగారి కుడిచేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు రామచంద్ర.
ఇరువురూ అన్నపూర్ణమ్మగారు వున్న వార్డులో ప్రవేశించారు. ఆమె బెడ్‌ను సమీపించారు.
మాధవయ్యగారు గొంతు సవరించటంతో అన్నపూర్ణమ్మగారు మెల్లగా కళ్లు తెరిచారు.
తలవైపునకు చేరి ప్రీతిగా భార్య ముఖంలోకి చూచాడు మాధవయ్య.
అతని ప్రక్కనే రామచంద్ర...
ప్రక్కన అతని అక్క డాక్టర్ సుగుణ...
అందరూ అన్నపూర్ణమ్మ ముఖంలోకి చూస్తున్నారు.
నర్స్ డ్రిప్స్ (గ్లూకోజు) ఏర్పాటు చేసింది...
చిరునవ్వుతో సుగుణ మాధవయ్యగారి ముఖంలోకి చూస్తూ...
‘‘ఇది రెండవ బాటిల్ సార్.. చాలా బలహీనంగా వున్నారు... మరో బాటిల్ ఎక్కిస్తారు. ఆహారం ఇక్కడే ఇస్తారు. వీడు నా తమ్ముడు. వాడు... మీరు వారిగురువుగారని చెప్పాడు. మీ మిసెస్‌గారికి ఏం భయంలేదుసార్... సాయంకాలంగాని లేక రేపు ఉదయంగానీ మీరు ఇంటికి తీసుకొని వెళ్లవచ్చు..’’ అనునయంగా చెప్పింది డాక్టర్ సుగుణ...
‘‘మేము చీరాల వెళాలమ్మా!...’’
‘‘అలాగా!... ’’ క్షణంసేపు ఆలోచించి... ‘‘రేయ్ రామూ!...’’
‘‘ఏం అక్కా!...’’
‘‘సాయంత్రం నాలుగు గంటలకు మన కార్లో వీరిని చీరాలలో దించి రారా!...’’
‘‘ఓ!... అలాగే అక్కా!...’ ఆనందంగా చెప్పాడు రామచంద్ర...
‘‘సార్‌ని మన ఇంటికి తీసుకొని వెళ్లి భోజనం పెట్టించు. రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకొని... సాయంత్రం నాలుగుగంటలకు వారిని మన కారెక్కించుకొని హాస్పటల్‌కి రా... అమ్మగారిని ఎక్కించుకొని చీరాల వెళ్లి వారిని దించి వద్దువుగాని!..’’ ఎంతో ప్రీతిగా చెప్పింది డాక్టర్ సుగుణ...
‘‘అమ్మా!... ఇదంతా మీరు.... మీరు...’’
‘‘సార్!... ఇది మా బాధ్యత... ప్లీజ్... చేయనీయండి.. ఇంటికి రాముతో వెళ్లి భోజనం చేసి రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకొని నాలుగు గంటలకు వాడితో కలసిరండి. వాడు మిమ్ములను ఆరుగంటలకల్లా చీరాల చేరుస్తాడు. అమ్మగారి విషయం నేను చూచుకొంటాను. మీరు ఇంటికి వెళ్లిరండి సార్!...’’ ఎంతో అభిమానంతో చెప్పింది సుగుణ.
మాధవయ్య భార్యతో చెప్పి రామచంద్రతో... వారి ఇంటికి వెళ్లాడు.
వేడినీళ్ల స్నానం... మంచి కూరలు పప్పు.. పెరుగుతో భోజనం.. ఆ తరువాత గెస్ట్ బెడ్‌రూమ్‌లో మూడుగంటల విశ్రాంతి... నాలుగు గంటలకు టీ... నాలుగున్నరకు కార్లో హాస్పటల్‌కు చేరారు మాధవయ్య.
డాక్టర్ సుగుణ అన్నపూర్ణమ్మకు కొన్ని మందులు విటమిన్ ట్యాబ్‌లెట్లు ఇచ్చింది.
రామచంద్ర గురువు గురుపత్ని గార్లతో చీరాలకు బయలుదేరాడు. ఐదుముక్కాలుకల్లా వారిని ఇంటి దగ్గర దించి... వారిరువురి పాదాలు తాకి ఆశీస్సులతో రామచంద్ర విజయవాడకు బయలుదేరాడు.
ఆ రాత్రి... గడచిన ఐదురోజుల అనుభవాలను తలచుకొంటూ ఒకే శయ్యపైన ఆ దంపతులు పడుకొన్నారు.
‘‘అనూ!...’’ మెల్లగా పిలిచాడు మాధవయ్య.
‘‘ఏమండీ!...’’
‘‘మనం ఏ రాకతో వచ్చామో... ఆ రాక తాలూకు పనులు అన్ని మనం సవ్యంగా ముగించాము.. ఒక్క చిన్నోడి పెళ్లి తప్ప... అదీ ఆ పై తండ్రి తలచుకొంటే త్వరలో జరుగుతుందని నా నమ్మకం.మనలో ఎవరు ముందో... ఎవరు వెనుకో మన పోక విషయంలో నాకు తెలియదు. ఇక పై మనం ఎవరింటికి వెళ్లేది లేదు. నాకు నీవు... నీకు నేను ఇక్కడే బ్రతికినన్నేళ్లు కలసి బ్రతుకుదాం... దేనికీ భయపడకు.. బాధపడకు... నీకునేనున్నాను... ఎంతో ప్రీతిగా చెప్పాడు మాధవయ్య... వారి ఇల్లాలు ఆనందంగా వారి ఎదపై వాలిపోయింది.
******
తలుపు తట్టిన సవ్వడి విని మాధవయ్య మెల్లగా వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగా చివరి కుమారుడు అవివాహితుడు రామశివం.
మాధవయ్య ఆశ్చర్యపోయాడు.
‘‘ఏమిటిరా... ఈ రాక?...’’ మెల్లగా అడిగాడు.
రామశివం ఆశ్చర్యంగా తండ్రి ముఖంలోకి చూస్తూ నిలబడ్డాడు. ఆ చూపులో ‘రేయ్!... మీరు నన్ను ఎందుకు కన్నారు?...’ అనే భావన కనబడుతోంది.
సమయం ఉదయం ఐదున్నర...
‘‘ఎవరండీ!...’’పడుకొనే అడిగింది అన్నపూర్ణమ్మ...
‘‘మన రామశివం వచ్చాడు అనూ!...’’
‘‘ఆ...’’
‘‘అవును...’’
‘‘అమ్మా!... నే వచ్చాను!...’’ తల్లికి వినపడేటట్టు పెద్దగా చెప్పాడు.
అన్నపూర్ణమ్మ మంచంపైనుండి దిగి వారిని సమీపించింది.
కుర్చీని రామశివం దగ్గరకు లాక్కొని ప్రక్కగా కూర్చొని అతని ముఖంలోకి వంగి పరీక్షగా చూచింది.
‘‘ఏం నాయనా... దిగులుగా వున్నావ్!...’’ దీనంగా అడిగింది.
ఆ మాటలు విన్న రామశివం భోరున ఏడ్చాడు.
‘‘ఎందుకు ఏడుస్తావ్?... విషయం ఏమిటో చెప్పు...’’ ప్రాధేయపూర్వకంగా అడిగాడు మాధవయ్య.
కొన్ని క్షణాల తర్వాత... రామశివం తమాయించుకొని... ‘‘అమ్మా!... మీ అన్నకూతురికి నేను నచ్చలేదు. నేను ఇంతకాలం అక్కడ వున్నానంటే కారణం... నేను సంధ్యను ఎంతగానో ప్రేమించాను తనను ఒప్పించి నమ్మించి ప్రేమతో వివాహం చేసుకోవాలనుకొన్నాను. మొన్న ఆ విషయాన్ని గురించి అడిగాను. తను నన్ను కాదంది. మీ అన్న రామదొరై కూతురికే సపోర్టు. అలాంటపుడు నాకు వారి ఇంట వుండవలసిన అవసరం... మీ అన్న చెప్పే పనులన్ని చేయడం... నాకు అనవసరం కదా!...
ప్రతి ఒక్కరూ ఇతరులను తమ అవసరాలకు వాడుకొనే వారే!.. మీరు కన్నబిడ్డలమైన మేము... మిమ్ములను మా అవసరాలకు ఎన్నో విధాలుగా వాడుకొన్నాము. వృద్ధిలోకి వచ్చాము. మిమ్మల్ని.. మీ జీవితాలను గురించి మరచిపోయాం... ఒకరీతిగా సంధ్య నాకు జ్ఞానోదయాన్ని కలిగించింది. అక్క సరేసరి... వివాహం అయిపోయింది. తన భర్తతో వెళ్లిపోయింది. నా ఇద్దరు అన్నలు మీ ఆస్థిని, పిఎఫ్‌ను పంచుకొన్నారు. మిమ్మల్ని అన్న విజయవాడకు రమ్మనిచెప్పి... తన భార్య మాట ప్రకారం... ఆమె తల్లిదండ్రులతో చార్‌ధామ్ యాత్రకు బయలుదేరాడేకాని.. మీరు వచ్చేటపుడు... మీతో స్టేషన్‌కు వచ్చి మిమ్ములను రైలు ఎక్కించలేకపోయాడు. మీరు మాకందరికీ ఎంత చేశారు?....’’ విశ్వాస హీనుడు... పరమ స్వార్థపరుడు...’’
‘‘వాడు నీకంటే పెద్దవాడురా!... వాడిని నీవు తిట్టకూడదు. అది నీకు పాపంరా!...’’ అవును నీకు మా సంగతులన్ని ఎలాతెలిసాయి?...’’ అడిగాడు మాధవయ్య.
‘‘మిమ్మల్ని ఇక్కడకు తీసుకొనివచ్చి దించిన రామచంద్ర గారి తండ్రి పేరుమోసిన లాయరు. మా మామ రామదొరై కొన్ని కేసుల విషయాల్లో వారి సలహాలు తీసుకొంటుంటారు. ఇద్దరం కలసి విజయవాడ వారిదగ్గరకు వెళ్లేవాళ్లం... కొన్నిసార్లు నన్నే పంపించేవాడు. అప్పుడు రామచంద్ర వాళ్ల అక్క డాక్టర్ సుగుణ... వారి కుటుంబం.. నాకు బాగా పరిచయం. నాన్నా నా మాటలను జాగ్రత్తగా వినండి... మన బాపట్ల ఇపుడు జిల్లా కేంద్రం అయిందిగా!.. నేను మీతో ఇక్కడే వుంటాను. నా ప్రాక్టీస్ ప్రారంభిస్తాను. నాకు మీకన్నా ఎవరూ ఎక్కువ కాబోరు...’’ చిరునవ్వుతో చెప్పి రామశివం రెస్టురూమ్ వైపునకు వెళ్లాడు.
ఆ సమయంలో రామశివం రాక... అతని మాటలు ఆ దంపతులకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. భార్యాభర్తలిరువురూ... రామశివం వివాహాన్ని.. అతని ఇష్టానుసారంగా... అతనికి అన్నివిధాల నచ్చిన వధువుతో గొప్పగా జరిపించాలని నిర్ణయించుకొన్నారు.
******
//సంపూర్ణం.//
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.
Comments