కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
Nammakam' New Telugu Story written by Thirumalasri
రచన : తిరుమలశ్రీ
జ్యోతిష్యం నిజమో కాదో చెప్పలేము కానీ కొంతమంది చేతులారా నిజం చేస్తారు. అలాంటి వ్యక్తి కథనే చక్కగా మలిచారు ప్రముఖ రచయిత తిరుమలశ్రీ గారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. ఇక కథ ప్రారంభిద్దాం
దుబాయ్ లో ‘జ్యోతిషం – సైన్సా. ఆర్టా?’’ అన్న విషయం పైన మూడు రోజులుగా అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. వివిధ దేశాలకు చెందిన పలువురు నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రముఖ జ్యోతిష్కులూ అందులో పాల్గొంటున్నారు.
కుతూహలంతో, డెలిగేట్ రుసుము చెల్లించి ఆ సదస్సుకు హాజరయ్యాడు శివరాం. ముప్పయ్ రెండేళ్ళు ఉంటాయి అతనికి. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాకి చెందినవాడు. రైతు కుటుంబం. పదేళ్ళ వయసులో తండ్రి అకాలమరణం చెందడంతో, తల్లే అతన్ని పెంచి పెద్దచేసింది. రెండెకరాల పొలంలో కూరగాయలు పండించి, దాని మీద వచ్చే ఆదాయంతో అతన్ని డిగ్రీ వరకు చదివించింది.
కాలేజ్ లో చదువుతున్నప్పుడు స్నేహితులతో కలసి మోటార్ బైక్ రేసింగ్ అలవరచుకున్నాడు శివరాం. చివరికి అది గొప్ప హాబీగా మారడంతో, అందులో ప్రత్యేక శిక్షణ కూడా పొందాడు. క్రమంగా ప్రావీణ్యతను సంపాదించాడు. రాష్ట్రంలోనే కాక, దేశంలో ఎక్కడ బైక్ రేసులు జరిగినా తప్పకుండా పాల్గొనేవాడు. బహుమతులు గెలుచుకునేవాడు. పందేలలో గెలవాలన్న పట్టుదలతో బైక్ వేగంగా నడుపుతూ, కొడుకు ఎక్కడ ప్రమాదానికి గురియవుతాడోనని తల్లికి భయంగా, బెంగగా ఉండేది. రేసులు మానేసి బ్రతుకుతెరువు కోసం ఉద్యోగం చూసుకోమని పోరేది. ఆమె సంతృప్తి కోసం అతను ఏవో ప్రయత్నాలు చేసినా, వాటిలో శ్రద్ధాసక్తులు లోపించడంవల్ల ప్రయోజనం లేకపోయేది. పోనీ వ్యవసాయంలో తనకు సాయం చేయమంటే, పొలం పనులు తనకు సరిపడవు అనేవాడు.
స్నేహితులు కొందరు దుబాయ్ వెళుతున్నట్టు తెలిసి, తానూ సిద్ధమయ్యాడు శివరాం. విదేశాలకు వెళ్ళితే అంతర్జాతీయ బైక్ రేసుల్లో పాల్గొనే అవకాశం తలుపు తడుతుందని ఉవ్విళ్ళూరాడు. ఒక్కగానొక్క కొడుకు విదేశాలకు వెళ్ళడం తల్లికి సుతరామూ ఇష్టంలేదు. కానీ, తల్లి మాట వినే స్థితిలో లేడు అతను.
దుబాయ్ లో ఓ ఎలెక్ట్రానిక్ షాపులో ఉద్యోగం దొరికింది శివరాంకి. వీలున్నపుడల్లా బైక్ రేసుల్లో పాల్గొనేవాడు. అనతికాలంలోనే ఫాస్టెస్ట్ బైకర్ గా పేరు తెచ్చుకున్నాడు…..
‘జ్యోతిషం’ పైన జరుగుతూన్న ఆ అంతర్జాతీయ సదస్సు పైన శివరాంకి ఆసక్తి కలగడానికి బలమైన కారణమే ఉంది…తమ ఊళ్ళోని ఆలయపూజారి కృష్ణశాస్త్రులుగారు జ్యోతిషం చెప్పేవాడు. యాభయ్యేళ్ళు ఆయనకు. అరచేతిరేఖలు చూసి మనిషి భవిష్యత్తు చెబుతాడు. ఆయన చెప్పినవన్నీ కనీసం నూటికి తొంభై అయిదు పాళ్ళు జరుగుతాయన్న పేరుంది. సమస్యల వలయంలో చిక్కుకున్నవారు, తీవ్ర అనారోగ్యసమస్యలతో బాధపడుతూన్నవారు, సినీప్రముఖులు, రాజకీయనాయకులు…పలువురు ఎక్కడెక్కడినుండో ఆయన వద్దకు వచ్చేవారు. జ్యోతిషం మీద పెద్దగా నమ్మకంలేని శివరాం, వారి అజ్ఞానానికి నవ్వుకునేవాడు.
కొడుకు బాధ్యత లేకుండా తిరుగుతూంటే, అతని భవిష్యత్తును గూర్చి ఆందోళనకు గురైన తల్లి, శివరాంని కృష్ణశాస్త్రులు గారి దగ్గరకు పంపించింది. తల్లి బలవంతం పైన అయిష్టంగానే వెళ్ళక తప్పలేదు అతను.
చేయి తనది కానట్టు, అరచేతిని కృష్ణశాస్త్రులుగారికి అప్పగించి దిక్కులు చూడసాగాడు శివరాం. ఆయన ఏదేదో చెబుతూంటే, విననట్టే వినసాగాడు. ఆయన ఏం చెప్పాడో, తాను ఏం అర్థంచేసుకున్నాడో తెలియదు…తల్లి అడిగితే తనకు విదేశీయానయోగం ఉందనీ, బైక్ రేసుల వల్ల హాని జరిగే అవకాశం లేదన్నాడనీ చెప్పాడు.
ఆనక కృష్ణశాస్త్రులుగారు చెప్పినట్టే, అనుకోకుండా దుబాయ్ వచ్చాడు శివరాం. బైక్ రేసుల్లో అప్పుడప్పుడు స్వల్పగాయాలు తప్పితే, ప్రమాదమేమీ జరుగలేదు అంతవరకూను. దాంతో, ‘జ్యోతిషం నిజంగానే నమ్మదగ్గ శాస్త్రమా?’ అన్న మీమాంస అప్పుడప్పుడు ఎదురయ్యేది అతనికి…
ఆ మూడు రోజుల సదస్సులో అత్యంత ఆసక్తికరమైన చర్చలు, వాదనలూ చోటుచేసుకున్నాయి-
‘జ్యోతిషం – గగనంలోని గ్రహాల గమనం, గతులనుబట్టి ప్రకృతి పైన, మానవజీవితాల పైన వాటి ప్రభావాన్ని చెబుతుంది. కొన్ని తేదీలు, సంఘటనల ఆధారంగా మనిషి యొక్క భవిష్యత్తును సూచించుతుంది. కానీ, ఆ రీడింగ్స్ ని వైజ్ఞానికంగా రుజువు చేయలేదు. కనుక దాన్ని సైన్స్ అని అంగీకరించలేము… జ్యోతిషం అనేది మానవమనస్తత్వాలు, విశ్వాసాల పైన ఆధారపడియున్న విషయం. హ్యూమన్ సైకాలజీ, బిలీఫ్ లతో జ్యోతిష్కులు నేర్పుతో చాతుర్యంతో ఆడుకునే చిత్రమైన ఆట అది. ఓ ప్రత్యేకమైన కళ. కాబట్టి, ఎట్ ద మోస్ట్, దాన్ని ఆర్ట్ అని చెప్పవచ్చును,.. గ్రహాల పోకడలు, కొన్ని తేదీలు, సంఘటనలు ఆలంబనగా అధ్యయనం చేసి భవిష్యత్తు గురించి చెబుతోంది కనుక జ్యోతిష్యాన్ని ‘సూడో-సైన్స్’ అనవచ్చునేమో… కొండొకచో జ్యోతిషం యొక్క సూచనలు ఫలించవచ్చును. అది కేవలం యాదృచ్ఛికమే తప్ప, ఎల్ల వేళలా అందరి విషయాలలోనూ ఆ సూచనలు ఫలించితీరుతాయన్న భరోసా లేదు. సో, నిరాధార సంగతులను సైన్స్ అంగీకరించదు,..’ – ఇది ప్రతికూలవాదుల అభిప్రాయం.
‘ప్రయోగశాలలో రుజువు చేయలేని కారణంగా జ్యోతిషం సైన్స్ కాదని కొట్టిపడేయడం సబవుకాదు. థియొరెటికల్ ఫిజిక్స్ లో అధిక భాగం లేబొరేటరీలో రుజువు చేయలేం. అయినా దాన్ని సైన్స్ గానే పరిగణిస్తున్నాం… జ్యోతిష శాస్త్రాన్ని వేలాది సంవత్సరాలుగా ప్రభుత్వాలు, సంస్థలు నిర్లక్ష్యం చేసాయి.
ప్రోత్సహించలేదు సరిగదా, వ్యతిరేక ప్రచారంతో దాని ప్రాచుర్యాన్ని దెబ్బతీసాయి. అందుకే నిజాయితీతో కూడిన పరిశోధన ఏదీ జరుగలేదు దాని పైన… జ్యోతిషం సైన్స్ అని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఎందుకంటే, అది గ్రహాలను గూర్చిన వైజ్ఞానిక సమాచారాన్ని, గ్రహాల స్థితిగతులను గూర్చిన పట్టికల వంటి సైంటిఫిక్ టూల్స్ ని ఉపయోగించి అధ్యయనం చేస్తుంది. భవిష్యత్తులో సంభవింపబోయే సంఘటనలను, వ్యక్తుల భవిష్యత్తునూ సూచించుతుంది. ఆ సూచనలకు సైంటిఫిక్ ఎవిడెన్స్ గా గతంలో జరిగిన సంఘటనలు, అనుభవాలను ఉటంకించడం కూడా కద్దు,.. జ్యోతిషం ఓ కాంప్లెక్స్ సబ్జెక్ట్. దాన్ని సైన్స్ గానో, ఆర్ట్ గానో కేటగరైజ్ చేయడం సాధ్యం కాదు. సైన్స్ లా దాన్ని కొన్ని పరిమిత ప్రమాణాలతో కొలవలేము. అదొక ఆధ్యాత్మిక పరికరం. భూగోళపు స్థితిగతులు, మానవాళి జీవితాలలోని భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలోని సంఘటనలను అధ్యయనం చేసి, వాటికి కారణాలను, జవాబులనూ వెదికే పనిముట్టు. జ్యోతిషం కేవలం ఆశువుగా, తోచింది చెప్పేది కాదు. దాని వెనుక ఎంతో అధ్యయనం, పరిశోధన, పరిశీలన, వగైరాలు ఉంటాయి. కావున జ్యోతిషం ఇటు సైన్సు, అటు ఆర్ట్స్ కూడాను,..’ – ఇది అనుకూలవాదుల వాదన.
ఇలా ఎవరి థియరీని వారు సోదాహరణంగా సదస్సు ముందు ఉంచారు. అయితే, అందరూ ఏకగ్రీవంగా అంగీకరించిన అంశం – నమ్మకం! జ్యోతిషానికి ఆయువుపట్టు ‘నమ్మకం’ అని తేల్చడం విశేషం!! కానీ, శివరాం మదిలోని ‘జ్యోతిషాన్ని నమ్మాలా వద్దా’ అన్న మీమాంస అలాగే ఉండిపోయింది…
***
మేనమామ ఫోన్ చేసాడు, శివరాం తల్లికి గుండెపోటు వచ్చిందనీ, కొడుకును
చూడాలనుకుంటోందనీను. వెంటనే ఇండియాకి బైలుదేరాడు శివరాం…హైదరాబాదులోని షంషాబాద్ ఏర్ పోర్ట్ లో దిగి, సికిందరాబాదు స్టేషన్లో తన ఊరికి వెళ్ళే ఓవర్ నైట్ ట్రెయిన్ ని పట్టుకున్నాడు. పదేళ్ళ తరువాత స్వదేశానికి తిరిగివస్తున్నాడు అతను. దశాబ్దంపాటు దుబాయ్ వంటి అల్ట్రా-మోడర్న్ కాంక్రీట్ జంగిల్ లో గడపిన అతనికి, స్వదేశంలోని ఆ ప్రశాంత వాతావరణం ఆహ్లాదకరంగా అనిపించింది. రైలు వెళుతూంటే – పరుగులు పెడుతూన్న పచ్చని పైరులు, వృక్షాలు, తోటలూ, కాలువలు వగైరాలు కనువిందు చేస్తున్నాయి.
కనుచూపు మేరలో తన ఊరు కనిపించడంతో శివరాం మది ఉరకలు వేసింది. రైలు పొలాల చుట్టూ తిరిగి ఐదుమైళ్ళ దూరంలో ఉన్న ఆ ఊరిని చేరుకుంటుంది. తన ఊరి స్వరూపం మదిలో మెదిలింది శివరాంకి– చిన్న రైల్వే స్టేషన్…ఊళ్ళోకి కాలిబాట…ఊరిముందు అమ్మవారి గుడి, పక్కనే పోతరాజు నిలువెత్తు విగ్రహం…ఊడలమఱ్ఱి…ఊళ్ళో ప్రవేశించగానే పెద్ద పెద్ద లోగిళ్ళు– ఆ ఊరి పంచాయితీ ప్రెశిడెంటు, మెంబర్లవి. ఆ తరువాత కొన్ని పెంకుటిళ్ళూ…ఎలిమెంటరీ స్కూలు…రామాలయం…దాపులో పెద్ద రావిచెట్టు, దాని చుట్టూ సిమెంటుతో చేయబడ్డ రచ్చచావడి.
రామాలయానికి వెనుకపక్క కృష్ణశాస్త్రులుగారి ఇల్లు…ఊళ్ళో చాలమటుకు మట్టి ఇళ్ళే. తమది కూడా. గ్రామం చివర పొలాన్ని ఆనుకుని ఉంటుంది…ఊరి చివర స్మశానం ఉంది… ఊరిని సమీపిస్తూంటే దూరంలో గుడిగంటలు సన్నగా వినిపించాయి. దాంతో శివరాం ఆలోచనలు కృష్ణశాస్త్రులుగారి వైపు మళ్ళాయి…
ఆయన చెప్పినట్టే తనకు విదేశీయానం ప్రాప్తించింది. కాకపోతే, ‘నీ మరణం జన్మించిన ఊళ్ళోనే కలుగుతుంది!’ అన్నాడాయన.
‘అది కూడా నిజమవుతుందా!?’ అన్న బెంగ శివరాం మదిలో బల్లిలా చొచ్చి డైనోసరస్ అంత అయిపోయింది. ఒకటి ఫలించి, మరొకటి ఫలించకుండా పోతుందా?? అంతర్జాతీయ సదస్సులోని జ్యోతిషాన్ని గూర్చిన చర్చలు మస్తిష్కంలో మెదిలాయి… ’జ్యోతిషం ఫలించడం యాదృచ్ఛికమైతే, అన్నీ ఫలించాలని లేదుగా! ఐతే, కృష్ణశాస్త్రులుగారి రీడింగ్స్ సాధారణంగా తప్పవన్న ప్రసిద్ధి కద్దు.
‘అంటే…!?’ గతుక్కుమన్నాడు శివరాం.
రైలు ఆ ఊళ్ళో ఆగింది. హఠాత్తుగా భయం క్రమ్ముకోవడంతో, దిగలేదు అతను. తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నాడు. అంతలోనే తల్లి గుర్తుకువచ్చింది. గుండెపోటుతో మంచం పట్టిన ఆమెను చూడకుండా వెళ్ళిపోవడానికి మనస్కరించడంలేదు.
‘జరుగుతుందో లేదో తెలియని దానికి భయపడి ఊరిదాకా వచ్చి అమ్మను చూడకుండా వెళ్ళిపోవడమా!?...జ్యోతిషానికి ఆలంబన ‘నమ్మకం’ అని అంగీకరించారంతా. చిన్నప్పట్నుంచీ జ్యోతిషం మీద నమ్మకంలేని తాను భయంతో పారిపోవడం పిరికితనమే అవుతుంది…’ అనిపించింది.
దిగాలనుకున్నాడు. ఐతే రైలు అప్పటికే తిరిగి బైలుదేరింది. ఎక్స్ ప్రెస్ కావడంతో ఆ స్టేషన్లో ఒకే ఒక నిముషం ఆగుతుంది. బ్యాక్ ప్యాక్ ని వీపుకు తగిలించుకుని తలుపు దగ్గరకు వెళ్ళాడు శివరాం. సెకన్లలో వేగం పుంజుకున్న ఎక్స్ ప్రెస్ ప్లాట్ ఫామ్ దాటుతోంది.
తోటి ప్రయాణీకుల హాహాకారాల మధ్య…రైల్లోంచి ఉరికేసాడు...!!
***సమాప్తం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారతప్రభుత్వపుCSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ అఫ్ అడ్మినిస్ట్రేషన్' గా పదవీ విరమణ చేసారు…వీరి మరో కలంపేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్లోను, ప్రక్రియలలోను(బాలసాహిత్యంతోసహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు185 నవలలు ప్రచురితమయ్యాయి. పలుకథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలోప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్లో ప్రసారంకాగా, మరికొన్నిరంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలుకథలు బహుమతులను అందుకున్నాయి. కొన్నికథలు హిందితోపాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీసంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు100 కథలు, ఆర్టికల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ (లిటరరీ) కాలం వ్రాసారు. ఓ జర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఈ బుక్స్ ప్రచురిత మయ్యాయి... స్టోరీ మిర్రర్ (ఆంగ్లం), ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదాంకితులు, మరియు ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020’ నామినీ… హిందీలో అరడజను కథలు ప్రచురితం కాగా,ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.
''స్టోరీ మిర్రర్- 'ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020' అవార్డ్స్ (రీడర్స్ చాయిస్- ఫస్ట్ రన్నరప్ & ఎడిటర్స్ చాయిస్- సెకండ్ రన్నరప్) ట్రోఫీలు లభించాయి..."
Comments