నమ్ముతావా కృష్ణా!
- T. V. L. Gayathri

- Oct 9
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #నమ్ముతావాకృష్ణా, #కడలిలోసంచలనం

గాయత్రి గారి కవితలు పార్ట్ 38
Nammuthava Krishna - Gayathri Gari Kavithalu Part 38 - New Telugu Poems Written By
T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 09/10/2025
నమ్ముతావా కృష్ణా! - గాయత్రి గారి కవితలు పార్ట్ 38 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
నమ్ముతావా కృష్ణా!
(వచన కవిత)
పదాలపదనిసలు
(ఆలన,లాలన,పాలన,భావన, సంభావన, వేదన,రోదన, సాధన, నివేదన, ఆరాధన.)
**********************************
జీవుల నెంతయో ప్రేమించి వారి మొరలనాలన.
చేవను కలిగిస్తూ చూపిస్తావు దీనులపై నీ లాలన.
సతతము ప్రయత్నిస్తావు మానుజుల్లో పెంపొంద సద్భావన.
వెతలను తొలగించే నీకు నా లేత మదిలో సంభావన.
నిన్ను కనుగొన లేక ఉప్పెనలా వస్తోందీ రోదన.
నిన్ను చేరటానికి చేస్తున్నా క్షణక్షణం కఠోరసాధన.
నీ మీద విరహంతో నాకు కలిగింది మనోవేదన.
నా మమతతో నిండిన నా మనసే నీకు నివేదన.
నమ్ముతావా కృష్ణా!నిన్నే తలపోస్తూ మౌనారాధన.
నెమ్మితో ప్రార్థిస్తున్నా నాకు కావాలి నీ పాలన.//
************************************

కడలిలో సంచలనం.
(వచన కవిత)
************************************
కడలికో ఆంతర్యం కడలిలో సంచలనం.
కడలికో హృదయం కడలికో ఆక్రోశం.
కాలుష్యాన్ని కలిపితే కడలిలో గరళం.
ప్లాస్టిక్కు వ్యర్ధాలతో ప్రళయానికి సంకేతం.
జలచరాల కిపుడు క్షణ క్షణం భయం భయం.
విలవిలలాడుతూ భీతి నొందు జీవ జాలం.
జీవులంతరించి పోవ చేవ మిగిలి ఉంటుందా?
భావితరాలనపుడు ప్రకృతి కాపాడుతుందా?
సాగర నాదంలో నేడు జడిపించే నినాదం.
ఆ గంభీరమౌ శబ్దంలో అవనికో సందేశం.
వినిపిస్తోందా మనకా వేదనపు విలాపం?
కనుపించదు మన కళ్ళకు రాబోయే ప్రళయం!
సుందరమౌ సాగరంలో శోభనమౌ కాంతులనేకం.
అందరాని సంపదలన్నీ అవని వాసుల సొంతం.
రక్షణగా మనముంటే రత్నాల నిచ్చే దాతృత్వం.
కక్షతోడ మసలుకుంటే కాలరాచే కడలి శౌర్యం.
భక్తితో సేవించు!మన వసుధను కాపాడుతుంది!
శక్తి నిలుపు సాగరం జగతికి జలమే ఆధారం.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:



Comments