top of page

నమో శ్రీనివాస

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #NamoSrinivasa, #నమోశ్రీనివాస, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Namo Srinivasa - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 06/09/2025

నమో శ్రీనివాస - తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


ఒంటిమీదకు ముప్పయి దాటినా ఇంకా పెళ్ళి కాలేదు. అమ్మకు నా పెళ్ళి గురించి ఒకటే బెంగ. నాకు పెళ్ళి లేట్ అయినా పర్వలేదన్నాను. ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలనేది అమ్మ వాదన. 


మా అమ్మ ఇక లాభం లేదనుకుని.. కనిపించిన ప్రతి గుడికి వెళ్లి దేవునితో నా పెళ్ళికోసం అగ్రిమెంట్ చేసుకుంది. అదేనండి.. మొక్కుకుంది. ఒకసారి కలలో వెంకటేశ్వర స్వామి కనిపిస్తే, కొడుకు పెళ్ళైతే.. దూరమైనా వస్తానని మొక్కేసుకుంది. 


దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని మరీ నా పెళ్ళిగురించి ఆశీర్వదించినట్టు, నాకు వెంటనే సంబంధం కుదిరింది. చక్కని అమ్మాయే దొరికింది.. చూడడానికే. మాటల పుట్ట నా పెళ్ళాం. పెళ్ళైన తర్వాత ఈ విషయం తెలిసింది.. అచ్చం తండ్రి పోలిక. పెళ్ళైన మూడు నెలలలో, తన మాటలతో తెగ వాయించేసింది మా ఆవిడ. 


ఏమిటో తెలియదు.. ఆమె మాటలకు లాజిక్ ఏమీ ఉండదు.. అలా మాట్లాడేస్తుంది అంతే. కూతురే ఇలా ఉంటె, తండ్రి ఎలా ఉంటాడో, ఇక చెప్పనవసరం లేదు. మా మామగారి మాటలకో, మరి ఎందుకో.. మా అత్తగారు లేత వయసులోనే పక్షవాతంతో లేటు అయ్యారు. 


మా ఆవిడ బాధ భరించలేక, చాలా సార్లు విడాకులు ఇచ్చేయ్యాలనిపించేది. అలా చేస్తే, ఇక ఈ జన్మకు నాకు మళ్ళీ పెళ్ళికాదని సర్దుకుపోయేవాడిని. 


"అన్ని మొక్కులు తీర్చేసాను.. కానీ ఒక్క తిరుపతి మొక్కు తప్ప.. వెంటనే వెళ్ళాలి అంది. అది తీరిపోతే, మీ ఆవిడ మారుతుందేమో" అని అమ్మ అనగానే.. నాకూ ఎక్కడో ఆశ కలిగింది. అప్పు చేసైనా సరే, టికెట్స్ బుక్ చేసుకుని ఒక మంచిరోజు బయల్దేరాము. మామగారు ఒక్కరిని వదలలేక, ఆయన కూడా మాతోపాటే బయల్దేరారు. 


స్టేషన్ కు క్యాబ్ బుక్ చేశాను. పొరపాటున మా మామగారు డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్నారు. ఆయన మాటలకచేరి మొదలుపెట్టారు. అంతే.. ! స్టేషన్ వచ్చేసరికి డ్రైవర్ ముఖం మాడిపోయింది. ఐదొందలు నోటు ఇస్తే, తిరిగి వెయ్యి ఇచ్చాడు.. అదీ మా మామ ఎఫెక్ట్. 


ట్రైన్ మొదలైంది.. మా మామగారు మళ్ళీ తన మాటల కచేరిని మొదలుపెట్టేసారు. ఈసారి మా ఆవిడ కూడా ఆయనకు కోరస్ పాడింది. ఒక మాటతో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతారు. మేటర్ ఏమీ పెద్దగా ఉండదు. ఆ ధాటికి ట్రైన్ బోగీ మొత్తం ఊగిపోయే పనైంది.. దెబ్బకి చాయివాడు, సమోసావాడు అందరూ మా బోగీకి రావడమే మానేసారు. మా బేరాలు పోతాయి, ఆయన మాటలు ఆపించండి అని ఒకటే వారిగోల. అక్కడ అందరిదీ అదే కోరిక. 


అందరికి తలనొప్పి తప్పితే.. ఏమీ లేదు. ఆగలేక, ఒక పెద్దావిడ.. మా ఆవిడని ఇలా అడిగింది.. 


"మీ నాన్నగారికి ఎంత ఓపికో.. అలా ఆపకుండా మాట్లాడడానికి. ఎప్పుడూ ఇంతేనా?"


"ఫోన్ కి ఛార్జింగ్ కోసం కరెంటు కావాలి.. మా నాన్నకి ఎనర్జీ కావాలంటే, ఎక్కువ మాట్లాడాలి" అంది నా పెళ్ళాం.


"నువ్వేమి తక్కువ కాదుగా"


"మా నాన్న యాభై వాట్ పవర్ అయితే.. నేను ఇరవై వాట్ అంతే.. "


'నాకు అదే చాలా ఎక్కువ' అని మనసులో అనుకున్నాను.. కాదు తిట్టుకున్నాను. 


ఈలోపు భోజన సమయం అయింది. తండ్రికూతురు ఇద్దరు మాటల దాటి కొంచం తగ్గింది.. నోరు బిజీ అయిందిగా మరి. మాములుగా అయితే, తండ్రికూతురిని సైలెంట్ గా ఉంచడం ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు. మాటలు విని విని, అందరమూ నిద్రలోకి జారుకున్నాము. మొత్తానికి తిరుపతి చేరుకున్నాము. దర్శనం బాగా అయింది. మొక్కు తీరినందుకు మా అమ్మ ఫుల్ హ్యాపీ. నాకూ అదే ఫీలింగ్. 


తిరిగి వస్తునప్పుడు.. శ్రీనివాస్ కనిపించాడు. అతను మా అన్నయ్య ఫ్రెండ్. చూడగానే వచ్చి మా అమ్మను పలకరించాడు. శ్రీనివాస్ ని చూడగానే.. మా మామగారు దూకుడు తగ్గింది.. మా ఆవిడ సౌండ్ మొత్తం తగ్గింది. రిమోట్ లో మ్యూట్ బటన్ నొక్కినట్టుగా ఇద్దరూ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.. ఎంతో నిశబ్దం. వాళ్ళు మాట్లాడకపోతే ఏదో జరిగిందని అర్ధం.. ఎప్పటిలాగా ఇద్దరు ఉంటె, మాకు భయం ఉండేదేకాదు. 


"అంతా 'ఓకే' కదా అని మా ఆవిడకు సైగ చేసాను.. 'ఓకే' అనే అంది. కానీ నాకు ఎక్కడో తేడా కొడుతుంది.


శ్రీనివాస్ తో నేను కూడా మాటలు కలిపాను. దూరం నుంచి మా మామగారిని చూసిన అతను.. "మీ సంబంధం కుదిర్చింది మా అన్నయే.. కానీ నేను మీ పెళ్ళికి రావడానికి కుదరలేదు"


"పర్వాలేదు.. "


"మంచి సంబంధం ఎలాగైనా కుదర్చమని అప్పుడు మీ మామగారు అడిగారు. 'మా అమ్మాయి అబ్బాయి కన్నా వయసులో కాస్త పెద్ద.. రాక రాక వచ్చిన సంబంధం, ఇది పొతే మా అమ్మాయికి పెళ్ళి కాదు' అని మీ మామగారు మా అన్నయ్యను బతిమాలారు. 


"నిజమా.. ?"


"వెయ్యి అబద్దాలు ఆడైనా పెళ్ళి చెయ్యమన్నారుగా.. అందుకే మా అన్నయ్య అమ్మాయి వయసు తగ్గించి, మీకు అబద్దం చెప్పాడు" అన్నాడు శ్రీనివాస్.


ఈ విషయం మా వాళ్ళకి చెప్పొద్దని నేను శ్రీనివాస్ దగ్గర మాట తీసుకున్నాను. అప్పటినుంచి.. 'నమో శ్రీనివాస' అంటే చాలు.. మా ఆవిడ సైలెంట్ అయిపోయేది. మమగారు కూడా మాతో ఎక్కువ మాట్లాడడమే మానేసారు.. పాపం అతని భయం అతనిది. 


నిజానికి నేను కూడా, నా వయసు తగ్గించే చెప్పాను.. సంబంధాలూ రావట్లేదని. మా అమ్మ ఆ శ్రీనివాసుని కటాక్షం చేత కోడలు మారిందని సంబరపడిపోతోంది. నిజమే మరి.. ఆ శ్రీనివాసుడే ఈ శ్రీనివాస్ రూపంలో వచ్చాడేమో. 

*********

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


Comments


bottom of page