top of page

నందనవనం


'Nandanavanam' New Telugu Story

Written By Sita Mandalika

'నందనవనం' తెలుగు కథ

రచన: సీత మండలీక

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

"రుక్మిణీ! చల్లటి మంచి నీళ్లిస్తావా" అంటూ మూర్తి ఇంట్లోకి ప్రవేశించేడు.

చల్లటి మంచి నీళ్లతో పాటు వేడి వేడి పకోడీలు కూడా టేబుల్ పై పెడుతూ "ఇంత ఎండలో ఎక్కడికి వెళ్ళేరు" అని ప్రశ్నించింది భార్య రుక్మిణి.


"అదే.. మన శేఖర్ భోజనాల తరవాత రమ్మంటే కలవడానికి వెళ్ళేను" అంతకి మించి రుక్మిణి అడగనూ లేదు, మూర్తి చెప్పనూ లేదు.


"దొడ్లో క్రిందటేడాది అరటి మొక్క బావి దగ్గర పోతేను చూసేరా. పెద్ద అరటి పళ్ళ వెరైటీ. నాలుగు నెలలై గెల వేసి పళ్ళు పండడానికి సిద్ధం గా ఉంది. రెండు రోజుల తరవాత గెల కొడతానన్నాడు వెంకడు. పళ్ళు పండగానే ఓ రెండు డజన్లు పళ్ళు వేణు గోపాల స్వామి గుడిలో ఇద్దరం వెళ్లి ఇచ్చి వద్దామండి"


"అబ్బా ఎంత మతి మరుపు వచ్చిందో చూడండి.. సీతాఫలం పళ్ళు చెట్టు నిండా పండేయి. ఈవేళ దేవుడి పూజలో రెండు పళ్ళు పెట్టేనంటూ పూజ గదిలోకి వెళ్లి రెండు పళ్ళు ఇద్దరికీ తెచ్చింది రుక్మిణి. పండు చాలా రుచిగా అనిపించింది మూర్తికి. అదే కాదు ఆ తోటలో ఏ పండు తిన్నా ఏ కూరగాయ తిన్నా అతి రుచిగా ఉంటాయి. అదంతా రుక్మిణి చేతి మహాత్మ్యం ఏమో అనిపిస్తుంది మూర్తికి.


ఎందుకో మూర్తి మనసంతా భారం గా అయిపొయింది.

"ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు” అంది రుక్మిణి

“ అదే ..పిల్లల గురించి ఆలోచన”


“ మీరు ఉద్యోగ రీత్యా ఇదే ఊరులో అమ్మా నాన్నతో ఉండిపోడం వల్లఈ తోట ఈ ఇల్లు అనుభవిస్తున్నాము. కానీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం పై చదువులు చదివించి పై దేశాలు కూడా పంపించేము.. వాళ్ళక్కడ హాయిగానే ఉన్నారు. అలా అనుకుని నేను ఓదార్పు పొందుతూ ఉంటాను.


పెళ్ళై వచ్చినప్పుడు నావయసు ఇరవై కన్నా తక్కువే. మీ అమ్మగారు ఈ చక్కటి చల్లని కుటీరం లోకి ఆహ్వానించి ఎంత ఆప్యాయం గా చూసుకునేవారు. నాలుగు గదులు కిచెన్ చుట్టూ ఎకరన్నర మేర చల్లటి తోట ఆ తోట లో నేను, ఆవిడ, ఎంత బాగా గడిపేవాళ్ళము. ఎన్ని మొక్కలు నాటేము. ఇద్దరం కలిసి ఒక నందనోద్యానం లా తయారు చేసేం.

నేను వచ్చిన కొత్తలో ‘చూడు కోడలు పిల్లా ఈ మొక్కలన్నిటితోను నేను మాట్లాడగలను’ అనేవారు అత్తయ్య.


మొక్కలతో మాటలా అని ఆశ్చర్య పోయేదాన్ని. వీటిని కూడా ప్రేమ తో సాకాలి అప్పుడే బాగుంటాయి అని పాఠం చెప్పేవారు.

‘చూడు శ్యామలాంబా ఆ పాఠాలు అట్టే చెప్పకు. రుక్మిణికి కూడా మొక్కల పిచ్చి వంట బట్టి పోతుంది’ అనేవారు మావయ్య.


నిజం చెప్పాలంటే ఆ నందనవనం అంటే నాకూ ప్రాణం. ఏ చెట్టు కొమ్మ విరిగి పోయినా ఏ చిన్న లత ఒరిగి పోయినా ప్రాణాలు తహతహ లాడిపోతాయి" అనేది రుక్మిణి.


రుక్మిణిని చూస్తుంటే మూర్తి కి ఆశ్చర్యం వేస్తుంది. తను వెళ్ళేది పండ్లు, పువ్వులు తీసుకుని ఒక వేణుగోపాల స్వామి ఆలయానికే.. పండిన పండు పువ్వులు కూరలు చుట్టూ ఉన్న అందరికి మాలి ద్వారా పంపి సంతోష పడిపోతుంది. ఏ ఊరు వెళ్లినా వారానికి మించి ఎక్కడా ఉండలేదు. వెంకడికి ఎన్నోఅప్పగింతలయ్యేక గాని బయలు దేరేది కాదు.


మూర్తికి మనసు మనసులో లేదు. తన సమస్య పిల్లలే తీర్చగలరు. ఇంక తన వల్ల కాదని నిశ్చయించుకున్నా. డు. అంత లోనే ఏదో మనసు కి స్ఫురించినట్టు అనిపించి కళ్ళు మూసుకుని పడుకున్నాడు.


పొద్దున్నే వేడి కాఫీ తాగుతూ ఏదో చెప్పబోయి ‘రుక్మిణీ’ అని పిలవగానే “చూసేరా మూర్తి గారూ.. నిగ నిగలాడుతున్న దోరగా పండిన ఈ జామ పళ్ళు. మీ కోసం ప్రత్యేకంగా కోసుకు వచ్చేను. తరవాత రుచి చూడండి” అంటూ ఆరంభించింది రుక్మిణి.


“అబ్బా.. ఎప్పుడు చూసినా ఇదే గోల. పళ్ళు, చెట్లు అంటూ విసుగొస్తోంది. పూర్తిగా తోటంతా అమ్మి పారేస్తా. హాయిగా ఉండచ్చు” అంటూ కోపం అంతా కళ్ళల్లో వ్యక్తం చేసేడు మూర్తి.

“పొద్దున్నే ఇవేమి అశుభం మాటలు.. వీటిని పిల్లలతో సమానం గా పెంచేనండీ. అదే జరుగుతే నేను బతుకుతానండీ” అంటూ కళ్ళలో నీళ్లు పెట్టుకుంది రుక్మిణి.


“సరే.. ముందర కూర్చీ లో కూర్చో” అని పొదివి పట్టుకుని కూర్చోపెట్టేడు రుక్మిణి ని మూర్తి.

“రుక్మిణీ.. నీకుతెలుసా.. శేఖర్ వాళ్ళు ఈనెలాఖరుకు సిటీ వెళ్లి, కొన్నాళ్ళు ఇల్లు అద్దె కి తీసుకుని ఉంటారుట”.

“మరి ఇల్లూ తోట ఏం చేస్తారుట “.


“ఈ జాగా మొత్తం కాంట్రాక్టర్ కి ఇస్తారట. అతను వీళ్ళకి 8 ఫ్లాట్ లు ఇస్తాడట. నాలుగు ఫ్లాట్ లు అమ్మేసి, రెండు అద్దెకిచ్చి రెండు వాళ్ళుంచుకుంటారుట. ఆ రెండు ఫ్లాట్ లు విశాలం గా కట్టుకుంటామని అన్నాడు”


రుక్మిణి రియాక్షన్ ఏమిటో అని మొహం లోకి తొంగి చూసిన మూర్తికి తెల్లగా ఉన్న రుక్మిణి మొహం ఎర్రగా జేవురించినట్లు చేసి “ఎవరిదండీ ఈ ఐడియా.. శేఖర్ దా, వసుంధరదా?"

"ఆ .. ఇద్దరిదీ. ఉండడానికి సదుపాయం గా ఇల్లు, చేతిలో డబ్బులు. ఎవరికి వద్దు?"

"మీకు కూడా వస్తుం దేమో ఇలాంటి ఆలోచన గాని, నేను బతికుండగా మనతోటని గురించి అలాంటి ఆలోచన రానియ్యను. అలాంటి పని చేయనియ్యను ".


ఆ రాత్రి నిద్ర పట్టలేదు రుక్మిణికి. నిజమే.. డబ్బు, సుఖం ఈ ప్రపంచం లో ఎవరికి వద్దు ? అలా అని పెంచి పెద్ద చేసిన ఈ వృక్షాలని, ఈ చల్లటి కుటీరాన్ని వదులు కోడమే కాదు, వాటిని నేల పాలు చేసి వాటి పై ఇళ్ళు కట్టి వాటిలో సుఖం గా జీవించడమా.. ఈ మొక్కలతో స్నేహం ఈ వేళ్టిది కాదు. 40 ఏళ్ల అనుబంధం. దీనిని ఎలా ఒదులుకోడం.. అది తన వల్ల కాదు. అవి ఇస్తున్న తీయటి పళ్ళు,

రుచికరమైన కూరలు, చక్కటి పువ్వులు తన కుటుంబము, చుట్టూ ఉన్నవారే కాక గుళ్లో దేముడు కూడా అనుభవిస్తున్నారు. తనకి ఎంత తృప్తి గా ఉంది. పెన్షన్ కాక దాచుకున్న డబ్బు అన్నీ కలిపి జీవితం సుఖం గానే ఉంది. అయినా మూర్తి గారు తోట అమ్ముతాన ని అనలేదు కదా. ఎందుకింత ఆలోచన” అని కళ్ళు మూసుకుని పడుకుంది రుక్మిణి.


ఆ మర్నాడు రాత్రి ఇద్దరు పిల్లలు ఒకరి తరవాత ఒకరు అమెరికా నించి ఫోన్ చేసి ఒకే విషయం పై ఎక్కువ ఒత్తిడి తెచ్చేరు.


"అమ్మా, నేను తమ్ముడు మీ సౌత్ ఇండియా టూర్ కి మొత్తం అన్నీ టికెట్ లు కొన్నాం.. మంచి హోటల్స్ కూడా బుక్ చేసేం. హాయిగా ఒక ఇరవై రోజులు తిరిగి రండి, శేఖర్ అంకుల్ వాళ్ళు కూడా మీతో బయలు బయలు దేరు తున్నారు. మీకు బాగుంటుందని సర్ ప్రైజ్ చేసేము"


"నాకు చెప్పకుండా ఎందుకు కొన్నారురా. మొన్ననే గులాబీ మొక్కలు గోలే ల్లో పాతేను. ఇంకా చాలా కొత్త మొక్కలోచ్చాయి. ఇప్పుడింత ప్రయాణం అంటే కష్టం అవుతుంది రా"


ఈ మాట విన్న చిన్న కొడుకు కౌశిక్ "అమ్మా, మొక్కలు మొక్కలంటూ ఇన్నాళ్లు మీరు ఎక్కడికీ వెళ్ళ లేదు. చెట్లు వెంకడికి అప్పచెప్పి బయలు దేరండమ్మా.. బాగుంటుంది" అన్నాడు. ఆ మర్నాడు పెద్ద వాడు ప్రదీప్ కూడా ఫోన్ చేసి అదే సంగతి చెప్పేడు.


వసుంధర వాళ్ళు కూడా ఉంటారు కనక ప్రయాణం బాగుంటుందని వెళ్ళడానికి నిశ్చయించేరు రుక్మిణి, మూర్తి.

వెంకడికి ఒకటికి పది సార్లు అప్పగింతలు పెట్టి చెట్లు మొక్కలు జాగ్రత్త గా చూసుకోమని చెప్పి బయలు దేరింది రుక్మిణి మూర్తి తో. హాయిగా రెండు కుటుంబాలు కలిసి ఊళ్లన్నీ సరాదాగా తిరిగి వచ్చేరు.


వస్తూనే రుక్మిణి తోట వైపు పరిగెత్తింది. మొక్కలన్నీ ఎండిపోయి వాడిపోయినట్లయిపోయేయి. మొక్కలన్నీ నీడలో ఉంచి నిండుగా నీళ్లు నింపేడు వెంకడు. నీరు ఎక్కువై మొక్కలన్నీ కుళ్లిపోయినట్లయిపోయేయి. ఆ దృశ్యం చూస్తుంటే రుక్మిణి కి ఏడుపు వచ్చినంతయ్యింది. వెంకడి పై చాలా కోపం వచ్చింది.

“మీరు పెంచినట్టు పెంచలేకపోయెనమ్మగారు. రోజూ నీళ్లు పోస్తూనే ఉన్నాను. అయినా మొక్కలన్నీ బతక లేదు”

“నువ్వు అసలు తోట మాలివేకాదు. నీకు చెప్పడం నాదీ తప్పు” అంటూ పదే పదే వల్లించింది రుక్మిణి.


“మూర్తి గారూ.. చూసేరా, వెళ్దాం వెళదాం అంటూ ఒకే బలవంత పెట్టేరు. మొక్కలన్నీ పోయేయి. ఈకారణం వల్లే నేను రానన్నాను”


“సరేలే.. మళ్ళీ కొత్త మొక్కలు నాట వచ్చు. అంత బాధ ఎందుకు? హాయిగా తిరిగి వచ్చేము కదా” అని మూర్తి అనేసరికి రుక్మిణి కంట తడి పెట్టుకుంది.

రుక్మిణి కోపం తో "మీకేం తెలుసు ఆ లేత మొక్కలకి కావలిసిన ప్రేమ? వాటిని అమ్మలా ప్రేమించాలి"


“అబ్బా రుక్మిణీ.. ఎప్పుడూ ఇదే గోల. విసుగు తెప్పిస్తున్నావు. అసలు నేను, పిల్లలూ ఈ ఇల్లూ తోట అమ్మేసి సిటీ లో అన్ని సదుపాయాలతో పెద్ద ఇల్లు కొందామని నిశ్చయించేము. అది త్వరలోనే జరుగుతుంది” అని గట్టి గా చెప్పేడు మూర్తి.

"ఆ నిశ్చయం అయిపోయిందా మూర్తి గారూ "

"ఆ.. అంతే అనుకో"


" నాకు తెలియకుండానే ఇదంతా జరిగి పోయిందా. నిజమా" అంటూ నిర్ఘాంత పోయింది రుక్మిణి.

ఆ రాత్రి నిద్రపోలేదు రుక్మిణి. మర్నాడు బద్దకం గా నిద్ర లేస్తూనే వంట పని అదీ పూర్తి చేసి మళ్ళీ పడుకున్న భార్యని చూసి తన మీద కోపం అనుకున్నాడు. ఆ రాత్రి వరకు లేవలేదు రుక్మిణి.


ఆ తరవాత కూడా రెండు రోజులు అదే విధంగా లేవడం, ఎదో బాధ గా అన్య మనస్కం గా పనిచేసి, రోజంతా నిద్రలోనే ఉండేది. 15 రోజులు అయ్యేసరికి మంచానికే పరిమితం అయ్యింది రుక్మిణి.

భార్య ఆరోగ్యానికేమయిందో తెలియక చాలా గాబరా పడిపోయేడు మూర్తి. ఎప్పుడూ ఉత్సాహం గా తన పనులు చేసుకునే రుక్మిణి ని చూసి ఏమయ్యిందో అర్ధం అవడం లేదు మూర్తి కి.

అదే విషయం డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు చెప్పేడు మూర్హి. అన్ని పరీక్షలు చేసి ఒంట్లో ఎటువంటి దోషం లేదని తేల్చేరు డాక్టర్ గారు. కానీ ఈమె ఏదో మానసికం గా బాధ పడుతున్నట్టుందని పిస్తోందని, మనసు ప్రశాంతత తో ఉంటే ఆవిడ ఆరోగ్యం బాగుపడుతుందని, లేక పోతే ఆరోగ్యం ఇంకా క్షీణించి లేని పోనీ కాంప్లికేషన్స్ రావచ్చని చెప్పేరు డాక్టర్ గారు.

మూర్హికి అర్ధం అయ్యింది. మనసంతా బాధతో నిండి పోయింది. ఆ తోట, ఇల్లు అంటే రుక్మిణికి ప్రాణం. అవి అమ్ముతాననగానే తన మనసు వికలమై మానసిక వ్యధ కి. గురయ్యింది. తనకేదయినా అయితే తను బతకగలడా! ఈ డబ్బూ ఇల్లూ తానొక్కడూ అనుభవించగలాడా? అయినా ఆ తోట నించి వచ్చే పండ్లు కాయలు, పువ్వులూ తన కుటుంబమే కాకుండా చుట్టూ ఉన్న వారు కూడా అనుభవిస్తున్నారు. అన్నిటికంటే రుక్మిణి తల్లిలా ఆ మొక్కలని పెంచుతూ ఆనందం పొందుతోంది. ఆ ప్రేమ ని తను దూరం చెయ్యకూడదని నిశ్చయించుకున్నాడు మూర్తి.

పిల్లలు కూడా అమ్మ ఆరోగ్య రీత్యా తోట అమ్మకం వద్దని ఇద్దరు మంచి మాలి లని పెట్టి తోట పని చేయించమని తండ్రి కి సలహా ఇచ్చేరు.

“రుక్మిణీ, రేపటినించి ఇద్దరం కలిసి తోట పని చేస్తున్నాం. కొత్త మొక్కలు నాటుదాం. కొత్త మాలి లని పెడదాం. మన తోట ఈ ఊరికే ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోవాలి” అని రుక్మిణిని దగ్గరగా తీసుకున్నాడు మూర్తి.


కళ్ళ వెంబడి ఆనందానికి కన్నీరు వస్తుంటే పెదవులతో “నిజంగానా” అంటూ అస్పష్టం గా పలికింది రుక్మిణి.

***

సీత మండలీక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం : సీత మండలీక

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


నేను హౌస్ మేకర్ ని. కొడుకులిద్దరూ అమెరికాలో పెళ్ళిళ్ళై స్థిరపడిపోయాక, భర్త ఎయిర్ ఇండియా లో రిటైర్ అయ్యేక ఇప్పుడు నాకు కొంచెం సమయం దొరికింది

కధలు చదవడం అలవాటున్నా రాయాలన్న కోరిక ఈ మధ్యనే తీరుతోంది.




125 views0 comments

Comments


bottom of page