top of page

గరుడాస్త్రం - ఎపిసోడ్ 12Written By Gannavarapu Narasimha Murthy


'గరుడాస్త్రం - ఎపిసోడ్ 12' తెలుగు ధారావాహిక


రచన : గన్నవరపు నరసింహ మూర్తి


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ..

శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.

అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు.

ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు. అయన శ్రీ హర్ష ను తన అవుట్ హౌస్ లో ఉండమంటాడు. కరుణాకరం గారి అమ్మాయి ప్రణవి తో పరిచయమవుతుంది.


పరీక్షలు పూర్తయ్యాక తన ఊరికి బయలుదేరుతాడు శ్రీహర్ష.

ప్రణవిని విడిచి వెళ్లడం అతనికి బాధ కలిగిస్తుంది.

శ్రీహర్షను కలవడానికి అతని దగ్గరకు వెళుతుంది ప్రణవి.

తమ వివాహానికి తండ్రిని ఒప్పించి వచ్చానని చెబుతుంది ప్రణవి.

పెద్దల అనుమతితో ఇరువురి వివాహం వైభవంగా జరుగుతుంది.


శ్రీహర్షకు డిఆర్డిఎల్ లో సైన్టిస్ట్ గా ఉద్యోగం వస్తుంది.

ట్రైనింగ్ పూర్తవగానే శ్రీహర్ష ని గరుడ మిసైల్ ప్రాజెక్టుకి బదిలీ చేసారు.

అక్కడ మిసైల్ కి సంబంధించిన డ్రాయింగ్ బయటి వాళ్లకు దొరుకుతుంది.


సిఐడీ బృందం వచ్చి శ్రీహర్షను, ప్రాజెక్ట్ ఇంఛార్జి భరద్వాజ గారిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభిస్తారు.

శ్రీహర్షను కలిసి ధైర్యం చెబుతుంది ప్రణవి.

అతని బెయిల్ కోసం వాదిస్తుంది.


సైంటిఫిక్ అసిస్టెంట్ భావనని ఎవరో కాల్చి చంపుతారు.

కోర్టు ప్రణవి వాదనను అంగీకరించి, శ్రీహర్షకు బెయిల్ మంజూరు చేస్తుంది.

హారిక అనే అమ్మాయి తాను భావన హంతకుల డ్రాయింగ్ గీచినట్లు శ్రీహర్ష, ప్రణవిలతో చెబుతుంది.


ఇక గరుడాస్త్రం - ఎపిసోడ్ 12 చదవండి..


ఆ మర్నాడు సీఐడీ ఒక ప్రకటన చేస్తూ భావన హత్య కేసులో పురోగతి సాధించామని, హంతకుల వేట కొనసాగుతోందనీ రెండు రోజుల్లో వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఆ ప్రకటన చూసి శ్రీహర్ష ప్రణవి ఆశ్చర్యపోయారు. హారిక ఫోన్ చెయ్యగానే ఇన్ స్పెక్టర్ రవీంద్ర స్పందించి ఉంటే ఆ హంతకులు దొరికేవారు. కానీ ఎందుకో ఆయన ఆ ప్రయత్నం చేయలేదు..


అదే రోజు ఒక పత్రిక సంచలనమైన వార్త ప్రచురించింది. “భావన హత్యలో పాక్ గూఢచారుల హస్తం? హత్య ఇంటి దొంగల పనే? “ అన్న శీర్షిక కింద ఆ హత్యోదంతాన్ని వివరంగా వ్రాసింది. రక్షణ శాఖలో కొన్ని పత్రాలు, కొన్ని ముఖ్యమైన ఆయుధాలకు సంబంధించిన డిజైన్స్ మాయమైన వ్యవహరంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గరుడ అనే మిసైల్ డ్రాయింగు వ్యవహారంలో శ్రీహర్ష అనే యువీ శాస్త్రవేత్తను అరెస్ట్ చేసిన సీఐడీ అసలు చేపలను వదిలేసిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. దీనికి రక్షణ శాఖలో పనిచేస్తున్న కొందరు పెద్ద అధికారుల హస్తం ఉన్నట్లు విశ్వశనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికైనా రక్షణ శాఖ ఈ విషయంలో ప్రతిస్పందించి అసలు దొంగలను పట్టుకొని అరెస్ట్ చేయాలని ప్రజలు కోరుతునారు . " అని ఆ పేపర్ వివరంగా వ్రాసింది..


శ్రీ హర్ష ఆ వార్తని చదివి ప్రణవికి ఇచ్చాడు .

ప్రణవి ఆ వార్తను చదివి "ఏదైనా భావన హంతకులు దొరికిన తరువాతే సీఐడీ ఛార్జ్ షీట్ వెయ్యగలదు ;వాళ్ళ ఛార్జ్ షీట్ చూ సిన తరువాతే మనం కేసులో ఎలా వెళ్లాలో ఒక క్లారిటీ వస్తుంది" అని చెప్పింది.


“డిఫన్స్ మినిస్ట్రీ కేంద్రప్రభుత్వ ఆధీనంలో వుంది కనుక సీబీఐ ఎంక్వయిరీ చేస్తేనే అసలు విషయాలు తెలుస్తాయి. స్టేట్ సీఐడీ అయితే అంతర్రాష్ట్రాల విషయంలో ముందుకి వెళ్ళలేదు " అని శ్రీహర్ష చెప్పాడు.


ఆ మర్నాడు సీఐడి భావన హంతకులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. హంతకుల ఫొటోలను ప్రెస్ కి రిలీజ్ చేసారు. ఆశ్చర్యంగా ఆ హంతుకులిద్దరూ హారిక చిత్రించిన ఫోటోల్లోని వారు కారు. వారు వేరే వ్యక్తులు..

అదే విషయం శ్రీహర్ష ప్రణవికి చెప్పేడు..


“ఈ విషయాన్ని మనం పోలీసులకు ఛార్జిషీట్ వేసిన తరువాత కోర్టులో ప్రస్తావిద్దాం. అప్పుడు నిజనిజాలు తెలుస్తాయి” అంది ప్రణవి.


ఆ తరువాత హారికకు ఫోన్ చేసి హంతకులను పోలీసులు పట్టుకున్నారన్న విషయాన్ని చెబితే ఆమె ఆశ్యర్చపోతూ” ఆ పట్టుకున్న వ్యక్తుల ఫోటోలను నేను కూడా పేపర్లో చూసాను.. కానీ వాళ్ళు కాదు. ఈ విషయంలో పోలీసులు ఘోరమైన తప్పిదాన్ని చేసారు. అవసరం అయితే నేను కోర్టు కొచ్చి అసలు హంతకులు ఎవరో కోర్టు కొచ్చీ చెబుతాను. అంతేకాక వాళ్ళు ఏ బండి మీద వచ్చారో కూడా ఆధారాలతో చెబుతాను” అని చెప్పింది..ఆ రోజు ప్రణవి, శ్రీహర్ష బయటకు వెళుతున్న సమయంలో భావన భర్త మధుకర్ వచ్చి “నిన్న బీరువాలో భావన వ్రాసిన డైరీ దొరికింది. అందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి. మీకేమైనా ఉపయోగపడుతుందేమోనని తెచ్చాను” అంటూ ఆ డైరీని వాళ్ళకిచ్చాడు.

శ్రీహర్ష అతనికి కృతజ్ఞతలు చెప్పి ఆడైరీ తీసుకున్నాడు; అది చదువుతుంటే కొన్ని సంచలన మైన విషయాలు తెలిసాయి..


డైరీ చదువుతుంటే సమయం తెలియటం లేదు.

సోమవారం: ఈ రోజు ఆఫీసుకి వెళ్ళిన తరువాత ఇది వరకు భరద్వాజ గారి స్థానంలో పనిచేసిన మల్తోత్ర అన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టరట; మా గదిలోకి వచ్చి పరిచయం చేసుకున్నారు. అతను చాలా సేపు అతని గురించే చెప్పుకున్నారు. అతనున్నపుడే ఈ గరుడ మిసైల్ ప్రాజెక్టుకి రూపకల్పన జరిగిందిట.. అతనే ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ ప్రాజెక్టుని అభివృద్ధి చేసానని చెప్పారు..

తరువాత ఆ ప్రాజెక్ట్ యొక్క ప్రోగ్రెస్ గురించి ఎన్నో ప్రశ్నలు వేసారు.. డిజైన్ ఎంత వరకు వచ్చిందో అడిగారు. తన దగ్గర ఉన్న కొన్ని డిజైన్స్న చూపిస్తూ మా డిజైన్స్ గురించి కొన్ని విషయాలు అడిగారు.


ప్రస్తుతం జరుగుతున్న డిజైన్లు, డ్రాయింగుల గురించి మేము ఇతరులతో మాట్లాడరాదని మాకు ఆర్డర్స్ ఉన్నాయి. కేవలం డైరెక్టర్ మాత్రమే వాటి గురించి మాట్లాడాలి. అసలు బయట వ్యక్తులు మా ఆఫీసుకి రాకూడదు.


కానీ వచ్చిన వ్యక్తి ఇది వరకు మా డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఆఫీసర్ కాబట్టి బహుశా అనుమతి లభించి ఉండవచ్చు . అందుకే అతని ఎన్నిసార్లు ప్రశ్నించినా నేను వాటి గురించి చెప్పలేదు;

ఇదే విషయాన్ని లంచ్ టైమ్ లో మా టీమ్ లీడర్ శ్రీహర్షతో చెప్పాను. ఆ వ్యక్తిని ఆఫీసులోకి అనుమతించవద్దనీ, మన ప్రాజెక్ట్ విషయాలేవీ అతనితో మాట్లాడవద్దనీ, అతను కరాఖండీగా చెప్పారు.


డ్రాయింగులను చాలా జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు.

మంగళవారము: ఈ రోజు మల్తోత్రా గారు మళ్ళీ వచ్చారు. మా గదిలోకి ఇతర వ్యక్తులు రాకూడదనీ చెప్పాను. తను ఇది వరకే ఈ సెక్షన్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసాననీ, తనకి వచ్చే హక్కు, తెలుసుకునే అధికారం ఉన్నాయని చెప్పారు. డ్రాయింగులో ఏవో తప్పులున్నాయనీ, వాటి గురించి తెలుసుకొని ప్రభుత్వానికి చెప్పాలనే వచ్చాననీ, కాబట్టి ఒకసారి డ్రాయింగ్ ను నాకు చూపించవలసిందిగా కోరాడు;


కానీ నేను డ్రాయింగు కావాలంటే టీమ్ లీడర్ శ్రీహర్ష గారి అనుమతి కావాలని చెప్పడంతో ఆయన కోపంగా వెళ్ళిపోయారు. ఆ తరువాత నా కొలీగ్ రాజేశ్వరి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పింది. మల్తోత్రా గారు ఉదయాన్నే వచ్చి కొన్ని డ్రాయింగులను ఫొటోలు తీసుకున్నట్లు చెప్పింది. నేను ఏయే డ్రాయింగుల ఫొటోలు తీసుకున్నారో ఆమెను అడిగి వాటిని పరిశీలించాను. కానీ అవన్నీ పాతవి; మా కొత్త ప్రాజెక్టుకి సంబంధించినవి కావు. అయినా అతను చేసింది తప్పు; ఆ తరువాత అతను మా గదికి మరి రాలేదు.. ”


గురువారం: ఈ రోజు మా ఆఫీసుకి సిఐడి పోలీసులొచ్చి శ్రీహర్ష గారిని ప్రశ్నించి అరెస్ట్ చేసారు. శ్రీహర్ష గారు మా ప్రాజెక్ట్ కి సంబంధించిన కొన్ని డ్రాయింగులను బయట వ్యక్తులకు ఇచ్చారని అతని మీద అభియోగాలు మోపి అతన్ని అరెస్ట్ చేసారనీ తరువాత నాకు తెలిసింది. ఆ సమయంలో నాకు మా ఆఫీసుకి వచ్చి డ్రాయింగులను కావాలని అడిగిన మల్తోత్రా గారు గర్తుకొచ్చారు. అతను తన గుర్తింపు కార్డు ఇవ్వడంతో అతనికి నేను ఫోన్ చేసి "సార్! ఈ రోజు మా టీమ్ లీడర్ డ్రాయింగులు బయటకు వెళ్ళాయనీ శ్రీహర్షని పోలీసులు లొచ్చి అరెస్ట్ చేసారు. ఆ రోజు మీరే డ్రాయింగుల గురించి నన్ను అడిగారు. కానీ నేనివ్వలేదు; కానీ మీరు వాటిని ఫోన్లోని కెమెరాతో ఫోటోలు తీసుకున్నారని తెలిసింది;అంటే ఈ డ్రాయింగులు మీ వల్లే బయటకు వెళ్ళాయని తెలుస్తోంది. ఈ విషయంలో మీ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అతనితో గట్టిగా చెప్పాను”;


అక్కడితో డైరీ పూర్తైంది.. భావన రాసిన ఆ డైరీని మొత్తం చదివాడు శ్రీహర్ష.

“ప్రణవీ! భావన ఏం జరిగిందో ఈ డైరీలో డిటైల్డ్ గా వ్రాసింది. ఆ డ్రాయింగులు బయటకు వెళ్ళడానికి మల్తోత్రా కారణమన్నట్లు ఆ విషయాన్నే అతనికి ఫోన్ చేసి మరీ చెప్పినట్లు వ్రాసింది. బహుశా భావన పోలీసులకి ఫిర్యాదు చేస్తే తన గుట్టు బయట పడిపోతుందని ఆ మల్తోత్రా గాడే ఆమెని కిరాయి గుండాలతో హత్య చేయించి ఉంటాడు. అందువల్ల రేప్పొద్దున్న కోర్టులో దీన్ని బలమైన సాక్ష్యంగా మనం ప్రవేశపెట్టొచ్చు ” అన్నాడు శ్రీహర్ష.

***

నెల రోజుల తరువాత సిఐడీ కోర్టులో శ్రీహర్ష కేసులో ఛార్జి షీటు దాఖలు చేసింది. ఛార్జీ షీటు కాపీ ని కోర్టు శ్రీహర్ష లాయరైన ప్రణవికి ఇచ్చింది..

ఛార్జి షీటులో కేసు పూర్వాపరాలన్నీ పొందుపరచపడ్డాయి.


చాలా రోజుల నుంచి పాకిస్తాన్ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలని నుంచీ ప్రయత్నం చేస్తోంది. దాని కోసం ఆ దేశం ఎంతో మంది గూఢచారులను మన దేశంలోకి రహస్యంగా పంపించింది. వాళ్ళు వాళ్ళు చాప కింద నీరులా దేశంలో ప్రవేశించి రక్షణ శాఖలోని ఉద్యోగులను ప్రలోభపెట్టి ముఖ్యమైన రహస్య పత్రాలను, ఆయుధాలు, విమానాలు, మిసైల్స్ కు సంబంధించిన డిజైన్లను, డ్రాయింగులను చేజిక్కించు కోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆ ప్రయత్నంలో భాగంగానే మిసైల్స్ ని తయారు చేస్తున్న రీసెర్చి సెంటర్లో ఆ మిసైల్స్ కి సంబంధించిన డ్రాయింగులను చేజిక్కున్నారు..


అదృష్టవశాత్తూ ఆ డ్రాయింగులు చేజిక్కించుకున్న ఇమ్రాన్ అనే గూఢాచారి మన పోలీసులకు పట్టుబడటంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. సిఐడి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఆ డ్రాయింగులు ఆ మిసైల్ డిజైన్స్ సెంటర్నించి బయటకు వెళ్ళినట్లు తేలడంతో అందుకు బాధ్యుడైన శ్రీహర్ష అనే సైంటిస్టుని అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి కోర్టు బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది.. కేసు పరిశోధన కొనసాగుతున్నది ” అని అందులో ఉంది..


రెండు రోజుల తరువాత కేసులో వాదనలు మొదలయ్యాయి. సీఐడి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జనార్దన్ "ఇమ్రాన్ కి దొరికిన డ్రాయింగులు సెంటర్ నుంచి బయటకు రావడానికి డిజైన్ సెల్ దే బాధ్యత కాబట్టి ఆ టీమ్ లీడరైన శ్రీహర్షని అరెస్ట్ చేసాము. దీని వెనక ఎవరన్నది ఇన్వేస్టిగేషన్ తరువాత తెలుస్తుంది; ప్రస్తుతం పరిశోధన పురోగతిలో వుంది “ అని తన వాదనలు వినిపించాడు.

ఆ తరువాత ప్రణవి డిఫెన్స్ తరపున వాదనలు మొదలు పెట్టింది.


“యువరానర్! ఈ కేసులో పోలీసులు తమ పరిశోధనలో పూర్తిగా విఫలమయ్యేరని చెప్పక తప్పదు. అసలు పాకిస్థాన్ గూఢచారి అని ప్రాసిక్యూషన్ వారు చెబుతున్న ఇమ్రాన్ దగ్గర దొరికిన ఆ డ్రాయింగు ప్రస్తుతం డిజైను చేయబడుతున్న గరుడకు సంబంధించినది కాదు;అది డిజైన్ జనరల్ డ్రాయింగు కాపీ.. అది అన్ని డిజైన్లకి సంబంధించిన సాధారణ విషయాలు పొందుపరచబడ్డ డ్రాయింగు. అది డిజైన్లకి కి ఏవిధంగానూ ఉపయోగపడదు. ఆ డ్రాయింగు బయటకొచ్చిందనీ, అది పాకిస్తాన్ చేతికి చిక్కితే బ్రహ్మాండం బద్దలై పోతుందనీ, అటువంటి మిసైల్నే తయారు చేయ కలిగితే దాంతో మన దేశభద్రతకు పెను ముప్పు వాటిల్లి ఉండేదనీ అనవసర ఆరోపణలు చేసి నా క్లైంట్ ని అన్యాయంగా అరెస్ట్ చేసారు.


దానివల్ల నా క్లైంట్ ఎంతో మానసిక క్షోభ అనుభవించాడు. ఆ ఆరోపణల్లో పస లేదు కాబట్టే కోర్టు వారు నా క్లైంట్ కి బెయిల్ ఇచ్చారు. కేసులో ఇంకో ముఖ్య విషయం;ఆ డ్రాయింగు బయటకు వెళ్ళడానికి అసలు కారకులైన వారిని వదిలేసి దానితో ఏ సంబంధం లేని నా క్లైంట్ ని అరెస్ట్ చేయ్యడం పోలీసులు చేసిన ఇంకో తప్పిదం. నా క్లైంట్ కొత్తగా శాఖలో చేరిన యువ శాస్త్రవేత్త. అతను డిజైన్ టీమ్ కి ఇంఛార్జి. కానీ ఆ ఆఫీసు వ్యవహారాలకు అతనికి ఏం సంబంధం లేదు. ఆ ఆఫీసుకి హెడ్ అయిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ది ఆ బాధ్యత. సెక్యూరిటీ అంతా అతని ఆధీనంలో ఉంటుంది. ఆఫీసు నుంచి ఒక చిన్న కాగితం సెక్యూరిటీని దాటి బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం.. అటువంటిది ఒక పెద్ద డ్రాయింగు అదీ మిసైల్ ప్రాజెక్ట్ కి సంబంధించినది బయటకు సెక్యూరిటీకి తెలియకుండా ఎలా వెళ్ళింది? అంటే సెక్యూరిటీ వైఫల్యం ఇందులో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అందుకు సెక్యూరిటీని, దానికి ఇంఛార్జి అయిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్నీ ప్రశ్నించకుండా, వారిని అరెస్టు చెయ్యకుండా అందుకు ఏమాత్రం సంబంధం లేని ఓ యువ శాస్త్రవేత్తని బాధ్యుణ్ణి చేసి అరెస్ట్ చెయ్యడం ఎంతవరకు సమంజసం అని కోర్టు వారికి తెలియపరుస్తున్నాను”.


“ఇంకో ముఖ్య విషయం! ఈ డిజైన్ సెక్షన్లో పనిచేస్తున్న భావన అనే సైంటిఫిక్ అసిస్టెంట్ హత్యకు గురైతే ఆ హత్యకు ఈ కేసుకి సంబంధం ఉండే ఉంటుందన్న కోణంలో దర్యాప్తు చేయ్యకుండా ఇన్వెస్టిగేటింగ్ ఏజన్సీ సీఐడీ ఓ పెద్ద తప్పిదం చేసింది. నిజానికి ఆ హత్యకు గురైన భావన డ్రాయింగులు భద్రపరిచే సెక్షన్ కి ఇంఛార్జి. ఆ డ్రాయింగులు బయటకు వెళ్ళడానికి ఆమె హత్యకు తప్పక ఏదో సంబంధం ఉండే ఉంటుంది. కానీ సిఐడీ తమ బాధ్యతలను మరచి ఆ పని చేయ్యిలేదు” అని ప్రణవి వాదనలు వినిపిస్తుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ జనార్దన్ లేచి నిలబడి “అబ్జెక్షన్ యువరానర్! డిఫెన్స్ లాయర్ కేసుకి సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తూ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు. భావన హత్యకి ఈ కేసుకీ సంబంధం లేదు. ఆమె హత్యకు రియల్ ఎస్టేట్ వ్యవహారం కారణం అని మా పరిశోధనలో తేలడం వల్ల ఆ కేసుని లోకల్ పోలీసులు దర్యాప్తు చేస్తునారు . ఆ హంతకులిద్దర్ని పట్టుకున్నారు” అని చెప్పాడు.


“అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మీ వాదనలు కొనసాగించండి” అని జడ్జి చెప్పారు. ప్రణవి మళ్ళీ వాదనలు ప్రారంభించింది.


“యువరానర్! భావన హత్య చేసిన హంతకులను పట్టుకున్నాము అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెబుతున్నారు. కానీ వారు అసలు హంతకులు కారు. ఎవరినో అరెస్ట్ చేసి వాళ్ళే హంతకులని కోర్టుని తప్పదోవ పట్టిస్తున్నారు” అని ప్రణవి చెప్పగానే జనార్ధన్ లేస్తూ “అబ్జెక్షన్ యువరానర్! ఏ ఆధారాలతో డిఫెన్స్ వారు హంతకులు కారని చెబుతున్నారో చెప్పాలి. లేకపోతే అది తప్పడు ఆరోపణే కాక కేసుని పక్క తోవ పట్టించడం అవుతుంది. ” అన్నాడు.


“అబ్జక్షన్ ఓవర్ రూల్డ్”


“థాంక్స్ యువరానర్! ఆ విషయంలో ఆధారాలున్నాయి. అందుకోసం ఒక ముఖ్య సాక్షిని ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతునాను” అంది ప్రణవి.

“అనుమతించబడింది” అని జడ్జిగారు చెప్పారు.


“ఈ విషయంలో హారిక అనే సాక్షిని ప్రవేశ పెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ”

రెండు నిముషాల తరువాత హారిక బోనులోకి వచ్చి నిలబడింది.

=================================================================

ఇంకా వుంది


=================================================================


గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.22 views0 comments

Comments


bottom of page