Written By Gannavarapu Narasimha Murthy
'గరుడాస్త్రం - ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ..
శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.
అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు.
ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు. అయన శ్రీ హర్ష ను తన అవుట్ హౌస్ లో ఉండమంటాడు.
కరుణాకరం గారి అమ్మాయి ప్రణవి తో పరిచయమవుతుంది.
ఒకరోజు కరుణాకరన్ గారు శ్రీహర్షని పిలిచి కోనసీమలో జరిగే ఒక పెళ్ళికి తన కూతురికి తోడుగా వెళ్ళమంటాడు. ప్రణవితో కలిసి అక్కడికి వెళతాడు శ్రీహర్ష. పెళ్లి కూతురి పక్కనే కూర్చుని ఉన్న ప్రణవి సౌందర్యానికి ముగ్ధుడవుతాడు..
పరీక్షలు పూర్తయ్యాక తన ఊరికి బయలుదేరుతాడు శ్రీహర్ష.
ప్రణవిని విడిచి వెళ్లడం అతనికి బాధ కలిగిస్తుంది.
శ్రీహర్షను కలవడానికి అతని దగ్గరకు వెళుతుంది ప్రణవి.
తమ వివాహానికి తండ్రిని ఒప్పించి వచ్చానని చెబుతుంది ప్రణవి.
పెద్దల అనుమతితో ఇరువురి వివాహం వైభవంగా జరుగుతుంది.
శ్రీహర్షకు డిఆర్డిఎల్ లో సైన్టిస్ట్ గా ఉద్యోగం వస్తుంది.
హైదరాబాద్ లో రిపోర్ట్ చేస్తాడు.
ట్రైనింగ్ పూర్తవగానే శ్రీహర్ష ని గరుడ మిసైల్ ప్రాజెక్టుకి బదిలీ చేసారు.
అక్కడ మిసైల్ కి సంబంధించిన డ్రాయింగ్ బయటి వాళ్లకు దొరుకుతుంది.
సిఐడీ బృందం వచ్చి శ్రీహర్షను, ప్రాజెక్ట్ ఇంఛార్జి భరద్వాజ గారిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభిస్తారు.
ఇక గరుడాస్త్రం - ఎపిసోడ్ 10 చదవండి..
"మిస్టర్ భరద్వాజ! ఈ మిసైల్ ప్రాజెక్ట్ కి ఇంఛార్జి మీరేనా?” అని అడిగాడు.
“యస్.. నేనే ఇంఛార్జిని.. ”
“మరి ఈ డ్రాయింగ్ ఆ పాకిస్థాన్ గూఢచారి ఇమ్రాన్ చేతికి ఎలా వెళ్ళింది. ? ”
“మిస్టర్ పరీక్షిత్! ఈ ప్రాజెక్ట్ కి ఇంఛార్జీని నేనే అయినా ఆ డిజైన్ వింగ్ కి టీమ్ లీడర్ శ్రీహర్ష.. నిజం చెప్పాలంటే ఆ డిజైన్ కాని, డ్రాయింగ్ కానీ నా వరకు రాలేదు. మా టార్గెట్ ప్రకారం ఆ డిజైన్ ఈ నెలాఖరుకి ఎప్రూవ్ చేయబడి హెడ్ క్వార్టర్స్ కి పంపాలి. ఈ రోజు ఇంకా ఐదవ తారీఖు. పదవ తేదీకి నా దగ్గరికి వస్తే నేను స్క్రూటినీ , వెరిఫై చేసి డైరెక్టర్ గారికి ఎప్రూవల్ నిమత్తం పంపిస్తాము. కానీ ఇంతవరకు నా దగ్గర కది రాలేదు” అన్నాడు భరద్వాజ.
“మిస్టర్ శ్రీహర్ష! మీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భరద్వాజ చెప్పినది నిజమేనా? ” పరీక్షిత్ కంఠంలోంచి బులెట్స్ లా వస్తున్నాయి ప్రశ్నలు..
ఒక్కసారి పోలీ స్టేషన్ మెట్లెక్కితే ఎంత పెద్ద అధికారి, వ్యక్తి అయినా అందరి లాగే సమాధానాలు చెప్పక తప్పదు.
పోలీసుస్టేషన్ అనేసరికి ఎంత ధైర్యవంతుని కైనా తడబాటు కలుగుతుంది. సైకలాజికల్ గా డౌన్ అవుతాడు. శ్రీహర్ష కూడా అదే స్థితిలో ఉన్నాడు.
“భరద్వాజ సర్ చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం. ఆ డ్రాయింగు గానీ, డిజైన్లు కానీ అతనికి పంపలేదు. అవి ఇంకా మా ఆధీనంలోనే ఉన్నాయి. అందుకు మేమే బాధ్యులం తప్ప అతను కాదు.. ఇందులో అతనికే సంబంధం లేదు” అని నిర్ద్వందంగా చెప్పాడు శ్రీహర్ష.
ఆ తరువాత కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రక్షణ శాఖకి సంబంధించిన గరుడ మిసైల్ డ్రాయింగు పాకిస్థాన్ గూడాచారి దగ్గర దొరకిందనీ దానికి ఆ డిజైన్ చేస్తున్న బృందానికి నాయకత్వం వహిస్తున్న శ్రీహర్ష బాధ్యుడనీ, అతని అలసత్వం వల్లే ఆ డ్రాయింగు పాకిస్థాన్ తీవ్రదాదుల చేతుల్లోకి వెళ్ళిందన్న అభియోగంతో శ్రీహర్షని అరెస్ట్ చేసినట్టు సీఐడీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆ వార్త దేశంలో పెను సంచలనం కలిగించింది. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్లు.. పేపర్లలో హెడ్ లైన్స్.. కొన్ని ఛానళ్ళైతే 'ఎవరీ శ్రీహర్ష' అంటూ శ్రీహర్ష మీద కథనాలు ప్రసారం చేసాయి. అతని బాధ్యతా రాహిత్యం వల్లే డ్రాయింగ్ తీవ్రవాదుల చేతికి చిక్కిందని ఆరోపిస్తూ కథనాలు వండి వార్చేయి ..
ఈ వార్త తెలిసి ప్రణవి దిగ్ర్భాంతికి లోనైంది. ఎంతో దేశభక్తి, నిజాయితీ కలిగిన తన భర్త శ్రీహర్ష మీద ఆరోపణలు వచ్చి అరెస్ట్ కావడం ఆమె జీర్ణించుకోలేకపోయింది.. ఆమె ఆ విషయాన్ని నమ్మలేకపోతోంది. ఎందుకిలా జరిగింది? డ్యూటీలో సిన్సియారిటీకి, డిసిప్లిన్ కి మారు పేరైన శ్రీహర్ష మీద ఎందుకింత తీవ్ర ఆరోపణలు వచ్చాయో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు.
ఈ వార్త తెలిసి ఆమె తండ్రి కరుణాకరం, తల్లి సుశీల వచ్చారు. కూతుర్ని ఓదార్చారు.. వాళ్ళని చూడగానే ప్రణవికి దుఃఖం ముందుకు వచ్చింది. కొద్ది సేపటికి తేరుకొని “డాడీ! శ్రీహర్ష ఇటువంటి పనులు ఎప్పుడూ చెయ్యడు. ఎవరో నమ్మకద్రోహం చేసారు ;అసలు ఏం జరిగిందో నేను లాకప్పుకి వెళ్ళి కనుక్కొంటాను” అని చెప్పింది.
ఆ సాయంత్రం అతన్ని అరెస్ట్ చేసి ఉంచిన లాకప్పు దగ్గరికి వెళ్ళింది ప్రణవి. ఆమెతో పాటు తండ్రి కరుణాకరం కూడా వెళ్ళాడు. అప్పటికే అక్కడ చాలా మంచి విలేఖర్లు ఉన్నారు. వారందరూ శ్రీహర్షని ఇంటర్యూ చెయ్యడానికి వచ్చారు.
కరుణాకరానికి ఎస్పీ త్రివిక్రమ్ బాగా పరిచయం. అతను ఫోన్ చెయ్యగానే శ్రీహర్షని కలియడానికి అనుమతి లభించింది. సాయంత్రం ఏడుగంటకు అందరూ వెళ్ళిపోయిన తరువాత ప్రణవి వంటరిగా శ్రీహర్షను కలిసింది.
శ్రీహర్షని అలా లాకప్పులో చూడగానే ఆమెకు ఏడుపు ముంచు కొచ్చింది. కొద్దిసేపు మాటలు రాలేదు. కళ్ళ వెంట నీళ్ళు కారుతున్నాయి. ఎంత ప్రయత్నించినా దుఃఖాన్ని ఆపుకోవటం ఆమె తరం కావటం లేదు.
కొద్ది సేపటికి తేరుకొని “ఏం జరిగింది” అని ప్రశ్నించింది..
“అదే నాకర్థం కావటం లేదు. డ్రాయింగులు, డిజైన్సుకి సంబంధించిన అన్ని ఫైళ్ళు భావన అనే సైంటిఫిక్ అసిస్టెంటు దగ్గర ఉంటాయి. ఏదైనా కాగితం బయటకు రావాలంటే ఆమెకు తెలియకుండా జరగదు.. ” అన్నాడు శ్రీహర్ష.
“మరి ఆ విషయం మీరు పోలీసులకెందుకు చెప్పలేదు. చెబితే ఆమెను ఇంటరాగేట్ చేసేవారు కదా? ఈ డ్రాయింగు బయటకు వెళ్ళిన విషయంలో మీ కెంత బాధ్యుతుందో, భరద్వాజ గారికి కూడా అంతే బాధ్యత ఉంటుంది . టీమ్ లీడరనీ మిమ్మల్ని బాధ్యత చేసిన వారు ప్రాజెక్టుకి డైరెక్టరు ని ఎందుకు భాద్యత చెయ్యలేదు ;.. పోలీసులు ఈ విషయంలో తప్పు చేసారనిపిస్తోంది. ”
“చెప్పాను ప్రణవీ.. రికార్డులన్నీ సైంటిఫిక్ అసిస్టెంట్ల దగ్గర ఉంటాయని చెప్పినా నన్ను బాధ్యుణ్ణి చేసారు. అదే నాకు అర్థం కావటం లేదు. ”
“ఈ మధ్య ఎవరైనా మీ ఆఫీసుకి వచ్చారా ? మీకు ఎవ్వరి మీదైనా అనుమానం ఉందా?” అనీ కళ్ళు తుడుచుకుంటూ అడిగింది.
శ్రీహర్ష కొద్దిసేపు ఆలోచించి “వారం క్రితం అనుకొంటాను. మా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర మల్తోత్రా వచ్చారు. అతను భరద్వాజకు ముందు మా లేబరేటరీలో పనిచేసారు. అప్పుడు అతనే ఈ ప్రాజెక్టుకి ఇంఛార్జి; అతను వచ్చి భరద్వాజ గారితోను, మాతోను మాట్లాడి వెళ్ళిపోయారు. ”
“అతని మీద మీకేమైనా అనుమానముందా?”
“అంటే అతను చాలా సేపు ఆ రోజు భావనతో మాట్లాడేడు. కొన్ని జిరాక్స్ కాగితాలను కూడా తీసికెళ్ళాడు; ఇద్దరూ కలిసి కంప్యూటర్ రూమ్ లోకి వెళ్ళి చాలా సేపు మాట్లాడుకున్నారు. భావన ఇది వరకు అతని కింద పనిచేసింది కదా ఆ చనువుతో మాట్లాడుతోందని అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ డ్రాయింగ్ బయటికి వెళ్ళడానికి బహుశా అతను కారణ మేమిటో అన్న అనుమానం కలుగుతోంది “అన్నాడు శ్రీహర్ష.
“మీరేం గాబరా పడవద్దు !నాన్నగారు కూడా వచ్చారు. మేము రేపే బెయిల్ పిటిషన్ వేస్తాము. మీకు ఈ విషయంలో ఏవిధమైనా సంబంధం లేదు.. బెయిల్ వస్తుంది” అంది ప్రణవి.
“ప్రణవీ! నిజంగా నేను ఏ తప్పు చేయ్యలేదు. నన్ను కనీసం నువ్వైనా నమ్ము. ఒకవేళ బెయిల్ మీద బయిట కొచ్చినా లోకమంతా నన్ను దేశద్రోహిలా భావిస్తుందన్న భయం కలుగుతోంది” అన్నాడు గద్గద స్వరంతో..
“చూడండి.. ప్రతీ వారి జీవితంలో సమస్యలనేవి వస్తునే ఉంటాయి. రోడ్లు తిన్నగా వుండవు. వాటికి ఎన్నో వంపులు ఉంటాయి ;అలాగే జీవితం కూడా; సుఖాలే కాదు కష్టాలనే వంపులూ ఉంటాయి, వంపులున్నాయనీ ముందుకెళ్లటం మానేస్తామా చెప్పండి ;ఇటువంటివి వస్తూనే ఉంటాయి ;మనం వాటిని ధైర్యం తో ఎదుర్కోవాలి ;వాటినే కష్టాలంటారు. చీకటి ఉంటేనే వెలుగు గొప్పతనం తెలుస్తుంది . ఇటువంటివి జీవితంలో స్పీడ్ బ్రేకర్ల వంటివి. కాబట్టి మీరేం బాధపడకండి. అన్నీ సర్దుకుంటాయి. నేనెక్కడో చదివాను అందమైన లోయను చూడాలంటే ఎత్తైన కొండని అధిరోహించక తప్పదు. మీకు అండగా మా కుటుంబమంతా ఉంది. మీ నాన్న గారికీ విషయం తెలియనివ్వను” అంది చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ..
శ్రీ హర్ష కి ఆమె మాటలు ధైర్యం కలిగించాయి ;
అతను బేలగా చూస్తూ ఉంటే అతని చేతిని తాకుతూ “నో మేన్ ఈజ్ ఏన్ ఐలండ్.. నువ్వు వంటరివికాదు. సరేనా.. ఏదొచ్చినా మన మంచికే.. కష్టాలు వచ్చినపుడు బాధ కలిగినా తరువాత దాని ఫలితం గొప్ప ఆనందాన్నిస్తుంది. బి. బ్రేవ్” అంటూ అతని దగ్గర శలవు తీసుకుంది ప్రణవి..
మర్నాడు సీఐడీ శ్రీహర్షను కోర్టులో హాజరు పరిస్తే అతనికి వారం రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. కరుణాకరం, ప్రణవి అదే సమయంలో బెయిల్ పిటీషన్ని వేసారు.
అది ఆరోజే విచారణ కొచ్చింది.
సీఐడి కి సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాఘవరావు తన వాదనలు వినిపిస్తూ “ఈ కేసు దేశభద్రతకు సంబంధించినది; మరీ ముఖ్యంగా దేశరక్షణ శాఖ యొక్క మిసైల్ డ్రాయింగు ఓ పాకిస్తానీ గూఢచారి చేతికి దొరికింది. ఇది చాలా ప్రమాదకరం.. రేప్పొద్దున్న వాళ్ళు మన మిసైల్ వ్యవస్థను నిర్వీర్యం చేసే వ్యవస్థను ఆ దొరికిన డ్రాయింగు ఆధారంగా తయారు చేయవచ్చు. అంతేకాక మనం తయారుచేస్తున్న మిసైల్ నమూనానే వారూ తయారు చేసి మన మీద ప్రయోగించవచ్చు. పాకిస్తాన్ తన గూఢచారులను చాప కింద నీరులా మన దేశంలో ప్రవేశ పెట్టింది. వాళ్ళు చాలా తెలివిగా మన రక్షణ శాఖ సైంటిస్టులకు డబ్బు ఆశ చూపించి ఇటువంటి అత్యంత విలువైన డ్రాయింగులను, పత్రాలను చేజించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకుదాహరణే ఈ కేసు; ఈ కేసులో శ్రీహర్ష అనే సైంటిస్టు ప్రలోభాలకి లోనై ఈ డ్రాయింగుని కొందరి బయట వ్యక్తులకు చేరవేసాడనిపిస్తోంది. అందుకని అతన్ని విచారణ చేస్తే అసలు విషయాలు తెలుస్తాయి.
అందువల్ల అతన్ని విచారించవలసిన అవసరం ఉంది. ఈ పరిస్థుతుల్లో అతనికి బెయిల్ ఇవ్వడం మంచిపని కాదు. అది కేసుని బాగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ బెయిల్ పిటిషన్ని కొట్టేయవలసిందిగా కోరుచున్నాను” అనీ తన వాదనలు వినిపించాడు.
అప్పుడు ప్రణవి డిఫెన్స్ తరపున తన వాదనలు వినిపించడం మొదలు పెట్టింది.. కరుణాకరం కూతురికి ఈ కేసు విషయంలో రిస్కు అని తెలిసినా వాదనలు వినిపించడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు.
"యువరానర్.. ఇమ్రాన్ అనే వ్యక్తి కాశ్మీర్ సరిహద్దులో పట్టుబడ్డాడు. అతని చేతిలో ఒక మిసైల్ డ్రాయింగు దొరికిందనీ, దానికి శ్రీహర్ష కారణమని సిఐడీ తరపు లాయర్ చాలా తెలివిగా వాస్తవాలను మరుగున పరుస్తూ వాదనలు వినిపించారు. దేశంలో మిసైల్స్ యొక్క డిజైన్లు కేవలం శ్రీహర్ష పనిచేస్తున్న ప్రయోగశాలలోనే కాకుండా ఇంకా ఇతర రక్షణ శాఖ ప్రయోగశాలల్లో జరుగుతునాయి. ఇదివరకు చాలా మిసైల్స్ కు రూపకల్పన జరిగేయి కూడా.
ఇప్పుడు ఆ ఇమ్రాన్ చేతికి దొరికినది ఏ మిసైల్ కి సంబంధించినదో సిఐడి వారు తన అభియోగ పత్రములో చెప్పలేదు. ఇప్పటి దాకా అగ్ని, త్రిశూల్, నాగ్ లాంటి ఎన్నో మిసైళ్ళను డిఆర్డియిల్ రూపొందించింది. వాటిలో దేని డ్రాయింగైనా అది కావచ్చు కదా.. అది శ్రీహర్ష టీమ్ రూపొందిస్తున్నదే అని ఎలా చెప్పగలం? అదీకాక అది డిజైన్ స్థాయిలోనే ఉంది కానీ ఆ డిజైనకు అనుమతులు మంజూరు కాలేదు. ఆ డిజైన్ పూర్తైతే దాన్ని రక్షణ శాఖ అనుమతిస్తుందో లేదో తెలియదు. అటువంటి డిజైన్ తో తయారు చేసిన డ్రాయింగు వల్ల శత్రువులకు ఏమిటి ఉపయోగం; ఇంకా ఆ డిజైన్ను ఎన్నో శాఖలు పరీక్షించి తమ అనుమతినివ్వాలి. అప్పుడే డ్రాయింగ్ తయారుచేయబడి ఆ మిసైల్ వేరే చోట తయారు చేయబడుతుంది.
ఇంకో ముఖ్య విషయం.. శ్రీహర్ష ఆ లేబొరేటరీలో రెండు సంవత్సరాల క్రితం నియమించబడ్డ ఒక జూనియర్ సైంటిస్టు మాత్రమే. ఆ మిసైల్స్ రూపకల్పన డా. భరద్వాజ నేతృత్వంలో జరుగుతోంది.
శ్రీ హర్ష అతని కింద పనిచేసే ఓ సైంటిస్టు మాత్రమే. టీమ్ లీడర్ అన్నది భరద్వాజ పని సౌలభ్యం కోసం, ప్రోగ్రెస్ కోసం ఏర్పరచినది కానీ అది ఏమి పదోన్నతి కాదు. కేవలం శ్రీహర్ష మీద నమ్మకంతో అతన్ని టీమ్ లీడర్ చేసారు. ఇందుకు ఏవిధమైన వ్రాత పూర్వక ఆర్డర్ ఏదీ లేదు. కేవలం నోటి మాటన జరిగినది. అదీకాక ఆ మొత్తం డిజైన్లు, డ్రాయింగులు సైంటిఫిక్ అసిస్టెంట్ల కస్టడీలో ఉంటాయి. వాటి వివరాలను వాళ్ళే ఒక రిజిస్టర్లో పొందుపరుస్తారు. ఏదైనా డిజైన్ గానీ, డ్రాయింగు గానీ బయటకు వెళ్ళాలంటే ఆ సైంటిఫిక్ అసిస్టెంట్లుకు తెలియకుండా జరగదు; అటువంటిది ఏ బాధ్యత లేని శ్రీ హర్షని ఈ కేసులో డ్రాయింగు బయటకు వెళ్ళిందనీ అరెస్ట్ చెయ్యడం అన్యాయం, అమానుషం; సంస్థ డైరెక్టర్, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్లు మొత్తం లేబరేటరీ భద్రతకు బాధ్యులు.. వాళ్ళని బాధ్యులు చేయకుండా కేవలం ఓ చిన్న సైంటిస్టుని బాధ్యత చేసి అరెస్ట్ చెయ్యడం వెనక ఏదో పెద్ద గూడుపుఠాణి ఉందనీ నేను మనస్పూర్తిగా నమ్ముతునాను. దీని వెనకాల ఢిల్లీ లెవల్లో ఎవరో రాజకీయ పెద్దల హస్తం ఉండొచ్చు. కేవలం ఓ చిన్న అధికారిని అరెస్ట్ చేస్తే వాస్తవాలు వెలుగులోకి రావనీ ఓ కుతంత్రంతో చేసిన పని ఇది. దీనివల్ల దేశభద్రతకు ముప్పు కలగడమే కాకుండా ఒక నిర్దోషి అయిన యువ సైంటిస్టు భవిష్యత్తుని పాడు చేసే ప్రయత్నంగా దీన్ని మనం భావించవచ్చు. ఈ కేసులో నిజాలు వెలుగులోకి రావాలంటే దీనికి సంబంధించిన పెద్ద తలకాయలను అంటే ఉన్నతాధికారులను, ఈ డ్రాయింగులను తమ కస్టడిలో ఉంచుకున్న సైంటిఫిక్ అసిస్టెంట్లను అరెస్ట్ చేసి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. దేశ భద్రతకు శ్రీహర్ష వల్ల ముప్పు వాటిల్లదు. అసలు ముద్దాయిలను రక్షించడం వల్ల దానికి ముప్పు పొంచి ఉంది. కాబట్టి నిర్దోషిని రక్షించి న్యాయాన్ని కాపాడవలసిందిగా న్యాయమూర్తిని కోరుతూ శ్రీహర్షకు బెయిల్ మంజూరు చేసి అసలు నేరస్థులను అరెస్ట్ చేయాలనీ సిఐడీని ఆదేశించవలసిందిగా కోరుతూ నా వాదనలు ముగిస్తున్నాను” అని వాదించి కూర్చొంది ప్రణవి.
ఇద్దరి వాదనలు విన్న న్యాయమూర్తి కేసుని మర్నాటికి వాయిదా వేసారు.
=================================================================
ఇంకా వుంది
=================================================================
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments