top of page

గరుడాస్త్రం - ఎపిసోడ్ 11


Written By Gannavarapu Narasimha Murthy

'గరుడాస్త్రం - ఎపిసోడ్ 11' తెలుగు ధారావాహిక

రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ..

శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.

అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు.

ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు. అయన శ్రీ హర్ష ను తన అవుట్ హౌస్ లో ఉండమంటాడు. కరుణాకరం గారి అమ్మాయి ప్రణవి తో పరిచయమవుతుంది.

ఒకరోజు కరుణాకరన్ గారు శ్రీహర్షని పిలిచి కోనసీమలో జరిగే ఒక పెళ్ళికి తన కూతురికి తోడుగా వెళ్ళమంటాడు. ప్రణవితో కలిసి అక్కడికి వెళతాడు శ్రీహర్ష. పెళ్లి కూతురి పక్కనే కూర్చుని ఉన్న ప్రణవి సౌందర్యానికి ముగ్ధుడవుతాడు..

పరీక్షలు పూర్తయ్యాక తన ఊరికి బయలుదేరుతాడు శ్రీహర్ష.

ప్రణవిని విడిచి వెళ్లడం అతనికి బాధ కలిగిస్తుంది.

శ్రీహర్షను కలవడానికి అతని దగ్గరకు వెళుతుంది ప్రణవి.

తమ వివాహానికి తండ్రిని ఒప్పించి వచ్చానని చెబుతుంది ప్రణవి.

పెద్దల అనుమతితో ఇరువురి వివాహం వైభవంగా జరుగుతుంది.

శ్రీహర్షకు డిఆర్డిఎల్ లో సైన్టిస్ట్ గా ఉద్యోగం వస్తుంది.

హైదరాబాద్ లో రిపోర్ట్ చేస్తాడు.

ట్రైనింగ్ పూర్తవగానే శ్రీహర్ష ని గరుడ మిసైల్ ప్రాజెక్టుకి బదిలీ చేసారు.

అక్కడ మిసైల్ కి సంబంధించిన డ్రాయింగ్ బయటి వాళ్లకు దొరుకుతుంది.

సిఐడీ బృందం వచ్చి శ్రీహర్షను, ప్రాజెక్ట్ ఇంఛార్జి భరద్వాజ గారిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభిస్తారు.

శ్రీహర్షను కలిసి ధైర్యం చెబుతుంది ప్రణవి.

అతని బెయిల్ కోసం వాదిస్తుంది.


ఇక గరుడాస్త్రం - ఎపిసోడ్ 11 చదవండి..


ఆ రాత్రంతా ప్రణవి శ్రీహర్షకి బెయిల్ వస్తుందో రాదో అన్న ఉత్కంఠతో గడిపింది. బెయిల్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆమె తండ్రి కరుణాకరం కోర్టులోనే ఆమెకి ధైర్యం చెప్పినా ఆమెకు నమ్మకం కుదరటం లేదు..


ఉదయం లేస్తునే ఆమెకు పిడుగు లాంటి వార్త తెలిసింది. క్రితం రాత్రి ఆఫీసు నుంచి వస్తున్న సైంటిఫిక్ అసిస్టెంట్ భావనని ఎవరో కాల్చి చంపారనీ శ్రీహర్ష స్నేహితుడు రాజు ఫోన్ చేసి చెప్పాడు. భావన పేరు వినగానే ఆమెకు ఆరోజు శ్రీహర్ష ఆఫీసులో ఆమెను పరిచయం చేసిన విషయం గుర్తు కొచ్చింది. మొన్న కస్టడీలో ఉన్నప్పుడు శ్రీహర్ష డ్రాయింగులు, రికార్డులు ఆమె కస్టడీలోనే ఉంటాయనీ, ఎవరో పాత ఎక్యూటివ్ డైరెక్టర్ వచ్చి ఆమెను కలిసాడని శ్రీ హర్ష విషయాలన్నీ ఒక్కొటొక్కటీ గుర్తుకు వచ్చాయి ప్రణవికి. అంటే ఏదో జరగబోతోంది. మిసైల్ డ్రాయింగు పాక్ గూఢచారి ఇమ్రాన్ దగ్గర దొరకడం, ఇప్పుడు ఆ డ్రాయింగులను భద్రపరిచే భావన హత్య గురికావడం.. ఇవన్నీ ఒకదాని కొకటి కలిపితే జాయినింగ్ ది డాట్స్ ; అంటే చుక్కలను కలిపితే కుట్రకోణం వైపు చూపెడుతునాయి..


వెంటనే తండ్రికి విషయం చెప్పి భావన ఇంటికి వెళ్ళింది ప్రణవి. అప్పటికే అక్కడ చాలా మంది ఉన్నారు. ఆమె శవానికి పోస్టమార్టెమ్ పూర్తైందనీ, ఆమె స్కూటీపై వస్తుండగా ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆమెను క్లోజ్డ్ రేంజ్ నుంచి పిస్టల్ని పేల్చారనీ, వెంటనే ఆమెను హాస్పిటల్ కి తీసికెళ్ళినా ప్రయోజనం లేకపోయిందనీ, ఆమె శరీరంలో మూడు బులెట్స్ ఉన్నాయినీ పోస్ట్ మార్టమ్ రిపోర్టులో ఉందనీ ఆ బులెట్స్ వల్లే ఆమె చనిపోయిందనీ అతను చెప్పాడు.. అవసరం అయితే అతన్ని కలుస్తానని చెప్పి వచ్చేసింది ప్రణవి.


భావన హత్య దేశాన్ని ఓ కుదుపు కుదిపింది.. దేశంలో ఏదో జరగబోతోందన్న వార్తలు వెల్లువెత్తాయి.. పాకిస్థాన్ గూఢాచారుల వలలో చాలా మంది చిక్కి ఉంటారనే భావన ప్రజల్లో పెల్లుబుకింది.. ఒక్కసారిగా నిఘా విభాగాలన్నీ ఎలర్టయ్యాయి.


ఆ మర్నాడు కూడా బెయిల్ పిటిషన్ మీద తీర్పు మర్నాటికి వాయిదా పడింది. ప్రణవిలో టెన్షన్ మొదలైంది. ఆమె గాబరా పడుతోంది తన గురించి కాదు శ్రీహర్ష గురించి; అతను మనసు చాలా సున్నితమైంది. తన మీద మోపిన అభియోగంతో అతను మానసికంగా చాలా కృంగిపోయాడు.. అటువంటిది బెయిల్ పిటిషన్ ఆలస్యమైతే అతను మరింతగా కృంగిపోయి నిరాశలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది.. అతను బయటకొచ్చి తమందరి మధ్య ఉంటే అతనికి ధైర్యం వస్తుంది.. తను ఒంటరివాడిని కానన్న ఆలోచన అతనికి ధైర్యాన్ని కలిగిస్తుంది. అందుకే ప్రణవి త్వరగా బెయిల్ రావాలని కోరుకొంటోంది .


కానీ అది మరింత ఆలస్యం అవుతోంది. ఈ లోగా భావన హత్య కేసుని మరింత క్లిష్టంగా మార్చింది. ఇప్పుడు కోర్టు ఏమని చెబుతుందో? సీఐడి వారి వాదన లేమిటో? అయినా భావన హత్యలో కూడా పాకిస్థాన్ గూఢచారుల హస్తం ఉందా? లేక తిన్నింటి వాళ్ళే ఈ పని చేసారా ?


. ఈ కేసు నుంచి శ్రీహర్ష బయట పడతాడా? ఇంకేమైనా కుట్రలున్నాయా? అనవసరంగా శ్రీహర్ష ఈ ఉద్యోగంలో చేరాడు.. ఏ ప్రైవేట్ కంపెనీలో చేరినా తమ జీవితాలు హాయిగా గడిచి పోయేవి.

ఆలోచనలతో ప్రణవి మస్తిష్కం వెడెక్కిపోతోంది. ఏం చెయ్యాలో తోచటం లేదు. ఈ రోజు ఉదయం దాకా బెయిల్ వస్తుందన్న ఆశ..


కానీ ఇప్పుడు అది రేపటి దాకా వాయిదా పడింది.. హాయిగా సాగిపోతున్న జీవితంలో ఏమిటీ కల్లోలం? ఎందుకీ ఉప్పెన? దారి కనిపించని అంధకారం.. వెలుగు ఎక్కడ? గమ్యం ఎటువైపు..

మళ్ళీ ఆమెలో ఆలోచనలు.. సాయంత్రం జైలు కెళ్ళి శ్రీహర్షని కలుద్దామని అనుకుంది కానీ అతని కేమి చెప్పాలో అర్థం కాలేదు.. ఏమి చెప్పినా అతను తట్టుకోలేడు. ఆ ఆలోచన రాగానే ఆ ఆలోచన విరమించుకుంది. ఆ రాత్రంతా ఆలోచిస్తూ ఉండిపోయింది.


ఆ మర్నాడు పదిగంటలకు తండ్రితో కలిసి కోర్టుకి వెళ్ళింది. వెళ్ళిందే కానీ ఆమె మనసు మనసులో లేదు. ఏదైనా వ్యతిరేక వార్త వినవలసి ఉంటుందేమోనన్న భయం ఆమెని పట్టి పీడిస్తోంది.

ఒక ట్రాన్స్ లోకి వెళ్ళి కోర్టులో కూర్చుంది. జడ్జిగారు పదకొండు గంటలకు వచ్చి కూర్చున్నారు.. అప్పటి నుంచి ప్రణవి ఒక అలౌకికమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. జడ్జిగారి మాటలు ప్రణవికి వినిపించటం లేదు.


జడ్జి గారి తీర్పు వెలువరిస్తున్నారు.. ప్రణవి అతని వైపు, తండ్రి వైపు బేలగా చూస్తోంది. అతను ఏమి చదువుతునారో ఆమె చెవులు ఆలకించటం లేదు..


కొద్దినిముషాల తరువాత జడ్జిగారు లేచి నిలబడి తన ఛాంబర్లోకి వెళ్ళిపోతూ కనిపించారు. ఇంతలో తండ్రి కరుణాకరం ఆమెతో ఏదో చెబుతునాడు. అతని ముఖంలో ఆనందం కనిపిస్తోంది. తండ్రి ఆమె చెయ్యి పట్టుకుని గట్టిగా పిలుస్తున్నాడు. ఒక్కసారిగా ఆమె ఈ లోకంలోకి వచ్చింది.


“ప్రణవీ! ఏమిటాలోచిస్తున్నావు.. కంగ్రాచులేషన్స్.. శ్రీహర్షకి బెయిల్ దొరికింది.. పద ఈ మంచి వార్త అందరికీ చెప్పాలి.. ” అంటూ లేచాడు. ప్రణవికి ఏం జరిగిందో అర్థం కావట్లేదు.


శ్రీహర్షకి బెయిల్ వచ్చింది. అన్న ఒకేమాట ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. అంతే! ఆమె ముఖంలో ఓ గొప్ప వెలుగు.. ఆనందం ఆర్ణవమైంది. చిరునవ్వు ఆమె ముఖంలో ఒక్కసారిగా మెరుపులా మెరిసింది.. ఒక్కసారిగా తండ్రి చేతులు పట్టుకొని వాటిని ఇటూ అటూ ఊపుతూ తన ఆనందాన్ని తెలియ చేసింది.


ఆ తరువాత ఇద్దరూ శ్రీహర్ష ఉన్న జైలుకి వెళ్ళారు. గంట తరువాత ఫార్మాలిసిటీస్ అన్నీ పూర్తెన తరువాత సాయంత్రం శ్రీహర్ష జైలు నుండి విడుదలయ్యాడు.


అతని ముఖంలో ఇప్పుడు ఆనందం కనిపిస్తోంది. జైలు బయట విలేఖరులు అతన్ని చుట్టు ముట్టారు. విలేఖర్లు అతనితో భావన హత్యకు గురైందన్న వార్త చెప్పగానే అతను ప్రణవి వైపు చూసాడు. ప్రణవి అతనికి కళ్ళతోటే అవునని సమాధాన మిచ్చింది..


తాను ఈ కేసులో నిర్దోషిననీ, ఆ డిజైన్లు బయటకెళ్ళే అవకాశమే లేదనీ, అవన్ని పాస్ వర్డ్ ఉన్న తన కంప్యూటర్లో భద్రంగా ఉన్నాయినీ, ఆ గూఢచారి దగ్గర దొరికిన డ్రాయింగ్ వల్ల ఏ ఉపయోగం ఉండదనీ , వాస్తవాలు త్వరలోనే తెలుస్తాయనీ, అంతవరకూ ఓపిక పట్టమనీ విలేఖరులకు చెప్పి, ప్రణవితో కలిసి ఇంటికి బయలు దేరాడు శ్రీహర్ష.


ఆ మర్నాడు శ్రీహర్ష, ప్రణవి ఇంట్లో ఉన్నప్పుడు “భావన భర్త” మధుకర్ వచ్చాడు. శ్రీహర్షకి అతన్ని చూడగానే చాలా బాధా కలిగింది.


“భావన విషయం నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఆఫీసులో ఆమె చాలా సిన్సియర్ గా పనిచేసేది. ఏదో కుట్ర జరిగింది. ఎవరో దీన్ని వెనుక ఉన్నారని పిస్తోంది. మేమంతా కొత్త వాళ్ళం, యువతీ యువకులం, చాలా త్రికరణ శుద్ధిగా మా పనులు చేస్తున్నాము. డిజైన్స్ బాగా వచ్చాయి.. వాటిని ప్రూఫ్ చెక్ చేసిన ఐఐటీ ప్రొఫెసర్లు కూడా మేము బాగా చేసామని అభినందించారు. అయినా సీఐడి వాళ్ళు సరియైన విచారణ చెయ్యికుండా నన్ను అరెస్ట్ చేసారు. వాళ్ళ సరిగ్గా విచారణ చెయ్యకపోవడంవల్లే భావన హత్య గురైందనుకుంటున్నాను. వాళ్ళే గాని ఆ డ్రాయింగ్ విషయంలో నిజానిజాలు తెలుసుకొని పరిశోధన చేసివుంటే నేరస్థులు దొరికేవారు . ఆమె హత్య జరిగి ఉండేది కాదు . అయినా బయటకు వెళ్ళిన డ్రాయింగ్ వల్ల పెద్ద ఉపయోగం కూడా ఉండదు. ముఖ్యమైనది డిజైన్. అది నా కంప్యూటర్లో భద్రంగానే ఉంది. దాన్నెవ్వరూ దొంగలించలేరు”.


“ అసలు ఆ డ్రాయింగ్ ఎలా బయటకు వెళ్ళిందో సరియైన విచారణ చెయ్యాలి. సెక్యూరిటీని, డైరెక్టర్లును, కంప్యూటర్ సెక్షన్ వాళ్ళనూ ప్రశ్నించాలి. ఈ విషయంలో పెద్ద పెద్ద వ్యక్తులకు ప్రమేయం ఉండే ఉంటుంది. వాళ్ళను తప్పించేందుకే మమ్మల్ని బలిపశువుల్ని చేసారు. వాళ్ళకు రాజకీయ అండ కూడా ఉండే ఉంటుంది. అయినా నేనీ విషయంలో రాజీ పడను. నేరస్థులను వదిలి పెట్టే ప్రసక్తే లేదు. భూమ్యాకాశాలు ఏకమైనా సరే నిజాన్ని వెలికి తీస్తాను. నిజం నిప్పు లాంటిది.. దాన్ని ఆర్పివేయడం అంత సులభం కాదు” అన్నాడు శ్రీహర్ష ఆవేశంగా.


ప్రణవికి అతని ఆవేశం చూసి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడూ మౌనంగా వుండే శ్రీహర్ష లో ఇంతటి ఆవేశం ఎప్పుడూ చూడలేదు.


మూడు రోజులు గడిచాయి. రోజులు భారంగా గడుస్తున్నాయి. శ్రీహర్ష బయటకు వెళ్ళలేదు. ఆఫీసుకు వెళతానంటే ప్రణవి వద్దని చెప్పింది. అక్కడి కెళ్తే వాళ్ళు పోలీసులు ఎంక్వయిరీ అంటూ వేధించే అవకాశం ఉండొచ్చనీ, దాని వల్ల శ్రీహర్ష అపెసెట్ అవచ్చనీ ఆమె ఆలోచన. అందుకే వద్దంది.. ఆమూడు రోజులు శ్రీహర్ష వెన్నంటే ఉంది ప్రణవి. భోజనాల దగ్గర కరుణాకరం అల్లుణ్ణి భయపడవద్దనీ, అన్నీ సర్దుకుంటాయనీ ధైర్యం చెప్పాడు.


శ్రీహర్ష అతనికి సమాధానం చెబుతూ "అంకుల్! నాకేదో అవుతుందన్న భయం నాకు లేదు.. నేనేమి తప్పు చెయ్యలేదు కాబట్టి ఏమి జరగదు. కానీ ఎవరో ఏదో కుట్ర పన్నారన్న అనుమానం నాకు కలుగుతోంది. దాన్ని ఛేదించాలి. లేకపోతే మా శాఖకు మా సంస్థకు ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది. వాళ్ళేవరో కనుక్కోవాలి. వాళ్ళు దేనికీ పని చేస్తునారో తెలుసుకోవాలి? దీని వెనక ఉన్న కుట్రను భగ్నం చెయ్యాలి” అన్నాడు.


“పోలీసులు ఆ పని ఎలాగూ చేస్తారు. నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకు”.

“వాళ్ళు ఎలాగూ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నేనూ ఉడతా భక్తిగా నా ప్రయత్నం చేస్తాను” అన్నాడు శ్రీహర్ష.


కరుణాకరం అల్లుడి ధైర్యానికి ఆనందించాడు. అల్లుడు ఈ కేసు విషయంలో మానసికంగా కుంగిపోతాడేమోనని బయపడ్డాడు.


కానీ ఇప్పుడతని మాటలు విన్న తరువాత అతనికి ధైర్యం వచ్చింది. “ఏదొచ్చినా మన మంచికే అంటారు. మనకి ఏ సమస్యా లేకుండా జీవితం హాయిగా సాగిపోతోందంటే మనం సరియైన దారిలో వెళ్ళటం లేదని భావించాలి” అని స్వామి వివేకానంద చెప్పాడు.


“మన అపజయాన్ని ఓటమి అనుకోకూడదు , ఓటమికి కారణం తెలుసుకున్నాము అని భావించాలి. ” — అని చెప్పి వెళ్ళిపోయాడు కరుణాకరం..


నాలుగు రోజుల తరువాత ఒక ఉదయం పదిగంటలకు వేళ శ్రీహర్ష, ప్రణవి అతని కేసు విషయమై కరుణాకరం గారితో మాట్లాడుతున్న సమయంలో ఒక స్త్రీ వాళ్ళని కలవడానికి వచ్చిందని వాచ్ మేన్ వచ్చి చెప్పాడు. కరుణాకరం బయటకు వెళ్ళి ఆమెను లోపలికి పంపించాడు.

గదిలో శ్రీహర్ష, ప్రణవి ఇద్దరూ ఉన్నారు. ఆమె లోపలికి వస్తునే “నమస్కారం! నా పేరు హారిక. నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంటాను. పెయింటర్ని కూడా. నా పెయింటింగ్స్ చాలా పత్రికల్లో వస్తుంటాయి. ” అని తనను పరిచయం చేసుకుంది.

ప్రణవి ఆమెని కూర్చోమని సోఫా చూపించింది.


“చెప్పండి మేడం? ఏ పని మీద మీ రొచ్చారు?” అని అడిగింది ప్రణవి.

“నాలుగురోజుల క్రితం రక్షణ శాఖ డెవలప్ మెంట్ లేబరేటరీలో పనిచేస్తున్న భావన అనే ఓ సైంటిఫిక్ అసిస్టెంట్ హత్య చేయబడిన సంఘటన మీకు తెలుసనుకుంటాను. ఆ విషయం గురించి మీతో మాట్లాడాలని వచ్చాను” అంది హారిక.


“భావన హత్య విషయం మీద మాట్లాడానికి వచ్చాను” అన్న ఆమె మాటలు శ్రీహర్ష కి ఆశ్చర్యం కలిగించాయి.

“చెప్పండి” అన్నాడు ఉత్కంఠతో.


“ఆ హత్య జరిగిన రాత్రి 9 గంటలకు నేను ఓ పెయింటింగ్ ఎగ్జిబిషన్ కి వెళ్ళియింటికి వెళుతునాను. గాంధీ సెంటరుకి వచ్చేసరికి చిన్నగా వర్షం మొదలైంది. నేను వెంటనే నా స్కూటీని రోడ్డు పక్కనే ఉన్న ఒక చెట్టు కింద ఆపి రైన్ కోట్ వేసుకుంటున్న సమయంలో ఒక ఆశ్చర్యకమైన సంఘటన జరిగింది. ఒక మోటార్ బైక్ మీద యిద్దరు వ్యక్తులు వచ్చి నా ముందర ఆగారు. నేను పక్కనే ఉండటంతో దీపాల వెలుగులో వాళ్ళ ముఖాలు నాకు స్పష్టంగా కనిపించాయి. . వాళ్ళు మోటారు సైకిలు ఆగగానే వెనక కూర్చున్న వ్యక్తి దిగి జేబులోంచి ఒక రైఫిల్ తీసి ఆ సమయంలో కొద్ది దూరంలో రోడ్డుమీద స్కూటర్ మీద వెళుతున్న ఓ స్త్రీ మీద కాల్పులు జరిపాడు.. మూడు సార్లు తుపాకీ పేల్చాడతను.. అంతే.. పెద్ద శబ్దం ఆ ప్రాంతంలో ప్రతిధ్వనించింది. ఆ తుపాకి పేలిన ప్రాంతంలో పొగ దట్టంగా వ్యాపించింది. పిస్టల్ని పేల్చిన తరువాత ఆ వ్యక్తి పరుగున వచ్చి మోటారు సైకిలు మీద కూర్చోగానే అది స్పీడుగా వెళ్ళి పోయింది.


నేను ఆశ్చర్యంలో తేరుకొని ఆ పొగ వచ్చిన ప్రాంతానికి వెళ్ళాను. అప్పటికే ఆ స్త్రీ రక్తపు మడుగులో పడి ఉంది. ఆమెకు దూరంగా స్కూటర్ పడి ఉంది.. వెంటనే నాతో పాటు చాలా మంది అక్కడ గుమిగుడారు. అంబెలెన్స్ కి ఎవరో ఫోన్ చేసారు. నేను వెంటనే చెట్టు దగ్గరికి వచ్చి పోలీసు స్టేషన్ కి ఫోన్ చేసాను. ఆ సమయంలో ఎస్సై రవీంద్ర ఫోన్ ఎత్తారు. అతనికి నేను గాంధీ సెంటర్లో ఓ స్త్రీ మీద ఎవరో కాల్పులు జరిపి పారిపోయారని చెప్పాను. అతను మీ పేరేమిటని అడిగితే నేను నాపేరు చెబితే ఎక్కడ నన్ను వేధిస్తారో నని భావించి పేరు చెప్పకుండా పోలీసులను పంపమని చెప్పి ఫోన్ కట్ చేసాను . “


“నేను అక్కడ కొద్ది సేపు ఉన్నాను. పోలీసులు రాలేదు కానీ అంబులెన్స్ వచ్చింది. వెంటనే ఆ గాయపడిన స్త్రీని అంబులెన్స్ లో దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తీసికెళ్ళారు. ఆ తరువాత నేను ఇంటికి వచ్చేసాను. ఆ మర్నాడు టీవీల్లో, పేపర్లోనూ మీ అరెస్ట్ గురించిన వార్తలు చూసేను . భావన కూడా మీ ఆఫీసులో పనిచేస్తోందని వార్తల ద్వారా తెలిసింది. మొన్న పేపర్లో మీరు బెయిల్ మీద బయటకు వచ్చినపుడు “ఆ మిసైల్స్ డ్రాయింగు విషయంలో నాకేమి సంబంధం లేదు.. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. దీన్ని బయట పెడతాను” అని విలేఖర్లుతో చెప్పడం టీవీలో చూసాను. ఒక పక్క మీ ఆఫీసుకి చెందిన భావన హత్య, ఇంకో పక్క మీ అరెస్ట్, విలేఖర్లతో మీ ప్రతిస్పందన చూసిన తరువాత భావన హత్య గురించిన నాకు తెలిసిన విషయాలు చెబితే మీకు ఉపయోగపడతాయనిపించి మీ దగ్గరకి వచ్చాను. ఇంకో ముఖ్య విషయం ; నేను పెయింటర్ ని కాబట్టి ఆ రోజు బైక్ మీద వచ్చి భావన మీద కాల్పులు జరిపిన ఆ ఇద్దరు వ్యక్తుల బొమ్మలు గీసాను .. ” అంటూ రెండు పెద్ద డ్రాయింగులు శ్రీహర్షకి ఇచ్చింది.


శ్రీహర్ష ఆ డ్రాయింగులను ఆతృతతో విప్పి చూసాడు. అందులో పొడవుగా గెడ్డాలతో చాలా రఫ్ గా ఉన్న ఇద్దరు వ్యక్తుల పెయింటింగ్స్ చిత్రించబడి ఉన్నాయి.


శ్రీహర్ష ఆమెతో “చాలా గొప్ప పని చేసారు హారిక గారూ.. మీలా ఇంత ధైర్యంగా స్పందించే వాళ్ళు అరుదుగా ఉంటారు. ఈ రోజు మీరు తెచ్చిన ఈ ఆధారాలు నా కేసుకు ఎంతో మేలు చేస్తాయి. ఇవే గొప్ప సాక్ష్యాలు కాబోతాయి. మీ మేలును జన్మలో మరవలేను” అన్నాడు ఉద్విగ్నతతో.


“ఒక సాటి మనిషిగా ఇది నా బాధ్యత . నిరపరాధైన ఓ యువ శాస్త్రవేత్తను కాపాడితే దేశానికెంతో మేలు జరుగుతుందనే ఆలోచనే ఈ రోజు నన్నిక్కడికి రప్పించింది” అంది ఆమె..

ఆ తరువాత ఆమె కాఫీ తాగి వెళ్ళిపోయింది.. -

=================================================================

ఇంకా వుంది


=================================================================


గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.38 views0 comments

Comentarios


bottom of page