Written By Gannavarapu Narasimha Murthy
'గరుడాస్త్రం - ఎపిసోడ్ 13' తెలుగు ధారావాహిక
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.
అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు.
ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు. అయన శ్రీ హర్ష ను తన అవుట్ హౌస్ లో ఉండమంటాడు. కరుణాకరం గారి అమ్మాయి ప్రణవి తో పరిచయమవుతుంది.
పరీక్షలు పూర్తయ్యాక తన ఊరికి బయలుదేరుతాడు శ్రీహర్ష.
ప్రణవిని విడిచి వెళ్లడం అతనికి బాధ కలిగిస్తుంది.
శ్రీహర్షను కలవడానికి అతని దగ్గరకు వెళుతుంది ప్రణవి.
తమ వివాహానికి తండ్రిని ఒప్పించి వచ్చానని చెబుతుంది ప్రణవి.
పెద్దల అనుమతితో ఇరువురి వివాహం వైభవంగా జరుగుతుంది.
శ్రీహర్షకు డిఆర్డిఎల్ లో సైన్టిస్ట్ గా ఉద్యోగం వస్తుంది.
ట్రైనింగ్ పూర్తవగానే శ్రీహర్ష ని గరుడ మిసైల్ ప్రాజెక్టుకి బదిలీ చేసారు.
అక్కడ మిసైల్ కి సంబంధించిన డ్రాయింగ్ బయటి వాళ్లకు దొరుకుతుంది.
సిఐడీ బృందం వచ్చి శ్రీహర్షను, ప్రాజెక్ట్ ఇంఛార్జి భరద్వాజ గారిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభిస్తారు.
శ్రీహర్షను కలిసి ధైర్యం చెబుతుంది ప్రణవి.
అతని బెయిల్ కోసం వాదిస్తుంది.
సైంటిఫిక్ అసిస్టెంట్ భావనని ఎవరో కాల్చి చంపుతారు.
కోర్టు ప్రణవి వాదనను అంగీకరించి, శ్రీహర్షకు బెయిల్ మంజూరు చేస్తుంది.
హారిక అనే అమ్మాయి తాను భావన హంతకుల డ్రాయింగ్ గీచినట్లు శ్రీహర్ష, ప్రణవిలతో చెబుతుంది.
హారికను కోర్టులోకి ప్రవేశపెడుతుంది ప్రణవి.
ఇక గరుడాస్త్రం - ఎపిసోడ్ 13 చదవండి..
ప్రణవి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని ప్రశ్నించడం మొదలు పెట్టింది.
“మీ పేరు”?
“హారిక”
“ఏం చేస్తుంటారు”...
నేను ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంటాను. పెయింటింగ్స్ వేస్తుంటాను.”
“ఈ నెల 10వ తారీఖు మంగళవారం నాడు సాయంత్రం మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు ఏం చూసారో చెప్పగలరా?”
“ఆ రోజు రాత్రి 8 గంటలకు నేను ఆఫీసు నుంచి ఇంటికి వెళుతుండగా వర్షం పడుతుండటంతో గాంధీ సెంటర్ దగ్గర ఒక చెట్టు కింద ఆగినపుడు ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిలు మీద వచ్చి పిస్టల్ లో అక్కడికి దగ్గరలో వెళ్తున్న స్త్రీని కాల్చి పారిపోవడాన్ని నేను గమనించాను. అక్కడే లైటు ఉండటంతో వాళ్ళిద్దర్ని స్పష్టంగా చూసాను. ఆ విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను.ఇంతలో అంబులెన్స్ రావడంతో నేను ఇంటికి వెళ్ళిపోయాను.నాకు పెయింటిగ్స్ వెయ్యిడం వచ్చు కాబట్టి ఆ ఇద్దరి ముఖచిత్రాలను పెయింట్ చేసాను” అంటూ రెండు చిత్రాలను ప్రణవికి చూపించింది.
ప్రణవి వాటిని తీసుకొని కొద్ది సేపు పరిశీలించి జడ్జిగారికి ఇచ్చింది.
“యువరానర్. ఇప్పుడు నేనిచ్చిన చిత్రాలను హరిక అనే సాక్షి స్వయంగా చిత్రించింది... ఈ చిత్రాలలో ఉన్నవాళ్ళే నిజమైన హంతకులు. కానీ పోలీసులు వీరిని కాక ఈ ఇద్దర్నీ హంతకులనీ అరెస్ట్ చేసింది” అంటూ ఓ పేపర్లో ప్రచురించబడ్డ వారి ఫొటోలను జడ్డీ గారికి చూపించింది.
"యువరానర్! పోలీసులు నకిలీ హంతకుల్ని అరస్ట్ చేసారనడానికి ఇంత కన్న వేరే సాక్ష్యం కావాలా?” అని అడిగింది.
పీపీ జనార్ధన్ లేచి “అబ్జెక్షన్ యువరానర్! డిఫెన్స్ వారు ప్రవేశపెట్టిన సాక్షి చెబుతున్నది నిజం అనడానికి ఆధారాలు ఏమిటి? ఎవరినైనా తెచ్చి తమకనుకూలంగా కావలసిన సాక్ష్యాన్ని చెప్పించుకోవచ్చు. ఇది తప్పడు సాక్ష్యం అని చెబుతునాను..” అంటూ కూర్చున్నాడు.
- "అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్”
“యువరానర్. దానికి కూడా సాక్ష్యాలున్నాయి” అనీ చెబుతుండగా జడ్జిగారు “కోర్ట్ ఈజ్ ఎడ్జర్న్డ్! కేసుని ఎల్లుండికి వాయిదా వేస్తున్నాను “ అంటూ లేచి వెళ్ళిపోయారు..
కోర్టు సెషన్ ముగియడంతో ప్రణవి, శ్రీహర్ష బయటకొచ్చారు. కరుణాకరం వాళ్ళని కలిసారు..
తండ్రికి ఆరోజు జరిగిన వాదనలు గురించి చెప్పింది ప్రణవి.
“ప్రణవీ! మనం ఒకసారి పోలీస్టేషన్ కి వెళితే ఆ హంతకుల వివరాలు తెలుస్తాయి. అప్పుడు మనం మరింతగా కేసులో వాదనలు వినిపించవచ్చు” అని చెప్పాడు శ్రీహర్ష.
“రేపుదయాన్నే వెళదాం!” అని చెప్పింది ప్రణవి.
ఆ మర్నాడు పది గంటలకు ఇద్దరూ దగ్గర్లో ఉన్న పోలీస్టేషన్ కి వెళ్లారు. అప్పటికి రైటర్ ఒక్కడే వచ్చాడు. అతని పేరు వీరాస్వామి. శ్రీహర్ష ప్రణవి తమ గురించి చెప్పగానే వాళ్ళని గౌరవించాడు. ముఖ్యంగా ప్రణవి ప్రముఖ లాయర్ కరుణాకరం గారి కూతురనీ తెలియడంతో అతను చాలా సంతోషించాడు…
"చెప్పండి.. ఏ పని మీద వచ్చారు”? అని అడిగాడాయన.
ప్రణవి కేసు వివరాలు చెప్పి హరిక ఇచ్చిన చిత్రాలను అతనికి చూపించి ఈ ఇద్దరూ భావనని హత్య చేసారు. వీళ్ళను మీరెప్పడైనా చూసారా? వీళ్ళ వివరాలు తెలుసా? “ అని అడిగింది…
అతను ఆ చిత్రాలను చూస్తూ “వీళ్ళు కరడు గట్టిన హంతకులు... వీళ్ళు భావన హత్యకావింపబడిన రోజు నా మా లాకప్పు లోనే ఉన్నారు” అని చెప్పాడు.
అతని మాటలు వినీ శ్రీహర్ష, ప్రణవి ఆశ్చర్యపోయారు...
వీరాస్వామి మెల్లగా మాట్లాడుతూ “మేడం! ఆరోజు సాయంత్రం మా ఎస్పై రవీంద్ర గారు డ్యూటీలో ఉన్నారు. ఇప్పుడతను శలవులో ఉన్నారు. ఇంకో విషయం చెబుతాను వినండి ;అంతకు మునుపు రోజే వాళ్ళిద్దర్నీ ఒక దాడి కేసులో అరెస్టు చేసి లా కప్పులో ఉంచారు. బహుశా ఆమెను హత్య చేయడానికే వాళ్ళను మా లాకప్పులో ఉంచారనిపిస్తోంది. అందుకే ఆ రోజు సాయంత్రం డ్యూటీలో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్ళను వేరే పనుల మీద బయటకు పంపించివేసాడు. ఆ తరువాత వాళ్ళిద్దర్నీ లాకప్పు నుంచి బయటకి పంపించాడు. ఆ సమయంలో నేను ఇదే గదిలో కూర్చుని ఉన్నాను.”
“వాళ్ళు లాకప్పు లోంచి బయటకు రాగానే నేను రవీంద్ర గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళను బయటకెందుకు పంపిస్తున్నారని అడిగితే చిన్న పని మీద పంపిస్తునాను... మీరు అవేమీ పట్టించు కోకండి ” అని చెప్పాడతను. ఒక గంట తరువాత మా పోలీ స్టేషన్ కి ఒక ఫోన్ వచ్చింది. నేను అప్పుడు ఎస్సై రవీంద్ర గారి పక్కనే ఉన్నాను. అతను ఫోన్ ఎత్తి “అలాగే పంపిస్తాను” అంటూ ఫోన్ పెట్టేసాడు.
ఆఫోన్ భావన హత్యను చూసిన ఒకమ్మాయి చేసింది. కానీ అతను నాకా విషయం చెప్పలేదు. ఒక గంట తరువాత పట్నామంతా ఆ హత్య గురించిన వార్త గుప్పుమన్నాది. ఆ హత్య గురించి ఎస్సై రవీంద్రకు బాగా తెలుసనీ నాకనుమానం. అతనే చాలా వ్యూహాత్మకంగా ఆ హంతకులిద్దర్నీ అరెస్టు చేసి లాకప్పులో పెట్టి వాళ్ళను తనే స్వయంగా బయటకు పంపి ఆ హత్యను చేయించాడు. ఆ హంతకులిద్దరూ ఈ ప్రాంతం వాళ్ళు కారు. వాళ్ళు నార్త్ ఇండియన్స్.. వాళ్ళ పేర్లు ఠాకూర్ , బలదేవ్ సింగ్... బీహరీ క్రిమినల్స్. అక్కడ నుంచి ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి వాళ్ళనిక్కడకు పంపించి ఉంటాడు... నా ఉద్దేశ్యంలో ఇది చాలా ప్లాన్డ్ గా జరిగిన మర్డర్... బహుశా ఆమెకు ఈ డ్రాయింగు ఎలా పాకిస్తాన్ గూఢచారికి చేరిందో తెలిసి ఉండాలి... అందుకే ఆమె సాక్ష్యాన్ని రూపుమాపడానికే ఈ పని చేసి ఉండవచ్చు.” ఈ విషయాలన్నీ నేను చెప్పినట్లు ఎవరికీ చెప్పొద్దు. కోర్టు కోరితే రికార్డులు సమర్పిస్తాం” అని చెప్పాడు వీరాస్వామి.
అతను చెప్పిన వివరాలు విన్న తరువాత శ్రీహర్ష, ప్రణవిలకు కేసులో పూర్తి స్పష్టత వచ్చింది...
అతనికి కృతజ్ఞతలు చెప్పి బయటకు వచ్చారు...
రెండు రోజుల తరువాత కోర్టులో మళ్ళీ వాదనలు మొదలయ్యాయి... ముందుగా డిఫెన్స్ తరపున ప్రణవి తన వాదనలు వినిపించడం మొదలు పెట్టింది.. “మొన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాదనలు వినిపిస్తూ హారిక గారు చెప్పిన విషయాలకు సాక్ష్యాలు ఏమిటని ప్రశ్నించారు. ఒక సాక్షి వచ్చి చెప్పిన విషయాలకు రుజువులు కావాలంటే ఇక సాక్షాలు అనవసరం... తీర్పులు ఇచ్చే అవకాశాలు ఉండవు. అయినా సరే ఆ రోజు హారిక గారు చెప్పిన సాక్ష్యానికి ఆధారాలు ఉన్నాయి. ఈ విషయాల్లో స్పష్టత రావాలంటే ఎస్సై రవీంద్రని ఇంటరాగేట్ చెయ్యాలి... అతన్ని ప్రశ్నించే అవకాశం ఇవ్వాలని కోర్టువారిని కోరుతునాను” అంది ప్రణవి.
"పెర్మిటెడ్ ;అనుమతిస్తున్నాం; రవీంద్రని ప్రవేశపెట్టండి” అన్నారు జడ్జిగారు.
పది నిముషాలు కేసు వాయిదా పడింది. ఆ తరువాత రవీంద్రను పోలీసులు ప్రవేశపెట్టారు... ప్రణవి అతన్ని ప్రశ్నించడం మొదలు పెట్టింది.
“మీ పేరు”
“రవీంద్రనాథ్”
మీరు ఏ పని చేస్తునారు?”
“ఎస్సై టూ టౌన్ పోలీస్టేషన్.”
“భావన అనే స్త్రీ హత్య జరిగిన సమయంలో మీరెక్కడ ఉన్నారు?”
“ఆ రోజు నేను పోలీస్టేషన్లో డ్యూటీలో ఉన్నాను”.
ప్రణవి హారిక ఇచ్చిన చిత్రాల్లోని వ్యక్తులను చూపిస్తూ “వీరెవరో మీకు తెలుసా?” అని అడిగింది .
“తెలుసు, ఠాకూర్ , బలదేవ్ సింగ్... ఒక దాడి కేసులో వీరిని అరెస్ట్ చేసాము.”
“భావన హత్య జరిగిన సమయంలో వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు?”
“లాకప్పులో ఉన్నారు.”
“మీరు చెబుతున్నది నిజమేనా? ఒక్కసారి ఆలోచించుకొని చెప్పండి”.
“నేను చెబుతున్నది నిజమే... ఇందులో ఆలోచించుకునే అవసరం లేదు”.
“ఓకె.. హారిక అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నిన్న కోర్టులో సాక్ష్యం చెబుతూ ఆ హత్య జరిగిన సమయంలో వాళ్ళిద్దరూ ఒక మోటారు సైకిలు మీద ఆ ఘటనాస్థలానికి వచ్చి భావనను పిస్టల్ లో కాల్చి చంపి పారిపోయారనీ, వాళ్ళని తాను దగ్గరగా చూసానని చెప్పి తాను చిత్రించిన వాళ్ళ చిత్రాలను కూడా ఇచ్చింది.. ఇప్పుడు మీకు చూపించినవి వాళ్ళ ఫొటోలే. తాను వాళ్ళిద్దర్నీ చూడకపోతే వాళ్ళ చిత్రాలను ఆమె ఎలా పెయింట్ చేయగలిగింది, కాబట్టి వాళ్ళు ఆ సమయంలో మీరు చెప్పినట్లు లాకప్పులో లేరనీ తెలుస్తోంది... దీనికి మీరేమంటారు?”
“బహుశా వాళ్ళని ఇది వరకే ఆమె చూసి ఉండవచ్చు. వాళ్ళ వల్ల తనకేదో అన్యాయం జరిగి ఆ కోపంతో వాళ్ళ చిత్రాలను వేసి వాళ్ళను కేసులో ఇరికించాలని ఆ పని చేసి ఉండొచ్చు... ఏదైనా జరగొచ్చు...” సూటిగా చెప్పాడు రవీంద్ర.
“అంటే ఆ సమయంలో వాళ్ళిద్దరూ లాకప్పులో ఉన్నారంటారు....”
“అవును... వాళ్ళిద్దరూ లాకప్పులోనే ఉన్నారు.”
“యువరానర్ !ఈ విషయంలో నిజం తెలియాలంటే ఆ సమయంలో పోలీస్టేషన్లో డ్యూటీలో ఉన్న రైటర్ వీరాస్వామిని ప్రశ్నించవలసి ఉంది. కోర్టు వారు అనుమతిస్తే అతన్ని ప్రశ్నిస్తాను” అంది…
కోర్టువారు “అనుమతివ్వబడింది” అని కేసుని మధ్యాహ్ననికి వాయిదా వేసారు.
మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకి కేసులో వాదనలు మొదలయ్యాయి. బోనులో వీరాస్వామి నిలబడి ఉన్నాడు.
“మీ పేరు; ఏం చేస్తుంటారు?”
“వీరాస్వామి! పోలీసు స్టేషన్ లో రైటర్ గా పనిచేస్తున్నాను “
“వీరాస్వామి గారూ!... మీ ఎస్పై గారనీ భయపడకుండా నిజం చెప్పండి ; ఆరోజు సాయంత్రం ఈ చిత్రాల్లోని వ్యక్తులు ఎక్కడ ఉన్నారు? ఏం జరిగింది?”
“నిజమే చెబుతాను... అంతకు మునుపు రోజున ఎస్సై రవీంద్ర గారు వాళ్ళిద్దర్ని అరెస్ట్ చేసి లాకప్పులో పెట్టారు . హత్య జరిగిన రోజు సాయంత్రం ఆరుగంటలకు మా ఎస్పైగారికి ఒక ఫోన్ ఎక్కడినుంచో వచ్చింది. నేను అప్పుడు ఎస్పై రవీంద్ర గారి పక్కనే ఉన్నాను. ఆ ఫోనులో మాట్లాడిన తరువాత ఎస్సైగారు ఆ లాకప్పులో ఉన్న రాకూర్, బలదేవ్ సింగ్ లిద్దర్నీ బయటకు విడిచి పెట్టేసారు... వాళ్ళను ఎందుకు వదిలేస్తునారు అనీ నేను ప్రశ్నిస్తే రవీంద్ర గారు ఓ చిన్న పనిమీద పంపిస్తున్నాను” అని చెప్పారు. నేను ఆ విషయాన్ని మా రిజిస్టర్లో వ్రాసేను; ఇదీ జరిగింది” అని చెప్పాడు.
“ఓకే వీరాస్వామి గారు... మీరిక వెళ్ళవచ్చు” అని అతను వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ వాదనలు మొదలు పెట్టింది;
"యువరానర్! ఎస్పై రవీంద్ర గారు ఠాకూర్, బలదేవ్ సింగ్ లిద్దరూ హత్య జరిగిన సమయంలో లాకప్పులోనే ఉన్నారని చెప్పారు. కానీ అదే స్టేషన్లో అతని క్రింద పనిచేస్తున్న రైటర్ వీరాస్వామి గారు హత్య జరిగిన సమయానికి గంట ముందు వాళ్ళిద్దర్ని లాకప్పు నుంచి బయటకు విడిచి పెట్టారనీ చెబుతునారు. అంటే వాళ్ళిద్దర్నీ కేవలం భావనని హత్య చేయడానికే విడిచి పెట్టినట్లు తెలుస్తోంది. ఎస్పై రవీంద్ర గారు విడిచిపెట్టడంతో వాళ్ళిద్దరూ ఆసమయంలో ఆమె ఆ ప్రాంతానికి వస్తుందని తెలిసి మోటార్ బైక్ మీద అక్కడికి వెళ్ళి ఆమెను కాల్చి హత్య చేసి పారిపోయారు.”
“అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి? ఆ సమయంలో రవీంద్ర కి ఎవరు ఎందుకు ఏమని ఫోన్ చేసారు? ఆ ఫోన్ వచ్చిన తరువాత ఎస్పై రవీంద్ర వారిద్దర్ని విడిచి పెట్టాడంటే ఎవరో రవీంద్రని ఫోన్లో వాళ్ళను విడిచిపెట్టమనీ ఆదేశించారని అర్ధం అవుతోంది...
అయితే ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? రవీంద్ర కతను ఎలా తెలుసు? రవీంద్ర ఎందుకు వాళ్ళిద్దర్నీ తప్పని తెలిసినా విడిచి పెట్టాడు? వీటన్నింటికీ సమాధానాలు తెలియాలి.... తెలియాలంటే సరియైన సమగ్రమైప విచారణ జరగాలి. ఆపని సీఐడి చెయ్యకుండా ఎవరో ఇద్దరూ సంబంధంలేని వ్యక్తుల్ని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంది? అంటే సీఐడి కూడా ప్రలోభాలకు లోనైందన్న అభిప్రాయం కలుగుతోంది.”
ఆమె చెబుతుంటే జనార్ధన్ లేచి “అబ్జెక్షన్ యువరానర్! డిఫెన్స్ వారు ఏవో కట్టు కథలు చెబుతూ కేసుని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. సీఐడి మీదా, ఎస్సై మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.. ” అన్నాడు.
“అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్”
“థాంక్స్ యువరానర్! ఈ కేసులో మరిన్ని ముఖ్య విషయాలున్నాయి. లాకప్పు నుంచి ఆ హంతకులిద్దరూ బయటకు వెళ్ళారనడానికి సాక్ష్యాలు పలుచోట్ల సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటిలో వీళ్ళు మోటర్ సైకిలు మీద బయటకు ఎప్పుడు వెళ్ళింది సమయం తో సహా రికార్డయ్యాయి; కోర్టు వారి వాటిని చూడాలి” అంటూ ఒక పెన్ డ్రైవుని జడ్జి గారికిచ్చింది. జడ్జిగారు దాన్ని లాప్ టాప్ లో పెట్టి చూసారు.
=================================================================
ఇంకా వుంది
=================================================================
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments