నవ్వులు పువ్వులు పూయాలి!
- Gadwala Somanna
- Sep 21
- 2 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #NavvulaPuvvuluPuyali, #నవ్వులుపువ్వులుపూయాలి, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 122
Navvula Puvvulu Puyali - Somanna Gari Kavithalu Part 122 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 21/09/2025
నవ్వులు పువ్వులు పూయాలి - సోమన్న గారి కవితలు పార్ట్ 122 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
నవ్వులు పువ్వులు పూయాలి!
-------------------------------------------
వదనంలో నవ్వులు
వనంలోని పువ్వులు
చీకటిని తరిమివేయు
వెలుగులీను దివ్వెలు
నవ్వులేని ముఖములు
అమావాస్య రాత్రులు
ఉండనే ఉండవోయ్!
చూడంగా సొగసులు
ఖర్చులేని నగవులు
ఖరీదైన నగవులు
ఉంటేనే ముఖమున
అవే కదా శుభములు
నవ్వులే రువ్వాలి
నవ్విస్తూ బ్రతకాలి
మోదమే పొందాలి
రోగాలు తరమాలి

కావాలి! కదలాలి!
---------------------------------------
మహాత్ముల మాటలతో
మదిని మార్పు తేవాలి
మంచి మంచి పనులతో
గుండెల్లో నిలవాలి
శుద్ధమైన మనసులతో
భగవంతుని కొలవాలి
స్వచ్ఛమైన మమతలతో
కదిలికలు పుట్టించాలి
స్పష్టమైన లక్ష్యంతో
గమ్యాన్నే చేరాలి
స్ఫూర్తినిచ్చు వాటిలో
ప్రథమంగా ఉండాలి
కన్నవారి సేవలో
ముందడుగే వేయాలి
వారి చూపు ప్రేమలో
భాగస్వాములు కావాలి

ఆది ప్రాస గేయం
--------------------------------------
మల్లెపూలు తెల్లదనము
తల్లి మనసు చల్లదనము
పల్లెసీమ చక్కదనము
ఎల్లరికి బహు ఇష్టము
కన్నప్రేమ త్యాగమయము
వెన్నెలంత చూడ ఘనము
ఎన్న తరమా! మహిలో
ఎన్ని ఉన్నా! మదిలో
ముద్దులొలికే బాలలు
ముద్దబంతి పూమాలలు
శ్రద్ధ గనుక చూపితే
వృద్ధి ఇంట వారితో
ఇష్టపడి చదివిస్తే
కష్టమే అన్పించదు
నష్టమే ఉండబోదు
శ్రేష్టమే భవిత అగును

మంచి మాటలు
-----------------------------------------
అతిముఖ్యం ఆచరణ
ఉండాలోయ్! విచక్షణ
తల్లిదండ్రుల దీవెన
జీవితానికి రక్షణ
మాట యిస్తే నిలకడ
తప్పకుండా ఉండాలి
ఉండకూడదు గడబిడ
హుందాగా బ్రతకాలి
చెప్పుడు మాటలు కీడు
చేయు బ్రతుకు వల్లకాడు
ఆదిలోనే వదిలితే
అట్టి వాడే విజేతే
మాటి మాటికి తప్పులు
చేయకూడదు ఎప్పుడూ!
అవి తగలబెట్టు నిప్పులు
తెలుసుకొమ్ము తమ్ముడూ!

వాస్తవాల జల్లులు
---------------------------------
ఎదిగితే తల్లిదండ్రులు
పాఠశాలలో గురువులు
గర్వంగా చెపుతారు
గౌరవంగా చూస్తారు
సాయపడే స్నేహితులు
సేవచేస్తే వృద్ధులు
మనసులో తలస్తారు
గుండె గుడిని చేస్తారు
ముద్దు చేస్తే పిల్లలు
గువ్వలా ఒదుగుతారు
ప్రేమ చూపితే గనుక
ఒడి బడిలో చేరుతారు
ఆదరిస్తే పేదలు
కృతఙ్ఞత చూపుతారు
మాట వింటే పెద్దలు
పాలలా పొంగిపోతారు

గద్వాల సోమన్న "వేకువ చుక్క" పుస్తక పరిచయ సభ గుంటూరులో
----------------------------------------------------
నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్న విరచిత "వేకువ చుక్క" పుస్తక పరిచయ సాహిత్య సభ గుంటూరులో ఘనంగా జరిగింది. "అమరావతి సాహితీ మిత్రులు" సంస్థ ఆధ్యర్యంలో నెలనెలా మూడవ ఆదివారం కార్యక్రమంలో భాగంగా డా. రావి రంగారావు ప్రముఖ సాహిత్యవేత్త, వారి కార్యవర్గం సౌజన్యముతో జరిగిన ఈ పుస్తకావిష్కరణ, పుస్తక పరిచయ సాహిత్య సభ, సర్వీస్ హెల్త్ ఆర్గనైజషన్ హాలు, బ్రాడీ పేట, గుంటూరులో సాహితీ మిత్రుల మధ్యలో జగరడం విశేషం. అనంతరం ఈ పుస్తకాన్ని సామాజిక సేవకులు,భాషాభిమానులు డా. పలకలూరి శివరావు గారికి అంకితం ఇచ్చారు. అత్యల్ప కాల వ్యవధిలో 80 పుస్తకాలు ముద్రించి,పలు చోట్ల ఆవిష్కరించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న కవి గద్వాల సోమన్న విశేష కృషికిగాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక సేవకులు, ది చిల్డ్రన్ స్పేస్ క్లబ్ సంస్థ అధినేత డా. శాంతమూర్తి,ప్రముఖ సినీ గేయ విశ్లేషకులు అమరాచారి, కవులు, కళాకారులు పాలొగొన్నారు. కృతికర్త గద్వాల సోమన్నను పాఠశాల హెడ్మాస్టర్అద్దేపల్లి జాన్సన్,తోటి ఉపాధ్యాయులు,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.
-గద్వాల సోమన్న
Comments